Monday, September 14, 2020

భిన్న మతాలలో వినాయకుడు

 భిన్న మతాలలో వినాయకుడు

.
హిందూ మతంలో గణేషుడు విఘ్నాధిపతిగా అతి ముఖ్యమైన పాత్రపోషించే దైవం. గణాధిపతి మొదటగా ఎక్కడ ప్రస్తావించబడ్డాడనే దానిపై చరిత్రకారులు భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు.
*Alice Getty అనే చరిత్రకారిణి, గణేషుడు ద్రావిడులకు చెందిన దైవమని అభిప్రాయపడింది.
*దక్షిణానికి వచ్చిన ఆర్యులు ఇక్కడి ఏనుగులను చూసి అంతటి శక్తి తమకివ్వమని ఆ రూపంలో గణేషుని కల్పన చేసుకొన్నారని మరికొందరి అభిప్రాయం. (Haridas Mitra).
*Aravamutham వంటి వారు వేదాలలో గణేషుని మూలాలున్నాయని భావించారు.
1. వేదాలలో గణేషుడు
రుగ్వేదం లో చెప్పబడిన గణేషుడు బ్రహ్మనస్పతి అని నేడు మనం కొలుస్తున్న గజముఖుడు, ఏకదంతుడు, లంబోదరుడు, శివపార్వతుల తనయుడైన వినాయకుడు కాదు అని ఒక వర్గం; వేదాలలో ఉన్న "గణానాంత్వా గణపతిగుం హవామహే.... శ్లోకంలో గణాధిపతిగా గణేషుడు కలడని, ఇతడే బ్రహ్మనస్పతి గా చెప్పబడ్డాడని మరొక వర్గం ఎవరికివారు తమ తమ వాదనలలో నిలువునా విడిపోయారు. ఇది ఎప్పటికీ తెగని వాదం.
రామాయణ, మహాభారతాలలో వినాయకుని ప్రస్తావన ఎక్కడా లేకపోవటం గణేషుని కాలాన్ని ప్రశ్నార్ధకం చేస్తుంది. (వ్యాసునికి లేఖకునిగా వినాయకుడు ఉండటం అనే గాథ తొమ్మిదో శతాబ్దానిది అంటారు. )
చరిత్రపరంగా చూడవలసి వస్తే... క్రీశ. 485 లో విష్ణుకుండిన రాజైన మాధవవర్మ వేల్పూరు లో వేయించిన ఒక శాసనములో మొదటి సారిగా వినాయకుని ఆలయనిర్మాణము గావించి అందులో "దంతిముఖ స్వామి" విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఉన్నది. దక్షిణభారతదేశములో వినాయక ఆలయాలను గురించి లభించే మొట్టమొదటి శాసనమిది.
వేంగిచాళుక్యల కాలంలో (ఆరోశతాబ్దం) బిక్కవోలు వద్ద నిర్మించిన వినాయకాలయం ప్రాచీన గణపతి ఆలయాలలో ప్రముఖమైనది. ఇక ఆ తరువాత ఏడో శతాబ్దం నాటి శంకరాచార్యుడు ప్రవేశపెట్టిన "పంచాయతన పూజ" పద్దతికి అనుగుణంగా శివాలయమైనా, వైష్ణవాలయమైనా గణపతి మందిరం తప్పనిసరిగా ఉంటూ వచ్చింది.
ఏ వాదన ఎలా సాగినప్పటికీ గణేష ఆరాధనకు సంబంధించిన గణాపత్య శాఖ (Ganapatya) క్రీశ. 4 వ శతాబ్దంలో వృద్ధిలోకి వచ్చి గణేష ఆరాధన భారతదేశంలోనే కాక శ్రీలంక, నేపాల్, బర్మా, చైనా, జపాన్ లాంటి దేశాలకు కూడా విస్తరించింది.
బౌద్ధ, జైన మతాలలో కూడా గణేషుని గురించి స్పష్టమైన ఉల్లేఖనలు కనిపిస్తాయి.
.
2. బౌద్ధంలో గణేషుడు
క్రీపూ రెండొ శతాబ్దానికి చెందిన అమరావతి బౌద్ధ స్థూపంపై ఏనుగుశిరస్సు కలిగిన యక్ష శిల్పాలు గణేషునికి సంబంధించిన తొట్టతొలి రూపంగా చరిత్రకారులు భావిస్తారు (C. Sivaramamurthy). కొన్ని బౌద్ధగాథలలో వినాయకుడు అన్నమాట బుద్ధునికి పర్యాయపదంగా వాడటం జరిగింది. (అమరుకోశం). విశాఖపట్నం సమీపంలో కల బొజ్జన్నకొండ వద్ద కల క్రీశ 5/6 శతాబ్దానికి చెందిన బౌద్ధారామం ముంగిట వద్దకూడా వినాయకుని విగ్రహం ఉన్నది.
శ్రీలంక లో ఒకటో శతాబ్దానికి చెందిన Mihintale బౌద్ధచైత్యంలో నేడు మనం చూస్తున్న ఆకారంలో గణేషుడు ప్రప్రధమంగా కనిపిస్తాడు. పీఠంపై కూర్చున్న భంగిమలో, లంబోదరంతో, ఏకదంతంతో ఉండే ఈ గణపతి విగ్రహం నేడు మనం పూజిస్తున్న విగ్రహానికి ప్రొటోటైప్ లాంటిదని చరిత్రకారులు భావిస్తారు. (IK Sarma).
క్రీశ 5 శతాబ్దానికి చెందిన సారనాథ్ బుద్ధుని నిర్యాణసందర్భాన్ని చిత్రించే శిల్పాలలో గణేషుడు తన సోదరుడైన కార్తికేయునితో ఇంకా నవగ్రహాల ప్రతిమలతో బుద్ధుని చూస్తున్నట్లు ఉంది. బౌద్ధ శిల్పకళ క్రమక్రమంగా హిందూ శిల్పకళగా రూఫాంతరం చెందుతున్న కాలాన్ని ఈ ప్రతిమ నిక్షిప్తం చేస్తుంది.
బౌద్ధమతంలో జనామోదం పొందిన పేరుగా వినాయకుడు అనే నామం హిందూదేవగణంలోకి ప్రవేశించి ఉంటుందని. KK Datta అభిప్రాయపడ్డారు. (Proceedings of the Indian History Congress Vol XXII).
.
2. జైన గణేషుడు
విఘ్నాలను తొలగించి, విజయం అనుగ్రహించే దైవంగా జైనులు గణేషుని కొలిచేవారు. దేవతలు కూడా తమకార్యాలు సఫలం అవ్వాలని గణేషుని ప్రసన్నం చేసుకొంటారు అంటూ జైనాచార్యుడు, వర్ధమానసూరి తన ఆచారదినకర అనే గ్రంధంలో అన్నాడు. తొమ్మిదో శతాబ్దానికి చెందిన మధుర, రాజస్థాన్ లోని Ranakpur లాంటి జైనాలయాలలో గణేషుని శిల్పాలు నేటికీ చూడవచ్చును.
***
ఒకే కథనో, బోధననో హిందువులు, బౌద్ధులు, జైనులు వారివారి సిద్ధాంతాలకు అనుగుణంగా భాష్యం చెప్పుకొన్నారు. మధ్యయుగాల వరకూ అందరూ ఒకే భావధారను పంచుకొన్నారు. ఒకే దేవుళ్లకు, దేవతలకు తమ ధార్మికగ్రంధాలలో తోచినరీతిలో స్థానాన్ని కల్పించుకొన్నారు. రెండువేల సంవత్సరాల క్రితం ఈ నేలపై విలసిల్లిన భిన్న ఆధ్యాత్మిక మార్గాలు ఆదానప్రదానాలు చేసుకొన్నాయి. సింధులోయనాగరికతనుంచే భారతదేశంలో భిన్న సంస్కృతుల మేళనం మొదలైంది.
ఈ సమ్మేళనం గురించి పార్శీలు ఒక కథ చెపుతారు. కొంతమంది పార్శీలు ఒక నగరానికి వచ్చినపుడు అక్కడి రాజు ఒక నిండిన పాలగ్లాసును పంపి, ఈ నగరంలో చోటులేదు అని అన్యాపదేశంగా చెప్పాడట. దానికి ఆ పార్శీ బృందం ఆ పాలగ్లాసులో చక్కెర వేసి తిరిగి ఆ రాజుకు పంపారట. దాని అర్ధం మేము ఇక్కడి ప్రజలతో పాలు చక్కెరల్లా కలిసిపోతాము, అంతే కాక తీపిదనాన్ని కలిగిస్తాము అని. అలాగే ప్రాచీన భారతదేశ చరిత్రను గమనించినపుడు, బౌద్ధులు, జైనులు, శక్తేయులు, చార్వాకులు, కాపాలికులు, గణాపత్య, గిరిజనులు, సనాతన ధార్మికులు అందరూ శతాబ్దాలపాటు కలిసిమెలిసి సహజీవనం సాగించారు. అన్ని మార్గాల మధ్యా మానవాభ్యుదయానికి సంబంధించిన ఉత్తమవిలువల ప్రసరణం జరిగింది.
ఇదే సంప్రదాయం ముస్లిములు ఈ నేలపై అడుగుపెట్టిన తరువాత కూడా హిందూమతం తన అనాది బహుళత్వాన్ని ప్రదర్శించటాన్కి ఒక ప్రయత్నం చేసినట్లు అర్ధమౌతుంది. వెంకటేశ్వర స్వామికి బీబీనాంచారిని కట్టబెట్టటం, సూఫీలను, పీర్ల పండుగలను హిందువులు సమాదరించటం, మాలిక్ నైబు ను మల్కిభరామునిగా కీర్తించటం లాంటివి చాచిన స్నేహహస్తాలవంటివి.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment