Friday, September 4, 2020

Imported post: Facebook Post: 2020-09-04T15:31:30

నా కవితాసంపుటి మూడో కన్నీటి చుక్క "పాతూరి మాణిక్యమ్మ జాతీయ స్థాయి స్మారక సాహిత్యపురస్కారం 2020 కు ఎంపిక అయినది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ కవి విమర్శకుడు శ్రీ అవధానుల మణిబాబు వ్రాసిన సమీక్షా వ్యాసమిది. వారికి కృతజ్ఞతలు ---బొల్లోజు బాబా *** శ్రీ బొల్లోజు బాబా రేపు "పాతూరి మాణిక్యమ్మ సాహిత్య పురస్కారం" అందుకోనున్న సందర్భంగా వారి "మూడో కన్నీటి చుక్క"పై నా సమీక్ష: కవిత, వ్యాసం, అనువాదం, చారిత్రక అంశం .... ఏదైనా సాధికారంగా వ్రాసి, ధైర్యంగా ప్రకటించి ప్రశంసలను, విమర్శలను సమానంగా స్వీకరించి; సమకాలీన తెలుగు సాహిత్య రంగంలో తనదైన ముద్రను ప్రముఖంగా ప్రకటించుకున్న బొల్లోజుబాబా మూడవ కవితా సంపుటి “మూడో కన్నీటి చుక్క”. 75కవితల సంపుటానికి ఈ బయాలజీ మాష్టారు ఈ పేరే శీర్షికగా పెట్టారంటే కన్నీటి గురించి ఇప్పటివరకూ నేర్చుకోనిది ఏదో తెలుసుకోవాలనిపించింది. ఒక కన్నీటి చుక్క అనేక ప్రోటీన్ల సముదాయమని; అందులో మూడు పొరలుంటాయని; కారణాన్ని బట్టి Basal tears, Reflex tears & Emotional tears గా విభజిస్తారని తెలిసింది. శరీరంలోని అన్ని ఘన, ద్రవ, వాయువుల గురించీ అన్నేసి విషయాలు పోగేసుకున్న మన పాఠ్యపుస్తకాల్లో ఈ కన్నీటికిి కాస్తయినా చోటు లేకపోయిందే అనిపించింది. ఇంత ‘విషయం’ ఉంది కాబట్టే, వాటి విలువ తెలిసిన బాబాకు కవితావస్తువే కాదు, కావ్యానికి శీర్షిక కూడా అయింది. బాబా కవితలను చదివేప్పుడు గతంలో ఓ కవితలో ఆయనే అన్నట్టు మెదడుతో తూకం వేస్తూ హృదయంతో మూల్యాంకనం చేసుకోవాలి. దాదాపు కవితలన్నీ స్వయంగా తాను అనుభవించిన సన్నివేశాలను లేదా ఆ సన్నివేశంలో/పాత్రలో తాను ప్రవేశించినడు కలిగిన అనుభూతులను కవితలుగా మలచినవే; ఎవరి అభిప్రాయాలను ఆధారం చేసుకునో అల్లినవి కావు. పూర్తి ఎరుకతో, నమ్మికతో వ్రాసిన కవితలు. ఓ చోట “భయ్యా, నేనన్నీ గమనిస్తూనే ఉన్నాను” అని ఒప్పుకున్నారు కూడా. బాబా కవిత్వ నిర్మాణ రహస్యమంతా నాకు ‘వేడుక’ కవితలో కనిపిస్తుంది. పసివాడు లోకాన్ని చూసి పొందే బాధ చూడలేక “ఓ దేవత వాడి నేత్రాలపై బీజాక్షరాలను లిఖించి కన్నీటి బిందువులను కవిత్వంగా మార్చే వరమిచ్చింది” . అప్పటినుండీ ఇలా లోకం మరిన్ని దృశ్యాలను అతని కళ్ళల్లోకి వంపి కవిత్వాన్ని పిండుకుంటోoది. అంటే పైన చెప్పుకున్న విభజనలో Emotional Tears అన్నమాట. ఇమేజరీ, పెర్సోనిఫికేషన్,అల్యూజన్,ఎక్కువగా అల్లిగోరి (అన్యాపదేశంగా మరేదో చెప్పడం), అడపాదడపా అస్పష్టత ... వెతికేకొద్దీ కావలసినన్ని. “కవిత్వ భాష”లో వీటన్నిటికీ ప్రసిద్ధ కవుల కవితా పంక్తులను ఉదాహరణలిచ్చి వివరించిన బాబా, ప్రతి అధ్యాయానికీ కావలసినన్ని ఉదాహరణలను ఈ సంపుటిగా మన ముందుంచారు. Side headings పెట్టి రాస్తే వ్యాసం కాస్తా వ్యాస రూప ప్రశ్నకు జవాబుగా మారుతుంది అందుకే, అక్కడక్కడా... ఒక్కొక్కటి.  మొదటి కవిత శీర్షిక “ఒక దు:ఖానికి కొంచెం ముందు”. కవిత వ్రాసినది ఎప్పుడో అయినా సాహిత్యలోకం ఈ కవితను నిజంగానే ఇపుడు మనం ఎదుర్కొంటున్న "ఓ పెను ప్రాపంచిక దు:ఖానికి" ముందు చదివింది.  ఒక స్థితిని వర్ణించడానికి పరిసరాలను కాక పరికరాలను ఎలా వాడుకోవాలో కవికి తెలుసు అందుకే, “కళాయి పోయిన అద్దంలో చూసుకుంటూ నుదిటిపై సూర్య బింబమంత కుంకుమ దిద్దుకుంటోoది” అంటారు. కళాయిపోయిన అద్దం కవి చెప్పకుండా దాచిన చాలా సంగతులు చెప్పేస్తుంది. నేరుగా చెప్పేసి ఇదే కవిత్వం అనడంరాని కవి, బాబా. ఆత్మహత్యకు ఎంచుకున్న పధ్ధతి ఏదైనా తరువాత దశ -మట్టిగా మారడమే. కానీ చెట్టుకు ఉరి పోసుకుని చనిపోయిన రైతు గురించి ఆ మాట సూటిగా చెప్పలేదు - “అప్పటికింకా అతను చెట్టు కొమ్మకు పిడికెడు మట్టై వేలాడలేదు” – అంటారు.  “నాన్నతనాన్ని బజార్లో ఎక్కడున్నా ఇట్టే గుర్తు పట్టేయవచ్చు సైజులు సరిపోకపోతే మారుస్తారు కదూ – అంటో బట్టల షాపులో” - ఎంత సాధారణ సన్నివేశం. కవితగా చదివినపుడు ఎంత ఆర్ద్రమైపోయిందో హృదయం. కవిత చివరలో ఇంత చేసినా కేవలం వాటి ఫోన్లో ఒక కాంటాక్ట్ గానే మిగిలి పోతాo అని కాస్త బాధపెట్టి; తరువాత కవితలో “ఫోన్ చెయ్యడం మానుకున్న (ఓ) బబ్లూ గాడిని గురించి వాళ్ళ నాన్నకు గుర్తుచేస్తారు”. ఈ రెండు కవితలూ వ్రాసేటపుడు, పుస్తకంలో వేసేటపుడూ ఈ connectivity ని కవి ఆలోచించలేదు. తండ్రిగానూ అంతే. ఎవరూ భవిషత్తులో బాగా చూసుకుంటారా? లేదా? అనే విషయాన్ని ఆలోచించి పెంచం.  పాపాయిని ఎత్తుకుంటే తోసేసిందిట, వాళ్ళమ్మకి ఇచ్చేస్తే సొట్ట బుగ్గలతో బోసినోటితో నవ్వుతోందిట - “ఒక్కసారి అనిపించింది తిరస్కరించిన తరువాత ద్వేషించనక్కరలేదని చక్కగా ప్రేమించుకోవచ్చనీ!” – పొరలుగా పొరలుగా ఒలుచుకోవాలే గానీ ఇది అన్ని బంధాలకీ వర్తిస్తుంది, కదూ! జీవితంలో అధిక భాగం మనం ఈ సూత్రం మరిచి తిరస్కరించిన వారిని ద్వేషిస్తూ గడిపేస్తాం. ఈ విద్య బాగా తెలిసిన వారు బాబా. అందుకే fb లో రాజపూజ్య, అవమానాలకు (రెండోవి సంఖ్యలో తక్కువే అయినా పట్టించుకోకుండా ఉండలేనివి) అతీతంగా అందరినీ ప్రేమిస్తూ సాగిపోతున్నారు. “పట్టుబడిన ఎలుకలను ఊరవతల విడిచినట్లునిన్ను బాధించిన వ్యక్తులను మరిచ్చిపో” అంటారు మరో కవితలో. కొంచెం తీవ్రంగా చెప్పనట్టు అనిపించినా కాదనలేని శాశ్వత సత్యం - “యుద్దానంతరం భూమికి మనం ఓ ఆరడుగుల బాధ్యత” ని గుర్తు చేస్తారు.  అమ్మాయి తన పాతగౌనులను పంచి వచ్చిందిట, మర్నాడు ఆమె ఎప్పుడో నాటిన గులాబీ మొక్క కు ఓ పువ్వు పూసిందిట. అంటే – “బహుశా ఎక్కడో ఎవరో ఓ పాప తనకు సరిగ్గా సరిపోయిన గౌనును చూసుకుని మురిసి పోయినప్పటి ఆనందం కావచ్చు, ఆ గులాబీ”. చిన్నపుడు law of conservation of energy చెప్పారు మా ఫిజిక్స్ మాస్టారు, బహుశా ఇదీ అలాంటిదేనేమో. లేదా బాబా నమ్మే బటర్ ఫ్లై థియరీ కావచ్చు.  అన్నీ పునరావృతం అవుతాయని నమ్ముతారు, బాబా. తన ప్రతిబింబాన్ని చూసుకోవడానికి నాన్న ఇక్కడిక్కడే తిరుగుతున్నాడంటే ఎవరూ నమ్మటం లేదని, “ కానీ రేపెపుడో నేనూ అలా కనిపించినపుడు నమ్ముతారు బహుశా!” అని ముగిస్తారు. ఆవేశాన్ని అక్షరాలుగా మార్చి సమాజంలోకి పంపి, మార్పు సాధ్యమవుతుందని నమ్మడం మనలో చాలామంది చేసే పని. ఇందులోనూ వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుంటూ: “సమాజం పట్ల ఆవేశం కలిగినపుడు హిందూ పత్రికకు ఓ ఉత్తరం వ్రాసి పారేసి ప్రపంచం మారి పోతుంది అని కలలు కనేవాడు ఇప్పుడు నేనూ అంతే, ఇంకేం చేయాలో తెలియక” అంటారు. ఈ సందర్భంలో సోమసుందర్ మాటలు గుర్తొస్తున్నాయ్ – “సమాజాన్ని కేవలం రచనల ద్వారానే సముద్ధరించగలమన్నది దురాశ. అయితే మనలాగే ఆలోచించే కొద్దిమంది ఆలోచనలకి, ఆశలకీ దీప్తి కలిగిస్తే చాలు. సామాజిక సమస్యలని సామాజికులే పరిష్కరించుకోవాలి. సామాజికులలో కవి భాగస్వామి”. బాబావ్ విషయంలో ఈ పనిని రెండు తరాలూ కొనసాగిస్తున్నాయ్. కవి కాస్త వ్యంగ్యంగా “మేమిద్దరం రక రకాల పాలకుల్ని మార్చాం కూడా” అని చెబుతాడు గానీ గతంలో ఆయనే అన్నట్టు “అన్ని నిర్ణయాలూ ముందే అయిపోయాయి, ఏదో కాలక్షేపానికి జీవించాలి అంతే”.  మంచి సందేశం, జీవన తాత్త్వికత చాల కవితల్లో పలకరిస్తాయి. “గతాన్నొక గాలిపటంచేసి ఎగరేసి దాని దారం తెంపెయ్యి” – దారం చేతిలో ఉన్నంతసేపూ నువ్వు గాలిపటాన్ని మోస్తున్నట్లే, బరువుండదుగానీ, దానిని పట్టిఉంచడం ఎంత బాధ్యతో? అన్ని సందర్భాలలో తెంచుకుపోవడం సులభం కాదు కదూ! కవిత్వానికి ఔచిత్యం ప్రధానం. ఈ విషయం తెలిసినవాడీ కవి. అంతా అయిపోయాక ఏమీ చెయ్యలేనప్పుడు కొన్ని ప్రశ్నలు అనవసరం. అందుకే “ఎలాగా అనబోయి అలాగా అన్నాను” అంటారు. బతికుండగా ఎపుడూ గుర్తురానివారు మరణించాక అందరికీ తెగ గుర్తొస్తారు. వారితో బాటు పోయినవారితో సంబంధం ఉన్నవారంతా. అందుకే కవి “ఒక చావు వంద చావుల్ని బతికిస్తుంది” అంటాడు. “జీవించడం అంటే ప్రేమించిన ఒక్కొక్కరినీ కోల్పోవటం కదూ!” అనిముగిస్తాడు. అలా అని జీవితం అంటే అంతే అనుకుంటామేమోనని మరో కవితలో “చివరి క్షణం వరకూ చెయ్యాల్సిన పనుల్ని చేస్తూండటాన్ని కాలంకూడా తప్పించుకోలేదు” అని చికెన్ షాప్ లో కోడిపుంజు మెడసారించి కూయడాన్ని గుర్తుచేస్తారు. “జీవిత పర్యంతమూ పరిమళించీ పరిమళించీ పూదోటగా విస్తరించటానికే నువ్వు ఇక్కడకు వచ్చావు” అని దిశా నిర్దేశం చేస్తారు. ఒత్తిడి తట్టుకోలేక విడిచి పెట్టేస్తానంటావేమో – “పాదం బరువుకు ఒరిగిన పచ్చిక మెల్లమెల్లగా ఎలా నిటారుగా తలెత్తుకొంటోoదో చూడు” అని ధైర్యం చెప్తారు. *** విహారానికి వెళ్ళినపుడు ఎవరి కాలక్షేపాలువారివి. ఎవరి దృష్టి కోణం వారిది. కోరంగి (తూర్పుగోదావరి జిల్లలో మడ అడవులు) వెళ్ళినపుడు కొందరు చెక్కల వంతెన, జంతువుల ఆనవాళ్ళు, రకరకాల పక్షులు, చెట్లు చూస్తారు. మరికొందరు, పురాతన లైట్ హౌస్, వలయాకార మెట్లు ఎక్కి ఫోటోలు తీసుకుంటారు. ఏ ఒకడో మాత్రమే “దూరంగా కనిపించే సువిశాల సముద్రాన్నీ, ఒగాల్ని, నగర హర్మ్యాలని, సుదూరంగా కనిపించే ఫాక్టరీ గొట్టాల్నీ శిధిలమైపోయిన ఒకనాటి కోరంగి మహానగరాన్నీ తదేకంగాచూసి మౌనభారంతో మెట్లు దిగుతాడు” – అలా అందరికీ పట్టనవి చూసి మౌనభారంతో మెట్లు దిగేవాడు కవికాక మరెవరు? రాత్రి బాస్ చేసిన ఫోన్ రిసీవ్ చేసుకోనప్పుడు “24/7 సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి నేను సెల్ టవర్నికాను, మనిషిని అందామనుకుని సారీ బాస్” అన్నానంటారు. వాకాటి పాండురంగారావుగారు ఓసారి కథ గురించి చెబుతూ తాను కాదలచుకున్నదానికీ అయిన దానికీ మధ్య అఖాతాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో రచయిత సన్నివేశాలు కల్పిస్తాడు, అంటారు. పై వాక్యాలు ఆ మాటలు గుర్తుచేశాయి. అన్నట్టు బాబాగారి కవితలో కథానాత్మక శైలి గురించి విమర్శకులెందరో చాలా వ్యాసాల్లో చెప్పేశారుగా. మనం మరో విషయానికి వెళ్దాం. ప్రవేశ నిర్గామాల మధ్య మనం చేసిన ప్రయాణమే జీవితం. మరి మన జీవితాలను ఎలా గడిపేస్తున్నామో చెప్పడానికి ఎక్కువ పదాలు వాడరు, కవి - “ఎంతో స్వచ్ఛంగా బోసి నవ్వులతో ఇక్కడికి వస్తాం. మురికి మురికిగా మరి ఏడుస్తూ నిష్క్రమిస్తాo” అంటారంతే. చాలా కవితల్లో కవి ఎన్నో ప్రశ్నలను సంధిస్తారు. అంటే అవి ప్రశ్నాపత్రంలా వాక్యం చివర “?”తో ఉండవు. అంతర్గతంగా తమలో ప్రశ్నలను దాచుకుంటాయి. వాటికీ సమాధానాలు మనకే విడిచి పెడతారు, తాను చెప్పలేక కాదు, మనకేది తడుతుందో అని. ఈ సందర్భంలో ఎందుకో “ఎర్ర సీత” నవలలో గొల్లపూడి మారుతీ రావు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. “ఆ సమాధానం వెనుక ఒక జీవితం ఉంది. ఓ ఛాలెంజ్ ఉంది. ఓ తెగింపు ఉంది. ఓ పరిష్కారం ఉంది. అంతకు మించి ఓ ముగింపు ఉంది. అయినా, సమాధానం చాలా క్లుప్తమయిందే.” ఈ మాటలు బాబా ప్రశ్నలకు (ఆ మాటకొస్తే కవులందరి ప్రశ్నలకు) సరిగ్గా సరిపోతాయ్. “వలస పక్షుల గానం” కవిత కొంత ఆశర్యపరిచింది. కన్నీటికి మూలం సాధారణంగా దు:ఖమే కదా! దుఃఖ నివృత్తి శ్లోకాలు (కాతత్ర పరివేదనా - ఎందుకు ఏడుస్తున్నావ్) పేరిట చిన్నపుడు కొన్ని శ్లోకాలు చెప్పారు. “ఇదం కాష్టం ఇదం కాష్టం నద్యామ్ వహతి సంగమాం సంయోగాశ్చ వియోగాశ్చ కాతత్ర పరివేదన”. ఇవి బాబాగారు చదివుండరనేఅనుకుంటున్నాను. వాటి సారాన్ని ఆధునిక కవిత్వ పరిభాషలో అద్భుతంగా చెప్పారు. ఇక ఫ్రాగ్మెంట్లను సంపుటిలో చేర్చడం బాబా స్టైల్. ఇవి అదనం కాదు, అంతర్భాగం. కావాలని కుదించాలనో, పని గట్టుకుని పెంచాలనో కవి ప్రయత్నించనపుడు కలం కాగితంపై ఎంత మేర పరుగు దీసి ఆగిపోతుందో, కవి అక్కడే ఆపి ప్రచురించారు తప్ప అవి వచనకవితలే. అలాగే, “జీవించటమే ...” అనేది పారాగ్రాఫుల రూపంలో ఒకటిన్నర పేజీ సాగినది కవితేనా? అనే సందేహం వస్తే సమాధానం తన కవిత్వ భాషలో చెప్పారు బాబా. “కవిత్వ ఫార్మేట్లో వ్రాసిందంతా కవిత్వంకానట్లే వచనం రూపంలో వ్రాసిందంతా వచనమూ కాదు, ఈ రెండిటి మధ్యా సరిహద్దు రేఖ గీయటం అంత సులభం కాదు. ఉత్త సమాచారం కాక మరింకేదో అందించేదాన్ని కవిత్వంగా గుర్తించాలి” అని. ఇదిగో అలా “మరింకేదో” అందించడం వలన అది కవితయింది. ఇది కొత్త కూడా కాదు. అద్దేపల్లి ‘ఇవ్వాళకి రేపు లేదు’, ‘దిగంతాల దాకా ఎక్కుపెట్టిన బాణం’ వంటి కవితలను కవితా సంపుటాలలోనే ప్రచురించారు. వచన కవితలో పాదవిభజనకు చెందిన లినియేషన్ గురించి బాబా చెప్పిన విషయాలు ఈ విషయంలో సందేహనివృత్తి చేసినా ‘ప్రవచించే వాక్యం’ లాంటి కవితలు కొన్నిటిలో (సుదీర్ఘ మైన పాదాలు ఉండవు కానీ) వచనత్వం పాలు ఎక్కువయింది. బాబా ఎపుడూ నాకో మాట చెబుతారు – “విమర్శలో బాంబులు కురిపించాలి గురూ! అపుడు హోరాహోరీ చర్చ జరుగుతుంది” అని. అయితే, “కవిత్వ భాష” తెలుసుకుని, నేర్చుకుని, అధ్యయనం చేసి పుస్తకంగా వ్రాసిన వాడీ కవి. అందుకే నేనేమి చెప్పగలను? ఒక్క వైరి సమాసాల గురించి తప్ప. అవి వచన కవిత్వంలో ఉండకూడదననుగానీ, అన్ని ఉండకపొతే బావుంటుంది అని నమ్ముతాను. “బొరియలోకి దూరింది కుర్రపీత - భూమిని మరోసారి ప్రేమించటానికి” అనే బాబా వాక్యంతో మన కబుర్లను ఇక్కడితో ఆపి, కవిత్వాన్ని ప్రేమించడానికి మరోసారి ఈ పుస్తకంలోకి దూరదాం. By SrI Avadhanula Mani Babu *** నా సహ అవార్డు గ్రహీత శ్రీ అనిల్ డానీ ఆధ్వర్యంలో అవార్డు ప్రదాన సభ జూమ్ యాప్ లో సెప్టెంబరు 5, 2020 సాయింత్రం 6 గంటలకు జరగనున్నది. ఈ సభలో పురస్కార ప్రదాత డా. పాతూరి అన్నపూర్ణ, కవి డా. యాకూబ్, శ్రీ కోడూరి విజయ్ కుమార్, డా. పెరుగు రామకృష్ణ, శ్రీమతి తన్నీరు శశికళ లు ప్రసంగిస్తారు. అవకాశం ఉన్నవారు జాయిన్ అవుతారని ఆశిస్తాను. ఈ పుస్తకాన్ని ఈ క్రింది లింకులో కొనుగోలు చేసుకొన వచ్చును https://kinige.com/book/Mudo+Kanneeti+Chukka

No comments:

Post a Comment