Monday, September 14, 2020

సమగ్ర కళా విమర్శకుడు - శ్రీ అద్దేపల్లి రామమోహన రావు

 సమగ్ర కళా విమర్శకుడు - శ్రీ అద్దేపల్లి రామమోహన రావు

.
(ప్రజాకవి శ్రీ అద్దేపల్లి రామమోహన రావు జయంతి సందర్భంగా)
కవి చేసిన సృజనలోని గుణదోష విచారణ చేయటాన్ని విమర్శ అంటారు. ఆధునిక విమర్శకులలో కట్టమంచి, రాళ్ళపల్లి, విశ్వనాథ, శ్రీశ్రీ కోవలో నిలిచే వ్యక్తి శ్రీ అద్దేపల్లి రామమోహన రావు గారు.
శ్రీ అద్దేపల్లి కవిగా ఎంత లబ్ద ప్రతిష్టులో విమర్శకునిగా కూడా అంతే గొప్ప ప్రతిభావంతులు. వీరు సాహిత్యవిమర్శను ఇలా నిర్వచించారు.
"విమర్శ స్థూలంగా రెండు విషయాలమీద ఆధారపడి ఉంటుంది. మొదటిది కవితా వస్తువు. రెండోది శిల్పం. ఒట్టి వస్తువు మీద మాత్రమే దృష్టి ఉంటే, దానిలో వాచ్యత మాత్రమే ఉంటుంది. ఒట్టి శిల్పం మీద మాత్రమే దృష్టి ఉంటే వ్యక్తికి గాని సమాజానికి గానీ సరైన ప్రయోజనం ఉండదు. అందువల్ల రెంటి మధ్యా సమగ్రమైన సమ్మేళనం ఉంటే అందులో ప్రయోజనం ఉంటుంది. వస్తువు శిల్పమూ ఎక్కడ కలిసిపోతాయో అది గొప్ప కవిత్వం. వస్తువును బాగా చెప్పేదే శిల్పం అవుతుంది. శిల్పం లేని వస్తువే గొప్పదనే వాదానికి పెద్దగా ప్రాముఖ్యం లేదు" అంటారు.
ఒక కవిని అంచనా వేయటానికి ఎంతో సహాయపడతాయి పై వాక్యాలు. అవి శ్రీ అద్దేపల్లి వారి సాహిత్యజీవితాన్ని కూడా పట్టిచూపుతాయి . విమర్శకునిగా శ్రీ అద్దేపల్లి విమర్శనావ్యక్తిత్వం ఆవిష్కృతమౌతుంది పై మాటలలో.
విమర్శకునిగా శ్రీ అద్దేపల్లి వెలువరించిన పుస్తకాలు, వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు.
1. శ్రీశ్రీ కవితా ప్రస్థానం
శ్రీశ్రీ మహాప్రస్థానంపై వ్రాసిన "శ్రీశ్రీ కవితా ప్రస్థానం" అనే సమీక్షాగ్రంథం శ్రీ అద్దేపల్లి వారి మొదటి విమర్శనా రచన. ఈ పుస్తకంపై రాచమల్లు రామచంద్రా రెడ్డి చేసిన ప్రతివిమర్శ, దానికి అద్దేపల్లి వారు ఇచ్చిన సమాధానం ఆ పై నడచిన చర్చ - అప్పట్లో తెలుగు సాహిత్యప్రపంచంలో గొప్ప సంచలనం సృష్టించింది. శ్రీశ్రీ కవిత్వాన్ని విశ్లేషించేటపుడు "అక్షరాక్షర పరిశీలన" అనే పదం వాడారు. ఇది అద్దేపల్లి వారు సృజించిన పదమే. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని వర్ణిస్తూ "కాల్పనికతకీ, అభ్యుదయానికీ మధ్య ఎర్రని రేఖ" అంటారు. అద్దేపల్లి ప్రతిపాదించిన ఈ మాట నేటికీ ఎంతో విలువైనదిగా భావించవచ్చు.
అద్దేపల్లి వారి గొప్పతనం ఎక్కడ ఉందంటే - ఆ తదనంతర కాలంలో శ్రీశ్రీపై చేసిన విమర్శలో ఉండిన "నా లోపాలు కూడా నాకు తెలిసినై" అని అంగీకరించటం. అది అద్దేపల్లి నిత్యచలనశీలతకు సంకేతం. ఇలాంటి వ్యక్తిత్వం విమర్శకులందరికీ గొప్ప ఆదర్శనీయం.
2. మహాకవి జాషువా కవితా సమీక్ష
జాషువా వ్రాసిన పుస్తకాలపై అద్దేపల్లి వ్రాసిన విశ్లేషణా వ్యాసాల గ్రంథం పేరు "మహాకవి జాషువా కవితా సమీక్ష". ఈ పుస్తకంలో జాషువా శైలి, శిల్పం, సామాజికత లాంటి అంశాలపై లోతైన చర్చ చేసారు అద్దేపల్లి. సాధారణంగా కులప్రాతిపదికపై జాషువా సాహిత్యాన్ని పరిశీలించటం అందరూ చేస్తారు. కానీ ఎవరూ అంతవరకూ చెప్పని విషయాలను చెప్పటం విమర్శకునిగా అద్దేపల్లి ప్రత్యేకత. పిరదౌసి, ముంతాజ్ మహల్ కావ్యాలలో కథాశిల్పాన్ని చెప్పటం, స్వయంవరం పుస్తకంలో ఉండే రాజకీయ వ్యంగ్యాన్ని గురించి విశ్లేషించటం ఈ కోవకు చెందుతాయి.
భూస్వామ్య భావధారకు ఫలితమైన సమాజదురాచారాలను వ్యతిరేకించటమే జాషువా ప్రగతిశీలత అని; జాషువా గాంధీ సిద్ధాంతాన్ని, మానవతా సూత్రాల్ని, కరుణ రస ప్రాధాన్యాన్ని విశ్వసించి రచనావ్యాసంగం సాగించారు అన్న అద్దేపల్లి అభిప్రాయాలు జాషువాను అర్ధం చేసుకోవటంలో దోహదపడతాయి.
3. అనుభూతి వాదం ప్రతిపాదన
ప్రముఖ కవి తిలక్ ను అనుభూతికవిగా, భావకవిగా అద్దేపల్లి దర్శిస్తారు. “అనుభూతి వాది తిలక్” అనే వ్యాసంలో అనుభవాన్ని, అనుభూతిని వేరుపరచి - అనుభూతి అనేది మనస్సును స్పందింపచేసి ఎక్కువకాలం గుర్తుండిపోయే అంశమంటూ అనుభూతిని నిర్వచిస్తారు. “అనుభూతిని రాస్తున్నట్టి కవులలో ఉపదేశము ఉండదు, ఒక నినాదము ఉండదు. ఒక సిద్ధాంతము ఉండదు. ఇవన్నీ పై పొరలకు సంబంధించినవి. కాని, లోపలి పొరలకు వెళ్ళినపుడు అవి అనుభూతి అవుతుంది” అంటూ అనుభూతి వాదాన్ని విశదపరుస్తారు. తిలక్ కవిత్వంలో కనిపించే వివిధ అనుభూతుల్ని ఉదహరిస్తూ సాగుతుందీ వ్యాసం. ఈ రకమైన కవిత్వాన్ని రాయటాన్ని "అనుభూతివాదం" అనొచ్చని ప్రతిపాదిస్తారు అద్దేపల్లి.
తెలుగు సాహిత్యచరిత్రలో ప్రధమంగా అనుభూతిని నిర్వచించటం దాని ఆధారంగా కవిత్వాన్ని విశ్లేషించటం, అట్టి కవిత్వానికి అనుభూతి వాదమని పేరుపెట్టటం చేసింది శ్రీ అద్దేపల్లే.
భావకవిగా తిలక్ అనే మరో వ్యాసంలో భావకవిత్వం సౌందర్యప్రధానమని, తిలక్ శైలిలోనే గొప్ప సౌందర్యం ఉంటుందని అదే విధంగా తిలక్ లో అభ్యుదయ భావాలుకూడా హెచ్చుగానే ఉన్నాయని నిరూపిస్తారు అద్దేపల్లి.
“కృష్ణ శాస్త్రి కవిత్వంలో అనుభూతి ఒక వేదనా స్పర్శతో కూడి ఉంటుంది” అంటారు అద్దేపల్లి. అంతే కాక ఒక వ్యాసంలో “కృష్ణ శాస్త్రి కృష్ణ పక్షం, ఊర్వసి, ప్రవాసం - ఈ మూడు వ్రాసి ఉండకపోయినా, ఒక్క “అన్వేషణము” అనే ఖండిక వ్రాస్తే చాలు, మహాకవిగా నిలబడిఉంటాడు” అంటూ చేసిన ఒక సాహసోపేతమైన వ్యాఖ్య దాన్ని సహేతుకంగా సమర్ధించిన విధానము విమర్శకునిగా అద్దేపల్లి ప్రదర్శించిన అసాధారణమైన సాధికారిక ప్రజ్ఞ.
4. మిని కవిత - శిల్పం శైలి.
ఒకనాటి తెలుగు కవిత్వలోకంలో మిని కవితా ఉద్యమం ఒక ప్రభంజనం. ఆ ఉద్యమాన్ని దాదాపు చేయిపట్టుకొని ముందుకు తీసుకెళ్ళి ప్రచారం చేసిన వారిలో శ్రీ అద్దేపల్లి ప్రముఖులు. "మినికవిత" అనే పుస్తకంలో మినీ కవితా శిల్పాన్ని, శైలిని సోదాహరణంగా చర్చించారు అద్దేపల్లి. "ఒకే ఒక్క భావాన్ని సాధ్యమైనంత శక్తిమంతంగా, హృదయంలో ముద్రపడేటట్లు, ధ్వనిపూర్వకంగా చెప్పటానికి మినీకవిత ఉపకరిస్తుంది, మిని కవితకు ఉచ్ఛ్వాసం క్లుప్తత, నిశ్వాసం ధ్వని” అంటూ శ్రీ అద్దేపల్లి ఇచ్చిన నిర్వచనాన్ని నేడు వస్తున్న ఏ రకపు కవితకైనా అన్వయించుకోవచ్చు.
రుబాయీలు, గాలిబ్ గీతాలు, గురజాడ, శ్రీశ్రీ కవితలను ఉదహరిస్తూ మినికవిత్వం అనేది ఎప్పటినుంచో ఉన్న ప్రక్రియేనని నిరూపించే ప్రయత్నం చేస్తారు అద్దేపల్లి.
కొత్తగా ఒక సాహిత్య ప్రక్రియ మొలకెత్తుతున్నప్పుడు దానిని స్వాగతించి, ఆ ప్రక్రియకొక సైద్ధాంతిక నేపథ్యాన్ని అందించటం విమర్శకుల బాధ్యత. మినికవితోద్యమ సందర్భంగా అద్దేపల్లి ఆ పనిని ఈ పుస్తకం ద్వారా సమర్ధవంతంగా నెరవేర్చారు.
5. దృష్టిపథం - అస్తిత్వ వాదాలపై విశ్లేషణ
వివిధ అస్తిత్వవాదాలు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్న సందర్భంలో దళిత, బహుజన, స్త్రీవాద రచనలపై వ్రాసిన విశ్లేషణాత్మక వ్యాససంపుటి “దృష్టిపథం”. ఈ పుస్తకంలో దళితవాద, స్త్రీవాద, పోస్ట్ మోడర్నిజం పుట్టుపూర్వోత్తరాలను లోతుగా చర్చించి, వాటి అవసరతను, బాధ్యతలను గుర్తుచేస్తారు. ఈ సంపుటిలో బొజ్జాతారకం గారు వ్రాసిన "నదిపుట్టిన గొంతుక" లోని తాత్వికధార తెలుగు ఆధునిక దళిత అస్తిత్వవాదానికి పునాదిగా నిలిచింది అని చేసిన ప్రతిపాదన అపూర్వమైనది.
ఈ పుస్తకంలో శ్రీ అద్దేపల్లి - ఫ్యూడల్ వ్యవస్థలో స్త్రీ బానిస అయితే బూర్జువా వ్యవస్థలో ఒక వస్తువు; పోస్ట్ మోడర్నిజం ఒక అవాంఛనీయ ధోరణి; దళితకవిత్వం ఒక ఉద్యమ కవిత్వంగా మారుతుందని మొదట్లోనే అంచనా వేయటం -లాంటివి వీరి సామాజిక అవగాహనకు నిదర్శనం.
తెలుగు సాహిత్యవిమర్శనా పుస్తకాలలో దృష్టిపథం అత్యంత విలువైనది, ఆధునిక తెలుగు కవిత్వరీతులను అధ్యయనం చేయటానికి ఇదొక దిక్సూచి.
6. అభ్యుదయ విప్లవ కవిత్వాలు-సిద్ధాంతాలు; శిల్పరీతులు
శ్రీ అద్దేపల్లి గారు తమ డాక్టరేట్ కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథం ఇది. తెలుగు సాహిత్యరంగానికి సంబంధించి అభ్యుదయ, విప్లవ కవిత్వాల యొక్క సిద్ధాంత చర్చలు ఎక్కువగా జరిగాయి తప్ప, వాటిలోని శిల్ప సమీక్ష పెద్దగా జరగలేదు. నిజానికి అదొక ఖాళీ ప్రదేశం. దిశానిర్ధేశనం చేయటానికి ఎటువంటి పూర్వరచనలు అందుబాటులో ఉండవు. అటువంటి టాపిక్ తీసుకోవటం సాహసోపేతమైన చర్య. ఒక రకంగా సవాలు కూడా. శ్రీ అద్దేపల్లి ప్రతిభ కలిగిన సాహసి కనుక ఈ టాపిక్ ను తమ డాక్టరేట్ కొరకు ఎంచుకొని ఆ లోటును ఈ సిద్ధాంతగ్రంథం ద్వారా సమర్ధవంతంగా పూరించారు.
7. కుందుర్తి కవితా వైభవం
కుందుర్తి ఆంజనేయులు గారి కవిత్వాన్ని సమగ్రంగా చర్చించిన పుస్తకమిది. కుందుర్తి అచ్చమైన ప్రజాకవి అని, కథా కథన పద్దతిలో ధ్వని మార్గాన్ని అనుసరించిన కవి అని, వ్యంగ్యాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకొన్నాడు అని శ్రీ అద్దేపల్లి చేసిన ప్రతిపాదనలు ఎంతో ఖచ్చితమైనవి, విలువైనవి.
8. సమకాలీనత
సాహిత్య విమర్శకుడు తప్పని సరిగా తనకాలంలో వస్తున్న వివిధ అంతర్జాతీయ రచనలను, వాటిపై వస్తున్న విమర్శను నిత్యం అధ్యయనం చేస్తూ ఉండాలి. ఇది అద్దేపల్లి వారు జీవిత పర్యంతమూ సాగించారు. శ్రీశ్రీని విమర్శించేటపుడు ఆనాటి టి.ఎస్. ఇలియట్ తో పోల్చటం; కృష్ణశాస్త్రిని విశ్లేషించేటపుడు ఠాగూర్ శైలిని ప్రస్తావించటం; తిలక్ వద్దకు వచ్చేటపుడు ఇమేజిస్ట్ సిద్ధాంత సారాంసాన్ని అన్వయం చేయటం; జాషువా కవిత్వాన్ని వివరించాల్సి వచ్చినపుడు భారతీయ భూస్వామ్య, కుల వ్యవస్థలలో అతని కవిత్వ మూలాల్ని అన్వేషించటం; స్త్రీవాదాన్ని, పోస్ట్ మోడర్నిజం, దళిత, మైనారిటీ వాదాల్ని విశ్లేషణ చేసేటపుడు ప్రపంచీకరణ, హ్యూమన్ రైట్స్ పట్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను చర్చించటం - అద్దేపల్లి కాలానుగుణ పరిణామశీలతను, నిరంతర అధ్యయనాన్ని, కాలిక స్పృహను మనకు పట్టిచూపుతాయి.
***
అనేక వందల పుస్తకాలకు అద్దేపల్లి వ్రాసిన ముందుమాటలలో ఎక్కువగా ఆ కవిత్వంలోని మంచిని వెలికితీసి చూపేవారు. ఇది వారి ఔదార్యానికి, ఔచిత్యానికి నిదర్శనం.
నలభై ఏళ్ళపాటు సాగిన శ్రీ అద్దేపల్లి విమర్శనాయానాన్ని గమనిస్తే- ఈయన ఆయా కాలాలలో వచ్చిన అన్ని ధోరణులను అధ్యయనం చేసి, వస్తువుతో పాటు కవి భావాల్ని, అతని పదాలకున్న శక్తిని, అతని శైలిని, శిల్పాన్ని మొదలైన అన్నింటిపై లోతైన విశ్లేషణలు చేసిన "సమగ్ర కళా విమర్శకుడు" గా దర్శనమిస్తారు.
బొల్లోజు బాబా
ఉపయుక్త గ్రంథాలు
1. అద్దేపల్లి రచనలు సమగ్రపరిశీలన – సిద్ధాంత గ్రంథం శ్రీ వాసా భూపాల్
2. డా. అద్దేపల్లి సారస్వత సమీక్షా దర్శిని
3. డా. అద్దేపల్లి రామమోహన రావు రచనలు
4. సారస్వత వివేచన – రాచమల్లు రామచంద్రారెడ్డి
5. అద్దేపల్లి వైమర్శిక ప్రస్థానం ఆదర్శనీయం – తంగిరాల చక్రవర్తి

No comments:

Post a Comment