శ్రీ దాట్ల దేవదానం రాజు గారి దోసిలిలో నది కవితా సంపుటిపై వ్రాసిన సమీక్ష ఆంధ్రప్రభ లో. ఎడిటర్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను.
పూర్తిపాఠం ఇది
దోసిలినిండా కవిత్వం
మట్టినీ ఆకాశాన్నీ
నదినీ పర్వతాన్నీ
కరుణనీ మానవతనీ
ఒక సమూహం కోసం
ఏకాంతంగా ప్రేమించేవాడే కవి ...... అన్న వాక్యాలు దాట్ల దేవదానం రాజు ఇటీవల వెలువరించిన “దోసిలిలో నది” కవితాసంపుటి లోనివి. పై వాక్యాలకు ఈ సంపుటిలోని కవిత్వం నిలువెత్తు దర్పణం పడుతుంది. వైయక్తికంగా ఉంటూనే, సామాజికంగా పలకటం ఆధునిక కవిత్వలక్షణం. అత్యంత సంక్లిష్టమైన ఈ గుణాన్ని దాదేరా ఒక కవితలో
“కవిత్వం ఒక తపస్సు
ఒక దీపస్తంభం” ..... అన్న అలతి అలతి పదాలలో నిర్వచిస్తాడు. ఆత్మ దర్శనం కోసం చేసే తపస్సు వైయక్తికమైనది. దారిచూపటం కోసం దీపస్తంభమై నిలబడటం సామాజికం. రెంటినీ సమన్వయపరుస్తూ సృజించేదే ఉత్తమకవిత్వంగా నిలుస్తుంది,
“దోసిలిలో నది” గా మారుతుంది.
నిర్మలమైన భావధార, చిక్కని అనుభూతి, ఇజాలతో సంబంధం లేని జీవనస్పర్శలు, తేటగా కనిపిస్తూనే లోతుగా తాకే వాక్యాలు దాదెరా కవిత్వలక్షణాలు. పడవప్రయాణం,
వానచినుకులు, రాజకీయనాయకుల వాగ్దానాలు, మట్టి, వెన్నెల వంటి సాధారణ వస్తువులు అసాధారణ కవితలుగా మారటం ఈ సంపుటిలోని అనేక కవితలలో చూడొచ్చు.
“ఒక కాంతిగురించి” అనే కవితలో
“వెన్నెల వెలుగుల్ని
మంచిగంధంలా
అరగదీసి రంగరించి
తెలుగింటి ముగ్గులా
బొటనవేలు....చూపుడువేలు సందున
శబ్దమై జారితే
కవిత్వమౌతుంది.
...... అంటాడు. వెన్నెల,
గంధం, ముగ్గు అనే మూడు పదాలతో సాధించిన ఈ పదచిత్రం బిగుతైన నిర్మాణానికి చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.
కడియం పూలనర్సరీలకు ప్రసిద్ది. ఆ ఊరిమీదుగా బస్సులో ప్రయాణిస్తున్నా ఒక పరిమళకాంతి మొహానికి తాకుతుంది. “పరిమళ కంకణం” అనే కవితలో ఆ ఊరిని
“మట్టి మంచి గంథంలోంచి
మొలకెత్తి
గాలికి అంకితమైన
పరిమళాల కొలువు.... కడియం .....” అని చేసిన వర్ణనాసౌరభం హృదయానికి ఆహ్లాదకరంగా తాకకమానదు.
ఒక సభలో ప్రముఖ కవి శ్రీ శివారెడ్డి గారి ప్రసంగం విన్నతరువాత వ్రాసిన కవితలో ఆ అనుభవాన్ని అద్భుతంగా ఇలా వర్ణిస్తారు దాదెరా.
“ఒళ్ళంతా కళ్ళై
కవిత్వ సౌందర్యాన్ని వీక్షించాను
లుప్తమైన నూనెలో
వత్తిని అటూ ఇటూ జరుపుకొని
నన్ను నేను వెలిగించుకొన్నాను
చిరుదీపపు వెలుగులో
అలౌకికానందాన్ని పదిలపరచుకొన్నాను” (ప్రేరణ). చిన్నచిన్న మాటలతో ఓ గొప్ప కవిత్వసౌందర్యాన్ని దర్శింపచేస్తాడు. తనని తాను కవిత్వంతో వెలిగించుకోవటం అనేది అమేయమైన అలౌకికానందం. దాన్ని గొప్ప వొడుపుతో అక్షరాలలోకి వొంపి మనకందిస్తాడు.
“ఈ జబ్బుకు మందేదీ” అనే కవితలో ఒక వ్యక్తి స్వశక్తితో ఎదుగుతూ, పేరుతెచ్చుకొంటున్నపుడు చుట్టూ ఉండే కొంతమంది ప్రదర్శించే అసూయా, ద్వేషాలను వర్ణిస్తూ అలాంటి వ్యక్తుల గురించి చివరలో
“నీది రోగమేనని ఏ వైద్యుడూ చెప్పడు
నిన్ను నయం చేసే మందులుండవు
నేను నిన్ను కాపాడలేను” అని అంటాడు. చిత్రంగా ఇదే సంపుటిలోని “సహృదయం” అనే కవిత అదే వస్తువును అవతలి పక్షం నుంచి చెపుతూ....
“కళ్ళల్లో జిల్లేడు పాలు పోసుకొని
వేదన దిగమింగక్కర్లేదు
చీకటిలో కుమిలిపోనక్కర్లేదు
వాడి ఎదుగుదలను స్వాగతిద్దాం” అంటూ మొదలౌతుంది. ఎదుటివాని ఎదుగుదలకు అసూయచెందే జంతుస్థితినుండి మనుషులు సహృదయత కలిగిన ఉన్నతదశకు ఎదగాలని ఈ కవి ఆశిస్తున్నట్లు భావించాలి.
బియాస్ నది మృతులపై వ్రాసిన స్మృతిగీతంలో
“ఏ కరకెరటమూ
సముదాయించి ఒడ్డు చేర్చలేదు
ఏ ప్రవాహపు నావ
అలలపై కూర్చుండబెట్టి
సేద తీర్చలేదు//
అగమ్య పథాన
జలఖడ్గం గుండెల్ని చీల్చింది (దుఃఖరసం).... అంటూ అలనాటి విషాదాన్ని శోకదృశ్యచిత్రాలుగా,
పదునైన వ్యక్తీకరణలతో కనులముందు నిలిపి అనుకంప రగిలిస్తాడు.
తెలుగునేల రెండురాష్ట్రాలుగా విడిపోవటం పట్ల కవులందరూ అటో, ఇటో హృదయానుగతంగా స్పందించారు. కవికూడా సమాజంలో భాగమే కనుక చుట్టూ జరిగే సంఘటనలకు తనవంతు బాద్యతగా స్పందించక తప్పదు. అందులో మినహాయింపు ఉండదు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వ్రాసిన
“కొత్త లోకాలు” అనే కవితలో
“ఒక మేఘం కింద
ఉదయాలు రెండు
విడి ముద్దులు మధురం.” అంటూ రెండు రాష్ట్రాలను రెండు కొత్తలోకాలుగా ఆవిష్కరించి ఆహ్వానించటం జరిగింది.
ఈ సంపుటిలో “ఉనికి” అనే కవిత రైతువెతల్ని ఎత్తిచూపుతుంది. రుణ మాఫీ పేరుతో రైతులలో లేనిపోని ఆశలు కల్పించి, వాగ్ధానభంగం కావించిన నాయకులను ఉద్దేశించి
“ఈ ప్రపంచం ఎప్పుడూ ఉంటుంది
రైతు కూడా” ..... అని అనటం ద్వారా వారి అధికారం అశాశ్వతమని పరోక్షంగా హెచ్చరిస్తాడు.
మోహం, పరిమళం ఆచూకీ, తీరంగూడు, పడవ, సగం తర్వాత వంటి కవితలు సున్నితమైన జీవనానుభవాలకు చక్కని కవిత్వరూపాలు.
ఈ పుస్తకంలో మొత్తం 37 కవితలున్నాయి. దీనికి ముందుమాటలు శ్రీ ఎం. నారాయణ శర్మ, డా.సీతారాం లు వ్రాసారు. ముఖచిత్రం శ్రీ ముమ్మిడి చిన్నారి సమకూర్చారు.
సరళంగా ఉంటూనే లోతైన అభివ్యక్తిని, ఆలోచింపచేసే తత్వాన్ని పొదుగుకొన్న “దోసిలిలో నది” మంచికవిత్వాన్ని ఇష్టపడేవారందరికీ నచ్చుతుంది.
వెల: 60 రూపాయిలు
కాపీల కొరకు
దాట్లదేవదానం రాజు
8-1-048 ఉదయిని
జిక్రియనగర్
యానాం – 533464
ఫోన్: 9440105987
బొల్లోజు బాబా - 9849320443