Sunday, May 28, 2017

కవిత్వంలో ఇమేజ్, మెటఫర్, సింబల్ లు


ఇమేజ్
ఒక చక్కని వర్ణన మాత్రమే.   ఇక వేరే అర్ధాలేమీ ఉండవు

1. కిటికీలోంచి చూస్తే
వెలుతురునిండిన బెజ్జాలతో పిల్లం గోవిలా
ఊళవేసుకుంటూ దూసుకుపోతోంది రైలు --  ఇస్మాయిల్

2. నిన్నరాత్రి ఎక్కడెక్కడికో
తప్పిపోయిన
నీడల్ని లాక్కొచ్చి
భవనాలకు, చెట్లకు
మనుష్యులకూ అతికిస్తున్నాడు
సూర్యుడు
తన కిరణాల దారాలతో!

మొదటి ఉదాహరణలో ఒక రైలు రాత్రిపూట ఎలా కనిపిస్తుందో చేసిన వర్ణన ఉంది.  ఆ ఇమేజ్ సౌందర్యమే కవిత్వం.  అంతకు మించి ప్రయోజనాన్ని కానీ వేరే అర్ధాన్ని కానీ ఆ వాక్యంనుంచి పొందలేము.  ఆ ఇమేజ్ ను సృష్టించటంలోనే కవి ప్రతిభ దాగి ఉంటుంది.
రెండవ ఉదాహరణకూడా అంతే ఆ దృశ్యం ఎంతవరకూ చూపగలదో అంతవరకూ మాత్రమే మనం చూడగలం.

మెటఫర్
చెప్పిన విషయం కాక మరో అర్ధాన్ని కలిగిఉండటం.
1. తనని బాధిస్తున్న ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి
ఈ పిల్ల చకచక ఎటో నడిచిపోయింది (ఆత్మహత్య)  -- ఇస్మాయిల్

2. ఈ రోజుకూడా సూర్యుడు బహుసా
ఆకాశపుటటెండెన్స్ రిజిష్టరులో
రెండు సంతకాలూ చేసేసి వెళిపోయుంటాడు.

మొదటి ఉదాహరణలో ఆ పిల్ల ప్రపంచపు ముల్లుని పీకి పారేయటం అన్న క్రియ కాదిక్కడ ప్రధానం.  ఆ చేష్ట ద్వారా కవి చెప్పదలచుకొన్నది ఆ అమ్మాయి ఆత్మహత్యచేసుకొంది అని అన్యాపదేశంగా చెప్పటం.  ఇక్కడ ఆత్మహత్యకు ప్రపంచపు ముల్లుని పీకిపారేయటం అనే క్రియ మెటాఫర్ గా మారింది.
రెండో ఉదాహరణలో ఆ రోజు యధావిధిగా సూర్యుడు ఉదయించి అస్తమించాడు అన్న విషయాన్ని చెప్పటం జరిగింది.


సింబల్
చెప్పిన విషయంతో పాటు మరో అర్ధాన్ని కలిగి ఉండటం.

1. సూర్యుని కోల్పోయినందుకు కన్నీరు రాల్చుకొంటే
నక్షత్రాలను కూడా చేజార్చుకోవలసి వస్తుంది.  -- టాగూర్

2.సంజె వేళ
దీపాలు వెలిగించారు
ఎవరి దీపాలు వారివి. -- ఇస్మాయిల్

మొదటి ఉదాహరణలో చెప్పిన విషయంతో పాటు - జీవితంలో ఎదురుదెబ్బతగిలినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఉన్న ఆనందాలను కూడా అనుభవించలేవు అనే ఒక జీవితపాఠం కూడా సింబాలిక్ గా  తెలుస్తుంది.

రెండవ ఉదాహరణలో కూడా ఎవరి దీపాలు వారివి అనటంలో  విశ్వప్రేమను చూపించేది సూర్యుడే నని చెప్పటం/జీవనయానంలో ఎవరి వెలుగులు వారివి అని సూచించటం.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment