Wednesday, June 7, 2017

కవిత్వంలో పెర్సొనిఫికేషన్ (Personification)


మానవలక్షణాలను వస్తువులకో, జంతువులకో లేక ఒక ఊహకో ఆరోపించి కవిత్వం చెప్పే పద్దతిని పెర్సొనిఫికేషన్ అంటారు.
కవిత్వం రాసే పద్దతులలో ఇది ఒక ముఖ్యమైన టెక్నిక్. దీనివల్ల ఒక విషయం పాఠకుని మనస్సులో లోతుగా నాటుకొంటుంది. మెటానొమీ లేదా సింబల్ లాంటి టెక్నిక్ లతో పోల్చినపుడు పెర్సొనిఫికేషన్ చాలా సరళంగా ఉంటూ, పాఠకుడిని శ్రమపెట్టకుండానే కవిత్వానుభూతి కలిగిస్తుంది.
పెర్సొనిఫికేషన్ టెక్నిక్ దైనందిన సంభాషణలలో, కథలలో, వార్తాకథనాలలో కనిపిస్తూనే ఉంటుంది. “ఈ బండి పెట్రోలు పొదుపు చేస్తుంది” అంటాం. “సూర్యుడు నడినెత్తిన నిప్పులు చెరుగుతున్నాడు” అంటూ ఓ కథ మొదలవ్వొచ్చు. “ఆ పథకం అందరిజీవితాలలో వెలుగులు నింపింది” అన్న ఓ వార్తాంశం కావొచ్చు. అన్నీ పెర్సొనిఫికేషన్ కు చక్కని ఉదాహరణలే.
కవిత్వంలో పెర్సొనిఫికేషన్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే – పెర్సొనిఫికేషన్ ద్వారా పాఠకుని మనసులో ఒక బలమైన దృశ్యరూపం ఏర్పడుతుంది. కవితలోని మూడ్ లేదా కవిత చెప్పదలచుకొన్న అంశం ఈ టెక్నిక్ వల్ల మరింత స్పష్టంగా అర్ధమౌతుంది. కవిత్వనిర్మాణ పద్దతులలో చాలా సులువుగా అందుబాటులో ఉండే ప్రక్రియ ఇది.
నీడని పరుచుకుని
ఎండని కప్పుకుని
పడుకుంది రాలిన ఆకు. --- ఇస్మాయిల్
ఇస్మాయిల్ గారి కవిత్వంలో పెర్సొనిఫికేషన్ ప్రక్రియతో నిర్మించిన అనేక అద్భుతమైన ఇమెజెస్ కనిపిస్తాయి. పై ఉదాహరణలో ఒక రాలిన ఆకుకు మానవలక్షణాలైన పక్క పరచుకొని, దుప్పటి కప్పుకొని పడుకోవటం అనే క్రియలను ఆరోపణ చేసి చిన్నచిన్న మాటలతో చక్కని సుందర దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు ఇస్మాయిల్.
వర్షధారలనే పగ్గాలతో
నేలను పైకి లాక్కొందామనే
మబ్బుల ఆలోచన ఫలించకపోవటంతో
అవి ఎలా మూలుగుతున్నాయో చూడు
ఉరుముల శబ్దాలతో. – 436 (గాథాసప్తశతి)
రెండువేల ఏళ్ళక్రితం నాటి ఈ సప్తశతి గాథలో ఒక అందమైన ఊహ పెర్సొనిఫికేషన్ వల్ల మరింత అందంగా, సజీవంగా మారి, ఆ దృశ్యం మదిలో హృద్యంగా రూపుకడుతుంది. ఉరుములనేవి విఫలయత్నం చేసి అలసిపోయిన మబ్బుల మూలుగులు అనటం గొప్ప ఊహ. పెర్సొనిఫికేషన్ ను పరాకాష్టకు తీసుకెళ్ళిన పదచిత్రంగా దీన్ని భావించవచ్చు.
ఓయ్ పిల్లవాడా బయటకు వెళ్లకు.
చెరువు పక్కనున్న తాటి వరుసలు
తమ తలల్ని నింగిపై బాదుకొంటున్నాయి,
తూరుపు రేవులో పెంజీకట్లు సంచరిస్తున్నాయి. (ద రైనీ డే క్రిసెంట్ మూన్ – రవీంద్రనాథ్ టాగోర్)
తుఫాను వచ్చేలా ఉంది, బయట సంచరించవద్దు అంటూ ఒక తల్లి తన పిల్లవానికి చేసిన హెచ్చరికలో - తాటిచెట్లు తలల్ని నింగికి బాదుకోవటం, పెంజీకట్లు సంచరించటం వంటి పెర్సొనిఫికేషన్ వర్ణణల వల్ల ఒక భయానక వాతావరణం/మూడ్ అలవోకగా నిర్మింపబడింది పై వాక్యాలలో.
ఎవరూ నన్ను వినట్లేదని
దూరంగా ఓ పక్షి రోదిస్తూ ఎగిరిపోయింది
రక్తమోడుతున్న వీధులు
 ముడుచుకున్న భవనాలపై
తన రోదన వస్త్రంలా కప్పబడిందని
అది చూడలేక పోయింది (అలా వదిలేయండి – మెర్సి మార్గరెట్)
పై కవితలో పెర్సొనిఫికేషన్ టెక్నిక్ చాలా బలంగా వ్యక్తమయింది. మానవలక్షణాలైన రోదనను పక్షికి, రక్తమోడ్చటం వీధులకు, ముడుచుకుపోవటం భవనాలకు ప్రతిభావంతంగా ఆపాదించటంతో, ఆ వాక్యాలు శక్తివంతమైన కవిత్వంగా మారాయి. ప్రతి వర్ణణా చిక్కని స్పష్ట చిత్రంగా మనసుకి తెలుస్తుంది.
అలలగొంతుతో
నది పాడుతుంటుంది
ఏ సుదూరాన్నుంచో పక్షులు నదిపాట విని
కచేరి ముందు వీక్షకులు చేరినట్టు
నది వొడ్డున చేరుకుంటాయి (నదిపాట – బాల సుధాకర్ మౌళి)
నది పాడటం, ఆ పాటను విని పక్షులు నదివొడ్డుకు చేరటం పెర్సొనిఫికేషన్ క్రిందకు వస్తుంది. ఇక్కడ ఉత్త పెర్సొనిఫికేషన్ చేయటంలో మాత్రమే కాక దానికి సంబంధించిన ఒక వాతావరణాన్ని సృష్టించటంలో కవి పరిణతి కనిపిస్తుంది. నది అలలగొంతుతో పాడటం, కచేరిముందు వీక్షకులుగా పక్షులు చేరటం వంటి వివరణలతో కవిత స్థాయి అనూహ్య ఎత్తులకు చేరింది. ఇలాంటి కవిత్వనిర్మాణంలోనే కవి ప్రతిభ స్ఫుటితమౌతుంది.
మేఘాలూ నేలా
రాత్రి చుంబించుకొన్నట్లున్నాయి.
తెల్లవార్లూ వానకురుస్తానే ఉంది.
నల్లని మంచుగడ్డకరిగిపోయింది.
ప్రశాంతతరువుల్లోకి ప్రాత:కాలం
తడితడిగా ప్రవేసించింది.
వందగుమ్మాలతో వెదురు పొద
స్వాగతం పలికింది. (ఆకుపచ్చని తడిగీతం)
చుంబనం, ప్రవేశించటం, స్వాగతం పలకటం వంటి లక్షణాలను ప్రకృతికి ఆపాదించటం ద్వారా అందమైన ఇమేజెరీ ఆవిష్కృతమైంది. వెదురుపొదలో నిలువుగా సమాంతరంగా ఉండే వెదురుమొక్కలను గుమ్మాలుగా వర్ణించటం చక్కని ఊహాశాలిత.
పెర్సొనిఫికేషన్ అనేది కవిత్వనిర్మాణంలో ఒక ప్రాధమిక స్థాయి టెక్నిక్. దీనిద్వారా సూటిగా, స్పష్టంగా కవితావస్తువును ఆవిష్కరించవచ్చు. పెర్సొనిఫికేషన్ టెక్నిక్ ఇతర నిర్మాణ పద్దతులతో ఒక భాగంగా ఉంటూ వ్రాసిన కవితలు మరింత శక్తివంతంగా ఉంటాయి.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment