Friday, June 2, 2017

కవిత్వంలో ఇమేజెరీ


కవిత్వంలో ఇమేజ్ అంటే పదాలతో నిర్మించిన ఒక చిత్రం. ఆ పదాలను చదువుకొన్నప్పుడు మనసులో ఒక దృశ్యం ఊహకు వస్తుంది.
“వెన్నెల
మబ్బుల మెట్లమీదుగా
నేలకు దిగే సమయాన" (మేఘనా - శిఖామణి)
అనే వాక్యంలో రాత్రి చిక్కబడుతూండగా వెన్నెల మెల్లమెల్లగా బయటపడుతున్న ఒక దృశ్యం ఆవిష్కృతమౌతుంది. ఇక్కడ కవి ఒక ఆహ్లాదకరమైన సందర్భాన్ని సౌందర్యాత్మకంగా కవిత్వీకరించాడు.
ఒక ఆలోచననో, దృశ్యాన్నో, ఉద్వేగాన్నో చెప్పేటపుడు ఒకటికంటే ఎక్కువ ఇమేజెస్ అవసరపడొచ్చు. అనేక ఇమేజెస్ కలిసి ఒక భావాన్ని వ్యక్తీకరించినపుడు ఆ ఇమేజ్ ల సముదాయాన్ని ఇమేజెరీ అంటారు. ఒక కవితలో అనేక ఇమేజెరీలు ఉండొచ్చు.
మన అనుభూతులనన్నీ ఇంద్రియాల ద్వారానే మనం పొందుతాం. వానవెలసిన సాయింకాలం పూట - మబ్బుల మధ్యతొంగిచూస్తోన్న నీలాకాశం, చెంపలకు తాకే చల్లని గాలి, ముక్కుపుటాలను ఆగాగి తాకే చిత్తడి వాసనా, పక్షులు తమ తడిచిన రెక్కలను తపతపలాడిస్తూ చేసే శబ్దాలు, గొంతులోకి జారే వేడివేడి చాయ్ రుచీ - అన్నీ హాయైన అనుభూతులను కలిగిస్తాయి. వాటిని మనసు సంశ్లేషించి ఆ ఆహ్లాదకర అనుభవాన్ని, ఒక అందమైన జ్ఞాపకంగా మలచుకొంటుంది. కవిత్వంలో ఇమేజెరీ కూడా ఇదే పని చేస్తుంది. ఇంద్రియానుభవం ఇవ్వటం ద్వారా రససిద్ధి కలిగిస్తుంది.
వేసవి గాడ్పులకి
దాహపు ఖర్జూరచెట్టు
యెడారి గొంతులో
అమ్ములపొదిలా
విచ్చుకొని
గరగరలాడుతోంది - (దాహం) ఇస్మాయిల్
పై ఖండికలో దాహమనే ఇంద్రియానుభవాన్ని అనేక ఇమేజెస్ ద్వారా చెపుతున్నాడు కవి . వివిధ మూర్త చిత్రాలను వరుసగా పేర్చుకొంటూ వెళ్లాడు. ఆ ఆరులైన్లు చదివేసరికి పాఠకునికి ఏదో ఎడారిలో మైళ్ళ దూరం నడిచి, దాహంతో గొంతు పిడచకట్టుకుపోయిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే దాహం అనే అమూర్త భావనను- ఎడారి, ఖర్జూరచెట్టు, ముళ్ళగరగర వంటి మూర్తచిత్రాలు నేరుగా అనుభవంలోకి తీసుకొస్తాయి. ఇది ఇమేజెరీ గొప్పదనం.
కవిత్వాన్ని అబ్ స్ట్రాక్ట్ నుంచి కాంక్రిట్ కు నడిపించటంలో ఇమేజెరీ అతిముఖ్యమైన పాత్రవహిస్తుంది. ఇలా భావాలను దృశ్యరూపంలో చెప్పే పద్దతిని ఇమేజిజం అంటారు.
*****
ఇమేజెరీ కవిత్వం అంటే చెట్టు పుట్టా కవిత్వమనే భావన కొంతమందిలో ఉంది. సామాజిక, రాజకీయ, కవిత్వాల శక్తివంతమైన నిర్మాణంలో కనిపించే ఇమేజెరీకి కొన్ని ఉదాహరణలు
1.
“గుండెల్లో
మెత్తగా దిగబడే
కాగితపు కత్తి
కరెన్సీ నోటు”
అలిశెట్టి ప్రభాకర్ ఈ ఇరవై అక్షరాల కవిత మానవసంబంధాలన్నీ ఆర్ధికసంబంధాలే అన్న మార్క్స్ మాటను గుర్తుకుతెస్తుంది. డబ్బునోట్లో తలపెట్టి ఇరుక్కుపోయిన మానవజాతి పరిణామక్రియను ప్రతిబింబిస్తుంది. గుండెలోకి ఆ అక్షరాలు పదునుగా దిగిన చప్పుడు ప్రతిధ్వనిస్తుంది. కవిత్వంలో ఇమేజెరీ స్థానం ఎంతగొప్పదో చూపుతుందీ కవిత.
2.
వాడెవడో మూర్ఖుడు
తల లేని మనిషి మొండేల్ని కుక్కినట్లు
లారీల్లో చెట్టు దుంగల్ని వేసుకెళ్తున్నాడు (అరణ్యకృష్ణ).
పచ్చని చెట్లను కొట్టేసి దుంగల్ని తరలిస్తున్న దృశ్యాన్ని తలలేని మొండాలను తీసుకెళ్ళటంలా పోల్చటం ద్వారా మన భవిష్యత్తు పట్ల భయాన్ని కలిగిస్తాడు కవి. రేపు నీ పరిస్థితి కూడా ఇదే నన్న హెచ్చరిక చేస్తాడు.. ఒక బీభత్సాన్ని కళ్ళముందు నిలుపుతాయా వాక్యాలు. ఇదంతా ఒక్క “తలలేని మనిషి మొండెం” అన్న ఇమేజ్ ద్వారా సాధ్యపడింది.
3.
కవిత్వం ఆర్భాటం కాదు
అది నగ్నంగా పడుకున్న
ఓ అపురూప సౌందర్యవతి దేహంతో
పసి పిల్లాడిలా.. పడుచు కుర్రాడిలా
ఏక కాలంలో ఆడుకునే
ఒకానొక అదృశ్య రసానంద రహస్యాత్మ (రసానందం - ప్రసాదమూర్తి).
కవిత్వం సూర్యుడిలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దర్శనమిస్తుంది. ప్రసాదమూర్తి చిత్రించిన కవిత్వచిత్రం గాఢంగా ఉంటూ చదివినపుడు ఒక్కొక్కరికి ఒక్కోరకపు ఇంద్రియానుభవాల్ని ఎరుకకు తెస్తుంది.
4.
అయ్యో
పాలింకి పోవడానికున్నట్లు
మనసింకిపోవడానికి
మాత్రలుంటే ఎంత బావుండు (అబార్షన్ స్టేట్ మెంట్ - పాటిబండ్ల రజని).
స్త్రీల Reproductive rights పట్ల స్పష్టమైన అభిప్రాయాలు ఏర్పడకపూర్వమే వ్రాసిన గొప్ప కవిత ఇది. అబార్షన్ తరువాత lactationను నిలుపుచేయటానికి మందులున్నట్లే, తన నిస్సహాయ స్థితివల్ల గాయపడిన మనసు సాంత్వన పొందటానికి మాత్రలు లేవు అన్న ఇమేజెరీ, స్త్రీవాద కోణంలో అత్యంత బలమైన అభివ్యక్తి.
5.
ఏ రోడ్డు మీదో నా చిన్నప్పటి గురువులు కనిపిస్తే
గద్దను చూసిన కోడిపిల్లలా
నా బొటనవేలు గుప్పిట్లో దాక్కుంటుంది (ఆత్మకథ - ఎండ్లూరి సుధాకర్ ).
ఈ ఇమేజెరీలో దళితచరిత్ర అంతా ఒదిగిపోయింది. ద్రోణుడు, ఏకలవ్యుడు జ్ఞప్తికి రాకమానరు. వేదాలు విన్నందుకు చెవుల్లో సీసం పోసిన చరిత్రశకలాలు కన్పిస్తాయి. సాహిత్యంలో దళిత అస్థిత్వానికి ఒక స్థానం కోసం చేసిన ఉద్యమంలో చరిత్రనిరాకరించే ప్రక్రియలో భాగం ఈ కవిత.
6.
నేను పుట్టకముందే
దేశద్రోహుల జాబితాలో
నమోదై ఉంది నాపేరు (పుట్టుమచ్చ ఖాదర్ మొహిద్దిన్)
పై వాక్యాలు తెలుగుసాహిత్యాన్ని ఉలిక్కిపడేలా చేసాయి. ‘పుట్టకముందే’ అన్న పదంవల్ల గొప్ప లోతు, పదును వచ్చి తెలుగుసాహిత్యంలో ముస్లింవాదం ఒక బిగ్ బాంగ్ తో ప్రవేశించటానికి దోహదపడింది.
ఇమేజెరీ ద్వారా కవి శక్తివంతమైన కవిత్వాన్ని సృష్టించగలడు. బలమైన ఇమేజరీ అనేది కవి ప్రతిభ, వ్యుత్పత్తులపై ఆధారపడి ఉంటుంది. ఇమేజెరీలో ఇమేజెస్ లాజికల్ ఆర్డర్ లో లేకపోతే గందరగోళానికి దారితీసే ప్రమాదం ఉంది. ఉత్తమ కవిత్వానికి ఇమేజెరీ గీటురాయి.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment