Tuesday, June 20, 2017

“ఆకు కదలని చోట” - కదలాడే కవిత్వపు జాడ


కవులు సత్యాన్వేషులు. కవిత్వం సత్యాన్నావిష్కరించే సాధనం. కవులు ఆవిష్కరించే సత్యాలు వారి మనోలోకంలో పుట్టినవి కావొచ్చు లేదా సామాజిక పరిశీలనలో బయటపడినవి కావొచ్చు. “ఆమె కన్నులలోన అనంతాంబరపు నీలి నీడలు కలవు” అన్న వాక్యంలో –ఆ కవి ఊహలో ఒక సౌందర్యరాశి నల్లని కన్నులుకు వినీలాకాశానికి సామ్యం కనిపించింది. అది ఒక సత్యావిష్కరణ. ఇలాంటి కవిత్వం చదువరి హృదయానికి హాయినిచ్చి, సంస్కారాన్ని, మార్ధవతను కలిగిస్తుంది. “ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం” అన్న వాక్యం ద్వారా, ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు కవికి కొన్ని సత్యాలను ఎరుకపరచినట్లు అర్ధమౌతుంది. ఇలాంటి కవిత్వం పాఠకునికి సమాజంపట్ల బాధ్యతను గుర్తుచేసి, సామాజిక మార్పు కోసం అతన్ని కార్యోన్ముఖుడని చేస్తుంది.

ఈ రెండు రకాల కవిత్వాలలో ఒకటి గొప్పది మరొకటి తక్కువది అనుకోవటం పొరపాటు. దేని విలువ దానిదే. సమాజానికి రెండిటి అవసరమూ ఉంది. ఒకటి వైయక్తిక మార్పుకు దోహదపడితే మరొకటి సామాజిక మార్పుకు దారితీస్తుంది.మెజారిటీ కవులు, నలుపు తెలుపుల్లా ఈ రెండువిభాగాల మధ్య రాసులుపోసినట్లు విస్తరించి ఉండటం సాధారణంగా గమనిస్తాం.

రెండు పంథాల మంచి చెడ్డలు ఆకళింపు చేసుకొని కవిత్వం వెలువరించే బహుకొద్ది మంది కవులలో బాల సుధాకర్ మౌళి ఒకరు.

“ఆకు కదలని చోట” సుధాకర్ మౌళి రెండవ కవిత్వసంపుటి. చిక్కని కవిత్వం, గొప్ప ఊహాశాలితతో కూడిన భావ సంచయము, జీవించిన ప్రతీ క్షణాన్ని కవిత్వీకరించాలి అనే తపనా, సమాజం పట్ల బాధ్యత, ఆశావహ దృక్ఫధం వంటివి స్థూలంగా మౌళి కవిత్వ లక్షణాలు.

వచనం ఆలోచనాత్మకం, కవిత్వంలో ఉద్వేగం ఉంటుంది. ఈ ఉద్వేగం హృదయాన్ని కదిలించగలుగుతుంది. చదువరిని భావావేశానికి గురిచేస్తుంది. మంచి ఉద్వేగాలు పండించగలిగిన కవి ఫస్ట్ క్లాస్ కవిగా నిలుస్తాడు. మౌళి కవిత్వంలో ఈ మౌలిక లక్షణం పరిపక్వ స్థితిలో కనిపిస్తుంది.

“కవులేం చేసారు – మొండి చేతులతో గోడలపై నినాదాలు వ్రాసారు” అంటారు శివారెడ్డి. ఈ వాక్యంలో – కలంపట్టుకొన్న చేతులు మొండివెందుకయ్యాయి? కవి చేతులను రాజ్యం నరికేసిందా? అయినప్పటికీ కవి తన మార్గాన్ని వీడలేదా? గోడలపై ఆ నినాదాలు ఏం చెపుతున్నాయి? వంటి అనేక ప్రశ్నలు ఉదయించి చదువరిని ఉద్వేగభరితం చేస్తాయి. రాజ్యం చూపే అన్యాయాల పట్ల కోపం కలుగుతుంది. అదీ కవిత్వ గొప్పతనం.

కవిత్వ మాధ్యమం శక్తి తెలిసిన వాడు మౌళి. అనేక కవితలలో ఉద్వేగాలు చాలా బలంగా పలికాయి.
****
“ఆకు కదలని చోట” సంపుటిలో ప్రధానంగా ఆకర్షించే అంశం మౌళి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కవిత్వంలోకి లీనం చేసిన విధానం. ఈ సంపుటిలోని మొత్తం 63 కవితలలో 5 అనువాదకవితలు తీసేయగా మిగిలిన 57 కవితలలో 27 కవితలు ఏదో సందర్భాన్నో, వ్యక్తులనో తలచుకొంటూ వ్రాసినవి కావటం గమనార్హం. వీటిలో శివారెడ్డి, గంటేడి, అరుణ్ సాగర్, అక్బర్ వంటి వారిపై ఆరాధనతో వ్రాసుకొన్నవి కొన్ని, వృత్తిరీత్యా ఉపాద్యాయుడు కావటం వల్ల, విజయ, జీవన్, కుమారి వంటి ప్రతిభకలిగిన విద్యార్ధులపై, ఇంకా డ్రాయింగ్ టీఛర్ దుర్గ, వీరశంకర్ వంటి సహాద్యాయులపై వ్రాసినవి మరికొన్ని, ఇవికాక బాక్సైట్ తవ్వకాలు, ముస్లిమ్ రచయితపై దాడి, కల్బుర్గి, సొనిసోరి, అయిలాన్ పిలగాడు, వేట నిషేదం వంటి వివిధ సందర్భాలకు రాసినవి ఉన్నాయి.

సాధారణంగా కవులు తమ కవిత్వాన్ని స్వీయానుభవంగా ప్రకటిస్తారు. కొన్ని వాక్యాలకు ఎవరెవరు కారణమయ్యారో వారిని ఏ ప్రస్తావన లేకుండా అనామకంగా ఉంచటం జరుగుతుంది. ఇది తప్పేమీ కాదు. తన కవితకు ప్రేరణ ఇచ్చినవారి గురించి చెప్పాల్సిన బాధ్యత కవికి లేదు. చాలా కాలం క్రితం వజీర్ రెహ్మాన్ “సత్తు చిత్తు” అనే కవిత్వసంపుటిలో తద్భిన్నంగా వ్యవహరించాడు. పుస్తకం చివరలో ఒక్కో కవితకు ఇచ్చిన ఫుట్ నోట్సులో ఆ కవితకు ప్రేరణ అయిన వ్యక్తుల్ని, చదివిన వాక్యాల్ని చక్కగా విపులంగా ప్రస్తావించుకొన్నాడు. ఈ వివరణలు ఆయా కవితల్ని మరింత అర్ధం చేసుకోవాటానికి దోహదపడతాయి.

నిజానికి అలా ఒక కవిత వ్రాయటానికి కలిగిన ప్రేరణలను ప్రస్తావించిన కవితలలోనే కవి వ్యక్తిత్వం బయట పడుతుంది. పైన చెప్పిన 27 కవితలలో మౌళి ఎలాంటి మానవునిగా తననుతాను కవిత్వంలో ఆవిష్కరించుకోవాలనుకొంటున్నాడో తెలుస్తుంది. మానవ జీవితాన్ని మౌళి ఏ కోణంలోంచి చూస్తున్నాడు, ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడు, ఏఏ విలువలకు కట్టుబడి ఉన్నాడు, తాను పీల్చుకొన్న సారాన్ని ఎలా కవిత్వీకరిస్తున్నాడు లాంటి వివిధ అంశాలు పై కవితలలో దొరుకుతాయి. మౌళి కవిత్వంలో ఏది సామాజికము, ఏది వైయక్తికము అని విడదీయలేం. తన చుట్టూ ఉన్న సమాజాన్ని కవి తన కవిత్వంలో ప్రతిబింబించటమే సామాజికత
 ****

సామాజిక చైతన్యంతో వ్రాసే కవిత్వం సాధారణంగా వస్తుప్రధానంగా సాగుతుంది. శిల్పాన్ని కూడా అంతే సాంద్రతతో నింపే వారిలో శివసాగర్ సమున్నత స్థానంలో ఉంటారు. “సాహిత్యానికి సాహిత్య లక్షణాన్ని ఇచ్చేది శిల్పమే తప్ప వస్తువు కాదు” అన్న బాలగోపాల్ మాటలను మౌళి బహుసా హృదయగతం చేసుకొన్నాడేమో - అందుకనే ఇతని కవిత్వంలో పదచిత్రాలు, ప్రతీకలు, ధ్వని, శైలి, అభివ్యక్తి, సౌందర్యాత్మకత వంటివి "వస్తువును" కవిత్వమయం చేస్తాయి. ఈ విషయం ఈ సంపుటిలోని అనేక కవితలలో స్పష్టంగా తెలుస్తుంది. బతికుండటం, ఆట, పలమనేరు కవిత:మట్టి, నిర్భందపు గోడల్ని, ఆకుకదలని చోట లాంటి కవితలు ఒక్క సుధాకర్ మౌళి మాత్రమే రాయగలిగే కవితలు అన్నంత గొప్పగా ఉంటాయి. ఏం నేత్రాలవి, రాత్రి అనే కవితలు ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా తోస్తాయి. చేపలు ప్రత్యుత్పత్తి చేసుకొనే కాలంలో “వేటనిషేదం” చర్య శాస్త్రీయంగా సరైనదే. దాన్ని “సముద్రం వుండదు/పడవ వుండదు/ఎవరో కన్నీళ్ళనోడుస్తూ/ గుమ్మంలోంచి కదలిపోతుంటారు” అంటూ కవిత్వీకరించటం టెక్నికల్ గా కరక్ట్ కాదు.
 ****

“ఇప్పటివరకు మేధావులందరు ఈ ప్రపంచాన్ని నిర్వచించారు. ఇప్పుడు మన బాధ్యత ఈ ప్రపంచాన్ని మార్చటం” అంటాడు మార్క్స్. ఏనాటికీ కాలదోషం పట్టని వాక్యమది. ప్రతీ తరంలోను యధాతథ స్థితిని బద్దలుకొట్టాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మార్గాలు అన్వేషింపబడుతూనే ఉంటాయి. అదొక ప్రవాహ సదృశ వెతుకులాట.

మౌళిలో కూడా ఇలాంటి అన్వేషణ కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతోందన్న అంతఃశోధన తెలుస్తుంటుంది. జవాబులు వెతుక్కుంటాడు, నిరసిస్తాడు, తిరగబడతాడు, ప్రేమిస్తాడు, సమాధాన పడతాడు. ఇన్నిరకాలుగా తనలోకి ఇంకిన సమాజాన్ని ఫిల్టర్ చేసి రిఫైన్డ్ రూపంలో కవిత్వీకరిస్తాడు. అది మనల్ని ఆలోచింపచేస్తుంది, ఉద్వేగ పరుస్తుంది, వెంటాడుతుంది చాలాకాలం. గొప్పకవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు అవే కదా!

బాల సుధాకర్ మౌళి ఫోన్: 9676493680

------ బొల్లోజు బాబా

1 comment:

  1. I really like your site - In addition to this I herewith posting a very useful site regarding the educational information.

    Click Here To Teacher Guide.in.

    ReplyDelete