మూడు అనుభవాలు
ఒక చెవిటివానికి
కోయిల పాట ఎలాఉంటుందో వినాలనిపించింది.
ఓ కవిమిత్రుణ్ణి అడిగాడు
గులాబిపూవులా ఉంటుందన్నాడు.
ఒక అందమైన గులాబీని చెవి వద్ద ఉంచుకొన్నాడు
మెత్తని పరిమళ స్వరం
గులాబి ముళ్ళు చెవితమ్మెల్ని గాయపరిచాయి
చేతికి రక్తం వెచ్చగా తగిలింది
అనామక కాకి రక్తం
*****
ఒక అంధునికి
ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనిపించింది
సాగరంలా ఉంటుందన్నాడో మిత్రుడు
వెంటనే సముద్రంలో దూకేసాడతను
గవ్వలు, రాళ్ళు గుచ్చుకొని గాయాలయ్యాయి
లోతుల్లోకి కూరుకుపోతూంటే
ఒక సముద్రగుర్రం తన వీపుపై ఎక్కించుకొని
ఒడ్డున దీబెట్టింది
ప్రేమంటే అర్ధమైందతనికి
*****
ఒక మూగవానికి
దేవుడు కనిపిస్తే ఏం మాట్లాడాలన్న సందేహం వచ్చింది
చిమ్మెట శబ్దాలలో నీకు సమాధానం లభిస్తుందన్నారెవరో
చిమ్మెటలు కిక్కిరిసిన తోటలో
ఎన్నోరాత్రులు ఓపికతో ఒంటరిగా ఎదురుచూసాడతను
ఓ వేకువ జామున
అతను దేవునితో సంభాషించాడు.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment