చాన్నాళ్ల క్రితం పాబ్లో నెరుడా రచించిన Only Death అనే కవిత నచ్చి నేను అనువదించాను. ఆ టపా ను
ఇక్కడ చూడవచ్చు. తరువాత ఇదే కవితను శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారు కూడా ఆ కవితను అనువదించారు. అది
ఈమాట వెబ్ పత్రికలో ప్రచురితమైంది.
ఈమధ్య శ్రీ విరియాల లక్ష్మీపతి గారి సంపాదకత్వంలో వచ్చిన పాబ్లో నెరుడా కవిత్వానువాదాల సంకలనం (భువన ఘోష) లో ఇదే కవితకు శ్రీశ్రీ చేసిన అనువాదం లభించింది. 1972 లోనే శ్రీశ్రీ ఈ కవితను అనుభవించి, పలవరించి అనువదించాడని అర్ధమైంది. మహాకవి శ్రీశ్రీ అనువాద పటిమకు మరోసారి అచ్చెరువొందాను.
ఈ మూడు అనువాదాలు ఒక చోటకు తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ఇలా........
ఈమాట వారికి, భైరవభట్లగారికి, "భువనఘోష" పుస్తక కాపీరైటు దారులైన శ్రీ వై. విజయకుమార్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
మరే ముంది మరణం తప్ప!
అనువాదం: శ్రీశ్రీ
ఉన్నాయ్ కొన్ని ఒంటరి శ్మశానాలు
చప్పుడు చెయ్యని ఎముకలతో నిండిన సమాధులు
సొరంగంలోంచి పోతున్న హృదయం
ఆకట్లో చీకట్లో చీకట్లో
నౌకా భంగంలా మరణిస్తాం మనలోనికి పోతూ
మన గుండెల్లోపల మనం మునిపోతున్న మాదిరిగా
చర్మంలోంచి ఆత్మలోకి రాలినట్లు జీవించిన మాదిరిగా
మరిన్నీ ఉన్నాయ్ కొన్ని శవాలు
చల్లని జిగురుమట్టితో చేసిన పాదాలు
ఎముకల్లో ఉంది మృత్యువు
కుక్కల్లేనిచోట కుక్కరుపులాగ
ఎక్కడో గంటల్లోంచి, ఎక్కడో గోరీల్లోంచి బైటికి వస్తూ
తడిగాలిలో కన్నీళ్లలాగ వానలాగ పెరుగుతూ
అప్పుడప్పుడూ నెనొక్కణ్ని చూస్తాను
తెరచాపలెత్తిన శవపేటికల్ని
పాలిపోయిన మృతులతో చచ్చిన వెంట్రుకలున్న స్త్రీలతో బయల్దేరి
దేవదూతల్లాంటి తెల్లని రొట్టెల వాళ్లతో
చెట్టుకింద ప్లీడర్లని పెళ్లి చేసుకుని
ఆలోచనల్లో పడ్డ అమ్మాయిలతో
నిలువుగా ప్రవహించే మరణపు నదిలో తేలిపోయే పేటికలు
ముదురుటెరుపు రంగునది
మరణం చేసే చప్పుడుతో నిండిన తెరచాపలతో ఎదురీదుతూ
మరణం చప్పుడుతో నిండి, అనగా నిశ్శబ్దంతో
ఆ సమస్త ధ్వనుల మధ్యా మరణం ప్రవేశిస్తుంది.
కాలులేని చెప్పుల్లాగ, మనిషిలేని దుస్తుల్లాగ
వచ్చి తలుపుతడుతుంది, రవ్వలేని ఉంగరంతో వేలు లేని ఉంగరంతో
వచ్చి అరుస్తుంది నోరులేని, నాలుకలేని గొంతుకలేని అరుపులు
అయినా దాని అడుగు సవ్వడులను వినవచ్చు.
దాని దుస్తులు నింపాదిగా ధ్వనిస్తాయి, వృక్షంలాగ
సరిగ్గా చెప్పలేనుగాని, కొద్దిగానే అర్ధమవుతుంది గాని,
అసలే కనిపించదు గాని
దాని సంగీతం తడిసిన నీలిపూల రంగని నాకు తోస్తోంది.
ఈ నీలి పూలకి స్వగృహం లాంటిది నేల
ఎంచేతంటే మృత్యువు ముఖం ఆకుపచ్చరంగు కనుక
మృత్యువు చూసే చూపు ఆకుపచ్చరంగు కనుక
నీలిపూల మొక్కల ఆకుల దూసుకుపోయే శీతలత్వంతో
కసినిండిన శిశిరకాలపు పొగచూరిన రంగుతో
అయితే మృత్యువు ప్రపంచంలో నడుస్తుంది కూడా
చీపురుకట్టలాగ ముస్తాబయి
నేలను నాకుతూ, మృతదేహాల కోసం వెతుక్కుంటూ
చీపురుకట్టలో ఉంది మృత్యువు
చీపురుకట్ట శవాన్ని వెదుక్కునే మృత్యువు సూది
మరణం మడత మంచాల్లో ఉంది
అది సోమరి చింకి చాపలమీద నల్లని శాలువల్లో
నిద్రపోతూ జీవితం గడుపుతుంది.
హఠాత్తుగా ఊపిరి ఒదుల్తుంది
దుప్పట్లను ఉప్పొంగించే విషాదపు చప్పుడు చేస్తుంది.
అప్పుడు శయ్యలన్నీ ఒక రేవువైపు పయనం కడతాయి
అక్కడ మృత్యువు వేచుకుని ఉంటుంది
నౌకాధికారిలాగ దుస్తులు ధరించి
(ప్రచురణ: ఆంధ్రజ్యోతి వారపత్రిక 1-12-1975 - వారి సౌజన్యంతో)
ఒక్కతే.... మృత్యువు
అనువాదం : శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు
అక్కడ ఒంటరి శ్మశానాలు,
ఎముకల నిశ్శబ్దం నిండిన సమాధులు,
ఒక సొరంగం గుండా పోతూ హృదయం
చీకటి, చీకటి, కటిక చీకటి
ఓటారిన ఓడలా, మెల్లగా లోలోపలకి
మనసులోకి మునిగిపోతూన్నట్టు,
ఈ మరణం
చర్మం అంచు పైనుంచి ఆత్మలోకి - ఒక అనంత పతనం.
అక్కడ శవాలున్నాయి
చల్లగా జిగురు జిగురుగా రాతిపలకల అడుగులున్నాయి
ఆ ఎముకల్లో మృత్యువుంది
అచ్చమైన రవంలా
కుక్క లేని మొరుగులా
ఏవో సమాధుల్లోంచి, ఎక్కడో గంటల్లోంచి వస్తూ
చిత్తడిలో పొంగుకొచ్చే ఆక్రందనలా
జడివానలా
అప్పుడప్పుడూ, ఒక్కడినే, నేను చూస్తూంటాను
శవపేటికలు లంగరెత్తి
చాపకట్టి పాలిపోయిన కళేబరాలు, ఆడవాళ్ళ నిర్జీవ కచభారాలు,
గంధర్వ గాయకుల మూగబోయిన గాత్రాలు,
గుమాస్తాల పడుచు భార్యల ముడుచుకున్న మొహాలు,
మోసుకుంటూ
నిర్జీవుల నిలువెత్తు నదిని అధిరోహిస్తూ
శవపేటికలు,
క్షతజ కాంతులీనే ఆ నదిలో
పైపైకి, మృత్యు రవానికి ఉబ్బిపోయిన
మృత్యు నిశ్శబ్ద రవానికి ఉబ్బిపోయిన
తెరచాపలతో.
మౌనంలో రవళిస్తూ మృత్యువు వస్తుంది
రాయీ వేలూ లేని ఉంగరంతో
తలుపు తడుతుంది.
ఆమె పిలిచే పిలుపుకి
నోరుండదు, నాలిక ఉండదు, గొంతూ ఉండదు.
అయినా ఆ అడుగుల సడి,
ఆమె దుస్తుల రెపరెపలు, ఒక చెట్టు ఊగినంత మెల్లగా
నీకు వినిపించే తీరుతాయి.
నాకంతగా తెలీదు, అర్థం కాదు, చూడనూ లేను
అయినా, నాకు నమ్మకం. మృత్యుగీతానిది తడి ఊదాపూల రంగు
మట్టితో జతకలిసిన ఊదాపూలది.
మృత్యుముఖం ముదురాకుపచ్చ కాబట్టి,
మృత్యువుది ముదురాకుపచ్చని చూపు కాబట్టి
ఊదా పూరేకుల పదునైన చెమ్మతో
చిక్కబడ్డ శీతకాలపు బూడిద రంగు
అంతేనా, చావు చీపురు పుచ్చుకొని భూమంతా తిరుగుతుంది.
శవాల కోసం నేలంతా నాకుతూ
ఆ చీపురే మృత్యువు
మృతదేహాలకై సాచిన నాలిక,
సూత్రం కోసం వెదికే మృత్యు సూచి.
మడత మంచాల్లో
స్తబ్ధమైన పరుపులు, నల్లని కంబళ్ళలో
అంతటా మృత్యువే
విస్తరించుకొని ఉండి, హఠాత్తుగా ఒక్కసారి ఊపిరి వదుల్తుంది
గట్టిగా ఊదుతుంది, దుప్పట్లన్నీ తెరచాపలై ఉబ్బిపోయే ఒక కటిక రవం…
అప్పుడు రేవులోకి తేలుకుంటూ వచ్చే శయ్యలు
అదిగో అక్కడే ఎదురుచూస్తూ, అడ్మిరల్ వేషంలో.
మృత్యువు మాత్రమే
అనువాదం: బొల్లోజు బాబా
మూగ ఎముకలు నిండిన గోరీలతో
ఏకాకి స్మశానాలవిగో.
సొరంగం గుండా హృదయ యానం
నీడలు.... నీడలు.... నీడలు.
మనలోకే కూలిపోయే ఓడలా
మనం చనిపోతూంటాం.
హృదయంలోకే మునిగిపోయినట్లుగా
చర్మంనుండి ఆత్మదాకా
అనంతంగా జారిపోయినట్లుగా
మనం చనిపోతూంటాం.
గవ్వలు పేరుకొన్న శిలలపాదాలవిగో
అక్కడంతా మృతదేహాలు.
స్వచ్చమైన శబ్ధంలా ఎముకలలో మృత్యువుంది.
ఏ కుక్కా లేకుండా వినిపించే మొరుగులా
గంటలనుంచో, గోరీలనుంచో జనిస్తో, తేమలో ఉబ్బుతో
ఒక ఏడ్పులానో లేక వానలానో మృత్యువు శబ్దిస్తోంది.
ఒంటరిగా ఒక్కోసారి నేను చూస్తుంటాను
తెరచాప నీడలో శవపేటికల్ని.
మృతుల, మృత జడల జవ్వనుల
తెల్లని దేవదూతల్లాంటి వంటవాళ్ల,
గుమస్తాలను పెండ్లాడిన శోక యవ్వనిల
లంగరు బరువును మోస్తోన్న
శవపేటికలను చూస్తూంటాను.
నిలువెత్తు మృత్యునదిలో
ఎర్రగా ఒరిసిపోయిన ఆ నదిలో
ప్రవాహానికి ఎదురొడ్డుతూ
మృత్యు సంగీతపు అలలతో శ్రుతి కలుపుతూ
మృత్యు మౌన కెరటాల సవ్వడితో జతకలుపుతూ
శవపేటికలు ఎగప్రాకటం
ఒక్కోసారి నేను గమనిస్తూంటాను.
మృత్యువు కనిపించదు, దాని శబ్ధమే నడిపిస్తూంటుంది.
పాదం కనిపించని బూటులా, దేహం అగుపించని సూటులా.
రాతితో కానీ, చేతితో కానీ చేయబడని
గణగణ మనే ఘంటారావం లా మృత్యువు వినిపిస్తుంది.
మృత్యువుకు నోరు లేదు, నాలుక లేదు, గొంతుకా లేదూ,
కానీ, మృత్యు పిలుపు వినిపిస్తూంటుంది.
సందేహం లేదు, నీవు మృత్యు పదఘట్టనలని
దాని దుస్తుల రెపరెపల్నీ, ఒక వృక్షంలా మౌనంగా వినగలవు.
మృత్యువు మాయా తివాచీపై కూర్చొని
నేలను నాకుతూ, మృతులకై వెతుకుతూ
భూమిని చుడుతూ ఉంటుంది.
మాయా తివాచీయే మృత్యువు.
దాని మృత్యు నాలిక మృతులను వెతుకుతూంటుంది.
తివాచీ నేసుకోవటానికి దారాలను వెతుక్కొంటూంది.
నాకు తెలియదు
నాకు కొంచెమే అర్ధమయింది
దృశ్యం అస్పష్టంగానే ఉంది, కానీ
మృత్యు గీతం అనేది తడిచిన నల్లకలువల వర్ణమని
నేను నమ్ముతున్నాను.
అవును
మట్టికి అలవాటు పడిన నల్లకలువ వర్ణమే!
ఎందుకంటే
మృత్యువు యొక్క ముఖం ఆకుపచ్చన.
ఎందుకంటే
నల్లకలువ దళపు పదునైన తడితోనూ
దాని గంభీరవర్ణపు శీతాకాల అసహనంతోనూ సారించే మృత్యువు యొక్క తీక్షణ చూపులు ఆకుపచ్చనే మరి.
మంచాలపై మృత్యువుంది
మెత్తని పరుపులపై, నల్లని దుప్పట్లలోనూ ఉంది.
దుస్తుల మడతలలో మృత్యువు విస్తరించి
అకస్మాత్తుగా పేలుతుంది.
దుప్పట్ల మధ్య నల్లటి శబ్ధం వ్యాపిస్తుంది.
మంచాలు ఓడరేవుకై ప్రయాణం సాగిస్తూంటాయి.
అక్కడ
యుద్దఓడల అధిపతి దుస్తులు ధరించిన
మృత్యువు ఎదురుచూస్తుంటుంది.
********
భవదీయుడు
బొల్లోజు బాబా