Friday, December 18, 2009

నీ దేహ అట్లాసు...... పాబ్లో నెరుడా

నీ దేహ అట్లాసును చిత్రిస్తున్నాను, నిప్పు రేఖలతో.
దప్పిగొన్న పిరికి సాలీడులాంటి నాపెదవులతో
నీలోకి, నీలోలోకి దూరిపోతున్నాను.

ఓ ముద్దుగుమ్మా!
ఈ సాయింత్రపు తీరంపై నిను సంతోషపెట్టటానికి
ఎన్ని కధలున్నాయో! ఒక కొంగ, ఒక చెట్టు, సుదూర ఆనందాలు,
మాగిన ఫలాలతో నిండిన ఈ ద్రాక్షఋతువు, ఇంకా మరెన్నో.

ఈ రేవులో సంచరిస్తూ, నిను ప్రేమిస్తూ నేను.
నా ఒంటరితనం
కలలతో మౌనంతో పెనవేసుకొంది.
సంద్రానికి దుఖా:నికి మధ్య చిక్కుకుపోయింది.
ఆ ఇద్దరు నిశ్చల నావికుల మధ్య నిశ్శబ్ధ మత్తులో జోగుతున్నది.

పెదాలకు స్వరానికి మధ్యనేదో అదృశ్యమౌతున్నది.
పక్షిరెక్కలతో ఉన్నదేదో! వేదనో లేక మైమరుపు లాంటిదేదో!
నా ముద్దుగుమ్మా
నీటిని వల చిక్కించుకోలేకపోయినా
ఏవో కొన్ని బిందువులు వేలాడినట్లుగా
జారిపడ్డ ఈ పదాలలోంచి ఏదో గీతం వినిపిస్తుంది.
ఏదో గీతం నా ఆకలిగొన్న పెదవులపైకి ఎగబాకుతున్నది.

పాడనా, దహించుకుపోనా, పర్వులిడనా పిచ్చివాని చేతి మువ్వలకర్రలా.
నా విషాద మృధుత్వమా
అకస్మాత్తుగా నిను ముంచెత్తేది ఏమిటనుకొంటున్నావు?
నేను సుందర శైత్యశిఖరాన్ని చేరినప్పుడు
నా హృదయం రాత్రి పూవు వలె ముడుచుకొంటుంది.

I Have Gone Marking

I have gone marking the atlas of your body
with crosses of fire.
My mouth went across: a spider trying to hide.
In you, behind you, timid, driven by thirst.

Stories to tell you on the shore of the evening,
sad and gentle doll, so that you should not be sad.
A swan, a tree, something far away and happy.
The season of grapes, the ripe and fruitful season.

I who lived in a harbour from which I loved you.
The solitude crossed with dream and with silence.
Penned up between the sea and sadness.
Soundless, delirious, between two motionless gondoliers.

Between the lips and the voice something goes dying.
Something with the wings of a bird, something
of anguish and oblivion.

The way nets cannot hold water.
My toy doll, only a few drops are left trembling.
Even so, something sings in these fugitive words.
Something sings, something climbs to my ravenous mouth.
Oh to be able to celebrate you with all the words of joy.

Sing, burn, flee, like a belfry at the hands of a madman.
My sad tenderness, what comes over you all at once?
When I have reached the most awesome and the coldest summit
my heart closes like a nocturnal flower.

బొల్లోజు బాబా

11 comments:

 1. అక్కడి 'మౌత్' ఇక్కడ 'పెదవులు' అయ్యాయి.
  అక్కడి 'ఇన్ యు, బిహైండ్ యు' ఇక్కడ 'నీలోకి, నీలోలోకి' అయ్యింది.
  అక్కడి 'స్వాన్' ఇక్కడ 'కొంగ' అయ్యింది.
  ===
  బాబా గారు - నిశ్శబ్ధము కాదు, నిశ్శబ్దము. దుఖ:ము కాదు, దు:ఖము
  శైత్యము అంటే శీతలము అనా?
  ===
  ఇది తాత్పర్యంలానే ఉంది కానీ, కవిత్వంలా మాత్రం లేదు.

  ReplyDelete
 2. కొండముది గారు,

  " ఇది తాతర్యం లానే వుంది కానీ కవిత్వం లా మాత్రం లేదు"

  నేను మీ అభిప్రాయంతో వొప్పుకోలేను. మీరు అంటొంది అనువాదం గురించా? అసలు నెరుడా కవిత్వం గురించా?

  నీ దేహ అట్లాసు ని చిత్రిస్తున్నాను నిప్పురేఖలతో...

  ఆ మొదటి పాదం లోనే ఎంత కవిత్వం వుంది!

  ReplyDelete
 3. అనుభవించకుండా అనువాదం ఎలా చేస్తాం? ఒకసారి అనుభవించాక...అర్థం "మనదౌతుందిగానీ" కేవలం మూలకవిదిగా మిగిలిపోతుందా!

  ReplyDelete
 4. బాబా గారు,
  మీ అనువాదం నన్ను చాలా నిరాశ పరిచింది. నెరుడా గారి కవితలో ఉన్నsensousness ఎక్కడా కనిపించలేదు. ముక్కస్య ముక్క అనువాదం కావాలనినేనట్లేదు. కనీసం ఆ భావంలేకపోతే ఎలా.

  I have gone marking the atlas of your body
  with crosses of fire.
  స్కూల్లో పిల్లలు అట్లాస్ మీద స్థలాల్ని గుర్తించి టిక్ మార్కులు పెడతారు చూడండి. అలా ఈ కవి కాంక్షతో జ్వలించే పెదవులతో ప్రియురాలి దేహపు అట్లాస్ మీద maark చేస్తున్నాడు. కవికి మీకు ఎంత తేడా ఉంది? మరి మార్కింగ్‌కు సరైన పదమేంటి? అది తోచేవరకు ఈ అనువాదం రాకపోయినా నష్టం లేదని గ్రహించండి.

  My mouth went across: a spider trying to hide.
  In you, behind you, timid, driven by thirst.
  మీ అనువాదం.
  దప్పిగొన్న పిరికి సాలీడులాంటి నాపెదవులతో
  నీలోకి, నీలోలోకి దూరిపోతున్నాను

  సాలీడు దప్పికగొనడమేమిటి? పిరికిదవడమేమిటి? కవి కాంక్షతో దేహమంతటా ఎడాపెడా ముద్దిడుతున్నాడు అన్నది భావన. my mouth went across : aspider trying tohide ఈ లైన్స్ తరవాత ఫుల్‌స్టాప్ ఉంది చూడండి. ఈ driven by thirst అన్నది కవికి వాడుకున్నాడు సాలీడుకు, పెదవులకు కాదు.

  అలాగే సమాసాలు కూడా. నిప్పురేఖలంటూ వీరతాళ్ళు సృష్టించేకంటే మనకు అలాంటి ఎక్స్‌ప్రెషన్‌కి ఉన్న అగ్నికీలలు అనే పదం బాగుంటింది.

  ఇది కేవలం మొదటి పేరా. మిగ్లినవి మరోసారి సరిచూసుకొని తిరిగి ప్రచురించండి.

  నెరుడా...ఎల్ కపితాన్స్ వర్సెస్ చదివారా.. అవి కూడా చాలా బాగుంటాయి.

  ReplyDelete
 5. స్పందించిన అందరకూ ధన్యవాదములు
  సుజ్జిగారికి, కల్పన గారికి, మహేష్ గారికి ధన్యవాదములు.

  కిరణ్ గారికి
  మొదటి పారాగ్రాఫులో ఆయా పదాలు ఇలాగ అయ్యాయి అన్నారు. అది అంగీకారమా? అనంగీకారమా తెలియలేదు.
  మీరు చెప్పిన స్పెల్లింగ్ మిస్టేకులు నా తప్పిదాలే. టైపాట్లుగా భావించగలరు.
  శైత్యము అంటే ఏమిటో ఓ సారి గూగిల్లండి తెలుస్తుంది. అది నా పైత్యము కాదు.
  ఇక మీ చివరి వాక్యం
  ఇది తాత్పర్యంలానే ఉంది కానీ, కవిత్వంలా మాత్రం లేదు. ఇక్కడ పాబ్లోకి నేను తాత్పర్యం చెప్పగలిగానని మీరంటే అది నిజంగా గౌరవంగా భావిస్తాను నేను. ఎందుకంటే ఆయన కవితలకు తర్జుమా కాదుకదా కనీసం తాత్పర్యం చెప్పటం కూడా గొప్పవిషయమే నని నా అభిప్రాయం.

  భవదీయుడు
  బొల్లోజు బాబా

  ReplyDelete
 6. --cont

  బుడుగు గారికి
  మీ పరిశీలనలు బాగున్నాయి. మీబోటి వారు చెపితేనే కదా కొన్ని విషయాలు తెలిసేవి. అలాగని మీరు చెప్పిన విషయాలని నేను ఏకీభవించాలని ఏమీ లేదు కదా. చెపుతూనే ఉండండి. ఎందుకంటే పాబ్లో కవితానువాదాలు పైపులైనులో చాలానే ఉన్నాయి. :-) ఇప్పటికే ఇరవై ప్రేమకవితలు ఒక విషాదగీతం పేరిట twenty love poems and a song of despair యొక్క అనువాదాలు అన్నీ పూర్తయి చాన్నాళ్లే అయ్యింది. కొన్ని మినహా చాలామట్టుకు వివిధ వెబ్ పత్రికలలో బ్లాగులో పోస్ట్ చేయబడ్డాయి. మీరు చెప్పిన the captain verses ఇదివరకే చూసాను. మంచి కవిత్వం.

  ఇక ఈ కవిత గురించి
  ఇది నా ప్రయత్నం. నాకోణము. నా శక్తీ. అంతే అంతకు మించేమీ లేదు.

  దీనిలో లోపాలు లేవని కానీ, భూషణ్ గారు ఎక్కడో వెక్కిరించినట్లు “మాతృక బహు గహనము కనుక అనువాదము దుర్లభము, దుష్కరము” అనికానీ నేను వాదించను.
  ఇదివరలో ఈ మాటలో జరిగిన చర్చలో(http://eemaata.com/forums/topic/8.html) అనువాదాల గురించి నాకున్న కొన్ని స్పష్టమైన అభిప్రాయాలను వెలిబుచ్చాను. వాటిలోని కొన్ని పాయింట్లను ఇక్కడ కాపీ పేస్టు చేస్తున్నాను. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే జతకలపండి.
  1. ఏదైనా ఒక కవితను చదివినప్పుడు దాని హేంగోవర్ హృదయాన్ని అలా మెలితిప్పుతూనే ఉంటుంది. ఆ భారాన్ని దింపుకోవటానికో, లేక ఆ అనిర్వచనీయమైన అనుభూతిని పదిమందికీ పంచటానికో కవి ఆ కవితను అనువదించి అందించాలని ఉద్యుక్తుడవుతాడు. లోతైన కవితలు భిన్న పొరలలో భిన్న అర్ధాలను ఇవ్వటం సహజమే. ఇది పాబ్లో విషయంలో ఎక్కువ సహజం.
  2. అనువాదం అనువాదమే అదెన్నటికీ మాతృక కాలేదు. ఆ విషయం ప్రతి అనువాదకునికీ తెలుసు.
  3. గ్రీకు విషాదాంత నాటకాలను గ్రీకు లోనే చదవటం మంచిది. కానీ గ్రీకు తెలియని మనవారికి తెలుగులో అనువాదం అవసరమే కదా. అనువాద కృతిలో రంద్రాన్వేషణ అతి సులువైన పని. కొంతమేరకు ఓర్మి, క్షమ లేకపోతే అనువాద కృతినే కాదు మూలకృతినీ చదువరి ఆస్వాదించటం అసాధ్యం. --- డా. వి.వి.బి. రామారావు.
  4. కొన్ని సందర్భాలలో అనువదించేపుడు మూలంలోని కొన్ని పదాలను/లేదా భావాలను వర్జించవలసివస్తుంది. వివరణార్ధంకొన్నిపదాలను చేర్చవలసీ ఉంటుంది.
  5. అనువాద రచనలకుండవలసినవి విశ్వసనీయత, విధేయత, స్వేచ్ఛ, అంతిమతలు.
  అనువాదకునికి విధేయతలేనిదే ఈ ప్రక్రియకే దిగడు. ఎందుకంటే అనువాదసేవలో కీర్తికాముకతలకు ఆస్కారం ఉండదు. ఏ నన్నయలాంటివారికో మినహా.
  స్వేచ్ఛ అనేది అనువాదకుని ప్రజ్ఞతో, ఆతనికి తనపాఠకులపై ఉండిన అభిప్రాయంతో తనకు తాను విధించుకొనే ఒక చట్రం. ఇది వ్యక్తిగతమే తప్ప దీనికి హార్డ్ ఫాస్ట్ రూల్సేమీ అగుపించవు. అనువాదకుడు తీసుకొన్న ఈ స్వేచ్ఛ ను ఆధారంగా చేసుకొనే, అనువాదరచనలని స్వేచ్ఛానువాదమనీ, అనుసృజన అనీ, అనుసరణ అనీ రకరకాల వర్గాలుగా పరిగణించటం జరుగుతుంది.
  ఇక అంతిమత గురించి. ఏ అనువాదమూ అంతిమము కాదు. ఇదే కవితను ఒకప్పుడు నేను చేసాను. ఇప్పుడు భైరవభట్లగారు చేసారు. నా దృష్టిలో ఇది మెరుగ్గా ఉంది. రేపు మరొకరెవరో చేస్తారు. ఈ రెంటికంటా అది బాగుండవచ్చు. (ప్రస్తుత వివరణ: ఈ పారాగ్రాఫు పాబ్లో only death పొయం గురించి. btw did you see the three versions of the above poem in my previous post)

  విశ్వసనీయత - ఇక్కడే వస్తుంది చిక్కు. ఏదో మొరటు జోకుగా అన్నట్టు, అందమైన అనువాదం విశ్వసనీయమైనది కాదు, విశ్వసనీయమైన అనువాదం అందంగా ఉండదూ అని.

  ఈ విషయంలో మూలరచయితకు విశ్వసనీయతకంటే చదువరికి అర్ధమయ్యే విధంగా, వానిని గందరగోళపరచకుండా వానిపట్లే హితంగా ఉండటం వలన మూలరచయితకు ఇంకా ఎక్కువ మేలు చేసిన వారవుతారు అనువాదకులు. ఎందుకంటే ఈ అనువాదాన్ని చదివి, మూల రచనలలోకి వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది. ఇది వాంఛనీయమే కదా? బహుసా అట్టి చదువరులు అనువాదం సరిగ్గా లేదని తిట్టుకోనూ వచ్చు లేదా గొప్ప పరిచయాన్ని చేసినందుకు మెచ్చుకోనూ వచ్చు.
  మొదటిదానికి అనువాదకుడు ఎప్పుడూ” బిక్కు బిక్కు” మంటూ సిద్దంగానే ఉంటాడు. (ఎందుకంటే అతని అనుమానాలు అతనికుంటాయి కనుక)”

  పై పాయింట్లన్నీ నా ఈ అనువాదం లో ఉన్నాయా లేవా అని వెతకటం అనవసరం. ఎందుకంటే నే ముందుగా చెప్పినట్లుగా ఇది నా ప్రయత్నం. నాకోణము. నా శక్తీ. అంతే అంతకు మించేమీ లేదు.

  మిగ్లినవి మరోసారి సరిచూసుకొని తిరిగి ప్రచురించండి అన్న మీ సలహాకు

  నా జ్ఞానమో/అజ్ఞానమో అలానే ఉండనివ్వండి. :-)

  భవదీయుడు
  బొల్లోజు బాబా

  ReplyDelete
 7. చాలా బాగా రాశారు.

  ReplyDelete
 8. మీ ఈ అనువాదంలో చాలా ఎలిమెంటరీ తప్పులున్నాయని నాకు వీలైనంత పొలైట్‌గా చెప్పాను. మీరు ఇచ్చిన వివరణ కనీసం ప్రాథమికస్థాయి తప్పులు లేని కవితలపై చర్చకు పనికివస్తుందేమో. ఇక్కడైతే అనవసరం.

  ఎనీ వే, మీరు "నా శక్తి ఇంతే"ననీ, మీ "అజ్ఞానాన్ని అలాగే ఉండనీయమని" కోరుకున్నారు.
  సంతోషం. మీ అనువాదాలపై ఇకపై నా కామెంట్లుండవని హమీ ఇస్తున్నాను.

  మీకు ఒక విషయంలో మాత్రం ధన్యవాదాలు. "దప్పికగొన్న పిరికి సాలీడు" అన్న పదసంకలనం పరిచయం చేసినందుకు. మాచంటాడికి చెప్పే బూచి కథల్లో వాడుకుంటాను. hopefully you dont mind.

  సెలవు
  -బు.

  ReplyDelete
 9. నోటి కొచ్చింది రాసేయ్
  ఓటి మాటలు వల్లించేయ్
  సూటిగా అడిగితే ను
  వ్వొట్టి వెధవాయవోయ్

  గూగుల్లో గాలించితే గల
  గలా రాల్తాయి పదాలు
  అమరం ఆంధ్ర నామ సంగ్రహం
  అటక మీదనున్నా మేలు మేలు

  రాసిందే కవిత
  భుజం తడితే నాతో జత
  అసంబధ్ద మన్నావో
  అయిపోయిందే కథ

  అర్థం లేదంటూ పె
  డర్థాలు తీయకు పా
  దాలని విరిచానా లేదా
  తెలియకపోతే కంపు

  (సరదాగా రాసినది మాత్రమే, ఎవరినీ కించ పరచడానికీ,
  నొప్పించడానికీ కాదు.)

  ReplyDelete
 10. బుడుగు గారికి