Tuesday, December 9, 2008

బుల్లి కవితలు పార్ట్ I

ఆవకాయ్.కాంలో ప్రచురింపబడిన నా కవితలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ కవితలపై వచ్చిన కామెంట్లను క్రిందఇవ్వబడిన లింకులో చూడగలరు.
http://www.aavakaaya.com/articles.aspx?a=l&categoryId=1


1
దొమ్మరి పిల్ల
మృత్యు తీగపై మోళీ కట్టే బాలిక
అడుగులో అడుగేసుకొంటూ నడుస్తూంది.
ఆమె పట్టుకొన్న వెదురుగడకు
ఒకవైపు జీవిక, మరో వైపు బాల్యం
వేలాడుతున్నాయి.

చిన్న అపశ్రుతి
రోడ్డుపై రక్తపు మరక.

దేముడు
పని ఇంకెప్పటికి నేర్చుకొంటాడూ?

By బొల్లోజు బాబా, Dec 7 2008 7:౫౩


2
సాంగత్యం
బయట
ఉరుములు మెరుపులతో
కుంభవృష్టిగా వాన.
అర్ధ నిమీలిత నేత్రాలతో
ప్రశాంతంగా నిద్రిస్తున్న నీవు .
సన్నిధిలో ఎంతటి
భరోసా ఉంటుంది.

కామెంట్లు 3
By బొల్లోజు బాబా, Nov 30 2008 7:59PM


3
ఆటో లోంచి పాట
మూడు చక్రాల స్పీకరు బాక్సు
ఏదో పాటను మోసుకుంటూ
సాగిపోతోంది.

మద్దెల అడుగుల చప్పుడు
దాని రాకనూ, పోకనూ
చక్కని శబ్దచిత్రంగా లిఖించింది.

పిట్టలు ముసిరిన చెట్టు
సంజెవేళలో వెదచిమ్మే
మువ్వల శబ్దాల్ని
రోడ్డుపై చల్లుకుంటూ పోతోంది ఆటో.

హడావిడిలో పట్టించుకోంగానీ
ఆ పాటకు జ్ఞాపకమేదో రేగుతాది
కలలో మెసలటానికి.

కామెంట్లు 3
By బొల్లోజు బాబా, Nov 25 2008 4:48AM



బొల్లోజు బాబా

17 comments:

  1. బాబాగారూ! నేనో కవిత రాసానండోయ్ మీ వ్యాఖ్యపడ్లేదింకా కాస్త చూడండి
    http://parnashaala.blogspot.com/2008/12/blog-post_07.html

    ReplyDelete
  2. 1) ఆ పిల్ల జీవికను, బాల్యాన్ని దేవుడు సరిగా balance చెయ్యలేకపోయాడనా మీ అభియోగం?
    భలె భలే ఐతే నాకూడా కవితలర్ధమౌతున్నాయ్.
    2) నిజమేకదా...

    ReplyDelete
  3. నాకు చిన్నప్పటినుంచీ ఒక సందేహం ఇచ్చిన కవితను అసలు కవితో కాదో ఎలా చెబుతారు అని. I mean కవితలకి ఛందోనియమాలేమైనా ఉంటాయా అని. యతి ప్రాస నియమాలని కూడా కొంచెం వివరించగలరు.
    గమనిక: ఇది కేవలం ఆసక్తితో అడిగిన ప్రశ్న మాత్రమే. నాకైతే కవితలు రాసే ఉద్దేశ్యం లేదు కాబట్టి మీరు నిర్భయంగా జవాబు చెప్పవచ్చు.:-)

    ReplyDelete
  4. దొమ్మరిపిల్ల బతుకు మనసుకి హత్తుకునేలా చెప్పారు. సాంగత్యం చదువుతుంటే నేనొకసారి మాఅమ్మాయితో గాలివానలో మోకాలులోతు నీళ్లలో 4గంటలసేపు డ్రైవ్ చెయ్యడం గుర్తొచ్చింది. గమ్యం చేరుకున్నాక, అంతసేపూ నాబుజంమీద వాలి నిద్రపోయిన (అర్థ నిమీలిత ..కాదు లెండి. చక్కగానే) మా అమ్మాయి లేచి, నాట్ బాడ్ మామీ అంది :)

    ReplyDelete
  5. బాబా గారు దొమ్మరిపిల్ల చాలా చాలా బాగుంది. మీ స్థాయిని మరో సారి ప్రకటించింది. అభినందనలు.

    ReplyDelete
  6. మహేష్ గారూ థాంక్సండీ

    మినర్వా గారు
    మీరు నా బ్లాగు సందర్శించటం సంతోషంగా ఉంది.
    నా అభియోగం అంతే నండీ.
    అర్ధమవ్వకపోతే ఆ తప్పేదో మాదేనండీ. మీది కాదు.


    కవిత్వం పద్యరూపంలో ఉన్నప్పుడు యతి ప్రాస ల వంటి నియమాలకు లోబడి ఉంటుంది.
    వచన కవిత్వమన్నప్పుడు యతి ప్రాసల వంటి నియమాలేమీ లేకుండా భావాలు వాక్యాలలో అమరిపోతాయి.
    పద్య కవిత్వం ప్రాచీనమైన పద్దతి. ఈ పద్దతిలో కవిత్వం వెలువరించేవాళ్లలో మన బ్లాగులోకంలో రాఘవ గారు,భైరవభట్లగారు, కొత్తపాళీగారు, వికటకవిగారు, ఊకదంపుడు గారు, రానారే గారు, గిరి గారు, చంద్రమోహన్ తదితరులు ఉన్నారండీ.

    ఇక మీరు పైన చదివిన కవిత్వం వచన పద్దతిలోనికి వస్తుంది. పద్యకవిత్వం వ్రాయాలంటే కొంత పరిశ్రమ, భాషపై పట్టు ఉండాలని నా అభిప్రాయం. వచన కవిత్వంలో మనకు కలిగిన భావాలను యధాతధంగా అక్షర బద్దం చేయగలమని నా అభిప్రాయం.

    నా మట్టుకు పద్య రచన కష్టంగానూ, వచన కవిత్వం సులభంగానూ అనిపిస్తుంది. మన చంద్రిమ బ్లాగరి చంద్రమోహన్ గారికి మాత్రం పద్యమే సులువుగా వ్రాయగలనని ఓసారి అన్నారు.
    (బహుసా వారు రెంటినీ చూసారు కనుకేమో)
    http://chandrima.wordpress.com/2008/08/24/%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%

    B0%AE%E0%B1%88%E0%B0%A8-%E0%B0%95%E0%B0%82%E0%B0%A6-%E0%B0%AA%E0%B0%A6%E0%

    B1%8D%E0%B0%AF%E0%B0%82/

    పైలింకులో చంద్రమోహను గారు కంద పద్యాన్నెలా వ్రాయాలో వివరించారు.

    ఇక మీ మొదటి సందేహం
    కొన్ని పదాల సముదాయాన్ని కవితో కాదో ఎలా చెపుతారు అని మీ సందేహం.

    చలం అంతటి ఆయనే కవిత్వాన్ని తూచే రాళ్లు నావద్ద లేవని అంటాడు. ఎందుకంటే ఏది కవిత్వం ఏది అకవిత్వం అని అంత సులభంగా విడదీయలేం. ఎందుకంటే నాకు అకవిత్వం అనిపించింది మరొకరికి కవిత్వంలా అనిపించవచ్చు.

    వచన కవిత్వంలో సౌలభ్యంవల్ల కొన్ని సందర్భాలలో కొన్ని కవితల పాదాలన్నింటినీ కలిపి చదువుకొంటే ఒక పారాగ్రాఫుగా మారిపోతుంది.
    అంటే ఒక పారాగ్రాఫు వచనాన్ని ముక్కలు ముక్కలు గా విడగొట్టి ఒక కవితగా వ్రాసేసారన్న అభియోగాన్ని కవి ఎదుర్కోవలసి ఉంటుంది.

    ఇచ్చట అట్టపెట్టెల పాకింగు చేయ బడును అనే వాక్యాన్ని ఇలా విడగొట్టి
    ఇచ్చట
    అట్టపె
    ట్టెల పా
    కింగు చే
    య బడును

    అని వ్రాస్తే కవితయిపోతుందా అన్న దాడులు కూడా జరిగినయ్.

    వచనానికి, కవిత్వానికి తేడాకి చిన్న ఉదాహరణ

    Alphabet

    ABCDE
    FGHIJ
    KLMNO
    PQRST
    UVWXYZ

    పైన వ్రాసినటువంటిది ఒక కవిత అని అనిపించటం లేదు కదూ? ఎ టు జెడ్ ని ఆల్ఫాబెట్ అంటారు అనే ఒక వాక్యం అది. కానీ ఇప్పుడు చదవండి.

    Suicide

    ABCDE
    FGHIJ
    KLMNO
    PQRST
    UVWXYZ

    ఇక్కడ ఒక కొత్త విషయాన్ని కవి చెపుతున్నాడు. గమనించారా? (ఆ విషయం మనం ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు అది వేరే విషయం). ఆల్ఫాబెట్స్ అంటే నాగరికత అని అర్ధం చెప్పుకొంటే నాగరికతవలన మనిషి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆత్మహత్య చేసుకొన్నది మనిషి కావచ్చు, మానవత్వం కావొచ్చు, అమాయకత్వం కావొచ్చు, స్వచ్చత కావొచ్చు, మన ఇష్టం. మన ఆలోచన పరిధిని బట్టి అనేక రకాలుగా విశ్లేషించుకోవచ్చు. పైది వచనమైతే క్రిందది కవిత్వం. ఇక్కడ కవి తనకు కలిగిన భావాన్ని మనలోకి ప్రవేశపెట్టాడు. అది కూడా భిన్న కోణాలలో ఆవిష్కరింపబడేలా.

    ఈ విధంగా వ్రాసే కవితలు ఒక ఆలోచనను ప్రతిపాదిస్తుంటాయి. ఇవి ఒక కోవకు చెందినవి. ఇది కాక మరొక రకం కవిత్వం ఉంటుంది. వాటిలో పదచిత్రాల సౌందర్యం ఉంటుంది.

    పదచిత్రాలంటే పదాలతో ఒకచిత్రాన్ని లిఖించటం.

    సూర్యుడు తూర్పున ఎర్రగా ఉదయించెను.
    అనే వాక్యం ఒక సాధారణ వచనం. ఒక నిత్య సత్యం.

    దాన్నే ఇలా చదవండి.
    తూరుపు నుదిటిపై కుంకం బొట్టు.

    కవి ఇక్కడ ఒక దృశ్యాన్ని చూశాడు. ఆదృశ్యంలో అతనికి తూర్పు అనే స్త్రీ సూర్యుడు అనే కుంకం బొట్టు ధరించినట్లుగా కనిపించింది. ఈ అనుభవాన్ని ఒకపదచిత్రం గా అతడు చదువరిలో ప్రవేశపెడుతున్నాడు. పై వాక్యం వచనమైతే క్రింది వాక్యం కవిత్వం.

    కవిత్వానికి ఉండవలసినది ఏమిటి?
    నా దృష్టిలో ఒక అనుభూతి మొదట కవి అనుభవించి దానిని చదువరిలోకి ప్రవేశపెట్టగలగాలి. ఎంత సమర్ధవంతంగా ప్రవేశపెట్టగలిగితే అది అంత గొప్ప కవితగా వెలుగొందుతుంది. కవి తన అనుభవాన్ని సార్వజనీనం చేయటంలోనే అతని ప్రతిభ దాగి ఉంటుంది. లేకపోయినట్లయితే అది ఫక్తు "సొంత గోల" లాగ మిగిలిపోతుంది.

    ఈ ప్రక్రియలో కవి కొన్ని ప్రతీకలను, ఉపమానాల్నీ ఎన్నుకొంటాడు.
    ఆ కవిత చదివినపుడు చదువరి తనజీవితంలో జరిగిన అనుభవాలతో అన్వయం చేసుకోవాలి. తాను ఆ అనుభవంతో మమేకం కావాలి. అలా చేయగలిగిన కవిత తనపని తాను సమర్ధవంతంగా నెరవేర్చినట్లే.

    అన్ని సందర్భాలలోను కవిత్వం కవి యొక్క స్వీయానుభవమే అవ్వనక్కరలేదు. :-)
    ఉదా; సద్దాం హుస్సైన్ ఉరిపై మంచి కవిత్వం వచ్చింది, :-).

    అంతెందుకు నా పైకవితలో దొమ్మరి పిల్ల చావుని నేను చూడలేదు.
    నేను అసలు వ్రాయదలచుకొన్నది బాల కార్మికుల గురించి. ఇక్కడ ఎవరిది తప్పు? తండ్రిదా, సమాజానిదా, రాజ్యానిదా? అని ప్రశ్నించుకొంటే, అందరూ పాత్రధారులేఅనిపించింది. మరి సూత్రధారి మాటేమిటి? (దేముడు). ఆయన చేసే పనేమిటి? అంటూ వ్రాసినదే ఈ కవిత.

    కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండాలని కొందరంటారు కానీ (అంటే ఓ విప్లవాన్ని తీసుకురావటం వంటివి) నాకైతే కవిత్వం పరమావధి అందం, ఆనందం కొండొకచో ఒక దృక్పధం పట్ల పాఠకులలో ఒక బెంట్ ఆఫ్ మైండ్ ని కలిగించటమే అని అభిప్రాయపడతాను.

    మీకు మరింత సమాచారం కోసం ఈ మాటలో ఇస్మాయిల్ గారు వ్రాసిన ఈ వ్యాసాన్ని చదవండి.
    http://www.eemaata.com/em/library/karunamukhyam/940.html

    మీరడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వటం నా స్థాయి కాదని తెలిసినా ప్రయత్నించాను.
    నాలో ఉన్న ఆలోచనలకు ఒక రూపం ఇప్పించారు. మీకు కృతజ్ఞతలు.

    తె తూలిక గారికి
    అమ్మా మీ అనుభవాన్నిచెప్పి నా కవితను అందలం ఎక్కించారు. ధన్యవాదములు.

    ఆత్రేయగారు
    ఇక్కడ స్థాయిలూ గీయులు ఏమీ లేవండి బాబూ. "-) స్పందించినందుకు ధన్యవాదములు

    బొల్లోజు బాబా

    ReplyDelete
  7. బాబాగారూ, మీరు "కవిత్వం అంటే!" అంటూ రాసిన వ్యాఖ్యని ఒక ప్రత్యేకమైన టపాగా కట్టండి. రాబోయే తరాలకి పనికొస్తుంది. నేనైతే చాలా నేర్చుకున్నాను.

    ReplyDelete
  8. బాబాగారు,
    మహేష్ గారన్నట్టు మీ వ్యాఖ్యని సత్వరం టపాకట్టించండి!
    మీరు కవిత్వాన్ని గురించి చెప్పినదానికి నేను కలిపే మరో చిన్న పాయింటు. ఛందస్సులో రాసేది ప్రతీదీ పద్యం అవుతుంది కాని కవిత్వం అవ్వాల్సిన అవసరం లేదు. కవిత్వాన్ని ఛందస్సులో రాస్తే అది పద్య కవిత్వం అవుతుంది.

    ఓ చిన్న దిద్దుబాటు. ఎలా అలవాటయ్యిందో కాని, చాలామంది చాలా చోట్ల "శ్రుతి"ని "శృతి" అని రాయడం చూసాను. నాకు తెలియనంత వరకూ నేనూ అలానే రాసేవాడిననుకోండి. సరైన పదం "శ్రుతి".

    ReplyDelete
  9. బాబాగారూ

    ౧ కామేశ్వరరావుగారి మాటే నాదీనూ :) ముందు దానిని ఒక ప్రత్యేకమైన టపాగా ప్రచురించండి.

    ౨ ఆమె పట్టుకొన్న వెదురుగడకు
    ఒకవైపు జీవిక, మరో వైపు బాల్యం

    "వెదురుగడకు" అనే కన్నా "తీగకి" ఇరువైపులా అని ఉంటే (మీరు చెప్పదలచుకున్న విషయపు గాఢత విషయంలో) ఇంకా బాగుండేదని అనిపిస్తోంది. నిలదొక్కుకోవడానికి కారణం వెదురే ఐనా నిలదొక్కుకునేది తీగ మీద గనుక.

    దేవుణ్ణి వెక్కిరించడం... :)

    ౩ సాంగత్యం కవిత క్లుప్తంగా సూటిగా ఉంది.

    ౪ హడావిడిలో పట్టించుకోంగానీ
    ఆ పాటకు జ్ఞాపకమేదో రేగుతాది
    కలలో మెసలటానికి :)

    ఏమో. మీ స్వానుభవం తెలియదు కాని నా విషయంలో ఖచ్చితంగా ఇది తప్పే. పాట ఎలాంటిది, ఎంత గట్టిగా వినిపించేలా ఉంది (చెవులకి తూట్లు పడేంతటి గట్టిగా వినిపించేలా ఉంటున్నై ఈ మధ్య ఈ ఆటోరాగాలు) అన్నది పనిచేస్తుంది నా మీద.

    ReplyDelete
  10. మహేష్ గారు
    ప్రయత్నిస్తానండీ. సూచనకు ధన్యవాదములు.
    భైరవభట్లగారు
    అప్పుడప్పుడూ ఇలా "శ్రుతి" చేస్తుండండి. పద్యకవిత్వంపై మీ వివరణ నిజమేకదూ. థాంక్యూ వెరీ మచ్ .
    రాఘవగారు
    మీ సూచన బాగుంది. తీగపై నడిచేవాళ్లు తాము పట్టుకొనే గెడతో బాలన్స్ చేసుకొంటూంటారు. ఒకవైపు బాల్యం మరో వైపు జీవిక అంటే నా ఉద్దేశ్యం బాల్యం కావాలంటే జీవిక ఉండదు, జీవిక కావాలంటే బాల్యం ఉండదు(గెడ పైకీ క్రిందకూ ఊగిసలాటలో) అని అండీ. అందులోనూ ఆ అమ్మాయి నడుస్తున్నది మృత్యుతీగ మీదాయె.
    మీరు చెప్పిన అర్ధం కూడా బాగున్నది. రెండు రాటలమధ్య కట్టిన తీగకు ఒక చివర జీవిక, మరొ చివర బాల్యం. రెంటి మధ్య నడకలో, జీవికకు దగ్గరవ్వాలంటే బాల్యానికి దూరమవ్వాల్సిందే అన్న అర్ధం ధ్వనిస్తుంది.
    కవిత ముమ్ములను ఆలోచింపచేసినందుకు ఆనందంగా ఉందండి.

    ఆటో రాగాలలో నే చెప్పింది ఒక రేర్ గా జరిగే విషయమే లెండి.
    ఏ బస్సుకోసమో నుంచున్నప్పుడు, దూరంనుంచి పాటల ఆటో మనల్ని దాటుకొని మరలా దూరంగా వెళ్లిపోయినపుడు కలిగే అనుభూతి ఈ కవిత. దాన్నే ఒక శబ్ధచిత్రం అన్నాను. అలా వినిపించే పాటల్లో బాస్ మరియు ట్రెబిల్ సౌండ్స్ తప్ప మరేమీ వినిపించవు మనకు.
    థాంక్యూ సర్
    బొల్లోజు బాబా

    ReplyDelete
  11. బాబా గారు,
    మీ కవితలు బాగున్నాయి. కవిత్వంగురించి మీ విశ్లేషణ బాగుంది.
    http://muralidharnamala.wordpress.com/2008/08/08/rain/

    http://muralidharnamala.wordpress.com/2008/12/10/softwareprobs/

    ReplyDelete
  12. బాబా గారూ మహేష్ గారన్నట్లు ఇంత మంచి విషయాన్ని కొత్త టపా క్రింద వేస్తే బాగుంటుంది .. దొమ్మరిపిల్ల కవిత్వం చదివినపుడు చక్కటి కవిత్వాన్ని ఆస్వాదించేకంటే ,కళ్ళముందు ఆ ద్రుశ్యం కనబడి బాధగా అనిపించింది మంచి కవితలు ఇంకా ఇలాగే రాసి మమ్మల్ని అలరింప జేయండి :)

    ReplyDelete
  13. 'దొమ్మరిపిల్ల ' చాలా బావుందండీ! చివరి రెండులైన్లలో ఆవేదన, ఆగ్రహం రెండూ కనిపిస్తున్నాయి.. అసలు మీ కవితలకి కామెంట్ రాయడమంటే పెద్ద ఛాలెంజ్ నాకు.. బావుంది, అద్భుతం లాంటి మాటలన్నీ ఒక్క 'ఆహా!!" లోకి ఒదిగిపోతాయి!! అందుకనే చాలాసార్లు చదివి కూడా అలానే వెళ్ళిపోతాను :-)

    ReplyDelete
  14. అందరూ చెప్పిందే అయినా మళ్ళీ చెప్తున్నా బాబా గారు, కవితలు అన్నీ బాగున్నాయి, దొమ్మరిపిల్ల ఇంకా సూపర్.... ఎప్పుడు నేర్చుకుంటాడో !!! వాహ్.

    ReplyDelete
  15. muraligaru, nestham gaaru, nishi garu, srikanth garu thanks andee.

    ReplyDelete
  16. ఇదేం బాగాలేదు. మీరు దాన్ని టపాగా మార్చండి అర్జెంటుగా...

    ReplyDelete
  17. బాబా గారు,

    మీరు మా అందరి మాట మన్నించి ఆ వ్యాఖ్యను టపాగా మార్చండి....ప్లీస్.

    ReplyDelete