Thursday, November 27, 2008

హేమంత్ కార్కర్ కు అశ్రు నివాళి

మిత్రమా
నిన్నెందుకలా సంబోధిస్తున్నానో కూడా
నాకు తెలియటం లేదు.
నిన్నటివరకూ నీగురించి తెలియదు
నిన్నెప్పుడూ చూడలేదు
అయినప్పటికీ.....
నా ఆత్మీయ మిత్రమా
ఎందుకు ఉదయంనుంచీ
పదే పదే గుర్తుకు వస్తున్నావు?
ఎందుకు నీకై
హృదయం మౌనంగా రోదిస్తుంది?

కనురెప్పల మాటున
పలుచని నీటి పొరపై ఎన్నో దృశ్యాలు
లుక లుక లాడుతున్నాయి.
నీలం షర్టులో నీవు
హెల్మెట్ ధరిస్తూ, జాకెట్ సరిచేసుకొంటూ
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ
ఎవరికో దిశా నిర్ధేశం చేస్తూన్న
దృశ్యాలు పదే పదే
కుత కుత లాడుతున్నాయి.

నిన్నటి దాకా
అగ్ని వర్షం కురిపించిన
నీ కనులు తృప్తి నిండిన
నిశ్శబ్ధాన్ని ధరించాయి.
వదరుబోతు మృత్యువు
ఎదురుచూడని నిబ్బరమది.

ఒక నమ్మకం, ఒక భరోసా
కలిగించాలంటే ప్రాణమివ్వటం కంటే
మరేదీ ఉండదనుకొన్నావా?

నువ్వు మాత్రం మరొక శవం కాదు
ఎందుకంటే
నీవు నడిచిన ఐడియాలజీ మార్గం
నా జాతిని ప్రభావితం చేస్తుంది.
చేస్తూనే ఉంటుంది.

(ముంబాయి టెర్రరిస్టు దాడులలో చనిపోయిన, నిజాయతీ పరుడైన ఏ.టి.ఎస్. అధికారి శ్రీ హేమంత్ కార్కర్ మరియు ఇతర సిబ్బంది ఆత్మ శాంతికి )

Tuesday, November 25, 2008

వంశవృక్షం

ఒక వృక్షం
ఇష్టంతోనో, అయిష్టంగానో
కొమ్మలు రెమ్మలుగా విడిపోయి
నలుదిక్కులకూ చెదిరిపోవటం
ఎంతటి అనివార్యమిపుడు!

అవసరపడో, అనురాగంతోనో
ఆ కొమ్మలన్నీతమ పువ్వుల, తుమ్మెదల
సమేతంగా గుమిగూడటం
ఎంతటి అబ్బురం!

తమలో ప్రవహిస్తున్న పత్రహరితపు
మూలాల్నీ, మార్గాల్నీ
తెలుసుకోవటం, తెలియచెప్పటం
ఎంతటి సంబరం!

అన్ని వర్ణాలూ
ధవళ కాంతిలోకి కుప్పకూలినట్లుగా
అన్ని శాఖలూ
వంశమనే అద్దంలో ఒదిగిపోవటం
ఎంతటి లీలా వినోదం!

నాస్టాల్జిక్ పొత్తిలిలో
కేరింతలు కొడుతున్న
వృక్షశకలాలను సమయం
చెర్నకోలై అదిలించటం
ఎంతటి ఛిధ్ర దృశ్య విషాదం!

బొల్లోజు బాబా

Thursday, November 20, 2008

నైట్ షిఫ్ట్ కేబిన్ మాస్టర్

పట్టాలపై రైలుబండి
మిణుగురుల దండలా మెరుస్తోంది.
నిదురించే ప్రయాణీకులు
గమ్యాల్ని స్వప్నిస్తున్నారు.

వాడు మాత్రం
నిద్రను నిలువునా పాతరేసి
ఎరుపు ఆకుపచ్చ కాంతుల చేతులతో
ప్రతి రైలునూ నిలుపుతూ, పంపుతూ ఉంటాడు.

వాడూపిన పచ్చ జండాకి
వేయి స్వప్నాల్ని కడుపులో మోస్తున్న
ఇనుప అనకొండా భారంగా కదుల్తుంది.

ప్రయాణీకులు నిదురలో గమ్యాల్ని
పలవరిస్తూ ఉంటారు.

నూటనాలుగు జ్వరంతో ఉన్న వాడి కూతురుపై
కలిగిన ఆలోచనల్ని గౌతమీ ఎక్స్ ప్రెస్
తన చక్రాల పాదాలతో తొక్కేస్తుంది.
ఇంటివద్ద సగం ఖాళీగా ఉండే మంచపు తలపుల్ని
గూడ్సుబండి ఎక్కించుకు తీస్కుపోతుంది.
నిదురలో వీని మెడచుట్టూ చేతులువేసి
దగ్గరకు లాక్కొనే జీవనానురాగాలకు
వీడెప్పుడూ ఓ జీవిత కాలం లేటే.

ఒక్కోరాత్రి అరవై, డభ్బై రైళ్లను పంపించి
తెల్లారేసరికల్లా వీడో రైలు చక్రంలా మారిపోతాడు.

అదేపట్టాపై, అదే చక్రం అనంత దూరాలు సాగినట్లుగా
ఎరుపు, ఆకుపచ్చ కాంతుల మధ్య వీని జీవితం
జీవరాహిత్య గూడ్సు బండిలా సాగుతూంటుంది .

పట్టాకు చక్రానికి మధ్య నలిగిన రూపాయి బిళ్లలా
షిఫ్టుకీ, షిఫ్టుకీ మధ్య వీడి జీవగడియారం చితికి
ఎపుడో వచ్చే వృద్ధాప్యాన్ని ఇపుడే బోనస్ గా అందిస్తుంది.

నిదురించే ప్రయాణీకులు
గమ్యాలను మాత్రమే స్వప్నిస్తూంటారు.

వీని ఒక్క పొరపాటు
వేయి శవాలను పీల్చుకొనే మూడడుగుల నేలనే సత్యం
వీడి నరాలలో పాదరస ప్రవాహాల్ని పరుగులెట్టిస్తుంది.

తప్పుకొన్న పట్టాలమధ్య పొంచిఉన్న ప్రమాదాన్ని గుర్తించి
వీడో నిలువెత్తు ఎర్రజెండాయై
పరిగెత్తే రైలుకు ఎదురెల్తూవేసిన వెర్రికేకలు
అసహనపు ప్రయాణీకుల తిట్లలో కరిగిపోతాయి.

మెలుకువ గాజు పెంకులపై
వీడు చేసిన తపస్సు ఫలితంగా
నిదురించే ప్రయాణీకులు
తమ తమ గమ్యాలలోకి మేల్కొంటారు.

బొల్లోజు బాబా

Friday, November 14, 2008

నువ్వు నువ్వే- నేను నేనే

నేనో పాతికసంవత్సరాలపాటు
వెతికి వెతికి నిన్ను చేరుకుంటాను.
నువ్వో ఇరవై వసంతాలలో నాకై
చూసి చూసి నన్ను ఆహ్వానిస్తావు.

అంతవరకూ మనం జీవించినకాలమంతా
నిలువునా కుప్పకూలుతుంది.

సహజీవనమనే కొత్తవేషం కడతాం.

శరీరాలు ఒకదానికొకటి
ఎంతవెలిగించుకొని కరిగించుకొన్నా
ఎవరి పరిమళాలు వారివే!

ఎన్ని స్వాంతనలూ, ధైర్యాలూ,
ఓదార్పులూ ఇచ్చిపుచ్చుకొన్నాఎడారులూ,
ఎడారులకొనలవేలాడే మృగతృష్ణలూ,
నీవి నీవే! నావి నావే.

ఇరువురి ఆశల్ని, ఆశయాల్ని
ఎంతఒకే తెరపై చిత్రించినా
ఎవరి వర్ణాలు వారివే!

తమబరువుని తామే
మోసుకుతిరిగే మేఘాల్లా
ఎవరి శ్వాసభారాన్ని వాళ్ళే మోసుకోవాలి.

సముద్రం తరపుననీళ్ళు వకాల్తా తీస్కొని
ఎట్లైతే ఆటుపోట్లని నృష్టించలేదో
అలాగే
ఒకరి దప్పిక, ఆకలి, నొప్పులను
మరొకరు పూరింపలేరు.

ఎన్ని రోజులు కలిపి మండించినా
ఎన్ని రోజాల్ని కలిసి పండించినా
నువ్వు నువ్వే, నేను నేనే.
నేనే నువ్వు అనుకోవటం
నువ్వే నేను అనుకోవటమంతమాయ.

అయినా సరే
లోకం దృష్టిలో మనిద్దరిదీ
ఎప్పటికీ అన్యోన్యదాంపత్యమే.

బొల్లోజు బాబా

Monday, November 10, 2008

ఈ కవితకు పేరు సూచించండి.

విరగకాచినవెన్నెల్లో
మరొక్కపొగడపువ్వు కూడా
పట్టేట్టు లేదు.

రాత్రయితే చాలు
ఋతువు తప్పని
వలసపక్షుల్లా
నీ జ్ఞాపకాలు
హృదయంపై వాలతాయి.

హృదయతరువుపై
మరొక్కవసంతం కూడా
పట్టేట్టు లేదు.


చుంబనంలో
మోహావేశంలో
మూసుకొన్న
కన్నియనయనాల్లా
హృదయం తీయగా
వణుకుతుంది.

పొగడ పూల పరిమళంలో
వెన్నెల జలకాలాడుతూంది.



బొల్లోజు బాబా

Wednesday, November 5, 2008

నగర మర్యాద + ఈమాట, ఆంధ్రభూమి లలో పడిన నా కవితల లింకులు.

బ్లాగ్మిత్రులకు, పెద్దలకు
ఈమాట వెబ్ పత్రిక యొక్క దశమ వార్షికోత్సవ సంచికలో ప్రచురింపబడిన " సార్ గారండీ, సార్ గారండీ" అనే కవిత మరియు మూడు నవంబరు న ఆంధ్రభూమి సాహితి పేజీలో ప్రచురింపబడిన " మట్టికనుల నా పల్లె" అనే కవితల లింకులను ఇక్కడ ఇస్తున్నాను. (పేజీ చివరలో ఉంటుంది)
నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మిత్రులకు, పెద్దలకు సదా కృతజ్ఞుడనై ఉంటాను.
ధన్యవాదములతో
భవదీయుడు
బొల్లోజు బాబా

http://www.eemaata.com/em/issues/200811/1348.html

http://andhrabhoomi.net/sahiti.html



నగర మర్యాద

రహదారికిరుపక్కలా చెట్లు క్రమేపీ తగ్గి
హోర్డింగులు మొదలైతే
నగరంలోకి ప్రవేశిస్తున్నామన్నమాటే.
రకరకాల రంగుల్లో, వింతైన వెలుగులతో
హోర్డింగులు వంగి వంగి స్వాగతం పలుతూంటాయి.

నోరూరించే రుచులూ, ఇంటిని మరిపించే ఆతిధ్యం అంటూ
కొన్ని హోర్డింగులు అత్యంత అతి వినయంతో ఆహ్వానిస్తాయి.

"తలతిరుగుడా అయితే పక్షవాతం కావొచ్చు" అంటూ మన క్షేమం కోరుతూ
కిడ్నీలెక్కడ దొంగిలింపబడతాయో చెపుతూంటాయి.

వేయబోయే కొత్త వేషాలకు దుస్తులు మావద్దే కొనుక్కోమని
కొన్ని హోర్దింగులు ప్రాకులాడుతూంటాయి.

మేమమ్మే చదువులే టౌనులో బెస్టంటూ
మీర్రాకపోతే మామీద ఒట్టంటూ కొన్ని ప్రాధేయపడతాయి.

మాదే " అసలైన అనువంశీక షాపంటూ" కొన్ని దీనంగా నమ్మబలుకుతాయి.

నిక్కచ్చైన KD బంగారం మావద్ద మాత్రమే లభ్యం
రండి రండి రండంటూ మరికొన్ని గారాలు పోతాయి.

"మిక్సీ కొనండి మారుతీ కారు ఖచ్చితంగా పొందండి" అంటూ
కొన్ని హోర్డింగులు రోడ్డు గుద్ది మరీ, సాదరంగా పిలుస్తాయి.

ఆఖరుకు చస్తే
మార్చురీ వేను ఫోను నంబర్లతో సహా (ఉపయోగపడే సమాచారమిది)
హోర్డింగులు ఆత్మీయంగా, సవివరంగా, సవినయంగా,
తెలుపుతూ నగరానికి ఆహ్వానిస్తాయి.

తెచ్చుకొన్న చమురు ఇంకి పోయేదాకా
నగరమన్నాకా, ఆమాత్రం మర్యాద చేయద్దూ మరి?


బొల్లోజు బాబా


Saturday, November 1, 2008

ప్రొడిగల్ సన్స్

కాలేజీ చదువులకని
ఇల్లు విడిచిన పిల్లలు
ఇంకా తిరిగి రారు.

వృద్దాశ్రమంలో అంతా బాగానే ఉంటుంది.
వేళకు తిండి, వైద్యం, కాలక్షేపం.
కానీ
మెలుకువ నిద్రపొడవునా వ్యాపిస్తూంటుంది.

చలిచేతుల్ని
అనుభవాల చుట్టూ వేసి
వెచ్చచేసుకోవాల్సిందే.

జ్ఞాపకాల్ని వింటూ కొవ్వత్తి
రాత్రిలోకి వలికిపోతుంది.
కాలం నిండా ఘనీభవించిన చీకటి.

ఇసుక గడియారంలోని
ఒంటరి ఎడారి ధార
భారంగా జారుతుంది.

గాలి తన బరువుని
చెట్లపై ఈడ్చుకుంటూ సాగుతూంటుంది.

పాదముద్రలను
కెరటం నోట కరచుకు పోయింది.
మౌనం పంజరంలా
దేహంపై దిగింది.

కాలేజీ చదువులకని
ఇల్లువిడిచిన పిల్లలు వచ్చారు.

బొల్లోజు బాబా