యానం విమోచనోద్యమం పుస్తకం గురించి
యానం అనేది గొదావరి ఒడ్డున ఉన్న ఒక యూనియన్ టెరిటరీ. ఇది భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరిజిల్లాలో ఉన్నప్పటికీ పాలనాపరంగా పుదుచేరీ (పాతపేరు పాండిచేరీ) తో అనుసంధానింపబడి ఉంటుంది. అంతేకాక పుదుచేరీ, కారైకాల్, మాహే మరియు యానంలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి 2 శతాబ్ధాల పాటు ఫ్రెంచివారి పాలనలో ఉండి, 1954 లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందాయి. భారత స్వాతంత్ర్యసంగ్రామం గురించి ప్రతిభారతీయునికి కొద్దోగొప్పో అవగాహన ఉంటుంది. కానీ 1947 లో బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత 7 సంవత్సరాలపాటు ఈ స్వతంత్ర్య భారతావని లోని కొన్ని ప్రాంతాలను ఫ్రెంచి వారు పరిపాలించారన్న విషయం, చరిత్ర చదివిన వారికి మాత్రమే తెలుస్తుంది. మరి వారిని కూడా ఈ దేశం నుంది వెళ్ల గొట్టటానికి జరిపిన పోరాటాలు ఎట్టివి? వాటిలో హీరోలెవ్వరు? అసువులు బాసిందెవ్వరు? వంటి ప్రశ్నలకు శ్రీ వి. సుబ్బయ్య గారు వ్రాసిన సాగా ఆఫ్ ఫ్రీడం ఆఫ్ ఫ్రెంచ్ ఇండియా, శ్రీ పాంచ్ రామలింగం గారి ఆత్మకధ వంటి పుస్తకాలలో అనేక విషయాలు తెలుసుకోవచ్చు. కానీ వీరంతా పాండిచేరికి చెందిన వారు కావటంతో అందులోని విషయాలన్నీ పాండిచేరి స్వాతంత్ర్య పోరాటానికి చెందినవై ఉండటము, యానానికి సంబందించిన అంశాల ప్రస్తావన తక్కువగా ఉండటము జరిగింది.
యానంలో జరిగిన స్వాతంత్ర్యపోరాటము యొక్క విశేషాలను రికార్డు చేయాలనే ఉద్దేశ్యంతో నేను యానాం విమోచనోద్యమము అనే పుస్తకాన్ని వ్రాయటం జరిగింది.
1954, జూన్ 13 న జరిగిన యానం విమోచననేపద్యం, ఆనాటి భావోద్వేగాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అప్పుడు జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఉటంకింపబడిన విషయాల మూలాలను ( రిఫరెంస్లు) కూడా అక్కడే చెప్పటం జరిగింది.
యానం విమోచనం జరుగుతున్నపుడు ఇక్కడ జరిగిన సంఘటనలు జాతీయంగా అంతర్జాతీయంగా ఏ విధంగా ప్రస్తావించబడ్డాయి? మిగిలిన ఫ్రెంచికాలనీలను మరియు ఫ్రాంస్ ను యానం విమోచనం ఏ విధంగా ప్రభావితం చేసింది? యానం విమోచనాన్ని ఫ్రెంచ్ ప్రభుత్వం ఏ విధంగా పరిగణించింది? వంటి ప్రశ్నలకు జవాబులు ఈ పుస్తకంలో దొరుకుతాయి.
No comments:
Post a Comment