Tuesday, May 13, 2008

స్వప్న లోకం


తెల్లారేసరికల్ల
ముత్యం భశ్మం అయినట్లు
స్వప్నం భళ్లుమంటుంది .
వృద్ధ కన్యని పరిణయమాడిన
రాకుమారుడూ లేడు,
మహాపతివ్రత మనోప్రపంచపు
శృంగార విహార యాత్రలూ లేవు.
బ్రహ్మచారితో అంతవరకూ
సరసమాడిన సినీతార
అమాంతం అదృశ్యమవుతుంది.
నిరు్ద్యోగి గ్రోలుతున్న
ఉద్యోగామృతధారలు ఆగిపోతాయి.
తెల్లారేసరికల్లా
స్వప్నం భళ్లుమంటూంది.
ముత్యం భశ్మం అయినట్లు.
సాయింత్రం నాన్న కొనని ఐస్ క్రీం తిన్న
కుర్రాడిచేతిలో కప్పు మాయమవుతుంది.
క్షుధార్తునికి వడ్డించిన విస్తరి
కన్ను తరచేలోగా కప్పుకొన్న గోనె సంచీ అయిపోతాది....
దేవుడినే ఓదార్చి, వీధి దాకా సాగనంపిన కవికి కూడా
తెల్లారే సరికల్లా
స్వప్నం భళ్లుమంటూంది.
ముత్యం భశ్మం అయినట్లు.


బొల్లోజు బాబా

No comments:

Post a Comment