కయితిన్నప్పుడు
కయితిన్నపుడు గుండొచ్చి
కొండనాలిక్కి చేప్ముల్లై గుచ్చుకోవాల.
కయిత చదూతూంటే లోపల్లోకం
చింతచెట్టుక్కట్టిన టైరుయ్యాల్లో
దేహంలా తేలిపోవాల.
ఇస్కూలు పిల్లగాడు బణ్ణుంచొచ్చి
అపచెప్పే సగంసగం పజ్జెంలా
పదిమందికీ చెప్పుకొనేదిలా ఉండాలి కైతంటే.
కయిత గుర్తొచ్చినపుడు
గుడ్డులోపలి కోడిపిల్ల పెంకును పొడిచినట్టు
గుండెలోపలేదో పొడిచినట్టుండాల.
కయితిన్నపుడు దేహం, దేహమంతా
తప్పెటై దరువెయ్యాల.
చెలకలో నీరంతా తాగేసే
పీతబొక్కలా ఉండాలి.
కమ్మిచ్చు గుండా గుండెని
తీగగా సాగదీసింట్టుండాల.
కయిత్తమంటే అపుడే పుట్టిన
దూడ గిట్టలంత మెత్తగా ఉండాల.
రాత్రేల నా ఆడదాని కళ్ల తడిలో
ఆపడే నా ముఖమంత మెత్తగా ఉండాల.
నామట్టీ, నీరు, గాలి, నిప్పు, ఆకాసం, అమ్మ
గుర్తుకురావాల.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment