తెలుగు మోనాలిసా
అతడామెను
నడిచే చందమామ అనీ
పరచుకొన్న వెన్నెలనీ
నిలచిపోయిన వసంతమనీ
అని వర్ణించాడు.
ఆమె నవ్వును
పూల పరిమళంతోను
సెలయేటి స్వచ్చతతోను,
రత్న కాంతుల సవ్వడితోను పోల్చాడు.
ఆమె కళ్లను
బటర్ ఫ్లై విప్పారిన రెక్కల ద్వయమనీ
ఆత్మలోక ద్వారాలనీ
రెండు పున్నమిలనీ
మిగిలిన దేహమంతా
ఆ రెండు కళ్లకూ పొడిగింపనీ అన్నాడు.
ఆమె చూపుల్లో
ప్రేమలోక సంగీతముందనీ,
కాంతులీను కరుణా ఝురిలున్నాయనీ,
అమరత్వానికి ఆహ్వానాలున్నాయనీ అన్నాడు.
ఆమె మాటలు
నెరళ్లు తీసిన నేల అడుగున
ఉండే విత్తును మొలకెత్తించే ఆర్ధ్రతనీ,
పరాజితుడిని కూడా అజేయుడిని
చేయగలిగే మంత్రమోహన శక్తులనీ,
ఎన్నో అన్నాడు
అతడామె గురించి చాలా చెప్పాడు
కానీ ఆమె మాత్రం
ఒక చిరునవ్వు శాపమిచ్చి సాగిపోయింది.
తెరచాటు మనిషి కదా!
బొల్లోజు బాబా
నాకు కవితా చాతుర్యత పెద్దగా లేదు. పదజాలసమ్మోహనాశీలత ఇంకా నాలోవొసగలేదు.అందుకే కవితకు దాసుడను. చాలా బావుంది. స్పందిపజేసినందులకు నాకునూ ఆనందంగా వుంది. ఇంకా నాకెమికావలె.
ReplyDeletemee pruthviaraj varma.
చివై వాక్యాలు చాలా బాగున్నాయండి.
ReplyDeleteబాబా గారూ,
ReplyDelete"ఆమె కళ్లను
బటర్ ఫ్లై విప్పారిన రెక్కల ద్వయమనీ
ఆత్మలోక ద్వారాలనీ
రెండు పున్నమిలనీ
మిగిలిన దేహమంతా
ఆ రెండు కళ్లకూ పొడిగింపనీ అన్నాడు."
ఎంత అందమైన భావన! తెలుగులో కవిత్వం ఇంకా బతికే ఉందని నమ్మకం కలిగించింది మీ కవిత.పదాల వంతెనతో ఈ లోకాన్ని తెలియని మరో రస ప్రపంచంతో కలపడం అందరికీ సాధ్యం కాదు, అసలైన కవికి తప్ప.
నా కవిత్వం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
పని వత్తిడి వల్ల ఈ మధ్య తరచుగా బ్లాగులు చూడక పోవడం వల్ల మీ comments కు త్వరగా స్పందించలేకపోయాను. మరోలా భావించకండి.
భలే భలే.
ReplyDeleteబహు బాగుంది. వర్మగారి బొమ్మ ధన్యం.
భాను మహాశయా, బొత్తిగా నల్లపూసై పోయారు. పనుల వత్తుడులు ఎప్పుడూ ఉండేవే. మళ్ళి కలం పట్టి బ్లాగు తలుపులు తెరవండి!
This comment has been removed by the author.
ReplyDelete@బాబా గారు
ReplyDeleteమీ కవిత బాగుందండి... మీకు తెలుగు ధారాళంగా వచ్చేస్తుంది. బొమ్మని చూసి ప్రేరణ పొంది రాయడం చాలా కష్టం... మీరు సఫలీకృతులయ్యారని చెప్పాలి... కానీ రెండో సారి చదివినప్పుడు కవిత మొత్తం మంచి తెలుగు వాడి బట్టర్ ఫ్లై అని ఇంగ్లీషు వాడకుండా ఉండాల్సిందనిపించింది... ఇంకా మీరు ఎలాగు నడిచే చందమామ అన్నారు కాబట్టి ఈ వరసలు లేకుండా ఉంటే బాగుండేది.. "రెండు పున్నమిలనీ మిగిలిన దేహమంతా ఆ రెండు కళ్లకూ పొడిగింపనీ అన్నాడు." కళ్ళు పదార్ధం కాబట్టి దానిని సమయంతో పోల్చడం భావ్యం కాదనిపించింది.. ఇంకా "ఆమె నవ్వును రత్న కాంతుల సవ్వడితోను పోల్చాడు." అన్నారు... అలానె
"ఆమె చూపుల్లో ప్రేమలోక సంగీతముందనీ," అన్నారు... అది కూడా నాకు రుచించలేదు... ఆ రెండు స్వాభావికంగా వేరైనవి...
అవి లేకుండా కూడా మీరు అనుకున్నది అర్ధము, అనుభూతి పోకుండా చెప్పొచ్చు అనిపిస్తుంది... ఎందుకంటే అదే భావం రెండు సార్లు ద్వనించినట్టు అనిపించింది మీ కవితలో...
మీ చివరి వరసలు అద్భుతమైన ముగింపు.. చిరునవ్వు శాపం అన్నారు కదా... చాలా బాగుంది...
"అతడామెను
నడిచే చందమామ అనీ
పరచుకొన్న వెన్నెలనీ
నిలచిపోయిన వసంతమనీ
అని వర్ణించాడు.
ఆమె కళ్లను
సీతాకోక చిలక విప్పారిన రెక్కల ద్వయమనీ
ఆత్మలోక ద్వారాలనీ
ఆమె చూపుల్లో
కాంతులీను కరుణా ఝురిలున్నాయనీ,
అమరత్వానికి ఆహ్వానాలున్నాయనీ అన్నాడు.
ఆమె నవ్వును
పూల పరిమళంతోను
సెలయేటి స్వచ్చతతోను పోల్చాడు.
ఆమె మాటలు
నెరళ్లు తీసిన నేల అడుగున
ఉండే విత్తును మొలకెత్తించే ఆర్ధ్రతనీ,
పరాజితుడిని కూడా అజేయుడిని
చేయగలిగే మంత్రమోహన శక్తులనీ,
తేనె జలపాతాలు కుచించుకుపోయి ఆమె పెదవులపై తారాడే శబ్ధ తరంగాలయ్యాయనీ,
ఎన్నో అన్నాడు
అతడామె గురించి చాలా చెప్పాడు
కానీ ఆమె మాత్రం
ఒక చిరునవ్వు శాపమిచ్చి సాగిపోయింది.
తెరచాటు మనిషి కదా!"
మీ కవితని చిన్నది చేసినప్పుడు నా ఆలోచనలో ఉన్నది... చూపులూ తాకిన తరవాతే మాటలు వినపడతాయి... ధ్వని కన్నా కాంతి వేగంగా ప్రయాణిస్తుంది... ఒక విషయాన్ని,వ్యక్తిని ప్రస్తుతించేప్పుడు పరస్పరం అంగీకారమైన ఉపమానాలు వన్నె తెస్తాయని... నేను సద్విమర్శ చేసాననుకుంటున్నాను... మీకు ఇబ్బందిగా అనిపిస్తే మన్నించండి..
దీపు గారికి ధన్యవాదాలు,
ReplyDeleteనాకవితను కూలంకషంగా చదివి, నాభావాలను అర్ధం చేసుకున్నందుకు.
మీ ఆక్షేపణలకు నా వివరణ.
నేనీ కవితలో ఎక్కువ మెటఫర్లు వాడటం వలన కొంత సరళత్వం లోపించి ఉండవచ్చు.
సీతాకోక చిలుక అనే పదం కన్న బటర్ ఫ్లై అనె పదం ద్వారా ఆ వాక్యంలో మీటర్ (metre లయ/దరువు) బాగుంటుందని వాడాను అంతే తప్ప తెలుగు భాష పట్ల శీతకన్నేమీ కాదు. మీరు మరొక సారి చదవండి. మీకే అనిపించవచ్చు.
పున్నమిలంటే మనందరికి స్ఫురణకు వచ్చేది, గుండ్రటి చంద్రుడు, చల్లటి వెన్నెల.
ఆరెండు కళ్లు గుండ్రంగా ఉన్నాయి, చల్లని కాంతులు చిమ్ముతున్నాయి. అనే అర్ధం రావటం లేదూ ఆ వాక్యంలో?.
కళ్లు అనేవి పదార్ధం కనుక అభౌతికమైన కాలంతో పోల్చటం సబబు కాదేమో అన్నారు. దానికి కొన్ని కవితలలోంచి ఉదాహరణలు.
తలపుల తావిలో తడిచిన నా కళ్లు.. (జ్ఞాపకాల కెరటాలు.. ) అనే వాక్యంలో భౌతిక మైన కళ్లకూ అభౌతికమైన తలపుల తావికి చక్కని జత కుదరలేదు.
మరికొన్ని ఉదాహరణలు.
ఆమె కళ్లు యవ్వనోత్సాహం నింపుకున్నాయి ఠాగూర్
The eyes those silent tongues of love
'మధువొలకపోసే ఈ చిలిపి కళ్లు' అనే సినీమా పాటలో కూడా కళ్లు మధువులను (శృంగారం)ఒలకపోస్తుందని భావం.
మీకు, రత్నకాంతుల సవ్వడి అన్న ప్రయోగం నచ్చినపుడు, (అందులో కాంతిని, ద్వనిని కలిపేయటం జరిగింది) కళ్లను పున్నమితొ పోల్చటం ఎందుకు నచ్చలేదో తెలియటంలేదు. నా బాడ్ లక్ అంతే.
మిగిలిన దేహమంతా ఆ రెండు కళ్లకూ పొడిగింపు అని అనటానికి ప్రేరణ చానాళ్లక్రితం vision is the extension of eyes అనో లెక దాదాపు అదే అర్ధంలోనో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది.
ఇక్కడ ఈ వాక్యంలోని నాభావన ఏమిటంటే పై వాక్యాలలో కళ్ల అందాన్ని లేదా గొప్పతనాన్ని చెప్పి ఇక మిగిలిన దేహం వీటికి పొడిగింపు గా ఊహించుకుంటే అది ఇంక ఆ దేహం ఏస్థాయిలో ఉంటుందో సూచన ప్రాయంగా చెప్పటం.
చూపులలో దయ, కరుణ, చల్లదనం, ప్రేమ, అగ్ని, మంటలు, విషం, కోపం, వెన్నెల, జలపాతాలు, శక్తి, వంటివెన్నో ఉన్నప్పుడు సంగీతం ఎందుకుండ కూడదు? ఒక వేళ సంగీతం ఉన్నప్పుడు అది ఏ ఇళయరాజాదో, లేక ఎ.అర్. రెహమాను దో అయితే ఇంకా ఎంతబాగుంటుంది.? ప్రేమలోకం అనేది ఒకటుందనుకుంటే, అందులో వినిపించే సంగితం ఎంత గొప్పగా ఉండవచ్చు. అటు వంటి సంగీతం ఆమే చూపులలో వినిపిస్తుందంటే, ఆమె ప్రేమ చూపుల భాషను అర్ధం చేసుకున్నట్లేగా?.
మీరొ్ప్పుకోక పోయినా స్వాభావికంగా వేరైన వాటిని మెటఫరైజ్ చెయ్యటంలోనే కవిత్వం ఉంటుందని నాఉద్ద్దేశ్యం. నేను ప్రగాఢంగా నమ్మే విషయం కూడా.
కొన్ని ఉదాహరణలు.
శ్రీశ్రీ ఒకచోట: నెలవంకను ఏడారిలో పడుకున్న ఒంటె తో పోలుస్తాడు.
శిఖామణి; 1.బాల్యాన్ని ఈతాకుల చీపురు చేసి.
2.వణుకుతున్న ఆమె దేహం పై చంద్రుడు వెన్నెల దుప్పటి కప్పి, చెట్టుకొమ్మకు లాంతరై వేలాడతాడు.
3.పూలబ్బాయి తన బాల్యాన్ని మూరమూర చొప్పున అమ్ముకుంటున్నాడు.
4. పెదవులమీద నవ్వుని కూడా తీసి హెంగర్ కి తగిలిస్తుంది.
చలం: 1.నీ వాగ్ధాన పరిమమళాలతొ గాలి నిండిపోతుంది.
2. నువ్వు పల్కకపోతే నీ మౌనంతో నాహృదయాన్ని నింపుకుని ఓర్చుకుని వూరుకుంటాను.
3. నీ గాన తేజస్సు లోకాన్ని వెలిగిస్తుంది.
పైన ఉదాహరణలలో స్వాభావికంగా వేరైన వాటిని కలపటం ద్వారా మంచి రసానుభూతి కలుగుతుంది.
నేను నా కవిత గొప్పదని చెప్పటంలేదు. మీరు చెప్పిన ఆక్షేపణలను గౌరవిస్తూనే, నా పాయింట్ ఆఫ్ వ్యూ ని వివరించాలని ప్రయత్నిస్తున్నాను.
ఆమె నవ్వును ..... అన్నా స్టాంజా తరువాత వరుసలో ఉంటే బాగుంటుందన్న విషయాన్ని ఏకీభవిస్తున్నాను.
చంద్రుడు, వెన్నెలా, పున్నమిలు, రిపీట్ అయినట్లు నాకు కూడా తెలుస్తున్నా భిన్న సందర్భాలలో, భిన్న ఉపమానలమద్య వచ్చాయి కదా అని సరిపెట్టుకుంటున్నాను.
నా కవితపై చక్కటి విమర్శచేసి, నాకవితను తూకం వేసుకోవటానికి అవకాశమిచ్చిన దీపు గారికి అనేకానేక ధన్యవాదాలతో
మీ
బొల్లోజు బాబా
బాబా గారు, చాలా బాగుంది. కవితలపై "స్పందించడం" మన కు చాతనవ్వదుకానీ, "ఆస్వాదించా"మని మాత్రం ఘంటాపధంగా చెప్పగలను.
ReplyDeleteబాబా గారు,
ReplyDeleteవర్మ గారి బొమ్మ ధన్యం! ఆయన రాజా రవి వర్మ గారి వారసుడని అనుకుంటుంటే, మీరు తిలక్ కి వారసులన్నట్టు రాశారు కవిత.
వర్మగారికి,రాధికగారికి, భానుగారికి,కొత్తపాళీ గారికి, దీపుగారికి,మహేష్ గారికి, సుజాత గారికి నా కృతజ్ఞతలు.
ReplyDeleteబొల్లోజు బాబా
చిన్న చిన్న పదాలతో చాలా అందంగా రాసారు.
ReplyDeleteచిరునగవు శాపమిచ్చి వెళ్ళిపోయింది అన్న పద ప్రయోగం అద్బుతం.
అద్భుతమైన చిత్రం.. దానికి తోడు అత్యద్భుతమైన కవిత్వం..
రెండూ కలిసి మెలిసి వీనుల విందు చేసాయి.
పరదా
ReplyDeleteనీ వెనక రహస్యం, దాచాలన్న ప్రయత్నం
నూ గనక లేకపొతే, చూస్తారన్న సందేహం
గాలికి పడుతూ లేచే సంకటం
పైకి, కిందికి ఊగిసల పోరాటం
పక్కకు తోలిగే వేళ కోసం
వేచియున్న వెన్నెల వాసం
-viswamitra
http://jyothy-viswamitra.blogspot.com
ప్రతాప్ గారికి, విశ్వామిత్ర గారికి ధన్యవాదములు
ReplyDeleteబొల్లోజు బాబా