Thursday, May 8, 2008

మృత మన్ను


ఎన్నో భావాల్నిపలికించిన ఈ నేత్రాలు అభావమైన దృశ్యం.
గాలిని పదాలుగా, నవ్వులుగా, ఆశలుగా, ప్రేమలుగా
మార్చిన ఈ స్వరతంత్రులు నిర్జీవమైన వేళ.........
ఇక ఈ చెవులు తీతువుపిట్ట సుదూరగానం వినలేవు.
వానజల్లుల శబ్ధాలను స్పర్శించలేవు.
ఈ వీధిగాయకుని అస్థిపంజరమిక మట్టిపొరల క్రింద పడి ఉంటుంది.
తన నీడల్లోకే నా నేస్తం కనుమరుగయ్యాడు.

ప్రజలందరూ వెలుగు ప్రపంచంలోకి ప్రవహిస్తుండగా
ఈ ఖాళీ రాత్రి లోంచి నీ జ్జాపకాలు ఉదయిస్తాయి
ఆ నీడల మద్య తచ్చాడుతూ నేను ..........
హృదయంపై భోరున ఒకటే కుంభవృష్ఠి .

వయసుపెరగడమంటే మనం ప్రేమించేవాళ్లను
ఒక్కొక్కళ్లనూ కోల్పోవటం కాదూ.......
బాధపడుతూ కూర్చుంటే జీవితం ఆగిపోదట
సాగిపోతూనే ఉంటుందట - ఎవరో అంటున్నారు

బాధంటే లేకపోవటమే. లేకపోవటమే బాధ.
శూన్యంలో జ్వలించే అంతులేని నిట్టూర్పే బాధంటే
జ్జాపకాలు అస్ఫష్టం కానంతవరకూ
బాధ ఓ సర్పపరిష్వంగమే!
భావానికీ రూపానికీ మద్య పరచుకొనేదే వేదన
కలకూ వాస్తవానికీ దూరం చెరిగే వరకూ
వేదన ఓ దృతరాష్ట్రకౌగిలే!

నాకు తెలుసు ప్రతి క్రియా నిర్ధేశితమేనని
నాకు తెలుసు ఈ బాట ముగింపేమిటో
నాకు తెలుసు నేను క్షతగాత్రుల బృందంలో ఒకరినని
కాలం సముద్రంలా అన్నింటినీ తనలో కలిపేసుకోగలదని
అయినా జీవితమంటే సాయంకాలపు వ్యాహ్యాళి కాదుగా!

చాన్నాళ్ల క్రితమే సిగరెట్లు మానేసినా
ఇపుడు ఒకటి కావాలనిపిస్తుంది.


బొల్లోజు బాబా
( మిత్రుని మరణం పై)


11 comments:

 1. 'హ్రుదయంపై భోరున కుంభవ్రుష్టి"

  "బాధంటే లేకపోవటమే"

  "చాన్నాళ్ల క్రితమే సిగరెట్ మానేసినా ఇపుడు ఒకటి కావాలనిపిస్తుంది"

  మీ బాధను పంచుకోవాలనిపించేలా రాశారు. కవిత అంటే హ్రుదయాన్ని ఒక ఝంఝామారుతంలా చుట్టుముట్టి కదిలించాలి(నా మట్టుకు). మీరు సీరియస్ గా తరచుగా రాయాలండి .

  ReplyDelete
 2. Nice Post !
  Use a Telugu social bookmarking widget like PrachaarThis to let your users easily bookmark your blog posts.

  ReplyDelete
 3. Extremely nice. I could sense and share the pain very much.

  http://jyothy-viswamitra.blogspot.com

  ReplyDelete
 4. Good to hear you stopped smoking.

  ReplyDelete
 5. టచింగ్ గ ఉన్నదండీ.
  ఇలాటీ సందర్భంలో గుడ్డుకి ఈకలు పీక్కూడదు కానీ టైటిలే నాకు అర్ధం కాలేదు. అందులో మన్ను అనేది మట్టి అనే అర్ధమా?

  ReplyDelete
 6. సుజాత గారికి, రోషిణి గారికి, విశ్వామిత్రగారికి స్పందించినందుకు ధన్యవాదాలు.

  కొత్తపాళీ గారు, మృతమన్ను అంటే నాఉద్దేశ్యం మట్టి అనే అర్ధంలోనే వ్రాసాను అండి. ఈ దేహము మట్టే చనిపోయినతరువాత కూడా మట్టిలోనే కలుస్తుంది.
  ఈ వీధిగాయకుని అస్థిపంజరమింక మట్టిపొరలక్రింద పడిఉంటుంది అన్న వాక్యం ఉద్దేశ్యం కూదా అదే.
  ఇక కవిత చెప్తున్న వాడుకూడా మరణం తాలూకు కుదిపివేతలో ఉన్నాడు. వాడి మనసునికూడా మన్నుతో పోల్చుకున్నట్లయితే అదిప్రస్తుతం మృతమై ఉన్నది.

  ఈ ఉద్దేశ్యాలతోనే మృత మన్ను అని పేరుపెట్టడం జరిగింది.
  మీ కామెంటు తరువాత ఆ టైటిలు కొంత అస్ఫష్టతకు తావిస్తున్నదనిపిస్తున్నది. మీరేమంటారు.


  పెదబాబు అన్నా,
  నీ వాత్సల్య పూర్వక కామెంటుకు ధన్యవాదాలు. వెనుకటికి ఎవరో " ఆర్ట్ ఎక్సిబిషను చూసిన వ్యక్తిని ఎలావుందని అడిగితే ఫ్రేములు చాలా బాగున్నాయి" అన్నాడట.

  కవిత్వం అన్నిసందర్భాలలోను అఫిడవిట్ కాదన్నా.
  thank you for the concern.

  మీ
  బొల్లోజు బాబా

  ReplyDelete
 7. నువ్వుశెట్టి బ్రదర్స్May 11, 2008 at 5:18 AM

  కవిత చాలా బాగుంది. మీరు ఇలాంటివి ఇంకా అందించండి. టైటిల్ నాకు నచ్చింది.

  ReplyDelete
 8. @బాబా గారు
  మీ అనుభవం కొట్టొచ్చినట్టు కనపడుతుంది... ఆలోచింప చేసింది... ముగింపు నన్ను మీ ఆలొచనల్లో కలిపేసింది...

  ReplyDelete
 9. నువ్వుశెట్టి బ్రదర్స్, దీపుగారికి స్పందించినందుకు ధన్యవాదాలు
  బొల్లోజు బాబా

  ReplyDelete
 10. వయసు పెరగడమంటే మనం ప్రేమించే నాళ్ళను ఒక్కొక్కళ్ళనూ
  కోల్పోనటం కాదూ---
  బాధపడుతూ కూర్చుంటే జీవితం ఆగిపోదట సాగిపోతూనే
  ఉంటుందట - ఎవరో అంటున్నారు---
  ఎంత బాగా అన్నారు

  ReplyDelete
 11. I got lot of useful information from this site. I recommended every one to read this site,Great articles. Thanks for sharing!

  ReplyDelete