Friday, May 9, 2008

నాన్న మరణం

నాన్న మరణం పై

దేహాన్ని ఇంతకాలం ధరించిన దుస్తులు
చిలక్కొయ్యకు వేలాడుతున్నాయి.
"జనమిత్ర" ఈ రోజు రావాలి అని ఎదురుచూసే
నయనాలు నిస్తేజమై పోయినాయి.

"సాహితీ-యానం" కు దిశానిర్ధేశం చేసిన
"సువర్ణశ్రీ" నడక నిలచి పోయింది.

యానాన్ని భారతంలో విలీనంచేయటంలో
ఉరకలెత్తిన రక్తం, జ్జాపకాలని మాత్రమే మిగిల్చి పోయింది.

ఆలోచనలు ఆగిపోగా కలం మూగపోయింది.
రాలిపడ్డ అక్షరాలు మాత్రం తీపిగురుతులైనాయి.

ఫ్రాంస్ ను యానాన్ని ఇంతకాలం కలిపిన
కలంలో సిరా ఇంకి పోయింది.

దేహం దగాచేయగా "యానాం చరిత్ర" అనే పుస్తకం
సగం చెక్కి వదిలేసిన శిల్పమై విలపిస్తుంది.

"తెలుగు రత్నాన్ని" గర్భంలో దాచుకున్న
యానాం ఇపుడో "రత్నగర్భ".


బొల్లోజు బాబా

వివరణ
సువర్ణశ్రీ అనే కలం పేరుతో మానాన్నగారైన శ్రీ బసవలింగం గారు అనేక రచనలు చేసారు. జనమిత్ర అనేది ప్రాంతీయ వారపత్రిక . ఫ్రెంచ్ కాలనీగా ఉండిన యానాన్ని 1954 లో భారతావనిలో విలీనం చేయటానికి జరిపిన ఉద్యమమంలో వీరు పాల్గొన్నారు. వీరు ఫ్రెంచ్ భాషోపన్యాసోపకులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. యానంలో ఉండే ఫ్రెంచ్ సిటిజన్లు ఫ్రాంసు తో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలను వీరు వ్రాసి ఇచ్చేవారు. "యానం చరిత్ర" అనే పుస్తకాన్ని వ్రాయడం మొదలు పెట్టి పూర్తవకుండానే పరమపదించారు. వీరి సేవలను పుదువై ప్రభుత్వం గుర్తించి "తెలుగురత్న" అనే బిరుదును ప్రధానం చేసింది.



No comments:

Post a Comment