Wednesday, December 4, 2019

Interview with GLN

ఏ చట్రమూ లేదనుకోవడం భ్రమ: లక్ష్మీ నరసయ్య
  బొల్లోజు బాబా
తెలుగు సాహిత్యరంగంలో  గుంటూరు లక్ష్మీనరసయ్య   పేరు తెలియని వారు ఉండరు.   లక్ష్మీనరసయ్య 1995లో సంకలనపరచిన ‘చిక్కనవుతున్న పాట’ అప్పట్లో ఒక సంచలనం. దళిత, బహుజన మైనారిటీ కవులను ఒక గొడుగుక్రిందకు తెచ్చి తెలుగు సాహిత్య చరిత్రను కొత్తపుంతలు తొక్కించారు.  ‘పదునెక్కిన పాట’ తో దళితబహుజన వాదం పదును తేలింది.
‘దళితసాహిత్యం-తాత్విక దృక్పథం’ అనే గ్రంధం ద్వారా లక్ష్మినరసయ్య  దళితబహుజన సాహిత్య దృక్పథానికి తాత్విక నేపథ్యాన్ని అందించారు.  ఈ క్రమంలో దళితబహుజన వాదాన్ని, మార్క్సిజాన్ని, “దేశీయమార్క్సిజం” పేరుతో సమన్వయపరచటానికి చేసిన ప్రయత్నం గొప్పది.  ఇవన్నీ ఒక ఎత్తు అయితే లక్ష్మీనరసయ్యను ఆధునిక సాహిత్యవిమర్శకునిగా నిలబెట్టినవి 1994 నుంచి 99 వరకూ ఆంధ్రజ్యోతిలో కాలమ్స్ గా వ్రాసిన “కవిత్వ నిర్మాణ పద్దతులు”, “సామాజిక కళావిమర్శ” వ్యాసాలు.  వీటిని ఆ పేర్లతోనే ఇటీవల పుస్తకాల రూపంలో తీసుకొనివచ్చారు.
వ్యక్తిగత కారణాలతో లక్ష్మీనరసయ్య దాదాపు రెండు దశాబ్దాలపాటు “పెన్ను మూసినా”  ఆధునిక కవిత్వ ధోరణుల అధ్యయనాన్ని ఆయన కొనసాగించారనే విషయానికి “కవిసంగమం” లో రెండు సంవత్సరాలుగా రాస్తున్న “కవిత్వంలో చర్చనీయాంశాలు” వ్యాసపరంపరే సాక్ష్యం.  తెలుగు సాహిత్యానికి, విమర్శకు కొత్త టానిక్ ఎక్కించిన లక్ష్మినరసయ్యతో  మాటామంతి……
***
ప్రశ్న:  లక్ష్మీనరసయ్యగారు నమస్తే.   తెలుగుయూనివర్సిటీ పురస్కారం లభించటం పట్ల ముందుగా మీకు  హృదయపూర్వక అభినందనలు. విమర్శకునిగా, కవిగా తెలుగు సాహిత్యాన్ని మీరు సుసంపన్నం చేసారు.  కొన్ని కీలక మలుపులకు మీరు కేంద్రబిందువుగా, సాక్షిగా ఉన్నారు.  మీ నేపథ్యాన్ని, సాహితీప్రస్థానాన్ని వివరించండి.
జ:       మాది తెనాలి దగ్గర మండూరు అనే గ్రామం. కవి శివారెడ్డి గారి ఊరికి మైలు దూరం. పేద మంగలి కులంలో పుట్టాను.  నాన్న లోకల్ సీపీఐ నాయకుడు. బాబాయ్ సీపీఎం కార్డుహోల్డర్.
మండూరులోనూ, పక్కనే ఉన్న కూచిపూడిలోనూ స్కూల్ విద్య పూర్తయింది. స్కూల్లో చదువుకుంటూనే కులవృత్తి చేసేవాడ్ని. ఆ అనుభవాల అవమానాలు ఇప్పటికీ కలుక్కుమంటూనే ఉంటాయి. క్లాస్మేట్లకు క్షవరాలు చేసిన అనుభవాలు మరీనూ. తెనాలి VSR కాలేజీలో ఇంటర్ పూర్తయింది. అక్కడే విప్లవ ఉద్యమాల వైపు ఆకర్షితుడ్ని అయ్యాను.  గురువు గారు వర్ధనరావు గారు నా విప్లవ కార్యాచరణకు దారులు వేసినా ముందునుంచే మా ఊళ్ళో, మా యింట్లో ఉన్న కమ్యూనిస్ట్ వాతావరణం అందుకు కావాల్సిన పునాదులు వేసింది.
అక్కడినుంచీ యూనివర్శిటీ చదువు వరకూ మావోయిస్టు ఉద్యమాల్లో పాలు పంచుకున్నాను.  యూనివర్సిటీ రోజుల్లోనే కవిత్వం రాయటం మొదలు పెట్టాను.
నిదురపోవడం కోసం ఆయుధం అనవరతం మేలుకొని ఉండాలి
విశ్రాంతి కోసం ఆయుధం వినమ్రంగా శ్రమించాలి
నీడకోసం ఆయుధం ఎండల వర్షాన్ని కురిపించాలి
ఇలా సాయుధపోరాటాన్ని సమర్థిస్తూ శ్రీశ్రీ, శివసాగర్, చెరబండ రాజు, శివారెడ్డి ల ప్రభావంతో కవిత్వం రాయటం మొదలు పెట్టాను. అన్ని పత్రికల్లోనూ కవిత్వం అచ్చయ్యేది.
విప్లవ పార్టీల చీలికలు, దేశవ్యాపిత అంబేడ్కరిస్టు ఉద్యమాలూ, కారం చేడు మారణహోమం నుంచి పెల్లుబికిన దళిత ఉద్యమాలూ, ప్రత్యేకించి నా మిత్రుడు ఇంగిలాల రామచంద్ర రావు(RC) ప్రభావం  నన్ను అంబేడ్కరిస్టుగా , దళిత వాదిగా మార్చాయి.  దళితవాదకోణం నుంచి సామాజిక, సాహిత్యవ్యాసాలు రాయడం మొదలు పెట్టాను.  కవిత్వాన్ని తగ్గించి సాహిత్య సిద్ధాంతాల గురించీ, సాహిత్య విశ్లేషణ గురించీ రాస్తున్న నాకు త్రిపురనేని శ్రీనివాస్ తోడు గొప్ప ఊతాన్ని ఇచ్చింది. ఈ పరిణామంతో దళిత సాహిత్య ఉద్యమాన్ని పాదుకొల్పే పని మొదలెట్టాం.  దాని ఫలితమే 1995లో ‘చిక్కనవుతున్న పాట’ దళిత కవితా సంకలన ఆవిర్భావం.  తెలుగు సాహిత్య చరిత్రలో పీడిత కులస్తులూ, ముస్లింలూ ఒకటిగా గుమిగూడి అగ్రకుల హిందూ ఆధిపత్యాన్ని కవిత్వపరంగా  బోనులో నిలదీసిన పుస్తకమది.  అది లేవ దీసిన చర్చా, సృష్టించిన సంచలనం ఒక ప్రత్యామ్నాయ సాహిత్యానికి దారితీసింది.  అదే సంవత్సరం మద్దూరి నగేష్ బాబు, తెరేష్ బాబు, ఖాజాలతో కలిసి ‘నిశాని’   అనే పేరుతో ఒక పుస్తకం తెచ్చాం.  1996లో ‘పదునెక్కిన పాట’ ను మరింత లోతునీ విస్తృతినీ పొందుపరచి తీసుకొచ్చాం.  విజయవాడ, నల్గొండ, హైద్రాబాద్ ల కేంద్రంగా ఈ ఉద్యమం కనీ వినీ ఎరుగని స్థాయిలో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సాహితీవేత్తల్ని ఒక వేదిక మీదికి తెచ్చింది.  ఇవ్వాళ ప్రముఖ దళిత బహుజన కవులుగా పేరుగాంచిన వారందరినీ ఆనాడు ఈ ఉద్యమం ప్రభావితం చేసింది.  తెలుగు సాహిత్యంలో అంబేడ్కరిజాన్ని నెలకొల్పింది.  ఇలాంటి ఉద్యమానికి నేను సెంటర్ పాయింట్ గా వుండే అవకాశం నాకు దక్కింది.  దళిత సాహిత్యోద్యమంలో పనిజేసే వ్యవధి కోసం హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తున్న PhD ని సంతోషంగా వదిలేశా. దళిత సాహిత్య దిక్సూచిగా పని చేశా.
ఇదిలా ఉంటే నేను విప్లవ కవిత్వాన్ని సొంతపేరు తోనే రాసినా, దళితకవిత్వాన్ని మాత్రం వరదయ్య అనే కలం పేరుతో రాశా.  వరదయ్య కవిత్వాన్ని సాధారణ పాఠకులు మనసారా ఆహ్వానిస్తే, పండితులు మాత్రం బెత్తాలతో దాడులు చేశారు.  దళిత సాహిత్య సిద్ధాంతాన్నీ, దళిత ఈస్థటిక్స్ భావజాలాన్నీ నిర్మించే క్రమంలో నేను పూర్తిగా సాహిత్య విమర్శకు షిఫ్టయిపోయి కవిత్వాన్ని తగ్గించాను.  ఆ తరవాతి చరిత్ర అందరికీ తెలిసిందే.  నేను PhD వదిలేసినా ఎన్నో PhD లకు సరిపడా వర్క్ చేయగలిగాననే సంతృప్తి పొందగలిగాను.
1999 లో ‘దళిత సాహిత్యం- తాత్విక దృక్పధం’ పుస్తకం తెచ్చాను.  దాదాపు అన్ని పత్రికల్లో వందల సంఖ్యలో వ్యాసాలు రాశాను. ఆంధ్రజ్యోతిలో’  కాలమ్’ రాశాను.  ఆ రోజుల్లో అదొక సంచలన ‘కాలమ్’.   నేను రాసిన వ్యాసాలను సమర్థిస్తూనో , విమర్శిస్తూనో వచ్చిన వ్యాసాలూ ఎక్కువే. అలాంటి వ్యాసాల్ని నా వ్యాసాలతో సహా  ‘దళితవాద వివాదాలు’ అనే పేరుతో  ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీ VC గా ఉన్న SV సత్యన్నారాయణ గారు ఒక పుస్తకంగా తీసుకొచ్చారు.
ప్రస్తుతం నా సాహిత్యాచారణా సామాజిక ఆచారణా అందరికీ తెలిసిందే. విమర్శతో పాటు కవిత్వమూ ఒక పక్క రాస్తున్నాను.
ప్రశ్న:  ఒక మామూలు వచనం కవిత్వంగా మారటానికి దోహదపడే అంశాలలో ముఖ్యమైనవి ఏమిటని మీరు భావిస్తారు?
జ. కవి ఆలోచనలన్నీ, భావాల్నీమామూలు వచనం అనుభవాలుగానో అనుభూతులుగానో ఉద్వేగాలుగానో రూపొందించగలిగినపుడు కవిత్వమౌతుంది. వచనం ఈ పని చేసే క్రమంలో ఎదో ఒక కవిత్వ నిర్మాణ కళా వ్యూహాన్నీ, ఊహనీ ఆశ్రయిస్తుంది. భాష అక్కడ నామినల్ పాత్రనే నిర్వర్తిస్తుంది.
“నిద్రపోతున్నా కూడా
ఒక కాలూపుతూనే వున్నాను
లేదంటే చచ్చిపోయిన మనిషనుకొని
ఇక్కడ అవతలికి విసిరికొడతారు”
ఈ వ్యక్తీకరణలో ఉన్నది మామూలు వచనమే. కవిత్వభాషగా చలామణిలో ఉన్నదేదీ ఇక్కడ లేదు. ఐనా ఇది కవిత్వం అయ్యింది. హృదయాన్ని చెమ్మగిల్లించే అనుభవాన్ని లేక ఉద్వేగాన్నీ రూపొందించింది. ఎదో ఒక పని చేస్తూనో చేస్తున్నట్లు నటించుతూనో కనపడాల్సిన దుస్థితి తెచ్చిన వత్తిడిని పాఠకుల్లో పలికించగలిగింది. మామూలు వచనం ఆ పని ఎందుకు చేయగలిగింది. కవి ఆలోచనని తదనుగుణమైన నిదర్శనం ద్వారా చూపించటం వలన. నిద్రపోతూ కూడా కాళ్ళూపటం పనిచేస్తున్నట్లుగా కనబడటానికి చెందిన వత్తిడికి నిదర్శనం అని వేరే చెప్పక్కర్లేదు. ఇందులోని నిదర్శనాత్మకతని తీసేస్తే ఇది కవిత్వం అయ్యే అవకాశం లేదు. ఈ నిదర్శనాత్మకతనే మనమిక్కడ కవిత్వనిర్మాణ పద్ధతి అంటున్నాం. ఇలాంటి విభిన్న నిర్మాణాలు అనేక మంది కవుల కవిత్వంలో అనేకంగా కనిపిస్తాయి.ఇక్కడ నిదర్శనాత్మకత ఉన్నట్లే మరొకచోట విరోధభాసాత్మకత ఉండొచ్చు. ఇంకొక చోట misplacement ఉండొచ్చు, అపరిచయీకరణాత్మకత ఉండొచ్చు. ఇలా అసంఖ్యాకంగా నిర్మితమయ్యే కళా వ్యూహాలు వచనాన్ని కవిత్వంగా నిలబెడతాయి. ఇక ఈ నిర్మాణాల్ని నిర్మించటంలో కవి ఊహా, కళాత్మకతా తరగని వనరులుగా వుంటాయని మీకు తెలుసు.
నా చీకటితో సూర్యుడికళ్లకు గంతలు కట్టాను
 పచ్చని కండువాతో
చెట్ల కళ్ళకు గంతలుకట్టి
నన్ను కనుక్కోమన్నాను
మేఘాల ముక్కలతో పక్షులకు గంతలు కట్టి
నన్ను కనిపెట్టమన్నాను
 ఒక నవ్వుతో
నా బాధకు గంతలు కట్టాను
ఇలా సాగిన కవితలోని ఊహా బలం , personification (మానవ గుణారోపణ) ఫక్తు వచనాన్ని ఎలా కవిత్వం చేసిందీ తెలుసుకోవటం కష్టం కాదు.
మీరు వ్రాసిన కవితానిర్మాణ పద్ధతులు, సామాజిక కళా విమర్శ పుస్తకాలు వచ్చినపుడు ఒక ఉద్యమ నేపథ్యం చాలా బలంగా ఉండింది. ఇప్పుడు కవిత్వ  వ్యక్తీకరణ, వస్తువు మారాయి.  అప్పటికీ ఇప్పటికీ మీ అభిప్రాయాలలో వచ్చిన మార్పులేమైనా చెపుతారా?
జ.  ఉద్యమాలు వున్నా ఉద్యమాలు లేకపోయినా కవిత్వం కవిత్వం కావటానికిచెందిన కళా కారణాలు నిర్మాణపద్ధతులకు చెందినవే. భాషా పాండిత్యం కవిత్వానికి అదనపు వనరేకానీ అసలైన వనరు కాదని నిరూపిస్తూ ఇప్పటికే ఒక పుస్తకానికి సరిపడ వ్యాసాలు నేను రాశానని మీకు తెలుసు.
ఉద్యమాలు ఇప్పుడు లేవనే మాట కూడా కరెక్ట్ కాదు. మనకలవాటైన పద్ధతిలో లేకపోవచ్చు. కొత్త కొత్త రూపాల్లో ఊపిరి పీలుస్తూనే ఉన్నాయ్.  GST కి వ్యతిరేకంగా, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా, కుల హత్యలకు వ్యతిరేకంగా, విషవాయువుల కర్మాగారాలకు వ్యతిరేకంగా, బిగ్ డ్యామ్ రాజకీయాలకు వ్యతిరేకంగా, జెండర్ వివక్షకు వ్యతిరేకంగా, అక్రమ మైనింగ్లకు వ్యతిరేకంగా, గ్లోబలైజేషన్ కు వ్యతిరేకంగా ,  మతోన్మాద మూకుమ్మడి దాడులకు వ్యతిరేకంగా, హిందూత్వ బూటకపు దేశభక్తికి వ్యతిరేకంగా  అభివృద్ధి పేరుతో జూలు విప్పిన విధ్వంసంకూ, నిర్వాసిత్వానికీ వ్యతిరేకంగా  జరుగుతున్న పోరాటాలూ, ఆందోళనలూ ఉద్యమాలు కావని ఎలా అనగలం. మునుపటి ఉదృతి లేని మాట నిజమేగానీ అసలు ఉద్యమాలే లేవని అసలేం. ప్రస్తుత కవిత్వంలో పైన నేను ప్రస్తావించిన అన్ని అంశాల ప్రతిఫలనం ఉంది. కొంత నిరాశ ఉంది. కొంత ఆశ ఉంది. రెండిటి మధ్య ఊగిసలాట కూడా ఉంది. కన్నీళ్ళు పెనవేసుకున్న కోపం ఉంది. దిక్కుతోచని తనమూ ఉంది, దిక్కులు పిక్కటిల్లే ఆక్రోశమూ ఉంది. ఫాల్స్ ఆశల హడావిడి తగ్గింది.
వ్యక్తీకరణ రీత్యా కూడా ఈ ద్వైదీయత కొట్టొచ్చినట్లు కనబడుతుంది.  ఒకపక్క విపరీత రూప శ్రద్ధ, మరొక పక్క విషయాన్ని కవిత్వం చేయడంలోని అశ్రద్ధ చూడొచ్చు.  అన్సెంటిమెంటల్ అల్లిక తో , వింత వ్యూహాలతో నూతన తరహా నిర్మాణాల్ని ముందుకు తీసుకురావడమూ చూడొచ్చు.  అకళా, అతికళా పక్కపక్కనే నడవటమూ గమనిస్తాం. స్ట్రీట్ ఇడియమ్ తో, నేలబారు పలుకుబడితో ఒక ప్రాక్టికల్ ఆదర్శవాదాన్ని అనుభవాల్లోకి తర్జుమా చేయడం, చట్రాల్లో ఇమడని చిత్ర వ్యక్తీకరణను పండించటం ఈనాటి కవిత్వంలో  అందరితోపాటు నేను చూస్తున్నా.
ప్రశ్న:  పోస్ట్ మోడర్నిజం అంతమై మెటా మోడర్నిజం ప్రారంభమయింది అని ప్రపంచం గుర్తిస్తోంది. అన్ని రంగాల్లో ఒక పారాడిమ్ షిఫ్ట్ మొదలైంది.   తెలుగు సాహిత్యంలో   మెటా మోడర్నిజం ధోరణులను మీరెలా గుర్తిస్తున్నారు ?
జ:  మెటామోడర్నిజం మీరు చెబుతున్నట్లుగా ప్రపంచం గుర్తించే స్థాయికి ఇంకా రాలేదు.  పోస్ట్ మోడర్నిజం అన్నిటినీ నిరాకరిస్తే మెటా మోడర్నిజం గోడమీద పిల్లివాటాన్ని తత్వం అంటుంది. ఊగిసలాటనే (oscillation) పరమ సత్యంగా ప్రచారం చేస్తుంది.  డిజిటల్ సంస్కృతీ ప్రభావంతో, ఆక్యుపై, బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమాల నేపథ్యంలో ముందుకొచ్చిన ప్రాక్టికల్ ఐడియలిజెమ్ ని ఆహ్వానిస్తోంది.  నిజానికి ఈ ప్రాగ్మాటిక్ ఆదర్శవాదం ఆధునికతలోని ఒక పాయ. John Dewey ఈ వాదానికి ఆద్యుడు.  ఆ పేరుతో పిలవలేదు గానీ మన దేశంలో పూలే, Dewey కంటే ముందే దీన్ని ప్రతిపాదించాడు.  అంబేడ్కర్ సిద్ధాంతం ఆచారణా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రాక్టికల్ ఆదర్శవాదాన్ని వాటిలో గమనిస్తారు.  పూలె, అంబేడ్కర్లు  పిడి వాదం లేని ఆధునిక వాదులు.  ఇలా 2010 తరువాత బయలుదేరిన ఈ మెటామోడర్నిజమ్ 19 వ శతాబ్దంలొనే పురుడుపోసుకున్న ఆధునికతలోని ఒక పాయను  తనే కనిపెట్టినట్లు చెబుతుంది. ఇది గమనించకుండా అదేదో కొత్త తాత్వికతను మోసుకొచ్చినట్లు భ్రమపడి దాన్ని తెలుగులో అనువర్తింపజేసే పాట్లు మనం పడక్కర్లేదు. మెటామోడర్నిజం ప్రతిపాదిస్తున్నట్లుగా కొంతమంది భ్రమపడే ఊగిసలాట తత్వం కూడా కొత్తదీ కాదు, పురోగామీ కాదు. లిక్విడ్ మోడెర్నిటీ పోస్ట్ మోడెర్నీటీలో భాగమైనట్లే మెటామోడర్నిజం మోడ్రనిజంలోని ఒక చిన్న పాయను పునఃప్రతిష్టించే బలహీన ప్రయత్నం చేసింది. Timotheus Vermuelen, రాబిన్ వాన్ డెన్ అక్కర్, Luke Turner లు పోస్టుమోడెర్నిజమ్ తో తలపడిన క్రమంలోనే ఈ మెటామోడెర్నిజమ్ ను ప్రతిపాదించారని తెలిస్తే దానిగురించిన భ్రమలు ఎగిరిపోతాయ్.
ప్రశ్న:  ఒక కవి దళితునిగానో, బహుజనుడిగానో లేదా మార్క్సిజ అభిమానిగానో ఉంటే ఆ చట్రంలోనే కవిత్వం వ్రాయాలా? తన జీవితంలో ఉండే సమాజము, ప్రకృతి, మానవసంబంధాలు, మనో వేదనల పట్ల రాయటం వల్ల ముందుగా తనకు తాను విముక్తుడు అవుతున్నాడు అనుకోవచ్చు కదా?
జ:  ఏ చట్రంలో లేకుండా రాస్తున్నామనుకోవటమూ ఒక భ్రమే. అన్ని చట్రాలకూ అతీతంగా వుండాలనుకునేవారూ, వుంటున్నామనుకునేవాళ్ళూ ఆధిపత్య చట్రాల్లో, పాలక చట్రాల్లో ఇరుక్కుని వుంటారు. ఆ చట్రాల్లో కంఫర్ట్ కూడా పొందుతూ వుంటారు. కనుక చట్రాలకతీతం అనుకోవడంలో పురోగామీ ధోరణి కానీ తిరుగుబాటుకానీ ఏమీలేదు. పోస్ట్ మోడర్ణిస్టులకూ, మెటామోడర్నిస్టులకూ ఇది వర్తిస్తుంది. ప్రజల పక్షాన, బలహీనుల పక్షానా, అణచబడుతున్న వాళ్ళ పక్షాన ఉండటం చట్రాల్లో ఇరుక్కోడం కాదు. ఏ చట్రాల్లో లేమనే భ్రమతో అణచివేత శక్తుల వలలో ఉండటమే పెద్ద చట్రంలో ఇరుక్కోవడమవుతుంది.
ఏ కవైనా రచయితైనా తన కుల వర్గ మత లైంగిక ప్రాంత నేపథ్యాలకు ఆరోగ్యకర ప్రతినిధిగా రాయటం సహజ విషయమే కానీ అసహజ విషయమేమీ కాదు. వాటికి చెందిన వాస్తవికతని చూడనట్లుగా నటించటంలో, వాటికి సంబంధించిన అసమానత్వాల అన్యాయాల మకిలిని ఉపేక్షించటంలో వంచనైనా ఉండాలి, ఆత్మ న్యూనతయినా ఉండాలి. కవులూ రచయితలూ మనుషులుగా విముక్తిపొందటమంటే మానవ సంబంధాలను పట్టి పీడిస్తున్న కల్మషాలను కడిగే ప్రక్రియల్లో భాగమై, భాగమయ్యామనే సంతృప్తిని అనుభవించడం.
అలా అని వ్యక్తివాద ధోరణిలో రాయడం, ఆధ్యాత్మిక సందిగ్ధాల్లో నలగడం, అనుభూతి ప్రధానంగా సృజన చేయడం నేరమని నేను అనను. అలా రాసి గొప్ప సాహిత్యాన్ని సృష్టించటం అసాధ్యం. మన తీరికకీ, ఓపికకీ, బతుకుతెరువుకీ కారణమైన సమాజ అల్లకల్లోలాల్నీ, అసమంజసతనీ పట్టించుకోవడంలోనే మన అసలైన విముక్తి ఉంది. దాన్ని పక్కన బెట్టి ఎంత confess చేసినా అది విముక్తి అనే భ్రమనే తప్ప విముక్తి కాజాలదు.
ప్రశ్న:  తెలుగు సాహిత్యవిమర్శనా రంగాన్ని భూమార్గం పట్టించటంలో మీరు పోషించిన పాత్ర చారిత్రాత్మకమైనది. దళితబహుజన సాహిత్యోద్యమనిర్మాణానికి పునాదిని ఏర్పరచారు.  ఎంతో మానసిక దృఢత్వం లేకపోతే ఇది సాధ్యం కాదు.  అప్పట్లో మీరు కొంతకాలం రాయకపోతే,   అస్త్రసన్యాసం చేసారా అని మేమంతా అనుకొన్నాం.  మళ్ళీ నేడు మీరు రెట్టించిన బలంతో ఉత్సాహంతో యువకవులతో పోటీపడుతున్నారు. ఫీనిక్స్ పక్షిలా పైకి లేచారు.   ఈ మీ ప్రయాణంలో మీకు సహాయపడిన వ్యక్తులను గురించి, మీకు అభ్యంతరం లేకపోతే మీ మౌనానికి కారణమైన పరిస్థితులను గురించి చెప్పండి.
జ:  కొన్ని పరిస్థితుల్ని జీర్ణించుకోలేకపోయాను.కొన్ని వత్తిడుల్ని(లోపలివీ, బయటివీ) తట్టుకుని నిలబడలేకపోయాను. నాలోని పోరాడే స్వభావాన్నీ ఫీలయ్యే స్వభావం తాత్కాలికంగా కొంతకాలం మింగేసి ఉండొచ్చు. అందుకే కొన్నాళ్ళు రాయలేదు. సామాజిక సాహిత్య కార్యాచరణల్ని తెలియకుండానే బంద్ చేశాను. చదువుతూ, పరిశీలిస్తూ ఉండిపోయాను. నేను నిశ్శబ్దంగా ఉండటం చాలామందికి నచ్చలేదు. కొంతమందికి అది చాలా అనందాన్నీ పెద్ద రిలీఫ్ నీ ఇచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రసాదమూర్తి నన్ను వెతికి పట్టుకొని రాయమని ప్రాధేయపడేవాడు. మొదట్నుంచీ మిత్రుల్ని అంటిపెట్టుకుని వుండే తత్వం నాకు ఉండేది కాదు. నేను తప్పిపోయిన ప్రతిసారీ నన్ను వెతికి పట్టుకునే స్నేహితులు కొంతమంది ఉండేవారు. వారిలో ప్రసాదమూర్తి ముఖ్యుడు. వాడు నన్ను వెంటాడి వేధించి ఒప్పించి ఉత్తేజపరిచి మళ్లీ రంగంలోకి దింపాడు. తాను పనిజేసే 10tv లో దాదాపు వంద సాహిత్య ఎపిసోడ్లలో నన్ను మాట్లాడించాడు. దళిత బహుజన కవులూ, రచయితలమీదే కాక మిగిలిన ప్రగతివాద రచయితలమీద నాచేత మాట్లాడించాడు. ఆ ఎపిసోడ్స్ అన్నీ గ్రాండ్ సక్సెస్.  మరో పక్కనుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్స్ నన్ను ఇలాగే వెతికి పట్టుకొని తరచూ కలుస్తూ ఉండేవారు. ముఖ్యంగా గంధం అరుణ, రవీంద్ర బాబు నాపుస్తకాలు వేస్తామనీ, అనుమతి ఇవ్వాల్సిందనీ పదే పదే అడుగుతూ ఉండేవారు. మొదట్లో నేను పట్టించుకునేవాడ్ని కాదు.  రాను రానూ వాళ్లలో చిత్తశుద్ధి, సీరియస్ నెస్ నాకు నచ్చి సరే అన్నాను. వెనువెంటనే  పూనుకొని 2015 లో నావి రెండు పుస్తకాలు వాళ్ళు పబ్లిష్ చేశారు. 1. కవిత్వ నిర్మాణ పద్ధతులు, 2. సామాజిక కళావిమర్శ.  నేను గతంలో కొన్ని సంవత్సరాలపాటు ఆంధ్ర జ్యోతి దినపత్రికలో  కాలంగా ప్రతి ఆదివారం రాసిన వ్యాసాలనుంచే వారు ఆ పుస్తకాలు తెచ్చారు. నా పుస్తకాలు వచ్చిన సందర్భంగా నా పునరాగమనాన్ని ‘లక్ష్మీనరసయ్య రెండవరాకడ ‘అని అభివర్ణిస్తూ ఆంధ్రజ్యోతిలో కే. శ్రీనివాస్ నా ఇన్టర్వ్యూ ప్రచురించారు. 10 టీవీ లో స్వయంగా ప్రసాదమూర్తే నన్ను ఇంటర్వ్యూ చేశాడు. సాక్షి లో పూడూరి రాజిరెడ్డి నా రచన గురించి ఒక  రైట్ అప్ కూడా వేశారు. అలా మళ్లీ రాయడం మొదలుపెట్టాను. తిరగటం మొదలుపెట్టాను. దాదాపు అన్ని పత్రికల్లోనూ నా రచనలు, కవితలూ ముమ్మరంగా  రావటం మొదలయ్యింది. పత్రికల్లోనే గాకుండా  ఫేస్బుక్ లో కూడా ముమ్మరమయ్యాను. పాత మిత్రులు తిరిగి దగ్గరయ్యారు. కొత్త మిత్రులూ, యువ మిత్రులూ పరిచయమయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే నా మిత్రుడు స్కైబాబా నన్ను కవి యాకూబ్ నడిపే కవిసంగమంలో రిజిస్టర్ చేశాడు. నిజానికి 1990లలోనే నాకు యాకూబ్ తో పరిచయం  ఉండేది. కవి సంగమంలో మళ్లీ కలిశాం. ఎప్పట్లాగే యాకూబ్ నన్ను అక్కునజేర్చుకుని ప్రోత్సహించాడు.  నన్ను ఒప్పించి కవి సంగమం లో  నాచేత  కాలం రాయించేదాకా వదల్లేదు. తరువాతి ఆచరణ అందరికీ తెలుసు.
కవి సంగమం తరవాత సారంగ కూడా ఇప్పుడు నాకొక వేదికయ్యింది. అఫ్సర్ తో నాకు దరిదాపు పాతికేళ్ల అనుబంధం. తాను విజయవాడ ఆంధ్రభూమిలో పనిచేసేప్పటినుంచీ. బహుశా కవిగా, విమర్శకుడిగా నా ప్రయాణంలోని అన్ని దశలూ తెలిసిన తక్కువ మంది మిత్రుల్లో అఫ్సర్ ఒకడు. అప్పట్లో విజయవాడలో త్రిపురనేని శ్రీనివాస్, అఫ్సర్, ఖాదర్,  కె.శ్రీనివాస్, ప్రసేన్, తిరుపతిరావు మొదలైనవాళ్ళం ఎక్కువగా కలుస్తుండే వాళ్ళం. విపరీతమైన చర్చలు జరుగుతూ ఉండేవి. అఫ్సర్ నా ఆలోచనల్ని బాగా ప్రోత్సహించేవాడు. కట్ చేస్తే, మళ్లీ సారంగ మలి ప్రయాణం నాటికి ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ లోకి  వచ్చాం.ఫేస్బుక్ అనేకంటే కవి యాకుబ్ నేతృత్వంలోని కవిసంగమం అనడం మేలు.హైదరాబాద్లో కలిశాం.’కధా నిర్మాణపద్ధతులు’మీద నేను కాలం మొదలుపెట్టేవరకూ ఊరుకోలేదు. ఫలితంగా కథా నిర్మాణపద్ధతులు ‘కథలోపలి కథ’గా ఇప్పటికి 5 భాగాలు సారంగలో వచ్చాయి.ఇంకా వస్తాయి.
ప్రశ్న:  ఇప్పుటి యువకులు వ్రాస్తున్న కవిత్వంలో మీరు గుర్తించిన, నిలిచిపోయే లక్షణాలు ఏమిటి అని మీరు భావిస్తున్నారు.   యువకవులకు మీరు ఏం సూచించ దలచుకొన్నారు.
జ: యువకవులు చాలామంది సీనియర్ కవులకంటే బాగానే రాస్తున్నారు. సీనియర్ కవులకు అలవాటులేని, సీనియర్ కవులు అలవాటు పడని పద్ధతుల్లో కవిత్వం చేస్తున్నారు. వేగంగా  సమాజంలో వస్తున్న మార్పుల్లోని వైరుధ్యాల్ని పట్టుకోవడంలో యువకవులు సక్సెస్ అవుతున్నారు. రోల్ మోడల్స్ లేని జీవితాల్ని జీర్ణించుకోలేని బాధనీ అగ్రహాన్నీ వ్యక్తంచేస్తున్నారు. ఫలితంగా విషాదాన్నీ విదూషకత్వాన్నీ కలగలిపిన కవితా స్వరాల్ని పూరిస్తున్నారు. ఆర్డినరీ అనుభవాల్ని ఆధ్యాత్మిక పజిల్స్ గా రూపొందించే ధోరణి గూడా కొంతమందిలో కనబడుతుంది.
అయితే ఫేస్ బుక్ అవసరాల రీత్యా రోజూ ఏదో ఒక కవిత రాయాలానే టెంప్టేషన్ నుంచి కొంత మంది బయటపడాల్సుంది. విషయం కవితగా మారే క్రమాన్ని తుదికంటా కొనసాగించకపోవడం వల్ల ఉడకని అన్నం మెతుకుల్లాంటి కవితలు రాస్తున్నారు కొంతమంది. పచ్చి కాయల్నే పండ్ల లా పాఠకులికి పంచితే ఏం జరుగుతుందో వీరు తెలుసుకోవాలి. అలాగే గుచ్చుకుంటున్న ముల్లుని  ఉపేక్షించి ముల్లే కానిదాన్ని ముల్లుగా  గుచ్చుకుంటున్నట్లు విలపించే తత్వాన్ని కొంతమంది యువకవులు వదులుకోవాలని నా అభిప్రాయం.
ఇంటర్వ్యూ  : బొల్లోజు బాబా
సారంగలో లక్ష్మీనరసయ్య పేజీ ఇక్కడ

రూములు రెంట్ కి ఇచ్చే అందమైన అమ్మాయి - by Charles Bukowski

రూములు రెంట్ కి ఇచ్చే అందమైన అమ్మాయి - by Charles Bukowski
న్యూ ఓర్లియాన్స్ నగరంలో అద్దెకు గది చూపించింది
ఓ అందమైన అమ్మాయి.
చీకటిగా ఉందాచోటు
చాలా దగ్గరగా నిలుచున్నాం మేం
"ఈ గదికి వారానికి నాలుగున్నర డాలర్ల అద్దె" అందామె
"నేను సాధారణంగా మూడున్నర చెల్లిస్తూంటాను" అన్నాను
ఆమెను అప్పుడప్పుడూ చూస్తుండొచ్చుకదా అని
నాలుగున్నర చెల్లించటానికి నిర్ణయించుకొన్నాను
ఆ అమ్మాయి లాగే , స్త్రీలు ముందుగా తాము చొరవచూపరెందుకో అర్ధంకాదు
మననుంచి ఆశిస్తారు
చివరకు నేనే "రూము తీసుకొంటాను" అని చెప్పి డబ్బులు చెల్లించాను
దుప్పట్లు మురికిగా ఉన్నా, మంచం సర్ది లేనప్పటికీ
నేను అస్కలిత యవ్వనస్తుడను
కంగారులో ఉన్నాను కూడా
డబ్బులు తీసుకొని
తలుపు వేసి వెళిపోయిందామె.
రూములో టాయిలెట్ లేదు
సింకు లేదు, కిటికీ కూడా లేదు
రూమంతా ఆత్మహత్య, మృత్యువులతో తడితడిగా ఉంది
మంచంపై పడుకొన్నాను
అక్కడొక వారం ఉన్నాను
హాల్ లో చాలామందిని కలిసాను
ముసలి తాగుబోతుల్ని
ఉపశమనం పొందుతున్నవారిని
పిచ్చివాళ్లని
చురుకైన పడుచువాళ్లను
జబ్బైన వృద్ధులను
కానీ
ఆ అమ్మాయిని మాత్రం మరలా చూడలేదు
చివరకు
అక్కడనుంచి మరొక చోటుకు మారాను
వారానికి మూడున్నర డాలర్ల బాడుగ
అందవిహీన నేత్రాలు, ముడుతలు పడిన చర్మంతో
డబ్బై అయిదు ఏండ్ల వయసున్న స్త్రీ నడుపుతోంది ఆ చోటును
అక్కడ ఏ సమస్యా లేదు
సింక్ ఉంది
టాయిలెట్ ఉంది
రూమ్ కు కిటికీ కూడా ఉంది.
మూలం: the pretty girl who rented rooms by Charles Bukowski

అరాజకీయ మేథావులు ...... Apolitical Intellectuals by Otto Rene Castillo

అరాజకీయ మేథావులు ...... Apolitical Intellectuals by Otto Rene Castillo
ఏదో ఒక రోజు
సామాన్య జనం
రాజకీయ చైతన్యం లేని
నా దేశ మేథావులను ప్రశ్నిస్తారు
తమ సమాజం విస్మరింపబడి
చలిమంటలా క్రమక్రమంగా
ఆరిపోతున్నప్పుడు
మీరేం చేసారు అని ప్రశ్నిస్తారు
వారి దుస్తుల గురించి
సుష్టుగా భోంచేసిన తర్వాత
తీసే కునుకుల గురించి
ఎవరూ ప్రశ్నించరు.
"అంతా మిథ్య" అనే వారి
వ్యర్ధ వాదనల గురించి
ఎవరూ తెలుసుకోవాలనుకోరు.
వారి ఆర్ధిక శాస్త్ర నైపుణ్యం గురించి
ఎవరూ మాట్లాడరు.
గ్రీకు పురాణాల గురించి లేదా
వారిలోని ఒకడు చనిపోతుంటే
వారెలా అసహ్యించుకొన్నారో
అనే దాని గురించి ఎవరూ ప్రశ్నించరు.
పెద్ద అసత్యం నీడన పెంచిపోషించిన
వారి అర్ధంలేని సమర్ధనల గురించి కూడా
వారినేమీ ప్రశ్నించరు.
ఆ రోజు
అరాజకీయ మేథావుల పుస్తకాలలో
కవిత్వంలో ఏనాడూ ప్రస్తావింపబడని
సామాన్యజనం వస్తారు.
ఎవరైతే వారికి
రొట్టెలు పాలు గుడ్లు అందించారో
ఎవరైతే వారి దుస్తులు కుట్టారో
ఎవరైతే వారి వాహనాలను నడిపారో
ఎవరైతే వారి కుక్కలను, తోటలను సంరక్షించారో
వారికొరకే పనులు చేసారో
వాళ్లు వచ్చి ప్రశ్నిస్తారు
"నిరుపేదలు బాధపడినపుడు
వారినుంచి లాలిత్యము, జీవము
హరించుకుపోతున్నప్పుడు
మీరేం చేసారు"? అని.
నా ప్రియమైన దేశ
రాజకీయ చైతన్యం లేని మేధావులారా!
మీ దగ్గర సమాధానం ఉండదు.
నిశ్శబ్దమనే రాబందు
మీ పేగులను పీక్కుతింటుంది
మీ దీనస్థితి
మీ ఆత్మను క్షోభపెడుతుంది
ఆరోజు
మీరు సిగ్గుతో తలదించుకొంటారు
అనువాదం: బొల్లోజు బాబా
(Otto Rene Castillo గుటమెలా దేశానికి చెందిన విప్లవకారుడు, కవి)

ఒక పక్షి చిత్తరువు వెయ్యాలంటే -To Paint The Portrait Of A Bird by Jacques Prevert

ఒక పక్షి చిత్తరువు వెయ్యాలంటే -To Paint The Portrait Of A Bird by Jacques Prevert
మొదట ఒక పంజరాన్ని చిత్రించు
దాని తలుపు తెరిచుండాలి
తరువాత
ఆకర్షణీయమైనది ఏదైనా
అందమైనది ఏదైనా
ఉపయోగపడేది ఏదైనా
డాంబికము లేనిది ఏదైనా
పక్షికొరకు చిత్రించు
ఇపుడు ఆ కాన్వాస్ ను
ఏదైనా ఒక చెట్టువద్ద ఉంచు
తోటలోనో, వనంలోనో లేదా అరణ్యంలోనో.
ఇక ఆ చెట్టు వెనుక దాక్కో
ఏమీ మాట్లాడకు
ఏమాత్రం చప్పుడుచేయకు
ఒక్కోసారి పక్షి వెంటనే రావొచ్చు లేదా
రావటానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు
నిరాశ చెందకు
నిరీక్షించు
అవసరమైతే సంవత్సరాల తరబడైనా.
నీ చిత్తరువు యొక్క విజయం
అది తొందరగా వచ్చిందా లేక ఆలస్యంగా వచ్చిందా
అన్నదానిపై ఆధారపడి ఉండదు
పక్షి అంటూ వస్తే.
పక్షి వచ్చాకా
గంభీరమైన నిశ్శబ్దాన్ని పాటించు
అది పంజరంలోకి వెళ్ళేవరకు ఎదురుచూడు
లోపలకు వెళ్లగానే
కుంచెతో పంజరం తలుపు మృదువుగా మూసెయ్యి.
తరువాత
పంజరం ఊసల్ని ఒక్కొక్కటిగా చెరిపేయి
పక్షి ఈకలను ఏమాత్రం తాకకుండా చేయి ఆ పని
అలాగే ఓ చెట్టు బొమ్మను చిత్రించు
దాని అందమైనకొమ్మలలో ఒకదాన్ని
పక్షి కొరకు కేటాయించు.
ఇంకా పచ్చని ఆకులను, తాజా గాలులను
సూర్యకాంతి తుంపరలను, వేసవి మద్యాహ్నపువేళ
పచ్చికలోంచి వచ్చే కీటకాల శబ్దాలను కూడా చిత్రించు.
ఇక ఆ పక్షి గొంతువిప్పి పాడేవరకు ఎదురుచూడు
పాడలేదా! అది అశుభం
నీ చిత్తరువుకు అది అపశకునం
పాడిందా! అది చక్కని శుభసంకేతం
మెల్లిగా ఆ పక్షి ఈకనొకదాన్ని సేకరించు
కాన్వాసు కు ఒక మూల నీ పేరును రాసుకో!
మూలం: To Paint The Portrait Of A Bird
by Jacques Prevert (tr. John Dixon Hunt)
తెలుగు: బొల్లోజు బాబా

నాన్నతనం

నాన్నతనం
.
అమ్మతనాన్ని గుర్తించటం కొంచెం కష్టం కానీ
రోడ్డుపై అడుగడుగునా ఎదురయ్యే
నాన్నతనాన్ని సులువుగానే పోల్చుకోవచ్చు.
.
పార్కులో రెండుచేతుల్తో పీచుమిఠాయో
పల్లీలపొట్లాలో తీసుకెళ్తూ కనిపించవచ్చు.
.
సినిమా హాలులో రెండో మూడో కూల్ డ్రింకులో
ఐస్ క్రీములో మోసుకెళ్తూ ఎదురవ్వొచ్చు.
.
ఇంటికెళ్ళే వేళ స్వీట్ కొట్లోనో, ఫ్రూట్ షాపులోనో
ఏవో పొట్లాలు కట్టిస్తూ తారసిల్ల వచ్చు.
.
ఏ పేవ్ మెంటు మీదనో
స్కూల్ బేగ్గో, షూసో కుట్టిస్తూ కంటపడొచ్చు.
.
నాన్నతనాన్ని బజార్లో ఎక్కడున్నా
ఇట్టే గుర్తు పట్టేయవచ్చు
.
"సైజులు సరిపోకపోతే మారుస్తారు కదూ"
పిల్లల బట్టల షాపులో అంటూ ...
.
స్కూల్ విడిచాక వస్తూన్న పిల్లల గుంపులోంచి
"డాడీ" అన్న పిలుపు వచ్చిన వైపు అసంకల్పితంగా
చూసే అయిదారు జతల ఆతృత నేత్రాలలో....
.
"అన్నీ పట్టుకెళుతున్నావా" అని వందోసారి
అడుగుతూ ఎగ్జామ్ సెంటర్ వద్దనో...
.
ఎక్కడయినా సరే
నాన్నతనం తేలిగ్గానే దొరికిపోతుంది.
.
పిల్లలు కాలేజీ చదువులకై ఇల్లువిడిచాకా
వారి సెల్ ఫోన్లో ఒక నంబరుగా మిగిలిపోతుంది నాన్నతనం
.
శుభాకాంక్షల్ని, జాగ్రత్తలను క్రమం తప్పకుండా అందుకొంటూ.
.
అప్పుడు కూడా
.
.
పార్కు బెంచీపై కూర్చొని మిత్రులతో
కొడుకు సంపాదన, కోడలి మంచితనం
మనవల అల్లరిని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తూ
కనిపిస్తుంది.......... నాన్నతనం.........
.
.
కొన్ని నీటి పొరలేవో కంటికడ్డు పడినప్పటికీ
.
ఈ కవిత Bolloju Baba గారిది . నాకు నచ్చి మీకు పంచాలి అనిపించి ఇలా పంచుతున్నాను . అభినందనలు ఆయనకు చెప్పండి . ఆయన టైం లైన్ లో నుండి కిందటి ఏడాది కొట్టుకుని వచ్చాను .
.
అమ్మతనాన్ని గుర్తించటం కొంచెం కష్టం కానీ
రోడ్డుపై అడుగడుగునా ఎదురయ్యే
నాన్నతనాన్ని సులువుగానే పోల్చుకోవచ్చు.
.
పార్కులో రెండుచేతుల్తో పీచుమిఠాయో
పల్లీలపొట్లాలో తీసుకెళ్తూ కనిపించవచ్చు.
.
సినిమా హాలులో రెండో మూడో కూల్ డ్రింకులో
ఐస్ క్రీములో మోసుకెళ్తూ ఎదురవ్వొచ్చు.
.
ఇంటికెళ్ళే వేళ స్వీట్ కొట్లోనో, ఫ్రూట్ షాపులోనో
ఏవో పొట్లాలు కట్టిస్తూ తారసిల్ల వచ్చు.
.
ఏ పేవ్ మెంటు మీదనో
స్కూల్ బేగ్గో, షూసో కుట్టిస్తూ కంటపడొచ్చు.
.
నాన్నతనాన్ని బజార్లో ఎక్కడున్నా
ఇట్టే గుర్తు పట్టేయవచ్చు
.
"సైజులు సరిపోకపోతే మారుస్తారు కదూ"
పిల్లల బట్టల షాపులో అంటూ ...
.
స్కూల్ విడిచాక వస్తూన్న పిల్లల గుంపులోంచి
"డాడీ" అన్న పిలుపు వచ్చిన వైపు అసంకల్పితంగా
చూసే అయిదారు జతల ఆతృత నేత్రాలలో....
.
"అన్నీ పట్టుకెళుతున్నావా" అని వందోసారి
అడుగుతూ ఎగ్జామ్ సెంటర్ వద్దనో...
.
ఎక్కడయినా సరే
నాన్నతనం తేలిగ్గానే దొరికిపోతుంది.
.
పిల్లలు కాలేజీ చదువులకై ఇల్లువిడిచాకా
వారి సెల్ ఫోన్లో ఒక నంబరుగా మిగిలిపోతుంది నాన్నతనం
.
శుభాకాంక్షల్ని, జాగ్రత్తలను క్రమం తప్పకుండా అందుకొంటూ.
.
అప్పుడు కూడా
.
.
పార్కు బెంచీపై కూర్చొని మిత్రులతో
కొడుకు సంపాదన, కోడలి మంచితనం
మనవల అల్లరిని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తూ
కనిపిస్తుంది.......... నాన్నతనం.........
.
.
కొన్ని నీటి పొరలేవో కంటికడ్డు పడినప్పటికీ
.
ఈ కవిత Bolloju Baba గారిది . నాకు నచ్చి మీకు పంచాలి అనిపించి ఇలా పంచుతున్నాను . అభినందనలు ఆయనకు చెప్పండి . ఆయన టైం లైన్ లో నుండి కిందటి ఏడాది కొట్టుకుని వచ్చాను .

శాకుంతలం Sakuntalam by Satchidanandan

శాకుంతలం Sakuntalam by Satchidanandan
ప్రతి ప్రేమికుడు తన ప్రేయసిని
ఒక్కసారైనా విస్మరించే
శాపాన్ని కలిగి ఉంటాడు:
మరుపు నది అతని ప్రేమను మింగేస్తుంది.
ఆమె రహస్యం
జ్ఞాపకాల వలలో చిక్కుకునేంతవరకూ
ప్రతి ప్రేయసి విస్మరింపబడే
శాపాన్ని పొంది ఉంటుంది.
పులినోట్లో చేయిపెట్టిన
ప్రతి బిడ్డా తండ్రిలేకుండా
పెరిగే శాపగ్రస్తుడు.
మూలం: Sakuntalam by Satchidanandan
అనువాదం: బొల్లోజు బాబా

దాహంతో చచ్చిపోయిన ఒక నది –A river dies of thirst

దాహంతో చచ్చిపోయిన ఒక నది –A river dies of thirst
ఇక్కడ ఒక నది ఉండేది, ఇరు తీరాలతో.
ఆ నదిని వానచినుకులతో పోషించే
స్వర్గలోకపు అమ్మ కూడా ఉండేదిక్కడ.
కొండకోనల్లోంచి జారుతో
మందగమనంతో పారేది అది.
ఓ అందమైన అతిధిలా గ్రామాలను సందర్శిస్తూ
లోయలకు పచ్చదనాన్ని, కొండఫలాల్ని అందించేది.
రాత్రివేళల తీరాలపై దొర్లే సరదాప్రియులను చూసి నవ్వుకొంటూ సాగేది
“మబ్బు పాలను తాగి, పశువులకు నీళ్ళు తాపి
జెరుసెలేమ్ కు, డమాస్కస్ కు ఉరకలెత్తిన నది”
అప్పుడప్పుడూ అది వీరోచితంగా గానం చేసేది
ఒక్కోసారి ఉద్రేకంతో.
ఇక్కడ ఒక నది ఉండేది, ఇరు తీరాలతో.
వానచినుకులతో ఆ నదిని పోషించే
స్వర్గలోకపు అమ్మ కూడా ఉండేది
కానీ వాళ్లు దాని అమ్మను అపహరించాక
ఆ నదికి నీరు లభించక
క్రమక్రమంగా చచ్చిపోయింది, దాహంతో
మూలం: A river dies of thirst by Darwish
అనువాదం: బొల్లోజు బాబా

ఉదాసీనుడు - The indifferent one by Darwish, Mohmoud

ఉదాసీనుడు - The indifferent one by Darwish, Mohmoud
అతను దేనినీ లక్ష్యపెట్టడు.
వాళ్ళు అతని ఇంటికి కుళాయి నిలుపుచేస్తే:
‘పరవాలేదు! వానాకాలం దగ్గరలోనే ఉంది’ అంటాడు.
కరంటు ఆపు చేస్తే: ఆవులిస్తూ
“పరవాలేదు, ఈ వెలుగు సరిపోతుంది’ అంటాడు
నీ జీతం తగ్గిస్తాం అని వాళ్ళు బెదిరిస్తే,
‘పరవాలేదు! మద్యం, సిగరెట్లు మానేస్తాను’ అంటాడు
అతన్ని వాళ్లు జైలులో పెట్టినపుడు
‘పరవాలేదు, జ్ఞాపకాలతో కొంతకాలం ఏకాంతంగా
గడపవచ్చు’ అంటాడు.
ఇంటివద్ద దిగపెట్టినపుడు:
‘పరవాలేదు! ఇది నా ఇల్లు’ అంటాడు
ఒకసారి అతణ్ణి కోప్పడుతూ అడిగాను
‘రేపు ఎలా జీవించాలనుకొంటున్నావు’ అని
అతనన్నాడూ
‘ఈ రేపు నన్ను బాధించదు.
అదొక ఒఠి ఊహ. నన్ను ఆకర్షించదు
నేను నేను మాత్రమే: నన్ను ఏదీ మార్చలేదు
నేను దేన్నీ మార్చలేనట్లుగానే,
నా సంతోషాల్ని దూరం చేయకు.
‘నేనేమీ Alexander the Great లేదా
Diogens ని’ కాదులే అన్నాను
‘నిర్లిప్తత అనేది ఒక వేదాంతం
ఒకరకమైన ఆశావహ దృక్ఫథం కూడా’ అన్నాడతను.
.
మూలం: The indifferent one by Darwish, Mohmoud
అనువాదం: బొల్లోజు బాబా

Expired -- చచ్చిపోయింది, by Varma Kalidindi

నేను ఎక్కువగా ఇంగ్లీషునుంచి తెలుగులోకి అనువదించాను తప్ప తెలుగునుంచి ఇంగ్లీషులోకి చెయ్యలేదు. చాన్నాళ్ళ క్రితం నా కవితలను కొన్నింటిని ఇంగ్లీషులో పెట్టుకొన్నాను. నాకే తృప్తిగా అనిపించక వదిలేసాను. మొన్నొక మిత్రుడు కలిదిండి వర్మగారి కవితనొకదాన్ని పంపి, చాలా బాగుంది ఇంగ్లీషులోకి అనువదించమని అడిగాడు.
కవిత అప్పటికే చదివి ఉన్నాను. మంచి కవిత. రోడ్డుపై చనిపోతున్న కుక్కగురించి ప్రజల సంభాషణ. కవిత చివరకు వచ్చేసరికి కుక్కబదులు మనిషి కనపడతాడు. చనిపోయినవారికి ఓటు ఉండదు కనుక ఆ చావు విలువలేనిది అయిపోతుంది అనటం ప్రస్తుతం నడుస్తోన్న ఓట్ల రాజకీయాలను కళ్ళకు కడుతుంది.
ఇక అనువాదం విషయానికి వస్తే తెలుగు నుడికారాన్ని ఇంగ్లీషులోకి పెట్టటం చాలా కష్టం అనిపించింది.
"ఇంటికి వెళుతున్నానా" అన్న వాక్యంలో ఉన్న అర్ధం while going home లో రాలేదు. వెళుతున్నానా అన్న విరుపును అనువదించటం నాకైతే సాధ్యపడలేదు.
"ఊరకుక్కని, జాతికుక్కని" పదాలలోని ( అని అనటంలోని) ఈజ్, నేటివిటీ may be stray, wellbred లో పలకటం లేదు. ఇది నాకు తెలుస్తోంది కానీ ఏమీ చెయ్యలేకపోయాను.
అదేవిధంగా "కుక్కప్రాణాలకు విలువలేదంట" వాక్యాన్ని no value
for its life too గా అనువదించాను. ఇక్కడ too అనేది జోడింపు.
Expired -- చచ్చిపోయింది, by Varma Kalidindi
while going home
I saw a dog
struggling for its life
People inquire for its owner
may be stray
well-bred or Mongrel
discussion went on
the dog died
of course no value
for its life too
people simply
pass over its body
dog has no vote
మూలం: చచ్చిపోయింది, Varma Kalidindi
వర్మ కలిదిండి//చచ్చిపోయింది//
ఇంటికి వెళుతున్నానా
దారిలో
కుక్క ప్రాణాలతో
కొట్టుకొంటోంది
కుక్క ఎవరిదని వెదుకుతున్నారు
ఊర కుక్కని
జాతికుక్కని
సంకరమని చర్చ
ఇంతలో కుక్క చచ్చిపోయింది
కుక్క ప్రాణాలకి విలువలేదంట
దారిలో
అందరూ చూసిపోతున్నారు
కుక్కకి ఓటు లేదు.
11.02.2019
వర్మగారు అభినందనలు. మంచి కవితను అందించినందుకు. దానిలో కొన్ని గంటలు నన్ను తిప్పినందుకు.
మిత్రులు అనువాదం గురించి అభిప్రాయాలు చెపితే సంతోషించగలవాడను....
భవదీయుడు
బొల్లోజు బాబా

ఎలా బయటపడగలవ్?

ఎలా బయటపడగలవ్?
వేల నాల్కలతో మింగే
దాహానికి
శలభంలా మాడిమసి కాక ముందు
నువ్వు దానితో చేసుకొన్న
రాజీ ఒప్పందాన్ని ఎక్కడా చెప్పకు
ఆత్మను చంపుకొంటావో
హృదయాన్ని అమ్ముకొంటావో
నీ యిష్టం
గొర్రెల మధ్య గొర్రెలా
నక్కల మధ్య నక్కలా బతకటం
చాలా సులువు
మనిషిలా
బతకాలనుకోవటం కన్నా
బొల్లోజు బాబా