Monday, October 20, 2025

ఫ్రెంచి పాలన చివరి రోజులు


            భారత్‌ లోని ఫ్రెంచి కాలనీల చరిత్రను గమనిస్తే, వీరు మొదటగా 1668 లో సూరత్‌ వద్ద ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని తమ వ్యాపార కార్యకలాపాలను మొదలెట్టారు. ఆ తరువాత మచిలీపట్నం, ఢాకా, కాసింబజార్‌, బాలాసోర్‌, కాలికట్‌, పాట్నా లలో చిన్న చిన్న వ్యాపార గిడ్డంగులను నెలకొల్పారు. 1673/74 లో పాండిచేరీ, 1721 లో మాహే, 1723 లో యానాం, 1738 లో కారైకాల్‌, 1774 లో చంద్రనాగూర్‌ లను తమ స్థావరాలుగా చేసుకొన్నారు. పాండిచేరీ, మాహె, కారైకాల్‌, చంద్రనాగూర్‌ మరియు యానాం లు మినహా మిగిలిన చిన్న చిన్న ప్రాంతాలను ఫ్రెంచి గవర్నర్‌ బారన్‌ 1947 అక్టోబరు 6 న స్వతంత్య్ర భారతదేశానికి అప్పగించేసాడు.

1. ఫ్రాన్స్‌కు సెంటిమెంటు భారత్‌కు అవసరం

            మిగిలిన ప్రాంతాలు  ఫ్రెంచి పాలననుండి విమోచనం చెంది భారతావనిలో విలీనం చెందటంలో అనేక నాటకీయపరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఫ్రెంచి కాలనీలన్నీ దూర దూరంగా ఉండటం వల్ల వీటిని నియంత్రించటం ఫ్రెంచి వారికి కష్టంగా ఉండేది. భారతావని సుమారు 10 లక్షల చదరపు మైళ్ళు ఉంటే, ఈ కాలనీలన్నీ కలిపి రెండువేల చదరపు మైళ్ళ విస్తీర్ణం మాత్రమే. అంతే కాక ఈ ప్రాంతాలకు స్పష్టమైన సరిహద్దులు లేవు.  ఉదాహరణకు పాండిచేరీలోని చాలా ప్రాంతాలు పాండీతో విభక్తమై అన్నివైపులా భారత భూభాగాన్ని కలిగి    ఉన్నాయి.  పాండీనుంచి ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే భారత భూభాగాన్ని దాటి పోవాల్సిందే.  ఈ ప్రాంతాలను సంరంక్షించుకొనేందుకు అవసరమైన మిలటరీ శక్తి కూడా ఈ ఫ్రెంచి కాలనీలలో లేదు. అయినప్పటికీ భారత్‌ లోని తన కాలనీలతో ఫ్రాన్స్‌ కు ఉన్న అనుబంధం వలసరాజ్య భావనలకు అతీతంగా ఉండేది. ఇవి తమ దేశ అంతర్భాగాలని ఫ్రాన్స్‌ ఏనాడో ప్రకటించింది. అందుకనే ఫ్రాన్స్‌ లో చేపట్టే ప్రతీ సంస్కరణనూ పాండిచేరీలో కూడా అమలు పరచేది. 1882 లో తొలిసారి మున్సిపల్‌ ఎలక్షన్లు జరుపుతున్న సమయంలో ‘‘ఈ ఎలక్షన్ల ద్వారా ప్రజలు ఫ్రెంచి దేశంతో తమకున్న బంధాన్ని బలోపేతం చేసుకొంటారని ఆశిస్తున్నామని’’ గవర్నరు వ్యాఖ్యానించాడు.

            1881 లో ఒక డిక్రీ ద్వారా స్థానిక ప్రజలు తమ భారతీయతను త్యజించినట్లయితే వారు కూడా ప్రాన్స్‌లోని పౌరులవలే ఫ్రెంచిచట్టాల పరిధిలోకి వస్తారని ప్రకటించింది. ఆ విధంగా పాండిచేరీనుంచి అనేక వేల మంది తమ భారతీయతను త్యజించి ఫ్రెంచి సంస్కృతి సాంప్రదాయాల పట్ల తమ కున్న అభిమానాన్ని చాటుకొన్నారు. తద్వారా ఈ కాలనీ ప్రజలు ఫ్రాన్స్‌ లో నివసించే ఫ్రెంచి పౌరులతో సమాన రాజకీయ, పౌరహక్కులను కలిగి ఫ్రెంచి సెనేట్‌లో తమ ప్రాతినిధ్యాన్ని పొందటం మొదలైంది. అందుకనే 1954 లో ఈ ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేయమంటే ` సుమారు 8 దశాబ్దాల పాటు  ఫ్రెంచి పౌరులుగా ఉన్న ఈ ప్రజల అభిప్రాయం రిఫరెండం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రాన్స్‌ వాదించింది. 

            ఇక భారత్‌ విషయానికి వస్తే, భౌగోళికంగా ఐక్యంగా ఉండటమనేది స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత భారతదేశం ముందున్న ప్రధమ లక్ష్యం. అందుకనే అప్పటికి దేశమంతా చెల్లాచెదురుగా ఉన్న కొన్ని వందల ప్రిన్స్‌లీ స్టేట్‌ లను ఒక్కొక్కటినీ నయానా భయానా ఒప్పించి విలీనం చేసుకోవటంలో కృతకృత్యమైంది. (ఆనాడు విలీనం కాకుండా మిగిలిపోయిన కాశ్మీర్‌ నేటికీ ఒక సమస్యగానే మిగిలిపోయింది).  పోర్చుగీస్‌ మరియు ఫ్రెంచి దేశాలు 1947 నాటికి భారతదేశంలో ఇంకా తమ కాలనీలను కలిగిఉన్నాయి. వీటిని కూడా కలుపుకోగలిగినట్లయితే భారతదేశం అవిచ్ఛిన్నమైన భూభాగంగా అవతరిస్తుంది. అలా చేయలేక పోయినట్లయితే ఈ ప్రాంతాల వల్ల దేశ సమగ్రత, అంతర్గత భద్రతలకు ముప్పువాటిల్లే అవకాశముంటుందని భారత్‌ భావించింది.

            పోర్చుగీస్‌ కాలనీలైన  గోవా, డయ్యు, డామన్‌, దాద్రా మరియు నగర్‌ హవేలీ లను భారతావనిలో వీలీనం చేసే ప్రక్రియలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశం ఒకానొక దశలో పట్టుమని మూడువేల మంది కూడాలేని పోర్చుగీసు బలగాలపై ముప్పయివేల మంది సైనికులను, భారీ వాయుసేనలను రంగంలోకి దింపవలసి వచ్చింది. భారత్‌ చర్యలకు వ్యతిరేకంగా పోర్చుగల్‌, భద్రతా మండలిని ఆశ్రయించగా రష్యా తనకున్న వీటో పవర్‌ ను ఉపయోగించి భారత ఉద్దేశ్యాలు నెరవేరేలా సహకరించింది. అలా 1961లో  పోర్చుగీసు కాలనీలు భారతదేశపు అంతర్భాగాలైనాయి.

            ఇక ఫ్రెంచి కాలనీల విషయానికి వస్తే భారతదేశం సంయమనం పాటించింది. ఎందుకంటే  స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంఅనే భావనలను ప్రవచించే దేశంగా ప్రాన్స్‌ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతే కాక భారతదేశంలోని తమ కాలనీలను ఒక వ్యాపార స్థావరాలుగా ఫ్రాన్స్‌ భావించక తమ దేశ అంతర్భాగాలుగా పరిగణించి ఇక్కడి పౌరులకు ఫ్రెంచి పౌరులకున్నటువంటి అన్ని రకాల రాజకీయ పౌర హక్కులను కల్పిస్తూఉండటం కూడా ఈ కాలనీల విషయంలో భారతదేశం ఆచి తూచి వ్యవహరించటానికి మరో కారణం. అహింస, అలీనతలకు పెద్దపీట వేసిన వ్యక్తిగా నెహ్రూకు అంతర్జాతీయంగా పెద్ద పేరు ఉంది.  ఫ్రెంచి కాలనీల విషయంలో 1947-1954 మధ్య భారత్‌-ఫ్రాన్స్‌ లు చిన్న చిన్న అభిప్రాయభేధాలను వ్యక్త పరచినా, అంతిమంగా  విన్‌-విన్‌ పరిస్థితులను పరస్పరం కల్పించుకొని ఇరుదేశాలు సమస్యనుంచి గౌరవంగా బయటపడ్డాయి. ఈ కాలనీల విషయమై భారత్‌`ఫ్రాన్స్‌ ల మధ్య యుద్ధం జరగవచ్చునని అప్పట్లో ఉహాగానాలు ఉండేవని పాండిచేరీ ఆఖరు ఫ్రెంచి గవర్నరుగా పనిచేసిన André Ménard,  August 30, 1985 న Patrick Pitoeff అనే చరిత్రకారునికి ఇచ్చిన ఇంటర్యూలో అనటాన్ని బట్టి ఆనాటి పరిస్థితులను అర్ధం చేసుకొనవచ్చును. భారతదేశం ఒకవైపు దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులు, చేస్తూనే, మరో వైపు ఈ కాలనీలను దిగ్బంధనం చేయటం వంటి చాణుక్యనీతిని ప్రదర్శించిందన్న విమర్శను ఎదుర్కోవలసి వచ్చింది.

2. భిన్న వాదనలు

            ఫ్రెంచి కాలనీల విలీనం పట్ల రెండు ప్రధాన వాదనలు ఉన్నాయి. ప్రాన్సే స్వచ్చందంగా ఈ కాలనీలను భారత్‌ కు అప్పచెప్పేసిందంటూ ఇండో`ఫ్రెంచి సంబంధాలను బలోపేతం చేసే వాదన ఒకవైపు; ఈ కాలనీల ప్రజలలో జాతీయవాద భావనలు పెరిగి వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాటం జరిపి వారిని పారద్రోలారన్న వాదనలు మరో వైపు వినిపిస్తాయి.  రెండు వాదనలనూ వాస్తవాలుగానే స్వీకరించాలి. ఈ కాలనీల ప్రజల కోరుకుంటే ఈ ప్రాంతాలను భారతావనికి అప్పచెప్పేస్తానని ఫ్రాన్స్‌ ముందునుంచీ చెపుతూనే ఉంది. అలాగే చంద్రనాగూరును 1949 లోనే భారత్‌ కు ఇచ్చివేసింది.  అదే విధంగా ఆనాడు ఫ్రెంచి పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వి.సుబ్బయ్య, దడాల రఫేల్‌ రమణయ్యల ఆత్మకధలను పరిశీలిస్తే రెండవ వాదనను కూడా అంగీకరించక తప్పదు. ఇక భారతదేశం సంయమనంతో ఈ రెండు ప్రక్రియలకు ప్రేరణకారిగా వ్యవహరించి, సమస్యను శాంతియుతంగా, అహింసా పద్ధతులలో పరిష్కరించుకోగలిగింది.

            భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వబోతున్నట్లు బ్రిటన్‌ ప్రకటించగానే, ఫ్రెంచ్‌ఇండియా పరిపాలనా వ్యవస్థను 1946 లో ఫ్రాన్స్‌ సమూలంగా మార్చివేసి, ప్రజా ప్రతినిధులకు విస్త్రుతాధికారాలు కట్టబెట్టి ‘‘స్వయంపాలన’’ జరుపుకొనే విధంగా చేసింది.

            ఎప్పుడైతే బ్రిటిష్‌ వారు భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించి తప్పుకొన్నారో, ఈ కాలనీల ప్రజలలో కూడా స్వాతంత్ర కాంక్ష పెరిగి ఈ ప్రాంతాలను ఫ్రెంచి పాలననుండి విముక్తి చేయాలన్న భావనలు పెరగసాగాయి.  అదే సమయంలో  ఫ్రెంచి పాలన ఉండాలని కోరుకొనే ప్రజలు కూడా ఉండేవారు. ఈ నేపథ్యంలో 1948 లో భారత్‌`ఫ్రెంచి ప్రభుత్వాలు ఈ 5 కాలనీల గురించి ఒక ఒప్పందం చేసుకొన్నాయి.  దీని ప్రకారం ఈ కాలనీల ప్రజలు వారు భారతదేశంలో విలీనం చెందాలా వద్దా అనే విషయాన్ని ఎన్నికల ద్వారా (రిఫరెండం) తెలియచేయాలి.  ఈ రిఫరెండం కూడా ఏ ప్రాంతంలో జరిగితే దాని ఫలితం ఆ ప్రాంతానికే పరిమితం. తదనుగుణంగా చంద్రనాగూర్‌ 1949 లో రిఫరెండం జరుపుకొని సమీప బెంగాల్‌ లో విలీనం అవుతానన్న తన ఆకాంక్షను తెలియచేసింది. దరిమిలా ఫ్రెంచి ప్రభుత్వం మారు మాట్లాడక చంద్రనాగూరు ను భారతదేశానికి ఇచ్చివేయటానికి 1951 లో ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ అనే ఒప్పందాన్ని చేసి, 1952లో దాని సార్వభౌమాధికారాలను భారత ప్రభుత్వానికి అప్పచెప్పింది.

            1948 లో పాండిచేరీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఫ్రెంచి పాలన ఉండాలని కోరుతున్న సోషలిస్టు పార్టీ ఘనవిజయం సాధించటంతో మిగిలిన ప్రాంతాలలో జరగాల్సిన ‘రిఫరెండం’ ప్రక్రియ అటకెక్కింది. అప్పట్లో పాండిచేరీ ఎన్నికలలో భారీ ఎత్తున రిగ్గింగులు జరిగేవి. ఆ కారణంగా  రిఫరెండం జరపటానికి తగిన పరిస్థితులు ఫ్రెంచి కాలనీలలో లేవని భారత్‌ తన నిరసనను తెలియచేసింది.

            ఈ సందర్భంలో విలీనానికి సంబంధించి ఫ్రెంచి ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వాలు ఈ కాలనీల ప్రజలకు ‘అయితే ఫ్రెంచి ప్రభుత్వం లేక భారత ప్రభుత్వం’ అనే తప్ప మరే విధమైన ఎంపిక అవకాశాల్ని ఇవ్వలేదు. రిఫరెండం జరగాలని ఫ్రెంచి ప్రభుత్వం, రిఫరెండం లేకుండా విలీనం జరగాలనీ పట్టుపట్టుకొని కూర్చున్నాయి తప్ప ఈ కాలనీలు ఫ్రాన్స్‌ మరియు భారత్‌ ల ఉమ్మడి సార్వభౌమాధికారాలతో ఉండటమా (Project Ramadier) లేక ఈ కాలనీలన్నీ భారతంలో ఉంటూ స్వయం ప్రతిపత్తి కలిగిన ఫ్రెంచి ప్రాంతాలుగా ఉండటమా  (Project Coste Floret)  లేదా ఫ్రెంచి వారు దశలు దశలుగా ఓ పాతిక ముప్పయి సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాలనుండి వైదొలగటమా లేక వీటిని స్వతంత్య్ర రాజ్యాలుగా పరిగణించటమా వంటి అవకాశాలను అన్వేషించలేదన్న విమర్శలు లేకపోలేదు.

3. దిగ్బంధనం/Blockade

            పాండిచేరీలో ఫ్రెంచి పాలనను అంతమొందించాలని ఉద్యమించిన వారిలో వి.సుబ్బయ్య, సెల్లాన్‌ నాయకర్‌, బాలసుబ్రమణియన్‌, ఎ. అరుల్‌రాజ్‌, ఎమ్‌. పెరియసామి, దడాల రఫేల్‌ రమణయ్య వంటివారు ప్రముఖులు.  ఫ్రెంచి విధేయుడైన ఎడ్వర్డ్‌ గుబేర్‌ (వీరు తరువాత తమ అభిప్రాయాలను మార్చుకోవటం జరిగింది) నాయకత్వంలో కొంతమంది ఫ్రెంచిపాలన కొనసాగాలని పోరాటం జరిపేవారు. మొదట్లో ప్రజలు ఈ ఫ్రెంచి విధేయవర్గానికే మద్దతు పలికారు. ఈ మద్దతు చూసుకొని కొంతమంది ఫ్రెంచి అధికారులు ‘‘ఫ్రెంచి కాలనీలలోని అంగుళం భూమిని కూడా భారతదేశం చేజిక్కించుకోలేదు’’ అని బీరాలు పోయారు. ఈ పరిస్థితులలో భారత ప్రభుత్వం రాజకీయ చతురతను ప్రదర్శించి ఫ్రెంచికాలనీలను ఆర్ధికంగా, వ్యాపార రీత్యా, రాకపోకల పరంగా, మౌలిక వసతుల పరంగా ఒక రకమైన దిగ్బంధనానికి గురిచేసి ఫ్రెంచి ప్రభుత్వాన్ని, ప్రజలనూ ఉక్కిరి బిక్కిరి చేసింది. (THE “COLD WAR” FRANCO- INDIAN (1949-1954) By Jacques Weber CIDIF).  ఇలాంటి నిర్బంధాలు పాండిచేరీకి కొత్త కాదు. బ్రిటిష్‌ వారివల్ల అనేకసార్లు ఇలాంటి ఇబ్బందులకు గురయ్యిన చరిత్ర ఉంది. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా అల్లా ఫ్రెంచి వారిలో లోపించిన నైతికస్థైర్యం మరియు వలసవాదుల పట్ల సర్వత్రా వెల్లువెత్తుతున్న నిరసన.

            పాండిచేరీ చుట్టూ ముళ్లతీగె వేయబడి భారతభూభాగంలోకి రాకపోకలు నియంత్రించబడ్డాయి.  పాండిచేరీనుంచి ఎవరైనా బయటకు రావాలంటే అక్కడి భారత కౌన్సిల్‌ చే జారీ చేసిన ఫొటోతో కూడుకొన్న ‘‘పాస్‌పోర్ట్‌’’ ను సరిహద్దు వద్దనున్న చెక్‌ పోస్ట్‌ ల వద్ద చూపించవలసి వచ్చేది.  ఈ పాస్‌పోర్టును ఒక రూపాయి రుసుముతో (అప్పట్లో రూపాయి అంటే చాలా పెద్ద మొత్తం) ఒకటి లేదా రెండు నెలల ‘వెలిడిటీ’ తో, కారణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే పాండిచేరీలో ఉన్న భారత కౌన్సిల్‌ జారీ చేసేది.  ఒక్కోసారి అప్లయిచేసిన కొన్ని నెలల తరువాత పాస్‌పోర్ట్‌ మంజూరు అయ్యేది.  ఈ విధానం వల్ల పాండిచేరీ ఒక ‘‘బంధింపబడిన ప్రజల ప్రాంతం’’ అయిపోయింది.

            ఈ విధానం వల్ల నిత్యం పాండిచేరీ నుంచి బయటకు వెళ్లి పనులు చేసుకొనే కూలీల మనుగడ కష్టమై పస్తులుండే పరిస్థితి వచ్చింది. అంతే కాక పాండిచేరీ నుంచి ఏ విధమైన వస్తువులను బయటకు/లోపలకు తీసుకువెళ్ల కూడదన్న నిబంధన వల్ల`పాండిచేరీకి చెందిన కూలీలు బయట ప్రాంతాలకు కూలి పనులకు వెళ్ళేటపుడు వారు తీసుకొని వెళ్ళే అన్నం కేరేజీలను   కూడా అనుమతించేవారు కాదు. అందువల్ల వారి భోజనాన్ని సరిహద్దుల వద్ద తినటమో లేక పారవేయటమో చేయవలసి వచ్చేదట. ఇదే నిబంధన వల్ల జాలరులు తాము పట్టుకొన్న చేపలను ఇంటికి తీసుకొని వెళ్ళే అవకాశం ఉండేది కాదట. దీనికి తోడు పాండిచేరీకి రాకపోకలు చేసేవారి వద్ద 50 రూపాయిలకు మించి డబ్బులు ఉండకూడదన్న నియమం కూడా ఉండేది.

            వెహికిల్‌ యజమానులకు భారతభూభాగం/పాండిచేరీ లలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకోవటానికి భారతప్రభుత్వం 120 రోజుల సమయం  ఇచ్చింది. ఆ తరువాత వాటి రాకపోకలను నియంత్రించటం మొదలెట్టింది. పాండిచేరీకి వెళ్ళే  రైళ్లు బస్సులు బయటే నిలిపివేయబడేవి. ఫ్రెంచి కాలనీ ప్రజలకు స్వేచ్చా రాకపోకలను కల్పిస్తూ ఫ్రెంచి ప్రభుత్వం 1941 లో బ్రిటిష్‌ ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందాన్ని భారతప్రభుత్వం ఉల్లంఘిస్తున్నదని ఫ్రెంచిప్రభుత్వం ఆరోపించింది. (UNE HISTOIRE SINGULIÈRE : PONDICHÉRY DE 1947 À 1954 By Stephanie Samy CIDIF)

            ఈ సమయంలోనే సందట్లో సడేమియా లాగ, పాండిచేరీకి బంగారం, వజ్రాలు వంటి విలువైన వస్తువులు విదేశాలనుంచి దిగిమతి అయి, భారతసరిహద్దు ప్రాంతాలకు స్మగుల్‌ అయ్యేవి. ఒక్క 1951-1952 మధ్య పాండిచేరీ వ్యాపారులు పదిహేను టన్నుల బంగారాన్ని, పద్నాలుగు కోట్ల ఫ్రాంకుల విలువైన వజ్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని సమీప భారత పాలిత ప్రాంతాలకు స్మగుల్‌ చేసి భారీ లాభాలు మూటకట్టుకొన్నారు.  ఈ విషయాన్ని గ్రహించిన భారత ప్రభుత్వం పాండిచేరీ చుట్టూ తన పహారాను మరింత కఠినతరం చేసింది.

            పాండిచేరీకి చెరాల్సిన పోస్టల్‌ కవర్లు మద్రాసులో నిలిచిపోయేవి.  1954 నాటికి ఇవి 8 వేలకు పైగా పేరుకు పోయాయి. 1937 నుంచి పాండిచేరీకి విద్యుత్తును సరఫరా చేస్తున్న కావేరీ విద్యుదుత్పత్తి కేంద్రంను రిపేరుల నిమిత్తం మూసివేస్తున్నందున,  ఇకపై సరఫరా చేయలేదని భారతప్రభుత్వం 1953 లో ఒక లేఖ ద్వారా ఫ్రెంచి గవర్నరుకు తెలిపింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటంతో పాండిచేరీలోని తక్కువ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం సహాయంతో మరియు అవసరాన్ని బట్టి జెనరేటర్‌లను ఏర్పాటు చేసుకొని ఫ్రెంచి ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు పరిమితంగా విద్యుత్‌ ను సరఫరా చేయటం మొదలెట్టింది. పాండిచేరీకి దిగుమతి చేసుకొనే పెట్రోల్‌, కూరగాయలు, దుస్తులు, పండ్లు వంటి వస్తువుల నిలుపుదల జరిగింది. నిత్యావసరాలైన బియ్యం, నూనెలు వంటి వాటిని ఫ్రెంచిప్రభుత్వం  ఇండోచైనా పాకిస్తాన్‌ వంటి దేశాలనుంచి షిప్పులలో దిగుమతి చేసుకోవలసి వచ్చేది.

            పాండిచేరీ కి నీటిని సరఫరా చేసే పంట కాలువ 1954 లో మూసివేయబడిరది. పాండిచేరీలోని బాహూరు చెరువుకు నీటినందించే కాలువ లాకులు మూతపడటంతో, పంటలకు నీరందక నాశనం అయ్యాయి. 1949 లో మొదలైన ఈ దిగ్బంధన ప్రక్రియ 1954 నాటికి పాండిచేరీని ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఫ్రాన్స్‌ వెలుపలి నుండి అన్ని విధాల సహాయ సహకారాలందించినా, పోగా పోగా ప్రజలలో అసంతృప్తి పెరగసాగింది.

            ఈ మొత్తం పరిస్థితులను అవగాహన చేసుకొన్న పాండిచేరీ ఆర్చిబిషప్‌, ఫ్రాన్స్‌ ఫారిన్‌ మినిస్ట్రీలో పనిచేస్తున్న తన మిత్రునికి వ్రాసిన లేఖలో  ‘‘ఫ్రాన్స్‌ ఇకపై ఏమాత్రమూ ఇండియాలోని తన కాలనీలను నిలుపుకోలేదు. తనను నమ్ముకొన్న ప్రజలకు కొన్ని సదుపాయాలు కల్పించి నవ్వుతో బయటకు వెళ్లటమే ఉత్తమం, గెంటివేయబడటం కన్నా’’ అని అనటం ఆనాటి ఫ్రెంచివారి ఆలోచనలకు అద్దం పడుతుంది.

            (పాండిచేరీ దిగ్బంధం గురించి ఇంతటి సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందు పరచటానికి కారణం` ఆనాటి ఫ్రెంచి పౌరుల త్యాగాల పట్ల, ఫ్రాన్స్‌ ప్రదర్శించిన సౌహార్ధ్రత పట్ల అవగాహన లేకుండా, ఈ ఫ్రెంచికాలనీలకు ఇంతటి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించటం ద్వారా నెహ్రూ తప్పుచేసాడనీ, ఈ ప్రాంతాలలో ఉన్న ఫ్రెంచ్‌ ఉనికి వల్ల మనమింకా వలసవాదుల పాలనలోనే ఉన్నట్లు అనిపిస్తోందనీ, ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో ఎందుకు విలీనం చేయటం లేదనీ వంటి రకరకాల వాదనలు నేడు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. భారతదేశానికి ఈ ప్రాంతాలను భౌగోళికంగా తనలో కలుపుకోవటం అనేది దేశ సమగ్రత, ఐక్యత, అంతర్గత భద్రత ల దృష్ట్యా ఒక చారిత్రిక అవసరం. హైదరాబాద్‌, పోర్చుగీస్‌ పాలిత ప్రాంతాల విలీనంలో జరిపినట్లు ఫ్రాన్స్‌ పై సైనిక ప్రయోగానికి భారత్‌ సాహసించలేకపోవటానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. అందుకనే దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులూ ఒకవైపు చేస్తూనే గొప్ప పరిణతి కలిగిన చాణుక్యనీతిని ప్రదర్శించింది.  ఆనాడు ఫ్రాన్స్‌ మరియు ఈ కాలనీలలోని ఫ్రెంచి పౌరులు చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా భారత్‌ ఈ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిందన్నది విస్మరించకూడని ఒక చారిత్రిక వాస్తవం `` రచయిత)

            ఇక యానాం విషయానికి వస్తే, పాండిచేరీలో జరిగినంత తీవ్రంగా కాకపోయినా ఈ ప్రాంతం కూడా దిగ్బంధనానికి గురయినట్లు ఆనాటి వార్తాపత్రికల ద్వారా తెలుసుకొనవచ్చును.  20 ఏప్రిల్‌, 1954 నుండి యానాంకు వచ్చే బస్సులను యానాంకు వెలుపలే నిలువరించటం మొదలైంది (రి. హిందూ, 22,ఏప్రిల్‌, 1954). శ్రీ దడాల, భయంకరాచారి, డి.ఎస్‌.ఆర్‌.సోమయాజులు, కొంపెన సుబ్బారావు ల ఆధ్వర్యంలో కాకినాడనుంచి యానాంకు సరుకులు చేరవేస్తున్న బండ్లను, 24 ఏప్రిల్‌, 1954 న నిలిపివేసి తిరిగి కాకినాడ పంపించి వేయటం జరిగింది.  ఈ విషయం తెలుసుకొని కాకినాడనుంచి యానాంకు రావాల్సిన బళ్ళు బయలుదేరనే లేదు (రి. 28 ఏప్రిల్‌, 1954).

యానాంకు నిత్యావసరాలు అందకపోవటంతో ఇక్కడి ప్రజాజీవనం స్థంభించిపోయింది. యానాం వ్యాపారులకు కాకినాడలో పెట్రోలు, కిరోసిన్‌, ఇతరనూనెలు అక్కడి వ్యాపారులు నిరాకరించేవారట. బిల్లు భారతీయుని పేరుపై తీసుకొని అతికష్టం మీద సరుకులను యానానికి రహస్యంగా చేరవేయవలసి వచ్చేదట. గోదావరి నదిపై జరిగే సరుకుల రవాణాను అడ్డుకొని పడవలను, సరుకులను, వలలను భారత కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకొనేవారట.

            పంటకాలువల రిపేర్లు పనులు చేయిస్తున్నామన్న కారణంచే, యానాంకు వచ్చే మంచినీటి సరఫరాను 28 ఏప్రిల్‌, 1954న కాకినాడ కలక్టరు నిలుపుదల చేయించారు. యానాం ప్రజలందరికీ మంచినీటి నందించే నీళ్ళ చెరువులు అప్పటికే ఖాళీ అయ్యాయి.  ఈ విషయంలో ఫ్రెంచి ఎంబసీ కల్పించుకొంటే తప్ప మే 1 నుండి యానాంకు నీటి సరఫరా పునరుద్దరణ కాలేదు.  (]. The Last Days of Yanam - George Sala published in July 1996, Lettre du CIDIF)        

            ఈ నేపథ్యంలో భారతదేశంలో తమ మనుగడ ఇక అసాధ్యమన్న నిర్ణయానికి ఫ్రాన్స్‌ వచ్చేసింది.  ప్రజలందరూ పాల్గొనే రిఫరెండం జరపాలని అంతవరకూ వాదించిన ఫ్రెంచిప్రభుత్వం తన పట్టు సడలించి, ప్రజానాయకులు పాల్గొనే రిఫరెండానికి సిద్ధపడిరది.  అలా 1954లో పాండిచేరీ సమీపంలోని కీళూరు అనే ప్రాంతంవద్ద జరిగిన ప్రజానాయకుల అభిప్రాయసేకరణ జరిపింది. దీనిలో 7 ఓట్లు ఫ్రెంచిపాలనకు అనుకూలంగాను, 164 ఓట్లు వ్యతిరేకంగాను రావటంతో, ఫ్రెంచిప్రభుత్వం 1954 అక్టోబరు 26న పాండిచేరీ, మాహె, కారైకాల్‌ మరియు యానాంలను యథాతథ స్థితిలో భారతదేశానికి అప్పగించుతూ ఒక ఒప్పందం చేసింది.  దీనినే ‘డిఫాక్టో ఒప్పందం’ అంటారు.  దీనికి అనుగుణంగా 1954 నవంబరు, 1న ఈ ప్రాంతాలనుండి ఫ్రెంచివారు ఖాళీచేసి వెళిపోయారు.  ఈ రోజును ‘డిఫాక్టో దినం’ గా ఇక్కడి ప్రజలు పాటిస్తారు.

4.  భారత పతాక రెపరెపలు

            పాండిచేరీలో అంతవరకూ పనిచేస్తున్న ఫ్రెంచి దేశస్థులు వెళిపోయే ముందు అట్టహాసంగా అధికారిక సంబరాలు జరిపి వెళ్లాలని యోచించినా, ఫ్రాన్స్‌ ఆ ప్రతిపాదనలను తిరస్కరించింది.  ఒక వార్‌ షిప్పులో పాండిచేరీలోని ఫ్రెంచివారినందరినీ ఫ్రాన్స్‌కు తరలించాలని మొదట్లో భావించినా ఆ ఆలోచనకూడా కార్యరూపం దాల్చలేదు.  కడకు ఎవరికి వారు మద్రాసు వెళ్లి ఫ్లయిట్‌ ద్వారా పారిస్‌ చేరుకొన్నారు. 1954 నవంబరు 1 నాటికి పాండిచేరీలో ఫ్రెంచి గవర్నరు ఇంచార్జిగా ఎస్క్వర్‌గుయిల్‌ (Escargueil) డిప్లొమేటిక్‌ సలహాదారునిగా P. Landy మరియు మరికొద్ది మంది ఫ్రెంచి అధికారులు మాత్రమే పాండిచేరీ లో మిగిలారు. ఢల్లీ నుంచి వచ్చిన భారత విదేశీ వ్యవహారాల శాఖ సెక్రటరీ జనరల్‌  RK Nehru నవంబరు 1ఉదయాన పాండిచేరీలో ప్రప్రథమంగా భారతదేశ జండాను ఎగురవేశారు. పాండిచేరీ చివరి భారత కౌన్సిల్‌ జనరల్‌ మరియు మొదటి హై కమీషనర్‌ అయిన కేవల్‌ సింగ్‌ ను P. Landy ఆహ్వానించి అధికారాలను బదలాయించారు.  ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో, భారత ప్రెసిడెంట్‌ రాజేంద్ర ప్రసాద్‌, ప్రధాని నెహ్రూ లు పంపించిన సందేశాలను RK Nehru ప్రజలకు చదివి వినిపించారు. ఆ విధంగా మూడు  వందల సంవత్సరాల ఫ్రెంచి పాలనకు తెరపడి భారత పాలనకు తెరలేచింది. 20 జనవరి, 1955 నాటి హిందూ పత్రిక తన ఎడిటోరియల్‌ లో ఈ ప్రాంతాలకు కల భౌగోళిక, సాంస్కృతిక వ్యత్యాసాలను దృష్టిలో ఉంచుకొని, చంద్రనాగూర్‌ విషయంలో జరిగినట్లుగా  సమీప రాష్ట్రాలలో విలీనం చేయాలని వ్రాసింది. 

5. ఈ ప్రాంతాల భవిష్యత్తు పై అనేక సందేహాలు

            అంతర్జాతీయ చట్టాల ప్రకారం డీఫాక్టో ట్రాన్స్‌ఫర్‌ జరిగినా ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాలు ఫ్రాన్స్‌ వద్ద ఉన్నట్లే లెక్క. ఈ రకమైన పరిస్థితి ఇదివరలో బోస్నియా, సిప్రస్‌ ప్రాంతాల విషయంలో వచ్చిందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అంటే ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాలను ఫ్రాన్స్‌ భారత్‌ కు సమర్పించనంతవరకూ భారత్‌ ఈ ప్రాంతాలలో అధికారిక పరిపాలన చేపట్టటానికి వీలుండదు.  అందుకనే భారత్‌ ఫ్రాన్స్‌తో మరో ఒప్పందం చేసుకొనే వరకూ ఇక్కడ ఫ్రెంచి పరిపాలనా వ్యవస్థను యథాతథంగా కొనసాగించింది.  ఆ మరో ఒప్పందమే 1956 మే, 28న భారతప్రధాని శ్రీపండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ మరియు ఫ్రాన్స్‌ దేశ ప్రతినిధి ఒష్ట్రరాగ్‌ లు  చేసుకొన్న ట్రీటీ ఆఫ్‌ సిషన్‌  (Traité de cession).

            ఈ మొత్తం ప్రక్రియపట్ల పాండిచేరీలో నిరసన వ్యక్తమయింది.  Grande Comore, Mohammed Saeed Sheikh, MP Raymond Dronne  దైవశిఖామణి వంటి కొంతమంది ఫ్రెంచి విధేయులు తమ తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు. ఈ కాలనీల ప్రజలకు ద్వంధ్వ పౌరసత్వం కల్పించాలనీ, ప్రజలందరూ పాల్గొనే రిఫరెండం తిరిగి నిర్వహించాలనీ, ఈ ప్రాంతపు ఫ్రెంచి సంస్కృతిని కాపాడమనీ, ఆటోనమీ ని కల్పించాలనీ, కీళూరు లో ప్రజాప్రతినిధులు మాత్రమే పాల్గొన్న రిఫరెండం ఫ్రెంచి రాజ్యాంగ విరుద్దమనీ అంటూ వీరు ఇరు ప్రభుత్వాలను డిమాండ్‌ చేసారు.  ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో విలీనం చేస్తారేమోన్న ప్రజల అనుమానాలను నివృత్తి చేయటానికి ఆనాటి భారత హైకమీషనరు కృపాలానీ, 1957, ఫిబ్రవరి 9 న ఏర్పాటుచేసిన ఒక ప్రెస్‌ కాన్ఫరెన్సులో  ‘‘ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో విలీనం చేసే ఉద్దేశాలు భారతప్రభుత్వానికి లేవని, ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ లో చేసుకొన్న ఒప్పందం ప్రకారం వీటి ప్రత్యేకతను నిలుపుతుందనీ’’ తెలిపారు.

            ఈ ప్రాంతాల భవిష్యత్తు గురించి ప్రజలలో ఉండిన ఆందోళనలు 1955 లో పాండిచేరీలో జరిగిన ఎన్నికలను ప్రభావితం చేసాయి.  ఫ్రెంచి కాలనీలను భారతావనిలో విలీనం చేయటంలో ప్రధాన పాత్రపోషించిన శ్రీగుబేర్‌ ` ‘పాండిచేరీని ఫ్రాన్స్‌ కు అప్పగించాలి’ అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగిన Marcel Valot అనే స్వతంత్ర అభ్యర్ధిచేతిలో ఓడిపోయాడు.   ఈ ప్రాంతాలకు ఆటోనమీ కల్పించాలనీ ఇక్కడి ఫ్రెంచి సంస్కృతిని కాపాడాలన్న డిమాండ్‌ తో ఎన్నికలలో పోటీ చేసిన పాపులర్‌ పార్టీ పాండిచేరీలో ఉన్న 18 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాల్ని గెలుచుకోవటం గమనార్హం. (ఇతర ప్రాంతాలలో గుబేర్‌ వర్గం ఎక్కువ సీట్లను దక్కించుకొంది).  మున్సిపల్‌ ఎన్నికలలో మూడొంతులు పైగా సీట్లను పాపులర్‌ పార్టీ కైవసం చేసుకొంది.  పై  ఫలితాల ద్వారా పాండిచేరీ ప్రజలలో ఫ్రెంచి విధేయత ఉన్నట్లు స్పష్టమవటంతో ఈ కాలనీల భవిష్యత్తుపై ఆ తదుపరి జరిగిన చర్చలలో  ఈ ప్రాంత ప్రజల ఫ్రెంచి సంస్కృతిని పరిరక్షించాలన్న వాదనకు బలం చేకూరింది. ఈ ఎన్నికల తరువాత గుబేర్‌ తన పంథాను మార్చుకొని, ప్రజాభీష్టం మేరకు ఈ ప్రాంతాలకు ప్రత్యేకప్రతిపత్తి కల్పించటంలో అవిరళ కృషిచేయటం గమనార్హం.  (కోడిపందాలు ఎక్కువగా ఆడతాడు కనుక ఎడ్వర్డ్‌ గుబేర్‌ ను ఫ్రెంచివారు కోడి`గుబేర్‌ అని పిలిచేవారట. ఫ్రెంచి వారు వెళిపోవటంతో ఇతని పేరు గుబేర్‌ పిళ్ళై గా మారిపోయింది.  ఈ చిన్న ఉదంతం ఫ్రెంచిపాలనకు`భారత పాలనకు మధ్య మౌలికంగా ఉన్న తేడాను అద్భుతంగా పట్టి చూపుతుంది. మొదటిదానిలో జాత్యహంకారం రెండవదానిలో సామాజిక మూలాల ప్రదర్శన కనిపిస్తాయి.)

            అంతర్గత కుమ్ములాటల కారణంగా 1955 ఎన్నికల ద్వారా ఏర్పడిన అసెంబ్లీని 1958 లో భారతప్రభుత్వం రద్దు చేసి పాండిచేరీలో రాష్ట్రపతి పాలనను విధించింది.  తిరిగి 1959 లో జరిగిన ఎన్నికలలో,  ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో విలీనం చేయం’ అన్న నినాదంతో కాంగ్రెస్‌ ఎన్నికలలోకి దిగి విజయం సాధించింది.

6. ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ కల్పించిన హామీలు

            డిఫాక్టో ట్రాన్ఫ్‌ర్‌ ఒప్పందానికి ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ ఒప్పందానికి మధ్య కల సుమారు రెండేళ్ల వ్యవధిలో ఇరుదేశాలు ఈ ప్రాంతాల భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనకు వచ్చాయని ఆ ఒప్పందంలో పొందుపరచిన ఈ క్రింది అంశాలను బట్టి తెలుస్తుంది.

ఎ. పౌరసత్వం: 1956 నాటికి పాండిచేరీలో మూడు రకాలైన ఫ్రెంచి పౌరులుండేవారు. ఇక్కడకు వచ్చి స్థిరపడిన ఫ్రెంచి దేశస్థులకు పుట్టిన వారు, 1880 లలో తమ భారతీయతను త్యజించి ఫ్రెంచి సివిల్‌కోడ్‌ ను ఎంచుకొన్న భారతీయులు మరియు ఈ రెండు వర్గాలకు చెందని వారు. వీరు తమకు ద్వంధ్వ పౌరసత్వం ఇమ్మని భారత మరియు ఫ్రెంచి ప్రభుత్వాలను కోరారు. అది జరగని పనని ఇరుదేశాలు తేల్చి చెప్పేసాయి.  ఈ ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ లో వీరికి పౌరసత్వ ఎంపిక అవకాశం కల్పించబడిరది.  దీని ప్రకారం ఈ ట్రీటీ అమలులోకి వచ్చిన (1962) ఆరునెలలలోగా తమ ఫ్రెంచి పౌరసత్వాన్ని నిలుపుకోవటానికి వ్రాతపూర్వకంగా తెలియచేయవలసి ఉంటుంది. అలా చేసిన వారికి వారు అంతవరకూ కలిగి ఉన్న ఫ్రెంచి పౌరసత్వాన్ని ఇక ముందు కూడా కలిగి ఉంటారు లేనివారు భారతపౌరసత్వాన్ని పొందుతారు.

            ఫ్రెంచి వారు వెళిపోయేటపుడు ఇచ్చిన సౌహార్థ్ర పూర్వక పౌరసత్వ ఐచ్చికతను ఉపయోగించుకొని పాండిచేరీనుంచి సుమారు 6000 మంది ఫ్రెంచి నేషనాలిటీని నిలుపుకొన్నారు.  వీరి సంఖ్య ప్రస్తుతం పదిహేనువేలకు పైమాటే.  ఫ్రాన్స్‌లో నివసించే పౌరునికి ఉండే వృద్ధాప్య పించను, పేదరికంలో ఉంటే అందే సహాయం, నిరుద్యోగ భృతి, విద్య వైద్యాల కొరకు రాయతీలు వంటి సోషల్‌ సెక్యూరిటీ పథకాలన్నీ ఈ ఫ్రెంచినేషనల్స్‌ కూ ఉన్నాయి. ఆ కారణంగా వీరందరూ ఆర్ధికంగా, సామాజికంగా సాటి భారతీయుల (వీరుకూడా ఒకప్పుడు ఫ్రెంచి పాలితులే అయినప్పటికీ ఫ్రెంచినేషనాలిటీని ఎంచుకోకపోవటం వల్ల భారత పౌరులుగా మిగిలిపోయారు) కంటే మెరుగైన స్థితిలో ఉన్నారు. కొన్ని సందర్భాలలో వారి అసూయకు కూడా పాత్రులవుతున్నారు.   అందుకనే పాండిచేరీ ఫ్రెంచి పౌరుల అసోషియేషన్‌ నాయకుడైన పి. ఆరోగ్యసామి  ఒకచోట ‘‘ఈనాడు పాండిచేరీలో రిఫరెండం పెడితే ప్రజలందరూ ఫ్రెంచి పౌరసత్వాన్ని స్వీకరించటం తథ్యం’’ అని వ్యాఖ్యానించాడు. (రి.  LES GENS DE NULLE PART Auteur : Author: Banerji Monideepa CIDIF). 1962 లో ఫ్రాన్స్‌ తన అప్పటి మరో కాలనీ అయిన అల్జీరియాకు స్వాతంత్య్రం ప్రకటించినపుడు అక్కడి ఫ్రెంచి పౌరులలో పదిలక్షల మందికి పైన ప్రజలు ఫ్రాన్స్‌తో తమ అనుబంధాన్ని తుంచుకోలేదు.  వీరందరూ ఫ్రాన్స్‌ చేరుకోగా, ఫ్రెంచి ప్రభుత్వం పునరావాసం కల్పించింది.  వీరందరినీ ఇప్పటికీ Pieds-noirs అని పిలుస్తారు.

బి. ఫ్రెంచి సంస్కృతి పరిరక్షణ:  ఈ ఒప్పందంలో ఈ కాలనీలలో అంతవరకూ పరిఢవిల్లిన ఫ్రెంచి సంస్కృతి పరిరక్షణ కావించబడుతుందని హామీ ఇవ్వబడిరది.  దీనిలో భాగంగా, ఫ్రెంచి అధికారిక భాషగా ఉంటుందని (ప్రజానాయకులు మార్చనంతవరకూ), స్కూళ్లలో ఫ్రెంచి భోధన కొనసాగుతుందనీ, ఫ్రెంచి సంస్కృతిని పెంపొందించటానికి సంస్థలు నెలకొల్పాలని వంటి హామీలు ఈ ఒప్పందంలో ఉన్నాయి.  అప్పట్లో నెహ్రూ ఈ ప్రాంతాలను Windows Open to France  అని వర్ణించాడు కూడా. కానీ ఫ్రెంచివారు వెళ్ళిపోయిన తరువాత ఈ ప్రాంత అధికారులు ఎక్కువగా బ్రిటిష్‌ ఇండియాలో పనిచేసిన వారు కావటంతో ఫ్రెంచి అధికారిక భాషగా ఎంతో కాలం కొనసాగలేదు. అంతే కాక ఇక్కడి ప్రజలు కూడా క్రమక్రమంగా ఇంగ్లీషుకు అలవాటు పడక తప్పలేదు. అంతవరకూ పనిచేసిన అధికారులు  ఫ్రెంచి పౌరసత్వాన్ని తీసుకొని ఫ్రాన్స్‌ వెళ్ళిపోవటం కూడా మరో కారణం. అందుకనే 1965 లో అసెంబ్లీ తీర్మానం ద్వారా ఈ కాలనీల లో ఇంగ్లీషు, తమిళ్‌, మళయాలం మరియు తెలుగులను అధికార భాషలుగా చేస్తూ చట్టం చేయటంతో, ఫ్రెంచి అధికార భాషగా కనుమరుగైపోయింది. ఇక ఫ్రెంచి భోధన కొరకు ఒక  కాలేజీ, సంస్కృతి పెంపొందించటం కొరకు అలయన్స్‌ ఫ్రాంకాయిస్‌ వంటివి నెలకొల్పటం జరిగింది. ఇవి నేటికీ పనిచేస్తూ ఉన్నాయి. యానానికి సంబంధించి జూనియర్‌ కాలేజీలో తొంభైల మధ్యవరకూ ఫ్రెంచి ద్వితీయ భాషగా బోధించబడేది. ఆ తరువాత శ్రీబొల్లోజు బసవలింగం గారి ఆధ్వర్యంలో యానాంలో కొంతకాలం ఒక ప్రైవేట్‌ ఫ్రెంచిస్కూలు నడపబడింది.

            భారతదేశంలో ఫ్రెంచి రాజ్యస్థాపనకై పాటుపడిన డూప్లే విగ్రహాన్ని  పాండిచేరీ నుంచి తొలగించవద్దని, ఒకవేళ తొలగించేటట్టయితే దానిని ఫ్రాన్స్‌ అప్పగించమనీ ఫ్రెంచి ప్రభుత్వం కోరింది.

            ఫ్రెంచి ప్రభుత్వం అంతవరకూ ఇచ్చిన విద్యార్హతలకు సమానమైన భారత విద్యార్హతలను నిర్ణయించటానికి  ఇరుదేశాల విద్యావేత్తలతో కూడిన ఒక కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకొన్నారు.

సి. ఫ్రెంచి చట్టాల కొనసాగింపు: ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ ఒప్పందంలో 1954 నాటికి ఉన్న కోర్టుకేసులకు ఫ్రెంచి చట్టాలకు అనుగుణంగానే తీర్పులు చెప్పాలనీ, ఈ చట్టాలను నెమ్మది నెమ్మదిగా తొలగించి, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ను ప్రవేశపెట్టుకోవచ్చని వ్రాసుకోవటం జరిగింది.  తదనుగుణంగా భారత ప్రభుత్వం 1963 లో  ఫ్రెంచి చట్టాల తొలగింపు మొదలుపెట్టి 1968 నాటికి పూర్తిచేసింది.

డి. ప్రత్యేక పరిపాలనా హోదా: చంద్రనాగూర్‌ అప్పగింత భేషరతుగా జరిగింది కనుక అది సమీప రాష్ట్రమైన బెంగాలులో విలీనం అయి ఒక మున్సిపాలిటీగా మారిపోయింది. కానీ మిగిలిన ఫ్రెంచికాలనీలైన పాండిచేరీ, మాహే, కారైకాల్‌ మరియు యానాంల విలీనం ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ ఒప్పందం ద్వారా విలీనం అయ్యాయి.  దానిలోని ఆర్టికల్‌ రెండు ప్రకారం ఈ ప్రాంతాలకు ‘‘ప్రత్యేక పరిపాలనా హోదా’’ను కల్పించాలని/కల్పిస్తాననీ ఇరుదేశాలు అంగీకరించుకొన్నాయి. అంతే కాక ప్రజల సమ్మతి లేకుండా ఈ హోదాను మార్చకూడదని కూడా వ్రాసుకోవడం జరిగింది.  దీనికి అనుగుణంగా 1962 లో భారతప్రభుత్వం 14 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసింది. ఈ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించినందుకు మీడియాలో నిరసన రాకపోలేదు.  1962, ఆగస్టు 9 నాటి హిందూ పత్రిక తన ఎడిటోరియల్‌ లో ఈ చిన్న ప్రాంతాలకు ఈ విధమైన ప్రత్యేకతను కల్పించటం ఒక ‘‘లగ్జరీ’’ గా పేర్కొనింది. ది మెయిల్‌ అనే పత్రిక కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరచింది.

            ప్రాంతాలు భారతావనిలో విలీనం అయితే వీటికి ప్రత్యేక హోదాను కల్పించి కేంద్రప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచుతానని భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ,  27 అక్టోబరు, 1949 న వ్రాసిన ఒక లేఖద్వారా తెలుస్తుంది. ఈ ప్రాంతాల విలీనం ఇంకా ఒక కొలిక్కి రాని సమయంలోనే తాను ఫ్రెంచి ప్రభుత్వానికి  ఇచ్చిన మాటను భారత ప్రభుత్వం ఈ విధంగా నిలుపుకొంది. 

తుది పలుకులు

            1957 లో ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ కు ఆమోద ముద్ర కొరకు ఫ్రాన్స్‌ ఫారిన్‌ అఫైర్స్‌ మినిష్ట్రీ కు పంపించినపుడు (Devinat report) ఈ ఒప్పందం ఫ్రెంచి రాజ్యాంగానికి లోబడి లేదని, ప్రజలు పాల్గొన్న రిఫరెండం జరగలేదనీ వంటి కొరీలు వేసి, దీన్ని ఆమోదించాలంటే ఫ్రెంచి పార్లమెంటు అనుమతి కావాలంటూ తిరస్కరించింది. (అప్పుడు జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు  ప్రతికూలంగా  27 ఓట్లు, అనుకూలంగా 15 ఓట్లు పడ్డాయి)

            ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాల అప్పగింతపై జరుగుతున్న జాప్యం పట్ల అప్పట్లో అనేక మంది నిరసనను తెలియచేసారు.  1958 జూన్‌, 16 నాటి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఎడిటోరియల్‌ లో ‘‘ డిజ్యూర్‌ ట్రాన్ఫ్‌ర్‌ (సార్వభౌమాధికారాల అప్పగింత) జరపటానికి తొందరగా చర్యలు గైకొనకపోయినట్లయితే  ఫ్రెంచివిధేయులకు, భారతవిధేయులకు పాండిచేరీ ఒక రణస్థలిగా మారే ప్రమాదం ఉంది’’ అని వ్రాసింది. ఎందుకంటే పాండిచేరీలో “Popular Republican Movement of French India”  అనే పేరిట ఒక సంస్థ  ఏర్పడి ఫ్రెంచిపాలన కొనసాగాలని ఆందోళనలు సాగిస్తున్న సమయమది.

            1958 ఆగస్టు, 11న జరిగిన పార్లమెంటు సమావేశాలలో  ఈ ప్రాంతాల బదలాయింపు గురించి ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నెహ్రూ ‘‘ఈ ప్రాంతాల డిఫాక్టో బదలాయింపు ఎన్నో సంవత్సరాల క్రితమే జరిగిపోయింది.  ఈ స్థితినుంచి వెనుకకు మరలే ప్రసక్తే లేదు. కానీ ఈ స్థితికి కొన్ని కొన్ని చట్ట పరమైన చిక్కులు ఉన్న మాట వాస్తవమే. డిజ్యూర్‌ ట్రాన్స్‌ఫర్‌ త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాను.  చేసిన ఒప్పందాన్ని నెరవేర్చమని  ఫ్రాన్స్‌ పై ఒత్తిడి తీసుకురావటం సబబనిపించుకోదు. అది లేనిపోని అపోహలకు దారితీస్తుంది’’ అనటాన్ని బట్టి అప్పట్లో భారత ప్రభుత్వం ఎంతటి సహనాన్ని ప్రదర్శించిందో సులువుగానే అర్థమౌతుంది. 

            ఫ్రాన్స్‌ అల్జీరియాలో చేస్తున్న యుద్ధంలో తలమునకలైపోయి ఉండటం వల్ల ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ ను ఫ్రెంచి ప్రభుత్వం దాదాపు పక్కన పెట్టేసిందనే భావించాలి.

            ఎట్టకేలకు 1962, జూలై 19 న ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ బిల్లు ఆమోదం కొరకు ఫ్రెంచి సెనేట్‌ కు వచ్చింది.  ఈ బిల్లును ప్రవేశపెట్టినపుడు, ఫిలిఫ్పి అర్జిన్‌ల్యూ అనే సెనేటర్‌ చేసిన ప్రసంగపు  తుదిపలుకులు ఈ ప్రాంతాలపై ఫ్రాన్స్‌ కు ఉన్న అభిప్రాయాలను పట్టిచూపుతాయిThe choice before us left seems strangely small. Or, unable to resist the feelings of deep regret to see a new tear in what was the French Empire, and whose institutions namely Pondicherry, Karaikal, Mahe and Yanam, for three centuries, formed the most beautiful jewels, it is against any acceptance of such an abandonment. Or, more modestly, but certainly a more realistic way, we accept the inevitable. we resign ourselves to a factual situation that allows no alternative, in other words, we agree, regardless of melancholy and sorrow that embrace the heart, the sensible and dull solution of accepting the treaty that gives our citizens a few guarantees and benefits, while formally inviting our diplomacy to resume talks at the earliest promptly to strengthen as far as possible the position of our country in this region and save up the rights of former French nationals. …….. (Ref. Le transfer-Part.3(8)-Part.III--La ratification du traité de cession - Written by Gabriel Piesse, CIDIF letters - Letter No. 26/27)

            1962 జూలై 23 న ఈ బిల్లుకు ఆమోదముద్ర పడిరది. దరిమిలా 1962 ఆగష్టు, 16 న ఫ్రెంచి ప్రభుత్వం ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాలను భారత్‌ కు బదలాయించటం ద్వారా ఈ ప్రాంతాలపై చట్టపరమైన హక్కులను కల్పించినట్లయింది. ఈ రోజును ఈ ప్రాంతవాసులు ‘‘డిజ్యూర్‌ దినం’’ గా సెలిబ్రేట్‌ చేసుకొంటారు.  ఆ తరువాత భారతప్రభుత్వం 30 ఆగష్టు 1962 న పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి పాండిచేరీ, కారైకాల్‌ మాహే మరియు యానాంలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించటం ద్వారా ఈ ప్రాంతాలకు ఉన్న మూడు శతాబ్దాల ‘‘ఫ్రెంచి కనెక్షన్‌’’ శాశ్వతంగా తెగిపోయింది.

(ఫ్రెంచికాలనీలు భారతదేశంలో విలీనం అయిన పరిణామ క్రమాన్ని వివరించే సమాచారం ఇంతవరకూ తెలుగులో పెద్దగా లేని కారణంగా ఈ చాప్టరులో ఆ అంశాన్ని ఎక్కువగా వివరించటం జరిగింది. గమనించగలరు)

 

 (ఈ వ్యాసం నేను రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకం (2010) నుండి. Pdf ఆర్కైవ్స్ లో కలదు)

బొల్లోజు బాబా
Uploading: 437373 of 437373 bytes uploaded.

 

 

Thursday, September 25, 2025

రానున్న నా కొత్తపుస్తకం.

రానున్న నా కొత్తపుస్తకం.

పల్లవి పబ్లికేషన్స్ శ్రీ నారాయణ గారి ఫోన్ నంబరు: 9866115655 లో ప్రి-బుక్ చేసుకొనవచ్చును.
చక్కని కవర్ డిజైన్ ఇచ్చిన శ్రీ గిరిధర్ కు, అర్ధవంతమైన బ్లర్బ్ ఇచ్చిన శ్రీ ప్రభు కు ధన్యవాదములు.
దయచేసి ఆదరించండి

బొల్లోజు బాబా



Tuesday, September 23, 2025

యానాన్ని ఆంధ్రాలో ఎందుకు కలపలేదు?

యానాం అనేది 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌ లోని తూర్పుగోదావరి జిల్లాచే ఆవరింపబడిన ఒక చిన్న ప్రాంతం. ఇక్కడి ప్రజల మాతృభాష తెలుగు. వీరి సంస్కృతి సాంప్రదాయాల మూలాలు పొరుగునున్న తెలుగువారితో ముడిపడి ఉన్నాయి. అలాంటప్పుడు యానాం భారతావనిలో విలీనమైనపుడు సమీప ఆంధ్రా లో ఎందుకు కలిపేయలేదన్న ప్రశ్న సహజంగా ప్రతిఒక్కరికీ కలుగుతుంది. 

1953 లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే సమయానికి యానాం ఫ్రెంచివారి పాలనలో ఉంది. ఆ తరువాత 1956 లో  భాషాప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన సమయానికి ఫ్రెంచి వారు ఇక్కడ నుంచి భౌతికంగా నిష్క్రమించినా, యానాంపై భారతదేశానికి చట్టపరమైన హక్కు ఇంకా రాలేదు. కనుక ఆ సమయాలలో యానాన్ని  సమీప తూర్పుగోదావరిజిల్లాలో అంతర్భాగం చేయాలన్న ఆలోచనే ఎవరికీ ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పటికింకా యానాం అనేది ఫ్రాన్స్‌ అంతర్భాగం. భారతదేశంలో విలీనం కాలేదు. యానాం ఫ్రెంచిపాలననుంచి విమోచనం చెంది భారతావనిలో విలీనమైన తరువాత కూడా దీనిని సమీప ఆంధ్రప్రదేశ్‌ లో కలపకుండా ప్రత్యేకంగా ఉంచటానికి ప్రధాన కారణం ఫ్రెంచివారు వెళిపోయేముందు భారత ప్రభుత్వంతో చేసుకొన్న ఒక ఒప్పందం.

ట్రీటీ ఆఫ్‌ సెషన్‌

ఫ్రెంచివారు తమ కాలనీలైన యానాం, పాండిచేరీ, మాహె, కారైకాల్‌లను స్వతంత్య్ర భారతావనికి అప్పగించి వెళ్ళేప్పుడు, భారత ప్రభుత్వంతో 1956, మే 28 న ట్రీటీ ఆఫ్‌ సెషన్‌ (Traite de Cession)  ను చేసుకొన్నారు.

ఈ ఒప్పందములో ఆర్టికల్‌ 2 ఇలా చెపుతుంది. 

The Establishments will keep the benefit of the Special Administrative Status in force prior to 1 November 1954.  Any consitutional changes in  this Status which may be made subsequently shall be made after ascertaining the wishes of the people.

(సారాంశం: ఈ స్థావరాలన్నీ , 1 నవంబరు 1954 కు పూర్వము కలిగి ఉండినటువంటి ప్రత్యేక పరిపాలనా హోదా ను నిలుపుకుంటాయి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తెలుసుకొన్న తరువాతే రాజ్యాంగపరంగా ఈ హోదాను మార్చవలసి ఉంటుంది)

1954 కు పూర్వం ఈ ప్రాంతాలు స్వతంత్య్ర భారతావనిలో కలువకుండా ప్రత్యేకంగా ఫ్రెంచివారి పాలనలో ఉన్నాయి.  భారత స్వాతంత్రానికి ముందుకూడా ఇవి బ్రిటిష్‌ వారి పాలనకు అతీతంగానే ఉన్నాయి.  పై క్లాజులో ఆ ప్రత్యేకతను నిలబెట్టమని ఫ్రెంచిప్రభుత్వం కోరింది.  అంటే ఈ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా హోదా కల్పించమని ఫ్రెంచివారు వెళ్ళిపోయేముందు అడిగిన చివరి కోరిక. ఈ హోదాను మార్చాలంటే ఈ ప్రాంతప్రజల అభిప్రాయాన్ని ఒక రిఫరెండం ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది.  ఈ ఒప్పందానికి అనుగుణంగా  భారతప్రభుత్వం 1 జూలై, 1963 న జరిపిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాంతాలను యూనియన్‌ టెరిటరీ ఆఫ్‌ పాండిచేరీగా ఏర్పరచింది.  అలా వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పరచి ప్రత్యేక హోదా కల్పించి ఫ్రెంచిప్రభుత్వానికి ఇచ్చిన మాటను  భారతప్రభుత్వం నిలబెట్టుకొంది.  

సమీపరాష్ట్రాలలో విలీనం చేయటానికి జరిగిన ప్రయత్నాలు

ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో విలీనం చేయ్యాలని మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఉన్నపుడు ఒక ప్రయత్నం జరిగింది.  అంటే యానాన్ని ఆంధ్రాలోను, పుదుచ్చేరీ, కారైకాల్‌ లను తమిళనాడులోను, మాహేను కేరళలోను విలీనం చేయటానికి. ఆ ప్రతిపాదనను ఈ ప్రాంతాల ప్రజలు ముక్తకంఠంతో ప్రతిఘటించారు.  మురార్జీదేశాయ్‌ కూడా 1954 నాటి ఒప్పందాన్ని చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడని అంటారు. ఎందుకంటే ఈ ఒప్పందం లోని 30వ ఆర్టికిల్‌లో ` ఈ ఒప్పంద ఉల్లంఘనకు సంబంధించిన పిర్యాదుల పరిష్కారానికై అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించబడిరది.

1990 లో పాండిచేరికి కొత్తగా నియమించబడిన గవర్నరు శ్రీమతి చంద్రావతి పాండిచేరిలో ఇంకా బతికిఉన్న ఫ్రెంచి సంస్కృతి, ఫ్రెంచి నేషనల్స్‌ అందుకొంటున్న ఫ్రెంచి పించనులు, ఫ్రాన్స్‌ పర్యవేక్షించే విద్యా సంస్థలు ఉండటాన్ని చూసి,  ‘‘పోర్చుగీస్‌, బ్రిటన్‌పాలిత ప్రాంతాలలో ఆయా వలసపాలకుల ఉనికి కనిపించదని పాండిచేరీకి ఇంతటి స్వేచ్ఛ, ప్రత్యేకతను కల్పించటం ద్వారా నెహ్రూ తప్పు చేసాడేమోనని’’ వ్యాఖ్యానించారు. 

ఆ తరువాత ఫ్రెంచి అంబాసిడర్‌ ఆండ్రూ లెవిన్‌ ఈమెను కలసి, పాండిచేరీ చారిత్రిక ప్రాముఖ్యతను, ఫ్రాన్స్‌ ఈ ప్రాంతాలను భారత్‌కు అప్పగించేటపుడు ఇరుదేశాలు చేసుకొన్న ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ ను వివరించినపుడు ఆమె విస్మయానికి గురయ్యారట. ఇదే విషయాన్ని భారత మినిస్ట్రీఆఫ్‌ ఫారిన్‌ అఫైర్స్‌ శాఖాధికారుల వద్ద లెవిన్‌ ప్రస్తావించినపుడు, ‘‘1956 నాటి ట్రీటీకి వ్యతిరేకంగా ఆలోచనచేసే ఉద్దేశం భారత్‌ కు లేదని, ఆమెకు చారిత్రిక అవగాహన లేకపోవటం వల్ల అలా వ్యాఖ్యానించి ఉంటారు’’ అని వారు వివరణ ఇచ్చారట.   ఈ అంశంపై అవగాహన కలిగిన విద్యావేత్తలు, చరిత్రకారులు అనేక మంది శ్రీమతి చంద్రావతి వ్యాఖ్యలను ఖండిరచారు. వారిలో 1954 లో పాండిచేరీలో భారత కమిషనర్‌గా పనిచేసిన భారత అధికారి అయిన కేవల్‌ సింగ్‌ వ్రాసిన "Pondicherry and Goa - Historical Contrast  --Times of India 12 April, 1990”  అనే వ్యాసం ప్రముఖమైనది. (DES ANCIENS COMPTOIRS DE L'INDE?/ Future of French India veterans? by Andrew Lewin published in CIDIF letters Nov 2010)


యానాన్ని ఆంధ్రలో కలపకుండా ప్రత్యేకంగా ఉంచటానికి మరొక ప్రధాన కారణం ఆనాటి స్థానిక నాయకుల దార్శనికత.

భారతావని నుంచి బ్రిటిష్‌ వారు వైదొలగిన తరువాత అందరి కళ్ళు ఫ్రెంచి వారిమీద పడ్డాయి. ఈ కాలనీలలో కూడా జాతీయవాద భావనలు బలపడి ఫ్రెంచి పాలననుండి విముక్తి పొందాలన్న ఆకాంక్ష ప్రజలలో పెరగసాగింది. అప్పటికే నెహ్రూ ‘‘ఫ్రెంచి కాలనీలు భారతదేశ ముఖంపై మొటిమల వలె ఉన్నాయని’’ వర్ణించాడు.  భారతావనిలో తమకాలనీల మనుగడ ఇక అసాధ్యమన్న నిర్ణయానికి ఫ్రాన్స్‌ వచ్చేసింది. కానీ ఈ కాలనీలను భారత్‌కు  అప్పగించటానికి వారి రాజ్యాంగంలోని ఆర్టికిల్‌ 27 ప్రకారం రిఫరెండం (ప్రజలందరి అభిప్రాయం తెలుసుకోవటం) తప్పనిసరి అని పట్టు పట్టింది.( Article 27 of the Constitution of the France Fourth Republic stipulates that “no surrender, no exchange, no addition of territory shall be valid without the consent of the peoples concerned”  అని స్పష్టంగా చెపుతుంది.)  వదులుకోవటం తప్పనిసరైతే హుందాగా అప్పచెప్పాలే తప్ప అవమానకర పరిస్థితులలో చేజార్చుకోకూడదని ఫ్రాన్స్‌ భావించింది. 

ఈ పరిస్థితులలో 1948 లోనే భారత`ఫ్రెంచి ప్రభుత్వాలు ఒక ఒప్పందం చేసుకొన్నాయి.  దీని ప్రకారం ఈ ప్రాంత ప్రజలు తాము భారతదేశంలో కలవాలా ఒద్దా అనే విషయాన్ని రిఫరెండం ద్వారా తేల్చుకోవాలి.  ఈ రిఫరెండం తీర్పు అది జరిగిన ప్రాంతానికే పరిమితమై ఉంటుంది. అంటే ఒక ప్రాంతం ఫ్రెంచివారితో ఉండాలనుకొంటే ఉండొచ్చు మరొక ప్రాంతం విడిపోవాలనుకొంటే విడిపోవచ్చు. అప్పటికి మొత్తం అయిదు ఫ్రెంచి కాలనీలుండేవి.  అవి పాండిచేరి, మాహె, కారైకాల్‌, యానాం మరియు బెంగాల్‌వద్దకల చంద్రనాగూర్‌ లు.    పై ఒప్పందానికి అనుగుణంగా చంద్రనాగూర్‌ 19, జూన్‌ 1949 న రిఫరెండం జరుపుకొంది. 7587 ఓట్లు భారతావనిలో విలీనానికి అనుకూలంగాను, 114 ఓట్లు వ్యతిరేకంగాను పోల్‌ అయ్యాయి.  అలా తొందరపడి రిఫరెండం జరిపేసుకోవటం వల్ల చంద్రనాగూర్‌ ఈనాడు ఈ అనంత భారతావనిలో ఉండే వేనవేల మునిసిపాలిటీలలో ఒకటిగా కనుమరుగైంది. 

చంద్రనాగూర్‌ లోని స్థానిక నాయకులందరూ పొరుగునున్న బెంగాల్‌ రాష్ట్ర కమ్యూనిష్టు నాయకుల ప్రభావంలో ఉండి ఆ ప్రాంతాన్ని విదేశీపాలనా చెర నుండి విడిపించి పొరుగునున్న బెంగాల్‌ లో విలీనం చేయించటంలో కృతకృత్యులయ్యారు.  కానీ అప్పటి యానాం నాయకులు పొరుగునున్న ఆంధ్రా నాయకుల ప్రభావంలో కాక పాండిచేరీ నాయకుల నాయకత్వంలో నడిచారు.    దీన్ని బట్టి చూస్తే అప్పటి యానాం నాయకులు ఆంధ్రావైపు ఎక్కువగా మొగ్గుచూపి ఉన్నట్లయితే చంద్రనాగూర్‌ వలెనే యానాం కూడా ఆంధ్రప్రదేశ్‌ లో ఏ   విశిష్టతా లేని ఒక పంచాయితీ గా మిగిలిపోయేది. కాకినాడ మున్సిపల్‌ కౌన్సిల్‌ కూడా యానాన్ని భారతావనిలో కలిపేయాలని తీర్మానం చేసింది.  కానీ అప్పటి యానాం నాయకులు ముందుచూపు కలిగి పాండిచేరీ తో ఉన్న సంబంధాలను తెంపుకోలేదు.  అపుడు మాత్రమే యానాం ప్రజలకు మేలు జరుగుతుందని భావించారు.  ఇది వారి దార్శనికతకు, రాజకీయ పరిణతికి నిదర్శనంగా చెప్పవచ్చు.  పుదుచ్చేరీ నాయకులు కూడా యానాన్ని  పాండిచేరీలో ఒక అంతర్భాగంగా చూసారు తప్ప వేరుగా చూడలేదు. 

ఇక మిగిలిన నాలుగు ప్రాంతాల ప్రజలు ఫ్రెంచి వారిని అంత సులభంగా చేజార్చుకోవటానికి ఇష్టపడలేదు.  భారతప్రభుత్వం కూడా పరిస్థితులు పక్వానికొచ్చే వరకూ ఎదురుచూసింది.  హైదరాబాద్‌లోలా సైనిక పదఘట్టనలతో బలప్రయోగానికి సాహసించలేదు.  అందునా ఇది దేశాల నడుమ వ్యవహారమాయె!  1948 డిసెంబరు, 19 న జైపూరులో జరిగిన కాంగ్రేసు ప్లీనరీసమావేశాలలో ‘‘స్వతంత్రభారతావని ఏర్పడినతరువాత, ఈ గడ్డపై విదేశీ పరిపాలన కొనసాగటం అసమంజసమే కాక దేశసమైక్యతకు భంగం కలిగించే విషయం’’ అని ఫ్రెంచివారినుద్దేశించి కాంగ్రేసు పార్టీ తీర్మానం చేసింది. ఆ తరువాత 1950 సెప్టెంబరు,21న  నాసిక్‌ లో జరిగిన సమావేశాలలో కాంగ్రేసు పార్టీ మరలా ‘‘ దేశంలోని విదేశీ పాలిత ప్రాంతాలు స్వతంత్ర భారతదేశంలో విలీనం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని’’ పునరుద్ఘాటించింది. 1952 నాటికి పాండిచేరీలో ప్రజలు ఫ్రెంచి వ్యతిరేక, అనుకూల వర్గాలుగా  చీలిపోవటంతో ఒక రకమైన భయానక వాతావరణం నెలకొనిఉంది. చిన్న చిన్న ఘర్షణలు, కొట్లాటలతో అట్టుడికి పోతూండేది. యానాంలో కూడా ఇదే పరిస్థితి ప్రతిబింబించేది. అక్టోబరు 22 న భారతభూభాగం నుంచి కొంతమంది సాయుధులు, పాండిచేరీలోకి ప్రవేశించి అక్కడి ఫ్రెంచి పౌరులపై దాడిచేసి గాయపరిచారు. ఈ ఉదంతాన్ని నెహ్రూ దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన ‘‘ఫ్రెంచి వారు భేషరతుగా ఈ ప్రాంతాలను భారతదేశానికి స్వాధీనం చేయాలనీ, అలాచేసినట్లయితే ఈ ప్రాంతాల ప్రజల సాంస్కృతిక, భాషా,  ఆచార, చట్టపరమైన హక్కులకు రక్షణ కల్పించగలనని’’ హామీ ఇచ్చాడు.   ఫ్రెంచి వారు కోరుతున్నట్లుగా ఈ ప్రాంతాలలో రిఫరెండం జరిపించటానికి భారతప్రభుత్వం అంగీకరించక పోవటానికి కారణం కాశ్మీర్‌ లో కూడా ప్లెబిసైట్‌ (రిఫరెండం) జరపాలని పాకిస్తాన్‌ పట్టు పడుతుందన్న అనుమానం ఉండటం.

యానాం విమోచనం, డిఫాక్టో ట్రాన్సఫర్‌, ట్రీటీ ఆఫ్‌ సిషన్‌, డి జ్యూర్‌ ట్రాన్సఫర్‌ మరియు విలీనము

పై పదాలన్నీ ఒకే విధంగా అనిపించినప్పటికీ వాటి అర్ధాలలో చాలా వ్యత్యాసముంది.  ఇవన్నీ అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలు.  యానాం ఎందుకు ఆంధ్రాలో విలీనం కాలేదో, యానాం ప్రత్యేకత ఏమిటో పై అంశాల ప్రాముఖ్యతను తెలుసుకొంటే మరింత అర్ధమౌతుంది.

విమోచనం: యానాంలో ఫ్రెంచి పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం పతాక స్థాయిని చేరుకొని 1954, జూన్‌ 13 న ఉద్యమకారులు అప్పటి  యానాం అడ్మినిష్ట్రేటరునుంచి అధికారాలను స్వాధీనపరచుకొని, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. తదుపరి ఫ్రెంచి జాతీయ జండాను అవనతం చేసి భారతదేశపతాకాన్ని ఎగురవేసి యానాం, ఫ్రెంచి పాలన నుండి ‘‘విమోచనం’’ చెందిందని ప్రకటించారు. 

ఈ మొత్తం ఉద్యమంలో పాలుపంచుకొన్న ఆనాటి నాయకులలో, దడాల రఫేల్‌ రమణయ్య, మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, కామిశెట్టి వరప్రసాదరావు నాయుడు, కోన నరసయ్య, యర్రా సత్యనారాయణమూర్తి, భయంకరాచారి వంటివారు ప్రముఖులు.  ఫ్రెంచి ప్రభుత్వం మాత్రం ఈ ఉద్యమాన్ని, ప్రభుత్వంపై జరిగిన ఒక ‘‘ముట్టడి’’ గా (Coup de’etat  Yanaon) అభివర్ణించింది.

  1956 మే, 28 న ఫ్రాన్స్‌`భారత దేశాల నడుమ జరిగిన ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ ఒప్పందంలో ` యానానికి సంబంధించి 1954, జూన్‌ 13 తరువాత జరిగిన అన్ని అధికారిక/అనధికారిక వ్యవహారాలకు తనకు ఏ విధమైన సంబంధం లేదని విస్పష్టంగా చెప్పటాన్ని బట్టి యానాంలో ఫ్రెంచి పాలన 1954, జూన్‌ 13 తో చారిత్రికంగా ముగిసినట్లు భావించాలి. 

డిఫాక్టో ట్రాన్సఫర్‌: ఫ్రెంచికాలనీల భవితవ్యం తేల్చటానికి 1954, అక్టోబరు 18న పాండిచేరీ లోని కీళూరు వద్ద  ఈ కాలనీల ప్రజాప్రతినిధులతో జరిగిన రిఫరెండం లో ` ఫ్రెంచి పాలనను కోరుతూ 7 ఓట్లు, భారతదేశంలో విలీనానికి అనుకూలంగా 164 ఓట్లు  రావటంతో ఫ్రెంచి ప్రభుత్వం ఈ కాలనీలను భారతదేశానికి యథాతథంగా అప్పగిస్తూ అక్టోబరు, 26న ఒక ఒప్పందం చేసింది. ఈ ఒప్పందం ద్వారా ఫ్రెంచి ప్రభుత్వం 1954 నవంబరు, 1 న పాండిచేరీ, మాహే, కారైకాల్‌ మరియు యానాం లను భారత ప్రభుత్వానికి యథాతథ స్థితిలో అప్పగించింది.   కనుక నవంబరు 1 ని డీఫాక్టో ట్రాన్సఫర్‌ దినంగా పరిగణిస్తారు. 

ప్రజలందరూ పాల్గొనే రిఫరెండం జరపాలని మొదట్లో  పట్టు పట్టిన ఫ్రెంచి ప్రభుత్వం తన పట్టు సడలించుకొని, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొంటే చాలని సరిపుచ్చుకొంది.  ప్రజలు పాల్గొనే రిఫరెండం లో ఫలితం తనకు అనుకూలంగా రాకపోతే విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుందన్న అనుమానంతో, భారత్‌ చేసిన ఒత్తిడి ఫలితమిది. (రి. అవర్‌ సీక్రెట్స్‌ ఇన్‌ అదర్స్‌ ట్రంక్స్‌` ఎ.జి. నూరాని, ఫ్రంట్‌ లైన్‌ పత్రిక జూలై 2005)

ట్రీటీ ఆఫ్‌ సిషన్‌:  ఫ్రెంచి కాలనీలను భారత్‌ కు అప్పగించినా, అవి చట్ట పద్దతిలో భారతదేశంలో విలీనం కావటానికి మరో ఒప్పందం 1956 మే 28 న  జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంత సార్వభౌమాధికారాలను భారతదేశానికి అప్పగించటం జరుగుతుంది. ఈ ఒప్పందం ద్వారా పాండిచేరీలో రెండు భవనాలను ఫ్రాన్స్‌ తన ఆధీనంలో ఉంచుకొని (అవి Rue de Marine  లో ఫ్రెంచి కౌన్సిలేట్‌ కొరకు ఒక భవనం, Victor Simonel  వీధిలో కల French College   భవనము) మిగిలిన ప్రాంతాలను భారత్‌ కు ఇచ్చివేసింది. ఈ ఒప్పందానికి ఫ్రెంచిపార్లమెంటు వేయాల్సిన ఆమోదముద్ర   ఫ్రాన్సు-అల్జీరియన్‌ యుద్ధం జరుగుతున్న కారణంగా ఆలస్యం జరిగింది.  (అల్జీరియాకూడా ఒక ఫ్రెంచి కాలనీయే.  ఇది స్వాతంత్య్రం కొరకు ఫ్రాన్స్‌ తో యుద్ధమే చేయవలసివచ్చింది).

డి జ్యూర్‌ ట్రాన్సఫర్‌:  1962 లో అల్జీరియా యుద్ధం ముగిసింది. 1962 లో ఫ్రెంచి పార్లమెంటు ట్రీటీ ఆఫ్‌ సిషనుకు ఆమోద ముద్రవేసింది.  దరిమిలా 1962, ఆగష్టు 16 న ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ కాలనీల ‘‘సార్వభౌమాధికారాల్ని’’ భారత ప్రభుత్వానికి బదలాయించింది.  కనుక ఆగష్టు 16 ను డి జ్యూర్‌ ట్రాన్సఫర్‌ దినమని పిలుస్తారు.  ఇది పుదుచేరి ప్రభుత్వ అధికారిక స్వాతంత్య్రదినం.  ఆ విధంగా ఈ కాలనీల ప్రజలు రెండు స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకొంటారు.  ఒకటి భారత స్వాతంత్య్రదినమైన ఆగష్టు 15 రెండవది ఆగష్టు 16 న జరుపుకొనే డి జ్యూర్‌ ట్రాన్సఫర్‌ దినం. 

విలీనము: ఈ ప్రాంతాల ఫ్రెంచి సంస్కృతి, సాంప్రదాయాలను సంరక్షిస్తానని ఫ్రెంచి ప్రభుత్వానికి  ఇచ్చిన హామీలకనుగుణంగా భారతప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి, ఈ నాలుగు ప్రాంతాలను 1963 జూలై,  1న యూనియన్‌ టెరిటరీ ఆఫ్‌ పాండిచేరీగా ప్రకటించింది.  ఈ ప్రక్రియతో ఈ ఫ్రెంచికాలనీలు భారతావనిలో విలీనం కావటం పూర్తయింది.

ముగింపు

పదహారవ శతాబ్దం నుంచీ  ఫ్రాన్స్‌ ప్రపంచవ్యాప్తంగా కాలనీలను నిర్మించటం మొదలెట్టింది. ఇరవయ్యవ శతాబ్దం నాటికి ప్రపంచం మొత్తం మీద 8.5% భూమిని చేజిక్కించుకొంది.  స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు అనేక ప్రాంతాలకు స్వాతంత్య్రం ప్రకటించి తప్పుకొంది. కానీ కొన్ని కాలనీలు ఈనాటికీ ఫ్రాన్స్‌ పరిపాలనలోనే కొనసాతున్నాయి.  ఒకప్పటి ఈ ఫ్రెంచికాలనీలు పారిస్‌ కు కొన్ని వేల మైళ్ళదూరంలో ఉన్నప్పటికీ, ‘ఫ్రెంచ్‌ ఓవర్‌సీస్‌ డిపార్ట్‌మెంట్స్‌’ అనే పేరుతో పిలువబడుతూ నేడు యూరోపియన్‌ యూనియన్‌లో ఫ్రాన్స్‌ అంతర్భాగాలుగా పరిగణింపబడుతున్నాయి.   ఇవి మార్టినిక్‌, గాడెలూప్‌, రీయూనియన్‌, ఫ్రెంచ్‌ గయానా లు. ఈ ప్రాంతాల జీవనప్రమాణాలు ఫ్రాన్స్‌లోని ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోవు.  ఇక్కడి యువకులు ఉన్నతచదువులకు పారిస్‌ వెళుతూంటారు.  పారిస్‌లో ఆవిష్కరింపబడిన కొత్త ‘ఫాషన్‌లు’ తెల్లారేసరికల్లా ఇక్కడ ప్రత్యక్ష్యమవుతాయి.  ఈ ప్రాంతం నుండి ఫ్రెంచి సెనేట్‌ కు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉంది. 

ఇక భారతదేశంలోని ఫ్రెంచికాలనీల విషయానికి వచ్చేసరికి 1947 లోనే ఫ్రెంచి ప్రభుత్వం  వీటిని ఫ్రెంచి ఓవర్‌సీస్‌ టెరిటరీస్‌ లు అని (సముద్రాంతర ఫ్రాన్స్‌ భూభాగాలు) నామకరణం చేసింది.  ఇలా చేయటం ద్వారా ఈ కాలనీలన్నీ ఫ్రాన్స్‌ అంతర్భాగాలని ప్రపంచానికి చెప్పటానికి ప్రయత్నించింది.  కానీ 1954 లో ఈ ప్రాంతాల ప్రజలు ప్రదర్శించిన అచంచలమైన భారతదేశభక్తి కి ఫ్రెంచి ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు.  భారతప్రభుత్వం కూడా సంయమనం పాటించి దౌత్యపరంగానే ఈ ప్రాంతాలను ఫ్రాన్స్‌ నుంచి పొందింది. 

పాండిచేరీ, మాహే, కారైకాల్‌ మరియు యానాంలలో ప్రథమంగా యానామే ‘‘విమోచనం’’ చెందినట్లు ప్రకటించుకొంది.  (ఆ తరువాత మాహే). పాండిచేరీ, కారైకాల్‌ లలో అలా జరగలేదు.  ఈ విషయంలో ఈ ఫ్రెంచి కాలనీలలో ‘‘విమోచనం’’ అనేది ఒక్క యానాం, మాహే లకు మాత్రమే ఉంటుంది.  మిగిలిన  ప్రాంతవాసులు డిఫాక్టో ట్రాన్‌ఫర్‌ దినం మాత్రమే జరుపుకొంటారు.  ఆ విధంగా యానాం ‘‘క్రాంత దర్శి’’ గా చరిత్రకెక్కింది. 

యానాం ని ఆంధ్రాలో కలపకపోవటం వెనుక ఇంతటి చరిత్ర దాగి ఉంది. 

(ఈ వ్యాసం నేను రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకం (2010) నుండి. Pdf ఆర్కైవ్స్ లో కలదు)

బొల్లోజు బాబా


Sunday, September 21, 2025

ఫ్రెంచి యానాం - చట్ట వ్యవస్థ

            ప్రాచీన భారతదేశంలో న్యాయాధికారం రాజుగారి వద్దే ఉండేది.  మనుస్మృతి అర్ధశాస్త్రాలలో చెప్పిన పద్దతులకనుగుణంగా నేరాలకు శిక్షలు విధించబడేవి.  ఇక గ్రామాలలో కుల పెద్దలతో కూడిన పంచాయితీలలో స్థానిక విచారణలు జరిగేవి.  ఇక్కడకూడా పైన చెప్పబడిన శాస్త్రాలననుసరించే తీర్పులు చెప్పేవారు.  బ్రిటిష్‌ వారి రాకతో ఈ పద్దతికి తెరపడి ఆధునిక న్యాయవ్యవస్థ అవతరించింది. 1661 లో ఈస్ట్‌ఇండియా కంపనీ తన ఉద్యోగులకొరకు కొన్ని చట్టాల్ని, శిక్షల్ని సొంతంగా ఏర్పాటుచేసుకొంది.  కాల క్రమేణా ఈ చట్టాల పరిధిలోకి సామాన్య ప్రజలను కూడా తీసుకురావటం జరిగింది.

            1701 లో ఫ్రాన్స్‌ జారీచేసిన ఒక రాజశాసనం ద్వారా పాండిచేరీలోని గవర్నర్‌ కౌన్సిల్‌ కు సంపూర్ణ జుడిషియల్‌ హక్కులు కల్పించబడ్డాయి.  1766 నుండి 1827 వరకూ పాండిచేరీలో ''Chaudrie'' అనే పేరుతో ఫ్రెంచి ఇండియా జుడిషియల్‌ వ్యవస్థ రూపుదిద్దుకొంది.  చాద్రిలను నేటి కోర్టులతో పోల్చవచ్చును.  (ఈ పదానికి క్రియాసారూప్యం కలిగిన చావడి, సత్రం అనే తెలుగు పదాలుండటం గమనార్హం)  ఇక్కడ సివిలు, క్రిమినలు, శాంతిభద్రతలకు సంబంధించిన అనేక విషయాలపై ఫ్రెంచి జడ్జిలు విచారణలు జరిపి తీర్పులు ఇచ్చేవారు.  ఈ తీర్పులు ఎక్కువగా భారతీయ ప్రాచీన శిక్షాస్మృతులను ఆధారంగానే చేసేవారు. (రి. ఆనందరంగ పిళ్ళై డైరీలు. పిళ్ళై కూడా ఒక చాద్రికి జడ్జిగా వ్యవహరించేవాడు)  ఆ కాలంలో ఇవ్వబడిన తీర్పులను “Jugements du tribunal de la Chaudrie de Pondicherry - 1766 to 1817” అనే పేరుతో Jean Bonnan  అనే ఆయన పుస్తకరూపంలోకి తీసుకొచ్చాడు. 1775 లో బ్రిటిష్‌ ఇండియాలో వార్న్‌ హేస్టింగ్స్‌ భారతీయ శిక్షాస్మృతులను అనుసరించి ‘‘హిందూ లా’’ ను తయారుచేయించి ప్రవేశపెట్టాడు. కాగా ఫ్రెంచి ప్రభుత్వం 1735 లోనే ఒక కమిటీ వేసి స్థానిక  శిక్షాస్మృతులను అధ్యయనం చేయించింది. తదనుగుణంగానే చాద్రిలు తీర్పులు చెప్పేవి. 

            ఇక యానాం విషయానికి వస్తే ఇక్కడ అలాంటి చాద్రిలు పనిచేసినట్లు తెలియరాదు. (రి. జె.బి.పి. మోర్‌)

1819 జనవరి, 6Compte Dupoy (ఫ్రెంచి గవర్నరు) ‘‘క్రిష్టియన్లు, ముస్లిములు లేక హిందువులు ఎవరైనప్పటికీ వారి వారి ఆచార వ్యవహారాలను బట్టి విచారణ జరపవలసి  ఉంటుంది’’ అన్నాడు.  ఇక్కడి ప్రజల బాల్యవివాహాలు, వారసత్వ వ్యవహారాలు వంటివి ఫ్రెంచి చట్టాలకు భిన్నగా ఉన్నప్పటికీ కూడా ఫ్రెంచి ప్రభుత్వం ఇక్కడి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదు.  అలా చేస్తే వారి వ్యాపారమనుగడ దెబ్బతింటుందన్న ఆలోచనలు కూడా   ఉండవచ్చు. 

1819, నవంబరు 22 న జారీ చేసిన ఒక రాజ శాసనం ద్వారా ఫ్రెంచి ఇండియాలో ‘‘మాజిస్ట్రేట్‌ కోర్టులు’’ ప్రారంభించారు.  వీటి ద్వారా ఫ్రెంచిప్రభుత్వం తన కాలనీలలోని ప్రజలకు సమర్ధవంతమైన న్యాయాన్ని అందించే వ్యవస్థకు శ్రీకారం చుట్టింది.

యానాం చాలా చిన్న ప్రాంతం కావటంచే  సివిలు, క్రిమినల్‌, శాంతిభద్రత వ్యవహారాలన్నింటికీ కలిపి ఒకే జడ్జి ఉండేవారు.  మొదట్లో యానాం పెద్దొరే (ఎడ్మినిస్ట్రేటర్‌) జడ్జిగా వ్యవహరించేవాడు.  ఆయనకు నోటరీ మరియు దుబాసీలు సహాయపడేవారు.  ఇక్కడ ఓడిపోయిన కేసులకు పాండిచేరీలో ఉన్న పెద్దకోర్టులో అప్పీలు చేసుకొనే అవకాసం మొదట్లో ఉండేది కాదు.  ఈ లొసుగును ఉపయోగించుకొని Courson వంటి పెద్దొరలు నియంతలుగా వ్యవహరించి కొంతకాలం యానాన్ని గడగడలాడిరచారు.

1784 లో చేసిన ఒక ఫ్రెంచి చట్టం ప్రకారం క్రిమినల్‌ కేసుల్లో జడ్జిమెంటు ఇచ్చేముందు ముగ్గురు స్థానిక ఫ్రెంచి పౌరుల సహాయంతో విచారణ జరపవలసి ఉంటుంది.  ఈ నిబంధన వలన యానాం కోర్టులో క్రిమినల్‌ కేసుల విచారణ నత్తనడకన సాగుతూండేది.  ఎంపిక చేసిన స్థానిక న్యాయ సహాయకులలో ఒకరుంటే ఒకరుండని కారణంగా కేసులు పదేపదే వాయిదా పడేవి.  ఈ ప్రతిబంధకం వలన చాలా కేసులు కోర్టు ఫైళ్ళలో మగ్గిపోతుండేవి.

1829 లో యానాంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి.  వీటిని అదుపుచేయటంలో అప్పటి పెద్దొర Delarche  విఫలం కావటంతో పాండిచేరీ నుంచి Lasparda ను యానాంకు పెద్దొరగా  అత్యవసరంగా పంపించారు.  లెస్పార్డా వచ్చీరాగానే ‘‘తుదితీర్పులు ఇవ్వటానికి యానాం పెద్దొరకు సంపూర్ణ అధికారాలు పాండిచేరీలో ఇవ్వబడ్డాయి’’ అన్న తీర్మానాన్ని స్థానిక కౌన్సిల్‌ లో ప్రవేశపెట్టి ఆమోదింపచేయించుకొన్నాడు.  దీనితో సహాయకుల అవసరం లేకుండా జడ్జిహోదాలో పెద్దొర ఒక్కరే తీర్పులు ఇచ్చే అవకాశం ఏర్పడిరది. అలా లెస్పార్డా తనకు కొన్ని విశిష్టాధికారాలను సృష్టించుకొని ఆనాటి యానాం అల్లర్లను అణచివేయగలిగాడు. (అది 1784 నాటి ఫ్రెంచి చట్ట వ్యతిరేకమైనప్పటికీ)

అప్పట్లో స్త్రీలు, పిల్లలు, ప్రభుత్వోద్యోగులు, చనిపోయినవారలకు చెందిన కేసులకు ప్రథమ ప్రాధాన్యత ఉండి వారికి సంబంధించిన కేసులకు త్వరితగతిన తీర్పులు చెప్పేవారు. 

1833, ఫిబ్రవరి 4 న జారీ చేసిన ఒక డిక్రీ ద్వారా యానానికి ప్రత్యేక జడ్జి నియామకం జరగటం మొదలైంది. (రి.18 February 1833, Letter of De Melay to De Lesparda, COR.GLE, India V.31). ప్రజలకు సరైన న్యాయం అందించటం కోసం 1833 లో సుమారు పదిరకాల వివిధ మాన్యుయల్స్‌ ను ఫ్రెంచి ప్రభుత్వం యానాం కోర్టుకు పంపించింది.  (మాన్యుయల్‌ ఆఫ్‌ జస్టిస్‌, మాన్యుయల్‌ ఆఫ్‌ క్రిమినల్‌ లా, సివిల ప్రొసీజర్‌ వంటివి)

క్రిమినల్‌ కేసుల విచారణ ముగ్గురు లేదా నలుగురు ఫ్రెంచి దేశస్థుల సమక్షంలో జరగాలనే నిబంధనను సడలించి ముగ్గురు లేదా నలుగురు స్థానిక పెద్దలను భాగస్వామ్యులను చెయ్యటం 1848 నుంచి మొదలయ్యింది.  పెద్దొర సిఫార్సుల మేరకు ఈ స్థానిక జడ్జిల నియామకం జరిగేది. ఆ విధంగా కామిశెట్టి పేరమ, బళ్ల సుబ్బయ్య, బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులు, బెజవాడ బాపనయ్య,వర్ధినీడి అయ్యప్పనాయుడు, గిరి వెంకన్న, దరియాఖాన్‌ వంటి స్థానికులు సహాయక జడ్జిలుగా పనిచేసారు.

1850 నాటి యానాం జుడిషియల్‌ వ్యవస్థలో ` ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌ (ఈయనే పోలీసు ఉన్నతాధికారి కూడా), నోటరీ వంటి ప్రధాన పదవులలో ఫ్రెంచి దేశస్థులు, వీరుకాక నలుగురు స్థానిక సహాయకులు, ఒక దుబాసీ, ప్రమాణములు చేయించటానికి బ్రాహ్మణుడు, బంట్రోతు మరియు జైలరు ఒక్కొక్కరు చొప్పున ఉండేవారు.  సుమారు ఇరవైమంది పోలీసులతో కూడిన పోలీసు వ్యవస్థ కోర్టుకు అనుబంధంగా పనిచేసేది.

యానాం కోర్టులో 1833 లో పద్దెనిమిది కేసులు విచారణ జరగగా 1859 నాటికి వీటి సంఖ్య 118 కి పెరిగింది.  ఇది ఆనాటి ప్రజలలో న్యాయవ్యవస్థపై పెరిగిన నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకొనవచ్చును. కానీ 1833 లో ఒకే ఒక క్రిమినల్‌ కేసు నమోదు కాగా 1859 లో 83  క్రిమినల్‌ కేసులు నమోదు కావటం గమనార్హం.

ప్రసిద్దిగాంచిన కొన్ని కేసులు

            యానాం కోర్టు ఏర్పడినపుడు దానికి ప్రథమ మాజిస్ట్రేట్‌ గా Emile Coet Morven నియమితుడయ్యాడు. ఇతని వ్యవహారశైలి తదనంతర కాలంలో వివాదాస్పదమైంది. అక్టోబర్‌  1833 లో మోర్వెన్‌ తన ఇంట్లో పనిచేసే అడపా వెంకటరెడ్డి తనకు త్రాగటానికి మురికి నీరు ఇచ్చాడన్న కోపంతో అతను నాపై విషప్రయోగం చేసి చంపాలనుకొంటున్నాడు అని కేసు బనాయించి పోలీసులచే చితక బాదించాడు.  ముద్దాయిని పరిశీలించిన డా.పిథోస్‌ అతని ఒంటిపై దారుణమైన దెబ్బలున్నాయని దృవీకరించాడు కూడా.

ఈ కేసు విషయం అంతా ఫ్రెంచి గవర్నరు  De malay కు తెలిసి అప్పటి పెద్దొర అయిన జోర్డైన్‌ కు ఈ విధంగా ఉత్తరం వ్రాయటం జరిగింది.

....... నేరం  ఋజువు కాలేదు. ఆ నీరు త్రాగి మోర్వెన్‌ అనారోగ్యం పాలయిన దాఖలాలూ లేవు.  విషప్రయోగం అన్నది ఒట్టి ఊహాగానమే తప్ప మరేమీ కాదు.  అడపా వెంకటరెడ్డిని తక్షణం విడుదల చెయ్యండి..... అందరికీ న్యాయాన్ని అందించాల్సిన న్యాయమూర్తే ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడటం శోచనీయం....... అంటూ అక్షింతలు పెట్టాడు.

ఆ తరువాత కూడా మోర్వెన్‌ వ్యవహార శైలి మారలేదు.  మోర్వెన్‌ అనేక రకాలైన అవమానాలకు, వేధింపులకు గురిచేస్తున్నాడని ఈతని ప్రవర్తన కంటక ప్రాయంగా ఉందంటూ యానాం ప్రజలు 1834లో గవర్నరుకు పిర్యాదులు చేసారు. ఆర్ధిక అవకతవకలకు పాల్పడి యానాంపెద్దొర ఉద్యోగాన్ని పోగొట్టుకొన్న కుర్సన్‌కు ఈ మోర్వెన్‌ అల్లుడే కావటం ఇక్కడ విశేషం.

మన్యవోరి మేడలో మానవ బలి కేసు

యానాం మన్యవోరి మేడలో అభియోగింపబడిన మానవబలి పై పాండిచేరి కోర్టు ప్రధాన న్యాయమూర్తి Ristle Hueber 17 నవంబరు 1858 మరియు 25 మార్చి 1859 తారీఖులలో జరిపిన విచారణల అనంతరం సమర్పించిన రిపోర్టు సారాంశం ఈ విధంగా ఉంది (రి. ఇండియా కార్డు 463). 

........ మన్యం వెంకటరత్నం యానాంలో పేరుమోసిన జమీందారు. ఇతనికి ఫ్రెంచి దొరలకూ మధ్య అనేక ఆర్ధిక వ్యాపారలావాదేవీలు ఉండేవి. 1856 ప్రాంతంలో ఈతనికి వచ్చిన జబ్బు ఎన్ని మందులు వాడినా తగ్గలేదు.  దానితో వెంకటరత్నం, షేక్‌ లాలా, ఆదినారాయణుడు మరియు బావాజి అనే ముగ్గురు మంత్రగాళ్ళను ఆశ్రయించాడు.  వాళ్ళు ఇదంతా చేతబడి ప్రభావం అని జమిందారును నమ్మించారు.  మీకు చేతబడిచేసింది నిజమే అయితే మేం చదివే మంత్రం పూర్తికాగానే మీ ఇంటిపై రాళ్ళు వర్షిస్తాయి అంటూ ఏవో మంత్రాలు జపించగా` వెంకటరత్నం ఇంటిపై రాళ్ళ వర్షం కురిసిందట. దానితో జమీందారు ఆ మంత్రగాళ్ళ మాటలకు లొంగిపోయాడు. వాళ్ళు అలా జమీందారు ఇంట్లో ఎనిమిదిరోజుల పాటు క్షుద్రపూజలు చేసారు.  తోట గవన్ను అనే ఆ ఇంటి పనివాడిపై దెయ్యాన్ని ఆవహింపచేస్తే ‘‘నువ్వొక నెలరోజుల్లో చనిపోతావు ఇప్పటికే ఆలస్యమయ్యింది తొందరగా భూతశాంతి చేయించు’’ అన్నదట.  దీంతో బెంబేలెత్తిపోయిన జమీందారు మంత్రగాళ్ళు చెప్పినట్లు  ‘‘మానవ కన్య’’ ను బలి ఇవ్వటానికి సిద్దపడ్డాడు.  ఆ మంత్రగాళ్ళ కన్ను ఆ ఇంటిలోనే పనిచేస్తున్న తోట గవన్ను కూతురైన పదేళ్ళ మంగ పై పడ్డాయి.  తోట గవన్నుకు తెలియకుండా బలి ఇవ్వటానికి ఆమెను ఎంచుకొన్నారు.

15 మే, 1856 న మంత్రగాళ్ళు ఆమెను పెరట్లోకి తీసుకు వెళ్ళి ఏవో పదార్ధాలను ఆమెచే తాగించారు.  అవి తాగాకా ఆమె ఇంటికి వెళ్ళి అపస్మారక స్థితికి చేరి రెండురోజుల తరువాత మరణించింది.  కూతురు మరణించటం పట్ల ఆగ్రహించిన తోట గవన్ను కొంతమంది పెద్దల సహాయంతో, మన్యం వెంకటరత్నం మరియు ఆ ముగ్గురు మంత్రగాళ్ళపై యానాం కోర్టులో కేసువేసాడు..... అంటూ రిజెల్‌ హూబర్‌ రిపోర్టు మొత్తం జరిగిన ఉదంతాన్ని క్రోడీకరించింది. 

అక్కడినుంచి మొదలైంది అసలు కధ. తోటగవన్ను ఇచ్చిన కంప్లైంట్‌ ఆధారంగా ఈ బలి ఉదంతంపై విచారణ జరిగింది.  ఆ అమ్మాయికి విషాన్ని పట్టించారన్న ఆరోపణ నిజానిజాలు నిర్ధారించటానికి వీలుపడలేదు, ఎందుకంటే అప్పటికే శవదహనం జరిగిపోయింది.  అందుచేత  అప్పటి యానాం కోర్టు జడ్జి ణవ De Saint Hilaire ఈ కేసును కొట్టివేసి ముగ్గురు మంత్రగాళ్ళు నిర్ధోషులని విడుదల చేసేసాడు.  ఈ తీర్పు పట్ల యానాంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయింది.  మన్యం వెంకటరత్నం తన పలుకుబడిని ఉపయోగించి కేసును కొట్టివేయించాడని యానాం నుంచి పిర్యాదులు అందటంతో ` పాండిచేరీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రిజెల్‌ హ్యూబర్‌ మొత్తం కేసును పునర్విచారణ స్వయంగా చేపట్టి ఆ మంత్రగాళ్ళకు మూడునెలల జైలు శిక్ష మరియు మంగ తల్లికి వెయ్యిరూపాయిల పరిహారాన్ని ఇప్పిస్తూ తీర్పు చెప్పాడు.

ఈ మొత్తం ఉదంతంలో ఫ్రెంచి ప్రభుత్వం అప్పట్లో యానాంలో అన్ని రంగాలలో ఆధిక్యతలో ఉన్న ఓ ప్రధాన సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచటానికే ఆ నిందితులకు నామ మాత్రపు శిక్షలు విధించినట్లు అనిపించక మానదు.

చెళ్లపిళ్ల వారి కేసు

తొలితరం ప్రముఖ ఆధునిక తెలుగుకవి చెళ్లపిల్ల వెంకటశాస్త్రి యానాంలో 1880 లలో విద్యనభ్యసించారు. చెళ్లపిల్ల వారు అల్లే కవిత్వంలో తమను గరించి దూషణలు ఉన్నాయని కొంతమంది స్థానికులు కొంతమంది  వీరిపై యానాం కోర్టులో కేసువేసారట.  ఆ కేసు విచారణ చేసిన జడ్జిగారు నూనూగు మీసాలైనా లేని చెళ్లపిల్ల వారిని చూసి ‘‘వీడు పొయెట్‌ అంటే నేను ఒప్పుకోను’’ అని కేసు కొట్టివేసాట్ట. (రి. చెళ్లపిల్ల వారు రచించిన కధలు`గాధలు పుస్తకం). ఆ తరువాత కాలంలో శ్రీచెళ్లపిల్ల వారు ఆంధ్రదేశం గర్వించదగ్గ కవిగా పేర్గాంచారు.  ఈ సందర్భంలో చెళ్లపిల్ల వారి తరపున వాదించిన లాయర్‌ యొక్క సామర్ధ్యం మెచ్చుకోదగ్గది ఎందుకంటే నిజంగానే నందిని పందిగా చేయగలిగాడీ కేసులో.

ఎన్నికల కేసులు

యానాంలో ఎన్నికలు జరిగిన ప్రతీసారీ ఓడిపోయిన అభ్యర్ధులు విజేతలపై కేసులువేయటం పరిపాటిగా ఉండేది.  1880 మేలో జరిగిన ఎన్నికలలో బెజవాడ బాపనయ్య మేయరుగా ఎన్నికయ్యారు.  ఈ ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్ధులు కేసు పెట్టారు.  మేయర్‌ పదవి చేపట్టటానికి బెజవాడ బాపనయ్యకు 25 సంవత్సరముల వయసులేని కారణంగా ఆయన మేయర్‌ ఎన్నిక చెల్లదంటూ యానాం కోర్టు తీర్పుచెప్పింది.

1922 లో కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు స్థానిక మండలి సభ్యునిగా ఎన్నికయినపుడు ఆయనకు ఫ్రెంచిరాదనీ, ఆ ఎన్నిక చెల్లదంటూ గిరి తాతయ్య కేసు వేసారు.  కోర్టువారు విచారణ జరిపి కామిశెట్టికి తగినంత ఫ్రెంచి వచ్చు కనుక అతని ఎన్నిక చెల్లుతుందని తీర్పుచెప్పారు. 

గ్రామ బహిష్కరణ తీర్పు

ఫ్రెంచి కోర్టు తీర్పులలో గ్రామబహిష్కరణ కూడా ఒక శిక్షావిధానంగా ఉండేది. ఉదాహరణకు యానానికి చెందిన సత్తర్‌ సాహేబ్‌ అనే ఫ్రెంచి పౌరుడు దొంగతనం చేసినట్లు  ఋజువు కావటంతో అతని కేసులో 1913, జూన 27 న ఇచ్చిన తీర్పులో` మూడునెలల జైలు శిక్ష, 25 ఫ్రాంకుల జురిమానా మరియు ఒక సంవత్సరం పాటు గ్రామ బహిష్కరణ శిక్షలు విధించటం జరిగింది.  ఈ గ్రామ బహిష్కరణ ఒక్క యానానికి మాత్రమే పరిమితం కాక మిగిలిన అన్ని ఫ్రెంచి కాలనీలకు కూడా వర్తిస్తుంది.

యానాం విమోచనం లో జడ్జి పాత్ర

1954లో యానాంను ఫ్రెంచి పాలననుండి విముక్తం చేయటానికి విమోచనోద్యమం ముమ్మరంగా జరిగింది. ఆ సందర్భంలో  ఫ్రెంచి దేశస్థుడయిన జార్జిసాలా యానాం అడ్మినిస్ట్రేటరుగా కొనసాగటం మంచిదికాదన్న ఉద్ధేశ్యంతో ఫ్రెంచి ప్రభుత్వం ఆయనను పాండిచేరీ పిలిపించివేసింది. అప్పటి యానాం కోర్టు న్యాయమూర్తి అయిన శ్రీ శివా గారికి యానాం  అడ్మినిస్ట్రేటరు బాధ్యతలను అప్పచెప్పేరు. 1954 జూన్‌, 13న వేల సంఖ్యలో విమోచనోద్యమకారులు అడ్మినిస్ట్రేటరు బంగళాను చేరుకొని ఇంచార్జ్‌ అడ్మినిస్ట్రేటరు అయిన శ్రీ శివా నుండి అధికారాలను స్వాధీనపరచుకొని, యానాం రెండు శతాబ్దాల ఫ్రెంచిపాలన నుండి విముక్తమైందని ప్రకటించారు. శ్రీ శివా పరిస్థితిని సమీక్షించి ప్రతిఘటించినట్లయితే తలెత్తే శాంతిభద్రతల సమస్యను దూరాలోచనచేసి అధికారాలను ఉద్యమకారులకు బదలాయించారు.  ఆ విధంగా యానాంలోని ఫ్రెంచిపాలనకు స్వస్థి వాక్యం పలకబడిరది. వలసపాలకుల నుండి రాజ్యాధికారం స్థానికులకు అందించటంలో యానాం జడ్జి పాత్ర ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయింది.

ముగింపు

యానాం మేజిస్ట్రేట్‌ కోర్టువారి అధికారిక వెబ్‌సైటు లో యానాం కోర్టు 1725 కు పూర్వం డచ్చివారిచే నిర్మింపబడిరదని, 1725 లో ఫ్రెంచివారి చేతుల్లోకి వెళ్ళిందని ఉంది. ఇది మొదట డచ్చి కోర్టు అనీ తరువాత ఫ్రెంచి కోర్టుగా రూపాంతరం చెందినట్లు వ్రాయబడిరది.  ఏ ఆధారాలతో ఒక ప్రభుత్వ వెబ్‌ సైటులో అలాంటి సమాచారాన్ని పొందుపరచారో ఆశ్చర్యం కలిగించక మానదు.

యానాన్ని డచ్చివారు పరిపాలించినట్లు కానీ ఇక్కడ తమ స్థావరాల్ని ఏర్పాటుచేసుకొన్నట్లు కానీ ఎక్కడా చారిత్రిక ఆధారాలు కనిపించవు. డచ్చివారు పరిపాలించిన ప్రదేశాలైన పాలకొల్లు, జగన్నాధపురం వంటి ప్రాంతాలలో ఎక్కడా ఏ విధమైన కోర్టులు నిర్మించలేదు.  పాపం వారికి పదిహేడవ శతాబ్దం అంతా స్థానికరాజుల నుండి వ్యాపారానుమతులు పొందటంతోనే సరిపోయింది.  పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్‌ వారితో పోటీ పడలేక కనుమరుగయిపోయారు.  ఇంగ్లీషు, ఫ్రెంచివారిలాగా డచ్చివారికి స్థానిక పరిపాలనలో పాలుపంచుకొనే అవకాశమే రాలేదు.  కనుక ప్రస్తుతకోర్టు డచ్చివారిచే నిర్మించబడిరదనటం సత్యదూరం.

            యానాంలో చాద్రిలు లేవని జె.బి.పి. మోర్‌ అభిప్రాయపడినప్పటికీ పాండిచేరీలో వాటి నిర్వహణ  1717 నుంచీ సమర్ధవంతంగా ఉన్నది కనుక, యానాంలో కూడా 1723`1758 మధ్య కాలంలో పెద్దొరలుగా పనిచేసిన Guillard, Choisy, Saifray వంటి ప్రభృతులు వాటిని నిర్వహించి ఉండవచ్చుననే భావించవచ్చును.  ఏది ఏమైనప్పటికీ 1833 నుంచి మాత్రం ఒక పూర్తిస్థాయి జడ్జితో యానాం కోర్టు నడిచిందన్నది ఒక చారిత్రక సత్యం.



(ఈ వ్యాసం నేను రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకం (2010) నుండి. Pdf ఆర్కైవ్స్ లో కలదు)

బొల్లోజు బాబా

 




Wednesday, September 17, 2025

ఫ్రెంచి యానాంలో జరిగిన బానిసల వ్యాపారం

పంతొమ్మిదవ శతాబ్దం చివరవరకూ జరిగిన బానిస వ్యాపారం మానవజాతి ఎన్నటికీ చెరుపుకోలేని మరక. స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాల ఆవశ్యకతను ప్రపంచానికి తెలియచెప్పిన ఫ్రాన్స్‌ ఒకానొక సమయంలో బానిస వ్యాపారంలో ప్రధాన పాత్ర వహించటం అశ్చర్యం కలిగించే విషయం. 1794 లోనే ఫ్రెంచి రిపబ్లిక్‌ బానిసవ్యాపారాన్ని నిషేధించింది. కానీ 1802 లో నెపోలియన్‌ ఆ నిషేదాన్ని ఎత్తివేసాడు. ఈ వెసులుబాటు వల్ల 1830 లో లూయిస్‌ ఫిలిప్‌ బానిస వ్యాపారాన్ని నేరమని చట్టం తీసుకువచ్చే వరకూ అది చట్టబద్దంగానే కొనసాగింది. ఇక అనధికారంగా 1850 ల వరకూ కూడా అక్కడక్కడా నడిచింది. బానిస వ్యాపారాన్ని 1772 లోనే ఇంగ్లాండ్‌ నిషేదించి ఫ్రాన్స్‌ కంటే ముందుండటం గమనార్హం. ఈ విషయంలో ఫ్రెంచి వారిపై బ్రిటిష్‌ వారు ఆ కాలంలో ఒక విధమైన మోరల్‌ పోలీసింగ్‌ పాత్రను పోషించారు. 

ఫ్రాన్స్‌ కు స్థానికంగా ఈ అనాగరీకమైన బానిస వ్యాపారం పట్ల ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ దానిని నిషేదించలేకపోవటానికి ఫ్రెంచి కాలనీఅయిన రీయూనియన్‌ (మడగాస్కర్‌ సమీపంలో ఫ్రెంచివారు ఆక్రమించుకొన్న ఒక ద్వీపం) మంచి లాభాల్నిచ్చే చెరకుతోటల సాగుకు వేల సంఖ్యలో కూలీలు అవసరం కావటం, ఆ తోటలు సమకూర్చే ఆర్ధికవనరులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సుమారు యాభైలక్షలమంది ఫ్రెంచి వారికి జీవనోపాధి కలిగించటం (1763 నాటికి) వంటివి ప్రధాన కారణాలు. అందుకనే ఫ్రెంచి ప్రభుత్వం బానిస వ్యాపారానికి సబ్సిడీలు ఇచ్చి మరీ ప్రోత్సహించవలసి వచ్చేది. ఈ కారణాల దృష్ట్యా, 1672 లో 10 లీవ్ర్‌ లు (లీవ్ర్‌ R ప్రాచీన ఫ్రెంచి కరెన్సీ. ఒక లీవ్ర్‌ సుమారు 450 గ్రాముల వెండి విలువతో సమానం) ఉండే ఒక బానిస వెల 1730 లో 100 లీవ్ర్‌లకు, 1787 నాటికి 160 లీవ్ర్‌లకు క్రమంగా చేరింది. 

ఫ్రెంచి వారు తమ బానిసలను మొదట్లో ఆఫ్రికా నుంచి సేకరణ జరిపినా కాలక్రమేణా ఇండియాలోని తమ కాలనీలనుంచి కూడా తరలించటం మొదలెట్టారు. 1760 లో ఏడాదికి సగటున 56 షిప్పులలో బానిసల ఎగుమతి జరిగేది. ఒక్కో షిప్పు మూడు నుంచి నాలుగొందల మంది బానిసలు పట్టే సామర్ధ్యం కలిగుండేవి. 1767 లో చక్కెర ఉత్పత్తిలో ఫ్రెంచి వారు ప్రపంచంలో అగ్రగామిగా నిలిచారు. రీయూనియన్‌ లో చెరకు తోటల్లో పనిచేసే బానిసల జీవనం కడు దయనీయంగా ఉండేది. వారు రోజుకు దాదాపు ఇరవై గంటలు పనిచేసేవారు. స్త్రీలు కొద్ది సంఖ్యలో ఉండేవారు. కుటుంబాలు ఉండేవి కావు. ఆ కారణాల వల్ల మరణ రేటు అధికంగా ఉండటంతో బానిసల కొరత నిరంతరం ఉండేది. బానిసలను చేరవేసే నౌకలకు Amity, Liberte వంటి గొప్ప పేర్లు ఉండటం దురదృష్టకరం.

యానాంలో ఫ్రెంచి వారు జరిపిన బానిస వ్యాపారానికి ఆధారాలు 1792 లో యానాం సమీపంలో కల ఇంజరం అనే గ్రామంలో నివసించే Mr. Yates అనే ఓ బ్రిటిషర్‌ పాండిచేరీలోని ఫ్రెంచి గవర్నర్‌ జనరల్‌ కి (Colo De Fresne) వ్రాసిన ఓ లేఖలో దొరుకుతాయి. (Ref. Asiatic Journal Vol. 26 No. 156 - printed in 1828, Chapter Slavery in India, Pages from 665 to 670)

యేట్స్‌ ఎపిసోడ్‌ (1792): బానిసలను ఎక్కించుకొనే ఫ్రెంచి నౌకలు కోరంగి నుంచి బయలు దేరే తారీఖు దగ్గర పడేకొద్దీ బానిసలను సరఫరా చేసే మధ్యవర్తులు రకరకాల పద్దతులకు పాల్పడేవారు. కొంతకాలం క్రితం ఈ ప్రాంతంలో విపరీతమైన కరువు విలయతాండవం చేయటం వల్ల తిండిలేక చచ్చిపోవటం కంటే బానిసగా బతకటమే మేలనే ఉద్దేశ్యంతో ప్రజలుండేవారు. కానీ ప్రస్తుతం కొద్దో గొప్పో తిండి గింజలు దొరికే పరిస్థితి ఉండటం చే బానిసల సేకరణ ఫ్రెంచి వారికి కష్టమై హింసాత్మక పద్దతులకు పాల్పడటం మొదలెట్టారు. యానాం వీధులలో తిరిగే యాచకులను యానాంలో సరుకులు కొనుగోలు కోసం వచ్చిన ఇతర గ్రామస్తులను పట్టి బంధించి, రహస్య ప్రదేశాలకు తరలించి అక్కడి నుంచి రాత్రివేళలలో ఫ్రెంచి నౌకలలోకి ఎక్కించేవారు. ఈ వ్యక్తులను వారి కుటుంబాలనుంచి అతి కిరాతకంగా విడదీయటం అనేది ఆయా ఫ్రెంచి నౌకల యజమానుల కనుసన్నల్లో జరిగేది ......... అంటూ యేట్స్‌ యానాంలో ఫ్రెంచి వ్యాపారులు జరుపుతున్న బానిస వ్యాపారం గురించి తన లేఖలో పేర్కొన్నాడు. 

ఈ అభియోగాలను సమర్ధిస్తూ అయిదుగురు ఇంజరం వాస్తవ్యులు లిఖిత పూర్వకంగా ధృవీకరించారు. వీరిలో బొండాడ వెంకటరాయలు అనే ఓ వైశ్యుడు వ్రాసిన మరో లేఖ ఈ ఉదంతం పై మరింత వెలుగును ప్రసరింపచేస్తుంది.

బొండాడ వెంకటరాయలు ఫ్రెంచి ఈస్ట్‌ ఇండియా కంపెనీచే గుర్తింపు పొందిన ఒక యానాం వ్యాపారి. ఈయన తన ఉత్తరంలో...... M. de Mars, M. La Blanche మరియు M. Ellardine అనే ముగ్గురు ఫ్రెంచి నౌకయజమానులు బానిసలను కొనుగోలు చేయటానికి మధ్యవర్తులను ఏర్పాటుచేసుకొని వారి ద్వారా యానాంలోని ముష్టివారిని, పొరుగూరి వారిని బలవంతంగా నిర్బంధించి కోరంగి రేవులో నిలిపిన వారి నౌకలలోకి ఎగుమతి చేయిస్తున్నారని` అంతే కాక యానాం చుట్టుపక్కల గ్రామాలకు మనుషులను పంపించి అక్కడి కూలీలకు, దర్జీలకు పని ఇప్పిస్తామని నమ్మబలికి వారిని యానాం తీసుకువచ్చి బంధించి రాత్రివేళలలో ఎవరికీ తెలియకుండా నౌకలలోకి తరలిస్తున్నారనీ` ప్రతిఘటించేవారి నోటిలో గుడ్డలు కుక్కి లేదా సారాయిని బలవంతంగా తాగించి ఆ నిస్సహాయ స్థితిలో వారిని నౌకలోకి మోసుకుపోవటం జరుగుందనీ .......అంటూ బొండాడ వెంకటరాయలు తన లేఖలో ఆనాటి సంఘటనలను వర్ణించాడు.  

ఆతేరు గ్రామానికి చెందిన ఒక బ్రాహ్మల అబ్బాయిని, నీలపల్లి కి చెందిన ఒక భోగం పిల్లని ఏ ఊరో తెలియని ఓ బ్రాహ్మణ అమ్మాయిని కూడా ఈ విధంగానే కిడ్నాప్‌ చేసి నౌకలోకి తరలించారు. ఈ ముగ్గురి విషయం తన మిత్రుల ద్వారా తెలుసుకొన్న యానాం పెద్దొర (సొన్నరెట్‌) ఆ నౌక కెప్టెన్‌ కు ఆదేశాలు జారీ చేసి వారిని విడుదల చేయించాడు. 

అలా ఆ ఫ్రెంచి నౌక ఎక్కి తిరిగొచ్చిన ఆ ముగ్గురూ, ఆ నౌకలో అనేక మంది కూలీలు, కుటుంబ స్త్రీలు, కొద్దిమంది బ్రాహ్మణులు ఉన్నారని చెప్పటంతో ఆగ్రహించిన స్థానికులు, ఆ మిగిలిన వారిని కూడా విడిపించమని సొన్నరెట్‌ ను అడిగారు. కానీ సొన్నరెట్‌ ఏ రకమైన హామీ ఇవ్వకపోవటం, నౌక బయలుదేరే తారీఖు దగ్గరపడుతూండటంతో వారంతా పొరుగునే ఉన్న బ్రిటిష్‌ అధికారులను ఆశ్రయించారు.  

ప్రజల వద్దనుండి వచ్చిన విజ్ఞప్తులపై విచారణ నిమిత్తం యేట్స్‌ యానాం వెళ్లగా, చాలామంది యానాం ప్రజలు ఆయనను చుట్టు ముట్టి సుమారు మూడువందలకు పైగా వారి బంధువులను ఎత్తుకుపోయారని గగ్గోలు పెడుతూ తమ గోడును వెళ్ళబోసుకొన్నారు. చిన్న పిల్లలను కూడా విడిచిపెట్టలేదని కన్నీరు మున్నీరై వారు విలపించారు. ఈ మొత్తం ఉదంతంపై సొన్నరెట్‌ ను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని మొదట్లో వాదించి, చివరకు కావాలంటే నౌకను తనిఖీ చేసుకోవచ్చునని అనుమతినిచ్చాడు. దరిమిలా ఒక ఫ్రెంచి అధికారి, స్కోబీ అనే ఒక ఇంగ్లీషు అధికారి పర్యవేక్షణలో ఒక కమిటీ ఏర్పడి నౌక తనిఖీ కి కోరంగి వెళ్ళారు. కానీ నౌక కెప్టెన్‌ వీరిని నౌక లోపలకు రాకుండా అడ్డుకొని ఏ విధమైన వివరణలు ఇవ్వకుండా కమిటీని వెనక్కు పంపించేసి కోరంగి రేవునుండి నౌకతో సహా జారుకొన్నాడు.  

యానాం పెద్దొర తన విచక్షణాధికారాలను ఉపయోగించి నౌకను నిలుపు చేసి ఉన్నట్లయితే ఆ స్థానికుల తరలింపు నివారింపబడి ఉండేదని యేట్స్‌, Major Wynch అనే మరో బ్రిటిష్‌ అధికారికి వ్రాసిన ఒక లేఖలో పేర్కొన్నాడు. 

పాండిచేరిలోని ఫ్రెంచి గవర్నరు (M.De Fresne) ఈ విషయాలనన్నీ బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ Lord (Cornwallis) ద్వారా తెలుసుకొని ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వారిని అరెస్టు చేసి పాండిచేరీ పంపవలసినదిగా ఆదేశాలు జారీచేసాడు. అంతే కాక వీటిని నియంత్రించలేని తన నిస్సహాయతను కూడా తెలియచేసాడు. (సరైన పర్యవేక్షణా యంత్రాంగం లేకపోవటం వల్ల) అలాంటి అనుమతుల కోసమే ఎదురుచూస్తున్న బ్రిటిష్‌ ప్రభుత్వం వెంటనే కోరంగి, భీమిలిపట్నం ల వద్ద సిపాయిలను నియమించి తీర ప్రాంతంలో ఫ్రెంచి వారు జరిపే దారుణ బానిస వ్యాపారం అరికట్టటానికి పూనుకొంది. 

యానాం పెద్దొర సొన్నరెట్‌ మాత్రం ఒక లేఖలో ‘‘ఇంగ్లీషువారు కూడా ఈ బానిస వ్యాపారంలో ఉన్నారనీ, ఒకసారి ఇంగ్లీషునౌకలో బానిసలుగా తరలింపబడుతున్న 12 మంది యానాం వాసులను తాను విడిపించానని’’ చెప్పటం ఈ మొత్తం ఉదంతానికి కొసమెరుపు. 

1793 నుండి 1816 వరకూ యానాం బ్రిటిష్‌ వారి ఆధీనంలో ఉండటం వల్ల ఆ కాలంలో యానాంలో జరిగిన విషయాలు తెలియరావు.

ఫ్రెంచి వారు చేసే ఈ బానిస వ్యాపారంపై బ్రిటిష్‌ వారి పహారా ఎంతెలా ఉండేదో 1820 లో జరిగిన ఒక సంఘటన తెలియచేస్తుంది.


 La Jeune Estele  అనే ఫ్రెంచి నౌకను బ్రిటిష్‌ పడవలు వెంబడిరచగా ఆ నౌక కెప్టెన్‌ కొన్ని పీపాలను సముద్రంలోకి విసిరేయటం మొదలెట్టాడు. అలా విసిరేసిన ఒక్కో పీపాలో 12 నుండి 14 సంవత్సరముల వయసు కలిగిన బానిసలు ఉండటం పట్ల యావత్‌ప్రపంచం నివ్వెరబోయింది. ఈ సంఘటన తరువాత ఫ్రెంచి నౌకలపై బ్రిటిష్‌ వారి కాపలా మరింత ఉదృతమైంది. అయినప్పటికీ ఈ కాలంలో 3211 మంది కూలీలను పంతొమ్మిది నౌకలలో యానాం నుంచి రీయూనియన్‌ కు పంపించటం జరిగింది. వీరిలో అధికశాతం ఇంగ్లీషు టెరిటరీనుంచి సమీకరించటం గమనార్హం. (Article of Mr. Jacques Weber - L’emigration Indeienne vers les colonies francaises)

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ ఫ్రెంచి ప్రభుత్వం పాత పద్దతులకు స్వస్థి పలికి కూలీల సేకరణ కొరకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

యానాంలో కాంట్రాక్టు పద్దతిపై కూలీల ఎగుమతి

రీ యూనియన్‌ లోని చెరుకు తోటలలో పనిచేయటానికి కార్మికుల అవసరం రోజు రోజుకూ పెరగటం, ఇండియానుంచి కూలీలను తీసుకుపోవటానికి, పొరుగు రాజ్యాన్ని ఏలే బ్రిటిష్‌ వారు ఎక్కడికక్కడ అనేక ఆంక్షలు విధించటం వల్ల ఫ్రెంచి ప్రభుత్వం 1828 లో కాంట్రాక్టు పద్దతి ద్వారా కూలీలను రిక్రూట్‌ చేసుకోవటం మొదలెట్టింది. ఫ్రెంచి ప్రభుత్వం నియమించిన ఏజెంటుకు, పనిచేయటానికి ముందుకొచ్చిన కూలీకి మధ్య జరిగే కాంట్రాక్టులో ఈ క్రింది హామీలుండేవి.

1. కాంట్రాక్టు కాల పరిమితి మూడు సంవత్సరాలు

2. ప్రతి కూలీకి నెలకు 7 రూపాయిల జీతం ఇవ్వబడుతుంది.

3. తిండి, వసతి, ఆరోగ్య సదుపాయాలు కల్పించబడతాయి.

4. వారి వారి ఆచారాలను, మతపరమైన సాంప్రదాయాలను గౌరవించటం జరుగుతుంది.

5. రాను, పోను ఖర్చులను మరియు కాంట్రాక్టు ముగియక ముందే అనారోగ్య లేదా ఇతర కారణాల వల్ల స్వదేశానికి వెళ్లాలనుకొనేవారి తిరుగు ప్రయాణ ఖర్చులను కూడా యజమానే భరిస్తాడు.

6. ప్రతి కూలీకి ముందుగా మూడు నెలల జీతం అడ్వాన్సుగా ఇవ్వబడుతుంది.

7. పనిలో చేరాకా ఇచ్చే జీతంలో 3 రూపాయిలను కూలీ చేతికి, మిగిలిన 4 రూపాయిలు ఇక్కడ అతని కుటుంబ సభ్యులకు నెల నెలా అందించబడుతుంది. 

Lకాంట్రాక్టు లోని చివరి రెండు హామీలకు యానాం వాసులే కాక పొరుగు ప్రాంతాల వారు కూడా ఆకర్షితులై అధిక సంఖ్యలో ముందుకొచ్చారు. ఆ విధంగా కాంట్రాక్టు కుదుర్చుకొన్న మొత్తం 268 మంది కార్మికులు 1829 ఆగస్టు, 7 న యానాం నుంచి రీయూనియన్‌ కు బయలు దేరారు. వారిలో 197 మంది దళితులు, 27 మంది ముస్లిములు, పదముగ్గురు చేనేత కార్మికులు, అయిదుగురు పల్లీయులు, ఇద్దరు అగ్రకులస్థులు (మిగిలిన వారి వివరాలు తెలియరావు) ఉన్నారు(]. Personal state of Indians embarking at Yanam for Bourbon from 16 March 1828 to 6 August 1829, COR.GLE, India V. 29).

అలా బోర్బన్‌ (రీయూనియన్‌) కు పంపించబడిన యానాం కూలీల కుటుంబాలకు నెల నెలా ఇచ్చే చెల్లింపులను రీయూనియన్‌ లోని వారి యజమాని అయిన Mr. Argand తరపున తాను చెల్లిస్తానని యానాంలో ఉండే ఫ్రెంచి ఏజన్సీ De Courson and Co వారు హామీ ఉన్నారు. మొదటి వాయిదా డిశంబరు 1829 నాటికి చెల్లించవలసి ఉంది. కానీ జనవరి వచ్చేసినా వారికి ఒక్క పైసా కూడా ముట్టలేదు. వారందరూ యానాం పెద్దొర అయిన Mr. De Lesparda వద్దకు వచ్చి విన్నవించుకొన్నారు. ‘‘ఆర్గాండ్‌ నుంచి మాకేమీ డబ్బులు ముట్టలేదు కనుక మేము వీరికి ఏ రకమైన చెల్లింపులు చేయలేము’’ అని కుర్‌సన్‌ అండ్‌ కో వారు చేతులెత్తేయటంతో` ఎనిమిదిరోజులుగా పస్తులతో పెద్దొర బంగ్లా వద్ద ఎదురుచూస్తున్న ఆ కూలీల కుటుంబాలకు యానాం పెద్దొరే, 1830 జనవరి, 17 నుంచి కొద్దిపాటి చెల్లింపు చేయటం మొదలెట్టాడు.  

యానాంలో ఇలా ఉండగా, అక్కడ రీయూనియన్‌ లోని చెరుకు తోటలు ఆ సమయంలో భారీ నష్టాలను ఎదుర్కోవటంతో యానాం కూలీలు సంతృప్తికరంగా లేరనే సాకు చూపి తాము కుదుర్చుకొన్న ఆర్ధిక ఒప్పందాలు నెరవేర్చలేమని అక్కడి తోటల యజమానులు తెగేసి చెప్పి, వారిని తిరిగి ఇండియా పంపించివేసారు. ఆ విధంగా యానాంలో జరిగిన కాంట్రాక్టు కూలీల ఎగుమతి వ్యవహారం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కాంట్రాక్టు పద్దతిలో కల ఆమోదయోగ్యమైన అంశాలకు ఆశ్చర్యపడిన బ్రిటిష్‌ వారు ఈ రకపు కూలీల తరలింపును ఏ విధంగానూ ఆటంక పరచలేకపోయారు. అయినప్పటికీ ఈ పద్దతి విజయం సాధించలేకపోవటం తో మరలా మరో ఇరవై ఏళ్ల వరకూ యానాం నుంచి ఏ విధమైన వలసలూ జరిగినట్లు తెలియరాదు.

కూలీల సేకరణలో ఫ్రెంచి వారిపై బ్రిటిష్‌ వారి ఆంక్షలు

కాలక్రమేణా కూలీల సేకరణ, వారి తరలింపు అనేది అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా మారటంతో పాండిచేరి, కారైకాల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లలో ఇదొక ప్రధాన పాత్ర వహించటం మొదలైంది. ఫ్రెంచి ప్రభుత్వం కూడా »»Society for Emigrationµµ అనే సంస్థకు ఈ విషయంలో సర్వాధికారాలు కట్టబెట్టింది. ఈ సొసైటీ అధిపతి అయిన Jouls Bedier Priery ఈ వ్యాపారంలో విపరీతమైన లాభాలార్జించి అప్పటి ఫ్రెంచ్‌ ఇండియాలో అత్యంత ధనికుడిగా పేర్గాంచాడు. ఒకానొక దశలో పాండిచేరి, కారైకాల్‌ లలో కూలీలు ఇక దొరకని పరిస్థితి రావటంతో బెడియర్‌ కళ్లు యానాం పై పడ్డాయి. దరిమిలా బెడియర్‌ కోరిక మేరకు ఫ్రెంచి ప్రభుత్వం, యానాంలో కూలీల సేకరణ జరుపుకోవటానికి అనుమతినిస్తూ 1849 సెప్టెంబరు, 1న ఉత్తర్వులు జారీచేసి, అప్పటి యానాం పెద్దొర జోర్డైన్‌ కు రెండువేల పాస్‌పోర్టులను పంపించింది. (ఒక ఫ్రెంచి పౌరుడు విదేశాలకు వెళ్లటానికి పాస్‌పోర్టులు అవసరం) ( India card 464, D 591 and the article of Jaques Weber)

లె పికార్డ్‌ అనే ఫ్రెంచ్‌ నౌకలో బెడియర్‌ తన మందిమార్బలంతో 1849 సెప్టెంబరు, 11 న పాండిచేరీలో బయలుదేరి 14 సెప్టెంబరుకు యానాం చేరుకొన్నాడు. ఈ ప్రాంతమంతా ఘోరమైన వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్థమై ఉండటం వల్ల వారికి కూలీల సేకరణ పెద్ద కష్టం కాలేదు. 30 సెప్టెంబరు కల్లా మొదటి దఫా కూలీల సేకరణ పూర్తయింది. వారికి (60 మంది) యానాం పెద్దొర జోర్డైన్‌ సంతకం చేసిన పాస్‌ పోర్టులు జారీ చేయబడ్డాయి. వీరందరినీ కోరింగి రేవులో ఫ్రాన్స్‌ జాతీయపతాకాన్ని అతిశయంతో రెపరెపలాడిస్తున్న తన నౌకలోకి చేరుస్తూండగా మొదలైంది అసలు కధ.

అక్టోబరు 1 న ఒక బ్రిటిష్‌ అధికారి ఓ కానిస్టేబుల్‌ని వెంటేసుకొని వచ్చి ఈ కూలీలు స్వచ్చందంగా వెళుతున్నారా లేక బలవంతంగా తరలించబడుతున్నారా అన్న విషయం తెలుసుకురమ్మని రాజమండ్రి కలక్టరు జారీ చేసిన ఒక ఉత్తర్వును చూపి, ఆ 60 మంది కూలీలను ఒక్కొక్కరినీ విచారించటం మొదలెట్టాడు. ఆ మరునాడు కలక్టరు ప్రెస్‌ డెర్గాస్త్‌ గారే స్వయంగా వచ్చి కూలీలను ప్రశ్నించి వారందరూ ‘‘మేము ఇష్టపూర్వకంగానే వెళుతున్నామని’’ చెపుతున్నా సంతృప్తి చెందక, పౌరులకు కోరంగి రేవు నుండి విదేశాలకు వెళ్ళే అనుమతి లేదన్న కారణంచే బెడియర్‌ తో సహా అందరినీ జగన్నాయకపురం తరలించి అరెస్టు చేయించాడు. వీరందరూ 10 అక్టోబరు వరకూ కటకటాల వెనుకే ఉన్నారు. 

అవమాన భారంతో పాండిచేరీకి వెనుదిరిగిన బెడియర్‌` ఫ్రెంచి ప్రభుత్వం కూలీలకు జారీచేసిన పాస్‌ పోర్టులను మరియు ఇతర చట్టపరమైన అనుమతులను బ్రిటిష్‌ కలక్టరు ఖాతరుచేయకపోవటం వల్ల తనకు జరిగిన ఆర్ధిక, పరువు నష్టాలకు 1,80,000 ఫ్రాంకుల పరిహారాన్ని ఇప్పించమని ఫ్రెంచి ప్రభుత్వాన్ని కోరాడు. కోరంగి రేవును తటస్థ రేవుగా (బ్రిటిష్‌ మరియు ఫ్రెంచి నౌకల ప్రయాణానికి) ఉంచాలని పూర్వం ఫ్రెంచి మరియు బ్రిటిష్‌ వారు చేసుకొన్న ఒప్పందాలను బ్రిటిష్‌ వారు ఉల్లంఘించారని బెడియర్‌ ఆరోపించాడు. (దీనికి స్పందిస్తూ ఆ ఒప్పందాలేమిటి అని బ్రిటిష్‌ వారు అడిగినపుడు ఫ్రెంచి వారు ఏమీ చూపలేకపోవటం వల్ల కోరంగి రేవు పూర్తిగా బ్రిటిష్‌ వారి ఆధీనంలోకి పోవటం ఆ తరువాత జరిగిన ఒక దురదృష్టకర పరిణామం ఫ్రెంచివారికి సంబంధించి).

బెడియర్‌ వంటి పెద్ద వ్యాపారికే అంత అవమానం జరిగిన తరువాత పాండిచేరీలోని మరే ఇతర వర్తకులు యానాంలో కూలీల సేకరణ జరపటానికి మరో పదేళ్ల వరకూ సాహసించలేదు

బ్రిటిష్‌`ఫ్రెంచి ప్రభుత్వాల ఒప్పందం 1861

బెడియర్‌ అవమానోదంతం ఫ్రెంచి ప్రభుత్వాన్ని కుదిపివేసింది. ఫ్రెంచి రాజ్యానికి గౌరవభంగం జరిగినట్లు భావించింది. దీనితో ఫ్రెంచి వారు బ్రిటిష్‌ ప్రభుత్వంతో పై స్థాయిలో చర్చలు జరిపి 1861 జూలై, 1 న ఒక ఒప్పందాన్ని చేసుకొన్నారు. దీని ప్రకారం బ్రిటిష్‌ వారి అన్ని పోర్టుల నుంచీ ఫ్రెంచివారికి కూలీలను పంపించుకొనే అధికారం పొందింది. ఆ యా సెంటర్లలో ఒక బ్రిటిష్‌ అధికారి ఉండి కూలీలు స్వచ్చందంగా వెళుతున్నారా లేక బలవంతంగా తరలింపబడుతున్నారా అనే విషయాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. (]. Year book of India 1866, Pondy, Govt.printing)

ఆ విధంగా 1861 నుంచి యానాంలో చట్టబద్దంగా కూలీల తరలింపుకు మరలా తెరలేచింది. 1861 నుండి 1870 మధ్య యానాం నుంచి సుమారు 3500 మంది కూలీలు రీయూనియన్‌ లోని చెరకు తోటలలో పనిచేయటానికి పంపించబడ్డారు. యానాం నుంచి బయలుదేరిన నౌకల కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి.

సంవత్సరం నౌక పేరు యానాం నుంచి బయలుదేరిన తేదీ తీసుకెళ్లిన కూలీల సంఖ్య చూడుడు ఫొటో

యానాం నుంచి బయలుదేరిన నౌకల వివరాలలో పైన ఉదహరించినవి కొన్ని మాత్రమే. మొత్తం మీద ఇరవై సంవత్సరాల కాలంలో యానాం నుంచి బయలు దేరిన పద్నాలుగు నౌకలలో సుమారు 3500 మంది, పాండిచేరీ నుంచి 13,000 మంది కలకత్తా నుంచి 9,000 మంది కూలీలు రీయూనియన్‌కు ఎగుమతి అయినట్లు రికార్డుల ద్వారా తెలుస్తున్నది. (రి. Mme. Mazard in her memoire de Maitrise “L’emigration indienne vers les colonies francaises from 1860 to 1880).


ఈ కాలంలో కూలీల సేకరణ మేస్త్రీల ద్వారా జరిగేది. వీరు యానాం నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాలనుంచి కూడా కూలీలను తీసుకువచ్చి యానాంలో కల ఏజెంట్లకు అప్పచెప్పేవారు. ఆ కూలీలకు ముందుగా మెడికల్‌ చెకప్‌ జరిగేది. చిన్న చిన్న వ్యాధులకు మందులు ఇచ్చేవారు. వృద్ధులను, పిల్లలను తీసుకొనేవారు కాదు. ఈ ప్రక్రియ అంతా ఒక ఇంగ్లీషు అధికారి సమక్షంలో జరిగేది. ఇలా ఎంపిక చేయబడిన కూలీలందరూ తాము ఐచ్ఛికంగానే జీవనోపాధికొరకు రీయూనియన్‌కు వెళుతున్నట్లు ఆయనకు ఒక అంగీకార పత్రాన్ని వ్రాసి ఇచ్చేవారు. తదుపరి ఆ కూలీలకు రెండునెలల జీతం (నెలకు 5 రూపాయిల చొప్పున మొత్తం 10 రూపాయిలు) ముందుగా చెల్లించి, నౌక బయలుదేరే తారీఖు వరకూ వారికి తిండి వసతులు కల్పించటం జరిగేది. ఈ మొత్తం వ్యవహారంలో ఏ రకమైన నిర్బంధాలు లేవని నిర్ధారించే బ్రిటిష్‌ అధికారికి నెలకు 250 రూపాయిల జీతం, సరఫరా చేసిన ఒకొక్క కూలీకు 3 రూపాయిల చొప్పున మేస్త్రీలకు, 24 రూపాయిల చొప్పున ఫ్రెంచి ఏజెంటుకు ముట్టేవి. 

1830 నాటి కాంట్రాక్టు పద్దతిలో ఒక్కొక్క కార్మికునకు నెలకు 7 రూపాయిల జీతం కాగా 1860 లో అది నెలకు 5 రూపాయిలు మాత్రమే కావటం గమనార్హం. ఏదైనా ఒక కుటుంబం అంతా ఈ విధమైన పద్దతిలో కూలీలుగా వెళ్ళేటపుడు, స్త్రీలకు పిల్లలకు నెలకు రెండు రూపాయిల యాభై పైసల చొప్పున జీతం ఉండేది. 1830 లో కూలి అడ్వాన్సుగా 21 రూపాయిలు ముందుగానే ఇచ్చేవారు, కానీ 1860 వచ్చేసరికి ఈ మొత్తం పదిరూపాయిలకు తగ్గిపోయింది. అయినప్పటికీ ఈ పద్దతిన వెళ్ళటానికి యానాం వాసులే కాక శ్రీకాకుళం, ఏలూరు, మచిలీపట్నం వంటి దూర ప్రాంతవాసులు కూడా వచ్చేవారు. 1862 లో యానాంలో Quillet Victor de Possel et Cie పేరుగల ఒక ఫ్రెంచి ఏజెన్సీ ద్వారా ఈ కూలీల లావాదేవీలు జరిగేవి. 

ఇదే సమయంలో ఇంగ్లీషువారు చేపట్టిన రైలు మార్గాల ఏర్పాటు, సాగునీటి కాలువల తవ్వకం (ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం చివరిదశకు చేరింది), బీడుభూముల్ని సాగులోకి తీసుకురావటం వంటి వివిధ పనులకు తీవ్రమైన కూలీల కొరత ఏర్పడటంతో, బ్రిటిష్‌ ప్రభుత్వం ఫ్రెంచివారు సాగిస్తున్న ఈ కూలీల ఎగుమతికి అనేక విధాలైన ఆటంకాలను కలిగించటం మొదలు పెట్టారు. మేస్త్రీలపై ఏడాదికి పదిరూపాయిల టాక్స్‌ విధించటం, మేస్త్రీలకు లైసెన్సులు జారీ చేసి వాటిని ప్రతీ సంవత్సరం మద్రాసులో ఉండే బ్రిటిష్‌ ఉన్నతాధికారిచే కౌంటర్‌సైన్‌ చేయించుకోవాలన్న నిబంధన విధించటం వంటివి వాటిలో ముఖ్యమైనవి.

1866 లో యానాం నుంచి ఆఖరు సారిగా కూలీలు పంపించబడ్డారు. తరువాత అలాంటి వ్యాపారం జరగలేదు. 1863 లో 775 మంది, 1864 లో 621 మంది, 1865 లో 184 మంది కూలీలను తరలించగా, 1865 లో మాత్రం సుమారు 1500 మంది యానాంనుంచి పంపించబడ్డారు. దీనికి కారణం అప్పట్లో ఒరిస్సాలో భయంకరమైన కరువు విలయతాండవం చేయటం వల్ల చాలా మంది ప్రజలు ఇలా వలస పోవటానికి సిద్దపడినట్లు అనుకోవాలి. 

ముగింపు

ఫ్రెంచి వారు తమ అవసరాల దృష్ట్యా కూలీలను తరలించటంలో మొదట కొన్ని అనాగరిక పద్దతులు పాటించినా (యేట్స్‌ ఉదంతం), కాలానుగుణంగా మానవీయ దృక్పధంతో వ్యవహరించినట్లే కనపడుతుంది. మరీ ముఖ్యంగా 1828 లో ప్రతిపాదించిన కాంట్రాక్టు పద్దతి ఈనాటికీ ఆదర్శప్రాయమే అనటం అతిశయోక్తి కాదు. షిప్పులో రవాణా సమయంలో ప్రతీ కూలీకి రోజుకు ఒక కేజీ బియ్యం తో వండిన అన్నం, 120 గ్రాముల పప్పులు, 200 గ్రాముల మాంసం లేక చేపలు మరియు మూడు లీటర్ల మంచినీరు ఇవ్వాలని నిబంధన ఉండేది. 1853 లో కారైకాల్‌ కు చెందిన కూలీలు సేకరించే ఒక మేస్త్రీ మైనారిటీ తీరని పిల్లలను కూలీలుగా ఎగుమతి చేయటానికి ప్రయత్నించినందుకు ఫ్రెంచి కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించటాన్ని బట్టి ఈ కూలీల సేకరణ ఇష్టమొచ్చినట్లు కాక, నిబంధనలకు లోబడే జరిగేదని అర్ధంచేసుకొనవచ్చును. 1854 లో పాండిచేరీ నుంచి బయలుదేరిన ఆగస్టస్‌ అనే షిప్పులో కూలీలు అనేక ఇబ్బందులకు గురయ్యారని పిర్యాదులు రావటంతో, ఫ్రెంచి ప్రభుత్వం రెజెల్‌ హ్యూబర్‌ అనే జడ్జితో విచారణ జరిపించి, షిప్పులో ప్రయాణించే కూలీలకు కనీస వసతి సౌకర్యాల కల్పనకు అనేక నిబంధనలను విధించింది. వీటి ఫలితంగా ఫ్రెంచి నౌకలలో తరలింపబడే కూలీలలో గమ్యస్థానాలకు చేరే లోపు జరిగే మరణాల శాతం 2.7 కు తగ్గింపబడిరది. కాగా బ్రిటిష్‌ నౌకలలో ఇది 7.8 గా ఉండేది. (]. Treaty Between Trade and Coolie: the case of Augustus (1854) by Jacques Weber CIDIF). 1885 నాటికి ఫ్రాన్స్‌ కూలీల సేకరణను పూర్తిగా నిలిపివేసింది.

ఫ్రెంచి మరియు బ్రిటిష్‌ వారు భారతదేశంలో వ్యాపారం చేయటానికి వచ్చారు. ఇరువురికీ మధ్య జరిగిన అనేక కలోనియల్‌ రాజకీయాలలో భాగంగా ఈ కూలీల ఎగుమతి విషయంలో ఫ్రెంచి వారిని ఇంగ్లీషువారు సమర్ధవంతంగా ఇరుకున పెట్టగలిగారు. యానాం నుంచి ఫ్రెంచివారు కూలీలను తరలించిటం అనేది ఈ ప్రాంతపు ఒక చారిత్రక సత్యం. ఏ దేశచరిత్రను తీసుకొన్నా ఇలాంటి నీలినీడలు కనిపిస్తాయనటంలో సందేహం లేదు. 

ఫ్రెంచి కరీబియన్‌ ద్వీపకల్పం లోని Sucre Island జనాభా ఏర్పడటంలో యానాం నుంచి 1849`1869 ల మధ్య ఎగుమతి చేయబడిన కూలీలు ప్రధాన పాత్ర వహించినట్లు ప్రొ. జాబ్స్‌ వీబర్‌ అభిప్రాయపడ్డాదు. (].GHC Bulliten, 16 May, 1990, page no. 134). అలా తరలించబడిన వారిలో ఎంత మంది తిరిగి వచ్చారో, ఎంత మంది అక్కడే స్థిరపడి పోయారో......

(ఈ వ్యాసం నేను రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" (2010) నుండి)

బొల్లోజు బాబా

Friday, September 12, 2025

ఫ్రెంచి యానాంలో విద్యావ్యవస్థ



భారతదేశంలో విద్యావ్యవస్థ వర్ణవ్యవస్థను పటిష్టం చేసేదిగా ఉండేది. మహమ్మదీయ పాలకులు విద్యాభివృద్ధి చేసిన దాఖలాలు కనపడవు. వర్ణవ్యవస్థకు అతీతమైన విద్యావ్యవస్థను భారతదేశంలో నెలకొల్పిన ఖ్యాతి బ్రిటిష్‌, ఫ్రెంచి పాలకులకు దక్కుతుంది. కారణాలేమైనప్పటికీ గుమస్తాలను తయారుచేయటానికే స్కూళ్ళను నెలకొల్పారు అన్న అపవాదును బ్రిటిష్‌వారు మూటకట్టుకొన్నారు. కానీ ఫ్రెంచి పాలకులు తమ స్థావరాలలో జరిపిన విద్యాసంస్కరణలు గమనిస్తే అటువంటి ఉద్దేశ్యాలు ఉన్నట్లు కనిపించవు. యానాం వంటి మారుమూల ప్రాంత ప్రజలు ఉన్నత విద్యనభ్యసించటానికి పాండిచేరి వెళ్లవలసివచ్చేది. వీరికి ఫ్రెంచి ప్రభుత్వం ప్రత్యేక స్కాలర్‌షిప్పులిచ్చేది. అలా యానాంనుంచి అనేకమంది విద్యార్ధులు పాండిచేరీ వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించేవారు. ఉదాహరణకు 1924 లో నల్లం సత్యనారాయణ (పాండిచేరీలోని నల్లం క్లినిక్‌ అధినేత శ్రీ నల్లం బాబు తండ్రి గారు) అలా పాండిచేరీలో వైద్య విద్యను పొందారు. అలాగే శ్రీదడాల రఫేల్‌, శ్రీ అబ్దుల్‌ రజాక్‌, మలిపెద్ది వీరన్న, తోట నరసింహమూర్తి, వంటి యానాం విద్యార్ధులు ఆ విధంగా స్కాలర్‌షిప్పుల సదుపాయాన్ని వినియోగించుకొన్నారు.
1905 లో యానానికి చెందిన దున్నా వెంకటరత్నంకు పాండిచేరీ వెళ్ళి చదువుకోవటానికి ఏడాదికి 72 రూపాయిలచొప్పున స్కాలర్‌ షిప్‌ మంజూరు అయ్యింది. దళిత వర్గానికి చెందిన ఒక వ్యక్తి స్కాలర్‌షిప్‌ పొందటం ఇదే ప్రథమం. అప్పట్లో పాండిచేరీలో ఉన్నత విద్య ముగిసినతరువాత యూనివర్సిటీ చదువు చదవాలనుకొనేవారిని ఫ్రెంచి ప్రభుత్వం స్వంత ఖర్చులతో ఫ్రాన్స్‌ పంపించేది. ఈవిధంగా ఎంతోమంది పాండిచేరీ, కారైకాల్‌ ల నుంచి ఫ్రాన్స్‌ వెళ్ళి పెద్దచదువులు చదువుకొన్నారు.
యానాంనుంచి ఆ విధంగా ఫ్రాన్స్‌ వెళ్ళి చదువుకొన్న వారిలో శ్రీదున్నా వెంకటరత్నం గారు ప్రముఖులు. వీరు కాంబోడియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేసి రిటైర్‌ అయినతరువాత యానాంలో స్థిరపడ్డారు.


1. తొలినాటి విద్యారంగం
1787 మే, 31న పాండిచేరీలో మొట్టమొదటి ఫ్రెంచి మిషనరీ స్కూలు స్థాపించబడినా, చాన్నాళ్ళకు కానీ దానిలో తెలుగుభోధన ఆరంభం కాలేదు. 1828 లో పాండిచేరీలో తెలుగును మాతృభాషగా కలిగిన వారి కోసం ఫ్రెంచిప్రభుత్వం పాఠశాల టైమ్‌టేబుల్‌ లో తెలుగుభాష పీరియడ్‌ను ప్రారంభించారు. 1840 నాటికి దీనిలో 26 మంది తెలుగు నేర్చుకొనే విద్యార్ధులుండేవారు. ఇక యానాం విషయానికి వస్తే, 1848 ఫిబ్రవరి, 17న అప్పటి ఫ్రెంచి గవర్నర్‌ శ్రీ పుజోల్‌ యానానికి ‘ఉచిత’ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు ఉత్తర్వులు జారీచేసారు. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. (రి: జె.బి.పి. మోర్‌)
ఇక్కడ ఉచిత అనే మాటనుబట్టి అప్పట్లో యానాంలో ప్రైవేటు స్కూళ్ళు ఉండేవని ఊహించుకొనవచ్చును. ఇదే విషయం యానాంలో 1880 ల ప్రాంతంలో విద్యనభ్యసించిన శ్రీ చెళ్ళపిల్ల వెంకటశాస్త్రి రచించిన ‘కథలు`గాధలు’ అనే పుస్తకం (పేజీ నం: 403) లో కనపడుతుంది.
సనాతన కుటుంబానికి చెందిన శ్రీ చెళ్ళపిల్ల వారు యానాం ప్రభుత్వస్కూలులో మాలమాదిగల సరసన కూర్చోవలసి రావటం ఇష్టంలేక యానాం స్కూలును విడిచి కొంతకాలం నీలపల్లి స్కూలులో చదువు ముగించుకొని, తిరిగి మరలా యానాంలో శ్రీ చక్రవర్తుల బాపయ్య గారిచే నడపే ఓ ప్రెవేటుస్కూలులో చేరారట. అంతేకాక అప్పటి ఫ్రెంచిస్కూలును వర్ణిస్తూ ‘‘ఇక్కడ పిల్లలు జీతమివ్వక్కర లేదు. పయిగా ఎక్కువ తెలివితేటలుంటే ప్రెజెంట్లు కూడా ఇచ్చేవారని’’ చెప్పుకొచ్చారు. దీనినిబట్టి ఫ్రెంచివారు స్కూళ్ళు స్థాపించక మునుపు యానాంలో బ్రాహ్మలచే నడపబడే ప్రెవేటుస్కూళ్ళు ఉండేవని భావించుకోవచ్చు. కానీ వీటిలో లభించే విద్య సమాజంలోని అగ్రవర్ణాలకే దక్కేదనటంలో మాత్రం సందేహపడక్కరలేదు.


2. యానానికి కన్యస్త్రీల సేవలు
యానాం విద్యారంగంలో స్వేచ్ఛా, సమానత్వం, సౌబ్రాతృత్వం వంటి విత్తనాలు నాటటానికి 1849 డిసంబరు, 5 న ర్‌. st. Joseph of Lyon చెందిన నలుగురు ంఱర్‌వతీం యానాం వచ్చారు. (సెయింట్‌ జోసెఫ్‌ ఆఫ్‌ లియోన్‌ అనేది ఫ్రాన్స్‌ లోని లియోన్‌ అనే ప్రాంతానికి చెందిన ఒక క్రిష్టియన్‌ ధార్మిక సంస్థ. ఈ సంస్థ 1807 లో ‘మదర్‌ సెయింట్‌ ఫాంట్‌బొన్నే’ అనే ఆవిడ ఆధ్వర్యంలో నడిచేది. ఈ సంస్థ మెంబర్లుగా ఉండే సిస్టర్స్‌/కన్యస్త్రీలు ప్రపంచవ్యాప్తంగా స్కూళ్ళు, ఆసుపత్రులను నడుపుతూ మానవజాతికి మహూెెన్నతమైన సేవలు చేస్తున్నారు ఇప్పటికీ). అలా వచ్చిన వారి చేతిలో కులమతాలకతీతంగా యానాంలోని విద్యార్ధులకు విద్యను భోదించమని ఫ్రెంచిప్రభుత్వం 1849 నవంబరు,10న ఇచ్చిన ఉత్తర్వు మాత్రమే ఉంది. కానీ మనసులో వజ్రతుల్యమైన సేవాదృక్పధం, మానవజాతి పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్నాయి. వీరికి యానాం ప్రజలు ఘనస్వాగతం పలికారు.
1850 లో వీరు రెండు స్కూళ్ళు ప్రారంభించారు. ఒకటి ఆడపిల్లల కొరకు మరొకటి చిన్నారి బాలికలు మరియు అనాధుల కొరకు. భారతదేశంలో మొదటి బాలికల స్కూలు 1848 జనవరి, 1 న సావిత్రిభాయి ఫూలే స్థాపించినట్లు చరిత్ర చెపుతుంది. కానీ దాదాపు అదే కాలంలో యానాంలో బాలికల కొరకు స్కూలు స్థాపించబడటం సామాన్యమైన విషయం కాదు.
st. Joseph of Lyon Sisters
1. Sister Saint Claire D’ugine - Superior
2. Sister Saint francois de Desingy
3. Sister Saint Justine de Thairy
4. Sister Marie Placide d’Annecy
వీరే కాక ఇతర సిస్టర్స్‌ కూడా యానాం విద్యారంగానికి తమసేవలందించారు. వారిలోSister Lucile, Sister Denice ,Sister Marie Theophile, Sister Augustin వంటి వారు ఇక్కడే గతించి పోయారు. (వీరి సమాధులు యానాంలోనే కలవు. చూడుడు ఫొటో)


Sister Casimir (Fillion Melanie) ఈమె ఫ్రాన్స్‌లోని Lyaud అనే ప్రాంతంలో జన్మించింది. 1890 లలో యానాంలో కొంతకాలం టీచర్‌ గా పనిచేసింది. ఇదే సమయంలో యానాం కోర్టు నోటరీ గా పనిచేసిన M. Casimir కు ఈమె బంధువు కావొచ్చు.
Sister Clotilda (Francoise Dunoyer) 1837 లో Nouglard అనే ప్రాంతంలో జన్మించిన ఈమె కొంతకాలం యానాంలో సేవలందించారు.
Sister Mary Amelia (1858-?) ఈమె 1890 లలో యానాంలో కొంతకాలం టీచర్‌ గా పనిచేసింది.
Sister Mary Eleonor (Deleaval Susan) ఈమె ఏప్రిల్‌ 13, 1861 న చదువు పూర్తి కాగానే యానానికి టీచరుగా నియామకం పొందింది.
Sister Rose Alexin 1871లో జన్మించిన ఈమె 1900 లో యానాం టీచర్‌ గా పని చేసింది.
Sister Ursula (Bossom Eugenie) 1831లో పుట్టిన ఈమె 1851 జూలైలో టీచరుగా పనిచేయటానికి యానాం రావటం జరిగింది.
1850`1854 మధ్య అప్పటి చర్చిఫాదరయిన డ్యూపాంట్‌ బాలురకోసం ఒక స్కూలు నడిపేవారు. దీనిలో ఫ్రెంచి, తెలుగులను డ్యూపాంటే బోధించేవారు. (బోధించగలిగే స్థాయికి తెలుగును ఒక ఫ్రెంచి దేశస్థుడు నేర్చుకోవటం ఆశక్తికరం).
1866 వచ్చేసరికి యానాంలో మొత్తం 5 స్కూళ్ళు ఉండేవి. వీటిలో మూడు బాలికల కొరకు రెండు బాలుర కొరకు. బాలికల పాఠశాలలను సెయింట్‌ జోసెఫ్‌ సిస్టర్స్‌ నిర్వహించేవారు. ఈ స్కూళ్ళను స్థానికులు ’కన్యస్త్రీల బడి’ లని పిలుచుకొనేవారు. ఈ మూడు బాలికల స్కూళ్ళలో ఒకటి ఫ్రెంచి, ఫ్రాంకో ఇండియన్‌ మరియు ఉన్నత వర్గాల పిల్లల కొరకు, రెండవది అన్ని కులాల పిల్లల కొరకు, మూడవది అనాధ బాలికల కొరకు ఉద్దేశింపబడినవి. మొదటి రెండు స్కూళ్ళలో ఫ్రెంచి, తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, జాగ్రఫీ, డ్రాయింగు వంటివి బోధనాంశాలుగా ఉండేవి. మూడవ స్కూలులో కుట్లు అల్లికలు నేర్పేవారు.


3. స్థానిక టీచర్ల ప్రవేశం
అబ్బాయిలకొరకు ఉన్న రెండు ప్రభుత్వ పాఠశాలలో ఒకటి ఫ్రెంచిమిషనరీకి చెందిన ఒక బ్రదర్‌ ఆధ్వర్యంలోను రెండవది ఆనాటి యానాం సమాజంలోని కాపు కులపెద్ద అయిన శ్రీ బెజవాడ చినపేరయ్యచే నడపబడేది. యానాం ప్రభుత్వ స్కూలులో పనిచేసిన మొదటి తెలుగు టీచర్‌ ఈయనే. ఎందుకంటే అంతవరకూ యానాం స్కూళ్ళలో ఫ్రెంచి దేశస్థులే ఉపాద్యాయులుగా ఉండేవారు. ఆఖరుకు తెలుగుభాషను భోదించాల్సివచ్చినా సరే.
యానాంలో అప్పట్లో విద్యనభ్యసించే బాలబాలికల లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. (చూడుడు టేబుల్)



1898 లెక్కల ప్రకారం కేవలం 30 మంది విద్యార్ధినులు మాత్రమే ఉండటం గమనార్హం. దీనికి ప్రధానకారణం 1849 లో యానాం స్కూలు స్థాపించటానికి వచ్చిన నలుగురు సిస్టర్స్‌ క్రమక్రమంగా గతించటమే కావొచ్చు. వీరిలో చివరగా డెనిస్‌ (1842`1899) మరణంతో యానాంలో బాలికల విద్యావ్యాప్తికి తీవ్రవిఘాతం ఏర్పడిఉంటుందని పై గణాంకాలను బట్టి భావించవచ్చును. అంతే కాక సాంప్రదాయ హిందూ కుటుంబాలలో స్త్రీవిద్య పట్ల ఉండే చులకన మరియు కన్యస్త్రీల బడి అనగానే తల్లిదండ్రులకు విద్యార్థినులకు కొంత భద్రతాభావం ఉండటం వంటివి ఇతర కారణాలు కావొచ్చు.
వారి తదనంతరం అంతే నమ్మకాన్ని యానాం విద్యార్ధినుల తల్లిదండ్రులలో కలిగించటానికి చాలాకాలం పట్టింది. ఈ విషయంలో 1930 లలో యానాం బాలికల స్కూలు టీచర్లయిన కంతేటి మంగమ్మ, చిక్కం మాతయ్య, పాలెపు వెంకట సుబ్బారావులు ముఖ్యులు. వీరి కృషి వలన 1933 లో విద్యార్ధినుల సంఖ్య 109 కి పెరిగింది. (యానానికి సంబంధించి శ్రీమతి కంతేటి మంగమ్మ మొదటి స్థానిక మహిళా టీచర్‌ కావొచ్చు)
1873 లో యానాం జమిందారు శ్రీ మన్యం కనకయ్య బాలికల స్కూలు నిర్మాణం కొరకు భారీ నిధులను సమకూర్చారు. కనకాల పేటలో 1880 లో ఒక బాయిస్‌ స్కూలు నెలకొల్పారు. దీనిలో కొమండూరి/సాతాను జియన్న, వర్ధినీడి అయ్యప్పనాయుడులు టీచర్లుగా పనిచేసారు. ఈ స్కూలు 1902 నుంచి కొంతకాలం మూసివేసి మరలా 1931 లో తిరిగి తెరిచారు. పంపన వీరాస్వామి అప్పట్లో దీనిలో టీచర్‌ గా పనిచేసారు. కురసాం పేటలో 1892 లో ప్రారంభించిన స్కూలు కొంతకాలం మూతబడి తిరిగి తెరువబడింది.
1908లో అడివిపొలంలో చిక్కం మాతయ్య అనే టీచరు ఆధ్వర్యంలో ఒక ప్రైవేటు స్కూలు నడిచేది. ఈ స్కూలు దళిత విద్యార్ధుల కొరకు బాగా ఉపయోగపడుతున్నదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని అందించి దానిని ప్రభుత్వస్కూలుగా మార్చివేసింది. ఈ స్కూలుకు హెడ్‌మాస్టర్లుగా 1932 లో ఎమ్‌.వి.వి. కొండయ్యనాయుడు, 1937లో గెల్లా శ్రీనివాసులు పనిచేసారు. ఈ స్కూలులో మధ్యాహ్నభోజన పధకం కూడా ఉండేది.
ఆనాటి విద్యాకమిటీలు
యానాంలోని విద్యావ్యవస్థను నడిపించటానికి 7 గురు సభ్యులుకలిగిన ఒక కమిటీ ని ప్రభుత్వం నియమించేది. యానానికి సంబంధించి 1880 లో మొదటిసారిగా ఏర్పడిన విద్యాకమిటీకి పుణ్యమూర్తుల వెంకటసుబ్బారాయుడు బెజవాడ బాపనయ్య లు ప్రారంభ సభ్యులుగా వ్యవహరించారు. ఇరవయ్యవ శతాబ్ద ప్రారంభదశలో స్కూలు కమిటీకి సమతం వెంకటసుబ్బారాయుడు, గిరితాతయ్య, అబ్దుల్‌ రెహ్మాన్‌ , పుణ్యమూర్తుల వెంకటసుబ్బారాయుడు, సమతం కృష్ణయ్య, పుణ్యమూర్తుల నరసింహమూర్తి, గిరి మాధవరావు నాయుడు, శింగంశెట్టి వెంకటరత్నం వంటివారు సభ్యులుగా తమ సేవలందించారు.

4. సెంట్రల్‌ బాయిస్‌ స్కూల్‌ ప్రాముఖ్యత
అప్పట్లో యానాం విద్యావ్యవస్థకు సెంట్రల్‌ బాయస్‌ స్కూల్‌ (జదీూ) కేంద్ర బిందువుగా ఉండేది. (ఈ స్కూలు పునర్నిర్మాణం జరిగినా ఆనాటి ‘గేట్‌ ఆర్చ్‌’ ను అలాగే ఉంచటం జరిగింది). యానాంలోని మిగిలిన స్కూళ్ళన్నీ దీనికి అనుబంధ సంస్థలుగా ఉండేవి. ఇక్కడి హెడ్‌ మాస్టర్‌ మిగిలిన స్కూళ్ళ పర్యవేక్షణ జరిపేవాడు. 1901 లెక్కల ప్రకారం నలుగురు టీచర్లు 177 మంది విద్యార్ధులతో ఈ స్కూలు నడిచింది. 1911`12 లలో జదీూ కు ణaఙఱశ్‌ీ అనే ఫ్రెంచిదొర హెడ్మాష్టరుగాను, మద్దింశెట్టి బాపన్న, తోట నరసింహ స్వామి, మహేంద్రవాడ సూర్యనారాయణ మూర్తి లు టీచర్లు గాను ఉండేవారు. 1916`17 లలో ణవ జతీబఓ ుష్ట్రశీఎaం సి.బి.ఎస్‌ కు హెడ్‌మాష్టరుగా వ్యవహరించారు. ఈ స్కూలుకు మొదటసారిగా స్థానిక వ్యక్తి హెడ్‌మాష్టరు గా పనిచేయటం 1918 లో గిరి తాతయ్య తో మొదలైంది. ఆ తరువాత 1923 లో మలిపెద్ది వీరన్న సి.బి.ఎస్‌ కు సారధ్యం వహించారు.
1934 లో సి.బి.ఎస్‌ లో మలిపెద్ది అంకయ్య హెడ్‌మాస్టరుగాను, గిరిలక్ష్మినారాయణ, మహేంద్రవాడ వీర గణపతి శాస్త్రులు, మద్దింశెట్టి సత్యనారాయణ మూర్తి, నల్లం సుబ్బారాయుడులు టీచర్లుగా పనిచేసారు.
1938`39 లలో సి.బి.ఎస్‌ కు గిరి లక్ష్మీనారాయణ హెడ్‌మాస్టరుగాను, మద్దింశెట్టి సత్యనారాయణ మూర్తి ఫ్రెంచి టీచరుగా (తెలుగును కూడా ఫ్రెంచివారే బోధించే స్థితినుండి తెలుగువారే ఫ్రెంచిని బోధించే స్థాయికి యానాం విద్యావ్యవస్థ చేరుకోవటం గమనార్హం), మద్దింశెట్టి సత్తిరాజు, మహేంద్రవాడ వీర గణపతి శాస్త్రులు, నల్లం సుబ్బారాయుడు లు ఇతర టీచర్లుగాను పనిచేసేవారు.
విద్యారంగానికి విశిష్టసేవలందించినందుకు గాను మద్దింశెట్టి సత్యనారాయణ మూర్తికి ఫ్రెంచిప్రభుత్వం 1954లో ‘షెవాలియర్‌’ బిరుదు ప్రధానం చేసింది. ఉన్నత చదువులకోసం ఎంతో మంది యానాం విద్యార్ధులు పాండిచేరీ వెళ్ళేవారు. వీరికి ఫ్రెంచి ప్రభుత్వం స్కాలర్‌షిప్పులు ఇచ్చేది. 19 శతాబ్దం చివరలో అలా వెళ్ళి ‘లా’ చదువుకొన్న గిరి వెంకన్న, పుణ్యమూర్తుల వెంకట సుబ్బారాయుడులు యానాం కోర్టులో సహాయజడ్జీ లు గా పనిచేసారు. అదే విధంగా నల్లం సత్యనారాయణ, ఆశెపు భైరవస్వామి లు వైద్యవిద్యనభ్యసించి స్థానిక ఆసుపత్రిలో డాక్టర్లుగా నియమితులయ్యారు.


5. పరీక్షలు ` సర్టిఫికేట్లు
యానాంలో ప్రాథమిక విద్య రెండు దశలలో జరిగేది. మొదటి దశను ‘సత్వికా’ అనేవారు. ఇది పూర్తిచేసిన వారికి “Brevet de langue Indigene” అనే సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. దీని తరువాత స్థాయిని ‘బ్రెవే’ అంటారు. ఇది పాస్‌ అయితే నిదీతీవఙవ్‌ సవ శ్రీaఅస్త్రబవ Iఅసఱస్త్రవఅవు అనే సర్టిఫికెట్‌ వచ్చేది. బ్రెవే పాస్‌ అయినవారు ఇంకా తమ విద్యను కొనసాగించాలంటే పాండిచేరీ వెళ్లవలసివచ్చేది. అమ్మాయిల చదువు సాధారణంగా సత్వికా కోర్సుతో ఆగిపోయేది. బ్రెవే చదువుకొన్నవారికి ప్రభుత్వ శాఖలలో టీచర్లు, టాక్స్‌ కలక్టర్లు వంటి ఉద్యోగాలు వచ్చేవి.


6. విద్యా విధానం
1880 ప్రాంతంలో యానాం ఫ్రెంచి స్కూలులో చదివిన చెళ్ళపిళ్ళవెంకటశాస్త్రి వ్రాసిన ‘నా గురు పరంపర’ (కృష్ణా పత్రిక 1934) అనే వ్యాసంలో తన అనుభవాలను ఇలా వర్ణించారు.
పదేండ్ల వయసులో చెళ్ళపిళ్ళ వారి చదువు ఫ్రెంచి టవును యానాంకు మార్చబడిరది. సాతాని జియ్యన్న గారు తెలుగు మాస్టారు. ఫర్మా, విజే అను ఇద్దరు ఫ్రెంచి దొరలు ఇతర టీచర్లుగా ఉండేవారు. వీరిలో ఫర్మా గారు హెడ్‌ మాష్టారు. ఆ మాష్టారు వీరిని ‘సెలపిల ఎంకత సలం’ అని పిలిచే వారట. మాల మాదిగలు స్కూలులో ఉన్నప్పటికీ ఎవరి బెంచీ వారిదే. గురువారం, ఆదివారం స్కూలుకు శలవుదినాలు.
పిల్లలు తప్పు చేస్తే వారానికొకమారు టేబుల్‌ పై పడుకోబెట్టి బెత్తంతో కొన్నిదెబ్బలు కొట్టేవారు. అలా చేయటాన్ని ‘పటుసారి’ అనేవారు. ఆల్ఫాబెత్తు అనే పుస్తకం పూర్తయిందో లేదో, మాల మాదిగలు అందరితో కలసి కూర్చోనివ్వాలి అనే రూలు వచ్చింది. దానితో చాలామంది పిల్లలు స్కూలు మానేసారు. వారిలో చెళ్ళపిళ్ళ వారు ఉన్నారు. పొరుగునున్న నీలపల్లి అనే బ్రిటిష్‌ గ్రామంలోని స్కూలులో వీరు తమ విద్యను కొనసాగించారు.
పై వివరాలను బట్టి యానాం స్కూలులో విద్యాబోధన ఏ విధంగా ఉండేదో అర్ధం చేసుకొనవచ్చును. మరీ ముఖ్యంగా ఫ్రెంచివారు అన్ని వర్ణాలవారిని సమానంగా చూసేవారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సనాతన కుటుంబానికి చెందిన చెళ్ళపిల్ల వారు నీలపల్లిలో విద్యాభ్యాసం సాగించటాన్నిబట్టి అక్కడ అటువంటి పరిస్థితి లేదనే భావించాలి.
స్కూలు బోధనాంశాలలో మోరల్‌ ఎడ్యుకేషను (నీతి విద్య) అన్నితరగతులకు తప్పనిసరిగా ఉండేది. దీనికొరకు టైమ్‌ టేబుల్‌ లో తప్పనిసరిగా ఒక పీరియడ్‌ ఉండేది.
స్కూళ్ళ సెలవుల షెడ్యూల్‌కు కూడా గవర్నరు స్థాయిలో నిర్ణయాలు జరిగేవి. స్కూలు సెలవులు క్రిష్టమస్‌, సంక్రాంతికి కలిపి సుమారు నెలన్నర రోజులపాటు ఉండేవి. వేసవి సెలవులు మాత్రం తక్కువగా ఇరవైరోజుల ఉండేవి. వారానికి అయిదురోజులు మాత్రమే స్కూల్స్‌ ఉండేవి. ప్రతి గురువారం, ఆదివారం శలవులు. హిందువుల పండుగలకు మొత్తం స్కూలుకు సెలవు ఉండేది. అదే ముస్లిముల పండుగలకు ఒక్క ముస్లిము విద్యార్ధులకు మాత్రమే సెలవు ఉండటం ఆశ్చర్యం కలిగించేవిషయం.
యానాంలోని స్కూళ్ళ నిర్వహణకు ఫ్రెంచి ప్రభుత్వం గణనీయమైన నిధులను వెచ్చించినట్లు రికార్డులు చెపుతున్నాయి. (చూడుడు టేబుల్)

ఆ మొత్తాలు ఆనాటి యానాం స్థూల ఆదాయంలో 12 నుంచి 27 శాతం వరకూ ఉండటం గొప్ప విషయమే. పై టేబుల్‌ను గమనిస్తే ఫ్రెంచ్‌ టీచర్ల జీతాలు గణనీయంగా పెరిగాయి కానీ తెలుగు/స్థానిక టీచర్‌ జీతం మాత్రం పెరగలేదన్న విషయం తెలుస్తుంది. కన్యస్త్రీ టీచర్ల లో మొదట్లో ఇద్దరికి మాత్రమే ప్రభుత్వం జీతం చెల్లించేది. మిగిలిన వారు వాలంటరీగా పనిచేసేవారు. 1862 నుంచి మరో కన్యస్త్రీ టీచరుకు కూడా ఫ్రెంచి ప్రభుత్వం జీతం ఇవ్వటం మొదలెట్టింది.
యానాం పెద్దొర ప్రతీ స్కూలును నెలకు రెండుసార్లు చొప్పున తణిఖీలు నిర్వహించినట్లు 1864 నుంచి ఉన్న రికార్డులు చెబుతున్నాయి.
1920 లో Valmry అనే ఫ్రెంచి అధికారి ఆధ్వర్యంలో ఒక కమిషన్‌ యానాం విద్యా వ్యవస్థను అధ్యయనం చేసినపుడు అక్షరాస్యతా 28 శాతం ఉంది. అంటే అప్పటి మొత్తం 5823 మంది జనాభాలో 3949 మంది నిరక్షరాస్యులే. 1951 నాటికి యానాం అక్షరాస్యత 33 శాతానికి పెరిగింది.


7. ముగింపు
ఆనాటి విద్యావిధానంలో ఫ్రెంచి మరియు తెలుగు మీడియం లలో బోధన జరిగేది. తెలుగు మీడియం విద్యార్ధులకు ఫ్రెంచిభాష నేర్చుకోవటం తప్పనిసరి. ముస్లిం విద్యార్థులకొరకు ఉర్దూ ఉండేది. 1898 నాటి లెక్కల ప్రకారం మొత్తం టీచర్ల సంఖ్య 24 కాగా, వారిలో 8 మంది ఫ్రెంచి టీచర్లు, 13 మంది తెలుగు టీచర్లు, (అంటే తెలుగులో బోధించే టీచర్లు అని` కొంతమంది ఫ్రెంచి దేశస్థులు కూడా తెలుగును నేర్చుకొని బోధన జరిపేవారు), ఇద్దరు కన్య స్త్రీ/సిస్టర్‌ టీచర్లు, ఒక ఉర్దూ టీచరు (Mr. Fathidine) ఉన్నారు. అప్పట్లో మిషనరీ సిస్టర్‌లచే నడపబడిన కాన్వెంటు ప్రస్తుతం మిని సివిల్‌ స్టేషను ఉన్న ప్రాంతంలో ఉండేది.


ఏది ఏమైనప్పటికీ యానాంలోని ఆధునిక విద్యావ్యవస్థ ప్రారంభదశలలో ఫ్రెంచి మిషనరీలు చేసిన సేవలు గణనీయమైనవి. ఆనాటి కన్యస్త్రీల సమాధులు నేటికీ యానాంలోని ఫ్రెంచి సెమెటరీలో చూడవచ్చును. ఫ్రెంచి వారు యానాంలో మిగిలిన శాఖల కన్నా విద్యావ్యాప్తికే ఎక్కువ నిధులు కేటాయించారన్న విషయం కూడా గమనించదగ్గది.
కుల మతాలకు అతీతంగా విద్యనందించటంలో ఫ్రెంచి వారు పొరుగునున్న బ్రిటిష్‌ వారికన్నా ముందున్నారు. యానానికి చెందిన ప్రముఖ కవి శిఖామణి ఒక చోట ‘‘నేను యానాంలో పుట్టి పెరగటం వలన కులపరమైన వివక్షను పెద్దగా ఎదుర్కొన లేదు’’ అని అన్నారు. బహుసా ఆ వ్యాఖ్యకు మూలాలు పై వ్యాసంలో దొరుకుతాయి.
(ఈ వ్యాసం నేను రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" (2010) నుండి)


బొల్లోజు బాబా