Sunday, March 22, 2026

మొఘల్ చక్రవర్తులకు జన్మనిచ్చిన హిందూ స్త్రీలు

భారతదేశం చారిత్రికంగా భిన్న మత విశ్వాసాల సమ్మేళనం. అనేక సముదాయాలు వివిధ సంస్కృతులతో కలిసిమెలిసి జీవించాయి. మనుషుల మధ్య బంధుత్వాలకు మతాలు అడ్డురాలేదు. చరిత్రలో హిందూ ముస్లిమ్ ల మధ్య అనేక వివాహాలు జరిగాయి. ఇవి భిన్న సంస్కృతుల సమ్మేళనానికి దారితీసాయి. చాలామంది మొఘల్ చక్రవర్తులు హిందూ స్త్రీలకు పుట్టారు. వారి ఆస్థాన చరిత్రకారులు ఈ విషయాన్ని ఎక్కడా దాచిపెట్టలేదు. స్పష్టంగానే రాసుకొన్నారు. వీటిని ఉత్త రాజకీయ తంత్రంగా భావించలేం. ఒక ముస్లిం రాజు హిందూ స్త్రీని పెండ్లాడి ఆమెను జనానాలో ఒకానొక దేహంగా మార్చకపోవటం; ఆమెద్వారా కలిగిన పుత్రుడు సింహాసనం అధిష్టించటం అనేవి ఉత్త రాజకీయ వ్యూహాలుగా పరిగణించలేం. రాజనీతిని మించిన మానవీయకోణాన్ని, సౌహార్దతను ఊహించాలి. భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన హిందు ముస్లిమ్ వివాహాలు కొన్ని ఇవి…….
****
1. హర్కబాయి (1542-1623) - అక్బర్ Maryam-Uz-Zamani

జైపూర్ రాజైన భర్మల్ 1562 లో తనకూతురు హర్కబాయిని అక్బరుకి ఇచ్చి వివాహం చేసాడు. ఈమె అక్బరుకు ఎంతో ఇష్టమైన రాణి అయింది. హర్కబాయి అపురూప సౌందర్యం, అద్భుతమైన మేధాశక్తి, గొప్ప దయ కలిగిన స్త్రీ. అక్బర్ చూపించిన మతసహనం, లౌకికత వెనుక ఈమె హస్తం ఉందని చరిత్రకారుల అభిప్రాయం. ఈమె కోరికపై అక్బరు గోమాంసాన్ని తినటం మానివేసాడు. ఈమె ద్వారా వైదిక క్రతువులు, బ్రాహ్మణులు, సూర్యనమస్కారాలు, శాఖాహారం, పూజలు లాంటివి ముఘల్ అంతఃపురంలోకి పవేశించాయి. హిందూస్త్రీలు సంస్థానంలో హారతి ఇస్తే స్వీకరించాలని అందరినీ ఆదేశించాడు అక్బరు. హర్కబాయి అక్బరులకు 1569లో కుమారుడు కలిగాడు. ఇతనే మొఘల్ చక్రవర్తి జహంగీరు. హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన మొదటి చక్రవర్తి జహంగీరు.
ముఘల్ సంస్థానంలో హర్కబాయి నాలుగుదశాబ్దాల సుదీర్ఘకాలంపాటు పట్టపురాణిగా ఆ పిదప రాజమాతగా ఎంతో గౌరవాన్ని పొందింది. ఈమె పేరుమీద ఒక ఓడ ఉండేది. ఈమె అనేక నౌకా వ్యాపారాలు చేసేది. వ్యాపారాభివృద్ధినిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించేది. ఈమె ఓడ పేరు రహిమి (Rahimi.) 12000 మంది సైనికులను కలిగి ఉన్న నలుగురు మొఘలు సంపన్న వ్యక్తులలో ఈమె ఒకరు. స్త్రీలలో ఒకే ఒకరు. ఇదీ ఈమె హోదా.
జహంగీర్ తనతల్లి హర్కబాయిని ఎంతో గౌరవంగా Her Majesty అని సంబోధించేవాడు. పాదాలకు నమస్కరించిన పిదప మాట్లాడేవాడు.
1605 లో అక్బర్ చనిపోయేనాటికి హర్కబాయి ముఘల్ స్త్రీలలో అత్యంత సంపన్నురాలు . ఈమె తన 81 వ ఏట 1623 లో మరణించింది. హర్కబాయి గౌరవార్ధం అక్బరు సమాధిపక్కనే ఆగ్రాలో ఈమె సమాధికూడా నిర్మించారు.
.
2. మన్ బాయి (1570-1605)- జహంగీర్
.
జహంగీర్ తల్లి హర్కబాయి సోదరుని పేరు రాజ భగ్వంత్ దాస్. ఇతను జైపూర్/ అంబర్ ను పాలించిన 23 వ రాజు. ఇతని కూతురు పేరు మన్ భవతి బాయి (Man Bai). జహంగీరు, మన్ బాయిలు బావమరదళ్ళు అవుతారు. మన్ బాయి గొప్ప సౌందర్యరాశి, సౌశీల్యవతి. మేనత్త హర్కబాయిలా తెలివైనది. ఆమెను జహంగీరుకు ఇచ్చి వివాహం చేయాలని హర్కబాయి ప్రతిపాదించగా, వంశప్రతిష్టలు కలిగిన కుటుంబానికి చెందిన అమ్మాయి కనుక అక్బరు మన్ బాయిని కోడలుగా చేసుకోవటానికి వెంటనే అంగీకరించాడు. మన్ బాయి, జహంగీరుల వివాహం 1585 లో అంగరంగవైభవంగా జరిగింది. వీరిద్దరికి 1587 ఖుస్రో మిర్జా అనే కొమారుడు కలిగాక మన్ బాయికి పట్టమహిషి (Shah Begum) హోదా లభించింది.
మన్ బాయి సోదరుని పేరు మాధవ సింగ్. ఇతనితో తన కొడుకు ఖుస్రో మిర్జా కలిసి భర్త జహంగీరుపై వ్యతిరేకంగా కుట్రలు పన్నటం మన్ బాయిని తీవ్రమైన మనస్తాపానికి గురిచేసేది . కొడుకుకు భర్తకు నచ్చచెప్పలేక మన్ బాయి తీవ్రఒత్తిడికి గురయి 1605 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మన్ బాయి, జహంగీర్ల దాంపత్యం ఎంతో అన్యోన్యమైనది. భార్య చనిపోయిందని తెలిసిన జహంగీరు నాలుగురోజులపాటు భోజనం చేయలేదు.

జహంగీరు భార్యావియోగంతో విరాగిగామారాడని తెలిసిన అక్బరు ఆ సమయంలో తను ధరించిన తలపాగ, శాలువాలను పంపించి ఓదార్చే ప్రయత్నం చేసాడు. కొడుకుపట్ల పిచ్చిప్రేమకు, భర్త పట్ల అనురాగానికి మధ్య నలిగిపోయి ఆత్మహత్య చేసుకొన్న కోడలి పట్ల ఎంతో కలత చెందాడు అక్బరు.
జహంగీరు, అలహాబాదు, Khusrau Bagh ఆవరణలో మన్ బాయి జ్ఞాపకార్థం అందమైన సమాధిని నిర్మింపచేసాడు.
.
3. జగత్ గోసాయిన్ (1573 – 1619) – జహంగీర్
.
ఈమెకే మనవతి బాయి, జోధ్ బాయి (జోదా అక్బరు జంట కాదు) అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈమె మార్వార్ (ప్రస్తుత జోధ్ పూర్) రాకుమార్తె. రాజ్ పుత్ రాజా ఉదయ్ సింగ్ కూతురు. ఈమె తాతగారైన Maldev Rathore నాయకత్వంలో మార్వార్ బలమైన రాజపుత్రుల రాజ్యంగా ఏర్పడింది.
యువరాజుగా ఉన్న జహంగీరు ఒకనాడు ఒక రాజకుటుంబ వేడుకలో అపురూపలావణ్యవతి అయిన జగత్ గోసాయిన్ ని చూసి ప్రేమించాడు. ఆమెను పెండ్లాడాలనే కోర్కెను వెలిబుచ్చాడు. ఈ పెళ్ళి ప్రతిపాదనను అక్బరు అంగీకరించలేదు. అక్బరు తల్లి హమీదాబాను అందరిని ఒప్పించింది. అలా జహంగీరుకు జగత్ గోసాయిన్ కి 1586లో వివాహమైంది. ఈ వివాహం మార్వార్ రాజు సంస్థానంలో పండితుల వేదమంత్రాలతో ముస్లిమ్ కట్టుబాట్ల మధ్య జరిగింది.

అందం, ఆకర్షణీయ సంభాషణ, చమత్కారం, సమయస్పూర్తి, ధైర్యసాహసాలతో జగత్ గోసాయిని తక్కువ కాలంలోనే జహంగీరుకు అత్యంత ప్రియమైన వ్యక్తిగా మారింది. జగత్ సంగీతంలో గొప్ప ప్రావీణ్యం కలిగిన గాయని. ఈమె 1592 లో జహంగీరుకు ఒక మగబిడ్డను ఇచ్చింది. అతనే మొఘల్ చక్రవర్తి షాజహాన్. హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన రెండవవ్యక్తి ఇతను. ఈ బిడ్డ జాతకం ప్రకారం మహర్జాతకుడని పండితులు చెప్పటంతో తాత అయిన అక్బర్ చక్రవర్తి ఈ బిడ్డకు “కుర్రం” (సంతోషకరమైన) అని నామకరణం చేసి తనవద్దే ఉంచుకొని పెంచి పెద్దచేసాడు.

1605 లో అక్బర్ మరణించాక కుర్రం తండ్రి వద్దకు వచ్చేసాడు. 1611 లో నూర్జహాన్ ను వివాహం చేసుకొన్నాకా ఆమె ఆకర్షణలోపడి జహంగీర్ జగత్ గోసాయిన్ పట్ల ఆదరణ తగ్గించేసాడు. 1619 లో జగత్ గోసాయిన్ అనారోగ్యకారణాలతో మరణించింది. ఈమె మరణానంతరం జహంగీర్ అన్ని రాజపత్రాలలో ఈమె పేరును Bilqis Makani (the Lady of Pure Abode) గా ప్రస్తావించమని ఆదేశించాడు. 1628 లో జగత్ గోసాయిన్ కుమారుడు షాజహాన్ ముఘల్ చక్రవర్తిగా సింహాసనం అధిష్టించే నాటికి ఈమె జీవించి లేదు.
.
4. నవాబ్ బాయి
.
కాశ్మీరుకు చెందిన రాజపుత్ రాజౌరి రాకుమార్తెను ఔరంగజేబు 1638 లో పెళ్ళిచేసుకొన్నాడు. ఈమె పేరు నవాబ్ బాయి. వీరిద్దరికి 1643 లో బహదూర్ షా I జన్మించాడు. ఇతను ఔరంగజేబు మరణానంతరం ముఘల్ చక్రవర్తి అయి 1707 నుండి 1712 వరకూ పరిపాలించాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన మూడవ వ్యక్తి. 1662 లో ఔరంగజేబు తీవ్రంగా అస్వస్థుడవగా, అతని చెల్లెలు రోషనార రాజ్యాధికారాన్ని చేతిలోకి తీసుకొని పరిపాలించసాగింది. ఈ చర్యను నవాబ్ బాయి ప్రతిఘటించింది. ఈమె కుమారులు తండ్రికి వ్యతిరేకంగా వ్యవహరించేవారు. ఈ కారణాలతో నవాబ్ బాయి అంతఃపురంలో క్రమేపీ గౌరవాన్ని కోల్పోయి ఔరంగజేబు ప్రేమకు దూరమైంది.

కొడుకులను భర్త ఖైదు చేయించాడని తెలిసి ఎంతో మానసిక క్షోభకు గురవగా, ఔరంగజేబు స్వయంగా వచ్చి నవాబ్ బాయిని ఓదార్చాడు. ఒక బాధ్యతకలిగిన తండ్రిగా, పాలకుడిగా ఏ పరిస్థితులలో సొంతకొడుకులను ఖైదుచేయించవలసిందో ఆమెకు వివరించాడు. 1691లో నవాబ్ బాయి చనిపోయింది. ఆమె గౌరవార్థం రాజ్యంలో ఒక వారంపాటు సంతాపదినాలు ప్రకటించాడు ఔరంగజేబు
.
5. ఉద్దమ్ బాయి/కుడ్సియాబేగం
.
ఉద్దమ్ బాయి హిందూ కుటుంబానికి చెందిన ఒక సామాన్య నర్తకి. రాజాస్థానంలో చేరింది. ఈమె తన సౌందర్యం, వాక్చాతుర్యం వల్ల ముఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా (r. 1719–1748) ప్రేమను చూరగొంది. మహమ్మద్ షాకు ఉద్దమ్ బాయి పట్ల మక్కువ పెరిగి రాణి హోదాను ఇచ్చాడు. వీరిద్దరికి పుట్టిన అహ్మద్ షా బహదూర్ 1748 - 1754 మధ్య ముఘల్ చక్రవర్తిగా రాజ్యమేలాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన నాల్గవ వ్యక్తి.
కొడుకు శక్తిహీనుడు, దక్షతలేనివాడు కావటంచే ఉద్దం బాయి అనధికారికంగా రాజ్యపగ్గాలు చేపట్టింది. పరిపాలకురాలిగా ఎదిగి, ప్రభుత్వ వ్యవస్థను చేతుల్లోకి తీసుకొంది. ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకొంది. డిల్లీలో గోల్డెన్ మాస్క్, కుడ్సియా బాగ్ లాంటి గొప్పనిర్మాణాలు చేపట్టింది.

పురుషుల ప్రపంచంలో ధైర్యం, తెలివితేటలు, సమర్ధత కలిగిన గొప్ప మహిళగా; ఒక నాట్యకారిణినుండి ఒక సామ్రాజ్ఞిగా ఎదిగిన ధీశాలిగా ఉద్దమ్ బాయి చరిత్రలో నిలిచిపోయింది.
.
6. అనూప్ బాయి 1699- ??
.
తొమ్మిదవ మొఘల్ చక్రవర్తి జహందర్ షా మూడవ భార్య అనూప్ బాయి. ఈమె రాజపుత్రుల యువరాణి. ఈమె Muazzamabadi అనే బిరుదును కలిగి ఉండేది. దాని అర్థం గౌరవనీయురాలైన అని. ఈమె కుమారుడు అలంగీర్ II. ఇతను 1754 – 1759 మధ్య ముఘల్ చక్రవర్తిగా పరిపాలించాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన ఐదవ వ్యక్తి. ముఘల్ రికార్డులలో 1756-1761 మధ్య ప్రభావితం చూపిన తొమ్మిది మంది మొఘల్ స్త్రీలజాబితాలో Muazzamabadi పేరు ఏడవ సంఖ్యలో ఉంది .

ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అబ్దాలి రాజు, 30 జనవరి, 1757 న ఢిల్లీ వచ్చినపుడు, అలంగీర్ II చక్రవర్తి తల్లి హోదాలో అనూప్ బాయి 121 బంగారు నాణాలు, బాదంతో చేసిన పాయసం (లవజత్) ను అతనికి పంపించింది . ఆ సమయం మొఘల్ సామ్రాజ్యం అంతర్గత కలహాలతో సంక్షోభంలో ఉంది. బహుసా అబ్దాలి వంటి రాజుల సహకారం పొందటం కొరకు అనూప్ బాయి ఆ కానుకలను పంపిఉండవచ్చు. ఇదొక దౌత్యపరమైన కూటనీతి. ఈ ఉదంతాన్ని బట్టి అనూప్ బాయి తెరవెనుక పోషించినపాత్ర కొంతమేరకు అర్ధమౌతుంది. ఇంతకు మించి ఈమె గురించిన చారిత్రిక వివరాలు పెద్దగా తెలియరావు. అనూప్ బాయి 1735 లోనే మరణించిందని మరొక కథనం కలదు.
.
7. బిలాల్ కన్వర్ / జినత్ మహల్
.
బిలాల్ కన్వర్ అలంగీర్ II భార్య. ఈమె హిందూ స్త్రీ. బిలాల్ కన్వర్ 1728 లో షా ఆలమ్ II కు జన్మనిచ్చింది . ఇతను 1760 – 1806 మధ్య ముఘల్ సామ్రాజ్యాన్ని పాలించాడు. షా ఆలమ్ II హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన ఆరవ వ్యక్తి. ఇంతకు మించి బిలాల్ కన్వర్ గురించిన సమాచారం పెద్దగా లభించదు.
.
8. లాల్ బాయి
.
బహదూర్ షా II చివరి మొఘల్ చక్రవర్తి. ఇతని తల్లి పేరు లాల్ బాయి. ఈమె హిందూ స్త్రీ. 1775 లో లాల్ బాయి బహదూర్ షా II జన్మనిచ్చింది. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన ఏడవ వ్యక్తి.

బహదూర్ షా II బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిపిన మొదటి స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించాడు. బ్రిటిష్ వారు ఇతనిని రంగూన్ తరలించి మరణించేవరకూ గృహనిర్భంధంలో ఉంచారు.
****
.
9. మరికొన్ని ప్రముఖ వివాహాలు
.
కమలాదేవి - అల్లావుద్దిన్ ఖిల్జి: కమలాదేవి గుజరాత్ లోని వఘేలా రాజ్ పుత్ కరణ్ దేవ్ II భార్య. ఈమె గొప్ప అందగత్తె. విదుషీమణి. అల్లావుద్దిన్ ఖిల్జీ 1298 లో గుజరాత్ ను ఓడించినపుడు ఈమెను ఢిల్లీసంస్థానానికి తీసుకువెళ్ళి పెళ్ళిచేసుకొన్నాడు. ఇది చరిత్రలో నమోదైన హిందూ-ముస్లిమ్ ల మధ్య జరిగిన మొదటి వివాహం. అప్పటికి ఈమెకు దేవలాదేవి అనే ఆరు నెలల కుమార్తె కలదు. ఆమె తండ్రి సంరక్షణలో ఉండి పెరిగి పెద్దదయింది. కమలాదేవి క్రమేపీ అల్లావుద్దిన్ ఖిల్జి విశ్వాసాన్ని చూరగొని, అతని రాజకీయ నిర్ణయాలలో సలహాలు ఇచ్చేస్థాయికి చేరుకొంది. కమలాదేవి చొరవతో ఆమె కూతురైన దేవలాదేవిని ఢిల్లీకి తెప్పించాడు అల్లావుద్దిన్ ఖిల్జి, దేవలాదేవిని అల్లావుద్దిన్ ఖిల్జి కొడుకు ఖిజ్ర ఖాన్ కు ఇచ్చి వివాహం జరిపించారు.

జహంగీరు చక్రవర్తి మరొక భార్య మలిక జహన్ హిందూ స్త్రీ. ఈమె జసల్మార్ కు చెందిన రావల్ భీమ్ కూతురు.

ఔరంగజేబ్ కొడుకైన బహదూర్ షా I, రాజా రూప్ సింగ్ కూతురును పెండ్లాడాడు.
1351 లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఫిరోజ్ షా తల్లి పేరు నైలా. ఈమె భట్నేర్ హిందూ రాజ కుమార్తె .
 
విజయనగర రాజు దేవరాయ I తన కూతురుని 1407 బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా కు ఇచ్చి అంగరంగవైభవంగా పెళ్ళిచేసాడు.
 
ఖేర్లా రాజైన నరసింహరాయ్ 1417 లో తన కుతురును ఫిరోజ్ షాకు ఇచ్చి వివాహం జరిపించాడు. అపురూపసౌందర్యరాశి అయిన ఈమె ఆ తదుపరికాలంలో బహుమని సుల్తాను పట్టపురాణి హోదాను పొందింది.
 
వారణాసిలో ఇరవైముగ్గురు ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ప్రేమించి హిందూమతంలోకి మారిపోయిన ఉదంతాన్ని మధ్య ఆసియా యాత్రికుడు అమిర్ అలి బాల్కి తన రాతలలో పేర్కొన్నాడు. ఇది ఆనాటి సామాన్యప్రజలలో ఉండిన మత స్వేచ్ఛను తెలియచేస్తుంది
****

అదే విధంగా మొఘల్ రాజస్త్రీలను హిందూ రాజులకు ముఖ్యంగా రాజపుత్రులకు ఇచ్చి పెండ్లిచేసిన ఉదంతాలుకూడా చరిత్రలో కనిపిస్తాయి. అక్బరుకుమార్తెకు- మేవాడ్ యువరాజు అమర్ సింగ్ కు; అక్బర్ మేనకోడలుకు రాజామాన్ సింగుకు; రూహాని బాయికు మహారాజా ఛత్రసాల్ కు; వజీర్ ఖాన్ కుమార్తె మహారాణా కుంభకు: ఒకముస్లిం సైన్యాద్యక్షుని కుమార్తెకు రాజపుత్ర రాణాసంగకు జరిగిన వివాహాలు ముస్లిం రాచస్త్రీలకు హిందూ యువరాజులకు మధ్య జరిగిన వివాహాలకు కొన్ని ఉదాహరణలుగా చెబుతారు.
.
10. ముగింపు
.
నేడు భిన్న విశ్వాసాల మధ్య వివాహాలను లవ్ జిహాద్ అని, బలవంతపు మతమార్పిడులు అని మాట్లాడటం శోచనీయం. అలాంటి ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం. ఈ రోజు ముఘల్స్ అంటే రక్తపిపాసులుగా, మతం పేరుతో ప్రజల్ని ఊచకోత కోసిన రాక్షసులుగా చిత్రిస్తున్నారు. కల్పితాలతో కట్టుకథలతో ఒక అబద్దపు నెరేటివ్ ను సృష్టిస్తున్నారు. వారి పేరు ఎవరైనా ఎత్తితే తీవ్రమైన దుర్భాషలతో, అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఊరూ పేరు, ఫొటో లేని సోషల్ మీడియా అనామకుల నుండి అత్యంత ఉన్నతమైన పదవులలో ఉన్నవారు వరకూ ఇదే ధోరణి. ఈ ద్వేషం బౌద్ధికంగా చాలా బలంగా ప్రజల మనసుల్లో నాటబడుతోంది. ఇక ఇలాంటి ద్వేషం భౌతికంగా ప్రతిఫలించటానికి ఎంతో దూరంలో లేము.

సాటి మనుషుల పట్ల ఎందుకింత ద్వేషమో అర్థం కాదు. ఈ ద్వేషం పునాదులపై ఏం నిర్మించాలని కోరుకొంటున్నారో ఊహకు అందదు. భిన్న అభిప్రాయాలు పరిఢవిల్లడం ప్రజాస్వామ్యం. మెజారిటేరియన్ భావజాలం మాత్రమే ఉండాలనుకోవటం ఫాసిజం. మానవజాతి పరిణామక్రమంలో మతం అనేది ఆదిమ అనాగరిక లక్షణమని, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం అనేవి నాగరిక లక్షణాలనీ ఎప్పటికి అర్ధం చేసుకొంటారూ?
ఎవరైతే ముస్లిమ్ పాలనవల్ల నష్టపోయారో వారే సమాజంలో ముస్లిముల పట్ల ఇంతటి ద్వేషానికి కారకులు అనటం సహజమైన అభియోగం. ఎవరు ముస్లిమ్ పాలనవల్ల నష్టపోయారు అని భిన్న సామాజిక వర్గాలను పరిశీలిస్తే---

రాజపుత్రులు, చోళులు, కాకతీయులు, పాండ్యులు, హొయసల రాజులు లాంటివారు సార్వభౌమత్వాన్ని కోల్పోయినా ముస్లిమ్ రాజులకు సామంతులుగా మారి అధికారాన్ని కోల్పోలేదు. అదే విధంగా స్థానిక జమిందార్లు/కౌలుదార్లకు వారి వారి హోదాలు పోలేదు చాలాచోట్ల. వ్యాపారులకు ముస్లిముల ద్వారా మధ్య ఆసియా వ్యాపారావకాశాలు పెరిగాయి. చేతివృత్తికారులకు ఆ వ్యాపారాల వల్ల పనులు పెరిగాయి.
 
ముస్లిమ్ పాలనలో వర్ణవ్యవస్థ కొంతమేర సడలటంతో దళిత బహుజనులు కొద్దిగా ఊపిరి పీల్చుకొన్నారు. అతిశూద్రులు కొంతమంది వివక్షనుంచి తప్పించుకోవటానికి ఇస్లాంలోకి మారారు. అధికజనాభా గ్రామాలలో నివసించేవారు. కేంద్రీయ ముస్లిం పాలనతో సంబంధంలేకుండా ఈ గ్రామీణ ప్రజలు స్వయంపోషణతో జీవించారు.
 
భక్తి ఉద్యమప్రభావంతో ముస్లిమ్ హిందూ ఐక్యత గ్రామాలలో బలపడింది. హోలి, దివాలి, సూఫీ, దర్గా, పీర్ల పండుగ లాంటి పండుగలలో హిందూముస్లిములమధ్య ఒకరకమైన సాంస్కృతిక సమ్మేళనం ఉండేది. దీనివల్ల కింది స్థాయి ప్రజలు ఒకరిపట్ల ఒకరు ప్రేమానురాగాలతో ఉండేవారు.
ఇక సమాజంలో ఎవరు ముస్లిమ్ పాలన వల్ల నష్టపోయారు అంటే కొంతమేరకు పండితవర్గం కనిపిస్తుంది. వీరు జనాభాలో 5%. ఒక పండితుడు సభకు రాగా, ఏ మహారాజైనా లేచి వెళ్ళి అతనిని ఆహ్వానించి ఉచితాసనంపై కూచుండబెట్టి, పాదాలు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకోవటం హిందూ ధర్మంలో భాగం. ముస్లిమ్ పాలనలో ఈ రకపు గౌరవాన్ని పండితులు కోల్పోయారు.

యజ్ఞయాగాదులు, Temple patronage తగ్గిపోయాయి. ఔరంగజేబు అయితే దర్బారులో కవులు, కళాకారులను నిషేదించాడు. అలా అంతవరకూ. ప్రభువు మెల్లకన్నుపై పద్యాలు చెప్పి మాన్యాలు పొందిన వైభోగం కోల్పోయారు పండితులు.
 
యజ్ఞయాగాదులు లేక శూద్రులు, అతిశూద్రులనుండి అతికష్టంగా కాపాడుకొన్న సంస్కృతం, వేదాలు పనికిరాకుండాపోయాయి.
 
ఈ వర్గం సమాజంలో శిష్టవర్గం. ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయగలిగిన వర్గం. వీరికి జరిగిన నష్టం మొత్తం సమాజానికి జరిగిన నష్టంగాను, వీరి శత్రువులు యావత్ సమాజపు శత్రువులుగాను చేయబడ్డారు. దీన్నే గ్రామ్సీ "కల్చరల్ హెగిమొని" అని వ్యవహరించాడు – సమాజంలోని ప్రభావశీల వర్గం తన విలువలు, నమ్మకాలను మిగిలిన ప్రజలచే వారికి తెలియకుండానే ఆమోదింపచేయటం.
.
బొల్లోజు బాబా

Friday, March 20, 2026

కవితాంతరంగం @ ఖమ్మం

కవితాంతరంగం @ ఖమ్మం
రెండురోజుల పాటు సాగిన ఖమ్మం కవితాంతరంగం ప్రోగ్రామ్ లో నేను కూడా పాల్గొన్నాను. 70 మంది కవితలను వారిపేరులేకుండా ఇచ్చి విశ్లేషించమని అడగటం ఒక నూతన ప్రయోగం. గ్రూపులో ఫణిమాధవి కన్నోజు, వైష్ణవిశ్రీ, గరికపాటి మణిందర్, చిక్కొండ్ర రవి, తాండా హరీష్ గౌడ్, వనపట్ల సుబ్బయ్య ఉన్నారు.
నేను రాసిన "పౌరసత్వ పత్రాలు" కవితను దాదాపు అన్ని గ్రూపులు మెన్షన్ చేసాయి. అందరకూ ధన్యవాదములు. ఈ సదస్సుకు నన్ను ఆహ్వానించినందుకు శ్రీ ప్రసేన్, శ్రీ సీతారామ్, శ్రీ రవి మారుతి లకు కృతజ్ఞతలు.
కవిత, కొన్నిఫొటోలు ఇవి.....
.
పౌరసత్వ పత్రాలు


నేను
హరప్పా వీధుల్లో
ఇటుకల మధ్య పుట్టిన జ్ఞాపకాన్ని
నిశ్శబ్దంగా నడిచిన కాలాన్ని.


వాయువ్యదిశ నుంచి వచ్చిన
వలసదారుల గుర్రాల మోతలో
సంస్కృత మంత్రాల హోరులో
నేను నా నాగరికతా పాటను కోల్పోయాను.

నా దేహంపై వర్ణాల గీతలు గీసారు
యజ్జాగ్ని వేడికి నా ఇళ్ళు కాలిపోయాయి
నా శ్రమకు బానిస సంకెళ్ళు వేసారు
నా స్వరానికి మౌనపు కచ్చడాలు బిగించారు

నేను హరప్పా వారసుడిని
ఈ దేశ మూలవాసిని
నా పౌరసత్వ పత్రాలు
ఫైళ్ళలో లేవు
నా DNA లో ఉన్నాయి
సింధునది ఒడ్డున పాతిపెట్టిన రక్తంలో ఉన్నాయి

వలసవచ్చిన వారికి ఏమున్నాయి?
పురాణాల అబద్దాలు
వర్ణవిభజన రాజకీయాలు తప్ప.
నా గోడలు ఇంకా మాట్లాడుతున్నాయి
నా మట్టి ఇంకా నిలబడి ఉంది
ఈ భూమి నాదే, ఎప్పటికీ నాదే.

బొల్లోజు బాబా


















ఒక మిత్రుడు "యుద్ధం" పై ప్రత్యేక సంచిక తెస్తున్నాం. వీలైతే ఒక కవితను పంపండి.... అని అడిగారు.
యుద్ధనేపథ్యంపై నేను అనువదించిన కవితలను ఒకసారి చదువుకొన్నాను. ఈ కవిత వద్ద ఆగిపోయాను. ఎంత గొప్ప కవిత. అనువదించి చాన్నాళ్లయింది. మళ్ళా చదివినపుడు ఆ అనుభవం మరలా తాజాగా తాకి హృదయాన్ని మెలిపెట్టింది. ఇలాంటివి రాయాలంటే ఎంత జీవితాన్ని చూడాలి!....ఈ మధ్య నాకు గూస్ బంప్స్ తెప్పించిన కవిత ఇది.
.
.
యుద్ధం ముగిసాకా (When the War is over by Shabir Ahmad Mir)
.
యుద్ధం ముగిసాకా
నువ్వు ఇలా వస్తే
బుల్లెట్లు, పెల్లెట్లు చేసిన రంద్రాలను
నీకు నేను చూపిస్తాను
నీ చేతివేళ్లతో తడిమి చూస్తే
నీకే అర్ధమౌతుంది వాళ్లెంత గాయపరచారో

యుద్ధం ముగిసాకా
శిధిలాల మధ్య భయం భయంగా వికసిస్తోన్న
ప్రిమ్ రోజెస్ పూల వాసన నీకు చూపిస్తాను
ఎంతటి దివ్యసౌందర్యం ఉండేదిక్కడ!

యుద్ధం ముగిసాకా
మా అఖండ పురాతన గిరుల మధ్య ప్రవహించే
సెలయేళ్ల గలగలల్ని నీకు వినిపిస్తాను
వాటి గొంతును కోపోద్రిక్త సరిహద్దుల చప్పుళ్ళు
ఇకపై అణచలేవు.

యుద్ధం ముగిసాకా
నేను నిన్ను దగ్గరుండి తీసుకెల్తాను
వెరినాగ్ నీటి చెలమలో నీ పాదాలను తడుపుకో
సుఖనాగ్ నీటిబుగ్గలోని నీళ్ళు దోసెళ్ళతో తాగు
ఏ భద్రతా లేకుండానే దాల్ సరస్సులో
పడవ షికారు చేస్తూ చేతిని నీళ్ళలో ఆడించు
ఇదెంత ప్రశాంత ప్రదేశమో నీకే తెలుస్తుంది.

యుద్ధం ముగిసాకా
భాష్పవాయువులు, పెప్పర్ స్ప్రేలు
సైరన్ లు, అరుపులు, మూలుగులు లేని
స్వేచ్ఛాగాలుల్ని శ్వాసించే మంచు శిల్పాలు
ఎంత అందంగా ఉంటాయో నీకు తెలిసేలా చేస్తాను.

నువ్వే చూస్తావు! నువ్వే చూస్తావు!
ఈ సువిశాల మంచు లోకపు ప్రశాంతత
అకాల సమాధులు తవ్వటానికై భగ్నం చేయకుండా ఉన్నప్పుడు
ఎంత అందంగా ఉంటుందో!

యుద్ధం ముగిసాకా
మా Wanwun బృందగానానికి తీసుకెళతాను, గొంతుకలుపు
వెండి వెన్నెల రాత్రివేళ
మా Rouff బృందనాట్యంలో చేరి ఆడుదుగాని.
మేము సంతోషంగా ఉండటం నీకూ సంతోషమేనని
నీకే తెలుస్తుంది.

యుద్ధం ముగిసాకా
నిన్ను టీ కి ఆహ్వానిస్తాను
కలిసి టీ తాగుదాం
ఉప్పని రుచితో, కుంకుమ రంగు కలిగిన టీ
నీకే తెలుస్తుంది
నేనేనాడూ నీకు శత్రువుని కానని.
.
Shabir Ahmad Mir ప్రముఖ కాశ్మీరీ కవి.
అనువాదం; బొల్లోజు బాబా,
December 4, 2019

కరుణ కన్నా గొప్ప మహిమ లేదు! - సూఫీల గొడుగు నీడలో


చాన్నాళ్ల క్రితం సారంగ కోసం కొత్తలంక బాబా గారి గురించి ఒక వ్యాసం రాసాను. ఆ వ్యాసం చదివిన ఒక మిత్రుడు ఒక మాట అన్నాడు—
“ఆ వ్యాసం కొత్తలంక బాబాగారిని కన్నా మీ అమ్మగారిని, ఆమె వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ఆవిష్కరించింది” అని.
ఈ ఉమెన్స్ డే రోజున ఆ వ్యాసాన్ని తిరిగి చదివితే నాకు స్పష్టంగా తెలుస్తోంది—
అది కొత్తలంక బాబా గారి కథ మాత్రమే కాదు;
నా జీవితాన్ని నిశ్శబ్దంగా మలిచిన
మా అమ్మ కథ కూడా.
బొల్లోజు బాబా
.
కరుణ కన్నా గొప్ప మహిమ లేదు! - సూఫీల గొడుగు నీడలో
తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడివరం సమీపంలో ఉన్న కొత్తలంకలో హజరత్ సయ్యద్ అహ్మదలీషా ఖాదర్ వలీబాబా గారి దర్గాతో మా కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి కొన్ని సంగతులు పంచుకోవాలనుకొంటున్నాను.
అవి 1930ల నాటి రోజులు.
మా మాతామహుని పేరు దొంతాభక్తుని సోమలింగం. యానాంలో నివసించేవారు. వీరికి సంతానం లేదు. ఎన్నిపూజలు చేసినా ఫలించలేదు. “రేవు అవతల ఎవరో యోగీశ్వరుడు వచ్చారట, ఆయన అనేక మహిమలు చూపుతున్నారట. వారిని దర్శించుకొన్నవారికి అనుకొన్నవి జరుగుతున్నాయట” అంటూ వారూ వీరూ చెప్పుకొనే మాటలను నమ్మి “సరే చూద్దాం ఏంజరుగుతుందో” అనుకొని ఒక రోజు మా తాతగారు కొత్తలంక వెళ్ళారు.
కొబ్బరితోట మధ్యలో ఓ చెట్టునీడన దిగంబరంగా కూర్చొని, బక్కపలచని శరీరంతో ఒక సాధువు, ఆయన చుట్టూ పది పదిహేను మంది భక్తులు. అరటిపళ్ళు, తీపితినుబండారాలు ప్రసాదంగా సమర్పించుకొని ఒక్కొక్కరు ఆయనపాదాలను తాకి నమస్కరించుకొని వెళిపోతున్నారు. కొంతమందితో ఆ సాధువు మాట్లాడుతున్నారు. మరికొందరిని వెళ్ళిపొమ్మని సైగలు చేస్తున్నారు. తెచ్చిన ప్రసాదాలను అక్కడక్కడా తీసుకొని ఎంగిలిచేస్తున్నారు, మరికొందరివి వారికే ఇచ్చేస్తున్నారు.
మా తాతగారి వంతు వచ్చింది. అరటిపళ్ళు ఆయన ముందు ఉంచి పాదాలకు నమస్కరించి లేస్తుండగా “ఏరా బ్రహ్మం, నీకు సంతానం ఉందిలే…. ఆడసంతానం” అని పలికి తలతిప్పి మరో వైపుకు చూస్తూ ఉండిపోయారట.
ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకు మా అమ్మ పుట్టింది. నెలల బిడ్డను తిరిగి బాబాగారి వద్దకు తీసుకు వెళ్ళారట మా తాతయ్య, అమ్మమ్మలు. ఎవరో తన ఒంటిపై కప్పిన శాలువాను బాబా గారు పొత్తిలిగా చేసి పసిగుడ్డుగా ఉన్న మా అమ్మను ఎత్తుకొన్నారట. సపోటా పండును వలిచి తొనలు నోటిలో పెడితే మా అమ్మ చప్పరించిందట. “ఏంపేరు పెట్టమంటారు బాబా” అని మా తాతగారు అడగ్గా ” అమ్మాజి అని పెట్టరా” అన్నారట. కప్పిన శాలువాను తిరిగి ఇచ్చేయబోతే పట్టుకొనిపొండి అని బాబాగారు సైగ చేసారట. ఆ తరువాత 1948 లో కొత్తలంక బాబాగారు స్వర్గస్తులైనారు. కొత్తలంకలో వారి సమాధి వద్ద దర్గా నిర్మించారు.
అలా మా అమ్మ పేరు అమ్మాజి. మా అమ్మకు తోబుట్టువులు లేరు. మా అమ్మ జీవితాంతం ఒక వైపు హిందువుగా అన్ని పూజలు, పండగలు, వ్రతాలూ ఆచరిస్తూనే, బాబాగారిని కూడా ఎంతో భక్తితో పూజించేది. అందరి దేవుడిపటాల సరసనా కొత్తలంక బాబాగారి ఫొటో కూడా ఉండేది. మేం ఆరుగురుం సంతానం. మా అన్నయ్యలు ముగ్గురికీ హిందూ పేర్లు పెట్టారు. నాకు మాత్రం మా అమ్మ పట్టు పట్టి కొత్తలంక బాబా గారి పేరు పెట్టించింది. నా పూర్తి పేరు బొల్లోజు అహ్మదలీబాబా. మా అందరికీ పుట్టువెంట్రుకలు కొత్తలంక దర్గావద్దే తీయించారు.
నాకు బాగా చిన్నప్పుడు కొత్తలంక వెళ్లాలంటే యానాంలో పడవకట్టించుకొని ముమ్మిడివరం రేవులో దిగి, అక్కడనుంచి సుమారు 4 కిలోమీటర్లు కాలవగట్టుపై నడుచుకొంటూ వెళ్ళేవాళ్ళం.
***
బాబాగారు ఇచ్చిన శాలువాని ఒక చెక్క పెట్టెలో వెండిపళ్ళెంలో ఉంచి పూజించేది మా అమ్మ. మాకెవరికైనా జ్వరాలొచ్చినా, చదువులకనో, పనులమీదో పొరుగూర్లు వెళుతున్నప్పుడూ బాబాగారి శాలువాని తీసి మా తలపై ఉంచి అంతా మంచి జరగాలని ప్రార్ధించేది.
ఏడాదికి రెండు మూడు సార్లు రోజంతా ఉపవాసం ఉండి, ఆ శాలువాను బయటకు తీసి, దాని ఎదురుగా కొవ్వత్తులు, అగరొత్తులు వెలిగించి, సెంటు, గంధం పూసి “కొత్తలంక బాబా నిను కోరి భజింతును, నిను చేరి సేవింతును” అనే పాటను పాడుకొంటూ పూజచేసుకొనేది మా అమ్మ. అలాగని మా అమ్మ బేల కాదు. మాహె, కారైకాల్ లాంటి సుదూరప్రాంతాలకు బదిలీలకారణంగా మా నాన్నగారు దాదాపు పన్నిండేళ్ళ పాటు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, బంధువుల సాయం అర్ధించకుండా ఆరుగురుసంతానం ఉన్న కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపించింది. పాలు అమ్మి, కోళ్ళను పెంచి కోడిగుడ్లు అమ్మి, పెరట్లో కూరగాయలు పెంచి సంసారం నడిపి ఆర్ధిక ఇబ్బందులు తప్పించేది. ఆ లోపలిధైర్యమేదో బాబాగారి నుంచి పొందిందనుకొంటాను.
***
మా నాన్నగారి సంవత్సరీకాలు అయిపోయాకా “కొత్తలంక వెళ్ళాలని ఉంది నువ్వు తీసుకెళ్తావా” అని ఒకటి రెండు సార్లు అడిగింది నన్ను. అప్పటికి మా అమ్మ వయసు డబ్బై సంవత్సరాలు. అప్పట్లో నేను ఏలేశ్వరంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. పరీక్షల హడావిడి తగ్గాక వస్తానే అని చెప్పాను. ఆ తరువాత ఒక రోజు ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ గుండుతో ఉండటం చూసి ఆశ్చర్యపడి, ఎప్పుడు వెళ్లావే దర్గాకు అని అడిగితే, “ఏమోరా నేను ఇక వెళ్లగలనో లేదో అని- దర్గా ఉన్నదిక్కుకు తిరిగి జుత్తు బాబాగారికి అర్పించేసుకొన్నాను” అన్నది. ఆ సంఘటన జరిగిన కొద్దిరోజులకే మా అమ్మ కూడా గతించిపోయింది. ఇది జరిగి పదిహేనేళ్లయినా నా జీవితంలో మిగుల్చుకొన్న పెద్ద వెలితి అది ఏనాటికీ.
నేను పదో తరగతి నుంచి కొత్తలంక దర్గాకు సొంతంగా వెళ్లటం మొదలు పెట్టాను. పడవపై యానాం గోదావరి దాటి, ఎదుర్లంకలో బ్రాంచ్ సైకిల్ అద్దెకు తీసుకొని మురమళ్ళవరకూ తొక్కుకుంటూ వెళ్ళి అక్కడ దాన్ని ఇచ్చేసి నడుచుకొంటూ కొత్తలంక వెళ్ళేవాడిని అప్పట్లో.
నేడు మా ఇంట్లో అందరి దేవుళ్లపటాలతో పాటు కొత్తలంక బాబాగారి పటంకూడా ఉంటుంది. నేటికీ ఏటా రెండు మూడుసార్లు కొత్తలంక దర్గాను దర్శించుకొంటాను సకుటుంబంగా. రకరకాల చిక్కుముళ్ళలో చిక్కుకున్నప్పుడు, పెద్దపనులు ఏమైనా తలపెట్టినపుడు దర్గావద్దకు వెళ్ళి ప్రార్ధించుకొని రెండుమూడుగంటలు కూర్చొని వస్తూంటాం. మా పిల్లలిద్దరి పుట్టువెంట్రుకలు కొత్తలంక బాబాగారి దర్గా వద్ద తీయించాము. రెండో సారి కేశాలు తిరుపతిలో ఇచ్చాం.
నేను డిగ్రీ చదివేటపుడు ఏ కల్మషమూ లేని ఒక మిత్రుడు “ఒరేయ్ మీరు కొత్తలంక బాబాగారిని ఇంతగా ఆరాధిస్తారు. మా తాతగారిది కోనసీమే. ఆయన బాబాగారి సమకాలీనుడు. ఎప్పుడైనా బాబాగారు మా ఇంటి అరుగుమీద కూర్చుంటే వెళ్ళిపో ఇక్కడనుంచి అని విసుక్కొనేవారట ఆయన. ఒక వ్యక్తిని కొందరు దైవంలా పూజించటం, మరికొందరు తృణీకరించటం ఎందుకు జరుగుతుందీ?” అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం నావద్ద అప్పుడూ లేదు ఇప్పుడూ లేదు.
చుట్టూ ఉన్న విశాలమైన గోదావరి కారణంగా కోనసీమ ప్రధానస్రవంతి చరిత్రకు కొంచెం ఎడంగానే ఉంది. అలాగని చరిత్రలేని సీమకాదు. అశోకుని పుత్రిక సంఘమిత్ర నిర్మింపచేసిన ఆదుర్రు బౌద్ధ క్షేత్రం ఘనమైన గతకీర్తికి చిహ్నం. షాజహాను ఆస్థానపండితుడైన జగన్నాధపండితరాయలు ఇక్కడివాడే. ఇతను షాజహాను కూతురు లవంగికను పెండ్లాడాడు అని ఒక కథ ప్రచారంలో ఉంది. ఎన్నోశతాబ్దాల క్రితం గోదావరిపై పడవలలో పెద్దమొత్తంలో ముస్లిం వ్యక్తులు వచ్చి ఇక్కడి ప్రజలలో కలిసిపోయి జీవించసాగారు అని చెపుతారు. లాస్ట్ బ్రాహ్మిన్ పుస్తకంలో ప్రధాన పాత్ర తన ముస్లిమ్ మిత్రుడిని సమాదరణతో చూస్తుంది. దళిత యోగిపుంగవుడైన ముమ్మిడివరం బాలయోగీశ్వరుని, కొత్తలంకబాబాగారిని పూజించినట్లుగానే కులమతాలకు అతీతంగా ఆనాటి కోనసీమ వాసులు ఆరాధించారు.
నా మిత్రుడు అడిగిన ప్రశ్నకు ఒక్కటి మాత్రం చెప్పగలను. పశుపక్ష్యాదుల్ని సమాదరించటం, మనుషుల బాధల్ని తొలగించటం లాంటి విషయాలలో కొత్తలంక బాబా గారు చూపిన మహిమలను ఈ ప్రాంత ప్రజలు కథలు కథలుగా చెప్పుకొంటారు.
ఈ సృష్టిలోని జీవరాశి అంతా ఒకటేనని, సాటిమనిషి పట్ల కరుణ కలిగి ఉండాలి అనే మౌలిక జీవన సూత్రాలను కొత్తలంక బాబాగారు ఈ ప్రాంతంలో సంచరిస్తూ అనుచరిస్తూ, వెళ్ళిపోతూ మనకు ఇచ్చిన దైవసందేశం అనుకొంటాను.
బొల్లోజు బాబా
15 Jun 2020




Comment made on respectable friend's wall


## ఒకే సర్. థాంక్యూ. ఇదే మీ సమాధానం అయితే నేనేమి అనలేను. ఒక్కటే గుర్తుచేయగలను. ఆనాటి సమకాలీనులు ముస్లిం, హిందూ లేదా యూరోపియన్ కథనాలలో "జీహాద్" అని అన్న ఒక్క వాక్యం చూపండి అని పదే పదే అడిగాను. అది చూపనంతవరకూ ఎవరెన్ని వాదనలు చేసినా అది ఈ రోజు మనకు కావలసిన విధంగా చరిత్రను వక్రీకరించటంగా భావిస్తాను. మనకు కావలసినట్లు చరిత్ర ఉండదు.
## ముస్లిమ్ సైనికులు మోసం చేసి పక్షాలు మారినంత మాత్రాన అది జీహాద్ అవుతుందా? అంబి, పుష్యమిత్రుడు, జైచంద్, సాళువనరసింహ, మరాఠా రఘునాథరావు ఎంతమంది లేరు చరిత్రలో వెన్నుపోటు మోసకారులు. రాజ్యకాంక్షను దాని డైనమిక్స్ ను అర్థం చేసుకోకుండా అంతా మతమే ఉందనీ, హిందూముస్లిం యుద్ధాలన్నీ జీహాద్ లు అని ఏ ఆధారాలు లేకుండా అంటే ఎలా?
భారతదేశంలోని ముస్లిమ్ యుద్ధాలన్నీ జీహాద్ లే అని ఒక దశాబ్దకాలంగా ఎవరంటున్నారో గమనిస్తూ కూడా అలాగే అనటంలోని ఔచిత్యాన్ని, నిజాయితీని ప్రశ్నించటం తప్పందుకవుతుందీ?
వాస్తవానికి సుల్తానులు తళ్ళికోట యుద్ధంలో గెలిచిన తరువాత విజయనగర సామ్రాజ్యాన్ని తమ రాజ్యంలో కలుపుకోలేదు. అది ముస్లిం రాజ్యం కాలేదు. రాయలవారి కుటుంబ వారసులకే వదిలి వెళిపోయారు. అలా విజయనగర సామ్రాజ్యం మరో 80 ఏళ్ళు కొనసాగింది. దీన్ని జీహాద్ అందామా లేక అతిగా వ్యవహరిస్తున్న రామరాయలకు బుద్ధిచెప్పటంగా అనుకోవాలో మీరే చెప్పండి.
•••
పాత ముస్లిం యుద్ధాలన్నీ అర్జంటుగా జీహాదులగా చెప్పటం అనేది ఇప్పుడు అవసరపడింది ఎందుకంటే...నేడు హిందుత్వవాదులు ముస్లింలపై చేస్తున్న దాష్టీకాలన్నిటికీ లెజిటమేసీ కల్పించటం కోరకు అనేది ఎవరికి తెలియని అంశం. అందుకే ఇన్నిన్ని అబద్ధాలు ఆడుతున్నారు.
****
వ్యాసంలో వాడిన "హిందూ ధర్మ సురత్రాణ" అనే పదం హిందుత్వ వాదుల సృష్టి.
ముస్లిమ్ రాజులు వివిధ యుద్ధాలలో విజయం సాధించి సుల్తానులుగా తమని తాము ప్రతిష్టించుకొన్నాక సంస్కృత శాసనాలలో వారు హమ్మీర (అమీరు), సురత్రాణ (సుల్తాను) లాంటి సాంస్క్రిటైజ్ చేయబడిన పేర్లతో పేర్కొనబడ్డారు. ఇవే పేర్లను హమ్మీర చౌహాన్, హమ్మీర వర్మన్ అంటూ కొందరు హిందూ రాజులు కూడా అనుకరించటం గమనార్హం.
శాసనాలలో హిందూ అన్నపదం 1347 లో విజయనగర రాజు మారెప్ప తనని తాను “హిందురాయ సురతాల” గా (హిందూరాజులలో సుల్తాను) చెప్పుకొన్నప్పుడు మొదటి సారిగా కనిపిస్తుంది. కొన్నాళ్ళకు ఈ పదం హిందూరాయ సురత్రాణ గా స్థిరపడింది. ఇది హిందూ ఇస్లాం Syncretism (సమ్మేళనం) కు గొప్ప ఉదాహరణ అంతే తప్ప మనుషుల్ని విడదీసే "హిందూ ధర్మ సురత్రాణ" అన్న పదం చరిత్రలో ఎక్కడా లేదు.
ఇది వాట్సప్ చరిత్రకారుల సృష్టి. ఆ పదంపట్టుకొని ఎక్కువ సేపు వాదించలేం.
బొల్లోజు బాబా
other references
1.Epigraphia Carnatica Inscription In Kolar District Vol.10, pn. 270
2. Epigraphia carnatica. By B. Lewis Rice, Director of Archaeological Researches in Mysore, pn 51
Ps.
పట్టణాలను దహనం చేసి నాశనం చెయ్యటం యుద్ధాలలో సహజం. కొన్ని ఉదాహరణలు
వాతాపి ని -పల్లవులు
అనురాధపురాన్ని - రాజరాజు
కల్యాణిని - చోళులు
దేవగిరినిని - యాదవులు, లాంటివి కనిపిస్తాయి.
మంగిరాజు ఖండిత శిరస్సుతో యుద్ధభూమిలో చాళుక్యరాజు ఫుట్ బాల్ ? ఆడుకొన్నారని ఒక శాసనం చెబుతుంది.
నిన్నమొన్నటి Sambhaji సైనికులు శత్రురాజ్యాల స్త్రీలను ఎత్తుకుపోయి అమ్ముకున్నట్లు రిఫరెన్సులు ఉన్నాయి.
ఇవన్నీ యుద్ధ ఉన్మాదాలు. వాటిని మత ఉన్మాదాలుగా చిత్రించటం నేటి విద్వేష రాజకీయాలు. తద్వారా బ్రాహ్మణాధిక్య సమాజాన్ని పునఃప్రతిష్ట చేయాలని పండితుల దురాలోచన. అంతిమంగా లబ్ది ఎవరికి అనేది విలాస శాసనం లో స్పష్టంగానే ఉంది
ఈ సూక్ష్మం తెలియనంతకాలం ప్రతిమనిషి పక్కమనిషిని ద్వేషిస్తూనే ఉంటారు



నాన్న ECG


.
సామాన్లు సర్దుతుంటే
పాత పేపర్ల మధ్య దొరికింది
పడి లేచే నల్లగీతలతో
మడతలుగా చుట్టి పెళుసుబారిన
ఒక గ్రాఫు కాగితం
నాన్న ఇసిజి.
 
ఇప్పుడు నాన్న లేడు
కానీ ఆ గీతలు
చేతికి వెచ్చగా తగులుతున్నాయి
వేళ్ళకి తెలుస్తోంది
ఆ హృదయం ఇంకా కొట్టుకోవడం
 
భుజంపై ఎవరిదో చేయి
వెనక్కి తిరిగి చూస్తే
నా కొడుకు
నిశ్శబ్ద ప్రవాహం
.
బొల్లోజు బాబా



Sunday, March 8, 2026

తళ్ళికోట యుద్ధం జీహాద్ యుద్ధమా?

తళ్ళికోట యుద్ధం 1565 జనవరి 23 న జరిగింది. దీనినే రాక్షస-తంగడి యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఓడించడానికి దక్కన్ ప్రాంతానికి చెందిన నాలుగు ముస్లిం రాజ్యాలు తమలోని శత్రుత్వాలను పక్కనపెట్టి ఒక్కటయ్యాయి. అవి అహ్మద్‌నగర్ (సుల్తాన్ హుస్సేన్ నిజాం షా), బీజాపూర్ (సుల్తాన్ అలీ ఆదిల్ షా), గోల్కొండ (సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా), బీదర్ (సుల్తాన్ అలీ బరీద్ షా).
 
వీరందరూ కలిసి విజయనగర సామ్రాజ్యంపై మూకుమ్మడిగా దాడి చేసి ఓడించారు. విజయనగర సైన్యానికి నాయకత్వం వహించింది శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియ రామరాయలు. ఈ యుద్ధంలో అళియ రామరాయలు ఓడిపోయి, శత్రువుల చేతిలో మరణించాడు. విజయనగర సైన్యం చెల్లాచెదురైంది. ఈ ఓటమితో దక్షిణ భారతదేశంలో అత్యంత బలమైన విజయనగర హిందూ సామ్రాజ్యం కూలిపోయింది.

I. తళ్ళికోట యుద్ధం జీహాద్ యుద్ధమా?

జీహాద్ అంటే ఇస్లామ్ మతరక్షణ, విస్తరణ కొరకు చేసే యుద్ధంగా నిర్వచిస్తారు. (ఇతర అర్ధాలున్నప్పటికీ నేడు అలా స్థిరపడింది). చరిత్రలో కొన్ని యుద్ధాలు జీహాద్ గా పేర్కొనబడ్డాయి కానీ ప్రతి యుద్ధం జీహాద్ అని ప్రకటించలేదు. భారతదేశంలో జరిగిన ముస్లిం యుద్ధాలను జీహాద్ లుగా ప్రకటించినట్లు ఆనాటి సమకాలీన ఆధారాలు లేవు. ముఖ్యంగా “జీహాద్” అనే పదం ఎక్కడా వాడలేదు.
 
ఈ రోజు Sandeep Balakrishna లాంటి కొందరు హిందుత్వవాదులు, ధర్మ డిస్పాచ్ లాంటి వెబ్ సైట్లు - భారతదేశంలో ముస్లింలు చేసిన యుద్ధాలను జీహాద్ గా అభివర్ణిస్తున్నారు. ఈ ధోరణి 2010 నుంచి ఎక్కువయింది. లవ్ జీహాద్, ఫుడ్ జీహాద్ లాంటి పదాలను సృష్టించి ప్రజలమధ్య విద్వేషాలను రగులుస్తున్నారు.
 
ఇటీవల ఒక ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త కూడా తన కొత్త పుస్తకాన్ని ప్రమోట్ చేసుకోవటానికి తళ్ళికోట యుద్ధం అనేది కొందరు ముస్లింరాజులు కలిసి హిందూరాజుపై జరిపిన “జీహాద్” అని ప్రకటించటం శోచనీయం, సత్యదూరం. ఈ విషయాన్ని దృవీకరించే ఆనాటి సమకాలీన ఆధారం ఒక్కటి కూడా లేదు. భారతదేశంలో హిందూ-ముస్లిం యుద్ధాలను జీహాద్ గా చెప్పటం పూర్తిగా ఇటీవలి పరిణామం. హిందుత్వవాదుల సృష్టి. మనుషులను విడదీదే విద్వేషపూరిత ప్రచారం. దాన్ని బలపరచే విధంగా తెలుగుసాహిత్యం దోహదపడటం నైతిక పతనం.
ఆనాటి వివిధ రచనలలో తళ్ళికోట యుద్ధాన్ని వర్ణించిన వాక్యాలలో ఎక్కడా జీహాద్ అన్న పదం కనిపించదు. హిందువులను కాఫిర్ (అవిశ్వాసి) గా వర్ణించటం ఆ కాలపు శైలి తప్ప మతప్రస్తావన కాదు.
 
II. జీహాద్ యుద్ధం చేయడం అంటే కొన్ని పద్దతులు పాటించాలి. అవి-

1. పవిత్రయుద్ధానికి పిలుపు ఇచ్చి ఆ యుద్ధాన్ని స్పష్టంగా జీహాద్ అని ప్రకటించాలి
2. పండితుల మద్దతుతో మతపరమైన ఫత్వా ఇవ్వాలి.
3. పాలకుడు తనను తాను ఘాజీ గా సంభోదించుకోవాలి
4. యుద్ధం యొక్క ప్రధాన ఉద్దేశం మత విస్తరణ అని చూపాలి
ఇన్ని నియమాలు పాటించినపుడు మాత్రమే ఆ యుద్ధాన్ని జీహాద్ అని అంటారు.
ఆ కాలానికి చెందిన వివిధ ఇస్లామ్, ఇస్లామేతర రచనలలో తళ్ళికోట యుద్ధ ప్రస్తావనలు ఉన్నాయి దేనిలోను జీహాద్ అనే పదం కనిపించదు. వాటి వివరాలు ఇవి….
.
A. ఇస్లామ్ చరిత్రకారులు తళ్ళికోట యుద్ధం గురించి చెప్పిన అంశాలు
.
1. తజ్కిరత్ అల్-ములూక్ (Tazkirat al-Muluk/ రాజుల వృత్తాంతం)
పేరుతో బీజాపూర్ కోర్టులో 1560 లలో పనిచేసిన రఫీ-ఉద్-దీన్ షిరాజీ అనే చరిత్రకారుడు తళ్ళికోట యుద్ధానికి సంబంధించి….
“ఇస్లాం రాజులు (నిజాం షా, ఆదిల్ షా, కుత్బ్ షా, బరీద్ షా) గత పరాజయాలు, భూభాగ నష్టాల తర్వాత “కాఫిర్” రామరాయను ఓడించేందుకు కూటమి కట్టటం; కృష్ణా నది దాటటం; తుపాకీల వినియోగం, రామరాయ మరణం; విజయోత్సవాలు లాంటి ఘట్టాలు వివరించాడు.” ఈ యుద్ధం ప్రధానంగా ప్రతీకారం, అధికార విస్తరణ లాంటి అంశాల ఆధారంగా జరిగిందని చెప్పాడు.

2. బుర్హాన్-ఇ-మఆసిర్ (Burhan-i-Maasir చారిత్రిక ఘనకార్యాలు) సయ్యద్ అలీ తబాతబా అహ్మద్‌నగర్ కోర్టు చరిత్రకారుడు 1590లలో రచించిన రచనలో తళ్ళికోట యుద్ధాన్ని ఇలా వర్ణించాడు.
“రామరాయ “దక్కన్‌లో ఏకైక అధికారి” గా ప్రకటించుకోవడంతో అతన్ని కూలదోయడానికి కూటమి ఏర్పడింది. రాజకీయ అధికారాల విస్తరణ, భూభాగ హక్కులకొరకు ఈ యుద్ధం జరిగిందని చెప్పాడు” తప్ప ఎక్కడా జిహాద్ ప్రస్తావన తేలేదు.

3. తరీఖ్ ఇ-ఫిరిష్తా (Tarikh-i-Ferishta ఫరిస్టా రచించిన చరిత్ర) — మహ్మద్ ఖాసిం ఫరిష్తా బీజాపూర్ చరిత్రకారుడు. ఇది 1589 నాటి రచన. దీనిలో ఫరిష్టా తళ్ళికోట యుద్ధం గురించి ఈ మాటలు చెప్పాడు.
“సుల్తాన్లు తమ శత్రుత్వాన్ని పక్కనబెట్టి కూటమి కట్టారని, కృష్ణా దాటి యుద్ధం చేసి “కాఫిర్” ను ఓడించారని చెప్పాడు. యుద్ధానికి ప్రధాన కారణం రామరాయ అధికారాన్ని అంతం చేసి రాజకీయ ఆధిపత్యం పొందటం అన్నాడు” దీనిలో కూడా “జిహాద్” ప్రకటన లేదు.

B. పోర్చుగీసు/యూరోపియన్ లు చెప్పిన అంశాలు

1. సెసారే ఫెడెరిచి (Cesare Federici): ఇటాలియన్ వ్యాపారి. 1567–68 మధ్య హంపి అవశేషాలు దర్శించాడు. “నలుగురు మూర్ రాజులు” ద్రోహంతో విజయనగరాన్ని ధ్వంసం చేశారని పేర్కొన్నాడు తప్ప. మతపరమైన యుద్ధంగా చెప్పలేదు.
 
2. డియోగో దో కౌటో (Diogo do Couto) 16వ శతాబ్దం చివర సందర్శించిన పోర్చుగీస్ చరిత్రకారుడు. “మూర్ రాజులు” కూటమి కట్టి “బిస్నగ రాజు” పై యుద్ధం చేశారని చెప్పాడు. పూర్వ అవమానాలకు ప్రతీకారం అన్న రాజకీయ భావనే తప్ప జిహాద్ ప్రస్తావన లేదు.
ఇతర జెసుయిట్/పోర్చుగీస్ లేఖలు (ఉదా: ఆంటోనియో రుబినో, 1608) లాంటి వాటిలో భూ వివాదాలు, ప్రతీకారం, కూటమి, ఇవి మాత్రమే యుద్ధకారణాలుగా ఉన్నాయి తప్ప మతపరమైన జిహాద్ పదజాలం లేదు.

III. తళ్ళికోట యుద్ధాన్ని జీహాద్ గా ఎవరు పేర్కొన్నారు

19-20 వ శతాబ్దపు చరిత్రకారులైన జాన్ బ్రిగ్స్, రాబర్ట్ స్యూవెల్ లాంటి వారు ఈ యుద్ధానికి రాజకీయ సైనిక వివరణలు ఇచ్చారు తప్ప జీహాద్ గా లేబుల్ చెయ్యలేదు. ఆధునిక చరిత్రకారులు - రిచర్డ్ ఎం. ఈటన్, బర్టన్ స్టీన్, సంజయ్ సుబ్రహ్మణ్యం, ముజఫ్ఫర్ ఆలం, రోమిలా థాపర్ మొదలైన వారు తళ్ళికోట యుద్ధానికి మతపరమైన ఫ్రేమింగ్‌ను తిరస్కరించారు.
నిజానికి అళియరామరాయలు సుల్తానులతో చాలాకాలం మైత్రిలో ఉన్నాడు. కొన్ని సార్లు వారితో ఘర్షణలు పడ్డాడు. ఇతని సైన్యంలో చాలామంది ముస్లిం సైనికులు ఉండేవారు. తన సింహాసనంపై ఖురాన్ ప్రతిని ఉంచుకొని ఇస్లాంమతాన్ని గౌరవించాడు.
 
తళ్ళికోట యుద్ధాన్ని జీహాద్ గా ప్రచారం చేయడం పూర్తిగా ఇటీవలి పరిణామం. మతవాదుల విద్వేషపూర్వక ఎత్తుగడ ఇది. ఈ ప్రచారం చేస్తున్నది Dharma Dispatch, True Indology, INDIAN REAL HISTORY వంటి వెబ్‌సైట్‌లు ఇతర సోషల్ మీడియా అకౌంట్లు ఇంకా అనేకానేక వాట్సప్ కథనాలు. యుద్ధానంతరం హంపిలోని ఆలయాల విధ్వంసాన్ని జిహాద్ గా చెబుతారు వీళ్ళు. కానీ అక్కడ వైష్ణవ క్షేత్రాల విధ్వంసం జరిగింది కానీ శైవ క్షేత్రాల విరూపం ఎందుకు జరగలేదనే ప్రశ్నకు వీరివద్ద సమాధానం ఉండదు.

నిజానికి మధ్యయుగాలలో కనిపించేది రాజ్యకాంక్షతో కూడిన యుద్ధోన్మాదం. కన్నూమిన్నూ కానని హింస, అరాచకత్వం ఆక్రమణ దాని లక్షణాలు. ఈ యుద్ధోన్మాదాన్ని మతోన్మాదంగా చిత్రీకరించడం అనేది ఒకమతంలో ఎవరైతే అధిపత్యాన్ని కలిగి ఉంటారో వారికి లబ్ది చేకూర్చే ఎత్తుగడ.
 
CE1323 లో తుగ్లక్ దక్షిణభారత దండయాత్రలో కాకతీయ సామ్రాజ్యాన్ని జయించి ఆంధ్రదేశాన్ని ఢిల్లీ సుల్తానుల పాలనకిందకు తెచ్చాడు. అప్పుడు ముసునూరి ప్రోలయనాయకుని నాయకత్వంలో ఆంధ్ర నాయకులు స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నారు. ఆ సందర్భంలో వేయించిన విలస తామ్రశాసనం చారిత్రికంగా విలువైనది.
 
"ఈ శాసనంలో - ముస్లిం పాలనలో ఆంధ్ర ప్రాంతం "మైలపడి" (అపవిత్రమైందని), దానిని యజ్ఞయాగాదులతో, బ్రాహ్మణులకు అగ్రహారాలు (భూములు) దానం చేయడం ద్వారా ప్రోలయ నాయకుడు "పునరుద్ధరణ" (శుద్ధి) చేశాడని పేర్కొనబడింది."

అంటే ఈ శాసనం బ్రాహ్మణాధిక్యతకొరకు, వర్ణధర్మం స్థాపన కొరకు వేయించిన శాసనం. మధ్యలో ముస్లింల ప్రస్తావన రాజకీయపరమైనది.

నిజానికి యుద్ధసమయంలో, రాజ్యకాంక్షలో మతాన్ని చూడటం మనువాదుల కుట్ర. తమ ఆధిపత్యం సడలుతున్నందుకు యుద్ధ ఉన్మాదాన్ని మత ఉన్మాదంగా చిత్రించారు. ఆ మేరకు దానాలు, సంభావనల రూపంలో లబ్దిపొంది తిరిగి తమ ఆధిక్యతను పునస్థాపించుకొన్నారని అవి ఆనాటి సోషల్ డైనమిక్స్ అని విలస శాసనం ద్వారా అర్ధమౌతుంది.
.
IV. ముగింపు
.
ఈ నేలపై ఒక్క ముస్లింలు హిందువులకు మాత్రమే యుద్ధాలు జరగలేదని కాస్త చరిత్ర చదివితే అర్థం అవుతుంది. హిందువులకు హిందువులకు మధ్యకూడా అంతకన్నా ఎక్కువే యుద్ధాలు జరిగాయని అప్పుడుకూడా సంపదలకోసం ఆలయాలు తవ్వబడ్డాయని, విగ్రహాలు విరూపం చేయబడ్డాయని, ముస్లింలు చేసిన యుద్ధాలలో హిందూ సైనికులే ఆ పని చేశారని కూడా అర్థమౌతుంది. అంతిమంగా లబ్దిపొందింది ఎవరో విలస శాసనం చివరిపంక్తులు చెబుతున్నాయి. నేటికీ అదే ధోరణి.
 
రాజ్యకాంక్షతో జరిగిన యుద్ధాల్లో మతాన్ని వెతకడం చరిత్రను వక్రీకరించే ప్రమాదకరమైన అవగాహన. రాజకీయ, ఆర్థిక, సామ్రాజ్యవిస్తరణ లక్ష్యాలతో సాగిన యుద్ధాలను మతపరమైనవిగా చిత్రించడం నేటి మతవాదుల దుష్ప్రచారం. గతంలో ముస్లింలు చేసిన ప్రతి యుద్ధమూ మతవిస్తరణ కోసమేనని, అదే ధోరణి నేడు ‘లవ్ జీహాద్’, ‘ఫుడ్ జీహాద్’ వంటి పేర్లతో కొనసాగుతోందని చెప్పడం విషప్రచారం మాత్రమే.

యుద్ధ సమయంలో కంటే, ప్రశాంత కాలంలో ఒక రాజు తన రాజ్యంలో భిన్న మతాలను ఎలా ఆదరించాడు, ఎలా సంరక్షించాడు అన్నదే చరిత్రాత్మకంగా పరిశీలించాల్సిన ప్రమాణం కావాలి.
యుద్ధోన్మాదమే మతోన్మాదం అనే అవగాహనతో రాసే సాహిత్యం సమకాలీన మత రాజకీయాలకు చరిత్ర పేరుతో ఊతం ఇచ్చినట్లు. ఇది వాంఛనీయం కాదు.
 
బొల్లోజు బాబా

Sunday, March 1, 2026

కాలం వెడల్పు

.
రద్దీ రోడ్డుకు చెరోవైపున
అపరిచితుల్ని తప్పించుకుంటూ
సెల్‌ఫోన్‌ మాటల్లో మునిగిన
ఇద్దరు బాల్యమిత్రులు.

ఒకే వీధిలో ఎదిగిన అడుగులు
ఇప్పుడు వేర్వేరు ఫుట్‌పాత్‌లపై.
ఒకే నవ్వు పంచుకున్న పెదాలు
ఇప్పుడు వేర్వేరు సంభాషణల్లో.

ఒకరినొకరు చూసుకోలేని దూరం
అంత పెద్దదేం కాదు
రోడ్డు వెడల్పంతే!
కానీ కాలం
ఆ రోడ్డుకంటే వెడల్పైంది.

జీవితం ఒకే దిశలో ప్రవహించే నది
ముందుకే తప్ప
వెనక్కి ప్రవహించదు.
జ్ఞాపకాలు మాత్రం
అడుగున రాళ్లలా
నీటిలో కరగక నిశ్చలంగా!

బొల్లోజు బాబా

Friday, February 13, 2026

పిల్లలు…


మన జీవితమనే ఇంట్లోకి
పిల్లలు బుడి బుడి అడుగులతో
నిశ్శబ్దంగా ప్రవేశిస్తారు

వారి చిట్టిచేతులతో
మన ఆలోచనలని
మన మాటలను
మన కాలాన్ని
కౌగిలించుకొని
పాటలతో నవ్వులతో
నింపేస్తారు

మనమేమో
చల్లని ఎండను, వేడి వెన్నెలను
మోసుకొంటూ సాగే నదిలా
తీరాల్ని ఒరుసుకొంటూ
ముందుకు సాగిపోతాం

మనం లేకపోయాక కూడా
వాళ్ళు ఇక్కడే ఉంటారు
వానాకాలం ముగిసాక
గోడలపై మిగిలే తేమలా
సాయంకాలం ఇంటిముందు
పడే పొడవైన నీడల్లా…

బొల్లోజు బాబా

suffocation

చిన్ని చిన్ని ఆశలు
ఇప్పుడే కాదని
కలలను కొంతకాలం
వాయిదా పెట్టిందామె
కాళ్ళకింద నేల గట్టిపడాలని

***
పెళ్ళయింది
తల్లయింది
వంటగది వాసనైంది
నలుగురికి నీడైంది
అన్నీ అయింది
కానీ
'తాను' అవ్వలేకపోయింది.

ఒక్కొక్కటిగా
వాయిదా... వాయిదా..
వాయిదాలే జీవితమై పోయింది

అద్దంలో అదే మొఖం
అదనంగా
నుదుటి ముడుతలు
జుత్తులో తెల్లని నిశ్శబ్దం

ఆమె తన కుమార్తెకి
ఒకటే మాట
చెప్పాలనుకుంది

“తల్లీ!
ప్రపంచం కోసం
దేన్నీ వాయిదా వెయ్యకు
ఇప్పుడే మొదలు పెట్టు
నీ కోసం
నీ ఊపిరి కోసం”

బొల్లోజు బాబా

డిజిటల్ శ్వాస.....

మరణం తరువాత కూడా
అతని పేరు
సోషల్ మీడియంలో
శ్వాస తీసుకుంటూనే ఉంది
పోస్టులుగా
ఫొటోలుగా
కామెంట్లుగా

తెలియని ఎవరో
ఎప్పుడైనా చెప్పిన
బర్త్ డే విషెస్ కు
వెలుతురు స్క్రీన్
సమాధి రాయిలా
చేతికి చల్లగా తాకుతుంది.

ఎప్పటికైనా
ఫోన్ మూసేసి
రోజువారి పనుల్లో పడిపోక తప్పదు

లోపల ఎక్కడో
సిగ్నల్ లేని ప్రాంతంలో
వేదన మాత్రం
ఇంకా లోడ్
అవుతూనే ఉంటుంది


బొల్లోజు బాబా

ఇల్లు విడిచిన పిల్లలు


కాలేజీ చదువులకై
సూట్‌కేసుల్లో
కలలు సర్దుకొని వెళ్లిన పిల్లలు
ఫోన్ నంబర్లుగా మాత్రమే మిగిలారు.

అదే ఇల్లు
అదే కాలండరు
అదే గడియారం
అన్నీ ఒకేలా నిలిచిపోయినట్లు
అదే బరువు
అదే అలసట
అదే నిశ్శబ్దం

జ్ఞాపకాల దీపం
వెలుగుకన్నా నీడనే
ఎక్కువగా పంచుతుంది.

చివరకు నిశ్శబ్దం
దేహంపై దుప్పటిలా పరుచుకొంది.

ఇల్లు విడిచిన పిల్లలు
ఫోన్ లో
వీడియో కాల్ గా
మాత్రమే తిరిగొచ్చారు.

బొల్లోజు బాబా

బడ్జెట్ డే

ఒకప్పుడు బడ్జెట్ అంటే
ఏ రంగానికి వెలుగు?
ఏ వర్గానికి ఊరట?
నా శ్రమకు
రేపు ఎంత విలువ?
లాంటి సంఖ్యల మధ్య
దేశం ఊపిరి తీసుకునేది.

దేశం నడిచే దారుల్లో
నన్ను నేను ఆసక్తిగా
వెతుక్కున్న రోజులవి.

ఇప్పుడు
బడ్జెట్ అనేది
సామాన్యుల కోసం కాక
రాజ్యం ధనవంతులకు రాసే
ప్రేమలేఖగా మారిపోయింది.

ఖర్చుల పట్టికలో
నేనొక అనవసర వ్యయాన్ని.
నా గొంతు ఎప్పుడో
నిశ్శబ్దంగా
చెరిపివేయబడింది.

నేను కేవలం
విస్మరింపబడే
ఓటును మాత్రమేనని
బడ్జెట్ లో ఒక కేటాయింపును
ఎన్నటికీ కాలేననేది
ఒక చేదునిజం.

బొల్లోజు బాబా

3/2/2026

కాకినాడ



ఈ ఊరు
నా ఉదయాలను సాయింత్రాలను
జ్ఞాపకాలుగా దాచుకొన్న
ఒక కవిత.

పిఆర్ కాలేజ్ గ్రౌండ్
ఇప్పటికీ
నా అడుగుల్ని
లెక్కపెడుతూనే ఉంది
అక్కడ నేను పాఠాల కంటే
ప్రశ్నలే ఎక్కువ నేర్పాను

గాంధీనగర్ పార్కులో
చెట్లు పెద్దవయ్యాయి
జీవితం ఇచ్చిన విరామాల్లో
నా శ్వాసను
అక్కడే రిఫ్రెష్ చేసుకొన్నాను

సినిమా రోడ్‌లో
థియేటర్లు మారాయి,
పోస్టర్లు మారాయి,
హీరోలు మారారు.
కాలం వెనక్కి తిరగదు
కానీ
నా ఎముకలలో
ఆనాటి క్యూలో నిలిచిన
ఉత్సాహం మాత్రం
ఇప్పటికీ వెచ్చగానే ఉంది.

భావనారాయణ స్వామి గుడిలో
గంట శబ్దం వినిపిస్తే
మనసు తేలికవుతుంది
ఏదో భారాన్ని
నేనే వదిలేసుకొన్నట్టు.
అక్కడ
అడిగింది తక్కువ
వదిలేసిందే ఎక్కువ.

బీచ్ రోడ్‌లో
సముద్రం నెమ్మదిగా అలవాటైంది.
అలలు పాత కలల్ని
తీరానికి తెస్తుంటే
మౌనం వాటితో జ్ఞాపకాల మాలలల్లేది.
ఈ గాలిలో ఇంకా
వలస దుఃఖపు వాసన
కొరంగీల ఆశల్ని మోసుకెళ్ళిన
నౌకల ఊపిరి అది.

జగన్నాధపురం వంతెన
ఒకనాటి పూలవంతెన,
పూలదుకాణాలు లేకున్నా
మనసులో వేలాడిన
పూలమాలలకు
ఇప్పటికీ అదే పరిమళం.

నేను ఇక్కడ పుట్టలేదు
ఇక్కడకు చేరుకొన్నాను.
బహుశా
ఇక్కడే గతించిపోతానేమో కూడా.

అది విషాదం కాదు.
ఎంపిక.
నెమ్మదిగా ప్రేమగా మారిన
ఒక ఊరు పేరు
కాకినాడ.

బొల్లోజు బాబా

Monday, January 26, 2026

లించింగ్.... .


తమ్ముడూ!
నువ్వు హింసను
సాధన చేయాలోయ్
మనిషిని మనిషే
సజీవంగా పీక్కుతుంటూంటే
తప్పట్లు కొడుతూ
"ఒన్స్ మోర్... ఒన్స్ మోర్" అని అరుస్తూ
ఎంజాయ్ చేసే స్థాయికి చేరుకోవాలోయ్
ఏళ్ళొచ్చినయ్.
ఎప్పటికి తెలుసుకొంటావ్.
ఎక్కువ ఆలోచించకు.
ఈ ప్రపంచం
ఎలా ఆనందిస్తోందో
ఒక్కసారి చూడు !
.
బొల్లోజు బాబా

ఇది "హరప్పా నుండి నేటివరకూ" పుస్తకానికి ప్రముఖ రచయిత, చరిత్ర సాంస్కృతిక విశ్లేషకులు శ్రీ కల్లూరి భాస్కరం గారు రాసిన ముందుమాట.


చరిత్రను ఈ కాలంలో ఎలా చదవాలి, ఎలా ఎదుర్కోవాలి అన్నదానికి ఇది ఒక బలమైన బౌద్ధిక నేపథ్యాన్ని అందించింది.
ఇంత లోతైన, బాధ్యతాయుతమైన విశ్లేషణతో ముందుమాట రాసిన శ్రీ భాస్కరం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
పాఠకుల నుంచి పుస్తకానికి వస్తున్న ఆదరణ, ఈ ప్రయత్నం సార్థకమైందనే నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది.
ఈ ప్రయాణంలో తోడైన అందరికీ ధన్యవాదాలు.
ఈ వ్యాసాన్ని ప్రచురించిన సాహిత్యప్రస్థానం పత్రిక ఎడిటర్ గారికి, ప్రచురణకర్తలు శ్రీ ఎస్.వి. నారాయణగారికి, కవర్ పేజ్ ఇచ్చిన శ్రీ గిరిధర్ గారికి, బలమైన క్రిస్పీ బ్లర్బ్ ఇచ్చిన సహృదయ మిత్రుడు శ్రీ అద్దేపల్లి ప్రభుగారికి, మరీ ముఖ్యంగా ఈ పుస్తకాన్ని కొని చదివి ఫోన్ లో మెసేజుల ద్వారా అభినందించిన అందరకూ....
బొల్లోజు బాబా
.
అసత్యాల అంధకారంపై చరిత్రవెలుగుల జడి
.
మన దేశం ఈరోజున ఒక కీలకదశలో ఉంది, కీలకమైన మలుపు తిరిగే దశలో ఉందని కూడా చెప్పవచ్చు. దానికి పూర్వరంగంలో క్షీరసాగరమథనంలా ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున భావసాగరమథనం జరుగుతోంది. అయితే, దానినీ, దాని ప్రాముఖ్యాన్నీ ఎంతమంది గుర్తించారో తెలియదు. గుర్తించవలసిన అవసరం మాత్రం ఉంది. బహుశా ఉపనిషత్తుల కాలం తర్వాత ఈ గడ్డమీద మళ్ళీ ఇప్పుడే పతాకస్థాయిలో భావాలు సంఘర్షించుకుంటున్నాయని నేను పదే పదే చెబుతూవచ్చాను. నేటి సందర్భ ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించి, అర్థం చేసుకునేవరకూ మళ్ళీ మళ్ళీ ఆ మాట చెప్పుకోక తప్పదు.
క్షీరసాగరమథనంలో విలువైనవాటితోపాటు, విషం కూడా పుట్టిందని మనకు తెలుసు. భావసాగరమథనం అందుకు భిన్నంగా ఉంటుందనీ, ఉండాలనీ ఆశించలేం. ఈ దేశానికీ, ఈ దేశగమనానికీ చెందిన ఎన్నో అంశాలలో ఒక స్పష్టతకు, ఒక అవగాహనకు రావడానికి చేయగల దోహదమే - దానినుంచి రాబట్టుకోగల విలువ; ఆ క్రమంలో అజ్ఞానపూరిత ఆవేశకావేశాల రూపంలో పుట్టుకొచ్చేది - విషం. అయినా అంతిమంగా జ్ఞానామృతభాండం చేతికందేవరకూ మథనం అనివార్యం.
ఇప్పుడీ భావసాగరమథనం అనేక రంగాల మీదుగా, అనేక పొరలలో జరుగుతోంది. వాటిలో ‘చరిత్ర’ ఒకటి. ఎక్కడైనా, ఎప్పుడైనా భావసంఘర్షణా, భౌతిక పరిస్థితులూ ఒకదానినొకటి పెనవేసుకుని, ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటూనే మనుషులను, లేదా దేశాలను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఈ గమనమంతా కలసి చరిత్ర అవుతుంది. స్థలకాలాల మీదుగా జరిగిన ఈ గమనం తాలూకు వివరాలన్నీ ఒకచోట క్రోడీకరిస్తే, అది ‘చరిత్ర’ అనే రూపం ధరిస్తుంది. అయితే, శ్రీశ్రీ చెప్పినట్టు చరిత్ర అంటే కేవలం తారీకులు, దస్తావేజులు మాత్రమే కాదు; స్థలకాలాలతో లేదా పరిణామక్రమంతో ముడిపడిన ప్రతీదీ చరిత్రగానే మారుతుంది. ఆవిధంగా చూసినప్పుడు, మనకు సంబంధించి, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు, కావ్యాలు, నాటకాలు, ప్రబంధాలు, అన్ని రకాల కళారూపాలు కూడా చరిత్రలో భాగమవుతాయి. కనుక, ఆధ్యాత్మికవాదులు చెప్పే ఆత్మ సర్వవ్యాపి అవునో కాదో తెలియదు కానీ, చరిత్ర సర్వవ్యాపి.
అయితే, ఒక మాట గానూ, ఒక సబ్జెక్టుగానూ కూడా చరిత్ర అంత గంద్రగోళానికి, వివాదాలకీ, తిరస్కారానికీ, చులకనకూ, అస్పృశ్యతకూ గురైన మరో మాటా, మరో సబ్జెక్టూ కనిపించదు. ఏది చరిత్ర, చరిత్ర నిర్వచనం ఏమిటి, చరిత్రను ఎలా వర్గీకరించాలి మొదలైన అనేక విషయాల్లో మన మధ్య ఇంతవరకూ ఒక కనీసమైన వస్తురూపసంబంధమైన ఏకీభావం కూడా ఏర్పడలేదు. మనకు చరిత్ర అక్కర్లేదండీ అంటూ ఒక్కమాటతో తీసి పారేసి, సంభాషణను హఠాత్తుగా ముగించిన విశ్వవిద్యాలయ పండితులు నాకు తెలుసు.
అయినాసరే, బ్రిటిష్ వలస పాలన దరిమిలా ఆత్మన్యూనతను, ఆత్మోత్కర్షగా మలచుకునే ప్రయత్నంలో మనకు చాలా గొప్ప చరిత్ర ఉందని చెప్పుకుంటూ చరిత్రరచనకు పూనుకున్న విచిత్ర చరిత్రా మనకు ఉంది. చరిత్రపట్ల తిరస్కారంతోపాటు, చరిత్ర రచనకు అవసరమైన విధివిధానాల క్రమశిక్షణ లోపించిన పరిస్థితిలో చరిత్రకు మసి పూయడం, మాయచేయడం, అణచిపెట్టడం, చరిత్ర పేరుతో అబద్ధాలను దండగుచ్చడం, లేని ఘనతను ఉన్నట్టు చూపడం, ఉన్న ఘనతను లేనిదిగానో, తక్కువ చేసో చూపడం విశృంఖలంగా జరుగుతూవచ్చింది. అదిప్పుడు ఔత్సాహిక చరిత్ర రచయితలు, అకడమిక్ పండితులు, భావజాల దృక్కోణంనుంచి చరిత్రను వ్యాఖ్యానించే ఆలోచనాపరులనే పొరలను దాటి రాజకీయకార్యక్షేత్రంలోకి, అందులోనూ అధికారపు అండ ఉన్న రాజకీయక్షేత్రంలోకి, సినిమా వంటి కళారూపాల్లోకి ప్రవేశించి మరింతగా వికటతాండవం, విలయతాండవం చేయడం చూస్తున్నాం.
ఇంకొక వింతా, వైరుధ్యమూ ఏమిటంటే; ఈ రాజకీయప్రేరిత చరిత్ర కల్పనకూ, కల్పితాలకూ, అబద్ధాలకూ, అసమగ్ర చిత్రణలకూ పాల్పడేవారు, వాస్తవంగా తాము ఉద్దేశించిన లక్ష్యానికి తామే నష్టం కలిగించుకుంటున్నామన్న సంగతిని గుర్తించకపోవడం! ఎలాగంటే, అసత్యాలతో, అర్ధసత్యాలతో, అతిశయోక్తులతో ఎవరినైనా, దేనినైనా ఆకాశానికి ఎత్తే ప్రయత్నం జరుగుతున్నకొద్దీ; దానికి సమాంతరంగా, వాటిని ఎత్తిచూపి, ఇదీ అసలు వాస్తవమని చెప్పే ప్రయత్నమూ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అది ఉద్యమరూపం ధరించిన దామాషాలోనే ఇదీ ఉద్యమరూపం ధరిస్తుంది. అంటే, మెచ్చులు, హెచ్చులు చూపినకొద్దీ పుచ్చులూ, రొచ్చులూ కూడా వేలెత్తి చూపవలసి వస్తూ ఉంటుంది.
ఈ క్షణాన అక్షరాలా జరుగుతున్నది అదే. అదీ జరగవలసిందే కానీ, అకడమిక్ రంగానికి పరిమితమై జరగడం వేరు, రాజకీయక్షేత్రంలోకి అడుగుపెట్టి జనం భావోద్వేగాలతో నేరుగా ముడిపెట్టుకుని జరగడం వేరు. అందుకు బాధ్యత వహించవలసింది, రాజకీయప్రేరిత సోకాల్డ్ చరిత్రకారులు మాత్రమే.
నేరుగా బొల్లోజు బాబా గారి ‘హరప్పానుంచి నేటి దాకా’ అనే ఈ పుస్తకంలోకి రావలసింది పోయి, మరీ ఇంత పెద్ద ఉపోద్ఘాతమా అని, ఇంతవరకూ చదివిన పాఠకులు అనుకుంటూ ఉండవచ్చు. కానీ, ఈ పుస్తకం విలువను మదింపు వేయడానికి ఇంత ఉపోద్ఘాతం అవసరమే. ఇది కూడా పూర్తిగా సరిపోతుందని కానీ, సమగ్రమని కానీ, సంపూర్ణ న్యాయం చేశానని కానీ నేను అనుకోవడంలేదు.
ఈ పుస్తకరూపంలోని బాబా గారి కృషి అంతా పైన చెప్పిన అనివార్య సమాంతర ప్రయత్నంలోకే వస్తుంది. తెలుగునాట ప్రస్తుతం చరిత్రరంగంలో అలాంటి సమాంతర ప్రయత్నం చేస్తున్న కొద్దిమందిలో బాబాగారు ఒకరు. ఆవిధంగా ఈ పుస్తకంలోని ప్రతి ఒక్క వ్యాసానికీ గొప్ప ప్రాసంగికత ఉంది. చరిత్ర పేరుతో రాజకీయపు ఊతతో బయట వినిపిస్తున్న అనేకానేక విపరీతకర్ణకఠోరవికటధ్వనులకు వ్యతిరేకంగా, వాస్తవికసమాచారం ఆధారంగా, సత్యాన్వేషణ ప్రధానంగా చేసిన కర్ణపేయమైన ప్రతిధ్వనులు – స్థూలంగా ఈ వ్యాసాలు.
ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ చిరకాలంగానే కాక, సమకాలీనంగా కూడా, చరిత్ర పేరిట వివిధరూపాల్లో ప్రచారంలోకి తెచ్చిన అసత్యాలను, అర్ధసత్యాలను, వక్రీకరణలను ఎత్తి చూపి వాస్తవాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగాలు. ఆవిధంగా ప్రాసంగికతను స్థాపించుకుంటున్నాయి. ప్రతి ఒక్క వ్యాసమూ ప్రమాణసూచికలతో, అంతగా ప్రాచుర్యంలో లేని విలువైన సమాచారంతో, ఎంతో ఆసక్తినీ, ఆలోచననూ గొలిపేవిగా ఉన్నాయి. నిజానికి, ఏ విశ్వవిద్యాలయ స్థాయిలోనో, తగినంత అర్థబలం, అంగబలం ఉన్న ఏ సంస్థ ద్వారానో జరగవలసిన కృషిని వ్యక్తిగతస్థాయిలో బాబా గారు తలకెత్తుకున్నారు. కాకపోతే అందువల్ల అనివార్యంగా కొన్ని పరిమితులూ ఏర్పడతాయి కనుక ఈ పుస్తకపాఠకులు వాటినీ దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది.
తాజా జన్యుఆధారాలతో ఆర్యుల వలసను నిర్ధరించడం, కులాలు బ్రిటిష్ వారి సృష్టా అని ప్రశ్నించి చర్చించడం, మాక్స్ ముల్లర్ , మెకాలే, చివరికి ఇటీవలి అంబేడ్కర్, నెహ్రూలకు వ్యతిరేకంగా జరుగుతున్న ద్వేషపూరిత అసత్యప్రచారాన్నీ; శంభాజీ లాంటి వారికి అనుకూలంగా జరుగుతున్న అబద్ధప్రచారాన్నీ; రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ పాత్రను తక్కువ చేస్తూ బి. ఎన్. రావు పాత్రను ఎక్కువ చేసి చూపడం వగైరాలనూ ప్రశ్నిస్తూ, అసలు నిజాలను ఆవిష్కరించడం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. వాటితోపాటు, మొగల్ చక్రవర్తులకు జన్మనిచ్చిన హిందూస్త్రీల గురించి, మొగల్ పాలకులు సంస్కృతాన్ని, సంస్కృతపండితులను ఆదరించడం గురించిన సమాచారాన్ని ఇవ్వడంతో సహా - ఇందులోని అనేక వ్యాసాలు - ప్రత్యేకించి గత దశాబ్దకాలంగా, అధికారపక్షపు అండతో మరింత పెద్ద గొంతును తెచ్చుకున్న ఏకపక్షవాదాలకు సముచిత ప్రతిస్పందనలు, ఆవిధంగా ఎంతైనా ప్రాసంగికాలు.
ఆ క్రమంలోనే కొందరు చారిత్రకవ్యక్తులు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వారు తీసుకున్న చర్యలు వగైరాలను, ప్రచారంలో ఉన్నదానికి భిన్నమైన కోణంలో, లేదా మరుగుపడిన కోణంలో రచయిత చూపిస్తారు; అలనాటి రాజరాజనరేంద్రుడితో మొదలుపెట్టి, ఔరంగజేబ్, దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇటీవలి ఇందిరాగాంధీ తదితరులు ఇందుకు ఉదాహరణలు.
ఇందులోని ‘ఆదిశంకరాచార్యుడు-ఆధ్యాత్మికయాత్ర’, ‘సింహాచలం-కొన్ని సంగతులు’ మొదలైన వ్యాసాలు చదువుతున్నప్పుడు, అవి అమిత ఆసక్తికరంగా ఉండడమే కాక; ప్రాచీన, మధ్యయుగ, ఆధునికపూర్వకాలిక చారిత్రకగమనాన్నీ, ఆ వెలుగులో నేటి దేశగమనాన్నీ అర్థం చేసుకోవడానికి అవి ఎంతైనా తోడ్పడతాయనిపించింది. సింహాచలం కేంద్రంగా జరిగిన యుద్ధాల తీరునే గమనిస్తే, ఇప్పుడు కూడా అలాగే రాజకీయయుద్ధాలు మతం ముసుగులోనే జరుగుతున్న సంగతి మనకు స్ఫురిస్తుంది.
అలాగే, ‘అయోతీ థాస్-దక్షిణభారత దళితమేధావి’, ‘రిజర్వేషన్ల కోసం పోరాడిన పెరియార్’ మొదలైనవి ఇటీవలి తరాలకు పెద్దగా తెలియని విస్మృతవ్యక్తులను, లేదా ఆయారంగాలలో వారి విస్మృతపాత్రనూ పరిచయం చేసిన వ్యాసాలు. ఈ పుస్తకం విలువను పెంచే విశేషాలు ఇంకా అనేకం ఉన్నప్పటికీ, విస్తరణభయంవల్ల ప్రస్తావించ లేకపోతున్నాను. పుస్తకం ఎలాగూ మీ చేతుల్లో ఉంది కనుక మీరే వాటిని దర్శించవచ్చు.
చివరిగా ఒక మాట చెప్పుకోవాలి. ఇటువంటి చరిత్ర ప్రధానమైన వ్యాసాలకు సంబంధించి, వస్తురూపాల నిర్వహణలో కేవలం ఒక కోణం కాక, అనేక కోణాలు జతపడి ఉంటాయి, అనేకవైపుల నుంచి విషయాలను పరిశీలించి నిగ్గు తేల్చుకోవలసి ఉంటుంది. ఒక నిర్దిష్ట ఉదాహరణ చెప్పాలంటే; సమాజం, సంస్కృతి, సాహిత్యం, మతవిశ్వాసాలు, దేవీదేవతలు, స్త్రీ-పురుష అంతరాలు మొదలైనవాటిని స్వదేశ, లేదా ప్రాంత కేంద్రితంగా మాత్రమే చూసినప్పుడు వాటి సమగ్రచరిత్ర బయటపడదు; ఎందుకంటే, ఇలాంటి అనేక విషయాలలో, ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు దేశాలుగా చెప్పుకునే అనేక ప్రాంతాలు పరస్పరం ప్రభావితం చేసుకున్నాయి, అనేకమైన వాటిని ఇచ్చిపుచ్చుకున్నాయి. కనుక వాటిని విశ్వజనీనకేంద్రితంగా చూసినప్పుడే వాటి గురించిన సమగ్రచరిత్ర వెల్లడవుతుంది.
ఉదాహరణకు, గ్రామదేవతారాధన మూలాలు హరప్పా సంస్కృతిలోనే ఉన్నాయనడం కానీ, ‘భారతీయసంస్కృతి’లోని సిందూరం, నల్లపూసలు, పువ్వులు ధరించడం వగైరా స్త్రీల తాలూకువన్నీ హరప్పన్ల నుంచి వచ్చాయనడం కానీ పాక్షికసత్యాలే అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల సౌభాగ్యవర్ధనంతో నేరుగా ముడిపెట్టుకుని చూసిన ఋతురక్తం, ప్రసవరక్తం, జంతురక్తాల నేపథ్యంనుంచి సిందూరధారణ వచ్చిందనీ; అలాగే, పూవులు, పండ్లు, రకరకాల మూలికలతో కూడిన పెరటిసాగుతో స్త్రీలకు మొదటినుంచీ, దాదాపు ప్రపంచమంతటా హార్దికసంబంధం ఉంటూ వచ్చిందనీ తేల్చిన అధ్యయనాలు అనేకం ఉన్నాయి. అలాగే, స్త్రీల స్థానం దిగజారడం వెనుక కూడా ఇలాంటి విశ్వజనీనకేంద్రిత చరిత్ర చాలా ఉంది. మనదేశానికి మాత్రమే పరిమితమై దానిని చెప్పుకోవడంవల్ల ఆ అంశానికి పూర్తి చారిత్రకన్యాయం జరగదు.
ఇతరత్రా ఎంతో విలువైన సమాచారమూ, దృష్టికోణమూ, ప్రాసంగికతా కలిగిన ఈ పుస్తకంలోని అంశాలను ఇలాంటి అదనపు కోణాలను కూడా జత చేసుకుని చూడాలని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఎన్నో చారిత్రకాంశాలను పొందుపరచడంతోపాటు, ఎన్నో ఆలోచనలను రేకెత్తించే ఈ పుస్తకం ఇలాంటి మరెన్నో కోణాలనుంచి పరిశీలనకు ఒక చక్కని ఆధారభూమిక కాగలిగినది.
బొల్లోజు బాబాగారికి హృదయపూర్వక అభినందనలు.

-కల్లూరి భాస్కరం

(ఈ వ్యాసం సాహిత్యప్రస్థానం పత్రికలో ప్రచురింపబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను)






పిల్లలు…


మన జీవితమనే ఇంట్లోకి
పిల్లలు బుడి బుడి అడుగులతో
నిశ్శబ్దంగా ప్రవేశిస్తారు

వారి చిట్టిచేతులతో
మన ఆలోచనలని
మన మాటలను
మన కాలాన్ని
కౌగిలించుకొని
పాటలతో నవ్వులతో
నింపేస్తారు

మనమేమో
చల్లని ఎండను, వేడి వెన్నెలను
మోసుకొంటూ సాగే నదిలా
తీరాల్ని ఒరుసుకొంటూ
ముందుకు సాగిపోతాం

మనం లేకపోయాక కూడా
వాళ్ళు ఇక్కడే ఉంటారు
వానాకాలం ముగిసాక
గోడలపై మిగిలే తేమలా
సాయంకాలం ఇంటిముందు
పడే పొడవైన నీడల్లా…

బొల్లోజు బాబా

suffocation....


.
చిన్ని చిన్ని ఆశలు
ఇప్పుడే కాదని
కలలను కొంతకాలం
వాయిదా పెట్టిందామె
కాళ్ళకింద నేల గట్టిపడాలని
***
పెళ్ళయింది
తల్లయింది
వంటగది వాసనైంది
నలుగురికి నీడైంది
అన్నీ అయింది
కానీ
'తాను' అవ్వలేకపోయింది.

ఒక్కొక్కటిగా
వాయిదా... వాయిదా..
వాయిదాలే జీవితమై పోయింది

అద్దంలో అదే మొఖం
అదనంగా
నుదుటి ముడుతలు
జుత్తులో తెల్లని నిశ్శబ్దం

ఆమె తన కుమార్తెకి
ఒకటే మాట
చెప్పాలనుకుంది
“తల్లీ!
ప్రపంచం కోసం
దేన్నీ వాయిదా వెయ్యకు
ఇప్పుడే మొదలు పెట్టు
నీ కోసం
నీ ఊపిరి కోసం”

బొల్లోజు బాబా

డిజిటల్ శ్వాస.....




.
మరణం తరువాత కూడా
అతని పేరు
సోషల్ మీడియంలో
శ్వాస తీసుకుంటూనే ఉంది
పోస్టులుగా
ఫొటోలుగా
కామెంట్లుగా

తెలియని ఎవరో
ఎప్పుడైనా చెప్పిన
బర్త్ డే విషెస్ కు
వెలుతురు స్క్రీన్
సమాధి రాయిలా
చేతికి చల్లగా తాకుతుంది.

ఎప్పటికైనా
ఫోన్ మూసేసి
రోజువారి పనుల్లో పడిపోక తప్పదు

లోపల ఎక్కడో
సిగ్నల్ లేని ప్రాంతంలో
వేదన మాత్రం
ఇంకా లోడ్
అవుతూనే ఉంటుంది

బొల్లోజు బాబా

Saturday, January 10, 2026

ప్రాచీనగాథల గురించి ….


.
ప్రాచీన గాథలు పుస్తకం విడుదలై ఏడాది కావొస్తుంది. సుమారు 500 పైగా ప్రాకృత, తమిళ, సంస్కృత పురాగాథల అనువాద సంపుటి ఇది. “సంగం కవిత్వం” ఈ పుస్తకంలో మొదటి చాప్టరు. నాకెంతో ఇష్టమైన చాప్టరు. పుస్తకంలో సుమారు 100 వరకూ సంగం కవితలు ఉన్నాయి.
సంగం కవిత్వంలో నాకు నచ్చిన ఒక గొప్ప కవిత ఇది.

55
పండగ రోజులు సమీపించాయి
భార్య ప్రసవవేదనలో ఉంది
వర్షం వల్ల పెందలాడనే చీకటి కమ్మేసింది
ఆమెకు సహాయం చేయటానికి
తొందరగా ఇంటికి వెళ్ళాలి ఆ చర్మకారుడు
బొంతను కుడుతున్న అతని చేతివేళ్ళ మధ్య సూది -
పట్టణాన్ని జయించటానికి వచ్చిన శత్రువుతో
ద్వంద్వయుద్ధంలో పోరాడుతున్న రాజు మెడలోని
దేవకాంచన పూలమాల కన్నా
వడిగా, కోమలంగా కదులుతోంది
Purananuru 82
(Perunarkilli అనే చోళరాజుకు Amur Mallan కు జరిగిన మల్లయుద్ధం ఈ గాథాసందర్భం)
.
బొంతను కుట్టే చర్మకారుని పని, పట్టణాన్ని కాపాడేందుకు ఒక రాజు చేస్తున్న పోరాటాన్ని ఒకే తలంపై నిలబెడతాడు ఈ గాథాకారుడు. రాజు చేసే యుద్ధం ఎంత విలువైనదో చర్మకారుని పని కూడా అంతే గౌరవనీయమని కవి చెబుతున్నాడు. మానవ విలువలు వృత్తితో నిర్ణయించబడవు అన్న భావన ఎంత ఉదాత్తమైనది. వర్ణ వ్యవస్థ, పురుషాధిక్యత ఇంకా కబళించని కాలమది.
అంతే కాక అప్పట్లో ప్రాణనష్టం నివారించటానికి ఇరురాజులు ద్వంధ్వ యుద్ధం ద్వారా జయాపజయాలను నిర్ణయించుకొనేవారనే చారిత్రక సత్యం కూడా ఈ గాథలో పొందుపరచబడింది.
***
పుస్తకం చివర ఆయా గాథల చారిత్రక నేపథ్యం చెప్పే నోట్సులో సంగం కవిత్వ సమాచారం ఇది.
ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో ఛాయా వారి స్టాల్స్ 178 నందు లభిస్తుంది. మొదటి కామెంటులో ఇచ్చిన అమజాన్ లింక్ లో కూడా దొరుకుతుంది.
***

సంగం కవిత్వం నోట్సు
.
సంగం కవిత్వం, 300 BCE నుండి 300 CE మధ్య రచింపబడిన తమిళ సాహిత్యం. ఇంతవరకూ లభించిన సంగం కవిత్వం సుమారు 473 మంది కవులు రచించిన 30 వేల పాదాలున్న 2381 కవితలు. ఈ 473 మంది కవులలో 103 మంది అజ్ఞాతకవులు. కపిలర్‌ కవి పేరుతో అత్యధికంగా 235 గాథలు ఉన్నాయి. సంగం కవిత్వంలో రెండు సంప్రదాయాలున్నాయి. ఒకటి అకం` ప్రేమ, మానవోద్వేగాలను వర్ణించే భాగం, రెండు పురం- రాజకీయాలు, యుద్ధాలను ప్రతిబింబించే భాగం. ఈ సాహిత్యంలో వేటగాళ్ళు, రైతులు, నావికులు మత్స్యకారులు, కుమ్మరులు, గొల్లలు, వర్తకులు, గాయకులు, కమ్మరులు, సైనికులు లాంటి దిగువతరగతి కుటుంబాలకు చెందిన సామాన్య వ్యక్తులే ప్రధాన పాత్రలు. కులీనుల జీవిత చిత్రణ అరుదు.

తెలుగు తమిళాలు ఒకే రకమైన మూలాలను, సంస్కృతిని పంచుకొన్నప్పటికీ తెలుగు తమిళవారసత్వాన్ని కాక, సంస్కృత కావ్య వారసత్వాన్ని అందిపుచ్చుకోవటం వల్ల, ప్రాచీనమైన ఉమ్మడి తమిళ, ప్రాకృత మూలాలకు దూరం జరిగిపోయింది. నన్నయకు పూర్వం తెలుగు సాహిత్యం ఉండేదని అరకొర ఆధారాలు లభిస్తాయి తప్ప బలమైన ఋజువులు లేవు. సంగం సాహిత్యానికి తొలి తెలుగు సాహిత్యానికి మధ్య సుమారు వెయ్యేళ్ల వ్యత్యాసం ఎందుకు ఉందనే ప్రశ్న విలువైనది.

‘‘సంగం సాహిత్యం ఎక్కువగా జైన, బౌద్ధ విశ్వాసాలకు సంబంధించినది. ఆ తరువాత కాలంలో వచ్చిన శైవ వైష్ణవ సంప్రదాయ పండితులు ప్రోత్సహించని కారణంగా సంగం సాహిత్యం చాన్నాళ్ళు గుప్తంగా ఉండిపోయింది’’ అని Poems of Love and War పేరుతో వెలువరించిన సంగం సాహిత్య అనువాదరచనకు రాసిన ముందుమాటలో శ్రీ A.K. Ramanujan అన్నారు.

ఈ పని తెలుగునాట కూడా జరిగి ఉంటుంది. నన్నయపూర్వ ప్రాకృత లేదా ప్రాచీన తెలుగు సాహిత్యం ఎక్కువగా జైన, బౌద్ధ విశ్వాసాలకు సంబంధించినదనే కారణంతో సంప్రదాయ పండితులు దాన్ని తగలపెట్టి ఉంటారు. ఇదే అభిప్రాయాన్ని శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్ళపల్లి వారి గాథాసప్తశతి తొలి తెలుగు అనువాద రచన తొలిముద్రణ (1931) ముందుమాటలో చెప్పారు. సంగం సాహిత్య వారసత్వాన్ని రెండువేల సంవత్సరాల పాటు అటకలపై దాచుకొని, మఠాలలో భద్రపరచుకొని నిలబెట్టుకొన్నారు తమిళులు. తెలుగునేలపై అలాంటి పని జరిగినట్లు లేదు. బ్రాహ్మణిజపు విలువల్ని స్థాపించే మహాభారత కావ్యానువాద రచన చేసిన నన్నయను తెలుగుభాషకు ‘ఆదికవి’ గా ప్రతిష్ఠించుకోవలసి వచ్చింది.

***
ప్రాచీనతమిళ సమాజాన్ని, సంస్కృతిని అర్ధం చేసుకొనటానికి సంగం సాహిత్యం ఎంతో దోహదపడుతుంది. ప్రేమ, రాజ్యపాలన, యుద్ధం, నీతి, రాజకీయాలు, ప్రకృతి, సామాన్యప్రజల జీవనం వంటి అనేక జీవితకోణాలను ఈ సాహిత్యం ఆవిష్కరిస్తుంది. సంగం కాలం తరువాత శైవ నాయనార్ల, వైష్ణవ ఆళ్వార్ల సాహిత్యం ప్రసిద్ధి చెందింది.

సంగం కవిత్వంలో ప్రముఖమైనది ఎట్టుతొగై. ఇది ఎనిమిది సంకలనాల సముదాయం. అవి Ainkurunuru, Akananuru, Purananuru, Kalittokai, Kuruntokai, Natrinai, Paripadal, Patirruppattu.
ఈ ప్రాచీన కావ్యాలను వెలుగులోకి తెచ్చింది శ్రీ సామినాథ అయ్యర్‌ (1855-1942). తమిళ సంగం సాహిత్యం పునరుజ్జీవనం కొరకు ఇతను ఊరూరు తిరుగుతూ, మఠాలను సందర్శిస్తూ, అటకలపై దాచిన తాళపత్ర గ్రంథాలను సేకరిస్తూ, వాటిని పరిష్కరించి పుస్తకరూపంలో ప్రచురించటానికై తన యావజ్జీవితాన్ని వెచ్చించాడు. దాదాపు కనుమరుగైపోయిన ఒక విస్మృత సారస్వతాన్ని తిరిగి బతికించి ప్రచారంలోకి తీసుకొని వచ్చాడు.

1877లో ఎట్టుతొగై మొదటి ముద్రణకు రాసిన ముందుమాటలోని ఈ వాక్యాలు ఒక చారిత్రిక సందర్భాన్ని నమోదు చేస్తాయి

‘‘నిప్పు, నీరుల నుండి తప్పించుకొన్నవి మాత్రమే నిలిచాయి. వాటిలోకూడా చెదపురుగుల బారినబడి మిగిలినవి కొన్నే.... ముడి విప్పితే తాటిఆకులు పికిలిపోతాయి, ఆకు తిప్పితే అది మధ్యకు విరిగిపోతుంది.... పాత రాత ప్రతులు పొడుం పొడుం అయ్యాయి, వాటికి ఎవరూ పుత్రికలను పుట్టించలేకపోయారు’’

ఆ విధంగా వెలుగు చూసిన సంగం సాహిత్యం భారతీయ సాహిత్యచరిత్రలో గొప్ప స్థానాన్ని పొందింది. సంగం సాహిత్యం ఆర్యసంస్కృతి ప్రభావం దక్షిణ భారతదేశంపై ఇంకా పడని కాలంలో రచించబడటం వల్ల, వైదిక దేవతలు, ఆచారాలు, సంస్కృత పదాలు, పురుషాధిక్యత, వర్ణవ్యవస్థ లాంటివి కనిపించవు. ఆ విధంగా సంగం సాహిత్యపు చారిత్రికత ఎంతో విలువైనది. ఇది తమిళుల ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే సాహిత్యం.
ఈ గాథలు అనువదించడానికి Sri. A.K. Ramanujan, Sri. M.L. Thangappa, Prof. S.M. Ponniah వంటి ప్రముఖుల అనువాదాలు దారిచూపాయి.
.










బొల్లోజు బాబా

దేశవిభజన కొరకు జిన్నా చేసిన ఆర్గ్యుమెంట్



మేము (మాకొక దేశాన్ని ఇమ్మని) హిందువులను ఏమీ అడగటం లేదు. ఎందుకంటే వారేనాడూ చారిత్రికంగా సంపూర్ణ భారతదేశాన్ని పాలించలేదు. ముస్లిములే భారతదేశాన్ని ఏకం చేసి 700 ఏళ్ళు పాలించారు. మా నుంచి బ్రిటిష్ వారు భారతదేశాన్ని తీసుకొన్నారు. ఇప్పుడు అది వారిచేతుల్లో ఉంది కనుక వారిని అడుగుతున్నాము, మాకు తిరిగి ఇచ్చేయమని. హిందువులని కాదు. హిందుస్థాన్ హిందువులకే చెందుతుందని చెప్పడం ముమ్మాటికీ అర్ధం లేని మాట."
(Said by Muhammad Ali Jinnah, President of the All-India Muslim League March 2, 1941)

మూలవాసుల స్వరం - ద్రావిడ మహాసముద్రం


.
గూండ్ల వెంకటనారాయణ తాజా కవితాసంకలనం "ద్రావిడ మహాసముద్రం". ఇది కేవలం ఒక కవితా సంకలనం కాదు- ఒక సైద్ధాంతిక ప్రకటన, ఒక చారిత్రక పునర్నిర్మాణ ప్రయత్నం, ఆధిపత్య భావజాలంపై ఎక్కుపెట్టిన ఒక వాడి అయిన అస్త్రం. డా. జిలుకర శ్రీనివాస్ తన ముందుమాటలో అన్నట్లు ఇది "ఒక ఐడియలాజికల్ మెటఫర్". మరొక ముందుమాటలో పల్లెపట్టు నాగరాజు “సత్యం కోసం నిలబడేవాళ్ళు, సత్యం కోసం పలవరించే వాళ్ళు, సత్యం ఎంత సౌందర్యవంతమైందో అనుభవించేవాళ్ళు, ఈ పుస్తకాన్ని తెరవండి, కాలం గుండె చప్పుడు వినండి … అంటాడు. అది నిజం. "ద్రావిడ మహాసముద్రం" ఈ కాలపు దళితబహుజనుల గుండెచప్పుడు.
 
ఈ కావ్యంలోని భావజాలాన్ని, కవితా శిల్పాన్ని, దాని బలాలను పరిమితులను పరిశీలించినపుడు దాని ఆత్మ ఆవిష్కృతమౌతుంది.

భావజాల పునాది- ద్రావిడ అస్తిత్వ ప్రకటన
ఈ పుస్తకం యొక్క ఆత్మ ద్రావిడవాదం, కానీ అది కేవలం భౌగోళిక, రాజకీయ అస్తిత్వానికి పరిమితమైనది కాదు. కవి దృష్టిలో ద్రావిడవాదం ఒక తాత్విక చింతన. కవిచెబుతోన్న ద్రావిడ భావజాలం ఈ కింది మూల స్తంభాలపై నిర్మించబడింది:

1. ఆర్య సంస్కృతి వ్యతిరేకత:
భరతఖండానికి వలస వచ్చిన ఆర్యులు ఇక్కడి మూలవాసుల (ద్రావిడుల) మహోన్నత నాగరికతను ధ్వంసం చేసి, వారి చరిత్రను వక్రీకరించారని కవి బలంగా వాదిస్తాడు. ఈ ఆర్య ఆధిపత్య సంస్కృతిని, వారి దేవుళ్ళను, పురాణాలను కవి నిర్మొహమాటంగా తిరస్కరిస్తాడు.

"దేవుడికి ఆకలి అవుతుంది
నోటిలో నెత్తురు పిండితే కానీ ఆకలి తీరదు అంటాడు"
ఇక్కడ 'దేవుడు' అనే ప్రతీక, కేవలం ఒక మతపరమైన భావన కాదు. అది ఒక దోపిడీ వ్యవస్థకు, తన ఆధిపత్యంతో తన ప్రజలనే బలులగా కోరే ఆధిపత్య శక్తికి రూపకం.
/అక్కడ ఒక తోట ఉండేది
అది పూలతో, పండ్లతో ఇంకా నీడలతో గుబురుగా ఉండేది.
ఉదయసాయంత్రాల ఎండపొడితో ఒళ్ళుతోముకునేది
రాత్రి నక్షత్రాలను అంటించుకుని మురిసిపోయేది
చల్లని గాలులను మూటగట్టుకొని పైకి వెదజల్లుతూ ఉండేది//

కానీ ఒకనాడు అక్కడికో గోవు వచ్చింది
పూలను తుంపేసింది
తోకతో మొక్కలను విరిచింది
అక్కడ తేనె నెత్తురులా పారింది
నక్షత్రాలను, సీతాకోక చిలుకలను
తేనెటీగలను కాళ్లకింద నలిపేసింది
చల్లని గాలులను తరిమేసింది. //

ఈ కవితలో తోట అంటే కేవలం భౌతికమైన తోట కాదు. ఆర్యులరాక ముందు హరప్పాకాలం నుండీ ఈ నేలపై విలసిల్లిన ద్రావిడ సంస్కృతి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ నేల మూలవాసులైన దళిత బహుజనుల సంస్కృతి, వారి ప్రాకృతిక కళలు, శాంతి, సౌభాగ్యం, సౌందర్యం, ఆనందం నిండిన జీవనవిధానం. ఆర్యుల రాకను పవిత్రమైన గోవుతో పోలుస్తున్నాడు కవి. ఇదొక గొప్ప మెటఫర్. ఆ గోవు తోటను నాశనం చేసిందడంలో, ఆర్యులు మూలవాసుల కళలను, జీవనవిధానాన్ని, సామాజిక సాంస్కృతిక వ్యవస్థలను ధ్వంసం చేసిన వైనాన్ని మార్మికంగా చెబుతున్నాడు. “అక్కడ తేనె నెత్తురులా పారింది” అనే ఉపమానం ద్వారా జరిగిన హింసతో అణచివేత గొప్పగా వ్యక్తీకరించబడింది.
 
2. మూలవాసుల చరిత్ర పునర్నిర్మాణం:
ఆధిపత్య గాథలలో రాక్షసులుగా, దస్యులుగా, దెయ్యాలుగా చిత్రీకరించబడిన వారే ఈ నేల అసలైన బిడ్డలని, ఒకనాటి పాలకులని కవి గర్వంగా ప్రకటిస్తాడు. నిరాకరించబడిన గుర్తింపులను తిరిగి స్వీకరించి, వాటిని గౌరవ చిహ్నాలుగా మార్చుతాడు.

"అప్పుడు ఈ నేల మీద ఎన్నో దెయ్యాలు ఉండేవి
ఎంతో ముద్దుగా, ముచ్చటగా ఉండేవి"
ఈ వాక్యం ఒక అద్భుతమైన పునర్నిర్మాణం. 'దెయ్యం' అనే తిట్టును ఒక సహజమైన, అందమైన అస్తిత్వంగా మార్చడం ద్వారా, కవి ఆధిపత్య భాషను ధ్వంసం చేస్తున్నాడు.
“పంది తన రెక్కలతో నింగికి ఎగిరింది

నేలను చూసింది
అడవిని చూసింది
ఊరిని చూసింది
అలా ఎగురుతూ పక్షులతో స్నేహం చేసింది
రకరకాల పండ్లను తిన్నది, తేనెను రుచి చూసింది
మేఘాలపై నిద్రించింది
గాలులతో ఆటలు ఆడింది”//…... (రెక్కలపంది)

బ్రాహ్మణవాద ఉన్నతవర్గాల సౌందర్యశాస్త్రం పందిని నీచ జంతువు అంటుంది. దాన్ని అణచివేతకు గురైన వర్గాలకు ప్రతినిధిగా, కవితా వస్తువుగా చేయటం ఒక ధిక్కారం. ఆ రెక్కలు కేవలం కల్పన కాదు అవి చదువు, చైతన్యం, ఆత్మగౌరవం, తిరుగుబాటు. హెజిమోనిక్ బావజాలాన్ని తిరస్కరించటం.
 
3.అంబేద్కర్, ఫూలే, పెరియార్ తాత్విక కొనసాగింపు:
ఈ కావ్యం మహాత్మా ఫూలే ఆవిష్కరించిన ఆర్య-అనార్య, బ్రాహ్మణ-అబ్రాహ్మణ ద్వైదీకృత సంబంధాల వ్యక్తీకరణే అని స్పష్టమవుతుంది. రచయిత ఈ పుస్తకానికి రాసుకొన్న ముందుమాటలో తన స్వప్నం కోసం "అంబేద్కర్, మార్క్స్ అనే రెండు కాగడాలను పట్టుకొని పెరియార్ చూపుతో" తన కవిత్వంలో తిరుగుతానని చెప్పుకోవడం ఈ భావజాల స్పష్టతకు నిదర్శనం. ఈ మొత్తం అవ్యవస్థలకు పరిష్కారం ఏమిటనేది దానిపట్లకూడా కవి స్పష్టంగానే ఉన్నాడు.
“ఒరే బ్రాహ్మడా! నువ్వంటే ఎంతిష్టమో తెలుసా అంటూ మొదలయ్యే ఒక కవితలో
"రా, నా బిడ్డను నీ కుమారుడికి ఇచ్చి పెళ్ళి చేస్తాను
 
నీ కుమార్తెను నా కొడుక్కి ఇవ్వు" // అనడం కేవలం పెళ్లి ప్రతిపాదన కాదు. అది కుల నిర్మూలనకు డా. అంబేద్కర్ ప్రతిపాదించిన సూటియైన, విప్లవాత్మక మార్గం. వేల ఏళ్లుగా కులం పేరుతో వేరు చేయబడిన రెండు సమూహాలను "వియ్యంకులు"గా మార్చి, జాంబవ ద్వీపాన్ని (ప్రాచీన భారతదేశం) మళ్లీ పచ్చగా చూసుకుందాం అనడంలో ఒక గొప్ప ఆశ, బలమైన రాజకీయ ప్రకటన ఉన్నాయి. ముగింపులో కవి మళ్ళీ ఒక మానవీయమైన స్థాయికి సంభాషణను తెస్తాడు.
 
"ఆ మడి కట్టులో నువ్వెంత మగ్గి పోయావో కదా
ఊరి చివర వెట్టివాడిగా నేనూ అంతే కుమిలిపోయాను" అంటాడు. ఇక్కడ కులం అనేది కేవలం అణగారిన వర్గానికే కాదు, ఆచారాల చట్రంలో బందీ అయిన బ్రాహ్మణుడికి కూడా ఒక చెరసాలేనని కవి గుర్తిస్తాడు. ఇలాంటి వాక్యాలు రాయాలంటే మనుషులపట్ల అపారమైన ప్రేమా, లోతైన సామాజిక అవగాహనా ఉండాలి. ఇంత భావజాల స్పష్టత అరుదుగా చూస్తాం.
 
4. శిల్పం మరియు శైలి
నిజానికి ద్రావిడవాదం, చారిత్రిక, సైద్ధాంతిక వస్తువును కవిత్వరూపంలో చెప్పటం సాహసం అయినప్పటికీ వెంకట నారాయణ తన భావజాలాన్ని కేవలం నినాదాల రూపంలో కాకుండా, శక్తివంతమైన కవితా శిల్పంతో ఆవిష్కరించారు. దీనిని సాధించడానికి కవి జానపద కథనాత్మకత, ప్రతీకాత్మక, సంభాషణాత్మక శైలులను ఎంచుకొని చెప్పదలచుకొన్న వస్తువును సూటిగా స్పష్టంగా, బలంగా చెప్పగలిగాడు. ముందుమాటలో డాక్టర్ జిలుకర శ్రీనివాస్ చెప్పినట్లు, ఈ కవి "మృత రూపకాలకు రక్తమాంసాలిచ్చి, జీవం పోసాడు". ఈ టెక్నిక్, ఇతర పద్ధతులతో కలిసి, ఈ సంపుటిని ఒక సైద్ధాంతిక కావ్యంగా నిలబెట్టింది.

1. కథనాత్మక శైలి (Narrative Style): ఈ సంకలనంలోని అనేక కవితలు చిన్నచిన్న జానపద కథల రూపంలో ఉంటాయి. కథనాత్మకత పాఠకుడిని సులభంగా కట్టిపడేస్తుంది. 'రెక్కల పంది' కవిత ఇందుకు చక్కటి ఉదాహరణ. రెక్కలు మొలిచి ఆకాశంలోకి ఎగరాలనుకున్న పందిని (అణగారిన వర్గాల చైతన్యం), అధర్మం పేరుతో 'గోవులు' (ఆధిపత్య కులాలు) చంపేయడం కుల వ్యవస్థ యొక్క క్రూరత్వాన్ని సూటిగా చెబుతుంది.
 
‘పల్లెలో వెన్నెల’ కవితలో – ఒక పండితుడు అందమైన వెన్నెల తనపైనే కాకుండా “అధముల పల్లె” పై (దళితులు) కూడా కురుస్తున్నందుకు అవమానంగా భావించి దొరకు చాడీలు చెప్పి ఆ పల్లెను తగలబెట్టిస్తాడు. ఇది కులాధిపత్యంలోని దౌష్ట్యాన్ని కళ్ళకు కడుతుంది.
నిజమైన ఆవు, కోల్పోయిన లోకం, దేవుని స్వర్గం లాంటి కవితలు ఈ కోవకు చెందుతాయి
 
2. ప్రతీకాత్మక శైలి (Symbolism): ఈ కవిత్వంలో ప్రతీకలు కీలక పాత్ర పోషిస్తాయి. 'ఆవు' పూజ్యనీయమైనదిగా, 'పంది' అపవిత్రమైనదిగా నిర్మించిన సామాజిక సంకేతాలను కవి తలకిందులు చేస్తాడు. 'నలుపు' రంగును ఆత్మగౌరవానికి, సౌందర్యానికి ప్రతీకగా నిలబెడతాడు.
/నాయనా ఇలా రా! కాస్త నలుపెక్కుదాం
నలుపు జాతరలో బూరలమవుదాం//
పిల్లా! నీ కర్రెపెదాల మీద పూసిన వానపూగుత్తి ఇది
నీకోసం నేను కట్టిన నల్లపదం ఇది/ …..అంటాడు ‘నల్లపదం’ అనే కవితలో. ఇది కేవలం నలుపు రంగు గురించి కాదు, అణచివేయబడిన గుర్తింపును ఉత్సవంగా జరుపుకోవడం గురించి.
‘మనుష్యపంచకం’ అనే కవితలో గోవులను బ్రాహ్మణీయ వర్గానికి ప్రతీకగా, నల్లజాతి గొడ్లను ఈ దేశ దళిత-బహుజన శ్రామిక వర్గాలకు ప్రతీకగాను చేస్తాడు. ‘రంగుల దెయ్యంపిల్ల’ అనే కవితలో అట్టడుగు వర్గాల సంతోషాన్ని, సౌందర్యాన్ని ఆధిపత్య వర్గాలు ఎలా సహించలేవో ప్రతీకాత్మకంగా చెబుతాడు కవి.
 
3. సంభాషణాత్మక శైలి: కవి ఎక్కడా అభ్యర్థన స్వరంతో మాట్లాడరు. ఆయన స్వరం నిండా ఆత్మవిశ్వాసం, ధిక్కారం, మరియు హక్కుగా అడిగే తత్వం కనిపిస్తుంది. "మా కక్కయ్య మద్దూరి నగేష్ బాబుకి" అనే కవిత ఇందుకు పరాకాష్ట. బ్రాహ్మణుడిని సంబోధిస్తూ, ప్రేమను, ఆవేదనను, కోపాన్ని కలగలిపి, కుల నిర్మూలన జరగాల్సిన ఆవశ్యకతను ఒక సంక్లిష్టమైన సంభాషణగా మలిచారు.

‘కాంతివ్యాప్తం’ అనే కవిత ఇద్దరు ప్రేమికుల సంభాషణ. దానిలో “ప్రపంచంలో ఇంత బాధ ఉండగా మనమెలా ప్రేమించుకోగలం?”..... అంటూ కవి సంధించిన ప్రశ్న మామూలుది కాదు. ఆ ప్రశ్న ఎన్ని జీవితాల్ని రగిల్చి ఉంటుందో అనే ఊహే హృదయాన్ని పట్టిలాగుతుంది. ఈ సంపుటిలో ఇంకా ‘మనువాద దేశ ప్రేమకథ’, ‘గొప్ప కవిత్వానికి నిర్వచనం’ అనే కవితలు సంభాషణాత్మకంగా సాగుతాయి.
 
5. బలాలు - పరిమితులు
భావజాల స్పష్టత: ఈ పుస్తకం యొక్క అతిపెద్ద బలం దాని సైద్ధాంతిక స్పష్టత. రచయిత దేని తరపున నిలబడుతున్నాడో, దేనిని .వ్యతిరేకిస్తున్నాడో ఎక్కడా సందిగ్ధత లేదు.
శక్తివంతమైన రూపకాలు: "ద్రావిడ మహాసముద్రం" అనే శీర్షికే ఒక శక్తివంతమైన రూపకం. ఇది హిందూ మహాసముద్రం అనే ఆధిపత్య నామకరణాన్ని తిరస్కరించి, ఈ నేలపై, సముద్రంపై మూలవాసుల హక్కును ప్రకటిస్తుంది.

చారిత్రక చైతన్యం: సమకాలీన రాజకీయ పరిణామాల (తమిళనాడు గవర్నర్ జనగణమన జాతీయగీతంలో ద్రావిడ అనే పదాన్ని ఉచ్ఛరించనని రేపిన వివాదం) స్పృహతో మొదలుకొని, సింధు నాగరికత మూలాల వరకు కవి తన రచనను ఒక విస్తృత చారిత్రక చట్రంలో నిలబెట్టాడు.
పరిశీలించాల్సిన పరిమితులు

కవిత్వాన్ని అలంకారయుతంచేసే ప్రక్రియలో, అనివార్యంగా వస్తువును కొంతమేరకు రూపకాలు, ప్రతీకల మాటున కప్పి చెప్పవలసి ఉంటుంది. చారిత్రిక, రాజకీయ, సైద్ధాంతిక వస్తువును కవిత్వ రూపంలో చెప్పినప్పుడు పాఠకుడు దాని సౌందర్యాన్ని ఆస్వాదించే క్రమంలో దానిలోని చారిత్రక విమర్శను గుర్తించలేకపోవచ్చు.
 
సిద్ధాంతాలను కవిత్వరూపంలో చెప్పటం కత్తిమీద సాము. ఈ విషయంలో వెంకటనారాయణ వస్తువుకు సరిపడే రూపాన్ని ఎన్నుకోవటంద్వారా ఆ పరిమితిని అధిగమించి విజయం సాధించారని చెప్పవచ్చు. ఎందుకంటే కథనాత్మక, సంభాషణాత్మశైలిలో చెప్పినప్పుడు పాఠకులు సులభంగా లీనమైపోతారు. రచనతో కనక్టై ఆలోచించడం మొదలుపెడతాడు. ఏ రచన అంతిమ లక్ష్యమైనా ఇదే కదా!
 
6. ముగింపు
"ద్రావిడ మహాసముద్రం" తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా దళిత-బహుజన, ద్రావిడవాద సాహిత్యంలో ఒక గొప్ప ప్రయోగం. ఆర్యులు ఈ నేలకు వలస వచ్చారు అని ఇటీవలే జన్యుశోధనల ద్వారా నిరూపితమైంది. అయినప్పటికీ దాన్ని మనువాదులు ఒక సత్యంగా అంగీకరించటానికి సిద్ధంగా లేరు. కానీ ఆర్యులు వలస వచ్చి, మూలవాసుల సంస్కృతులను ధ్వంసం చేసి, వారిని బానిసలుగా చేసుకొని వారిపై తమ ఆధిపత్యాన్ని స్థాపించుకొన్నారు అనే సత్యం ఈ దేశ దళిత బహుజన వర్గాలు గ్రహించాయి. ఆ మేరకు వారు తమ అస్తిత్వాన్ని పునర్నిర్వచించుకొంటున్నారని పల్లెపట్టు నాగరాజు ముందుమాట స్పష్టపరుస్తుంది.
ఈ నేపథ్యంలో తెలుగు సాహిత్యంలో ఇలాంటి వస్తువుపై వచ్చిన కవిత్వంలో ఇదే మొదటిది కావచ్చు.
 
ద్రావిడ మహాసముద్రం అణగారిన వర్గాల వేదనను, ఆగ్రహాన్ని, వారి ఆకాంక్షలను ఇంకా వారి ఉజ్వలమైన భవిష్యత్ స్వప్నాన్ని అత్యంత శక్తివంతంగా నమోదు చేసింది. ఇది కేవలం చారిత్రక గాయాలను తడమడమే కాదు, భవిష్యత్తులో నిర్మించుకోవాల్సిన ఒక సమసమాజపు చిత్రపటాన్ని కూడా మన ముందు ఉంచుతుంది. గూండ్ల వెంకటనారాయణ కవిగా, ఒక సైద్ధాంతిక యోధుడిగా తన కలం ద్వారా ఒక బలమైన పొలికేక పెట్టాడు. ఆ పొలికేక ఈ "ద్రావిడ మహాసముద్రం" లో ప్రతిధ్వనిస్తోంది.

బొల్లోజు బాబా
(ఈ వ్యాసం నవ తెలంగాణ పత్రికలో ప్రచురింపబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను)




ఒక పెద్దాయన వాల్ పై.....

ఒక పెద్దాయన వాల్ పై --- "శంకరుడి తర్వాత...మళ్లీ ఈనేలలో మరెవడూ తాత్వికుడిగా పుట్టలేదు..!!" అనే మాటను విభేదించి డా. అంబేడ్కర్, ఫూలే, పెరియార్, రామస్వామి లాంటి తాత్వికులు మీకు కనిపించరా అని ప్రశ్నించాను. (ఆయనపట్ల నాకు గౌరవమే.) కానీ అక్కడ నేను ఎప్పుడెప్పుడో బ్లాక్ చేసిన అసహన పండితులందరూ చేరి నన్ను బాగానే తిట్టుకొన్నారు. Its ok. No problem.

ఇక ఈ అంశంపై కొంత వివరణ ఇది.

మనిషి, సమాజం, జీవితం, సత్యం, మానవ సంబంధాలు వంటి ప్రశ్నలపై తర్కబద్ధమైన, విమర్శనాత్మక ఆలోచనలనే తాత్వికశాస్త్రం అని అలా ఆలోచించే వ్యక్తిని తాత్వికుడు లేదా దార్శనికుడు అనీ అంటారు.
 
తత్వవేత్తలు సంప్రదాయాలను ప్రశ్నిస్తారు, కొత్త ఆలోచనా వ్యవస్థను నిర్మిస్తారు, మానవ అస్తిత్వాన్ని నిర్వచిస్తారు. ఈ పరిధిలోంచి చూసినపుడు మహాత్మా ఫూలే, డా.అంబేద్కర్, పెరియార్ లు ఇరవయ్యోశతాబ్దపు తత్వవేత్తలు.
 
1. మహాత్మా జ్యోతిరావు ఫూలే (1827–1890)
ఈయన చారిత్రిక నైతిక కారణాలు చూపి వేదాల ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. సమానత్వం ప్రాతిపదికన మానవసమాజాన్ని ఊహించాడు. పుట్టుక ఆధారంగా మనుషుల విభజన ఉండరాదని చెప్పారు. ఈయన రాసిన 'గులాంగిరీ' ఒక రాజకీయ తత్వశాస్త్ర గ్రంథం. దీన్ని రూసో లేదా మార్క్స్ రచనలతో పోల్చవచ్చు.

2. పెరియార్ ఇ.వి. రామసామి (1879–1973)
ఈయన హేతువుతో ఆలోచించి దేవుడిని, ఆత్మను, పునర్జన్మను అంగీకరించలేదు . కులం అనేది ఒక వ్యవస్థీకృత హింస అని వివరించాడు. నైతికత అనేది శాస్త్రాల నుండి కాదు, సామాజిక న్యాయం నుండి రావాలని చెప్పాడు. పెరియార్ ఆలోచనలు నీషే (Nietzsche) ఆలోచనలకు దగ్గరగా ఉంటాయి

3. డా. బి.ఆర్. అంబేద్కర్ (1891–1956): భారతదేశం అందించిన అత్యున్నత మేధావి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం వంటి పదాలకు భారతీయ పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త నిర్వచనాలు ఇచ్చారు.
ఈయన ప్రతిపాదించిన కుల నిర్మూలన అనేది కేవలం సామాజిక సంస్కరణ కాదు, ఒక నైతిక దిశానిర్ధేశనం. నవయాన బౌద్ధం ద్వారా దేవుడు లేని మానవతావాదాన్ని ప్రతిపాదించారు.
***

నేటి పండితులు తత్వశాస్త్రాన్ని ఇప్పటికీ శంకరుడు, రామానుజుడు, మాధ్వుడు, నింబార్కుడు, వల్లభాచార్యుడు వంటి కొన్ని పేర్ల చుట్టూనే తిప్పుతారు. వీరందరూ బ్రాహ్మణిజానికి కేంద్రంగా ఉండే కర్మ సిద్ధాంతం, వర్ణాశ్రమ ధర్మాలు, జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల వ్యవస్థ, బ్రాహ్మణాధిక్యత లాంటివాటిని తాత్వికంగా సమర్థించినవారే. ఈ ధోరణి సమాజంలోని అసమానతలను ప్రశ్నించకుండా, అవే సహజమైనవన్నట్లుగా చూపుతుంది. తత్వచింతనను “వేదాలు–బ్రాహ్మణులు–సంస్కృతభాష” అనే పరిమితిలో బంధించి, సామాజిక అనుభవాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వదు.
 
బ్రాహ్మణీయచట్రంలో కుదురుకొనే గాంధీ, సర్వేపల్లి రాధకృష్ణ, జిడ్డు కృష్ణమూర్తి, అరవిందో లాంటివారిని సమకాలీన పండితులు తత్వవేత్తలుగా అంగీకరిస్తారు కానీ బ్రాహ్మనిజాన్ని ధిక్కరించిన బుద్ధుడు, చార్వాకులు డా. అంబేడ్కర్, ఫూలే, పెరియార్, రామస్వామి, కంచె ఐలయ్య లాంటి వారిని ఒప్పుకోలేరు.

నిజానికి నేడు తత్వశాస్త్రం అంటే – సమాజం, మానవజీవితం పై చేసే తార్కిక విమర్శనాత్మక విశ్లేషణ. ఆధిపత్యధోరణులను సమర్ధించే వేదాంతం కాదు.
 
తత్వశాస్త్రం ఆధిపత్యం నుంచి విముక్తి వైపుకు పంతొమ్మిదో శతాబ్దంలోనే మార్క్స్ సిద్ధాంతంతో దిశమార్చుకుంది. ఈ మార్పు ఇప్పటికీ ఈ పండితుల కళ్లకు కనిపించటం లేదు. ఇంకా పాచిపళ్ళ పాటలే పాడుతున్నారు.

బొల్లొజు బాబా
పిఎస్. అక్కడ చర్చలో నా తరపున రెండుమాటలు మాట్లాడిన Sreerama Murthy గారికి, Pasunoori Ravinder అన్నకు ధన్యవాదములు

థ్యాంక్యూ విరాట్ గారు for a crisp review

 


@#$%^&... చోరీ


.
మోకాళ్ళపై కూర్చుని
దేశాన్ని భుజాలపై మోసే
అనామకుని పేరు
దేశానికి తెలియదు.

వాడి చెమటతో
బడ్జెట్ లు తయారవుతాయి
వాడి ఆకలితో
జెండాలు ఎగురుతాయి
వాడి కలలతో
జాతిభవిష్యత్తు
రూపుదిద్దుకొంటుంది

వాడు దేశాన్ని మోస్తాడు
దేశం వాడి ఓటునే
దొంగిలిస్తుంది.

28/12/2025

డిజిటల్ ఒంటరితనం


చీకటి గది
ఫోన్ వెలుగులో
రాత్రిని స్క్రోల్ చేస్తున్నాను
స్క్రీన్ పై కదిలిపోయే
వేల ముఖాలు

నేనొక్కడినే ఒంటరిగా.
డిజిటల్ గోడల మధ్య

కనక్షన్ ఉంది
సంభాషణ లేదు
నెట్ వర్క్ బలంగా ఉంది
మనిషి బలహీనంగా ఉన్నాడు

బొల్లోజు బాబా



Friday, January 2, 2026

ద్రాక్షారామ పట్టణ చరిత్ర- ఆలయ శాసనాలలో ఆనాటి సమాజం pdf




ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చరిత్రపై నేను మెకంజి కైఫియ్యతులు-తూర్పుగోదావరి జిల్లా (2020), ప్రాచీన పట్టణాలు- తూర్పుగోదావరి జిల్లా (2021) అనే రెండుపుస్తకాలు రాసాను. ఇటీవల ప్రాచీనపట్టణాలు పుస్తకం నుంచి ద్రాక్షారామ పట్టణ చరిత్ర వ్యాసాన్ని నా ఫేస్ బుక్ వాల్ పై షేర్ చేసినపుడు చాలామంది నాకు కాల్ చేసి అభినందనలు తెలిపారు. వివిధ వాట్సప్ గ్రూపులలో విస్తృతంగా షేర్ అయినట్లు తెలిపారు. ఈ అంశంపై మరింత సమగ్ర సమాచారం ఒకే చోట ఉంటే బాగుంటుందనిపించింది
• 'ప్రాచీన పట్టణాలు' పుస్తకంలో ద్రాక్షారామ పట్టణ చరిత్ర గురించి వివరించగా,
• 'మెకంజి కైఫియ్యతులు' పుస్తకంలో ద్రాక్షారామ ఆలయ శాసనాల ఆధారంగా ఆనాటి సమాజపు లోతైన విశ్లేషణ ఉంటుంది.
.
ముప్పై పేజీల ఈ రెండువ్యాసాలు ఒకే చోట ఉంటాయని ఒక పిడిఎఫ్ గా చేసి ఆర్చైవ్ లో ఉంచుతున్నాను. ఆసక్తి కలిగినవారు ఈ ప్రాంత చరిత్రను, శాసనాలలో అభించే ఆనాటి సామాజిక పరిస్థితులను తెలుసుకొంటారని భావిస్తాను.

బొల్లోజు బాబా

1/1/2026