చరిత్రను ఈ కాలంలో ఎలా చదవాలి, ఎలా ఎదుర్కోవాలి అన్నదానికి ఇది ఒక బలమైన బౌద్ధిక నేపథ్యాన్ని అందించింది.
ఇంత లోతైన, బాధ్యతాయుతమైన విశ్లేషణతో ముందుమాట రాసిన శ్రీ భాస్కరం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
పాఠకుల నుంచి పుస్తకానికి వస్తున్న ఆదరణ, ఈ ప్రయత్నం సార్థకమైందనే నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది.
ఈ ప్రయాణంలో తోడైన అందరికీ ధన్యవాదాలు.
ఈ వ్యాసాన్ని ప్రచురించిన సాహిత్యప్రస్థానం పత్రిక ఎడిటర్ గారికి, ప్రచురణకర్తలు శ్రీ ఎస్.వి. నారాయణగారికి, కవర్ పేజ్ ఇచ్చిన శ్రీ గిరిధర్ గారికి, బలమైన క్రిస్పీ బ్లర్బ్ ఇచ్చిన సహృదయ మిత్రుడు శ్రీ అద్దేపల్లి ప్రభుగారికి, మరీ ముఖ్యంగా ఈ పుస్తకాన్ని కొని చదివి ఫోన్ లో మెసేజుల ద్వారా అభినందించిన అందరకూ....
బొల్లోజు బాబా
.
అసత్యాల అంధకారంపై చరిత్రవెలుగుల జడి
.
మన దేశం ఈరోజున ఒక కీలకదశలో ఉంది, కీలకమైన మలుపు తిరిగే దశలో ఉందని కూడా చెప్పవచ్చు. దానికి పూర్వరంగంలో క్షీరసాగరమథనంలా ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున భావసాగరమథనం జరుగుతోంది. అయితే, దానినీ, దాని ప్రాముఖ్యాన్నీ ఎంతమంది గుర్తించారో తెలియదు. గుర్తించవలసిన అవసరం మాత్రం ఉంది. బహుశా ఉపనిషత్తుల కాలం తర్వాత ఈ గడ్డమీద మళ్ళీ ఇప్పుడే పతాకస్థాయిలో భావాలు సంఘర్షించుకుంటున్నాయని నేను పదే పదే చెబుతూవచ్చాను. నేటి సందర్భ ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించి, అర్థం చేసుకునేవరకూ మళ్ళీ మళ్ళీ ఆ మాట చెప్పుకోక తప్పదు.
క్షీరసాగరమథనంలో విలువైనవాటితోపాటు, విషం కూడా పుట్టిందని మనకు తెలుసు. భావసాగరమథనం అందుకు భిన్నంగా ఉంటుందనీ, ఉండాలనీ ఆశించలేం. ఈ దేశానికీ, ఈ దేశగమనానికీ చెందిన ఎన్నో అంశాలలో ఒక స్పష్టతకు, ఒక అవగాహనకు రావడానికి చేయగల దోహదమే - దానినుంచి రాబట్టుకోగల విలువ; ఆ క్రమంలో అజ్ఞానపూరిత ఆవేశకావేశాల రూపంలో పుట్టుకొచ్చేది - విషం. అయినా అంతిమంగా జ్ఞానామృతభాండం చేతికందేవరకూ మథనం అనివార్యం.
ఇప్పుడీ భావసాగరమథనం అనేక రంగాల మీదుగా, అనేక పొరలలో జరుగుతోంది. వాటిలో ‘చరిత్ర’ ఒకటి. ఎక్కడైనా, ఎప్పుడైనా భావసంఘర్షణా, భౌతిక పరిస్థితులూ ఒకదానినొకటి పెనవేసుకుని, ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటూనే మనుషులను, లేదా దేశాలను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఈ గమనమంతా కలసి చరిత్ర అవుతుంది. స్థలకాలాల మీదుగా జరిగిన ఈ గమనం తాలూకు వివరాలన్నీ ఒకచోట క్రోడీకరిస్తే, అది ‘చరిత్ర’ అనే రూపం ధరిస్తుంది. అయితే, శ్రీశ్రీ చెప్పినట్టు చరిత్ర అంటే కేవలం తారీకులు, దస్తావేజులు మాత్రమే కాదు; స్థలకాలాలతో లేదా పరిణామక్రమంతో ముడిపడిన ప్రతీదీ చరిత్రగానే మారుతుంది. ఆవిధంగా చూసినప్పుడు, మనకు సంబంధించి, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు, కావ్యాలు, నాటకాలు, ప్రబంధాలు, అన్ని రకాల కళారూపాలు కూడా చరిత్రలో భాగమవుతాయి. కనుక, ఆధ్యాత్మికవాదులు చెప్పే ఆత్మ సర్వవ్యాపి అవునో కాదో తెలియదు కానీ, చరిత్ర సర్వవ్యాపి.
అయితే, ఒక మాట గానూ, ఒక సబ్జెక్టుగానూ కూడా చరిత్ర అంత గంద్రగోళానికి, వివాదాలకీ, తిరస్కారానికీ, చులకనకూ, అస్పృశ్యతకూ గురైన మరో మాటా, మరో సబ్జెక్టూ కనిపించదు. ఏది చరిత్ర, చరిత్ర నిర్వచనం ఏమిటి, చరిత్రను ఎలా వర్గీకరించాలి మొదలైన అనేక విషయాల్లో మన మధ్య ఇంతవరకూ ఒక కనీసమైన వస్తురూపసంబంధమైన ఏకీభావం కూడా ఏర్పడలేదు. మనకు చరిత్ర అక్కర్లేదండీ అంటూ ఒక్కమాటతో తీసి పారేసి, సంభాషణను హఠాత్తుగా ముగించిన విశ్వవిద్యాలయ పండితులు నాకు తెలుసు.
అయినాసరే, బ్రిటిష్ వలస పాలన దరిమిలా ఆత్మన్యూనతను, ఆత్మోత్కర్షగా మలచుకునే ప్రయత్నంలో మనకు చాలా గొప్ప చరిత్ర ఉందని చెప్పుకుంటూ చరిత్రరచనకు పూనుకున్న విచిత్ర చరిత్రా మనకు ఉంది. చరిత్రపట్ల తిరస్కారంతోపాటు, చరిత్ర రచనకు అవసరమైన విధివిధానాల క్రమశిక్షణ లోపించిన పరిస్థితిలో చరిత్రకు మసి పూయడం, మాయచేయడం, అణచిపెట్టడం, చరిత్ర పేరుతో అబద్ధాలను దండగుచ్చడం, లేని ఘనతను ఉన్నట్టు చూపడం, ఉన్న ఘనతను లేనిదిగానో, తక్కువ చేసో చూపడం విశృంఖలంగా జరుగుతూవచ్చింది. అదిప్పుడు ఔత్సాహిక చరిత్ర రచయితలు, అకడమిక్ పండితులు, భావజాల దృక్కోణంనుంచి చరిత్రను వ్యాఖ్యానించే ఆలోచనాపరులనే పొరలను దాటి రాజకీయకార్యక్షేత్రంలోకి, అందులోనూ అధికారపు అండ ఉన్న రాజకీయక్షేత్రంలోకి, సినిమా వంటి కళారూపాల్లోకి ప్రవేశించి మరింతగా వికటతాండవం, విలయతాండవం చేయడం చూస్తున్నాం.
ఇంకొక వింతా, వైరుధ్యమూ ఏమిటంటే; ఈ రాజకీయప్రేరిత చరిత్ర కల్పనకూ, కల్పితాలకూ, అబద్ధాలకూ, అసమగ్ర చిత్రణలకూ పాల్పడేవారు, వాస్తవంగా తాము ఉద్దేశించిన లక్ష్యానికి తామే నష్టం కలిగించుకుంటున్నామన్న సంగతిని గుర్తించకపోవడం! ఎలాగంటే, అసత్యాలతో, అర్ధసత్యాలతో, అతిశయోక్తులతో ఎవరినైనా, దేనినైనా ఆకాశానికి ఎత్తే ప్రయత్నం జరుగుతున్నకొద్దీ; దానికి సమాంతరంగా, వాటిని ఎత్తిచూపి, ఇదీ అసలు వాస్తవమని చెప్పే ప్రయత్నమూ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అది ఉద్యమరూపం ధరించిన దామాషాలోనే ఇదీ ఉద్యమరూపం ధరిస్తుంది. అంటే, మెచ్చులు, హెచ్చులు చూపినకొద్దీ పుచ్చులూ, రొచ్చులూ కూడా వేలెత్తి చూపవలసి వస్తూ ఉంటుంది.
ఈ క్షణాన అక్షరాలా జరుగుతున్నది అదే. అదీ జరగవలసిందే కానీ, అకడమిక్ రంగానికి పరిమితమై జరగడం వేరు, రాజకీయక్షేత్రంలోకి అడుగుపెట్టి జనం భావోద్వేగాలతో నేరుగా ముడిపెట్టుకుని జరగడం వేరు. అందుకు బాధ్యత వహించవలసింది, రాజకీయప్రేరిత సోకాల్డ్ చరిత్రకారులు మాత్రమే.
నేరుగా బొల్లోజు బాబా గారి ‘హరప్పానుంచి నేటి దాకా’ అనే ఈ పుస్తకంలోకి రావలసింది పోయి, మరీ ఇంత పెద్ద ఉపోద్ఘాతమా అని, ఇంతవరకూ చదివిన పాఠకులు అనుకుంటూ ఉండవచ్చు. కానీ, ఈ పుస్తకం విలువను మదింపు వేయడానికి ఇంత ఉపోద్ఘాతం అవసరమే. ఇది కూడా పూర్తిగా సరిపోతుందని కానీ, సమగ్రమని కానీ, సంపూర్ణ న్యాయం చేశానని కానీ నేను అనుకోవడంలేదు.
ఈ పుస్తకరూపంలోని బాబా గారి కృషి అంతా పైన చెప్పిన అనివార్య సమాంతర ప్రయత్నంలోకే వస్తుంది. తెలుగునాట ప్రస్తుతం చరిత్రరంగంలో అలాంటి సమాంతర ప్రయత్నం చేస్తున్న కొద్దిమందిలో బాబాగారు ఒకరు. ఆవిధంగా ఈ పుస్తకంలోని ప్రతి ఒక్క వ్యాసానికీ గొప్ప ప్రాసంగికత ఉంది. చరిత్ర పేరుతో రాజకీయపు ఊతతో బయట వినిపిస్తున్న అనేకానేక విపరీతకర్ణకఠోరవికటధ్వనులకు వ్యతిరేకంగా, వాస్తవికసమాచారం ఆధారంగా, సత్యాన్వేషణ ప్రధానంగా చేసిన కర్ణపేయమైన ప్రతిధ్వనులు – స్థూలంగా ఈ వ్యాసాలు.
ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ చిరకాలంగానే కాక, సమకాలీనంగా కూడా, చరిత్ర పేరిట వివిధరూపాల్లో ప్రచారంలోకి తెచ్చిన అసత్యాలను, అర్ధసత్యాలను, వక్రీకరణలను ఎత్తి చూపి వాస్తవాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగాలు. ఆవిధంగా ప్రాసంగికతను స్థాపించుకుంటున్నాయి. ప్రతి ఒక్క వ్యాసమూ ప్రమాణసూచికలతో, అంతగా ప్రాచుర్యంలో లేని విలువైన సమాచారంతో, ఎంతో ఆసక్తినీ, ఆలోచననూ గొలిపేవిగా ఉన్నాయి. నిజానికి, ఏ విశ్వవిద్యాలయ స్థాయిలోనో, తగినంత అర్థబలం, అంగబలం ఉన్న ఏ సంస్థ ద్వారానో జరగవలసిన కృషిని వ్యక్తిగతస్థాయిలో బాబా గారు తలకెత్తుకున్నారు. కాకపోతే అందువల్ల అనివార్యంగా కొన్ని పరిమితులూ ఏర్పడతాయి కనుక ఈ పుస్తకపాఠకులు వాటినీ దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది.
తాజా జన్యుఆధారాలతో ఆర్యుల వలసను నిర్ధరించడం, కులాలు బ్రిటిష్ వారి సృష్టా అని ప్రశ్నించి చర్చించడం, మాక్స్ ముల్లర్ , మెకాలే, చివరికి ఇటీవలి అంబేడ్కర్, నెహ్రూలకు వ్యతిరేకంగా జరుగుతున్న ద్వేషపూరిత అసత్యప్రచారాన్నీ; శంభాజీ లాంటి వారికి అనుకూలంగా జరుగుతున్న అబద్ధప్రచారాన్నీ; రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ పాత్రను తక్కువ చేస్తూ బి. ఎన్. రావు పాత్రను ఎక్కువ చేసి చూపడం వగైరాలనూ ప్రశ్నిస్తూ, అసలు నిజాలను ఆవిష్కరించడం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. వాటితోపాటు, మొగల్ చక్రవర్తులకు జన్మనిచ్చిన హిందూస్త్రీల గురించి, మొగల్ పాలకులు సంస్కృతాన్ని, సంస్కృతపండితులను ఆదరించడం గురించిన సమాచారాన్ని ఇవ్వడంతో సహా - ఇందులోని అనేక వ్యాసాలు - ప్రత్యేకించి గత దశాబ్దకాలంగా, అధికారపక్షపు అండతో మరింత పెద్ద గొంతును తెచ్చుకున్న ఏకపక్షవాదాలకు సముచిత ప్రతిస్పందనలు, ఆవిధంగా ఎంతైనా ప్రాసంగికాలు.
ఆ క్రమంలోనే కొందరు చారిత్రకవ్యక్తులు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వారు తీసుకున్న చర్యలు వగైరాలను, ప్రచారంలో ఉన్నదానికి భిన్నమైన కోణంలో, లేదా మరుగుపడిన కోణంలో రచయిత చూపిస్తారు; అలనాటి రాజరాజనరేంద్రుడితో మొదలుపెట్టి, ఔరంగజేబ్, దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇటీవలి ఇందిరాగాంధీ తదితరులు ఇందుకు ఉదాహరణలు.
ఇందులోని ‘ఆదిశంకరాచార్యుడు-ఆధ్యాత్మికయాత్ర’, ‘సింహాచలం-కొన్ని సంగతులు’ మొదలైన వ్యాసాలు చదువుతున్నప్పుడు, అవి అమిత ఆసక్తికరంగా ఉండడమే కాక; ప్రాచీన, మధ్యయుగ, ఆధునికపూర్వకాలిక చారిత్రకగమనాన్నీ, ఆ వెలుగులో నేటి దేశగమనాన్నీ అర్థం చేసుకోవడానికి అవి ఎంతైనా తోడ్పడతాయనిపించింది. సింహాచలం కేంద్రంగా జరిగిన యుద్ధాల తీరునే గమనిస్తే, ఇప్పుడు కూడా అలాగే రాజకీయయుద్ధాలు మతం ముసుగులోనే జరుగుతున్న సంగతి మనకు స్ఫురిస్తుంది.
అలాగే, ‘అయోతీ థాస్-దక్షిణభారత దళితమేధావి’, ‘రిజర్వేషన్ల కోసం పోరాడిన పెరియార్’ మొదలైనవి ఇటీవలి తరాలకు పెద్దగా తెలియని విస్మృతవ్యక్తులను, లేదా ఆయారంగాలలో వారి విస్మృతపాత్రనూ పరిచయం చేసిన వ్యాసాలు. ఈ పుస్తకం విలువను పెంచే విశేషాలు ఇంకా అనేకం ఉన్నప్పటికీ, విస్తరణభయంవల్ల ప్రస్తావించ లేకపోతున్నాను. పుస్తకం ఎలాగూ మీ చేతుల్లో ఉంది కనుక మీరే వాటిని దర్శించవచ్చు.
చివరిగా ఒక మాట చెప్పుకోవాలి. ఇటువంటి చరిత్ర ప్రధానమైన వ్యాసాలకు సంబంధించి, వస్తురూపాల నిర్వహణలో కేవలం ఒక కోణం కాక, అనేక కోణాలు జతపడి ఉంటాయి, అనేకవైపుల నుంచి విషయాలను పరిశీలించి నిగ్గు తేల్చుకోవలసి ఉంటుంది. ఒక నిర్దిష్ట ఉదాహరణ చెప్పాలంటే; సమాజం, సంస్కృతి, సాహిత్యం, మతవిశ్వాసాలు, దేవీదేవతలు, స్త్రీ-పురుష అంతరాలు మొదలైనవాటిని స్వదేశ, లేదా ప్రాంత కేంద్రితంగా మాత్రమే చూసినప్పుడు వాటి సమగ్రచరిత్ర బయటపడదు; ఎందుకంటే, ఇలాంటి అనేక విషయాలలో, ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు దేశాలుగా చెప్పుకునే అనేక ప్రాంతాలు పరస్పరం ప్రభావితం చేసుకున్నాయి, అనేకమైన వాటిని ఇచ్చిపుచ్చుకున్నాయి. కనుక వాటిని విశ్వజనీనకేంద్రితంగా చూసినప్పుడే వాటి గురించిన సమగ్రచరిత్ర వెల్లడవుతుంది.
ఉదాహరణకు, గ్రామదేవతారాధన మూలాలు హరప్పా సంస్కృతిలోనే ఉన్నాయనడం కానీ, ‘భారతీయసంస్కృతి’లోని సిందూరం, నల్లపూసలు, పువ్వులు ధరించడం వగైరా స్త్రీల తాలూకువన్నీ హరప్పన్ల నుంచి వచ్చాయనడం కానీ పాక్షికసత్యాలే అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల సౌభాగ్యవర్ధనంతో నేరుగా ముడిపెట్టుకుని చూసిన ఋతురక్తం, ప్రసవరక్తం, జంతురక్తాల నేపథ్యంనుంచి సిందూరధారణ వచ్చిందనీ; అలాగే, పూవులు, పండ్లు, రకరకాల మూలికలతో కూడిన పెరటిసాగుతో స్త్రీలకు మొదటినుంచీ, దాదాపు ప్రపంచమంతటా హార్దికసంబంధం ఉంటూ వచ్చిందనీ తేల్చిన అధ్యయనాలు అనేకం ఉన్నాయి. అలాగే, స్త్రీల స్థానం దిగజారడం వెనుక కూడా ఇలాంటి విశ్వజనీనకేంద్రిత చరిత్ర చాలా ఉంది. మనదేశానికి మాత్రమే పరిమితమై దానిని చెప్పుకోవడంవల్ల ఆ అంశానికి పూర్తి చారిత్రకన్యాయం జరగదు.
ఇతరత్రా ఎంతో విలువైన సమాచారమూ, దృష్టికోణమూ, ప్రాసంగికతా కలిగిన ఈ పుస్తకంలోని అంశాలను ఇలాంటి అదనపు కోణాలను కూడా జత చేసుకుని చూడాలని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఎన్నో చారిత్రకాంశాలను పొందుపరచడంతోపాటు, ఎన్నో ఆలోచనలను రేకెత్తించే ఈ పుస్తకం ఇలాంటి మరెన్నో కోణాలనుంచి పరిశీలనకు ఒక చక్కని ఆధారభూమిక కాగలిగినది.
బొల్లోజు బాబాగారికి హృదయపూర్వక అభినందనలు.
-కల్లూరి భాస్కరం
(ఈ వ్యాసం సాహిత్యప్రస్థానం పత్రికలో ప్రచురింపబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను)

No comments:
Post a Comment