Saturday, February 25, 2023

"ఫ్రెంచి ఇండియా స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ దడాల రఫేల్ రమణయ్య" పుస్తకావిష్కరణ



నిన్న యానాంలో నేను రచించిన "ఫ్రెంచి ఇండియా స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ దడాల రఫేల్ రమణయ్య" పుస్తకావిష్కరణ జరిగింది.
శ్రీ పొనుగుమట్ల విష్ణుమూర్తి గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభకు శ్రీ దాట్ల దేవదానం రాజు గారు అద్యక్ష్యత వహించారు. శ్రీ ముమ్మిడి చిన్నారి సభను నిర్వహించారు. యానాం మున్సిపల్ కమీషనర్ శ్రీ ఖండవిల్లి రామకృష్ణగారు, యానాం సర్వశిక్షఅభయాన్ అధికారి శ్రీ కమిడిప్రభాకరరావు, ఇంకా మిత్రులు శ్రీ కె. శివశేషుబాబు, శ్రీ వెంకటరమణ, కోలా సత్య ప్రసాద్, నల్లం రాము, కేదార్ నాథ్, అశోక్ కుమార్, శ్రీ మధునా పంతుల చలపతి, శ్రీ దడాల కుటుంబసభ్యులు ఇతర మిత్రులు ఈ సభలో పాల్గొన్నారు.
ఇది నా పదకొండవ పుస్తకం- వీటిలో మూడుపుస్తకాలు, యానాం విమోచనోద్యమం (2006), ఫ్రెంచి పాలనలో యానాం 2012, శ్రీ దడాల రఫేల్ రమణయ్య (2023) యానాం చరిత్రకు సంబంధించినవే కావటం నాకు దక్కిన ఒక అరుదైన అవకాశంగా భావిస్తాను.
నా సాహితీ యానంలో నన్ను చేయిపట్టుకొని నడిపించిన గురువుగారు శ్రీ శిఖామణి గారిని, నాకు నేటికీ స్పూర్తిని ఇచ్చే శ్రీ దాట్ల రాజుగారిని నిత్యం స్మరించుకొంటాను.
.
ఈ పుస్తకాన్ని శ్రీ పల్లవి పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. శ్రీ ఎస్. వి నారాయణ కాంటాక్ట్/pay phone number: 9866115655, వెల 100 రూపాయలు, పేజీలు 80. దయచేసి ఆదరించండి.

 
బొల్లోజు బాబా














































Friday, February 24, 2023

నాలుగూ నాలుగుదిక్కులకు లాక్కెళ్ళే శక్తులు.





.
//అమ్మవారో, మరేదేవతో
ఆ తల్లి ఎవరైతేనేం
బహుశా, ఆమె అన్నం ముద్దలు కలిపి పెడుతున్నందుకే
తలోజా జైల్లో ఆదిమపుత్రుల ఆకలి తీరుతోంది
గడ్డకట్టిన అండాసెల్ నిద్రలేమి నీఱై కరుగుతోంది
ఆమె మల్లోజుల మధురమ్మ,
వివేక్ ని కన్న కొదమగుండ్ల మాధవి,
వేముల రోహిత్ కోసం
గుండెలు పగిలేలా ఏడ్చిన రాధికక్క// ( 1818- శ్రీ రామ్ పుప్పాల)
.
సూర్యుడిని వండుకొని, చంద్రుడిని నంజుకొని
చుక్కలను అద్దుకున్న మేఘాలను కప్పుకొని
భూమిని ఆకాశాన్ని కాళ్ళు చేతులు చేసుకొని
పెంచుకున్న సంపదనంతా వదిలిపెట్టి యెక్కడికి పోతున్నారు? (బూడిదచెట్లపూలు-నిజం)
.
మళ్ళీ జన్మ ఉంటే ఎలా పుడతావు' అందామె//
'వేదనామయ లోకంపై దయచూపేవాడిలానా' అన్నది
'మనకి దయ చూపే అనుభవం కోసం
లోకంలో వేదన ఉండాలనుకోవటం కటువుగా లేదా' // (ఊరికే జీవితమై-బివివి ప్రసాద్)
.
అమ్మింకా రాలేదు
ఎండకి మొకవంతా పీక్కపోంది
గొడ్లు గోడ ఇళ్ళకొచ్చినియి
మా కర్రిదూడ సూడు వాళ్ళమ్మని సూసి
తెగ అరుత్తోంది
పిట్టపిల్లలు ఆకుల సాటునుంచి
వాళ్ళమ్మని జూసి బో సంబరంగా నవ్వుతున్నయి
కోడిపిల్లలు వాళ్ళమ్మ రెక్కల సందున
ఒదిగొదిగి తిరుగుతున్నయి
మమ్మొత్తే బాగుండు// (ఇయ్యాల ఊళ్ళో - గూండ్ల వెంకట నారాయణ)
.
విలక్షణ వ్యక్తీకరణకు, వస్తు వైచిత్రికి నాలుగు పుస్తకాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
కవి మిత్రులకు
అభినందనలు

. ధన్యవాదములు
 
బొల్లోజు బాబా


నిన్న కాకినాడలో హెచ్చార్కె గారి సభా విశేషాలు



నిన్న కాకినాడలో హెచ్చార్కె గారి సభా విశేషాలు.... Sailaja Kallakuri గారి వాల్ నుంచి.
.
మారని ధార హెచ్చా ర్కె
అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ అనే మాటని ప్రతి మనిషి ఎంతో కొంత ప్రేమిస్తాడు. ప్రపంచంలో మార్పు కన్నా శాశ్వతమైనది ఏమీ లేదు అని అదే మనిషి ప్రతిక్షణం ఎరుకలో ఉంటాడు కూడా!
అవును! పుట్టిన ప్రతి వాడు నా జీవితం ఎంతో కొంత Predictable గా ఉండాలనుకుంటాడు. అలా ఉండడం కోసమే నిజానికి మానవుడు నాగరికతను సృష్టించాడు. ప్రతిరోజు అడివిలో దారులు వెతుక్కుంటూ తనని తాను రక్షించుకోలేక!.
అది అడవో, జనారణ్యమో, యంత్రాల భూమో, సాంకేతికత నిండిన ఎడారో, ఇక రాబోయే జి పి చాట్ శూన్యమో.... ఇవన్నీ ఒక్కొక్కటి, ఒక్కొక్క మిస్సైల్స్ లా మానవాళిని తాకినప్పటికీ ఇంకా ఉన్నాంగా మనమంతా?ఒకరి పట్ల ఒకరం ప్రేమగా? అభిమానంగా?
ఇంకా మన కళ్ళు వెలుగుతున్నాయిగా, మరో మనసు తో మాట్లాడుతున్న గుర్తుగా? హృదయం తడబడి,మాట చెమ్మగిల్లి, మనమంతా ఒకరితో ఒకరు కరచాలనం చేసుకుంటున్నాం గా?
అదే జరిగింది నిన్న హెచ్ఆర్ కే గారు కాకినాడ వచ్చినప్పుడు.
అనంతపురం మద్దిలేటి వాగు నుంచి గోదావరి పంట కాలువ దాకా, సాయుధ పోరాట సమయం నుంచి ఉక్రెయిన్ యుద్ధ కాలం దాకా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ తోటి మనిషి పట్ల ప్రేమతో నడిచే ఒక జీవధార హెచ్ ఆర్ కే గారు.
ఆయన కాకినాడకు 19-2-2023 న వచ్చారు.
శ్రీ వక్కలంక రామకృష్ణ గారు అన్ని తానే అయి ముందుండి నడిపించిన ఒక్కరోజు కార్యక్రమం చివరికి వచ్చేసరికి సభా ప్రాంగణం నుంచి ప్రతివారు సాదర,సంతోష క్షణాలను కాసిని మూటగట్టుకుని ఇంటికి వెళ్ళగలిగారు.
ఉదయం 'పరివర్తన'లో పిల్లలను ఉద్దేశించి హెచ్ ఆర్ కే గారు మాట్లాడుతూ పదాన్ని ప్రేమించమన్నారు.ప్రతి వస్తువుకు భావానికి మానవుడు ఒక రూపాన్ని ఒక పేరును ఇవ్వగలిగాడని కాబట్టి ప్రతి పదం వెనుక ఒక సైన్స్ ప్రయోగమో, ఒక భావ ధారో ఉంటుందంటూ భాష గురించిన అత్యంత మౌలికమైన రహస్యాన్ని ఆ పిల్లలకు విప్పి చెప్పారు.
ఏదో ఒక పదం మాట్లాడకుండా ప్రతి పదం వెనుక నున్న సామాజిక, తాత్విక కోణాలను తమకు తాము ఆవిష్కరించుకోవడమే జీవితం అని హెచ్ ఆర్ కే గారు తెలియజేశారు.
ఈ ఏ ఒక్క వాక్యం ఆయన నోటిలోంచి వచ్చింది కాదు కానీ, ఇదే ఆయన చెప్పిన సారాంశం.
ఆయన చెప్పిన విధానం మటుకు పక్కనుండి విన్న వాళ్లకు మాత్రమే తెలిసింది.పాట పాడిన విజయ్, కలెక్టర్ ఔతానన్న రవిశంకర్, మా రోజూ రొటీన్ ఇది అంటూ కలబోసుకున్న మరొక చిన్నారి,.... వీళ్ళందరికీ “అరేయ్ పెన్ను అంటే రాసే ఒక వస్తువు కదరా! మరి అది నీకు మార్కులను ఇస్తుంది, ఉద్యోగం తెస్తుంది, రేపు పొద్దున్న రచయితవైతే సమాజంలో మార్పును తెస్తుంది. "హెయిల్ హిట్లర్" అనే ఒక్క నినాదం కొన్నాళ్లపాటు మానవాళిని వణికించింది, అదే....'మరో ప్రపంచం' అంటూ శ్రీశ్రీ చెప్పిన కవిత్వంలో జనజీవన చిత్రమూ ఉంది అంటూ ఆయన సోదాహరణంగా... పదం,భాష భావం,తత్వం అన్నింటినీ సరిగ్గా విని, అర్థం చేసుకుని, ఆ తరువాత మానవ శ్రేయస్సు కోసం అనుక్షణం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని హెచ్ ఆర్ కే గారు బోధించారు.
ఆ తరువాత జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన నోటి నుంచి వచ్చిన కొన్ని ప్రత్యేకమైన విషయాలు
---
1.మల్టీ పొలారిటీతో ఉన్న నేటి సమాజం
2.ఎందరు ఎన్ని రకాల సమూహాలను సృష్టించినా మానవులంతా ఒక్కటిగా నిలబడాలని, సత్యాన్ని శోధించాలని. నేటి సత్యం రేపటికి అసత్యమైతే దాన్ని వదిలి పెట్టాలని ఆయన అభిప్రాయ పడ్డారు.
ఈ వాక్యాలు ఒక పూటతోనో ఒక రోజుతోనో వదిలిపెట్ట గలిగేవి కావు! ఆయనతో మాట్లాడిన తరువాత ఆహారం రుచిని కోల్పోయింది.
ఆయన నోటి వెంట అనేక భాషల్లో రచయితలు, కవులు వారి ఆలోచన స్రవంతి గురించి 'పరివర్తన' హాల్లోనే కాదు, మా హృదయాల్లో కూడా సుడులు తిరుగుతూ సదా మమ్మల్ని చైతన్య వంతంగా ఉంచుతాయనడంతో సందేహం లేదు.
సాయంత్రం గాంధీభవన్లో ఏడు గంటల వేళ శ్రీ అద్దేపల్లి ప్రభు గారి సారధ్యంలో సాహితీ సమావేశం జరిగింది.
సభాధ్యక్షులు శ్రీ బొల్లోజు బాబా గారు ఆద్యంతం సభను కడు సమర్థవంతంగా నిర్వహించారు.
ఇద్దరు ప్రధాన ఉపన్యాసకులు ఒకరు ముక్కామల చక్రధర గారు. మరొకరు సుంకర గోపాల్. ఇద్దరూ ఇద్దరే.
చక్రధర్ గారు తనకు హెచ్ఆర్ కే గారి కుటుంబంతో ఉన్న ఆత్మీయత గురించి తెలియజేసుకుంటూ, "తెలుగు సాహిత్యంలో మరొక కవి వ్రాసిన కవిత్వాన్ని, వ్యక్తిగత స్థితిని బట్టి కాక భాష, భావం, ఆలోచనలను బట్టి విని, ప్రోత్సహించే అరుదైన వ్యక్తిత్వం హెచ్ ఆర్ కే గారిది"అంటూ తన కొన్ని అనుభవాలను తెలియజేశారు.
" ఈ సభ అయ్యేసరికి మనమందరం మనుషుల పట్ల ప్రేమను మరింత ఎక్కువగా, ఇంకొంచెం స్పష్టంగా, మూట కట్టుకుని వెళ్తామని" చెప్పారు. అదే జరగడం అత్యంత ఆనందదాయకం. శ్రీ ముక్కామల చక్రధర్ గారి ప్రసంగంలో సామాన్యంగా కనిపించే వాక్యాల్లోనే అసామాన్యమైన అబ్జర్వేషన్స్ ఉంటాయి. కుండబద్దలు కొట్టేంత నిర్మొహమాటం తప్ప ఇంకేం ఉండదు.
శ్రీ సుంకర గోపాల్ మాట్లాడుతూ--- 1970లో విప్లవ గీతంతో మొదలై దశాబ్దాలు గడిచినా పోరు బాట వదలక,నిక్కచ్చిగా మానవ సమాజం కోసం ఆలోచించే వ్యక్తి శ్రీ హెచ్చార్కే గారు అని అభివర్ణించారు. ఆయన పదాల్లో, కవిత్వ భాషలో సూటిదనం ఎప్పటికీ 'అప్డేటెడ్' గా ఉంటాయని, ఆయన వ్రాసినవన్నీ 'పద్యాలు' అంటూ ఉదాహరణలతో సహా వివరించి చెప్పారు. హెచ్ ఆర్ కే గారు భాషను శాసించి,వాటి భావాన్ని పాఠకుడికి అందించడంలో కృతకృత్యులయ్యారని తెలియజేస్తూ, 'నీటి తాత్వికత' ను ప్రతిబింబించే హెచ్ ఆర్ కే గారు రాసిన ఒక కవితను చదివి వినిపించారు. "మనిషి మొట్టమొదటిసారి తన ప్రతిబింబాన్ని చూసుకున్న అద్దం నీరు" అని హెచ్ ఆర్ కే గారు వ్రాసిన వాక్యం చదివినప్పుడు సభాస్థలి మొత్తం అవాక్కయింది. హెచ్ ఆర్ కే గారి లాంటి కవుల గురించి, తెలుగు నాట కవిత్వాన్ని కవులను ఇంకా సమర్థవంతంగా విద్యార్థి లోకానికి పరిచయం చేయటం లేదనే ఆవేదనను శ్రీ సుంకర గోపాల్ వ్యక్తం చేశారు.
శ్రీ అవధానుల మణి బాబు హెచ్ ఆర్ కే గారు రాసిన రెండు కథలను గురించి ప్రస్తావించి అందులో హెచ్ ఆర్ కే గారి ఎత్తుగడ సంఘర్షణను చిత్రీకరించే నేర్పు గురించి చెప్పారు.
శ్రీ బొల్లోజు బాబా గారు విరోధాభాస ను అలవోకగా నిర్వహించగల నేర్పు గల కవి శ్రీ హెచ్ ఆర్ కే గారు అంటూ, కవి వాక్యాలను కొన్నింటిని చదివి వినిపించారు.
నేను కూడా నాలుగు మాటలు మాట్లాడడానికి పోడియం మీదకు వెళ్లేసరికి హెచ్ ఆర్ కే గారి వ్యక్తిత్వం భావజాలాలకు అతీతంగా.....
వ్యక్తి శ్రమను, శ్రమైక సౌందర్యాన్ని గుర్తించి,
యుద్ధాన్ని, మానవ సంక్షోభాన్ని నిరసించే... నిలువెత్తు నిజాయితీగా ఆయన కనబడడంతో అదే విషయాన్ని నా ప్రసంగంలో చెప్పాను.
తదుపరి హెచ్ ఆర్ కే గారు తన స్పందనను తెలియజేస్తూ మనిషి కలలు కనాలని, కల ఎప్పుడు కృత్రిమంగా ఉండకూడదని,
గతంలోకో,భవిష్యత్తులోకో జారిపోకుండా వర్తమాన క్షణంలో నిలబడి, నిక్కచ్చిగా, సమస్య కళ్ళలోకి చూసినప్పుడు మాత్రమే సరైన సమాధానాలు, పరిష్కారాలు దొరుకుతాయని చెప్పారు.
మేధో శక్తి, ఊహా శక్తి గొప్పవి కావచ్చు కానీ వాటన్నింటికీ అస్తిత్వం మటుకు మనిషి తినే ప్రతి తిండి గింజయే. కనుక అది పండించే రైతు, పండే భూమి మటుకు ఎవరి చేతుల్లో బందీగా ఉండకూడదు అని చెప్పారు.
ఎంత సాంకేతికత వచ్చినా ప్రేమించే మనిషి ముందు నిలబడలేవని ధీమా వ్యక్తం చేశారు.
యుద్ధం ఎక్కడిదైనా రక్తపాతం సృష్టిస్తుంది కాబట్టి అది గర్హనీయమన్నారు. ప్రపంచమంతా మంచి వైపే నడుస్తూ ఉందని, ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయని, ఇవన్నీ మనిషిని మరింత ఉన్నతీకరిస్తూనే వెళ్లాలని, అలాగే జరిగి తీరుతుందని మానవాళి పట్ల తనకున్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
మనుషుల మధ్య విభేదాలు సహజమని, వాటిని పరస్పరం చర్చతో అవగాహన చేసుకోవాలని, మనం ఆలోచనలకు ప్రతీకలుగా కాక ఎదుటివారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటో తెలుసుకోవడం వలనే పురోగమిస్తామని, అటువంటి చర్చ మాత్రమే మనల్ని అర్థవంతంగా మలచగలదని తెలియజేశారు.
శ్రీ అద్దేపల్లి ప్రభు గారు వందన సమర్పణ చేశాక ఎవరికి వారం విడిపోయాం.
ఇంతకు పొద్దున్న లేచేసరికి వార్త ఏమిటంటే, కాకినాడ పట్టణం హెచ్ ఆర్ కే గారిని విపరీతంగా ప్రేమిస్తోంది.
ఏనాడూ లేనిది, షిరిడి ఎక్స్ప్రెస్ 5 గంటలు లేటు!
మనమీద మనకు కన్న మనిషి మీద నమ్మకం పెరిగినపుడు అభద్రత కు తావులేని,స్వార్ధానికి చోటులేని నిర్మలానందం దొరుకుతుంది...
.
Sailaja Kallakuri








తిరుక్కురళ్ - ప్రేమస్వరాలు



.
తిరుక్కురళ్ 3 BCE నుండి 5 CE మధ్యలో రచింపబడిన తమిళ కావ్యం. దీనిని రచించింది తిరువళ్ళువర్ కవి. ఈ రచన మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి విభాగంలో మనుషులు పాటించాల్సిన ధర్మం గురించి, రెండవ విభాగంలో భౌతిక సంపదల గురించి, మూడవ విభాగంలో ప్రేమ గురించి ఉంటుంది. ఇది హిందూ మతం చెప్పే పురుషార్ధాలైన ధర్మ అర్ధ కామ లతో సరిపోలుతున్నా ధర్మం పేరుతో తిరువళ్ళువార్ వర్ణధర్మం గురించి చెప్పడు. మనిషి భిన్నదశలలో నిర్వర్తించాల్సిన విధుల గురించి చెబుతాడు. అదే విధంగా నాలుగో ధర్మమైన మోక్షం గురించి తిరువళ్ళువర్ మాట్లాడడు.
ఇతని బోధనలలో అహింస, శాఖాహారం పట్ల ఇష్టత ఇంకా ఇతర జైన మతపర అంశాలను గుర్తించిన పండితులు తిరువళ్ళువర్ జైనుడని అభిప్రాయపడ్డారు. David Shulman (2016) Tamil: A Biography అనే పుస్తకంలో తిరువళ్ళువర్ జైనుడని అన్నాడు. తిరువళ్ళువర్ ఆజీవికుడనే అభిప్రాయం కూడా కలదు.
.
డాక్టర్ జి.యు పోప్ అనే కవి తిరువళ్ళువర్ ను ఇలా కీర్తించాడు
వళ్ళువర్ యోగీ! కడజాతిలో జన్మించిన ప్రబోధకుడా!//
నీవు విశ్వమానవకీర్తిగానం చేసే కవివి//
సుగుణాలు, వాస్తవమైన ఆస్తి, ఆనందము
ఇవే మానవుని లక్ష్యం అని
అతిమధురమైన ద్విపదలలో నీవు ఎలుగెత్తి చాటావు 1 //
.
హిందూమతం ఉచ్చ్ఛస్థితికి చేరుకొన్నతరువాత అంతవరకూ జైన, బౌద్ధ, ఆజీవిక సంప్రదాయాలను పాటించిన వ్యక్తులు సంఘబహిష్కృతులు గావించబడ్డారని ఆ విధంగా తిరువళ్లువర్ జాతి అయిన వల్లవన్ జాతి నేడు బహుజన కులంగా మారిపోయిందనే వాదన కూడా కలదు.
ఏది ఏమైనప్పటికీ....
.
తిరుక్కురళ్ లో మొత్తం రెండు పాదాలు కలిగిన 1330 కురళులు (ద్విపదలు) ఉంటాయి. ఇవి సూక్తులుగా, , బోధనలుగా, కవితా వాక్యాలుగా సమస్తమానవాళికి నేటికీ స్పూర్తినిస్తున్నాయి.
.
తిరుక్కురళ్ మూడవ భాగమైన ప్రేమ కురళ్ లలో కొన్నింటికి నేను చేసిన అనువాదం ఇది.
.
తిరుక్కురళ్ - ప్రేమ స్వరాలు
.
1.
అప్సరసా? అరుదైనమయూరమా? లేక
అందంగా అలంకరించుకొన్న మానవకన్యా? ఎవరీమె అంటూ
నా హృదయం తర్కించుకొంటోంది (1081)
2.
మృత్యువో, నయనాలో లేక హరిణమో?
ఆమె చూపులు నాకు ఆ మూడింటినీ
స్ఫురింపచేస్తున్నాయి (1085)
3.
ఆ యువతి చనుధ్వయాన్ని కప్పుతోన్న వస్త్రం,
మదమెక్కిన ఏనుగు కళ్లకు కట్టిన గంతల వలె ఉన్నది (1087)
4.
యుద్ధరంగంలో శతృవులను గడగడలాడించే నా పరాక్రమం
ఆమె అందమైన మోము ముందు ఓడిపోయి తలదించుకొంటుంది (1088)
5.
హరిణి చూపులు, ముగ్ధత్వము అలంకారాలుగా ఉన్న
ఆ పడతికి ఇక వేరే ఆభరణాలు ఎందుకు? (1089)
6.
మధువు సేవించినపుడే మైకం కలుగుతుంది
ప్రేమ ఉత్తచూపులతోనే హృదయాన్ని మత్తెక్కించగలదు (1090)
7.
ఆమె కాటుక కనులు ఏకకాలంలో రెండు పనులు చేయగలవు
ఒకటి గాయపరచటం, రెండు స్వస్థపరచటం (1091)
8.
నేను చూచినపుడు ఆమె కనులు దించుకొని నేలచూపులుచూస్తుంది
చూడనపుడు నన్నే చూస్తూ ముసిముసి నవ్వులు చిందిస్తుంది (1094)
9.
నిరంతరం ఒకరినొకరు కొత్తగా పరిచయమైన వారిగా
భావించటం ప్రేమికులకే చెల్లుతుంది (1099)
10.
హృదయం హృదయంతోను, కళ్ళు కళ్లతోను సంభాషిస్తున్నపుడు
మాటల అవసరం ఏముంది? (1100)
.
మూలం: తిరుక్కురళ్- తిరువళ్ళువర్
అనువాదం: బొల్లోజు బాబా
(ఇంకా ఉంది)
(1Source: భారతీయ సాహిత్యనిర్మాతలు-తిరువళ్ళువర్ - సాహిత్య అకాదెమి)

తిరుక్కురళ్ - ప్రేమస్వరాలు -2
.
తిరుక్కురళ్ మూడవవిభాగమైన ప్రేమ కురళ్ లను The Book of Desire పేరుతో ప్రముఖ కవయిత్రి మీనా కందసామి ఇటీవల అనువదించారు. ఈ పుస్తకంలో తిరువళ్ళువర్ 31 BCE లో జన్మించి ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు.
మనుషులు జన్మతా సమానమే అనే భావన కొన్ని కురళ్ లలో కనిపించటాన్ని బట్టి తిరుక్కురళ్ - కులం, సనాతన ధర్మం ఇంకా పాదుకొనని కాలంలో రాయబడిన తమిళ కావ్యంగా భావించాలి.
మద్రాసు ప్రెసిడెన్సీలో సివిల్ సర్వెంట్ గా పనిచేసిన Francis Whyte Ellis (1777-1819) తిరుక్కురళ్ ద్విపదలను ఎంతగానో ప్రేమించాడు. ఇతను మద్రాసు టంకశాలకు ఇంచార్జ్ గా ఉన్నసమయంలో తిరువళ్ళువర్ బొమ్మకలిగిన నాణాలను ముద్రింపచేసాడు.
Whyte Ellis తిరుక్కురళ్ లోని కొన్ని ద్విపదలను ఇంగ్లీషులోకి అనువదించి 1812 లో ప్రచురించాడు. తిరుక్కురళ్ కు పూర్తి ఇంగ్లీషు అనువాదం George Uglow Pope 1886 లో వెలువరించాడు.
***
తిరుక్కురళ్ మూడవ భాగమైన ప్రేమ కురళ్ లలో కొన్నింటికి నేను చేసిన అనువాదాలు ఇవి....
11.
స్పర్శ, రుచి, వాసన, దృష్టి, శ్రవణం - ఒకేక్షణంలో పంచేంద్రియ సుఖాలన్నీ ఆమె కౌగిలిలో లభిస్తాయి. (1101)
12.
చదువు ఎక్కువ అవుతున్నకొద్దీ
ఏమీ తెలియదనే తెలివిడి కూడా ఎక్కువయినట్లుగానే
ఆమెను ఎంత గాఢంగా అనుభవించినా
ఏమీ అనుభవించలేదనే విషయంకూడా నెమ్మదినెమ్మదిగా తెలుస్తూంటుంది. (1110)
13.
నాముందు సువిశాలమైన
సముద్రమంత ప్రేమ పరుచుకొని ఉంది
కానీ దాటేందుకు చిన్న తెప్పకూడా కనిపించదు (1164)
14.
పిచ్చి రాత్రి!
అన్నింటినీ నిద్రబుచ్చి నాకు తోడుకొరకు మేలుకొని ఉంటోంది (1168)
15.
దూరదేశమేగిన నా దయలేని మగని కంటే
క్రూరంగా ఉన్నవీ సుదీర్ఘమైన రాత్రులు (1169)
16.
నా హృదయంలానే నా నేత్రాలు కూడా
అతనితో పాటు వెళిపోయి ఉన్నట్లయితే
అవి నేడు నా కన్నీటి వరదల్లో చిక్కుకొని ఉండకపోను (1170)
17.
అతను ఉన్నప్పుడు నా కనులకు నిద్రరాదు, అతను లేనప్పుడు అవి నిద్రపోవు. ఈ రెండు విపరీతాల మధ్య నా కనులు ఎంత క్షోభకు గురవుతున్నాయో (1179)
18.
మన రహస్యాలన్నీ అందరకూ తెలిసిపోతున్నాయంటే
నిందించాల్సినది బాకాలు ఊదే నా నేత్రాలను (1180)
19.
ఈ నల్లపిల్ల కౌగిలింతలో నాకు
ఇల్లు ఇచ్చే చనువు, ఇంటిభోజనపు సుఖం లభిస్తాయి (1107)
20.
కలహించు, రాజీపడు, సంగమించు
అవన్నీ ప్రేమ దయతో అనుగ్రహించే వరాలు (1109)



తిరుక్కురళ్ - ప్రేమస్వరాలు - చివరి పార్టు
.
తిరుక్కురళ్ మూడవ భాగమైన కామత్తుప్పాల్ లోని 41 కురళ్ లను ప్రేమ స్వరాలు గా అనువదించాను. దానిని పిడిఎఫ్ రూపంలో ఆర్చైవ్ ఆర్గ్ నుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును.
లింకు కామెంటులో కలదు.
థాంక్యూ ఆల్
బొల్లోజు బాబా
.
21.
ఓ వెన్నెలా!
నువ్వు మురికిగా, కాంతివిహీనంగా ఉన్నావేమీ?
నీ ప్రియుడుకూడా దయలేని వాడా? (1222)
22.
అతను నన్ను తలచుకొందామని అనుకొని
తలచుకోలేదు కాబోలు - వచ్చే తుమ్ము ఆగిపోయింది (1203)
23.
ప్రేమప్రతిపాదనకు స్పందన కరువైనప్పుడు ప్రియునికి
మడల్ స్వారీ1 మాత్రమే గొప్ప ఓదార్పు (1131)
(ప్రియురాలు తిరస్కరించినపుడు ప్రియుడు తాటిఆకులతో చేసిన గుర్రం బొమ్మ ఎక్కి వీధులలో ప్రియురాలి పేరు/చిత్రం రాసిన జండాని ప్రదర్శిస్తూ, రోదిస్తూ తిరగటాన్ని మడల్ స్వారీ అంటారు. ఇంతజరిగాక ప్రియురాలు అంగీకరించవచ్చు. ఇది సంగం యుగపు ఒక ఆచారం)
24.
సాగరమంతటి ప్రేమోద్రేకం ముంచెత్తినప్పటికీ
స్త్రీకి మడల్ నిషేదం.
ఎంత అదృష్టవంతురాలామె! (1137)
25.
దీపం ఆర్పేవరకూ చీకటి ఎదురుచూసినట్లు
నా కౌగిలినుంచి ప్రియుడు దూరమయ్యేవరకు
నన్ను ముంచెత్తటానికి కాంతిహీనత ఎదురుచూస్తోంది (1186)
.
మూలం: తిరుక్కురళ్- తిరువళ్ళువర్
అనువాదం: బొల్లోజు బాబా

ఇక్కడనుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును














The Lovely Fork by Bertolt Brecht





అందమైన నగిషీపిడి కలిగిన
ఫోర్క్ విరిగిపోయింది
ఒక్కసారిగా అనిపించింది.
దాని లోపల అప్పటికే
ఏదో లోపం ఉండి ఉంటుందని
అది విరిగిపోకముందు దానితో
నా సంతోషసమయాల్ని
జ్ఞాపకం చేసుకొంటున్నాను
The Lovely Fork by Bertolt Brecht
Trn: John Willett
telugu: బొల్లోజు బాబా

Thank you Gangaprasaad mitramaa..

 




Advice to the Actress C.N by Bertolt Brecht


.
సేదతీరు సోదరీ!
మంచు ముక్కలు వేసిన రాగిపాత్ర నీటిలో
తలముంచి నేత్రాలను తెరచి శుభ్రం చేసుకో.
మెత్తని టవల్ తో తుడుచుకొని
నీకు నచ్చిన పుస్తకాన్ని తెరు.
అలా ఒక చక్కని ఆనందకరమైన
రోజుని ఆరంభించు
Source: Bertolt Brecht
Translated in to eng: John Willett
అనువాదం: బొల్లోజు బాబా

ఫ్రెంచి ఇండియా పోరాట యోధుడు రఫేల్‌ రమణయ్య జీవిత కథ



Sangishetty Srinivas అన్నా, థాంక్యూ సో మచ్.
.
ఫ్రెంచి ఇండియా పోరాట యోధుడు
రఫేల్‌ రమణయ్య జీవిత కథ
.
స్వాతంత్య్రోద్యమం అంటే ఆధిపత్య కులాల వాండ్లు చేసిన పోరాటంగానే ఇన్నేండ్లు చరిత్రలో రికార్డయింది. 1990ల తర్వాత సబాల్టర్న్‌ వర్గాల నుంచి కొత్తగా అకరాలు సేకరించి నూతన విషయాలను వెలుగులోకి తెస్తూ ఉండడంతో బహుజనులు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారనేది రికార్డవుతోంది. అట్లాంటి పుస్తకాల్లో మిత్రుడు బొల్లోజు బాబా రాసిన ‘శ్రీదడాల రఫేల్‌ రమణయ్య’ పుస్తకం ఒకటి. పోయిన నెలలో అచ్చయిన ఈ పుస్తకంలో ఫ్రెంచ్‌ ఇండియా స్వాతంత్య్ర సమరయోధుడి పోరాటాల గురించి చెప్పిండు.
1908లో పుట్టి 1991లో చనిపోయిన రఫేల్‌ రమణయ్య నెహ్రూ మొదలు అనేక మంది జాతీయ నాయకులతో కలిసి పనిచేసిండు. తన ఆత్మకథను 1974లో ‘మై స్ట్రగుల్‌ ఫర్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఫ్రెంచ్‌ ఇండియా ` యాన్‌ అటో బయోగ్రఫీ’ పేరిట రాసిండు. అయితే బొల్లోజు బాబా ఇది ఇంగ్లీషులో దళితుడు రాసిన తొలి ఆత్మకథగా చెప్పిండు.
యానాంను భారతదేశంలో విలీనం చేయాలనే డిమాండ్‌ జరిగిన ఉద్యమంలో రమణయ్య సెల్లాన్‌ నాయకర్‌ నాయకత్వంలో పనిచేసిండు. చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చిన రమణయ్య గురించి ఇప్పటి తరానికి దాదాపు తెలియదు అని చెప్పవచ్చు. అట్లాంటి దళిత్‌ క్రిస్టియన్‌ చరిత్రను వివిధ పత్రికల్లో 1950వ దశకంలో పత్రికల్లో వచ్చిన వార్తలను జోడిరచుకొని సంక్షిప్తంగానే అయినా వివరమైన జీవిత చరిత్రను రాసిన బొల్లోజు బాబా అభినందనీయుడు.
ఆనాటి పత్రికల క్లిప్పింగ్స్‌ని కూడా ఈ పుస్తకంలో ప్రచురించడంతో దీనికి సాధికారత వచ్చిందని చెప్పవచ్చు. ఈ పుస్తకానికి బెంగళూరులో స్థిరపడ్డ వ్యాపారవేత్త, దడాల కుటుంబానికి చెందిన ప్రవీణ్‌ కె. దడాల ముందుమాట రాసిండు. ఇందులో కుల పరమైన, జెండర్‌ పరమైన వివక్షను ఆయన ప్రస్తావించారు. 80 పేజీల ఈ పుస్తకాన్ని జనవరి, 2023లో విజయవాడకు చెందిన పల్లవి పబ్లికేషన్స్‌ వారు ప్రచురించారు.
పుస్తకం చదువాలనుకునే వారు పల్లవి పబ్లికేషన్స్‌కు చెందిన దవారిని 9866115655. వెల. వంద రూపాయలు.



ఫ్రెంచి యానాంపై ఒక పాత వీడియో


1997 వ సంవత్సరంలో Partho Bhattacharya అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు , 1954 లో జరిగిన యానాం విమోచనోద్యమంలో పాల్గొన్న ఆనాటి ముఖ్యమైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తూ ఫ్రెంచిలో ఒక డాక్యుమెంటరీ చేసాడు. ఆ డాక్యుమెంటరీలో శ్రీ దడాల గురించిన ప్రస్తావనలు ఇలా ఉన్నాయి. ఇదంతా చరిత్ర.

.
George Sala (యానాం చివరి ఫ్రెంచి అడ్మినిస్ట్రేటర్)
Dadala 1952 నుంచి పాండిచేరీలో ఉద్యమంలో ఉన్నాడు. 1954 లో యానాం వచ్చినపుడు స్థానిక నాయకులెవరూ అతనితో కలవలేదు. పదిహేను రోజుల తరువాత 1954 ఏప్రిల్ 30 న యానాం నాయకులు ఆంధ్రనాయకుల సమక్షంలో శ్రీ దడాలను కలిసాక, వారు యానాన్ని విడిచి శ్రీ దడాలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగించారు. యానానికి సంబంధించి అది ఒక "Perfect Move"
.
శ్రి చింతా ఎ. నాయుడు, ఫ్రెంచి కానిస్టేబులు
వాలంటీర్ల సమూహానికి సాయుధ బలగాలకు శ్రీ దడాల నాయకత్వం వహించారు. ఫ్రెంచి పోలీసులమైన మమ్ములను లొంగిపొమ్మని ఒక లౌడ్ స్పీకర్ లో ఆదేశాలు ఇచ్చారు. 32:31
.
శ్రీ బొల్లోజు బసవలింగం:
ఉద్యమకారులు దడాల సారధ్యంలో యానాంలోకి ప్రవేశించి, శాంతియుతంగా, ఘర్షణలు, ప్రతిఘటనా లేకుండా ఫ్రెంచి ప్రభుత్వ ప్రతినిధి అడ్మినిస్ట్రేటర్ శివా నుండి అధికారాలను స్వీకరించి యానాం పరిపాలను చేపట్టారు. 35:08
.
శ్రీ కనకాల తాతయ్య:
నేను ఫ్రెంచి పతాకాన్ని క్రిందికి దించగా యానాంలో తొలిసారి భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసారు దడాల. యానాంలో ఫ్రెంచిపాలన అంతమైందని నేను వెళ్ళి వీధి వీధి తిరుగుతూ ప్రకటించాను 38:30
****
శ్రీ దడాల దళితుడు కావటంతో సహజంగానే ఆయన సాగించిన పోరాటం సామాజిక నిర్లక్ష్యానికి గురయ్యింది. ఈ వీడియోను గమనిస్తే ఒక వ్యక్తి నేనే ఉద్యమాన్ని నడిపించాను అనే అర్ధం వచ్చేలా చాలా హింట్లు ఇచ్చారు.
శ్రీ దడాల పోషించిన పాత్రపై ఇప్పటికీ కొందరికి అనుమానాలే. నొసటివిరుపులే.
ఒక స్థానికుడిగా ఇది నాకు తెలుసు. యానం దళిత మేధావి శ్రీ పొనుగుమట్ల విష్ణుమూర్తి ఈ పుస్తకానికి రాసిన ముందుమాట "సింహాలు తమ విశిష్టత చాటుకోకపోతే, తోడేళ్ళు సింహాలుగా చెలామణి అయిపోతాయి" అనే వాక్యంతో మొదలౌతుంది. బహుసా అది సమంజసమే అనిపిస్తోంది.

రాత్రి ఆశ్రయం - A Bed for the Night by by Bertolt Brecht


న్యూయార్క్, బ్రాడ్వే 26 వ వీధి మూల
చలికాలంలో ప్రతీ సాయింత్రం పూట ఒక వ్యక్తి
వచ్చీపోయే బాటసారులను అడుగుతూ
నిరాశ్రయులకు మంచాలు అందిస్తూంటాడు

అది ప్రపంచాన్ని ఏమీ మార్చివేయదు
మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరచదు
దోపిడీ యుగాన్ని తగ్గించదు

కానీ కొద్దిమందికి ఆ రాత్రికి మంచం దొరుకుతుంది
వారు ఆ రాత్రికి చలిగాలులను తప్పించుకొంటారు
వారిపై కురవాల్సిన మంచు రోడ్డుపై రాలుతుంది
ఇది చదివి పుస్తకాన్ని పక్కన పెట్టేయకు... మిత్రమా!
కొద్దిమందికి ఆ రాత్రికి మంచం దొరుకుతుంది
వారు ఆ రాత్రికి చలిగాలులను తప్పించుకొంటారు
వారిపై కురవాల్సిన మంచు రోడ్డుపై రాలుతుంది

కానీ, అది ప్రపంచాన్ని ఏమీ మార్చివేయదు
మనుషుల మధ్య సంబంధాలను మెరుగుపరచదు
దోపిడీ యుగాన్ని తగ్గించదు


Source: A Bed for the Night by by Bertolt Brecht
అనువాదం: బొల్లోజు బాబా

హంసగీతం/swansong by Bertolt Brecht


మానవజాతి చివరి శిలాశాసనం ఇలా ఉంది
(చదివేవారు లేరు, ఫలకమూ పగుళ్ళుతీసి)
"ఈ భూమి ముక్కలైపోయింది .
అది పెంచి పోషించిన వారే దానిని నాశనం చేసారు.
కలిసి బ్రతికే మార్గంగా
మేము పెట్టుబడిదారీ విధానాన్ని ఎంచుకొన్నాం.
భౌతికశాస్త్రాన్ని మరింతలోతుగా శోధించి
కలిసి చనిపోయే మార్గాన్ని
ఆవిష్కరించుకొన్నాం"


Swansong by Bertolt Brecht
Eng.Trns: John Willett
అనువాదం: బొల్లోజు బాబా

I, the Survivor by Bertolt Brecht


చాలామంది మిత్రులు గతించిపోయినా
నేనింకా జీవించి ఉండటం
ఉత్త యాదృచ్ఛికం అనుకొనేవాడిని
నిన్నరాత్రి కలలో నా మిత్రులు
"Survival of the fittest" అంటూ
నాగురించి చెప్పుకోవటం వినిపించింది
నా మీద నాకే అసహ్యం వేస్తోంది.
.
మూలం: The Survivor by Bertolt Brecht
అనువాదం: బొల్లోజు బాబా

Sunday, February 5, 2023

The Swamp by Bertolt Brecht

నాకెంతో మంది స్నేహితులుండేవారు
వారిలో నాకు ఇష్టమైన మిత్రుడొకరు
అసహాయుడై ఒక ఊబిలో కూరుకుపోయాడు

ఇది ఒక్క రోజులో జరగలేదు
పూర్తిగా మునిగిపోవటానికి వారాలు, నెలలు పట్టింది
చాలామందిని మింగేసిన ఆ ఊబి గురించి
మేమిద్దరం సుదీర్ఘంగా చర్చలు చేసుకొనేవాళ్ళం

అశక్తుడనై చివరిసారిగా అతడిని చూసాను
మెరిసే మెత్తని బురదతో కప్పబడి,
పాకే జలగలతో కొంచెం కొంచెంగా
మునిగిపోతోన్న అతని మొఖంపై
భీతికొలిపే అందమైన చిరునవ్వు.
.
మూలం: The Swamp by Bertolt Brecht
అనువాదం: బొల్లోజు బాబా

Saturday, February 4, 2023

ఒప్పందం


మా అమ్మాయిని ఆసుపత్రి వద్ద డ్రాప్ చేసాను
అక్కడ ఎవరో వృద్ధుని మృతదేహాన్ని
స్ట్రెచర్ నుండి అంబులెన్స్ లోకి
ఎక్కిస్తున్నారు
అతని తెరిచున్న కళ్ళు ఆకాశంలోకి చూస్తున్నాయి
నెలలు నిండిన ఒక స్త్రీ
నడుంపై ఒక చేయి
సహాయక స్త్రీ భుజంపై మరో చేయివేసి
ఆకాశం వైపు చూస్తూ
భారమైన అడుగులతో నడుస్తోంది

నేనూ ఆకాశం వైపు చూసాను
మెట్లదారిలో
ఒక వృద్ధుడు ఉత్సాహంగా పైకి ఎక్కుతున్నాడు
ఒక చిన్ని బాలుడు గెంతుతూ క్రిందకి దిగుతున్నాడు
గగనానికి ఇలకూ మధ్య కుదిరిన అనాది ఒప్పందం
***
డాడీ బై అంటూ మా అమ్మాయి
వాచీ చూసుకొని స్టెత్ సర్ధుకొంటూ
కంగారు కంగారుగా లోనికి వెళిపోయింది
.
బొల్లోజు బాబా

Wednesday, February 1, 2023

చివరి ఆశ...



బరువుగా వీపున కూర్చున్న
ఈ సాయింత్రమొక ఇసుకమూట

రద్దీ నగరం తీగలు తెగిన ఒక వయొలిన్
కలల్ని కన్నీళ్ళను మోసుకొంటూ సాగుతోంది
చీకట్లోకి ఆకట్లోకి రేపట్లోకి

చెవులు, నాలుకలు, కళ్ళు లేని
క్షతగాత్ర దేహాల జలపాతం తూర్పుదిక్కున
 
తెల్లారే వేళకి
సగంసగం పచ్చిగా ఉన్న గాయాలను తడుముకొంటూ
చూడలేని, వినలేని, పలుకలేని ప్రజలు మరలా ఉదయిస్తారు
రాత్రంతా వారు విడిచిన నిట్టూర్పులే
ఈ పొగమంచు
నగరమంతా పరుచుకొంది
దేహమంతా నిండిపోయింది
కవిత్వమంతా పాదుకొంది
 
గర్భగుడి గోడలపై తారాడే
దేవదేవుని అఖంఢజ్యోతి పలుచని కాంతి
ఒక్కటే ఆశ ఇక
ఈ చలిమంచుని కరిగించగలిగే స్వప్నం

బొల్లోజు బాబా