తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు -- పార్ట్4
1500 BCE నాటికి మనుగడలో ఉండిన మాతృస్వామ్య సమాజం క్రమేపీ పితృస్వామ్య సమాజంగా మారడానికి వేద సంప్రదాయం/ఆర్యసంస్కృతి దోహదపడింది. అంతవరకూ వేదాధ్యయనం చేసి, సామాజిక ఉత్పత్తిలో పురుషులతో సమానపాత్ర పోషించి, వేదకాండలను నిర్వహించి; విదుషీమణులుగా, కవయిత్రులుగా, గణనీయమైన పాత్రవహించిన స్త్రీలను ఈ సనాతన ధర్మం కట్టడి చేసి పురుషాధిక్య చట్రంలో బిగించసాగింది.
ఆర్యసంస్కృతి స్త్రీలనే కాక శూద్రులను కూడా జ్ఞానానికి (సంస్కృతానికి) దూరంగా ఉంచింది. వీరికి వేదవిద్యలు నేర్పాలా వద్దా అంటూ అతిప్రాచీన ఆపస్తంబధర్మసూత్ర మొదలు ఆ తదుపరి ఆదిశంకరాచార్యుల బ్రహ్మసూత్ర, పదహారోశతాబ్దపు అప్పయ్యదీక్షితులవరకూ చర్చోపచర్చలు జరుగుతూనే ఉండటం గమనార్హం.
ఆర్యసంస్కృతి ద్వారా వెలికి గురైన స్త్రీలను, శూద్రులను మొదటగా చేరదీసింది జైనమతం. బుద్ధునికన్నా 50 ఏండ్లు పెద్దవాడైన జైన మహావీరుడు ముప్పై ఆరువేల మంది స్త్రీలతో సంఘాన్ని నెలకొల్పాడు. పార్శ్వనాథుడు (BCE 872 -772) స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా అథ్యాత్మిక మార్గాన్ని అన్వేషించే స్వేచ్ఛ ఉందని వారు కూడా జ్ఞాన సముపార్జన చేసి గురుస్థానం పొంది బోధనలు చేయవచ్చని ప్రవచించాడు. అంతే కాక స్త్రీలు అధికారిక, రాజకీయ స్థానాలకు కూడా అర్హులని చెప్పాడు. బౌద్ధ జైనాలు స్థానిక భాషలలో జ్ఞానాన్ని అందిస్తూ, శూద్రులను స్త్రీలను అక్కున చేర్చుకొన్నాయి. ఈ చర్యలు ఆర్యసంస్కృతి భావజాలానికి ప్రతికూలంగా పనిచేసి ఉండొచ్చు, అదొక చారిత్రిక భావజాలవైరుధ్యం.
***
BCE మూడో శతాబ్దంలో మెగస్థనిస్ భారతదేశం గురించి చెబుతూ అక్కడ -- బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, విద్యలను అధ్యయనం చేసే సంచార స్త్రీ లు ఉన్నారని, వీరిని పబ్బజితా (pabbajita the Female Wanderer) అంటారని చెప్పాడు. ప్రతీదశలో స్త్రీ ఎవరో ఒకరి సంరక్షణలో ఉండాలి తప్ప ఆమెకు స్వాతంత్ర్యం లేదు అంటూ మనుస్మృతిలో (400 BCE -700 CE) చెప్పిన పురుషాధిక్య కట్టుబాటును ధిక్కరించి భార్యగానో, తల్లిగానో మరొకరికి లొంగిపోయి, స్వేచ్ఛను కోల్పోవటానికి ఇష్టపడని స్త్రీలు బౌద్ధ జైనాల వైపు ఆకర్షితులై సంచార జీవనాన్ని సాగించేవారని ఊహించవచ్చు.
బుద్దిజం క్షీణించాక ఈ female wanderers ను అప్పటి సమాజం “Loose women” గా చూడటం మొదలుపెట్టి ఉంటుంది. (ఆంధ్రదేశంలో శిథిలరూపంలో ఉన్న ఒకనాటి బౌద్ధారామాలను లంజలదిబ్బలు అనే పేరుతో వ్యవహరింపబడటం నేటికీ గమనించవచ్చు.) “Loose women” ను, ఆత్మస్వేచ్ఛకొరకు సంప్రదాయాన్ని ధిక్కరించిన పరిత్యాగులను కలిపి చూడలేం. ఎందుకంటే బుద్ధిజంలోని అష్టాంగమార్గ అనుసరణ కఠినమైనది. చెడువర్తనకు తావు లేనిది.
స్త్రీలు బౌద్ధ బిక్షుణిలుగా మారాలంటే కొన్ని నిబంధనలు కలవు. కనీసం 20 సంవత్సరాల వయసు ఉండాలి. తల్లిదండ్రులు జీవించి ఉంటే వారి అనుమతి లేదా భర్త ఉంటే అతని అనుమతి తప్పని సరి. అప్పటికే సంఘంలో ఉండే ఇతర బిక్షుణి, బిక్షుకుల అంగీకారం ఉండాలి. ఈ దశలో కుటుంబసంబంధాలను తెంచుకోనక్కరలేదు.
ఇలా రెండేళ్ల పాటు బౌద్ధ సన్యాసిని వద్ద విద్యనభ్యసించాక సంఘంలోకి సభ్యురాలిగా తీసుకొంటారు. అలాంటి వారిని "సిఖమన" అంటారు (sikkhamana- female buddhist probationar). ఈ దశలో 12 ఏండ్లపాటు సంఘంలో ఉంటే బిక్షుణిగా గుర్తిస్తారు. ఈమె కొత్తగా సంఘంలోకి వచ్చినవారికి శిక్షణ ఇవ్వవచ్చు. వృద్ధ భిక్షుణిని థేరి అంటారు.
బౌద్ధ ఆరామంలో మఠవాసినులుగా ఉండాలంటే -- వనాలలో సంచరించకూడదు; ఒంటరిగా జనావాసాలలోకి వెళ్లకూడదు; ఒంటరిగా నదులు దాటకూడదు; ఒంటరిగా రాత్రివేళల సంచరించకూడదు; ఒంటరిగా ప్రయాణించకూడదు; పురుషులు, స్వైరిణిలు స్నానమాడిన చోట స్నానం చేయరాదు- లాంటి నియమాలను బుద్ధుడే స్వయంగా స్త్రీల కొరకు చెప్పాడు.
***
థేరీ గాథల ద్వారా ఆనాటి స్త్రీలు ఎంతటి ఆత్మవిశ్వాసంతో, స్వతంత్ర వ్యక్తిత్వంతో, ఎన్ని కష్టాలొచ్చినా నిరాశకు కృంగిపోని దృఢచిత్తంతో, అచంచలమైన స్వేచ్ఛాకాంక్షతో కూడిన జీవనేచ్ఛతో జీవనం సాగించారో ఆశ్చర్యం కలిగించక మానదు…
పురుషుని అండలేకుండా స్త్రీలు స్వతంత్రంగా నివసించటం వల్ల కలిగే సామాజిక సమస్యలు బౌద్ధమతానికి తెలుసు. దైహికవాంఛల పట్ల వైముఖ్యం పెంపొందించుకోవటమే దీనికి పరిష్కారంగా సూచించినట్లు సుభ చెప్పిన గాథ ద్వారా అర్ధంచేసుకోవాలి.
***
సుభ ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయి. గొప్ప అందగత్తె. యుక్తవయసులో బౌద్ధ దీక్ష తీసుకొని తక్కువ కాలంలోనే ఆత్మజ్ఞానం పొంది వివేచన కలిగిన భిక్షుణిగా పేరుతెచ్చుకొన్నది. ఒకనాడు ఆమె ఒంటరిగా అడవిలో సంచరిస్తున్నప్పుడు కామాతురుడైన ఒక అందమైన యువకుడు ఎదురై ఆమెను నిలువరించాడు. అప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణ కు సంక్షిప్తరూపమిది.
సుభ:
ఎవరవోయి నీవు? నేను నీకేమి చేసాను?
ఎందుకు నాదారికి అడ్డు పడుతున్నావు?
ఒంటరిగా ఉన్న అమ్మాయిని తాకటం సరి కాదు
నేను పవిత్రంగా ఉన్నాను, ఏ కళంకమూ లేదు
మా రక్షకుడు, బోధకురాలు నన్ను తీర్చిదిద్దిన విధానమది.
నీ బుద్ధి మంచిగా లేదు, కోర్కెతో రగిలిపోతోంది
నేను నిర్మలంగా ఉన్నాను
నాకు ఏ వాంఛలూ లేవు
తేటగా ఉన్నాను
నా మార్గానికి ఎందుకు అడ్డుపడుతున్నావు?
యువకుడు:
నువ్వు అందగత్తెవు, అమాయకంగా ఉన్నావు
నీ కాషాయ వస్త్రాలను విడిచిపెట్టు
మనిద్దరం ఈ అడవిలో విహరిద్దాం
గాలి తియ్యగా ఉంది
అడవంతా పుష్పించింది
తరువులు పుప్పొడి వెదచల్లుతున్నాయి
వసంత రుతువు ఆనందాలకు నెలవు
ఏ తోడూ లేక ఈ వన సంచారం ఏం సుఖం నీకు?
చుట్టూ మృగాలు,
మగ ఏనుగులచే ఉద్రేకించబడిన
ఆడఏనుగుల ఘీంకారాలు
భయం వేయటం లేదా?
నీవు నాతో వచ్చేయి
నీకొరకు పెద్ద భవంతి నిర్మిస్తాను
బంగారం, రత్నాలు, ముత్యాలతో
సేవకులు నిన్ను అలంకరిస్తారు
గంధపుచెక్కతో చేసిన తల్పంపై పవళించగ
రా... నన్ను అంగీకరించు...
సుభ:
ఈ దుర్భలదేహంలో మృత్యువు ఉంది
ఈ దేహాన్ని ఎందుకు తదేకంగా
చూస్తున్నావు?
దీనిలో నిన్ను ఆకర్షించినదేమిటీ?
యువకుడు:
నీ నేత్రాలు... మృగనయనీ... నీ నేత్రాలు!
అవి ప్రకాశించే నీలి కలువలు
వాటిని చూస్తే నీపై నా ప్రేమ అతిశయిస్తుంది
నీవు నిష్క్రమించినా
నీ కనులను, నీ కనుబొమలను, నీ చూపులను
స్మరించుకొంటూనే ఉంటాను
నీ నేత్రాలను మించినవేవీ లేవీ లోకంలో
సుభ:
బుద్ధభగవానుడి పుత్రికను నీవు వాంఛిస్తున్నావు
ఇది తప్పు మార్గము
నాకు ఏ కోర్కెలు లేవు
కోర్కెలు అంటే ఏమిటో కూడా నాకు తెలియదు
కోరుకోవటానికి అర్హతకలిగినది ఏదీ కనిపించదు నాకు
నేను అష్టాంగమార్గంలో సాగుతున్నాను
అంధుడా!
నీవు లేని వస్తువుల వెంటపడుతున్నావు
నేత్రాలు అనేవి
గుంటల్లో ఉండే చిన్న చిన్న గోళాలు
కన్నీళ్ళు, శ్లేష్మం నిండిన బంతులు
(అని చెప్పి ఆమె తన కంటిని బలవంతంగా పెకలించి అతని చేతిలో పెట్టి ఇలా అన్నది)
.
నీవు ఎంతో ప్రేమించిన
నా నేత్రం ఇదిగో!
తీసుకో .... ఇక ఇది నీదే!
.
(ఊహించని ఈ సంఘటనకు చలించిపోయిన ఆ యువకుడు పశ్చాత్తాపం పొంది క్షమించమని ఆమెను కోరాడు)
యువకుడు:
పవిత్రమైన భిక్షుణీ!
దయచేసి నీవు నీ పూర్వరూపాన్ని పొందు
నన్ను మన్నించు.
ఇకపై ఇలా ఎన్నడూ జరగదు
దయచేసి నీవు నీ పూర్వరూపాన్ని పొందు
నన్ను మన్నించు. (369-402)
(పిదప సుభ తధాగతుని వద్దకు వెళ్ళగా అతని చూపులు ఆమెపై ప్రసరించగానే ఆమెకు నేత్రము తిరిగి పూర్వస్థితికి వచ్చింది.)
.
పై గాథలో సుభకు ఆ యువకునిపై ఏ రకమైన మోహమూ లేదు. శారీరిక వాంఛలపట్ల ఆసక్తి లేదు. బుద్ధుని బోధనల వల్ల అంతర్నేత్రం పొందిన ఆమెకు బాహ్యనేత్రాలు అవసరం లేవని చెప్పటమే ఈ గాథ పరమార్ధం. సుభకు నేత్రము తిరిగి తెప్పించటం అనే ఉదంతం విశేషమైనది ఎందుకంటే బుద్ధభగవానుడు మహిమలు చూపించిన దాఖలాలు పెద్దగా కనిపించవు.
సోర్స్:
Poems of the first Buddhist women by Charles Hallsey
THE FIRST BUDDHIST WOMEN By Susan Murcot
గాధల అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా
No comments:
Post a Comment