Saturday, August 21, 2021

తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 5

 తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 5

.
రెండున్నరవేల ఏండ్ల క్రితం కొద్దిమంది స్త్రీలు స్వేచ్ఛగా , స్వైరిణిలుగా, సన్యాసినులుగా సంచార జీవనం సాగించినప్పటికీ అధికశాతం మంది వైవాహిక జీవితంలో ఉన్నారు. తధాగతుడు ఒక సందర్భంలో ఆదర్శవంతమైన భార్య తన భర్త కు తల్లిలా, సోదరిలా, స్నేహితురాలిలా, పరిచారికలా ఉండాలి అని చెప్పాడు .
పై లక్షణాలన్నీ కలిగి ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో విఫలమై సన్యసించిన ఇసిదాసి అనే అనే భిక్షుణి చెప్పిన గాథ ఆసక్తికరంగా ఉంటుంది.
ఇసిదాసి ఉజ్జయినిలో ఒక సంపన్న వర్తకుని ఇంట జన్మించింది. ఇసిదాసికి యుక్తవయసు వచ్చాక ఆమె తండ్రి సాకేతపురికి చెందిన మరో సంపన్న వర్తకుని కుమారుడికి ఇచ్చి వివాహం చేసాడు. ఇక అక్కడినుంచి ఇసిదాసి జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో ఓ గాథలో ఇలా చెప్పుకొంది.
.
నేను ప్రతిరోజు నా అత్తమామల పాదాలను
కళ్ళకద్దుకొని దినచర్య ప్రారంభించే దానిని
నా భర్త తరపువాళ్ళను చూడగానే
ఒణికిపోతూ లేచి నా స్థానాన్ని వారికి ఇచ్చేదానిని
వారికి నచ్చిన రుచికరమైన వంటకాలు వండిపెట్టేదానిని
ఉదయాన్నే నిద్రలేచి,
నా భర్తకు తలదువ్వి, అలంకరించేదానిని
స్వయంగా ఒండిన అన్నాన్ని తినిపించేదానను
తల్లి బిడ్డను సాకినట్లు నా భర్తను సాకేదానిని
ఇన్ని చేసినా నా భర్తకు నేను నచ్చలేదు
ఇసిదాసి తో కలిసి ఉండలేను అని నన్ను
మా పుట్టింటికి పంపించివేసాడు.
కొడుకుని పొందాను కానీ సౌభాగ్యాన్ని కోల్పోయాను
నా తండ్రి భారీ కట్నకానుకలిచ్చి
మరో ధనికుడైన వ్యాపారితో నాకు రెండో పెళ్ళి చేసాడు
ఇతను కూడా ఒక నెల కాపురం చేసి
నన్ను మా పుట్టింటికి పంపించివేసాడు
మా ఇంటికి భిక్షకు వచ్చిన ఒక సన్యాసికిచ్చి
నాకు మూడో పెళ్ళిచేసాడు మా తండ్రి
ఇతను కూడా ఒక నెల కాపురం చేసి
ఇసిదాసి తో కలిసి ఉండలేను అని నన్ను విడిచి వెళ్ళిపోయాడు.
ఇంతజరిగాక నేను చనిపోదామని నిశ్చయించుకొన్నాను
ఒక రోజు మా ఇంటికి జ్ఞానవంతురాలైన ఒక భిక్షుణీ వచ్చింది
ఆమె బోధనలతో నేను ఆథ్యాత్మిక మార్గాన్ని తెలుసుకొని
బౌద్ధదీక్ష తీసుకొని ధమ్మమార్గంలో ప్రయాణిస్తున్నాను (403-450 సంక్షిప్తరూపం)
.
థెరీ గాథలు ఆనాటి స్త్రీ జీవితాలను ప్రతిబింబిస్తాయి. దుర్భరమైన వైవాహిక బంధంలో ఇమడలేని ఇసిదాసి జీవితాన్ని తీసుకొన్నప్పుడు- అనాదిగా ఎంతటి విషాదం, దుఃఖం, నిస్సహాయతలు స్త్రీల జీవితాలతో పెనవేసుకొని ఎంతమందిని కబళించి ఉంటాయో ఊహింపశక్యం కాదు. ఇన్నిశతాబ్దాల తరువాత కూడా ఈ విషాదం పరిష్కృతమైందని చెప్పలేం. ఇలాంటి స్త్రీలకు కుటుంబం, మతం తప్ప ఎవరు ఓదార్చారు చరిత్రలో. ఇలాంటి విధివంచితుల కన్నీళ్ళని తుడవటంలో మతం పాత్రను విస్మరించలేం. ఇసిదాసి గాథద్వారా అప్పట్లో స్త్రీ పునర్వివాహం పట్ల సమాజానికి ఏ పట్టింపులులేవని తెలుస్తున్నా, రెండు మూడవ వివాహాలలో ఎక్కువ కట్నము, అయోగ్యుడైన భర్త లాంటి అంశాలు కూడా గమనించదగినవి.
***
.
1. థెరికా
థెరికా క్షత్రియకుటుంబంలో జన్మించింది. ఒకనాడు ఈమె బుద్ధుని బోధనలు విని ఆకర్షితురాలై, సంఘంలో చేరాలని నిర్ణయించుకొంది. భర్త అందుకు అంగీకరించని కారణంగా థెరికా గృహస్తుగా సంసారిక బాధ్యతలు నిర్వర్తిస్తూ తథాగతుని బోధనలు మననం కొంటూ జీవనం సాగించసాగింది. ఒకనాడు వంటింట్లో మంటలు చెలరేగగా థెరికాకు ప్రాణాపాయం తప్పింది. ఆ క్షణంలో మానవ జీవితం ఎంత అశాశ్వతమో అర్ధమై, భర్తను ఒప్పించి బౌద్ధ భిక్షుణిగా దీక్ష తీసుకొంటుంది. ఒకనాడు బుద్ధుడు ఈమెతో ఇలా అన్నాడట
.
థేరికా
ఇప్పుడు నీవు థేరీలలో కలిసావు
నీకు చిన్నప్పుడు పెట్టిన పేరు ఇన్నాళ్ళకు నిజమైంది
నీవు స్వయంగా కుట్టుకొన్న దుస్తులను కప్పుకొని
హాయిగా నిదురించు
నీ వాంఛలన్నీ కుండలో దాచిన ఆకుకూరల్లా
వడలి ఎండి పోతాయి ఇక. (1)
.
2. ముత్త
ముత్త (ముక్త) పేద బ్రాహ్మణకుటుంబంలో జన్మించింది. దుర్భరదారిద్ర్యం కారణంగా ఆమె తల్లిదండ్రులు ఈమెను ఒక గూనివానికిచ్చి వివాహం జరిపించారు. అనాకారితో వివాహం కన్నా వైవాహిక జీవితంలో ఎదురైన కష్టాలు ముత్త ను కృశింపచేసాయి. భర్త అనుమతితీసుకొని ఆమె బౌద్ధ ఆరామంలో చేరింది. నియమనిష్టలతో జీవనం సాగించి సంఘంలో భిక్షుణి హోదాను పొందింది.
నేను స్వేచ్ఛనొందాను
మూడు కుటిల విషయాలనుండి
నా భర్త, రోలు, రోకలి
నేను స్వేచ్ఛనొందాను
మూడు కుటిల విషయాలనుండి
జననం, మరణం, పునర్జన్మ
నేను స్వేచ్ఛనొందాను (11)
.
3.
దంతిక
కోసల రాజు వద్ద మంత్రిగా పనిచేస్తున్న ఒక బ్రాహ్మణుని కూతురు దంతిక. ఈమె యుక్తవయసులోనే బౌద్ధసన్యాసినిగా ప్రజాపతి గౌతమి శిష్యురాలిగా బౌద్ధదీక్ష తీసుకొన్నది. పరిపరివిధాల ప్రవహించే మనసుని స్వాధీనపరచుకోవటానికి సాధన చేయటమే మార్గమని, కఠోరసాధన ద్వారా ఎంతటి మృగప్రాయ చిత్తమైన మచ్చికకాక తప్పదని గొప్ప దుష్టాంతంద్వారా దంతిక తన గాథలో ఇలా చెప్పింది.
.
గృద్ధకూట పర్వతంపై ధ్యానం కొరకు వెళ్ళాను
అక్కడ ఒక ఏనుగు
నదిలోంచి నడుచుకొంటూ బయటకు వస్తోంది
పురుషుడొకడు ఆ ఏనుగును ఆపి
దానికి అంకుశాన్ని చూపాడు
అది ముంగాలు ముందుకు చాచింది
ఆ పురుషుడు దానిని అధిరోహించాడు
ఒక అడవి మృగం నా కళ్ళముందే
మానవునిచే మచ్చికకాబడింది
అది చూసాకా నాకు నమ్మకం వచ్చింది
అడవిలోకి వెళ్ళి సాధన మొదలుపెట్టాను. (48-50)
(ఇంకా ఉంది)
గాథల అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా
.
Ref.
Poems of the first Buddhist women by Charles Hallsey
THE FIRST BUDDHIST WOMEN By Susan Murcot
No photo description available.
Gopal Sunkara, Marni Janakiram Chowdary and 74 others
10 comments
3 shares
Like
Comment
Share

No comments:

Post a Comment