Thursday, August 5, 2021

వజ్జలగ్గ – గాథలు పార్ట్ 2

 వజ్జలగ్గ – గాథలు పార్ట్ 2

.
(వజ్జలగ్గ అనేది గాథాసప్తశతి లానే అందమైన ప్రాకృత గాథల సమాహారం. ఈ సంకలనంలోని గాథలు CE 750-1337 మధ్య కాలానికి చెందినవి. జైన పండితుడైన జయవల్లభుడు ఈ గాథలను సేకరించాడు)
***
హరప్ప ముద్రలపై (Seal) ఏనుగు బొమ్మలుండటాన్ని బట్టి అయిదువేల ఏండ్లక్రితం నుంచే మనపూర్వీకులకు ఏనుగులతో సాహచర్యం ఉందని ఊహించవచ్చు.
రుగ్వేదంలో ఏనుగు "మృగ హస్తిన్" (చేయికలిగిన జంతువు) అని చెప్పబడింది. . మహాభారత యుద్ధంలో ఏనుగుల ప్రస్తావన కలదు. అలగ్జాండర్ యుద్ధ ఏనుగును చూసి హడిలిపోయాడని ఒక కథనం ఉంది.
ఏనుగులను మచ్చికచేయటం, వాటిని వివిధ అవసరాలకు వాడుకోవటం రాజుకు మాత్రమే ఉండే హక్కుగాను, ఏనుగుని ఇతరులెవరైనా మచ్చికచేసిన, చంపినా మరణదండన అని కౌటిల్యుని అర్ధశాస్త్రంలో ( BCE రెండో శతాబ్దం) చెప్పబడింది. ఏనుగులపై మోనోపలి రాజ్యానికి మాత్రమే పరిమితం చేయటం రాజ్య సంరక్షణ వ్యూహంగా అనుకోవాలి.
ఏనుగులను పట్టుకోవటం, శిక్షణ, సంరక్షణ, వాటి పోషణ చూసే అధికారిని హస్త్యాధ్యక్ష అంటారని అతని విధులు, బాధ్యతలు గురించి ఒక అధ్యాయమే కలదు కౌటిల్యుని అర్ధశాస్త్రంలో.
పైవన్నీ ఒకపార్శ్వం కాగా - అడవిలో స్వేచ్ఛగా సంచరించే ఏనుగులను బంధించి వాటిని వివిధ రకాల యాతనలకు గురిచేసి శిక్షణ ఇవ్వటాన్ని ఎవరో ఓ ప్రాచీన గాథాకారుడు నిశితంగా పరిశీలించి ఉంటాడు. ఆ సందర్భాలను ఉద్వేగభరిత గాథలుగా పోతపోయటం మరో పార్శ్వం….. ఆ పని ఒక్క సాహిత్యం మాత్రమే చేయగలదు
.
సరస్సులో జలకాలాడుతున్నప్పుడు
తొండంతో సుతారంగా తెంపిన తామరతూడుతో
ఆడ ఏనుగు తనను మెత్తగా తట్టటం
శృంఖలాలతో బంధించబడిన ఏనుగుకు ఇంకా గుర్తు (191)
.
ఓ గజరాజమా!
నీవు స్వేచ్ఛగా ఉన్నప్పుడు తినిన
గంధపు చెట్ల ఆకుల గురించి ఆలోచిస్తూ చింతించకు.
నీ యజమాని ఇప్పుడు అందించిన ఎండుగడ్డిని అంగీకరించు
ఉన్నతులు విధి వైపరీత్యాలను
తమను తాము మెరుగుపరచుకోవటానికి వాడుకొంటారు. (192)
.
విపరీతమైన ఆకలి బాధిస్తున్నప్పటికీ
దూరమైన తన తోడు గుర్తుకు రావటంతో
తొండం చివర పచ్చని తామరతూడులు
అలా నిశ్చలంగా నిలిచిపోయాయి (196)
ఏనుగులు సమూహజీవులు. వాటి మధ్య అనుబంధాలు ఉంటాయి. ఏనుగులు ఒకదానినొకటి గుర్తించుకొని సహానుభూతి ప్రకటించుకొంటాయి. ఒక సారి జంటకడితే మరణంలో తప్ప విడిపోవు. ఒకదానిపట్ల మరొకటి నిబద్దులై ఉంటాయి. వాటి అన్యోన్యత పైగాథలలో అద్భుతంగా ఒదిగిపోయింది. 196 వ గాథలో దూరమైన తన జోడు జ్ఞాపకం రాగా తిండి సయించటం లేదు అనే మాట ఎంత గొప్పగా చెప్పాడా ప్రాచీన కవి.
***
.
ఓ హంసరాజమా!
స్వర్ణపద్మాలు, మంచిముత్యాలతో నిండిన
పవిత్ర మానససరోవరాన్ని విడిచిపెట్టి
ఊరికాలువలో వసిస్తూన్నందుకు
సిగ్గుతో నీవింకా చచ్చిపోలేదేమి? (261)
పై గాథకు ఒక చాటువు ఆధారం.
మానససరోవరం నుంచి వచ్చి ఊరి చెరువుగట్టుపై వాలిన ఒక హంసను అక్కడి లోకల్ కొంగలు “ఎవరు నీవు, ఎక్కడనుంచి వచ్చావు?” అని ప్రశ్నించగా “నన్ను హంస అంటారు నేను స్వర్ణపద్మాలు, మంచిముత్యాలతో నిండి, దేవతలు స్నానించే పవిత్ర మానససరోవరం నుంచి వచ్చాను” అన్నదట. దానికి ఆ లోకల్ కొంగలు “అక్కడ నత్తలుంటాయా” అని ప్రశ్నించగా “నత్తలంటే ఏమిటి” అని విస్తుపోయి ఎదురుప్రశ్నించిందట ఆ మానససరోవరపు హంస. ఆ ప్రశ్నకు “నత్తలంటే తెలీదా” అని పకపక నవ్వాయట లోకల్ కొంగలు.
పై చాటువులో పారలౌకిక విషయాలు గొప్పవనీ ప్రాపంచిక విషయాలు అల్పమైనవనే వెటకారపు భావన ఉంది. ఇదే చాటువుని కొనసాగిస్తూ చాన్నాళ్లక్రితం నేను వ్రాసిన “ఆ తరువాత ఏమైందంటే…” అనే కవితను ఇలా ముగించాను.
//కొన్నాళ్లకు
అమృతజలాలు లభించక
నత్తల్నెలా పగలగొట్టుకొని తినాలో తెలియక
మానససరోవరపు కొంగ కృశించి కృశించి
ఆ చెరువు గట్టునే చచ్చిపోయింది. (“ఆ తరువాత ఏమైందంటే…” వెలుతురు తెర- 2016)
వజ్జలగ్గలోని 261 వ గాథ పై చాటువును స్పృశిస్తూ చక్కని లోతైన కోణాన్ని దర్శింపచేస్తుంది.
ప్రాకృతభాష స్థానీయమైనది. (లోకల్ కొంగల భాష). సంస్కృతభాష పండితులది. బౌద్ధ, జైన మతాల భాష ప్రాకృతం కాగా సంస్కృతం హిందూమత భాష. బౌద్ధ జైనాలు మోక్షం, కర్మకాండలు లాంటి పారలౌకిక విషయాలను అంగీకరించవు. మానససరోవరం, దేవతలు స్నానం చేయటం లాంటి అలౌకిక విషయాలవెనుక ఉండే కాల్పనికతను పై ప్రాకృత గాథలో “నీవింకా చచ్చిపోలేదేమి” అంటూ కత్తివాదర లాంటి వ్యంగ్యంతో ఖండించాడా ప్రాకృత జైన గాథాకారుడు.
Source
Jayavallabha’s Vajjalaggam by M.V. Patwardhan
అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా

No comments:

Post a Comment