Sunday, August 8, 2021

వజ్జలగ్గ – గాథలు పార్ట్ 3

 వజ్జలగ్గ – గాథలు పార్ట్ 3

.
(వజ్జలగ్గ అనేది గాథాసప్తశతి లానే అందమైన ప్రాకృత గాథల సమాహారం. ఈ సంకలనంలోని గాథలు CE 750-1337 మధ్య కాలానికి చెందినవి. జైన పండితుడైన జయవల్లభుడు ఈ గాథలను సేకరించాడు)
***
వింధ్యపర్వతాలు, తూర్పుకనుమలు ప్రాకృతగాథల భౌగోళిక సరిహద్దులుగా ఉన్నాయి. అక్కడి అరణ్యాలలో జీవించే పుళిందుల ప్రస్తావనలు అనేక గాథలలో విస్తారంగా కనిపిస్తాయి. వేటాడి సేకరించిన జంతువుల చర్మాలు, ఏనుగు దంతాలను ఈ పుళిందులు పట్టణం నుంచి వచ్చే వ్యాపారులకు విక్రయించేవారని కొన్ని గాథలద్వారా తెలుస్తుంది. ప్రాకృత గాథలలో ఈ పుళిందులు కారుమేఘాలను చూసి ఏనుగుల మంద అని సంబరపడేవారిగాను, ముత్యాలను కాదని గవ్వలను ఎంచుకొనే కల్లకపటం లేనివారిగాను కనిపిస్తారు. "వేటగాడు అతని కొత్తపెండ్లాము" అనే Motif లో (వివిధ గాథల మూలాంశం) అకలుషిత ప్రేమ, శృంగారేచ్ఛ అపురూపంగా వ్యక్తీకరింపబడుతుంది.
.
వింటిని చెక్కగా వచ్చిన పేళ్ళు
గాలికి సుడులు తిరుగుతూ
పైకి లేచిన దృశ్యం విజయపతాకంలా
ఆ వేటగాని భార్యకు పట్టిన అదృష్టాన్ని
అందరకూ చాటుతోంది. (207)
.
పై గాథ హాల విరచితం గా సప్తశతి లో కూడా ఉన్నది. కొత్తగా పెళ్ళయిన వేటగాడు భార్యతో మిక్కిలి అన్యోన్యంగా ఉన్నాడని చెప్పటానికి, రోజూ అతను తన బరువైన విల్లును (అంతబరువు మోయలేక) చెక్కి చెక్కి సన్నగా తేలికగా చేసుకొంటున్నాడు అనే సాదృశ్యం అనేక గాథలలో కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు బరువైన విల్లును ధరించి పులులు ఏనుగులను వేటాడిన ఆ వేటగాడు భార్యతో సరసాలలో మునిగిపోయి బరువైన విల్లును మోసే సత్తువను కూడా కోల్పోయడని అనటంలో వ్యంగ్యం కన్నా వారి అన్యోన్యతే ఎక్కువ ప్రతిబింబిస్తుంది.
.
సవతులంతా ఏనుగు కుంభస్థలాలలో
దొరికే ముత్యాలతో అల్లిన హారాలను ధరించగా
వేటగాని పడుచుభార్య నెమలి ఈకలు ధరించి
వారి మధ్య గర్వంగా నడుస్తోంది. (212)
.
ఇదే గాథ హాల సప్తశతిలో పొట్టిస అనే కవి పేరిట ఉంది. ఏనుగు కుంభస్థలాలోని ముత్యాలను (ఒకరకమైన గుండ్రని సున్నపు నిర్మాణాలు) సంపాదించటం వీరత్వానికి చిహ్నం. ఆ వేటగాడు ఏన్నో ఏనుగులను చంపి వాటినుంచి సేకరించిన ముత్యాలతో హారాలు అల్లి పాత భార్యలకు బహూకరించి ఉంటాడు. ఇక పడుచుదైన కొత్త భార్య భర్తను కొంగున కట్టేసుకొంది. భర్త వేటకు వెళ్ళటమే లేదు. ఏనుగుల వధా లేదు, ముత్యాల హారాలు లేవు. ఆమెకు దక్కుతున్నవి నెమలి ఈకలు మాత్రమే. అలా భర్త తన చుట్టూ తిరుగుతూ ఉండటం తన ఆడతనానికి దక్కిన గౌరవంగా గర్వంగా భావిస్తూ నెమలి ఈకలు మాత్రమే ధరించి సవతుల మధ్య తిరుగుతోన్నదట ఆ పడుచు పుళింద స్త్రీ.
.
ఆడ ఏనుగుల మంద
వేటగాని భార్య వక్షోజాలతో
“మీ దయ వల్ల మాకు వైధవ్యం సంక్రమించటం లేదు.
మీ కివే మా వందనాలు” అన్నది. (211)
ఒక సప్తశతి గాథలో - పుట్టింటికి వెళ్ళి తిరిగి వస్తూన్నపుడు దారిపొడవునా కానుగ చెట్ల ఆకులకు అంటుకొని ఉన్న మత్తగజాల మదజలాలను గమనించి- తన భర్త మరణాన్ని ముందే ఊహించిందట ఒక వేటగాని భార్య. వీరుడైన తన భర్త బ్రతికి ఉంటే ఏనుగులు అంత విశృంఖలంగా సంచరించగలిగేవి కావు అని ఆమె విశ్వాసం. ఒక స్త్రీ తన భర్త వీరత్వంపై ఉంచిన నమ్మకానికి ఉదాత్త వ్యక్తీకరణ ఇది. దాదాపు అలాంటి భావనే వజ్జలగ్గ పై గాథలో కూడా కనిపిస్తుంది.
.
అనేక ప్రాకృత గాథలలో జింకలను వేటాడే వేటగాని వర్ణనలు ఉంటాయి. వీటి ద్వారా అన్యోన్య దాంపత్యం, కరుణ, ప్రేమ వంటి భావాలనెన్నింటినో పలికించారు ప్రాచీన గాథాకారులు.
ఒక గాథలో కొత్తగా పెళ్ళయిన వేటగాడు జింకల జంటపై బాణం గురిపెట్టి భార్య గుర్తుకు రాగా బాణాన్ని క్రిందకు దించివేసాడనటంలో ఉదాత్తగుణం ఆనాటి కుటుంబ అనుబంధాలలోని ఆర్థ్రతను ఇన్ని వందల సంవత్సరాల తరువాతకూడా తడితడిగా ప్రకటిస్తుంది.
ఈ క్రింది గాథలో వేటగాడు మగజింకను బాణంతో కొట్టాడు. ఆడ జింకపై సంధించటానికి మరొక బాణం తీస్తుంటే, ఆడజింక అన్న మాటలట ఇవి.
.
ఓ వేటగాడా!
ఒక బాణం సరిపోతుంది కదా
ఎందుకు పొదిలోంచి మరొకటి తీస్తున్నావు
మా ఇరుదేహాలలో ఉండేది ఒకే ప్రాణం (217)
***
బాణం తగిలిన వృద్ధ హరిణం
భుజాలు ఎగవేస్తూ ఇలా అంటోంది
“గానం ఆపకు... పాడు
గొంతులో జీవం ఉన్నంతవరకూ
పాడుతూనే ఉండు” (218)
.
నిండైన జీవితాన్ని చూసి పండిపోయిన ఒక జింక చావును ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఎన్ని కష్టాలొచ్చినా గానం ఆగకూడదు, పాట కొనసాగాలి అనటం ఒక జీవితాదర్శంగా చెపుతున్నాడు గాథాకారుడు.
*
Source
Jayavallabha’s Vajjalaggam by M.V. Patwardhan
అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా

No comments:

Post a Comment