Tuesday, August 17, 2021

తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 2

 తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 2

ఆమ్రపాలి
.
వైశాలి నగరంలో ప్రమదావనంలో పనిచేసే తోటమాలికి ఒక మామిడిచెట్టు క్రింద ఓ చిన్నారి శిశువు దొరికింది. ఆ శిశువుకు అతడు అంబపాలి/ఆమ్రపాలి అని పేరు పెట్టి పెంచుకోసాగాడు. ఆమె అపురూపమైన సౌందర్యరాశిగా రూపుదిద్దుకొంది. ఆమెను పెండ్లాడాలని అనేకమంది యువరాజులు పోటీపడి వాదులాడుకొనేవారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారినపుడు- అంబపాలిని వేశ్యగామారి అందరికి ప్రేమను పంచుతూ జీవించమని పెద్దలు తీర్పుచెప్పారట. ఆ మేరకు అంబపాలి వేశ్యగా జీవనం సాగించి అపారమైన ధనాన్ని కూడబెట్టి నగరంలో ఉన్నతవర్గానికి చెందిన వ్యక్తిగా జీవించసాగింది. బింబిసార చక్రవర్తి ద్వారా అంబపాలి కుమారుడిని పొందింది. ఒకనాడు అంబపాలి గౌతమ బుద్ధుని బోధనలు స్వయంగా విని, బౌద్ధ బిక్షుణి గా మారి సంఘారామ జీవనం ప్రారంభించింది. తన సంపదలను సంఘపరం చేసింది. గొప్ప ఆరామాన్ని నిర్మించింది. తధాగతుడు నిర్వాణానికి నాలుగు నెలల ముందు అంబపాలి నిర్మించిన ఆరామంలో కొన్నాళ్ళు బసచేసాడు.
అంబాపాలి వేశ్య. అంతఃపురవాసినిగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించింది. అన్నీ పరిత్యజించి బుద్ధుని బోధనల ప్రభావంతో ఆమె వ్రాసిన ఒక గాథలో అందం శాశ్వతం కాదు అనే జీవితసత్యం ప్రకటిస్తుంది. ఇది ధర్మమార్గంలోకి ప్రజలను ఆకర్షించటానికి వ్రాసినదిగా భావించాలి.
.
ఒకప్పుడు నా కురులు
గండుతుమ్మెదల రంగులో నల్లగా, ఒత్తుగా ఉండేవి
నేడు
జనపనార వలె వడిలిపోయి ఉన్నాయి
ఒకప్పుడు నా కొప్పునిండా పూలుండేవి
తలంతా సుగంధ పేటికలా పరిమళాలు చిందేది
నేడు
కుందేలు ఉన్నివలే దుర్గంధమోడుతోంది
ఒకప్పుడు నా కనుబొమలు
నెలవంకల వలే కాంతులీనుతూ ఉండేవి
నేడు
అవి వాలి, ముడుతలు పడి ఉన్నాయి.
ఒకప్పుడు నా కనులు
వజ్రాలవలే తళుక్కుమంటూ మెరిసేవి
నేడు
అవి ఎవరినీ వెనక్కి తిరిగి చూసేలా చేయటం లేదు
ఒకప్పుడు నా గొంతు
తోటలో సంచరించే కోయిల వలే ఉండేది
నేడు
బీటలుతీసి, పెళుసు బారి
నా వయసును స్పష్టంగా పలికిస్తూ ఉంది
ఒకప్పుడు నా వక్షోజాలు
అందంగా, ఉన్నతంగా గుండ్రంగా ఉండేవి
నేడు
అవి ఖాళీ తోలు సంచుల్లా వేలాడుతున్నాయి
ఒకప్పుడు నా పాదాలు
మెత్తని దూదికూరినట్లు మృదువుగా ఉండేవి
నేడు
అవి పగుళ్ళుతీసి పుచ్చిపోయాయి
చూసావుగా నా దేహం ఎలాగ శిథిలమైందో
నేడు ఇది
బాధలు వసించే చోటు
పెచ్చులు రాలిపోతున్న
ఒక జీర్ణ గృహం
సత్యాన్ని పలికేవాని బోధనలు ఇవి (252-270)
.
ఏ మతంలోనైనా ఉన్మత్తతలకు దారితీసే ఐహిక సుఖాల పట్ల విముఖతను పెంచేలా బోధనలు ఉంటాయి. బుద్ధిజం మినహాయింపు కాదు. ఏమిజన్మంబు ఏమి జీవనంబు; మానవా ఏమున్నది ఈ దేహం; తోలుతిత్తి ఇది తుటులు తొమ్మిది … లాంటి వైరాగ్య గీతాలలోని భావధారకు 2600 ఏండ్లక్రితం అంబాపాలి రచించిన ఈ గీతమే మూలం అనటానికి సందేహించక్కరలేదు.
గాథల అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా
.
Ref.
Poems of the first Buddhist women by Charles Hallsey
THE FIRST BUDDHIST WOMEN By Susan Murcot



No comments:

Post a Comment