వజ్జలగ్గ – గాథలు పార్ట్ 1
.
వజ్జలగ్గ అనేది గాథాసప్తశతి లానే అందమైన ప్రాకృత గాథల సమాహారం. ఈ సంకలనంలోని గాథలు CE 750-1337 మధ్య కాలానికి చెందినవి. వజ్జలగ్గలోని భాష శ్వేతాంబర జైనులు వాడే మహారాష్ట్ర ప్రాకృతము. జైన పండితుడైన జయవల్లభుడు ఈ గాథలను సేకరించాడు అందుకే వజ్జలగ్గ కు జయవల్లభమనే పేరు కూడా ఉంది. జయవల్లభుడు మొదటగా 700 గాథలను సేకరించి వాటిని 48 విభాగాలుగా వర్గీకరించి వజ్జలగ్గగా కూర్చాడు. మానవ జీవితాన్ని ప్రభావితం చేసే ధర్మ, అర్ధ, కామ అనే త్రివర్గాల ఆధారంగా ఈ విభజన ఉంటుందని జయవల్లభుడే ఒక గాథలో చెప్పాడు. ఇది జైన రచన కనుక మోక్షం అనే భావన లేకపోవటం గమనార్హం.
.
ధర్మ అంటే కర్తవ్యము, నైతికత; అర్ద అంటే ప్రాపంచిక విజయాలు; కామ అంటే ఐహిక సుఖాలు. వజ్జలగ్గ తొలికూర్పులో ధర్మ అనే అధ్యాయంలో 63 గాథలు, అర్ధ పేరుగల అధ్యాయంలో 347 గాథలు, కామ ప్రకరణంలో 342 గాథలు ఉండేవి. కాలానుగుణంగా అనేక గాథలు వచ్చి చేరటం తో మొత్తం 95 విభాగాలుగా 990 గాథలుగా వజ్జలగ్గ విస్తరించింది. హాలుని గాథాసప్తశతి, గౌడవహ, గాథాకోశ లాంటి ప్రాకృత రచనలలోని అనేక గాథలు వజ్జలగ్గలో పునరుక్తం అయ్యాయి.
.
వజ్జలగ్గలోని గాథలకు హాలుని సప్తశతిలోని గాథలకున్నంత ప్రాచుర్యం రాలేదు. అయినప్పటికీ కొన్ని వజ్జలగ్గ గాథలను ఆనందవర్ధనుడు, మమ్మటుడు వంటి ఆలంకారికులు తమ శాస్త్రాలలో ఉదాహరణలుగా ప్రస్తావించారు.
వజ్జలగ్గ కావ్యానికి 1969 లో Prof. M.V. Patwardhan ఇంగ్లీషు అనువాదం వెలువరించారు. ఈ క్రింది గాథల అనువాదాలు పై పుస్తకం నుంచి చేసినవే.
***
మంచి వ్యక్తికి కోపంరాదు,
వచ్చినా మనసులో చెడు తలపులు పెట్టుకోడు
పెట్టుకొన్నా వాటిని ఎన్నడూ వ్యక్తం చేయడు
ఒకవేళ చేసినా, ఆ పనికి సిగ్గుపడిపోతాడు (34)
.
పై గాథలో సజ్జనుడు ఎలా జీవిస్తాడనే విషయాన్ని చెపుతున్నాడా ప్రాచీన గాథాకారుడు. తమిళకవి తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురల్ కావ్యం భారతదేశానికి సంబంధించి నైతిక నియమావళిని చెప్పే ప్రాచీన రచనగా గుర్తిస్తున్నారు. ( ఇతను CE 5వ శతాబ్దం/ BCE 3వ శతాబ్దం అని రెండు భిన్నమైన వాదనలు కలవు). తిరువళ్ళువర్ ఒక జైన పండితుడు. తిరుక్కురల్ కావ్యంలో కూడా వజ్జలగ్గ లో లానే ధర్మ, అర్ధ, కామ అనే విభాగాలు ఉంటూ కొంతమేరకు భావసారూప్యం కలిగి ఉంటుంది.
.
దక్షిణభారతదేశంలో జైనులతోపాటు వారి రచనలు కూడా చాలామట్టుకు అదృశ్యమైనాయి. తమిళులు మాత్రం జైనులను కొర్రువేసి నిర్మూలించినా వారి రచనలను నేటికీ నిలుపుకొని (సంగం సాహిత్యం) తమది అతి ప్రాచీన సంస్కృతిగా ప్రచారించుకొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ భారతదేశ ప్రాచీన సంస్కృతి నిర్మాణంలో జైన పండితుల పాత్ర, ప్రాకృతభాష సృష్టించిన సాహిత్యం రెండూ అతి ముఖ్యమైనవి.
***
దారిద్ర్యమా!
నీవల్ల కలిగే కష్టాలను, ఇక్కట్లను
ఆత్మగౌరవం కలిగినవారు సాధారణంగా
బయటపడనీయరు.
బంధువులు వచ్చినప్పుడో పండుగ రోజునో
విపత్తు సమయాలలోనో
అవే బయటపడిపోతుంటాయి. (138)
***
దారిద్ర్యమా!
నీకు వందనాలు.
నీవు చేసిన మేలు వలన
నేను ఎవరికీ కనిపించకపోయినా
అందరూ నాకు కనిపిస్తున్నారు (140)
పై రెండుగాథలలో పేదరికం అనాదిగా మానవులకు ఎన్నెన్ని పాఠాలు నేర్పుతోందో కదా అనిపించకమానదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనచుట్టూ ఉన్నవారి నిజస్వరూపాలు మనకు తెలుస్తాయి అనే మాట ఎప్పటిదీ?
***
కాళ్ళకు అడ్డంపడుతున్న తన పేగుల్ని తప్పించుకొంటూ
ఒక చేత ఖడ్గం ధరించి మరో చేత్తో
వాలిపోతున్న శిరస్సును పైకెత్తి నిలుపుకొంటూ
మీదపడే శత్రువులపై వీరుడు ప్రతిదాడి చేస్తున్నాడు (167)
***
యుద్ధభూమిలో స్పృహతప్పి పడిపోయిన
యజమాని పక్కనే నేలకొరిగిన యోధుడు
రాబందులు తనపేగుల్ని బయటకు పీకుతున్నప్పటికీ
వాటి రెక్కల కదలికలవల్ల తన స్వామి మొఖానికి గాలి తగిలి
అతనికి మెలకువ వస్తే బాగుణ్ణు అని కోరుకొంటున్నాడు (177)
.
పై రెండు గాథలలో ధర్మాచరణ వర్ణించబడుతోంది. ఆనాటి సమాజంలో ప్రతిఒక్కనికి ఒక ధర్మం నిర్ధేశించబడింది. ఆ ధర్మం ప్రకారం అతను జీవించాల్సిందే. వేరే మార్గం లేదు. గుణకర్మలను బట్టి ఈ వర్ణధర్మాలు మార్చుకోవచ్చు అంటూ పుస్తకాలలో ఉన్నప్పటికీ వాస్తవికంగా అలాంటి వెర్టికల్ మొబిలిటీ జరిగిందా అనేది అనుమానమే. 167 వగాథలో ఒక వ్యక్తి తాను చనిపోయే చివరి క్షణం వరకూ తన ధర్మాన్ని నిర్వర్తించాల్సిందే అనే సత్యాన్ని తెలియచేస్తుంది. 177 వ గాథలో తన ప్రాణాలు పోతున్నా సరే యజమాని క్షేమాన్నే కోరుకోవాలి అంటు స్వామిభక్తిని రొమాంటిసైజ్ చేసి చెపుతున్నాడా ప్రాచీన కవి.
బొల్లోజు బాబా
Source
Jayavallabha’s Vajjalaggam by M.V. Patwardhan
No comments:
Post a Comment