తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 6
.
సాధారణ జీవనం సాగించే స్త్రీలు బౌద్ధమతం పట్ల ఆకర్షించబడటానికి కారణాలు వివిధ రకాలుగా ఉన్నాయి. స్వేచ్ఛ, జన్మరాహిత్యాన్ని కోరుకోవటం అనేక గాథలలో ప్రధానంగా కనిపిస్తుంది. ఆ తరువాత దుఃఖం, వియోగం నుండి విముక్తినొందటానికి కొందరు, ఐహిక సుఖాలపట్ల వైముఖ్యం పొంది మరికొందరు, క్రతువులు వ్రతాల పట్ల అయిష్టతతో ఇంకొందరు అంతవరకూ పాటిస్తున్న జైన లేదా వైదిక సాంప్రదాయాలను త్యజించి బౌద్ధాన్ని ఎన్నుకొన్నట్లు ఈ గాతలద్వారా తెలుస్తుంది.
బౌద్ధమతంవైపు ప్రజలు ఆకర్షితులవటం ఒకరకంగా గొప్ప చారిత్రిక చిక్కుముడి. మిత్తా, నందుత్తరలు చెప్పిన ఈ గాథలు ఆ చిక్కుముడిని కొంత విప్పే ప్రయత్నం చేస్తాయి.
మిత్తా
ఈమె క్షత్రియ కుటుంబంలో జన్మించింది. ఈమెకు మహాప్రజాపతి గౌతమి ఈమెకు దీక్ష ఇచ్చింది. కఠోర సాధనతో ఈమె అనతికాలంలోనే గొప్ప భిక్షుణిగా పేరుతెచ్చుకొంది.
ఉత్తమ జన్మ కొరకు
ఎన్నో ఉపవాసాలు ఉన్నాను
అష్టమి, ఏకాదశి, చతుర్ధశి, పౌర్ణమి
ఇంకా అన్ని పర్వదినాలలోను
కఠోరమైన ఉపవాసాలు ఉండేదాన్ని
ఈ రోజు
శిరోముండనం గావించుకొని
కాషాయవస్త్రాలు ధరించి,
ఒక పూటే తింటున్నాను
ఉత్తమ జన్మ పట్ల నా మనసులో
ఏ బెంగా లేదిక . (31-32)
***
ఇదే మోక్షమార్గమని వైదిక ధర్మం ఎన్నో క్రతువులను నిర్ధేశించింది. వాటిని పాటించకపోతే ఏమౌతుందో అనే ఆందోళన, భయం సహజం. పై గాథలో ముత్తకు అలాంటి ఆందోళనలనుండి ఉపశమనం దొరికింది. నిజానికి ఒకపూటే తింటూ మునుపటికన్నా ఎక్కువ నిరాహారంగా ఉన్నది మిత్త. బౌద్ధం జీవన్ముక్తి పేరుతో చెప్పిన జన్మరాహిత్యభావన మిత్తలాంటి విశ్వాసులను ఆకర్షించి ఉంటుంది. పరలోకం కాదు అన్నీ ఇక్కడే అనే ఆలోచనతో వారు బెంగ, ఆందోళనా లేని జీవనాన్ని సాగించి ఉంటారు.
***
.
నందుత్తర
నందుత్తర ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె మొదట జైన మతాన్ని స్వీకరించి దేశమంతా తిరుగుతూ ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ ఎంతో మందిని ఓడించింది.. ఒకరోజు బుద్ధుని ప్రియశిష్యుడైన మొగ్గల్లన తో చర్చల్లో పాల్గొని వాదనలో ఓడిపోయి బౌద్ధాన్ని స్వీకరించి అనతికాలంలోనే సంఘంలో గొప్ప సన్యాసినిగా పేరుతెచ్చుకొన్నది
.
అగ్నిని, సూర్యచంద్రులని
దేవతలను భక్తితో ఆరాధించాను
పవిత్రనదులలో స్నానమాచరించాను
ఎన్నో పూజలూ వ్రతాలు చేసాను
నేలపై పడుకొన్నాను
రాత్రిపూట ఉపవాసం ఉండేదానను
మరోపక్క
ఆభరణాలు ధరిస్తూ,
సుగంధద్రవ్యాలు పూసుకొంటూ
శరీరానికి తైలమర్ధనాలు చేయించుకొంటూ
విషయభోగాసక్తిని త్యజించలేదు
ఎప్పుడైతే సన్యసించానో
ఎప్పుడైతే ఈ దేహ నిజస్వరూపాన్ని దర్శించానో
కోర్కెలు, వాంఛలు, లాలసలు అన్నీ నశించాయి
సంకెళ్ళన్నీ తెంచబడ్డాయి
హృదయం ప్రశాంతంగా ఉంది. (87-97)
.
Satipatthana-Sutta లో మానవదేహం మరణించాకా ఏ విధంగా కుళ్ళిపోతుందో దశలుగా వర్ణించబడింది. కొత్తగా సన్యసించిన వారిని కుళ్ళిపోతున్న శవాలను మధ్య కూర్చుబెట్టి ధ్యానం చేయించే వారట. దాని వల్ల ఈ దేహంపై మమకారం, అనురక్తి నశించి కోర్కెలను జయించగలరని విశ్వాసం. పై గాథలో నందుత్తర “ఎప్పుడైతే ఈ దేహ నిజస్వరూపాన్ని దర్శించానో” అన్న వాక్యం బహుశా ఆ విధంగా క్రుళ్ళిపోతున్న మానవదేహాన్ని పరిశీలించి నా దేహమూ కూడా కొంతకాలానికి ఇంతే కదా అని వైరాగ్యాన్ని పొంది థేరీగా మారి ఆథ్యాత్మిక శాంతిని పొంది ఉంటుంది
గాథల అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా
.
Ref.
Poems of the first Buddhist women by Charles Hallsey
THE FIRST BUDDHIST WOMEN By Susan Murcot
No comments:
Post a Comment