Tuesday, August 10, 2021

వజ్జలగ్గ – గాథలు పార్ట్ 4



వజ్జలగ్గ – గాథలు పార్ట్ 4
#వజ్జలగ్గ
.
ప్రాచీన భారత సమాజంలో స్త్రీలు పురుషులతో సమానమైన గౌరవాన్ని పొందారు. ఎవరైనా భర్తను కోల్పోయినా భర్త ఉండగా అక్రమ సంబంధం కలిగి ఉన్నా ప్రాయశ్చిత్తం ద్వారా ఆ దోషాన్ని పోగొట్టుకొని సాధారణ జీవనం సాగించవచ్చు అని హిందు ధర్మశాస్త్రాలు చెప్పాయి. వితంతు పునర్వివాహం కూడా ఆనాటి సమాజానికి వింత కాదు. భారతంలోని దమయంతి పునర్వివాహ స్వయంవర ఉదంతం దీనికి తార్కాణం. పరాశర, నారద స్మృతులలో కూడా పునర్వివాహ ప్రస్తావనలు ఉన్నాయి.
కర్మకాండలు, క్రతువులు జరపవలసి వచ్చినప్పుడు తప్పని సరిగా దంపతులు పాల్గొనాలి కనుక అత్యవసర పరిస్థితులలో ముప్పై ఏండ్ల పురుషుడు పన్నెండేళ్ళు దాటిన బాలికను మాత్రమే వివాహం చేసుకోవాలని, అదే విధంగా 24 ఏండ్ల యువకుడు 8 ఏండ్లు దాటిన బాలికను మాత్రమే పెండ్లాడాలని మనుసంహిత చెప్పింది. ఎలాంటి వివాహమైనా ఆ బాలిక రజస్వల అయి యుక్తవయసువచ్చాక మాత్రమే కాపురానికి పంపాలని కూడా చెప్పబడింది. ఆ మేరకు చూసినప్పుడు ఆనాటి సమాజంలో బాల్యవివాహాలు విశృంఖలంగా జరిగినట్లు చెప్పలేం., వివాహ వయస్సు అబ్బాయిలకు 25 ఏండ్లు, అమ్మాయిలకు 16 ఏండ్లు ఉండాలని వైద్యగ్రంధమైన శుశ్రుత సంహిత నిర్ధేశించింది.
BCE 200 నుంచి CE 150 మధ్య దాదాపు 350 సంవత్సరాలు భారతదేశం మరీముఖ్యంగా ఉత్తరభారతదేశం అత్యంత క్లిష్టమైన చీకటి కాలాన్ని చూసింది. మొదట గ్రీకులు తరువాత సింథియన్ లు, పార్థియన్ లు భరత ఖంఢంపై దండయాత్రలు జరిపారు. ఈ దండయాత్రలలో మొత్తం హిందూ జనాభాలోని 50 శాతం మంది నిర్మూలించబడ్డారు. వీరిలో సగం మంది చంపబడితే మిగిలినవారిని బానిసలుగా ఎత్తుకుపోయారు. ఈ కాలంలోనే ఓడిపోయిన స్థానిక జనాభా బానిసత్వానికి గురయ్యింది. అప్పుడే స్త్రీలు బానిసకొక బానిసగా మార్చబడ్డారు.
(అలా విపరీతమైన అంతర్గత ఒత్తిడికి గురైన హిందూ సమాజం. అగ్రెసివ్ నెస్ ను పొంది శాంతి, పరిత్యాగాలను బోధించే బౌద్ధ జైనాలను ద్వేషించి వాటికి దూరంగా జరిగిందనే ఒక వాదన కలదు. అంతవరకూ సన్యాసిగా మారి అన్నీ పరిత్యజించి తపస్సు చేసుకోవటం గొప్పదిగా చెప్పబడినప్పటికీ - వార్ధక్యంలో తప్ప వయసులో ఉన్నప్పుడు సన్యసించినా వారసులను ఇవ్వకుండా ఈ ఐహిక బంధాలను పరిత్యజించినా అలాంటి వ్యక్తులను శిక్షించాలని -అర్ధ శాస్త్రంలో కౌటిల్యుడు గట్టిగా చెప్పాడు. )
ఒకప్పుడు స్త్రీలకు కూడా ఉపనయనం ఉండేది. అది CE 200 నుండి ఆగిపోయింది. వివాహ వయస్సు తగ్గించబడింది. దానివల్ల వారికి విద్యలు దూరమయ్యాయి. ఈ మూడు కారణాల వల్ల స్త్రీ యొక్క స్థానం క్రమేపీ క్రిందకు జారింది.
ఈ సందర్భంలోనే స్త్రీలకు పాతివ్ర్యత్యం గురించి; జీవితపర్యంతం పరాధీనంగా బ్రతకటమే ఆదర్శంగాను; భర్త ధూర్తుడైనా అతన్నే పూజించాలని; భర్త తనకు అనుకూలవతికాని భార్యను త్యజించవచ్చు కానీ భార్యకు ఆ హక్కు లేదని లాంటి నీతి సూత్రాలను స్మృతికారులు బోధించటం మొదలుపెట్టారు. స్త్రీ అంటే పుత్రుడను ఇచ్చే సాధనంగా మార్చివేసారు.
ఈ కాలానికే చెందిన వజ్జలగ్గలోని కొన్ని గాథలు ఉత్తమ ఇల్లాలు ఎలా ఉండాలో చెపుతాయి. ఈ గాథలు స్త్రీలను పురుషాధిక్యత అనే చట్రంలో బిగించటానికి సాహిత్యరూపంలో ఉన్న సామాజిక సూత్రాలు అని సులభంగానే పోల్చుకొనవచ్చును.
***
అందరూ తృప్తిగా భోంచేసాకా మిగిలినవి
ఆమె తింటుంది
సేవకులతో సహా అందరూ నిదురించాక
ఆమె నిద్రకుపక్రమించి
అందరికన్నా ముందరగా నిద్రలేస్తుంది
ఆమె ఇంటి ఇల్లాలు కాదు ఆ గృహ లక్ష్మి (455)
.
ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు ఆ ఇల్లాలు
చేతి గాజులమ్మి తన పేద భర్తకు
గౌరవభంగం కలగకుండా చూసిందట.
ఆమె ఔదార్యానికి ఊరు ఊరంతా కన్నీరు పెట్టుకొంది. 458
.
గుణమే మిన్న అని నమ్మే పేద మగని పరువు నిలపటం కొరకు
ఆడంబరాలు, పటాటోపం ప్రదర్శించే తన పుట్టింటివారితో
గిల్లికజ్జాలు పెట్టుకొని తెగతెంపులు చేసుకొందట
ఆ ఉత్తమ ఇల్లాలు. (462)
.
పిల్లలందరూ భోజనాలు చేసాకా
మిగిలిన ఆహారపదార్ధాలను
తనకు ఆకలిగా ఉన్నప్పటికీ
ఆ ఇల్లాలు యాచకులకు బిక్షంగా వేస్తోంది
కుటుంబగౌరవం నిలబెట్టటం కొరకు (461)
***
చక్కగా చూర్ణం చేసి సరైన పాళ్ళలో కలిపి
సిరా తయారు చేయటం నీకు రాదు,
లేఖినిని సరిగ్గా పట్టుకోలేకపోతున్నావు, తప్పులు రాస్తున్నావు
మూర్ఖుడా! నీవు ప్రజ్ఞకలిగిన లిపికారుడవు కాదు
అందమైన పత్రాలను పాడుచేసేలా ఉన్నావు
నీవింక దయచేయి. (508)
ఒకప్పుడు లేఖకులు ఊరూరా తిరుగుతూ ఊరి పండితుల వద్ద ఉండే వివిధ గ్రంధాలకు పుత్రికలను పుట్టిస్తూ (నకళ్ళు తీయటం) జీవనం సాగించేవారు. రామాయణ భారతాదులకు నకళ్ళుతీయించి పంచిపెట్టటం ఒక పుణ్యకార్యంగా ఉండేది అప్పట్లో. అలాంటి లేఖన పని సరిగ్గా చేతకాని ఒక లేఖకుని గురించి పైగాథ తెలుపుతుంది.
ధార్మిక కావ్యాల నకళ్ళు తీయించటానికి అవసరమయ్యే తాళపత్రాల కొరకు ఊరిలో తాటి వనాలను పెంచి ఆలయాలకు దానంగా ఇచ్చినట్లు పలు శాసనాలలో కనిపిస్తుంది. ఉదాహరణకు: విమలపాత్రుడు అనే దాత CE 1433 లో నాలుగు లక్షల అరవై వేల తాళ్ళను నాటించి ఆ సందర్భముగా పిఠాపురం కుంతీమాథవ స్వామి ఆలయంలో వేయించిన ఒక శాసనంలో – ప్రజలకు బుద్దిన్ని, మతివిశేషమున్ను ధర్మమున్ను యీ తాడాకుల నే పంచాంగాలు పురాణాలు శాస్త్రాలు ధర్మకర్తలు వ్రాసి చదువంగాను//సకలధర్మాలకున్ను తాంటి వృక్షమే మూలము…. అని ఉన్నది.
.
జ్యోతిష్కుడు బలపాన్ని చేత ధరించి
నగరవీధుల్లో సంచరిస్తున్నాడు,
అతనికి గ్రహగతులన్నీ తెలుసు
ఎవరైనా తమ గ్రహచారం అడిగితే
అతను లెక్కించి చెబుతాడు. (497)
వేదకాండలకు శుభ ముహూర్తములు నిర్ణయించేందుకు వేదాలకు ఉపాంగంగా జ్యోతిష్యశాస్త్రం ఏర్పడింది. వరాహమిహిరుడు, ఆర్యభట్టారకుడు, పరాశరుడు, కల్యాణవర్మ లాంటి వారు ఖగోళశాస్త్ర పరిశీలనలను జ్యోతిష్యశాస్త్రానికి అన్వయించి ఈ రంగాన్ని తీర్చిదిద్దారు.
ఈ జ్యోతిష్యశాస్త్రం హిందూ సమాజాన్ని సంపూర్ణంగా శాసించిందనే చెప్పాలి. రాజుల స్థాయిలో యజ్ఞయాగాదులకు, యుద్ధాలకు, మంచి చెడ్డలకు ముహుర్తాలు, శాంతులు నిర్ణయించటమే కాక సామాన్యుల జీవితాలలోకి కూడా జ్యోతిష్యం ఏ మేరకు చొచ్చుకుపోయిందో పై గాథ తెలియచేస్తుంది. నగరవీధుల్లో జ్యోతిష్యం ఒక అంగడి సరుకుగా ఉంటూ ఎంతమంది జీవితాలను ప్రభావితం చేసి ఉంటుందో! ఎంతమందికి ఉపాధి కల్పించి ఉంటుందో ఊహింపశక్యం కాదు.
Source
Jayavallabha’s Vajjalaggam by M.V. Patwardhan
అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా

No comments:

Post a Comment