కల్నల్ కాలిన్ మెకంజీ
.
(కాలిన్ మెకంజీ ద్విశతవర్ధంతి సందర్భంగా)
కాలిన్ మెకంజీ 1754లో స్కాట్లాండ్ లోని Stornoway, Isle of Lewis లో జన్మించాడు. 2 సెప్టెంబర్ 1783 న ఈస్టిండియా కంపనీ ఉద్యోగిగా మద్రాసులో అడుగుపెట్టాడు. అది మొదలు 1821 లో కలకత్తాలో చనిపోయేవరకూ మెకంజీ ఇండియాలోనే ఉన్నాడు. 1784-90 ల మధ్య ఇతను రాయలసీమ-కృష్ణా పరిసర ప్రాంతాలలో కంపనీ సైనిక ఇంజనీరుగా పనిచేసాడు. 1799 లో టిపు సుల్తాను ఓటమి కారణంగా కంపనీ పరమైన కర్ణాటక జిల్లాలను, నిజాం దఖలు పరచిన సీడెడ్ జిల్లాలను సర్వే చేసే బాధ్యతను కంపనీ మెకంజీకి అప్పగించింది. ఆ సమయంలో సర్వే నిమిత్తం కృష్ణా దిగువ ప్రాంతాలను విస్త్రుతంగా పర్యటించాడు. ఏలూరుకు చెందిన కావలి సోదరుల సహాయంతో మెకంజీ అనేక స్థానికచరిత్రలను, శాసనాలను సేకరించాడు. అప్పటివరకూ హిందువులకు చరిత్రను దాచుకోవాలనే శ్రద్ధలేదు అని వాదించిన బ్రిటిష్ చరిత్రకారులను గ్రామకరణాలవద్ద ఉండే కవెలకట్టలలో (తాటియాకు పత్రాలు) ఆ గ్రామచరిత్ర, సరిహద్దులు, పాలించిన స్థానికనాయకుల వివరాలను స్థానికులు భద్రపరచుకొన్నారన్న విషయం, విస్మయపరచింది. వీటిని కైఫియ్యతులు అన్నారు. తాను సేకరించిన చారిత్రిక సమాచారాన్ని తన మిత్రులతో తరుచూ పంచుకొంటూ చర్చిస్తూ ఉండేవాడు మెకంజీ. హిందువుల చరిత్రను వ్రాయటానికి హిందువుల మూలాలను శోధించాలి తప్ప పెర్షియన్ మూలాలను కాదు అని మెకంజీ వాదించేవాడు.
ఈస్ట్ ఇండియా కంపనీ 1810 లో ఇతనిని మద్రాసు ప్రెసిడెన్సీ సర్వేయర్ జనరల్ గా నియమించింది. 1811 లో జావా ద్వీపంపై కుంఫణీ సైన్యం దండయాత్ర చేసినపుడు మెకంజీ కూడా ఉద్యోగ రీత్యా కంపనీ సైన్యాన్ని వెంబడించవలసి వచ్చింది. ఎందుకైనా మంచిదని వీలునామా రాసి పెట్టాడు. అక్కడ 18 నవంబరు 1812న డచ్ సంతతికి చెందిన Petronella jacomina Bartels ను వివాహమాడాడు.
1815లో తిరిగి ఇండియా చేరుకొన్నాకా మెకంజీ భారతదేశ సర్వేయర్ జనరల్ గా నియమించబడ్డాడు. కలకత్తా సెయింట్ జార్జి కోటలో ఇతని ఆఫీసు. అక్కడకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ – అప్పటిదాకా ఆంధ్ర, తమిళ, కర్ణాటక ప్రాంతాలలో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించటం కోసం మద్రాసులో ఉండేందుకు కంపనీ అనుమతి తీసుకొని 1817 వరకూ మద్రాసులోనే ఉన్నాడు.
1817 లో మెకంజీ తన మిత్రుడైన అలెగ్జాండర్ జాన్ స్టన్ కు వ్రాసిన ఒక లేఖలో ఈ స్థానిక చరిత్రలను సేకరించటంలో తన ఉద్దేశాలను, నిబద్దతను, కష్టాలను ఇలా చెప్పుకొన్నాడు .
1. 1799 లో కంపనీకి సంక్రమించిన ప్రాంతాల హద్దులను నిర్ణయించే పని నాకు అప్పగించినపుడు- సరిహద్దులే కాక ఆ ప్రాంత చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని కూడా అధ్యయనం చేస్తానని నేను చెప్పిన ప్రణాళికను కంపనీ ఆమోదించి ముగ్గురు గుమస్తాలను, ఒక నాచురలిస్ట్ ను నాకు సహాయకులుగా ఇచ్చింది. కానీ 1801 లో వీరిని తొలగించటంతో నా ప్రణాళికలన్నీ భగ్నమయ్యాయి. ఈ ప్రాంతాల జీవరాశిని రికార్డు చేద్దామనే నా ఆలోచన ఫలించలేదు. అంతే కాక నా జీతం, నాకు ఇచ్చే కంటింజెన్సీ డబ్బులు కూడా తగ్గించేసారు. దీనివల్ల నా ప్రణాళిక దాదాపు కుంటుపడింది.
2. అయినప్పటికీ నేనీ పనులు చేయగలిగాను
జైనులు, బుద్ధులు వేరు వేరు అని నిర్ధారించగలిగాను (అప్పట్లో ఈ మతాలను హిందూ మతంలో అంతర్భాగాలుగా భావించేవారు); ప్రాచీన మతసాంప్రదాయాలైన లింగాయత్, శైవం, పాండరం, మఠాలు వివిధ శాఖలు వాటి పుట్టుపూర్వోత్తరాలు స్పష్టపరిచాను;
సుమారు మూడు వేల వివిధ శిలా శాసనాలు, తామ్రపత్రాలకు నకళ్ళు తీయించాను; ఢిల్లీ నుంచి కేప్ కొమరిన్ దాకా ఉన్న Veeracul, Maastie cull లలోని పురాతనజాతుల సంస్కృతిని వెలికితీసాను.
(పైన చెప్పిన అన్ని అంశాలను మెకంజీ మొత్తం 12 రీసెర్చ్ పేపర్లుగా ఆసియాటిక్ జర్నల్ లో ప్రచురించాడు)
3. కొన్నాళ్ళు మద్రాసులోనే ఉంచమని కోరటానికి కారణాలు ఈ లేఖలో ఇలా చెప్పుకొన్నాడు మెకంజీ – “నాకు సహాయకులుగా ఉన్న వ్యక్తులతో నా అనుబంధం వ్యక్తిగతమైనది. వాళ్ళు ఈ ప్రాంతపు స్థానికులు, కలకత్తాకు నాతో పాటు వాళ్ళు వచ్చి జీవించలేరు. మేము సేకరించిన విషయాలను కేటలాగ్ చేయాలి. చాలా వాటిని అనువదించాలి. ఇది కలకత్తాలో సాధ్యపడదు. నేను ఇంగ్లాండు వెళ్ళేలోగా కనీసం స్థానిక వ్రాతప్రతులు, పుస్తకాలు, శాసనాల సంక్షిప్తసమాచారాన్ని పుస్తక రూపంలో చూడాలని నా కోరిక. దీనికి నా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. కనీసం విద్యావంతులకు తదుపరి పరిశోధనలకు వీలుగానైనా వీటిని కేటలాగ్ చేయించాలి.
***
అలా ఇంగ్లాండు వెళ్లాలని ఆశపడ్డ మెకంజీ పాపం వెళ్ళనే లేదు. మెకంజీ సేకరణలు శిధిలమౌతున్నాయని గమనించిన సి.పి. బ్రౌన్ 1840లలో సుమారు 419 వాల్యూములకు నకళ్ళు తయారు చేయించాడు. వాటికి మరలా తిరిగి 1940-65ల మధ్య మరోసారి నకళ్ళు తీయించటం జరిగింది . ఆంధ్రప్రదేష్ ఆర్చైవ్స్ విభాగం వారు 1970 లలో మెకంజీ సేకరణలను మైక్రోఫిల్ములుగా మార్చారు. నేడు మద్రాసు లైబ్రేరీలో ఉన్నతెలుగు మెకంజీ కైఫియ్యతుల వ్రాతప్రతులు చదవటానికి వీల్లేని విధంగా పూర్తిగా పాడయిపోయాయి.
****
మెకంజీ సేకరణా విధానం
మెకంజీకి భారతీయ భాషలు రావు. దీనికి కారణం ఇతని ఉద్యోగమే. మెకంజీ ఒక సర్వేయరు. ఇతని ఉద్యోగం విపరీతమైన శారీరిక శ్రమ, నిత్యం ప్రయాణాలతో కూడుకొని ఉండేది. ఒక చోట స్థిరంగా, స్థిమితంగా కూర్చుని గురుముఖంగా బారతీయ భాషలను అధ్యయనం చేసే అవకాసం అతనికి ఎన్నడూ రాలేదు. భారతీయభాషలు నేర్చుకోలేకపోవటం తన బలహీనత అయినప్పటికీ తనవద్ద నున్న పండితులు బహుభాషాకోవిదులు కనుక ఆ లోపం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు అని చెప్పుకొన్నాడు మెకంజీ.
సర్వే అనేది స్థానికంగా వెళ్ళి చేయాల్సినపని. అందువలన ఇతనికి ఆయాప్రాంతాలలో స్వయంగా పర్యటించే అవకాశం వచ్చింది. దీనిని వినియోగించుకొని స్థానిక గ్రామకరణాల వద్ద ఉండే కవెలకట్టలలోని గ్రామ చరిత్రలను, స్థానికంగా లభించే తాళపత్ర గ్రంధాలను సేకరించాడు. వివిధ ఆలయశాసనాలను చూసి వాటి ప్రతులను తయారుచేయించాడు. శిల్పాలు శిధిలమౌతున్న ప్రాచీనకట్టడాల చిత్రాలు గీయించటం లాంటి పనులకు ఎక్కువ విలువ ఇచ్చేవాడు. గ్రామాలనుంచి సేకరిస్తున్న కైఫియత్తులతో భారతదేశ చరిత్రను తెలుసుకోవచ్చునని మెకంజీ నమ్మాడు. గ్ర్రామ చరిత్రలే కాక, ఆయాప్రాంతాలలోని వృక్ష, జంతురాశి, ప్రజల అలవాట్లు ఆచారాలగురించి కూడా సమాచారం సేకరించాలని అనుకొన్నాడు మెకంజి.
ఇతను నియమించుకొన్న ఉద్యోగుల జీత భత్యాలు కంపనీ భరించేది. ఇది లక్షరూపాయిల మేరకు అయినట్లు రికార్డులు చెపుతున్నాయి. క్రమేపీ కంపనీ డబ్బులు ఇవ్వటం మానేసాకా ఒకానొక దశలో వారికి జీతాలు మెకంజీయే స్వయంగా ఇచ్చాడు. మెకంజీ సేకరణలలో ఎక్కువ భాగం ఈ విధంగా స్వయంగా సేకరించినవే. తాను స్వయంగా వెళ్లలేని ప్రదేశాలకు తన అనుచరులను పంపి రిపోర్టులు తెప్పించుకొనే వాడు.
***
కాలిన్ మెకంజీ స్వయంగా చిత్రకారుడైనప్పటికీ ఇతనివద్ద వివిధ చిత్రకారుల బృందమొకటి ఉండేది. వీరు మెకంజీ ఆదేశాలకనుగుణంగా అనేక చిత్రాలను లిఖించారు. మెకంజీ గీయించిన చిత్రాల ఆధారంగా Illustrating India, The Early Colonial Investigations of Colin Mackenzie పేరుతో Jennifer Howes 2010 లో ఒక పుస్తకాన్ని వెలువరించింది. ఈ పుస్తకంలో ఆమె కొన్ని వందల మెకంజీ డ్రాయింగ్స్ ని తీసుకొని, వాటి చారిత్రిక నేపథ్యాన్ని ఆ చిత్రంలో ఉన్న లోతైన విశేషాలను అద్భుతంగా వర్ణించింది.
మెకంజీ వద్ద సహాయకులుగా ఉన్న కావలిసోదరులకు తిరిగి మరలా సహాయకులు ఉండేవారు. అలాగ కావలి వెంకట లక్ష్మయ్య వద్ద నారాయణ రావు, నిట్టల నారాయన, ఆనందరావు, నరసింహులు, సీతయ్య అనే అనుయాయీలు ఉండేవారు. వీరిని వివిధ ప్రాంతాలు పంపించి అక్కడి వివరాలను రిపోర్టులు రూపంలో తెప్పించుకొనేవారు. అలా నారాయణరావు అనే వ్యక్తి పంపిన అనేక రిపోర్టులు మెకంజీ కైఫియ్యతులలో లభిస్తాయి. ఇతని రిపోర్టులలో ఆ యా ఊర్లకు ఎలా వెళ్ళిందీ, ఎంతదూరం, ఎక్కడ బసచేసాడు, ఎంతెంత ఖర్చయింది లాంటి వివరాలు కూడా ఉండటం విశేషం.
ఎక్కడకు వెళ్లాలి, ఏం సేకరించాలి అనే విషయాలపట్ల మెకంజీ చాలా స్పష్టంగా వీరందరికీ దిశానిర్ధేశం చేసే వాడు. ఒకసారి మెకంజీ వెంకటలక్ష్మయ్యను మహాబలిపురం పంపిస్తూ – “నువ్వు అక్కడ మొదటగా ఆలయప్రధాన అర్చకులను, ఊరిపెద్దలను కలుసుకో, వారితో మర్యాదగా వ్యవహరించు, వారి విశ్వాసాన్ని చూరగొను, నీపని తప్ప మరే ఇతర విషయాలలోను తలదూర్చకు, అక్కడి వివరాలు ప్రతీరోజు డైరీలో రాయి, అక్కడి భవనాలు, శిల్పాలు, ఆసక్తి కలిగించే అంశాలు అన్నింటినీ నమోదు చెయ్యి, వారితో పరిచయం పెంచుకొన్నాక మొదట వ్రాతప్రతులు సేకరించు, తరువాత శాసనాలు, ఆ పిదప ఆ ప్రాంతంలో గతంలో జరిగిన ఆసక్తికర ఉదంతాలను అడుగు - అంటూ ఖచ్చితమైన సూచనలు ఇచ్చాడు .
కొన్ని చోట్ల స్థానికులు సమాచారాన్ని పంచుకోవటానికి ఇష్టపడక మెకంజీ అనుచరులను అటకాయించిన సంఘటనలు ఎదురయ్యేవి. తమిళనాడులోని ఈరోడ్ నుంచి నిట్టల నాయిన 10 మార్చ్, 1807 న వ్రాసిన ఉత్తరంలో “ఇక్కడ సమాచారం ఇవ్వకుండా ఇద్దరు బ్రాహ్మలు నన్ను బెదిరిస్తున్నారు, మీరీ విషయాన్ని కలక్టరుగారికి చెప్పి నాకు మార్గం సులభం చేస్తే తప్ప ఇక్కడి శాసనాల వివరాలను సేకరించలేను” అని వ్రాసాడు. మెకంజీ బహుసా M. Gorrow అనే కలక్టరుకు ఈ విషయం చెప్పి ఉంటాడు. ఏప్రిల్ 18 న నిట్టల నాయన వ్రాసిన మరో ఉత్తరంలో “కలక్టరు M. Gorrow గారి చొరవవల్ల నేను ఇక్కడ 20 శాసనాలు, కొన్ని తామ్రపత్రాలు, చాలా గ్రామాల కైఫియత్తులను సేకరించాను” అని చెప్పాడు.
మొదట్లో మెకంజీ సేకరిస్తున్న స్థానిక చరిత్రలను సమకాలీన బ్రిటిష్ చరిత్రకారులు పెద్దగా పట్టించుకొనేవారు కాదు. వాటిని పురాణగాథలని వాటికి చారిత్రిక విలువ ఉండదనీ తీసిపారేసేవారు. కానీ HH Wilson, Charles Wilkins లాంటి చరిత్రకారులు మెకంజీ చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పదని, దీని ద్వారా భారతదేశ చరిత్ర, సంస్కృతులను అర్ధంచేసుకొనే అవకాసం చిక్కుతుందని సమర్ధించారు. శాసనాలలో, తామ్రపత్రాలలో దానం ఇచ్చిన రాజు వంశావళిద్వారా హిందువుల చరిత్రను నిర్మించవచ్చు అని Mark wilks అనే మరో చరిత్రకారుడు గమనించాడు.
ఈ నేపథ్యంలో తన అనుచరులు తనకు కావాల్సిన సమాచార సేకరణలో వివిధ చోట్ల ఎదుర్కొంటున్న సమస్యలను ఈస్ట్ ఇండియా కంపనీ బోర్డు సభ్యులకు చెప్పి వారిని తన బృహత్ యత్నానికి సహాయపడవలసినదిగా మెకంజీ కోరి ఉంటాడు. కంపనీబోర్డు సానుకూలంగా స్పందించి తమ ఆధీనంలో ఉన్న జుడిషియల్, మెడికల్, రెవెన్యూ అధికారులకు 14 ఫిబ్రవరి 1808న ఒక మెమో జారీచేసి మెకంజీ చేస్తున్న సేకరణలకు సహకరించమని కోరింది. ఆ మెమోలో ఏయే అంశాలలో సహాయపడాలో స్పష్టంగా తెలిపింది.
అవి 1.వంశావళులు. 2. దండకవెలలు. 3. కాలజ్ఞానం సంగతులు (భవిష్యత్తును ఊహించి చెప్పే విషయాలు). 4.చరిత్రలు (ప్రసిద్ధిగాంచిన కథలు, పాత్రలు). 5. పన్ను వసూళ్ల వివరాలు. 6. ఒక గ్రామంలో ఉండే కుటుంబాల సంఖ్య, గ్రామజనాభాలో కులాల వారి విభజన. (ఇది చాలా విలువైన సమాచారం. మరి ఎందుచేతనో ఈ వివరాలు ఏ కైఫీయత్తులోను కనిపించలేదు) 7. గుడులు, గుడిమాన్యాలు, మఠాలు మఠాధిపతులు, స్థలపురాణాలు. 8. శాసనాలు, తామ్రపత్రాలు. 9. దానపత్రాలు. 10. పురాతన దేశీ విదేశీ నాణాలు. 11. ఒకనాటి ప్రధానపట్టణాలలో నేటికీ ఉన్న పాత భవనాలు, శిధిలమౌతున్న ఆలయాల చిత్రాలు. 12. వీరకల్ లు (వీరుల స్మారకంగా నిర్మించే శిలా విగ్రహాలు) 13. వివిధ శిల్పాల, నగిషీల చిత్రాలు.
ఈస్ట్ ఇండియా కంపనీ మెకంజీ పట్ల మొదట్లో కొంత ఉదాసీనతచూపినా పై మెమోద్వారా అతని కృషిని గుర్తించి సహాయపడినట్లు గ్రహించవచ్చు. ఒక గ్రామంలో పైన చెప్పిన అన్ని రకాల వివరాలు లభించకపోవచ్చు. కానీ పై సూచనలు మెకంజీ అనుచరులకు ఒక చెక్ లిస్ట్ లా ఉపయోగపడి ఉంటుంది.
***
1797లో అమరావతి స్థూపాన్ని గుర్తించిన మొదటి యూరోపియన్ కాలిన్ మెకంజీ. ఒక స్థానిక జమిందారు అమరావతిలో తాను చేపట్టిన ఒక భవన నిర్మాణరాయి కొరకు "దీపాల దిన్నె" గా స్థానికులు పిలుచుకొనే ఒక ఎత్తైన గుట్టను తవ్వించటం మొదలుపెట్టాడు. ఈ తవ్వకాలలో అక్కడ పాలరాతి ఫలకాలు అనేకం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ వార్త కాలిన్ మెకంజీ దృష్టికి రావటంతో 1796 లో అమరావతి వచ్చి అక్కడ తొంభై అడుగుల వ్యాసంతో ఇరవై అడుగుల ఎత్తులో పాలరాతినిర్మాణం ఉందని, అక్కడ లభించిన కొన్ని శిధిలాల చిత్రాలతో కూడిన ఒక వ్యాసాన్ని వ్రాసాడు .
అనేక ఉద్యోగ ఒత్తిళ్ల వల్ల మరలా 1816కి కానీ మెకంజీ అమరావతి రాలేదు. అప్పుడు కూడా తన అనుచరులను, చిత్రకారులను ఆ ప్రాంతంలో పెట్టి తిరిగి వెళిపోయాడు. వీరు అమరావతి కట్టడం యొక్క అనేక చిత్రాలను రెండేళ్లపాడు గీస్తూనే ఉన్నారు. మెకంజీకి 1818 లో తిరిగి అమరావతికి వచ్చాడు. అక్కడ ఆ జమిందారు ఒక చెరువును నిర్మించటం వలన అమరావతి స్థూపం మరింత శిధిలమై కన్పించింది మెకంజీకి. అనేక ఫలకాలు చెల్లాచెదురుగా ఆ చెరువుగట్టున పడిఉండటాన్ని గమనించాడు. అక్కడ తవ్వకాలు జరిపించి బాగున్న ఫలకాలను భద్రపరచమని మచిలీపట్నం పంపించాడు. మెకంజీ చిత్రకారులు 1798-1818 ల మధ్య చిత్రించిన 132 అమరావతి ఫలకాలలో 81 ఫలకాలు 1845 నాటికే అదృశ్యమైపోయాయి, డ్రాయింగ్స్ మాత్రమే మిగిలాయి . వాటి ఆధారంగా Elliot, Sewell లాంటి ఆ తదుపరి చరిత్రకారులు అమరావతి స్థూపస్వరూపాన్ని నిర్ణయించారు .
అమరావతి స్థూపాన్ని మెకంజీ మొదట్లో జైన నిర్మాణంగా భావించాడు. అమరావతిపై వ్రాసిన మొదటి వ్యాసంలో దాన్ని జైన ఆలయంగా పేర్కొన్నాడు. 1818 లో తవ్వకాలు జరిపినపుడు అది బౌద్ధమతసంబంధమైనదనే అనుమానం కలిగింది మెకంజీకి. అప్పట్లో సాంచీ స్తూపం పై పరిశోధనలు చేస్తున్న Edward Fell కు బౌద్ధ నిర్మాణాల వివరాలు పంపమని కోరాడు. ఆ వివరాల ఆధారంగా వ్రాసిన రెండవ వ్యాసంలో మెకంజీ జైన మత ప్రస్తావన తేలేదు. ఇదేసమయంలో మెకంజీకి ఉదరసంబంధ అనారోగ్యం మొదలైంది.
మద్రాసులో పదివేల వరహాల విలువచేసే భవనాన్ని మెకంజీ అద్దెకు ఇచ్చేసి కలకత్తాకు వెళ్ళిపోయాడు. 1820 నాటికి ఇతని ఆరోగ్యం మరింత క్షీణించింది. గాలి మార్పు కొరకు ఒరిస్సా వెళ్లాడు. అక్కడ పూరీ జగన్నాధ ఆలయం, రధయాత్ర, చిల్కా సరస్సుల డ్రాయింగ్స్ సేకరించాడు. తిరిగి కలకత్తా వచ్చేసాడు. తీవ్ర అనారోగ్యం వల్ల తన సేకరణలపై పెద్దగా దృష్టి నిలపలేకపోయేవాడు. ఉప్పుగాలిని పీల్చితే రోగం నయమౌతుంది అన్న వైద్యుల సలహామేరకు హుగ్లీ నదిపై రోజూ 12 మైళ్ల దూరం పడవ సవారి చేసేవాడు. 8 మే 1821 న అలా పడవప్రయాణం చేస్తూ పడవలోనే మరణించాడు .
మెకంజీ సేకరించిన ప్రతులు సుమారు “14 భాషలకు” సంబంధించినవి. వీటిని మెకంజీ కూడా సంపూర్ణంగా పరిశీలించలేదు. వాటిని ఎప్పటికైనా స్థిమితంగా కూర్చొని క్రోడికరించాలని అనుకొని తనదారిలో కనిపించిన ప్రతి చిన్న అంశాన్నీ జీవితాంతం సేకరించుకొంటూ పోయాడు.
***
మెకంజీ మరణం తరువాత
మెకంజీ చనిపోయేనాటికి అతని భార్య పెట్రొనెల్లా వయసు ఇరవై ఏళ్ళు. ఈమె తన స్వస్థలమైన Isle of Lewis లో ఉంటున్న తన అక్క మేరి వద్ద ఉండేటట్లు మెకంజీ తనవీలునామాలో ఏర్పాట్లు చేసాడు. పెట్రొనెల్లా 1823 లో Robert Fulcher అనే సైనికాధికారిని పెళ్ళి చేసుకొని కొంతకాలం ఇండియాలో ఉండి 1828 లో భర్తతో పాటు లండన్ వెళిపోయింది.
మెకంజీ సొంతడబ్బులతో పెట్టికొనుక్కొన్న పుస్తకాలు, పురావస్తువుల విలువ సుమారు లక్షరూపాయిలు ఉండొచ్చని విలువకట్టారు. వీటన్నింటిని ఇరవై వేల రూపాయిలకు మెకంజీ భార్య కంపనీ ప్రభుత్వానికి ఇచ్చివేసింది. బహుసా విడివిడిగా వ్యక్తుల వద్ద ఉండే కంటే ఒకచోట ఉంటాయని భావించిందేమో.
మెకంజీ మరణించాక అతని స్థానంలోకి వచ్చిన అధికారికి దాదాపు “లక్ష పేజీల” వరకూ ఉన్న ఈ వ్రాతప్రతులను, ఇతరసేకరణలను ఎలా మదింపువేయాలో అర్ధంకాలేదు. వాటిని ఏంచేయాలో తెలియక కంపనీ అధికారులు తలలు పట్టుకొని కూర్చునేవారు. అలాంటి సమయంలో మెకంజీ మిత్రుడు H H Wilson అనే అధికారి, వీటిని క్రోడికరించటానికి ముందుకురాగా కంపనీ బోర్డు వెంటనే అనుమతినిచ్చింది.
విల్సన్ మెకంజీ సేకరణలను పరిశీలించి వాటిలో - 2070 స్థానిక చరిత్రలు; 8076 శాసనాలు; పన్నెండు భారతీయ భాషలకు చెందిన 1568 కావ్యాలు, తెలుగులో ఉన్నవి 176; 2159 ఇంగ్లీషు అనువాదాలు; 79 పటాలు; 2630 డ్రాయింగ్స్; 106 ఇమేజెస్; 6218 నాణాలు అంటూ వేరుచేసి వాటికి ఇండెక్స్ నంబర్లు ఇచ్చి మొత్తం ఆ వివరాలను 1828 లో Meckenzie Collection - A Descriptive Catalogue of the Oriental Manuscripts and Other articles అనే రెండువాల్యూముల పుస్తకాలుగా వెలువరించాడు. పైన చెప్పిన సేకరణలలో చాలా మట్టుకు బ్రిటిష్ లైబ్రేరీకి, కొన్నింటిని మద్రాసు లైబ్రేరీకి తరలించారు.
విల్సన్ ఈ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో- వీటన్నింటిలో శాసనాలు, స్థానిక చరిత్రలు ముఖ్యమైనవని, వీటిని మరింత శోధించవలసి ఉందని బావించాడు. తెలుగు సాహిత్యంలో ఎక్కువగా సంస్కృత అనువాదాలు ఉన్నాయని, కొద్దిగా మాత్రమే స్వతంత్ర రచనలు లభించాయని అన్నాడు. మెకంజీ కృష్ణా నదికి దక్షిణభాగం (రాయలసీమ ప్రాంతం) నుంచి ఎక్కువ సేకరణలు జరిపినట్లు ఉత్తరభాగం నుంచి పెద్దగా సేకరణలు లేనట్టు గుర్తించాడు. బహుసా ఆ కారణం వల్లనే కడపజిల్లా కైఫియ్యతులు ఏడు సంపుటాలుగా మనకు లభించినట్లుగా ఇతరకోస్తా జిల్లాల కైఫియ్యతులు లభించవు.
ఆ తరువాత William Taylor మద్రాసులోని మెకంజీ వ్రాతప్రతులకు సంక్షిప్తానువాదం చేసి Examination and analysis of the mackenzie manuscripts deposited in the madras library అనే పేరుతో 1862 నాటికి మూడువాల్యూములు వెలువరించాడు.
విల్సన్, టేలర్ చేసిన కేటలాగులను సమన్వయపరుస్తూ T.V. Mahalingam, 1976 లో Mackenzie Manuscripts: Summaries of the Historical Manuscripts in the Mackenzie Collection పేరుతో రెండువాల్యూములను వెలువరించాడు.
***
కాలిన్ మెకంజీ ప్రాసంగికత
మెకంజీ భారతీయులు చరిత్రను రకరకాల రూపాల్లో భద్రపరచుకొన్నారని గ్రహించాడు. ఏఏ చోట్ల భారతదేశ నిక్షిప్తమై ఉందో కూడా మెకంజీ గుర్తించాడు. వాటిని తన జీవితకాలం అకుంఠిత దీక్షతో శ్రమించి సేకరించాడు.
విల్సన్ అన్నట్లు మెకంజీ సేకరణలలో శాసనాలు, కైఫియ్యతులు ముఖ్యమైనవి. వీటి ద్వారా అప్పటి సామాజిక వ్యవస్థ, చరిత్ర, సాహిత్యం, గ్రామాల సరిహద్దులు, ఆనాటి పాలకుల వంశావళి వంటి అనేక అపురూపవిషయాలు తెలుస్తాయి. ఒక గ్రామంలోని ఆలయాలు, వాటికి ఇచ్చిన దానాలు, వాటి మాన్యాలు, ఆ ప్రాంతంలో పండే పంటలు, ప్రజలుకట్టిన పన్నులు, ఆ గ్రామం పుట్టుపూర్వోత్తరాల గురించిన కథలు, ఆనాటి కథలు గాథలు, విశ్వాసాలు, ఆచారవ్యవహారాలులాంటి అనేక సంగతులు కైఫియ్యతులలో ఉన్నాయి. రెండు శతాబ్దాల క్రితం తెలుగునేల ఎలాఉండేది అనే విషయాలు నేడు తెలుసుకోవటంలో మెకంజీ సేకరణల పాత్ర తక్కువేమీ కాదు. మెకంజీ వీటిని సేకరించి ఉండకపోతే చాలాస్థానిక విషయాలు కాలగర్భంలో కలసిఫోయిఉండేవి. ఈ కైఫియ్యత్తులు స్థానికులు వ్రాసుకొన్న చరిత్రలు. నేడు సబ్ ఆల్ట్రన్ చరిత్రల అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా విస్త్రుతంగా జరుగుతున్నది.
నేడు చరిత్రను మూడు కోణాలలో అధ్యయనం చేస్తున్నారు
1. చరిత్రను స్థలము, కాలము, అక్కడి ప్రజల సంస్కృతులను దృష్టిలో ఉంచుకొని చూడటం.
2. చారిత్రిక దస్తావేజులను ఆ దేశ స్మృతులుగా గుర్తించటం
3. వివిధ శాస్త్రాలు పరస్పరసహకారం అందించుకొని చరిత్రను నిర్మించటం.
పై మూడు కోణాలలోంచి చరిత్రకారులు నెరేటివ్స్ ను నిర్మిస్తున్నారు. చరిత్రలో జరిగిన వివిధ సంఘటనలద్వారా మానవజాతి గమనం ఇలా నడిచింది అని చెప్పే కథనాలను హిస్టారికల్ నెరేటివ్స్ అంటున్నారు. ఇది ఒకరకంగా Civil history of Mankind. దీనిలో ఆధారాలను సేకరించటం ఒక ఎత్తు అయితే వాటిని విశ్లేషించటం మరొక ఎత్తు.
దక్షిణభారతదేశ చరిత్రను అధ్యయనం చేసే చరిత్రకారులకు మెకంజీ సేకరణలు ఇంకా చాలా తరాలవరకూ తరగని గనివంటివి. రెండువందల ఏళ్లతరువాత కూడా ఇంకా తరగని గని లాగ ఉన్నాయి.
ఇటీవలికాలంలో యూరోపియన్ చరిత్రకారుల దృష్టి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న అపారమైన మెకంజి సేకరణలపై పడింది. వాటిపై గొప్ప రీసర్చ్ జరుగుతోంది. Jennifer Howes, Philip Wagnoner, Dirks Nicholas, Nick Barnard, Rama Sundari Mantena, Sushma Jansari లాంటి చరిత్రకారులు Mackenzie సేకరణలపై గొప్ప పరిశోధనలు చేసి పుస్తకాలు వ్రాస్తున్నారు.
***
ఉపసంహారం
కాలిన్ మెకంజీ దిగువమధ్యతరగతికి చెందిన కుటుంబంనుంచి వచ్చాడు. ఇతని తండ్రి ఒక పోస్ట్ మాస్టర్.
మెకంజీ ఆరు అడుగుల రెండు అంగుళాల పొడవుతో బలమైన దేహంతో ఉండేవాడు. మెకంజీ 57 ఏండ్ల వయసులో జావాయుద్ధంలో పాల్గొన్న నాటి ఒక సంఘటనను అతనితో పాటు ఆ యుద్ధంలో పాల్గొన్న ఒక యువసహచరుడు చెప్పిన ఒక ఉదంతమిది. "ఒకరోజు అకస్మాత్తుగా చాలా సమీపంనుంచి మాపై శతృవుల దాడి జరిగింది. ఏం చేయాలో పాలుపోని నేను, ఆ ముసలాయన (మెకంజీ) జేబులో రెండు రైఫిల్స్ పెట్టి అతని తలరాత బాగుంటే తప్పించుకొంటాడు అని వదిలేసి మేం మా స్థావరాలవైపు పరుగులు తీసాం. ఆశ్చర్యకరంగా అతను మాకన్నా వేగంగా పరిగెత్తి, పొడవైనదేహంతో నీళ్లల్లో ఈదుకొంటూ మమ్ములను దాటుకొని శిబిరాన్ని చేరుకొన్నాడు. అప్పుడు అతని శరీర సామర్ధ్యం, హృదయ సామర్ధ్యంతో సమానమని మాకు అర్ధమైంది. "
***
మెకంజి ప్రతినెలా తన జీతంలో చాలా భాగం లండన్ లో ఉండే తన మిత్రుడైన Thomas Anderson ద్వారా స్కాట్లాండ్ లోని తనకుటుంబానికి పంపించేవాడు. 1793 లో వ్రాసిన ఒక ఉత్తరంలో - తండ్రికి 50 పౌండ్లు, అక్కకు 25 పౌండ్లు, మేనత్తకు 10 పౌండ్లు అందచేయమని చెపుతాడు. 1796 లో వ్రాసిన మరో ఉత్తరంలో తాను పంపుతున్న వంద పౌండ్లతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన తండ్రిని చిక్కుల్లోంచి బయటపడేయమని కోరాడు. వీలైతే స్వయంగా వెళ్లి ఎలా మంచిదనిపిస్తే అలా సమస్యను పరిష్కరించమని అభ్యర్ధించాడు. మెకంజీ లేఖలలో తాను స్వస్థానికి వెళ్లాలన్న కోర్కెను పదే పదే చెప్పుకొనేవాడు. చివరకు ఇండియాలో అడుగుపెట్టిన తరువాత ఒక్కసారికూడా ఇంగ్లాండ్ వెళ్ళకుండానే ఇక్కడే చనిపోయాడు .
అతని సోదరి మేరీ మెకంజీ అక్కడే ఉండేది. తమ కుటుంబసభ్యుల కొరకు ఈమె 1823 లో అక్కడ ఒక సమాధి మందిరాన్ని కట్టించింది. మెకంజీ తల్లిదండ్రులు, మేరీ మెకంజీలు కూడా అక్కడే ఖననం చేయబడ్డారు. అక్కడ ఖననం చేయబడని కల్నల్ మెకంజీ సమాధిఫలకాన్ని కూడా మేరీ వేయించింది. దీన్ని నేటికీ అక్కడ చూడవచ్చును. ఆరుద్ర అక్కడకు వెళ్లి ఆ విశేషాలు సమగ్రాంధ్రసాహిత్యచరిత్ర లో పొందుపరచాడు.
మేరీ తన తమ్ముడిని 29 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు చూడటమే. మెకంజీ భారతదేశంలో ఏమి సేకరించాడో కళ్ళారా చూడలేదు. ఉత్తరాల ద్వారా, సన్నిహితులు చెప్పే విషయాల ద్వారా మాత్రమే ఆ అక్కాతమ్ముళ్ళ అనుబంధం కొనసాగింది. ఆ పరిమితజ్ఞానంతోనే ఆమె వేయించిన మెకంజీ జ్ఞాపికాఫలకంలోని “నాలుగు దశాబ్దాల పాటు భారతదేశంలో ప్రాచీన చరిత్ర, సాహిత్యం, పురావస్తువుల సేకరణలో- మానవ శ్రమకు, అన్వేషణకు మించి చేసిన విశేషకృషి వల్ల ఎంతో విలువైన అపార సంపద నేడు ప్రపంచానికి కానుకగా మిగిలి ఉన్నది” అనే వాక్యాలు మెకంజీ సార్ధకజీవనానికి అద్దంపడతాయి.
(కాలిన్ మెకంజీ కాలిన్ మెకంజీ ద్విశతవర్ధంతి సందర్భంగా సందర్భంగా - తూర్పుగోదావరి జిల్లా- మెకంజీ కైఫియ్యతులు పుస్తకంలోని వ్యాసం)
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment