విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ చిన్నారులకొరకు చేసిన రచన "క్రిసెంట్ మూన్". దీన్ని 2011 లో అనువదించి నా బ్లాగులో పోస్ట్ చేశాను. కవితా వస్తువు చిన్నపిల్లలు వారి నిష్కల్మష ఆలోచనలు, ఆశ్చర్యాలు, కలలు నిండిన ఒక శుభ్రజ్యోత్స్న ప్రపంచం.
నిజానికి ఇలాంటి ఒక జానర్ నేడు కనుమరుగైపోవటం తెలుగు సాహిత్యం చేసుకొన్న దురదృష్టం. ఈ తరహా రచనలు ఎందుకు ప్రగతినిరోధకమో, ఎలా దోపిడీశక్తులకు దోహదపడతాయో నాకు ఎన్నటికీ అర్ధం కాని విషయం.
బొల్లోజు బాబా
***
ప్రారంభం
"నేనెక్కడి నుండి వచ్చాను?
నేను నీకు ఎక్కడ దొరికానూ?" పాపాయి అమ్మనడిగింది.
పాపాయిని గుండెలకదుముకొని
" నీవు నా హృదయంలో దాని వాంఛై ఉండినావు చిన్నారీ"
నవ్వుతూ, కనులనీరు నించుకుంటో అమ్మ బదులిచ్చింది.
నీవు నా బాల్యపు ఆటలలో బొమ్మవై ఉండే దానవు.
ప్రతి ఉదయమూ నా దేవుని ప్రతి రూపాన్ని మట్టితో చేసే దానిని.
అపుడే నిన్ను కూడా తయారు చేసి చేజార్చుకొనే దానిని.
మా కులదైవంతో సమానంగా నీకు కొలువుండేది.
ఆతని పూజలో నిను సేవించే దానిని.
నా అన్ని ఆశలలో, ప్రేమలలో, జీవితంలో, నా తల్లి జీవితంలో నీవు సంచరించావు.
మా ఇంటిని పాలించే అమృతమూర్తి ఒడిలో నీవు అనాదిగా సాకబడుతున్నావు.
కౌమార్యంలో నాహృదయం తన రేకలు విచ్చుకొన్నప్పుడు
నీవు దాని సుగంధానివై పరిమళించావు.
నీ సౌకుమార్యం నా యవ్వనాంగాలలో వేకువవెలుగులా వికసించింది.
స్వర్లోకపు ఆదిమ సఖి, ఉదయకాంతికి సహోదరివి అయిన నీవు
ఈ ప్రపంచ జీవన వాహినిపై తేలియాడ దిగివచ్చావు,
చివరకు నాహృదయానికి చిక్కావు.
నిన్నలా తేరిపార చూస్తే రహస్యమేదో ముంచెత్తుతుంది.
అందరకూ చెందిన నీవు నాకే సొంతమైనావు.
ఏ ఇంద్రజాలం నా దుర్భల చేతులలో
ఇంతటి భువనైక సౌందర్యాన్ని బంధించగలదు?
మూలం: రవీంద్రుని క్రిసెంట్ మూన్
అనువాదం: బొల్లోజు బాబా
మొత్తం అనువాదాన్ని ఈ క్రింది లింకులోనుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును.
https://archive.org/details/crescentmoontelugutranslationbaba
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment