Thursday, May 20, 2021

Imported post: Facebook Post: 2021-05-20T16:16:43

Samih al-Qasim జోర్డాన్ లో జన్మించిన పాలస్తీనియన్ కవి. ఇతను అనేకసార్లు రాజకీయకారణాల వల్ల జైలు పాలయ్యాడు. ఇతర కవుల్లా ఇతను పాలస్తీనియాను విడిచిపెట్టి పోలేదు దానికి కారణం నా మాతృభూమిపై నా అనుబంధమే అని ప్రకటించుకొన్నాడు. తన జీవితంలో ఎక్కువకాలం గృహనిర్భంధంలోనే గడిపాడు "The only way I can assert my identity is by writing poetry" అనేది Samih al-Qasim కవిత్వ వస్తువు మరియు శిల్పము. Samih al-Qasim 2014 లో మరణించాడు. Samih al-Qasim కవితల అనువాదాలు ఇవి. 1. Travel Tickets నన్ను చంపినరోజు నా జేబులో Travel Tickets గమనిస్తావు నువ్వు శాంతిలోకి పంటపొలాలలోకి, వానలోకి మనుషుల అంతరాత్మలలోకి తీసుకెళ్ళే Travel Tickets ప్రియమైన నా హంతకుడా ఆ టికెట్లను వృధాచేయకు. వాటిని వాడుకో. దయచేసి ప్రయాణించు 2. Slit lips చనిపోయిన ఒక కోకిల కథను నేను నీకు చెప్పి ఉండేవాడిని. వాళ్ళు నా నాలుకను చీల్చి ఉండకపోతే ఆ కథను నీకు...... 3. Abandoning నేను చూసాను ఆమెను నేను చూసాను ఆమెను కూడలిలో నేను చూసాను కూడలిలో ఆమె రక్తంచిందించటం నేను చూసాను కూడలిలో ఆమె నడవలేకపోవటం నేను చూసాను కూడలిలో ఆమె చంపబడటం నేను చూసాను... నేను చూసాను.... ఈమె సంరక్షకుడు ఎవరని అతను బిగ్గరగా అరచినప్పుడు నాకు ఆమె పరిచయమే అనే విషయాన్ని చెప్పలేదు ఆ కూడలిలో ఆమెనలా విడిచిపెట్టేశాను ఆ కూడలిలో రక్తమడుగులో ఆమెనలా విడిచిపెట్టేసాను ఆ కూడలిలో నడవలేకపోతున్న ఆమెనలా విడిచిపెట్టేసాను ఆ కూడలిలో మృత్యువుకి ఆమెనలా విడిచిపెట్టేసాను ఆమెనలా విడిచిపెట్టేసాను.... 4. End of Discussion with a Jailer నా జైలుగది కిటికీలోంచి నన్ను చూసి నవ్వే చెట్లు నా ప్రజలతో నిండిన ఇంటికప్పులు నాకోసం విలపిస్తూ ప్రార్ధించే కిటికీలు కనిపిస్తాయి నా ఇరుకైన గది తలుపురంద్రంలోంచి నీ విశాలమైన గది కూడా కనిపిస్తుంది. 5. Confession at Midday . ఒక చెట్టును నాటాను దాని ఫలాల్ని తృణీకరించి మానుని కలపగా వాడుకొన్నాను కొమ్మలను వీణగా చేసి గొప్ప రాగాల్ని పలికించాను వీణ పగిలిపోయింది రాగాలు ఆగిపోయాయి ఫలాలు పోగొట్టుకొన్నాను ఇప్పుడు చెట్టు కొరకు దుఃఖిస్తున్నాను. , మూలం- Samih al-Qasim అనువాదం: బొల్లోజు బాబా

No comments:

Post a Comment