శిఖామణి కవితా దర్శనం
మూడు దశాబ్దాల క్రితం “మువ్వల చేతికర్రతో” తెలుగు సాహిత్యలోకంలోకి అడుగుపెట్టారు శిఖామణి. సూర్యుడు, నెత్తురు, అడవి, తుపాకి గొట్టం, ఎన్ కౌంటర్లు లాంటి ఘాటైన పదాలతో తెలుగు కవిత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాలం అది. ఈ నేపథ్యంలో- తల్లి చేతి స్పర్శని, చిన్నప్పటి పిప్పరుమెంటు రుచిని, చెక్కిలిపై ఆరిన కన్నీటి చారికను, ఖేదమో మోదమో తెలీని తన్మయత్వాన్ని నింపుకొని వచ్చిన శిఖామణి కవిత్వం ప్రతిఒక్కరిని ఆకట్టుకొంది.
ఈ మూడు దశాబ్దాలలో శిఖామణి 11 కవితా సంపుటులు, 9 విమర్శనా గ్రంధాలు, ఇతర భాషలలోకి అనువదింపబడిన 5 కవిత్వ సంపుటులు వెలువరించారు. 5 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఆంధ్రదేశంలోని దాదాపు అన్ని సాహిత్య సంస్థలనుండి పురస్కారాలను అందుకొన్నారు. ఒక కవిగా, విమర్శకునిగా, పీఠికా కర్తగా, పరిశోధకునిగా, పరిశోధనా పర్యవేక్షకునిగా, ఒక కవిత్వ కార్యకర్తగా, సాహిత్య సభలలో వక్తగా, పత్రికా సంపాదకునిగా వీటన్నిటికీ మించి మార్దవత నిండిన మనిషిగా- శిఖామణి గారు నాకు సహస్ర బాహువులతో ప్రకాశించే కార్తవీర్యార్జునుని గా కనిపిస్తారు.
1. కవిగా శిఖామణి
జీవితపు రణగొణధ్వనుల మధ్య జారిపోయే సున్నితానుభవాలను నేర్పుగా ఒడిసిపట్టుకోవటం - నడచి వచ్చేసిన మార్గంలోని రాలుపూల పరిమళాల్ని నెమరువేసుకొంటూ కలల మాలలల్లటం - మనిషితనం తగలకపోతుందా అంటూ లోలోపలికి తవ్వుకుంటూ పోయేతత్వం - కాస్త అమాయకత్వం, లోకం మీద ఇంత దయా తప్ప మరే అలంకారాలూ లేకపోవటం - స్వప్నాన్ని కమ్మిచ్చుగుండా సాగదీసి సాగదీసి బంగారు తీగలాంటి ఓ వాక్య చిత్రాన్ని నిర్మించటం - మనచుట్టూ జరుగుతున్న అన్యాయాలపట్ల ధర్మాగ్రహం ప్రకటించటం- శిఖామణి కవిత్వంలో మనకు అడుగడుగునా కనిపిస్తాయి
జీవితానుభవాల్ని కవిత్వానుభవాలుగా మార్చటంలో శిఖామణి నేర్పరి. అనుభూతిని భాషలోకి అనువదించటం తేలికైన విషయం కాదు. అనుభూతులను వ్యక్తీకరించటానికి ఒక్కోసారి భాష సరిపోదు. ఒక అనుభూతిని అంతే శక్తిమంతంగా చదువరిలో ప్రవేశపెట్టటంలో శిఖామణి ప్రతిభ అనన్యసామాన్యం.
రోడ్డుపై ఎదురయ్యే బిచ్చగాళ్లను విసుక్కొంటూనో, జాలితోనో ఎంతోకొంత దానం చేస్తాం. మనం ఇచ్చిన నాణెం ఎంతవిలువైనదో ఆ కబోది బిచ్చగాడు దాని అంచులను తడుముకొని తెలుసుకొంటాడు. ఆ విషయాన్ని కూడా మనం ఎపుడో ఒకప్పుడు గమనించే ఉంటాం. ఇంతవరకూ ప్రతిఒక్కరకూ ఎదురయ్యే అనుభవమే. కానీ శిఖామణి మరికొంత ముందుకు చూసి, ఆ అనుభూతిని ఒక అర్ధ్రతతో కూడిన చిత్రంగా రూపుకట్టగలిగారు.
ఈ రోజు కబోది బొచ్చెలో
నువ్వు వెయ్యవలసింది
చిల్లర నాణెం కాదు
వాడు నాణెపు అంచులు తడిమి
దాని విలువను తెలుసుకునేటప్పుడు
నాణెపు అంచుకు బదులు
అక్కడ
నీ హృదయపు అంచులు దొరకాలి (హ్రుదయదానం)
మామూలుగా జరిగే దైనందిన సంఘటనలను శిఖామణి అద్భుతంగా కవిత్వం చేస్తారు. ఉదాహరణకు బొబ్బిలి టు పార్వతీపురం అనేకవితలో కొన్ని వాక్యాలు ఇలా సాగుతాయి
ఒక అరుణోదయపు వేళ
ఇంటికి వెళ్లగానే
కాళ్లకు నీళ్ళిచ్చినప్పుడే అనుకొన్నాను
బొబ్బిలిలో ఉంటూ కూడా
ఈ కోడలు పిల్ల
మా యానాం చెరువు నీళ్ళు ఎలా తెచ్చిందా అని.
ఇక్కడ మా యానాం చెరువు నీళ్ళు అన్న వాక్యం వల్ల ఒక మామూలు విషయం కవిత్వమైంది. కవిది యానం, కవి చెపుతోన్న కోడలి పిల్లది కూడా యానామే. ఇద్దరూ యానాం చెరువునీళ్లు తాగిన వారే. ప్రస్తుతం ఆ కోడలు పిల్ల యానానికి సుమారు రెండువందల కిలోమీటర్లు దూరంగా బొబ్బిలి లో ఉంటుంది. మరి బొబ్బిలిలో యానాం చెరువు నీళ్ళు ఎలా సాధ్యం? అదే శిఖామణి కవిత్వ రహస్యం. అతని కవిత్వాన్ని చదువుతూంటే ఏదో సొంత ఇంట్లోకి అడుగుపెడుతున్నట్లు, మన ఆత్మలోకంలో మనమే సంచరించుతున్నట్లూ అనిపించకమానదు.
మిత్రుడు లేని ఊరికి వెళ్లటం అనే అనుభవం చిత్రమైనది. ఆ మిత్రుని జ్ఞాపకాలు ముసురు కొంటాయి. హృదయం భారమౌతుంది. ఆ భారాన్ని మాటల్లో అంత సులభంగా చెప్పలేం. చానాళ్లకి వెళ్లాను పాల్వంచకి అనే కవితలో ఆ అనుభవాన్ని అద్భుతంగా పట్టుకొంటారు శిఖామణి.
తీరా వెళ్ళాక తెలిసింది
ఇతఃపూఱ్వం
అతను కేవలం పాల్వంచలో మాత్రమే ఉండేవాడని
ఇపుడతను
హైదరాబాద్ లోనూ నరసరావు పేటలోను
మహబూబ్ నగర్ లోనూ భద్రాచలంలోనూ
ఎక్కడెక్కడ తన మిత్రులున్నారో
అక్కడక్కడ ఏకకాలంలో ఉంటున్నాడని తెలిసింది
అవును
నిత్యసంచారికి శరీరంతో ఏం పని
చనిపోయిన వ్యక్తులు బ్రతికున్నవారి జ్ఞాపకాలలో జీవిస్తూనే ఉంటారు అన్న సత్యాన్ని పై వాక్యాలలో చెపుతున్నాడు.
ఇదే కవితకు పొడిగింపా అన్నట్లు “నువ్వు గుర్తొస్తావు” అనే కవిత ఒకటి ఉంది. అలా జ్ఞాపకాలలో జీవించి ఉండటం కూడా ఎంతకాలం జరుగుతుంది అని ప్రశ్నించి గొప్ప తాత్వికంమైన సమాధానం చెపుతాడు ఇలా…
//నువ్వైనా ఎందాకా గుర్తొస్తావులే!
నిన్ను గుర్తు పెట్టుకున్నానన్న
గుర్తు నాకున్నంత వరకు.
ఒక శుభోదయాన
నేనెవరో ఇతరులు తప్ప
నన్ను నేను గుర్తు పట్టలేని క్షణాన
నిన్నూ నన్నూ కలిపి గుర్తు పట్టే వ్యక్తి
వ్యక్తంగానో అవ్యక్తంగానో
ఎక్కడో ఉండే వుంటాడు.
ఈ జ్ఞాపకాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆగిపోతాయి. అప్పుడు మనల్ని ఇతరులు గుర్తు పెట్టుకుంటారు అనటం జీవన వైచిత్రి.
కవిత్వానికి ఉండాల్సిన లక్షణాల పట్ల ప్రతికవికీ కొన్ని అభిప్రాయాలుంటాయి. అలాగే శిఖామణి కూడా “అప్పట్లో మా నాయన అనేవాడు” అనే కవితలో తన కవిత్వ మూలాలను చెప్పుకొంటాడు.
కవిత్వం రాయగానే సరికాదు
కాస్త జ్ఞానం వుండాలిరా అని
జ్ఞానం దేనికైనా అవసరపడుతుందేమోగానీ
కవిత్వం రాయడానికి కావాల్సింది
కాస్త అమాయకత్వం
లోకం మీద ఇంత దయా
అనుకొంటాను ఇప్పటికీ.//
పైన చెప్పినట్లుగా శిఖామణి కవిత్వంలో. మానవజాతిని కొత్తమలుపులు తిప్పాలనే గొప్ప గొప్ప ఊహలు, కార్యాచరణలు, సిద్దాంతాలు లాంటి జ్ఞాన ప్రకటనలు ఉండవు. ఉండేదల్లా ఉత్త హృదయ నివేదనా, ఈ లోకంపట్ల అపారమైన దయ. పూలకుర్రాళ్లు, అంధ భిక్షకులు, రైళ్లలో యాచకులు, ఆఫీసులో అటెండరు, మేడపై వాలే పావురాలు, మరణించిన బాల్య మిత్రులు, స్నేహితులు వీళ్ళే ఎక్కువగా శిఖామణి కవిత్వానికి వస్తువులు
తెలుగు సాహిత్యంలో శిఖామణి రాసినన్ని ఎలిజీలు వేరే ఎవరూ రాయలేదంటే అతిశయోక్తి కాదు. ఇవన్నీ “స్మరణిక” పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. దీనిలో మొత్తం 34 వ్యాసాలున్నాయి. శిఖామణి వ్యక్తులను ఎంతగా ప్రేమిస్తాడో, వారితో తనకు గల అనుభవాలను, వారిలోని మంచిని ఎంతెలా గుర్తుపెట్టుకొంటాడో ఈ నివాళి వ్యాసాలను చదివినపుడు అర్ధమౌతుంది. వారు మనకు తెలియని వ్యక్తులైనప్పటికీ గుండె బరువెక్కుతుంది. ఇవన్నీ శిఖామణి “మనిషి” గా జీవించాడు అనటానికి రుజువులు. శిఖామణికి ఈ లోకంపై, మనుషులపై ఎంత దయ, హృదయ వేదన లేకపోతే అంతఆర్థ్రంగా వారిగురించి వ్రాయగలడు
ఒక్క ఉదాహరణ
శిఖామణి బంధువు యొక్క మూడునెలల పసిబిడ్డ చనిపోవటం మీద వ్రాసిన “నిదురించిన చిన్నిముద్దు” అన్న కవితలో
ఈ చిన్నారి శిశువు కోసం తవ్విన గోతిని చూసి
వానలకు పైవర వరకు ఉబికొచ్చిన నూతి నీటిలా
దు:ఖం జీవితపు ఇంత పై పొరల్లోనే ఉంటుందనుకోలేదు” అన్న అత్యంత విషాదవాక్యాలతో సందర్భాన్ని కళ్లకు కడతాడు కవి. చిన్న పిల్లవానిని ఖననం చేయటానికి చిన్నగొయ్యి సరిపోయింది అన్న సూచనకూడా గుండెల్ని పిండే ఒక వాస్తవం.
కవిత్వానికి కావాల్సినమరో అంశం అమాయకత్వం అని శిఖామణి అంటారు కానీ, నిజానికి శిఖామణి కవిత్వం పైకి అమాయకంగా కనిపిస్తూ లోపల జీవనతాత్విక సముద్రాలను ఇముడ్చుకొని ఉంటుంది.
ఈ విషయం శిఖామణి వ్రాసిన చిలక్కొయ్య కవితను పరిశీలిస్తే అర్ధమౌతుంది. ఇది ఒక గోడకు ఉండే చిలక్కొయ్య పై వ్రాసిన వస్తుకవితైనప్పటికీ, ఒక సంపూర్ణజీవితాన్ని అంతర్లీనంగా చెపుతూంటుంది.
కవి బాల్యంలో చిలక్కొయ్యతో తనకు గల అనుభవాలతో కవిత మొదలౌతుంది.
చిలక్కొయ్యపై పిచ్చుకలు వాలటం, కవి తల్లిగారు ఉత్త పసుపు పుస్తెలతాడు వేలాడదీయటం, దానికి తగిలించిన సీమవెండి కేరేజీలో చప్పరింపు చప్పరింపుకు రంగులు మారే బిళ్లలను వారి అమ్మగారు దాయటం, మూడో పురుషార్థ సాధనలో ఉన్న దంపతులను ఆ చిలక్కొయ్య నిర్వికారంగా చూడటం, ఈ ఒంటరి ప్రయాణంలో ఈదలేక నిష్క్రమిస్తూ అదే చిలక్కొయ్యకు ఆత్మను తగిలించటం -ఇవీ ఈ కవితలో కనిపించే వివిధ దృశ్యచిత్రాలు. అతి సామాన్యంగా కనిపించే వాక్యాలతో కవిత మొదలై ముగింపుకు వచ్చేసరికి అవే పదాలు మరో గొప్ప అర్థాన్నిచ్చే విధంగా మారతాయి. కవిత ప్రారంభంలో కనిపించిన కొయ్య చిలుక నెమ్మది నెమ్మదిగా కనుమరుగవుతూ, ఓ జీవితం కనిపించటం మొదలవుతుంది.
2. శిఖామణి కవిత్వంలో దళిత ఈస్తటిక్స్
శిఖామణి మొదట మనిషి ఆ తరువాత దళితుడు. దళిత కవిత్వం ఉత్తుంగ తరంగంలా తెలుగు సాహిత్యలోకంలో ఎగసినపుడు శిఖామణి ఆ కవిత్వానికి తాను అందించాల్సిన సామాజిక కర్తవ్యాన్ని గుర్తించారు. దళితుల పక్షన నిలబడి కవిత్వం వ్రాసారు. అంతకు మునుపు దళితుల సమస్యలను కవిత్వీకరించలేదనే విమర్శను నిజాయితీ గా అంగీకరిస్తారు శిఖామణి.
పూల కుర్రాళ్ల గురించీ
గుడ్డి బిచ్చగాళ్ల గురించీ
పుప్పొడి పదాలతో పలవరించిన నేను
పదిరికుప్పం పరాభవాల గురించి
పన్నెత్తు మాటయినా పలకలేకపోయాను..... అంటూ.
ఆ తరువాత కిర్రుచెప్పుల భాష, చూపుడువేలు పాడే పాట కవిత్వ సంపుటులను, దళిత సాహిత్యతత్వం, దళిత సాహిత్యోద్యమం పేర్లతో విమర్శనా గ్రంధాలను వెలువరించారు. శిఖామణి దళిత ఈస్తటిక్స్ దళిత కవిత్వానికి కళాత్మకతను అద్దింది. ఆ విషయంలో శివసాగర్ పక్కన స్థానం ఈయతగినవారు శిఖామణి.
కవిని నేను
వర్ణచాపాన్ని విరగ్గొట్టడానికి వచ్చిన
దళిత కవిని నేను --- అని ప్రకటించుకొంటాడు.
శిఖామణి వ్రాసిన “మా బాప్ప”, “నల్లని దానను” కవితలలో దళిత ఈస్తటిక్స్ నిరుపమానంగా వ్యక్తమౌతాయి.
మా బాప్ప
వాడతప్ప వూరు లేని
కులంతప్ప పేరు లేని
శ్రమ తప్ప సుఖం లేని
మా బాప్ప కథ వింటారా?
బాప్పంటే మాటలా
పొడుగాటి బొప్పాయి చెట్టులా
వెనక్కి తిరిగి చూడని యేరులా
ఆకాశాన్ని సవాలు చేసే
సన్నని సరివి చెట్టులా
చేయెత్తు మనిషి
కచ్చా బిగించి
భుజాన కొడవలితో పొలానికి వెళ్తుంటే
తోక మీద నిలబడిన
ఆరడుగుల నల్ల తాచులా
అగుపించేది మా బాప్ప
నలుపంటే నలుపా అది!
గుత్తులుగా విరగకాచిన నేరేడు నలుపు
దుక్కిదున్నిన నల్లరేగడి మడిచెక్క నలుపు
పంటబోదెలో విరబూసిన నల్లకలువ నలుపు
అప్పుడే కోసి ఆరబోసిన మిరపకళ్లంలా
ఆ నల్లని నుదుటిమీద ఎర్రని బొట్టు
రూపుకు నల్లనే కాని
మా బాప్ప మనసు పుచ్చపువ్వు తెల్లన
బూరుగు దూది మెత్తన//
ఊరుతో వైరం వచ్చినప్పుడు
చెంగులో ఇంతకారప్పొడి
చేతిలో హరకెన్ లాంతరుతో
తెల్లవార్లూ ఏటిగట్టున కాపలా తిరిగిన
మా బాప్ప
చుండూరులో ఎందుకు పుట్టలేదా
అనుకొంటాను//
ఈ కవితలో కనిపించే కచ్చాబిగించటం, కొడవలితో పొలానికి వెళ్లటం, నేరేడు, కలువ, దుక్కిదున్నిన నల్లరేగడి, మిరప కళ్ళం, ఊడ్పుల కాలం, బడిపిల్లల మధ్యాహ్న భోజన పథకం, వెండి కడియాలలో లక్క, ఊరితో వైరం లాంటి దృష్టాంతాలన్నీ దళిత జీవనాన్ని దృశ్యమానం చేస్తూ కవిత సాంద్రతను పెంచుతాయి.
నల్లని దానను అనే కవితలో- నవధాన్యాలలో నాలుగవదానను, హంసలమధ్య పికిలిపిట్టను, చెమ్మసోకితే ఉబ్బిపోతాను, ఆపై స్పృశిస్తే తెల్లగా మెరిసిపోతాను వంటి పైపై పోలికలను బట్టి ఇది మినువులపై చెపుతున్న కవితగా అనిపించినా -- జాత్యాహంకారాన్ని దహించే నీలి అగ్నిశిఖ, ఆఫ్రికానుండి మొహంజొదారో వరకు నిక్షిప్తమైన నలుపు ధాతు శిలాజాలు, వీరబాహుడినుండి మండేలా వరకు సాగిన నల్లరక్తపు వెలిగే పాదముద్రలు, తెల్లజాతిని అబ్బురపరచిన నల్ల మైఖేల్ జాక్సన్ వంటి అనేక మెటఫర్ ల ద్వారా ఒక వర్గదృక్ఫధాన్ని కవితలో అత్యంత ప్రతిభావంతంగా ప్రవేశపెడతాడు కవి. దళిత ఈస్తటిక్స్ ఈ కవితలో అద్భుతంగా పలుకుతాయి.
శిఖామణి కవిత్వానికి అనుభూతి, మానవత, తాత్వికతలు పుష్కలంగా పొటమరించే అందాలు. ఉపమ, రూపకాలు శిఖామణి కవిత్వానికి మణిపూసలు. "సస్టైయిన్డ్ రిలీజ్ డ్రగ్ లాగ శిఖామణి అక్షరాల్లో కవిత్వం నిలకడగా స్రవిస్తూ ఉంటుంది అంటారు ప్రముఖ విమర్శకుడు శ్రీ కె.శ్రీనివాస్
****
3. విమర్శకునిగా శిఖామణి
వివిధ, సమాంతర, దళిత సాహిత్య తత్త్వం, దళిత సాహిత్యోద్యమం, సేతువు, వాగర్ధ వంటి పుస్తకాలు శిఖామణిని మనకున్న మంచి విమర్శకునిగా నిరూపిస్తాయి.
ప్రయోగవాది పఠాభి, తెలుగు-మరాఠి దళిత కవిత్వం లాంటి పుస్తకాలు శిఖామణిలోని పరిశొధకుడిని మనకు చూపుతాయి.
విశ్వవిద్యాలయ ఆచార్యుని వృత్తిలో భాగంగా 24 పి హెచ్ డీలు, 42 ఎంఫిల్ లకు శిఖామణి పరిశోధక పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. పద్యసాహిత్యం, తులనాత్మక పరిశీలన, ఆధునిక వచనం, కవిత్వం, నాటకం, సంస్కరణలు వంటి ఒకదానికొకటి సంబంధం లేని అంశాలకు పరిశోధక పర్యవేక్షకుడిగా ఉండటం ఒక అరుదైన విషయమని అనుకొంటాను.
పుస్తకానికి పీఠిక అనేది ఒక రికమెండేషన్ లెటర్ లాంటిది. శిఖామణికి గారికి ఈ విషయం చాలా బాగా తెలుసు. అందుకనే వీరి పీఠికలలో కవి పట్ల, అతని కవిత్వం పట్ల అవ్యాజమైన ప్రేమను చూపుతారు. వెన్ను తడతారు. లోపాలను సున్నితంగా చెపుతారు. 116 పుస్తకాలకు పీఠికా కర్తగా కూడా శిఖామణి సాహిత్యసేవ గణనీయమైనది.
కవిత్వం వ్రాయటం ద్వారా కవి సమాజం నుంచి ఎంతో గౌరవం, సన్మానాలు పొందుతాడు. కవిత్వాన్ని రాయటమే కాక మోయటం కూడా కవి భాద్యతగా తీసుకోవాలి అనుకొంటాను.
“యానమా నా ఆరో ప్రాణమా” అని పలవరించిన శ్రీ శిఖామణి యానాన్ని తన కవిత్వ కార్యక్షేత్రంగా చేసుకొని గత మూడు సంవత్సరాలుగా యానాం ప్రపంచ కవితా దినోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. తెలుగు సాహిత్యంలో లబ్దప్రతిష్టులను యానానికి తీసుకొని వచ్చి పొయెట్రీ వర్క్ షాపు నిర్వహించారు. “శిఖామణి కవితా పురస్కారం” నెలకొల్పి, తెలుగు సాహితీదిగ్గజాలను ఏటా సత్కరించుకొంటున్నారు. ఆంధ్ర దేశంలో వందలాది సభలలో అలుపెరుగక పాల్గొంటూ సాహిత్యప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే “కవి సంధ్య” పత్రికను మూడేళ్ళుగా అప్రతిహతంగా ఒంటిచేత్తో నడిపించుకొంటూ రావటం మరొక ఎత్తు. ఈ పనులన్నీ శిఖామణి మంచి కవే కాదు “గొప్ప కవిత్వ కార్యకర్త” కూడా అని నిరూపిస్తాయి.
ఇక చివరగా
శిఖామణి లేని తెలుగు కవిత్వం ఎలా ఉండేదని ప్రశ్నించుకొంటే – మొదట్లో చెప్పినట్లు, సూర్యుడు, నెత్తురు, అడవి, తుపాకి గొట్టం, ఎన్ కౌంటర్లు లాంటి ఘాటైన పదాలతో తెలుగు కవిత్వం మరికొంతకాలం ఉక్కిరిబిక్కిరి అయిఉండేదేమో; తెలుగు కవిత్వంలో మానవసంబంధాలను ఆర్థ్రంగా చెప్పటం అనే అర వెలితిగా ఉండేదేమో అనిపిస్తుంది.
బొల్లోజు బాబా
17/5/2019
(శ్రీ శిఖామణి చందుసుబ్బారావు సాహిత్య పురస్కారాన్ని పొందిన సందర్భంగా చేసిన ప్రసంగపాఠం.
మరొక్కసారి అభినందనలు తెలుపుతూ)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment