Tuesday, May 18, 2021
Imported post: Facebook Post: 2021-05-18T09:56:44
ఒకానొకప్పుడు Once Upon A Time by K. Sachidanandan
.
నీకుతెలుసా
ఒకానొకప్పుడు కోకిలమాత్రమే కాదు
ప్రతీ పక్షీ గానం చేసేది, కాకితో సహా
అవే మనకు పదాలను ఇచ్చాయి
వాటి పాటలు పంటచేలలో నీళ్ళై పారేవి
వాటిపాటలు పూలను కవిత్వంతో,
పళ్ళను కథలతో, నిద్రను కలలతో,
స్తనాలను పాలతో, దేహాలను కోర్కెలతో
హృదయాలను కరుణతో నింపేవి.
ముక్కులలో రక్తం నిండగా పక్షులు
పాడటం మానేసాయి
ఆపై, చెట్ల నృత్యాలు, మృగాల నవ్వులు
శిలల సంభాషణలు, సెలయేర్ల తియ్యదనాలు
నిలిచిపోయాయి.
చివరకు బుద్ధుడు నేనూ ఒంటరిగా మిగిలిపోయాం
చీకట్లో ఒకరికొకరు అగోచరంగా ఉన్నాం.
ఒణికించే చలిలో రావి ఆకుల్లా రెపరెపలాడాం
బుద్ధుని గద్గదాక్రందనలు శూన్యాన్ని ప్రకాశింపచేశాయి
ఇక ఎంతమాత్రమూ తాళలేక
ముక్తకంఠంతో 'ఓయని' రోదించాం మేం.
వెలుగు విచ్చుకొంది.
సగంకాలిన రెక్కలు అల్లాడిస్తో పక్షులు తిరిగి వచ్చాయి.
భూమిపై అంతరించిన రంగులగురించి, స్వరాల గురించి
నులిమివేయబడిన గొంతుకలతో
ఇంకా మిగిలున్న కొద్ది పదాలతో
పాటలు గానం చేసాయి
మా సమాధుల తోటలో.
.
Once Upon A Time by K. Sachidanandan
అనువాదం: బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment