Sunday, January 17, 2021

Imported post: Facebook Post: 2021-01-17T09:41:44

కులనిర్మూలన అంశంపై ఒక మిత్రుని వాల్ పై వ్రాసిన కొన్ని అభిప్రాయాలు..... కులం మతం సోషల్ డైనమిక్స్ ని ప్రభావితం చేస్తాయి. ఏ పరిస్థితుల్లో ఎలాచేస్తాయి అనేది సూత్రీకరణలకు లొంగదు. కులం, మతం ప్రభావితం చేసే సోషల్ డైనమిక్స్ పరిధి పెద్దది. కులనిర్మూలన అనేది పైపైన మాట్లాడుకొనేంత చిన్న విషయం కాదు. హిందూమత ఆయువుగా చెప్పబడే పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, వాజ్మయం అంతెందుకు నిన్నమొన్నటి చందమామ కథలవరకూ తిరిగి రాసుకోవాలి. కులభావన అంతలా విస్తరించింది, చొచ్చుకుపోయింది. దాని బదులు మరో కొత్తమతాన్ని స్థాపించటం సులభం. ఈ అంశంపై నా అవగాహన ఇది. ఇది లాజికల్ సత్యం అనుకొంటాను తప్ప ఇదే అంతిమ సత్యం అనను. 1. సనాతన ధర్మం మూలసూత్రం వర్ణధర్మం. పుట్టినవారు చతుర్వర్ణాలలో ఏదో ఒకదానిలో ఇమడాల్సిందే. వీరికి వెలుపల చండాలురు పుళిందులు వేదకాలం నుంచే ఉన్నారని చెప్పబడింది. హిందూమతంలో పుట్టామంటేనే ఏదో వర్ణానో/ కులాన్నో అంగీకరించి పుట్టామనే. వాటిని అంగీకరించని వారు హిందూమతాన్ని త్యజించాలి. దీనికి వేరే మాటలేదు. రెండువేల సంవత్సరాలుగా అనేకమంది వివిధ ధర్మాల పేరిట హిందూమతాన్ని విడిచి వెళిపోయారు. హిందూమతానికి సంబంధించి వారు ఏ మతంలోకి వెళ్ళినా, హిందూమతంలో పుట్టాడు కనుక వాడు చచ్చేవరకూ హిందువే. అందుకే హిందూమతంలోకి తిరిగి స్వీకరించే ప్రక్రియకు చెందిన శ్లోకాలు తంతులు మన శాస్త్రాలలో ఎక్కడా లేవు. ఏ క్రిష్టియనునో హిందూ మతంలోకి తీసుకోవాలంటే వాడిని ఏ వర్ణంలో ఉంచాలనేది కూడా ఎక్కడా హిందూమతం ఎక్కడా రాసుకోలేదు. . 2. సనాతన ధర్మం లో క్రతువులు క్రిందివర్గాలవారికి అనుకూలంగా లేవన్న కారణంగా భిన్న తిరుగుబాట్లు వచ్చాయి. అవే బుద్ధిజం, జైనిజం, శాక్తేయం, సూర్యారాధన, గణపత్యం, అజీవకులు ఇంకా తొంభై తొమ్మిది రకాల తిరుగుబాటు వర్గాలు... కొంచెం లేటుగా వీరశైవం. 3. శంకరాచార్యుడు ఈ వ్యవహారం గమనించి అందరినీ సంఘటిత పరచి, పంచ ఆరాధనా పద్దతిని ప్రవేశపెట్టి అన్ని వర్గాలకు ఎంతో కొంత ప్రాతినిథ్యం కల్పించి సనాతన ధర్మాన్ని హిందూమతంగా స్థిరీకరింపచేయటానికి దోహదపడ్డాడు. హిందూమతానికి అది పునరుజ్జీవనం అంటారు కానీ అది దాదాపు పుట్టుక 4. ఆ పిమ్మట వర్ణధర్మం ప్రకారం క్షత్రియుల చేతిలో ఉండాల్సిన రాజ్యం శూద్రులచేతుల్లోకి వెళ్ళింది. చాళుక్యులాదిగా. (శాతవాహనులు కూడా శూద్రులనే వాదన ఉంది). ఈ క్రమంలో బ్రాహ్మణుల పాత్ర మారలేదు. చండాలుర/పుళిందులది కూడా. ఇక శూద్రుల పాలనలో వివిధ వృత్తుల వారు కులాలుగా బిగుసుకుపోవటం మొదలైంది. 5. అంతవరకూ అనాదిగా వర్ణాల మధ్య, వృత్తికార శూద్రుల (నేటి సో కాల్డ్ కులాలు) మధ్య అంతర్వివాహాలు సుబ్బరంగా జరిగాయి. క్రీపూకి చెందిన చాళుక్యుని అర్ధశాస్త్రంలో వివిధ "వర్ణాల మధ్య" (చండాల వర్గంతో సహా) వివాహాల ద్వారా పుట్టిన వారికి వివిధ పేర్లు గమనించవచ్చు. అంటే అవి జరిగాయి. వర్ణాలమధ్య వివాహాలే చంపుకొనేంత నిషిద్దం కానప్పుడు శూద్రుల మధ్య (వర్ణంలోపల) అంతర్వివాహాల పట్ల అభ్యంతరాలు అసలు సోదిలోనే లేవు. శూద్రులందరూ ఒకే ఎంటైటీ అప్పట్లో. కనీసం పదోశతాబ్దం వరకూ. 6. 12-15 శతాబ్దంవచ్చేసరికి ఇలా కులాల పేరుతో శకలాలు, శకలాలుగా విడిపోతున్న సమాజాన్ని సంఘటితపరచటానికి హిందూ మతం చాలా సర్దుబాట్లే చేసింది. వాటి ఫలితమే కులపురాణాలు. అన్నింట్లో బ్రాహ్మలపై ఆధిపత్యం పొందినట్లు, విష్ణువుని ఓడించినట్లూ, తమకులం ప్రమేయం లేకపోతే ఇతరకులాలలో వివాహాలు, క్రతువులు జరగని విధంగా వరాలు పొందినట్లు- ప్రజలందరినీ కలుపుకుపోయేలా ముఖ్యంగా క్రింది వర్గాలను - అనేక పాచ్ వర్క్ లు చేసింది హిందూమతం. వెయ్యిలోపు జనాభా ఉండే అతిచిన్న యూనిట్ అయిన గ్రామాల్లో ఈ పాచ్ వర్క్ వల్ల అందరూ కలిసిమెలిసి బ్రతికారు. గుడులు అన్నివర్గాలను కలుపుకు పోయేది. మంగలులు, కంసాలులు, శిల్పులు, కుమ్మరులు వడ్రంగులు, యాదవులు, పల్లకి బోయిలు, కాపలా కాసే దళితులు, గుళ్లపై గద్దలు రాబందులు మాంసఖండాలు వేయకుండా చూసే ఒక వర్గం, పుల్లలు కొట్టేవారు, మాలకారులు, తోట మాలులు, కళావంతులు, వ్యాపారులు, బ్రాహ్మలు, రాజులు అందరినీ ఇముడ్చుకొంది గుడి. ఈ పై వృత్తులకు ఎంతెంత జీతాలివ్వాలనేది వివిధ శాసనాల్లో కనిపిస్తాయి ఈనాటికీ. మెకంజీ కైఫియ్యతులు రాసేకాలం వరకూ శ్రీశైలంలో రోజూ ఇచ్చే బలులను మాలమాదిగలే నిర్వహించేవారు. అది ఆనాటి ఆర్ధిక వ్యవస్థ . ఇదంతా హిందూమతం గొప్పతనం అనుకోలేం. ఎందుకంటే నిచ్చెనమెట్ల వ్యవస్థ మరింత బిగుసుకొంది క్రమేపీ. కానీ ఏదో విధంగా సమాజంలోని అన్నివర్గాలవారికీ ఉపాధులు దొరికాయి. ఆమేరకు కులంఅనేది ఒకనాటి ఉపాధి హామీ పథకం. ప్రతి ఊరిలో బారాబలవతీలు పేరుతో పన్నెండు కులాలకు చెందినవారు ఉండాలని నిర్ధేశించింది. వారిని ఆ ఊరికి నియమించటం రాజు బాధ్యత. ఏ ఒక్కరు తగ్గినా (వారసులు లేకుండా ఆకుటుంబం అంతరిస్తే) పక్కగ్రామం నుంచి ఆ వృత్తికార కుటుంబాన్ని మేళతాళాలతో ఆహ్వానించుకొని, వారికి వృత్తి మాన్యాలు ఇచ్చి వూరిలో ఉండేలా చూసుకొనేవారు. ఒక్కోసారి కొంతమంది వృత్తికారులు ఊరిపై అలిగి పొరుగూరుపోయి నిరసన తెలిపితే వారిని మరల బుజ్జగించి తెచ్చుకొన్నట్లు ఆధారాలున్నాయి. 7. ఒకప్పుడు సమాజ క్షేమమే మానవజాతి ముఖ్య ప్రయారిటీ. సమాజం తరువాతే వ్యక్తి. అందుకే ఒకనివల్ల సమాజానికి ముప్పు ఉందంటే వాడిని చంపేయటమే చట్టం. శిక్షల తీవ్రత ఒక్కో వర్గానికి/వర్ణానికి ఒక్కోలా ఉండేవనేది కూడా కాదనలేని సత్యం. కానీ నేడు సమాజ క్షేమం ప్రయారిటీ కాదు. వ్యక్తే ప్రధానం. ఇది ఆధునిక, పరిణామం. నాగరీకమైనది. అందుకే కరడు కట్టిన నేరస్థుడికి కూడా హక్కులు ఉన్నాయి. ఇది కాలమార్పు. యుగధర్మం. 8. ఈ వర్ణాలు, కులాలు వాటి హెచ్చు తగ్గులు, కట్టుబాట్లు, సంకరానికి శిక్షలు అనేవి సమాజమే ప్రధాన ప్రయారిటీ గా ఉన్నరోజుల్లో వ్రాసుకొన్న చట్టాలు. ఆ నేపథ్యానికి, ఆ కాలానికి అవి 100 శాతం కరక్టు కావొచ్చు. ఈ రోజు వాళ్లు అలా ఎందుకు చేసారు అని వాదించుకోవటం, వాళ్లు రాసుకొన్న అప్పటికి వర్తించే చట్టాలను తగలపెట్టటం మన పూర్వీకులను అవమానించటమే. వాళ్ళు వాటివల్ల సమాజానికి మంచి జరుగుతుందనే రాసుకొన్నారు. వారి పరిస్థితులు అలాంటివి. ఒకరిని ఒకరు చంపుకొని, ఆకలేస్తే పీక్కుతిని, కోర్కె రేగితే బలాత్కరించే ఆటవిక సమాజం నుంచి వచ్చినవారికి తప్పో ఒప్పో ఆపాటి "క్రమశిక్షణ" ఆనాటికి అవసరం అయి ఉండొచ్చు. మనం ఎవరు జడ్జ్ చెయ్యటానికి. 9. మరి నేటి సమాజంలో కులాల రిలవెన్స్ ఏమిటి? ఆధునిక సమాజం వ్యక్తి ప్రధాన సమాజం. వ్యక్తిప్రధానం అయిపోవటంతో వాడు ఒంటరి అయిపోయాడు. బలహీనుడు అయిపోయాడు. ఎదగటానికో, రక్షణ కొరకో అతనికి సమూహం అవసరం ఏర్పడింది. సమూహబలమే తనబలంగా భావించుకోవాల్సి వస్తుంది. టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎలక్త్రీషియన్లు, ప్లంబర్లు సమూహాలుగా ఏర్పడతారని మార్క్స్ ఊహించాడు. అది జరగలేదు. ఇక ఆధునిక మానవుడికి కనిపించే ఏకైక ప్రత్యామ్న్యాయం కులం. అప్పటికే నాలుగైదు వందల సంవత్సరాలుగా స్థిరపడిన కులం. కనుక కులం నేడు మరింత బలపడింది. ఇది పోవాలంటే మరలా సమాజమే ప్రధాన ప్రయారిటీగా ఉండే పరిస్థితులు రావాలి. కానీ మానవజాతి ప్రయాణం ఆ వైపు లేదు. 10. బ్రిటిష్ పాలన నేటి భారతదేశంలోని 60% భూభాగంలోనే జరిగింది. ఇక్కడ వారు బలమైన కుల వివక్ష వ్యతిరేక చట్టాలు, సంస్కరణలు చేసారు. బ్రాహ్మలు మాలమాదిగలు ఒకే బెంచిపై కూర్చుని చదువు నేర్చుకొనే స్కూళ్లను నెలకొల్పారు. ఆధునిక విద్య అందించారు. అందుకనే ఈ ప్రాంతాలనుంచి అనేక సంఘసంస్కర్తలు పుట్టుకొచ్చారు. అనేక మంది దళితులు విద్యావంతులై ఉన్నతోద్యోగాలు చేసారు. శూద్రులు వ్యాపారాలు చేసి కోటీశ్వరులయ్యారు. ఈ ప్రాంతాలలో బ్రిటిష్ పాలనలో కుల వివక్ష లేదని చెప్పలేం కానీ చంపుకునేంత ఉందని చెప్పటానికి బలమైన చారిత్రిక ఆధారాలు కనిపించవు. ఇక మిగిలిన 40% భారతభూభాగాన్ని హిందూ రాజులు పాలించారు. (నేటి ఉత్తరభారతదేశంలోని చాలావరకూ) వారి రాజ్యాలలో బ్రిటిష్ చట్టాలు వర్తించలేదు. వారు సమాజాన్ని ధర్మ శాస్త్రాల ఆధారంగా వెనక్కి నడిపించారు. శిక్షలు విధించారు. వర్ణధర్మం మీరినందుకు క్రింది కులస్థులను ఊచకోతలు కోసారు. ఈ విశాలమైన భారతదేశంలో వర్ణవివక్షకు సంబంధించి అన్నిప్రాంతాలలో ఒకేరకమైన న్యాయాలు లేవు. కొన్ని పోకెట్స్ లలో నడిచిన కులపీడన ఇతరప్రాంతాలలో కూడా అదేవిధంగా జరిగిందని భావించటం తప్పు. అది హిందూమతం పై చేసిన దుష్ప్రచారం. బొల్లోజు బాబా

No comments:

Post a Comment