హుయాన్ త్సాంగ్ పిఠాపురాన్ని సందర్శించాడా?
.
Yuan Chwang క్రీశ 631 లో భారతదేశం ప్రవేశించి 645 లో తిరిగి చైనా వెళ్లిపోయాడు. ఇతడు ఆంధ్రదేశాన్ని క్రీశ.635-36 ల మధ్య సందర్శించాడు[1].
హుయాన్ త్సాంగ్ కోశల నుండి బయలుదేరి An-to-lo చేరుకొన్నాను దీని రాజధాని Ping-chi/Ping-ki-lo అని పేర్కొన్నాడు. An-to-lo ని చరిత్రకారులు ఆంధ్రగా గుర్తించారు. ఇది క్రీశ మొదటి శతాబ్దానికి చెందిన రోమన్ చరిత్రకారుడు Pliny చెప్పిన Andara పదంతో సరిపోతుంది. ఇక Ping-ki-lo పదాన్ని Julein అనే చరిత్రకారుడు కొంత సంశయపూర్వకంగా Vingila లేదా వేంగి కావొచ్చునని (పెదవేగి, పశ్చిమగోదావరి) అన్నాడు. Fergusson ఈ రాజధాని ఎక్కడో తెలియటం లేదు కానీ ఉచ్ఛారణ రీత్యా వేంగి తో సరిపోలుతుంది అన్నాడు[2].
హ్యుయాన్త్సాంగ్ Ping-ki-lo నుంచి దక్షిణంవైపున 1000 లీలు ప్రయాణించి Te-na-ka-che-ka చేరుకొన్నట్లు చెప్పాడు[3]. Te-na-ka-che-ka అనే ప్రాంతాన్ని చాలా సులభంగానే Dhanakataka (ధరణికోట, గుంటూరు జిల్లా) గా అందరూ గుర్తించారు. హ్యుయాన్త్సాంగ్ 1000 లీలు ప్రయాణించానని అన్నాడు.
హ్యుయాన్త్సాంగ్ కొలతలను అతను భారతదేశంలో సందర్శించిన ప్రాచీననగరాల మధ్య దూరంతో పోల్చిచూసి Cunningham 40 లీలు 6.75 మైళ్ళు గా తేల్చాడు. అంటే 6 లీలు ఒక మైలు దూరం[4].
6 లీలు ఒక మైలు అయితే వెయ్య లీలు 167 మైళ్ళు అవుతుంది.
Ping-ki-lo ని వేంగి అనుకొంటే వేంగి నుంచి ధరణికోటకు దూరం 167 మైళ్ళు లేదు 70 మైళ్ళే. కనుక హ్యుయాన్త్సాంగ్ చెప్పిన ఆంధ్రరాజధాని Ping-ki-lo వేంగి అయ్యే అవకాశం లేదు. Ping-ki-lo అనేది ధరణికోటనుండి 167 మైళ్ల దూరంలో ఉండే మరొక పట్టణం అవ్వాలి. ఇది పిఠాపురం కావొచ్చు. ఎందుకంటే
1. ధరణికోటనుంచి పిఠాపురానికి దూరం 160 మైళ్ళు. ఇది హ్యుయాన్త్సాంగ్ చెప్పిన వెయ్యి లీల దూరానికి సరిపోతుంది.
2. హ్యుయాన్త్సాంగ్ ఈ ప్రాంతాన్ని క్రీశ. 635-36 ల మధ్య సందర్శించాడు. అది కుబ్జ విష్ణువర్ధనుడి కాలము. అప్పటికి శ్రీకాకుళం నుండి నెల్లూరువరకూ విస్తరించిన ఆంధ్రప్రాంతానికి వేంగి రాజధానిగా లేదు. పిఠాపురం రాజధాని[5]. ఈ కోణంలోంచి ఆలోచించి చూస్తే హ్యుయాన్త్సాంగ్ కోసలనుండి ధరణికోటకు పిఠాపురం మీదుగా వెళ్ళి ఉంటాడని భావించటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి.
Ping-ki-lo (పిఠాపురం) గురించి హ్యుయాన్త్సాంగ్ చేసిన వర్ణనలు ఇవి.
ఈ ఆంధ్ర దేశము వైశాల్యం 3000 లీలు. దీనికి రాజధాని Ping-ki-lo (పిఠాపురము). దీని విస్తీర్ణము 20 లీలు. ఇక్కడ సారవంతమైన నేలలు కలవు. తేమ, వేడి అధికము. ఇక్కడి ప్రజలు సాహసము కలవారు. వీరిభాష మధ్యభారతదేశ భాషకన్నా భిన్నముగా ఉనంది. లిపి మాత్రము మధ్యభారతదేశ లిపి వలె ఉన్నది (బ్రహ్మి లిపి కావొచ్చు)
ఈ రాజధాని సమీపంలో ముప్పైకి పైగా బౌద్ధారామములు, 3000 మంది భిక్షువులు ఉన్నారు. ఒక సంఘారామము కలదు. ఇది పెద్ద పెద్ద గదులతో, అంతస్తులతో అందమైన అలంకారములతో శోభిల్లుతున్నది. ఇందులో ఉన్న బుద్ధుని విగ్రహము సుందరముగా, జీవకళ ఉట్టిపడుతూ ఉన్నది. ఈ సంఘారామము ప్రాంగణమున కొన్ని వందల అడుగుల ఎత్తైన స్తూపమొకటి కలదు. ఈ సంఘారామమును, స్తూపమును అచలుడను శిల్పి నిర్మించాడు.
ఇక్కడి నుండి నైరుతి దిక్కుగా ఇరవై లీల దూరములో ఒంటరిగా ఒక కొండపై శిలాస్తూపము, అశోకవనము కలదు. ఇచ్చట జినభోధిసత్వుడు తన ప్రవచనాలను అందించి, మహిమలు చూపి, అనేకమందిని తన అనుయాయిలను చేసుకొన్నాడట[6].
హ్యుయాన్త్సాంగ్ Ping-ki-lo (పిఠాపురం) సందర్శించిన సమయములో చూసిన బౌద్ధఆరామాలు, స్తూపాలలో కొన్ని మనకు ఈ ప్రాంతపరిసరాలలో నేటికీ శిథిలాలరూపంలో కనిపిస్తాయి. పిఠాపురం సమీపప్రాంతాలైన గొల్లప్రోలు, కొడవలి, మల్లవరం, అన్నవరం, కొత్తపల్లి, కుమ్మరిలోవ, గోపాలపట్నం, శృంగవృక్షం, రంపఎర్రంపాలెం, కోరుకొండ, ఎర్రవరం, పెద్దాపురంలలో అసంఖ్యాకమైన బౌద్ధ అవశేషాలు కలవు.
పిఠాపురానికి ఏడుకిలోమీటర్ల దూరంలో కల గొల్లప్రోలు, ఎవీ నగరం గ్రామంలో ఇటీవల భారీ బౌద్ధస్తూపం గుర్తించారు. ఇక్కడి శిథిలాలలో గాంధారశిల్పశైలిలో చెక్కిన బుద్ధుడి తలభాగం దొరికింది. స్తూపం వద్దకు వెళ్ళటానికి రాతితో చెక్కిన మెట్లు కలవు. ఇంకా లోతైన పరిశొధనలు జరిగితే మరిన్ని ప్రాచీన అవశేషాలు ఈ ప్రాంతంలో బయటపడతాయి. పిఠాపురం సమీపంలోని చిత్రాడ వద్ద వజ్రయానానికి చెందిన బౌద్ధ అవశేషాలు లభించాయి[7].
చేబ్రోలు వద్ద కూడా క్రీస్తుపూర్వంనాటి బౌద్ధ/జైన విగ్రహాలు బయటపడ్డాయి.
Ping-ki-lo (పిఠాపురము) లో 30 కి పైగా బౌద్ధారామములు ఉన్నాయి అన్న హ్యుయాన్త్సాంగ్ ధనకటకంలో చాలా బౌద్ధారామాలు ఉన్నాయి కానీ చాలామట్టుకు ఖాళీగా ఉన్నాయి, మహాసంఘిక కి చెందిన బిక్షుకులు మాత్రం ఓ వెయ్యి మంది వరకూ ఉన్నారు, 100 కు పైగా దేవ ఆలయాలు (హిందూ) ఉన్నాయి అని చెప్పటం ఆసక్తికరం. అంటే ఆంధ్రలొ బౌద్ధం ధనకటంలో అప్పటికి క్రమేపీ కనుమరుగవుతూ ఉండగా పిఠాపురం వద్ద మెరుగైన స్థితిలో ఉండేదని భావించవచ్చు.
***
హ్యుయాన్త్సాంగ్ చెప్పిన వర్ణనలను బట్టి Ping-ki-lo గొప్ప బౌద్ధక్షేత్రం గా విలసిల్లిందని అర్ధమౌతుంది. పిఠాపురం, సమీప ప్రాంతాలలో నేడు అడుగడుగునా అసంఖ్యాకంగా బౌద్ధ అవశేషాలు బయటపడుతూన్నాయి. 1848 లో పిఠాపురంలోని ఒక దిబ్బవద్ద జరిపిన తవ్వకాలలో ఒక గాజుభరిణి దొరికిందని దానిలో పచ్చలు, కెంపులు, పగడాలు, కొన్ని ముత్యాలు, స్వర్ణంతో చేసిన నగిషీలు ఉన్నాయని వాటిని మద్రాసు మ్యూజియంకు పంపటం జరిగిందని ప్రముఖ బ్రిటిష్ చరిత్రకారుడు Walter Elliot పేర్కొన్నాడు. (JAHRS Vol 5, 1930 p.no151).
దొరుకుతున్న ఆధారాలను బట్టి హ్యుయాన్త్సాంగ్ వర్ణించిన ఒకనాటి Ping-ki-lo నేటి పిఠాపురం కావొచ్చు అనే ప్రతిపాదనను అంత సులభంగా త్రోసిపుచ్చలేం.
(తూర్పుగోదావరి జిల్లా-ప్రాచీనపట్టణాలు- అనేపుస్తకంలో పిఠాపురం వ్యాసంలోని కొంతభాగం)
రిఫరెన్సులు
[1] ఆంధ్రదేశము విదేశీయాత్రికులు - భావరాజు కృష్ణారావు పేజినంబరు. 62
[2] On Yuan Chwang's travels in India, 629-645 A.D, Thomas Watters Vol II-p.no 210, The Capital, Ping-ki (or Chi)-lo, is restored doubtfully by Julien as Vingila//Fergusson says that the name here given for it “sounds very like Vengi…
[3] Ibid p.no 214
[4] The Linear measures of Fahian and yuan chwang by Major W. Vost - The Journal of the Royal Asiatic Society of Great Britain and Ireland Jan., 1903), pp. 65-107)
[5] తిమ్మాపురం తామ్రశాసనంలో -. EI Vol IX p. no 317 - Vishnuvardhana I (కుబ్జవిష్ణువర్ధనుడు క్రీశ. 624-641) resided at Pishtapura, the modern pithapuram in the godavari district అని ఉన్నది.
[6] ఇది పిఠాపురం సమీపంలో కల కొడవలి స్తూపం కావొచ్చు. - Where the Buddha preached, displayed miracles, and received into his religion a countless multitude - p.209, On Yuan Chwang's Travels in India, Thomas Watters Vol II
[7] The Hindu, 15, December, 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment