ప్రముఖ హిందీకవి మంగలేష్ దబ్రాల్ కు నివాళిగా ఆయన కవిత్వానువాదాలు
.
1. ఈ శీతాకాలం - This winter by Mangalesh Dabral
పోయిన శీతాకాలం చాలా బాధపెట్టింది
దాన్ని తలచుకొంటేనే వణుకు వస్తోంది
గత శీతాకాలం అమ్మ వెళ్ళిపోయింది
ఒక ప్రేమలేఖ కనపడకుండాపోయింది
ఒక ఉద్యోగం పోయింది
ఆ రాత్రులు ఎక్కడెక్కడ తిరిగానో గుర్తే లేదు
నేను చేసిన ఫోన్ కాల్స్, నా ఆత్మశకలాలూ
నాపై కుప్పకూలాయి
గత ఏడాది వేసుకొన్న దుస్తుల మూటల్ని విప్పదీసాను
దుప్పట్లు, మఫ్లర్లు, మంకీ కేప్ లు
వాటికేసి అలా తేరిపార చూసాను
ఆ రోజులు ముగిసిపోయాయి
ఈ శీతాకాలం అంత కఠినంగా ఉండదు... నిజంగానే!
.
2. తాత గారి ఫొటో - Grandfather's Photograph by Mangalesh Dabral
మా తాతగారికి ఫొటోలు తీయించుకోవటం
పెద్దగా ఇష్టం ఉండేది కాదేమో లేదా టైమ్ చిక్కలేదో
ఒకే ఒక ఫొటో ఉంది ఆయనిది
నీళ్ళబరువుతో వేలాడే మబ్బులా
రంగువెలసిన గోడకి తగిలించి
మా తాతగారి గురించి మాకు తెలిసిందల్లా
ఆయన బిచ్చగాళ్ళకు దానాలు చేసేవాడని
రాత్రుళ్ళు నిద్రపట్టక అటూ ఇటూ దొర్లేవాడని
ఉదయం తన పక్కను చక్కగా సర్దుకొనేవాడనీ.. అంతే
నేను అప్పటికి చాలా చిన్నపిల్లాడ్ని
ఆయన అమాయికత్వం కానీ కోపం కానీ ఎప్పుడూ చూడలేదు
ఫొటోలు మనుషుల అంతరంగాల్ని ఎన్నటికీ చెప్పలేవు.
అమ్మ అంటూండేది
మేం నిద్రపోతున్నప్పుడు
రాత్రిపూట మమ్మల్ని చుట్టుముట్టే వింత వింత జీవుల్ని
మా తాత ఫొటోలో మెలకువుగా ఉండి కాపలా కాస్తాడని
నేను మా తాత అంత ఎత్తు అవ్వలేదు
అంత శాంతంగానూ, గంభీరంగాను కూడా
కానీ ఆయన లక్షణాలు నాలో ఏమూలో ఉన్నాయనే అనుకొంటాను
ఆ అమాయికత్వం, ఆ కోపం.
నేనూ తలదించుకొనే నడుస్తాను
ప్రతీరోజూ ఒక ఖాళీ ఫొటో ఫ్రేములో
నన్ను నేను చూసుకొంటూంటాను.
మూలం. Mangalesh Dabral
అనువాదం: బొల్లోజు బాబా
No comments:
Post a Comment