thank you so much Haribabu Maddukuri garu for a wonderful introduction to the book. Thanks alot to all your friends who encouraged the work.
Bolloju Baba
***
మెకంజీ కైఫియత్తులు - తూర్పుగోదావరి జిల్లా..
ఇప్పుడు మనం వాడే అధునాతన కారు, బైకు ఎలా వచ్చాయి..?? మార్పులు చెందబడ్డ పాతతరం బళ్ళనుంచేగా..
అట్లాగే ప్రతీ పాతికేళ్ళకి కాలగతిలోనూ, జనజీవనంలో సంభవించే మార్పుల్ని గనుక సంఘటనలు, వ్యవహారాల పేరిట జాగ్రత్తగా రికార్డుల్లో భద్రపరిస్తే అవి రాబోయే తరాలకి దిక్సూచిగానూ, వివిధ భావజాలాలకి దర్పణంగానూ నిలిచి పలు అధ్యయనాలకి పనికొస్తాయ్, మనదైన ఒరవడిని ముందుకు తీసుకెళ్లగల్గుతాయి..
స్థానిక విషయాలైనా, సాంకేతిక అంశాలైనా వాటి చరిత్ర, నేపథ్యం తెల్సుకోవడం వల్లే నవీనస్రవంతికి పరిపూర్ణత చేకూరుతుందని నా నమ్మకం.. కానీ మనకి చరిత్ర సృష్టించి జబ్బలు చరుచుకోవడం మీదున్న శ్రద్ధ వాటిని భద్రపరచుకోవడం మీద ఉండదనేది కాదనలేని వాస్తవం.. దానిక్కారణం ముందునించీ 'కరణం గారు ఎంత కొలిస్తే అంత' అని మనకేం పట్టనట్టు ఉండటం.. 😊
మనదేశంలో బ్రిటీషర్లు బలపడుతున్న బలహీనరోజుల్లో ఇండియాకి పొట్ట చేత్తో పట్టుకునొచ్చిన ఇంగ్లీష్ దొరల్లో కొంతమంది మహానుభావులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని జీతం తీసుకునెళ్లిపోకుండా మనకెప్పటికీ పనికొచ్చే పనులు చేసి పెట్టి చరిత్రలో నిలిచిపోయారు..
వాళ్ళలో కోస్తా ప్రాతఃస్మరణీయులు కాటన్ దొర, తెలుగుసాహిత్య క్రౌన్ సిపి బ్రౌన్ అగ్రగణ్యులైతే వాళ్ళ తర్వాత గుర్తుంచుకోదగ్గ మరో ముఖ్యవ్యక్తి కల్నల్ మెకంజీ అనే బ్రిటిష్ మిలట్రీ ఇంజనీర్..
17వశతాబ్దంలో కల్నల్ మెకంజీగారు తక్కిన బ్రిటీషర్లలాగే ఇక్కడికొచ్చాడు.. బ్రిటీషర్లకి, టిప్పుసుల్తాన్కి మధ్య జరిగిన మూడో మైసూర్ యుద్ధంలో టిప్పుసుల్తాన్ ఓడిపోయాకా అప్పటివరకూ అతగాడి ఏలుబడిలో ఉన్న ప్రాంతాల్ని, బ్రిటిష్ ప్రభుత్వ ప్రభావం ప్రత్యక్షంగా లేని పరగణాల్ని సర్వే చెయ్యమని 1800వ సంవత్సరంలో మెకంజీకి బాధ్యతలు అప్పగించింది ఈస్టిండియా ప్రభుత్వం..
అయితే ఆంగ్లేయుడు కావడంతో ఆంధ్రభాష రాదు కాబట్టి కావలి బొర్రయ్య, లక్ష్మయ్య అనే గొప్ప దక్షత కలిగిన ఇద్దరు నియోగ బ్రాహ్మణ కవలసోదరుల్ని గుమస్తాలుగా పెట్టుకుని పని కానిచ్చాట్ట.. (ఈ సోదరులిద్దరూ యే ఊరెళ్తే ఆ ఊరి గ్రామకరణాల సాయంతో చారిత్రక అవసరాలకి తగట్టు ఎలా అనువైన వచనం చేశారన్నది ఇంకో గొప్ప ఆసక్తికర చరిత్ర).
అట్లా తెలుగునాట ఎన్నో జిల్లాలు తిరిగి సర్వేలు గట్రా నిర్వహించి పుట్టుపూర్వోత్తరాల్ని కలాలతో తవ్వితీసి ఆ అమూల్యమైన సమాచారానికి కైఫియత్తులని (స్థానికచరిత్ర అని అర్ధమట) అరబిక్ పేరుపెట్టారు.. కట్టింది కూలీవాళ్ళైనా కట్టించింది ఫలానా షాజహాన్ కాబట్టి తాజ్మహల్ అతడిదే అయినట్టు ఈ కైఫియత్తుల సమాచార కష్టమంతా కావలి కవలలు, కరణాలదే అయినన్నప్పటికీ ఈ తతంగం వెనుకున్న మూలకారణం కల్నల్ దొరది కాబట్టి అవి మెకంజీ కైఫియ్యత్తులయ్యాయ్.. వీటిలో అప్పటి సీడెడ్/దత్తమండలాలైన రాయలసీమ జిల్లాల్నుంచి కోస్తాజిల్లాల వరకూ ప్రతీ ప్రాంతానికి కైఫియత్తులున్నాయ్.. వీటినే మన ప్రభుత్వాలు ఇప్పటికీ రిఫరెన్సులుగా వాడుతున్నాయ్..
అదంతా గతం..
ప్రస్తుతానికొస్తే రచయిత బొల్లోజు బాబాగారు మెకంజీ కైఫియ్యత్తుల మీద తూర్పుగోదావరిజిల్లాకి సంబంధించి పుస్తకం వేశారని మొన్న శ్రీధరన్న చెప్పగానే సమయానికి ఇండియాలో ఉండబట్టి వెంటనే ఆర్డర్ పెట్టి సంపాదించి ఇందాకే పూర్తిచేసేసా..
చిన్నప్పట్నుంచీ ఎరిగిన ఊళ్లే అయినాగానీ చదువుతూ ఉండగానే ఎన్నో కొత్త విషయాలు తెల్సి ఆశ్చర్యానికి గురిచేశాయ్..
శ్రీధరన్న చెప్పినట్టు ఇది తూగోజి కైఫియత్తు అయినాగానీ ఈ పుస్తకాన్ని చదవడానికి తూగోజీవాళ్లే కానవసరం లేదు.. విజయనగరం, పిఠాపురం, రాజమహేంద్రవరం, పెద్దాపురం, సామర్లకోట, కోరుకొండ సంస్థానాలు మొదలుకుని వేంగీచాళుక్యులు, రెడ్డిరాజులు, కొండవీడు రాజులపాలనా కాలం నాటి చారిత్రక విశేషాలతో బాటు మెకంజీ సేకరించిన శాసనాలు, చారిత్రక వివరణలు ఉన్నాయి కాబట్టి చరిత్ర మీద ఆసక్తి ఉన్నవాళ్ళెవ్వరైనా నిరభ్యంతరంగా చదివెయ్యొచ్చు..
ఇన్నాళ్లూ మా ఊరిని అప్పుడెప్పుడో ఫలానా శ్యామలదేవి అనే రాణి పరిపాలించింది కాబట్టే మా శ్యామలకోట కాస్తా బ్రిటీష్ బండనోళ్ళలో పడి సామర్లకోట అయ్యి కూర్చుందని మా అందరి ప్రగాఢ నమ్మకం.. కానీ చామర్లకోట అనబడే చాళుక్యభీమవర పట్టణం కాలక్రమేణా శ్యామలకోటగా ఎలా మారిందనే కారణం వెనుక పదిపేజీల చరిత్ర ఉందని ఈ పుస్తకం చదివేదాక నాకు తెలీనే తెలీదు.. (ఆ..ట్ట్ మూమెంట్.. విజిల్స్..)
ఇట్లాంటి మనదైన, అరుదైన చరిత్రని అతి చవగ్గా అందించిన ఈ 192 పేజీల పుస్తకం ధర కేవలం 200 రూపాయలే కావడం మరో ఆశ్చర్యకర విషయం..
పల్లవి పబ్లికేషన్స్ వారి ద్వారా దొరికే పుస్తకం కోసం 9866115655 కి వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు.. రిజిస్టర్డ్ పోస్టులో మీ ఇంటికొచ్చేస్తుంది..
Sri. Haribabu Maddukuri
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment