Tuesday, January 5, 2021

కోరంగి సెమెటరీ



కోరంగి సెమెటరీ లో బ్రిటిష్ అధికారులకు చెందిన ఏడు సమాధులు ఉన్నట్లు List of Inscriptions on Tombs in Madras Vol II లో సమాచారం ఉంది. అవి William Clark (1802), A. Meris (1804), Alexander Woodcock (1816), John Eaton (1819), Charles Eaton (1827), William Charles Eaton (1857) వ్యక్తులవి. వీరు కోరింగలో కంపనీ అధికారులుగా పనిచేసి ఇక్కడే గతించారు.
"తూర్పుగోదావరి జిల్లా-ప్రాచీనపట్టణాలు" అనే పుస్తకం కొరకు సమాచార సేకరణలో భాగంగా పై సమాధుల ఫొటోలను తీసుకొందామని కోరింగ సెమిటరీలను సందర్శించాను
కొన్నేళ్ళక్రితం ఈ సమాధులను మొత్తం పెకలించి ఆ ప్రాంతాన్ని చదును చేసినట్లు తెలిసింది. వాటిని విక్టోరియా సమాధులు అని స్థానికులు పిలుచుకొనేవారట. స్థానిక మాజీ సర్పంచి శ్రీ బుజ్జి గారి సహాయంతో, అతి కష్టం మీద ఎవరో ఔత్సాహికుడు భద్రపరచిన ఒక సమాధి ఫలకం దొరికింది. అది కూడా వీధి కరంటు స్తంభానికి నిలబెట్టి ఉంది. 4X3‍X0.5 అడుగుల కొలతలతో ఉన్న నల్ల రాయి అది. దానిపై
.
"Sacred to the memory of Alexander Woodcock, Esq, who departed this life on 19th May 1816, aged 46 and Mary Ann, his infant daughter, who died in March, 1810, aged 11 months" అని ఉన్నది.
ఈ అలెగ్జాండర్ వుడ్ కాక్ కోరంగి ఒక పెద్ద ఓడరేవుగా, నౌకా నిర్మాణకేంద్రంగా వెలుగొందిన కాలంలో ఓడరేవు అధికారిగా పని చేసాడు (Master attendant).
1817 నాటి Asiatic Journal and Monthly Register లో ఈ అలెగ్జాండర్ వుడ్ కాక్, Lark అనే ఓడపై కోరంగినుండి మద్రాసు వెళుతూ దారిమధ్యలో చనిపోయాడని ఉంది.
పైన చెప్పిన ఫలకం మద్రాసులో తయారైనట్లు క్రింద రాసి ఉంది. ఆ ఫలకంపై అలెగ్జాండర్ పేరుతో పాటు అంతకు ఆరేళ్ల క్రితం పదకొండునెలల వయసులో చనిపోయిన అతని కూతురు Mary Ann పేరు కూడా ఉండటం గమనార్హం. బహుశా అలెగ్జాండర్ మిత్రులో బంధువులో ఎవరో ఈ ఫలకాన్ని మద్రాసులో తయారుచేయించి ఆ తండ్రి కూతుర్ల జ్ఞాపకార్ధంగా పాతించి ఉంటారు.
***
.
కోరంగిలో 1827 చనిపోయిన Charles Eaton సమాధిఫలకం దొరుకుతుందని ఆశపడ్డాను. ఇతను కోరంగి ఓడరేవు అధికారిగా యాభైఏళ్ళు పనిచేసాడు. ఈ రేవుని ఎంతగానో అభివృద్దిపరిచాడు. ఇతని జ్ఞాపకార్ధం 1833 లో కోరంగిలో నిర్మితమైన ఒక ఓడకు " Charles Eaton" అనే పేరు పెట్టారు.
ఆ ఓడ ఏలా ఉండేదో వివరాలు ఇలా ఉన్నాయి...
.
"Charles Eaton 350 టన్నుల బరువును మోయగలిగే సామర్ధ్యము కలిగి ఉన్నది. కోరంగి ఓడరేవు అధికారిగా పనిచేసి 1827 లో ఇక్కడే మరణించిన Charles Eaton పేరును ఈ ఓడకు పెట్టారు. ఈ ఓడ అత్యుత్తమ టేకు తో తయారయినది. రెండు అంతస్థులు కలవు. ఒక్కో అంతస్థు ఎత్తు ఆరున్నర అడుగులు. ఓడముందరి భాగము ఎత్తుగా అందముగా నగిషీలతో ఉన్నది. గదుల మధ్య నడవటానికి పొడవుగా, వెడల్పైన వసారా కలదు. ఓడ వెలుపలి భాగం దృఢంగా ఉండటం కొరకు చెక్కలకు సున్నం, తారులతో రాగిరేకులు తాపడం చేసి ఉన్నవి.
ఈ ఓడకు చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే, ప్రయాణికులు బసచేసే గదులు పెద్ద ఓడలలో ఉన్నట్లుగా చాలా విశాలంగా, విలాసవంతంగా ఉండి, ప్రతి గదికి ప్రత్యేకమైన Toilet కలిగి ఉండటం. ఈ ఓడను లండన్ మార్కెట్టులో అమ్మకానికి పెట్టగా Gledstanes & Co అనే కంపనీ కొనుగోలు చేసింది"
***
కోరంగికి కనీసం రెండువేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది కళింగ రాజ్యంలో ఉండేది. మధ్యమధ్యలో కొన్ని గేప్స్ ఉన్నప్పటికీ మరలా తిరిగి ఈస్ట్ ఇండియా కంపనీ పాలనలో పెద్ద ఓడరేవుగా, నౌకానిర్మాణ కేంద్రంగా కోరంగి పునరుజ్జీవనం పొందింది. ఇక్కడ తయారైన ఓడలు విదేశాలలో విక్రయించబడేవి. సైక్లోనులు, ఉప్పెనల ప్రభావం, క్రమేపీ ఇసుకమేటలు వేయటంతో ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంనాటికి కోరంగి తన ప్రాభవం కోల్పోయింది. నేడు గతవైభవాన్ని సూచించే ఏ చిహ్నాలూ లేవు.
సెమెటరీని కూడా ఇటీవలే పాడుచేసుకోవటం దురదృష్టకరం.







బొల్లోజు బాబా
యానాం సెమెటరీ వివరాలు
https://sahitheeyanam.blogspot.com/.../my-paper...
భీమిలి సెమెటరీ వివరాలు
https://www.facebook.com/bolloju.baba/posts/10214592656154902




No comments:

Post a Comment