Tuesday, January 5, 2021

ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు- ఒక పరిశీలన

 ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు- ఒక పరిశీలన

తెలుగులో సాహిత్యవిమర్శకు సంబంధించి చాలా తక్కువ పుస్తకాలు వచ్చాయి. ఒక నిర్ధిష్టమైన సాహిత్యసిద్ధాంతాన్ని ప్రతిపాదించే పుస్తకాలు దాదాపు మృగ్యమనే చెప్పుకోవచ్చు. ఇటీవలి కాలంలో ప్రముఖ విమర్శకుడు శ్రీ సీతారంగారి వాల్ మీద ఈ అంశంపై మంచి చర్చ జరిగింది. ప్రముఖ కవి, విమర్శకులు, నవలా రచయిత శ్రీ సాగర్ శ్రీరామకవచం గారు “ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు” పేరిట ఒక విమర్శనాత్మకవ్యాస సంపుటిని వెలువరించారు. దీనిలో వారు సాహిత్యాన్ని అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించటానికి, విమర్శచేయటానికి ఉపయుక్తంగా ఉండేలా ఒక సాహిత్యసిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనిని “ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు” అనే పేరుతో వ్యవహరించారు. ఇది ఆసక్తిదాయకంగా ఉండటమే కాక ఎంతో ఆలోచనాత్మకంగా అనిపిస్తుంది.
కవిత్వంలో వస్తువు అంటే చెప్పబడిన అంశమని, శిల్పం అంటే చెప్పిన విధానమని సాధారణ నిర్వచనాలు. అంతే కాక ఈ రెండిటినీ విడదీయలేమనీ, వస్తువుకు తగ్గ శిల్పం అదే అమరుతుంది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అంటే తీవ్రమైన ధిక్కారాన్ని పలికించటానికి “ఒరేయ్ లంజాకొడకా…” (శిఖామణి) అనే ప్రయోగం, దుఃఖపెట్టే వియోగభారాన్ని చెప్పటానికి “నీవులేవు నీ పాట ఉంది… (తిలక్) లాంటి లలితకోమల వ్యక్తీకరణలు వస్తు శిల్పాల ఆధారితను నిరూపిస్తాయి. ఒక రచనలోని వస్తు శిల్పాల మధ్య ఉండే సంబంధం, వాటి స్వరూపాల గురించి శ్రీరామకవచం గారు లోతైన చర్చ చేసారు ఈ పుస్తకంలో.
***
ప్రచ్ఛన్న అంటే దాగి ఉండిన లేదా రహస్యంగా ఉండిన అని అర్ధం. ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు అంటే రచనలో కనిపించకుండా తెలుస్తూండే వస్తు శిల్పాలు అని. ఒక రచనలో పైకి కనిపించే వస్తువు వెనుక మరో వస్తువు, దానిని అనుసరిస్తూ మరో వస్తువు అదే విధంగా పైకి కనిపించే శిల్పం వెనుక మరో శిల్పం దాగి ఉంటుందని ఈ సిద్ధాంతకర్త ప్రతిపాదన. ఇలా కనిపించని వస్తుశిల్పాల సమాశ్రయమే ఆ రచన మొత్తం పాఠకునిలో కలిగించే రసస్పందన అంటారు. అంటే రచనలో పైకి కనిపించే వస్తు, శిల్పాలకు అతీతంగా అంతర్గతంగా భిన్న వస్తువులు శకలాలు శకలాలుగా, భిన్న శిల్ప రీతులు ఛాయలు ఛాయలుగా విస్తరించి ఉండి ఆ రచనను పండిస్తాయని చెపుతారు. ప్రచ్ఛన్న వస్తుశిల్పాల సిద్ధాంత నిర్వచనం వారిమాటల్లోనే….
వస్తువు యొక్క వస్తువు ప్రచ్ఛన్న వస్తువు!
శిల్పం యొక్క శిల్పం ప్రచ్ఛన్న శిల్పం!
ఇదే ప్రచ్ఛన్న వస్తుశిల్పాల ప్రచ్ఛన్న రహస్యయాత్ర రచనలో…
అది తొవ్వి తీయాల్సిన అవసరం ఎంతో వుంది…! భవిష్యత్తు విమర్శకి దాగిన పునాది ఇక్కడే ఉంది. అదే ప్రచ్ఛన్న సహిత్య అనాది రచనా చరిత్ర అవుతుంది. – సాగర్
ఒక కవి ఒక వస్తువును తీసుకొని దానికి సాహిత్యరూపం ఇచ్చేటపుడు ఆ వస్తువు స్వభావాన్ని సంపూర్ణంగా అర్ధం చెసుకోవాలి. ఆధునిక కాలంలో ఆ వస్తువు పరిణామశీలతను గుర్తించగలగాలి. అలా చేసినపుడే ఆ వస్తువుకు ఆ రచనలో కనిపించని ఆ వస్తువు యొక్క నీడలకు (ప్రచ్ఛన్న వస్తువు) మధ్య సమన్వయం ఏర్పడుతుంది. లేనట్లయితే అది కవియొక్క అజాగ్రత్తకి, అమాయకత్వానికి ఉదాహరణగా నిలబడుతుంది. ప్రచ్ఛన్న వస్తువు పొరలుపొరలుగా నిర్మితమైనప్పుడు గొప్ప మార్గం ఆవిష్కరింపబడుతుంది. రచనా నిర్మాణ క్రమంలో ప్రచ్ఛన్న వస్తువు ప్రధాన వస్తువుకి నీడలుగా, జాడలుగా విస్తరించి తత్ఫలితంగా రచన అద్భుత స్థాయికి చేరుకొంటుంది.
శిల్పం కూడా ఇదే పద్దతిని అనుసరించి, పైకి కనిపించే శిల్పం ప్రచ్ఛన్న శిల్పశకలాలుగా విడిపోయి భిన్న అనుభూతులకు తావిస్తుంది. ఒక కవి శిల్పనిర్వహణా రీతికి అతని సాంస్కృతిక వారసత్వం అవినాభాజ్యంగా ఉంటుందనే ప్రతిపాదన విలువైనది.
***
ఒక రచనలో కనిపించే ఏకసూత్రతను పట్టుకొని పాఠకులకు విప్పిచెప్పటానికి సాహిత్యసిద్ధాంతాలు దోహదపడతాయి. ఒక వాచకాన్ని ఎలా చూడాలో చెప్పటం సాహిత్యసిద్ధాంతం ముఖ్యోద్దేశంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే కళ్లద్దాల వంటివి. శ్రీరామకవచం గారు తాను ప్రతిపాదించిన “ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు” సిద్ధాంతం ద్వారా, ఒక రచనలో పైకి కనిపించే వస్తువు వెనుక కనిపించని వస్తువులు అనేకం ఉండొచ్చునని, అదే పైకి చూపిస్తున్న శిల్పం వెనుక రహస్యమైన శిల్పశకలాలు ఉంటాయని, ఆ రచనను అర్ధం చేసుకోవాలన్నా, విమర్శించాలన్నా ఈ లోపలి పొరలను కూడా దర్శించవలసి ఉంటుందని చెపుతున్నారు. తెలుగు సాహిత్యం వస్తువాదకవిత్వానికి పెద్దపీటవేసి శిల్పాన్ని తృణీకరించిందని, వస్తు,శిల్పాల మధ్య వైరుధ్యాలు ఉండవని అనటం ద్వారా తెలుగు సాహిత్యానికి తీవ్ర నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఎండుకట్టెలో అగ్ని దాగి ఉన్నట్లు, నువ్వు గింజల్లో నూనె ఉన్నట్లు ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు చీకటివెలుగుల మాదిరి చలన నియమాలతో సాహిత్యంలో ప్రవర్ధిల్లుతాయి అంటారు.
శ్రీరామకవచం గారు ఈ పుస్తకంలో తమ సిద్ధాంతాన్ని అప్లై చేసి కొన్ని విపులమైన ఉదాహరణలు ఇచ్చి ఉంటే బాగుండేది.
***
ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు సిద్ధాంతం సాహిత్యవిశ్లేషణలో ఒక నూతన ఆవిష్కరణ. ప్రతీ ఆవిష్కరణా పూర్వరీతుల భుజాలపై నిలబడకుండా శూన్యంలోంచి రాలేదు. అలాగే ఈ సిద్ధాంతంలో మన పూర్వీకులు నిర్వచించిన రస సిద్ధాంతంలో కనిపిచే స్థాయీ భావాలు, సంచారీ, వ్యభిచారీ భావాలు లాంటి ఊహలను కొన్ని పోల్చుకొనవచ్చును. వాటిని ఆలంకారికులు వస్తు, శిల్పాలకు కాక రససిద్ధిని నిర్వచించటం కొరకు వినియోగించారు. అది వేరే సంగతి. ఒక కవితలో వాచ్యార్ధాన్ని ఆ కవిత Extension గాను, ధ్వనిపూర్వక అర్ధాన్ని Intension గాను గుర్తించాలంటాడు అలన్ టాటె. ఈ రెండు సమపాళ్లలో బింబప్రతిబింబాలుగా, బిగుతుగా, ఒకదానితో ఒకటి పోటీపడేటట్లుగ ఉండే స్థితికి ఆ రెండు పదాలలోని ప్రిఫిక్స్ లను తొలగించి Tension అని పేరుపెట్టాడు. కవిత్వానికి కవిత్వశక్తినిచ్చేది Tension మాత్రమే అంటాడు. ఇది కూడా శ్రీరామకవచంగారు చెపుతోన్న వస్తు, శిల్ప శకలాల నిర్వచనానికి దగ్గరగా అనిపిస్తుంది. ఈ పోలికలు ఈ రచయిత కృషిని తక్కువ అంచనా వేయటంగా కాక ప్రతిపాదిత సిద్ధాంతపు విస్తృతిగా అర్ధంచేసుకోవాలి.
శ్రీరామకవచంగారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రీతి, విశ్లేషించిన తీరు ఆమోదయోగ్యంగా ఉన్నది. ఇంతవరకూ తెలుగు సాహిత్యచరిత్రలో ఇది నేను ప్రతిపాదిస్తున్న సాహిత్యసిద్ధాంతం అని ఎవరూ ప్రకటించుకొన్న దాఖలాలు కనిపించవు. ప్రాత్య, పాశ్చాత్య సిద్ధాంతాలను సమన్వయపరుస్తూనో లేక దిగుమతి చేసుకొనో వచ్చిన వివరణలే తప్ప. ఆ రకంగా ఇది గొప్ప ప్రయత్నం. ప్రతి తెలుగు కవి, విమర్శకుడు తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ కోణంలోంచి కూడా సాహిత్యాన్ని దర్శించే దృష్టిని ఏర్పరుచుకోవటం అవసరం.
***
ఈ పుస్తకాన్ని మూడు అధ్యాయాలుగా విభజించారు. మొదటి అధ్యాయంలో “ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు” సిద్ధాంతాన్ని చాలా విపులంగా చర్చించారు. మిగిలిన రెండు భాగాలలో సాహిత్యంపై, విమర్శపై తన అభిప్రాయాలను పంచుకొన్నారు. చాలా అభిప్రాయాలు సమకాలీన సాహిత్యరీతులను, అపసవ్యతలను ప్రతిబింబించాయి. చాల విలువైన, వివాదాస్పదం అయ్యేటటువంటి అంశాలను కూడా ఏ శషభిషలకు తావివ్వకుండా చర్చించారు. వీటిలో వివిధ అస్తిత్వవాద ఉద్యమాలు గురించి; కీర్తివెంట పరుగులెత్తే వారిపై; ప్రాచీనతకు నవ్యత్వం సాధించే అవసరతపైనా; ప్రవచనకారులుగా మారిన సాహిత్యకారులపై; ఆధునిక విమర్శ మన లాక్షణికుల సిద్ధాంతాలను గుడ్డిగా తిరస్కరించటం పట్లా; శకలీకరణ పాలకవర్గాలకు ఉపయోగపడింది అనటం లాంటి స్టేట్మెంట్స్ చాలా లోతైనవి. వాటిని రచయిత ఎలా సమర్ధించారన్నది తెలుసుకోవాలనుకొనే వారు పుస్తకాన్ని చదివాల్సిందే. “పోస్ట్ మోడర్నిజం సిద్ధాంతపరిచయం” పేరిట ఉన్న వ్యాసంలో ఆ సిద్ధాంతం యొక్క చారిత్రిక పరిణామాన్ని, అది తీసుకొచ్చిన మార్పులను చాలా గొప్పగా ఆవిష్కరించారు.
ఈ పుస్తకం కవులకు, విమర్శకులకు కరదీపికగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.
బొల్లోజు బాబా
పుస్తకం లభించు చోటు
ఫోన్: 9121683515
ప్రచురణ
నవ్యాంధ్ర రచయితల సంఘం
విజయవాడ.



1 comment:



  1. కామింట్లో కామింటు ప్రచ్ఛన్న కామింటు :)


    బాగుందండీ వ్యాసము
    చేగూరాలి జనులకు సశేషము శుభముల్
    సాగవలెను మీ యానము
    పాగడమై వస్తువు ప్రతి పాదింప బడన్


    జిలేబి

    ReplyDelete