Friday, January 8, 2021

Imported post: Facebook Post: 2021-01-08T02:03:09

వృత్తిని ప్రతిబింబిస్తూ వ్రాసిన కవితలు . ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేసించి పాతికేళ్ళు నిండాయి. మొదట్లో స్కూల్ టీచర్ గా, తరువాత జూనియర్ లెక్చరర్ గా ప్రస్తుతం డిగ్రీకాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసరుగా నా ఉద్యోగప్రయాణం సాగింది. ఈ సుదీర్ఘకాలంలో నా ఉద్యోగ అనుభవాలను ఏమేరకు కవిత్వంలోకి తీసుకొచ్చాను అని ఒకసారి పరిశీలించుకొంటే చాలానే కనిపించాయి. సమాజంలో ఉపాధ్యాయునికి గౌరవం ఉంది. తల్లితండ్రులలో, విద్యార్ధులలో. మనం ఎంత ప్రేమిస్తే అంత ప్రేమను తిరిగి ఇస్తారు. ఇది స్కూల్ స్థాయిలో మరీ ఎక్కువగా పొందాను నేను. మొదట్లో పిల్లలు పిలిచే “సార్ గారండీ” అనే పిలుపు నాకు వింతగా తోచేది. వాళ్ళు మనకిచ్చే ప్రేమ, గౌరవాలకు అనుగుణంగా ఒక స్వీయ డిసిప్లిన్ ఏదో తెలియకుండా మన వ్యక్తిత్వంలోకి ప్రవేశిస్తుంది. ఒక టీచరుగా నా బాధ్యతను ఆ పిలుపు గుర్తుచేస్తుందనే ఎరుకతో వ్రాసిన కవిత ఇది. *** 1. సార్ గారండీ… సార్ గారండీ… శరీరం మీంచి బాల్యం అదృశ్యమౌతుంది. దేహంపై యవ్వనం నూనూగుగా మొలకెత్తుతుంది. దాని గొంతుక వింతైన జీరతో “సార్ గారండీ, సార్ గారండీ” అంటుంది. ఆ మాధుర్యానికి ఒక జీవితాన్ని అర్పించుకోవచ్చు. ఆ అభిమానానికి ఒక హృదయాన్ని అంకితమీయచ్చు. వాడు నిర్మించుకొనే వ్యక్తిత్వ హర్మ్యానికి మేలిమి ఇటుకలను ఎంచి వాడికందిస్తాను. వాని ఆలోచనల చురకత్తులు పదును పెట్టుకోవటానికై నా మెదడును సానరాయి ని చేస్తాను. పరస్పర వైరుధ్యాల అరణ్యంలో వాడు దారి తప్పి కునారిల్లినపుడు నా అనుభవాల్ని దిక్సూచిగా చేసి బహూకరిస్తాను. రసాయనోద్రేకాల ప్రళయ కాలంలో అయితే కుంభవృష్టి లేకపోతే చండ్రగాడ్పులు తప్ప మధ్యస్థమెరుగని వాడి మనసుకు ఉదయ లేకిరణాల్ని వేసవి సాయంకాలాల్ని, మంచుసోనల్ని, వెన్నెలరాత్రుల్నీ పరిచయం చేస్తాను. ఒక తరం తన నడతను ప్రసవించుకొనే వేళ నేను మంత్రసాని నౌతాను. ఈ దేహం కలిసిపోయే లోపు ఎప్పుడో, ఎక్కడో వాడు కన్పించి, “బాగున్నారా మాష్టారూ” అంటాడు. అంతకుమించింకేం కావాలీ జీవితానికి. నవంబర్ 2008 *** నేను జంతుశాస్త్ర అధ్యాపకుడను. బైపిసి గ్రూపు తీసుకొన్నప్పటినుంచి డిసెక్షన్లు తప్పనిసరి. వానపాములు, బొద్దింకలు, కప్పలు, తొండలు, చేపలు ఎన్నో జీవుల అంతరావయువాలను డిసెక్ట్ చేసి పిల్లలకు చూపించటం వారితో చేయించటం నా వృత్తిలో భాగం. ఆయా జీవులను డిసెక్షన్ల పేరుతో చంపటం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందనీ ఇంకా జీవకారుణ్య కారణాల దృష్ట్యా యుజిసి వారు డిసెక్షన్లను నిషేదించారు. అలా అంతరించిపోయిన ఆ ప్రక్రియను ఒక కవితలో పర్యావరణ కోణంలోంచి ఇలా వ్యక్తీకరించాను. 2. సమతుల్యత కప్ప దమనీ వ్యవస్థ డిసెక్షన్ విద్యార్ధులకు డిమానుస్ట్రేషన్ క్లాసది. క్లోరోఫాం ఇచ్చిన కప్పను డిసెక్షన్ చెక్కపై ఉంచి కదలకుండా కాళ్ళకు మేకులు కొట్టాను. నా చుట్టూ విద్యార్ధులు నిల్చొని శ్రద్ధగా గమనిస్తున్నారు. సిజర్ తో చర్మాన్ని కొద్దికొద్దిగా తొలగిస్తూ స్టెర్నమ్ ఎముకను కత్తిరించి ఉరఃకుహరాన్ని బయల్పరిచాను. “మీ చేతులు వణుకుతున్నాయి సార్” అన్నాడో విద్యార్ధి. అప్పుడు గమనించాను నా చేతులు విపరీతంగా వణుకుతున్నాయి. మిగిలిన డిసెక్షన్ వెంటవెంటనే ముగించి వచ్చేవారం మీరు చేద్దురుగాని అని చెప్పి డిపార్ట్ మెంటుకు వచ్చేసాను. భయమేసింది జబ్బేదైనానా అని. కాగితం తీసుకొని నా పేరు వ్రాసుకొన్నాను ముత్యాల్లాంటి అక్షరాలు కొంచెం ధైర్యం వచ్చింది. *** విద్యార్ధుల ఒక్కొక్కరి ట్రేలో ఒక్కో కప్ప వాళ్ళు జాగ్రత్తగా డిసెక్షన్ మొదలుపెట్టారు. కాసేపయ్యాకా చూద్దును కదా ప్రతి ఒక్కరి చేతులూ వణుకుతున్నాయి అలా వణుకుతున్న చేతులతోనే అందరూ డిసెక్షన్ చేస్తున్నారు – ఆశ్చర్యంగా! *** నిన్నరాత్రి కప్పలు లేని చెరువుగట్టుపై మిడతలు వాలినపుడు గరికపూలు కూడా అలానే ఒణికుంటాయి. JULY 20, 2012 *** విద్యావ్యవస్థలో విద్యనేర్పటం ఎంతైతే భాగమో నేర్చుకొన్న దాన్ని మూల్యాంకనం చేయటం కూడా అంతే అవసరం. విద్యార్ధులు వ్రాసిన జవాబుపత్రాలను దిద్దేటప్పుడు ప్రతీసారీ కాకపోయినా చాలాసార్లు మనసులో మెదిలే భావాలకు అక్షరరూపం ఈ కవిత. 3. మూల్యాంకనం జవాబు పత్రాన్ని పట్టుకోగానే ఓ ఏడాది కాలాన్ని చేతిలోకి తీసుకొన్నట్లుంటుంది. ఏదో అపరిచిత జీవితాన్ని తడుముతున్నట్లనిపిస్తుంది. పాస్ మార్కులు వేయమంటూ కన్నీటి ప్రార్ధనో, వెయ్యినోటో, ఫోన్ నంబరో లేక శాపాల బెదిరింపో వంటి చేష్టలు బిత్తరపరచినా ఇన్నేళ్ళ చదువులో ఎక్కడా తగలని ఒక వాక్యమో, కొత్త కోణమో, వివరణో తళుక్కు మన్నపుడు కవిత్వం చదివినంత ఆనందమౌతుంది. జవాబు పత్రాల్ని మెదడు తూకం వేస్తే హృదయం మూల్యాంకనం చేస్తుంది. ఈ స్టూడెంట్ కి మమ్మీ డాడీ దీబెట్టి బెస్టాఫ్ లక్ చెప్పారో లేదో హైలైటర్స్, స్కెచ్ పెన్ లు కొనివ్వలేదు కాబోలు స్కేలు కూడా లేదేమో.. పేపరు మడతే మార్జినయ్యింది. ఈ అక్షరాలు వ్రాసిన చేయి పొలంపనులు చేసిందో, రాళ్ళు మోసిందో పెట్రోలు కొట్టిందో లేక అంట్లే తోమిందో అక్షరాల నిండా మట్టి వాసన ... మట్టి వాసన... హృదయానికి మట్టివాసన ఎంతిష్టమో! జవాబులు సరిగ్గా రాయకపోవటానికి కారణం ఒక్క చదవకపోవటమేనా... లేక ఆ సమయంలో జబ్బుచేసిందా? ముందురోజు తండ్రికి తలకొరివి పెట్టాడా? పెళ్ళిబట్టలలో నేరుగా పరీక్షహాలుకు వచ్చిందా? సమస్యలనుంచి రేపు పారిపోవాలనుకొంటున్నాడా? ఖాళీ జవాబు పత్రం ప్రశ్నల పత్రమౌతుంది పేపర్లు దిద్దటం అంటే ఒక్కోసారి పత్రికల్లో పతాక శీర్షికలవటం కూడా ఆత్మహత్యగానో, అత్యుత్తమ రాంక్ అనో. MARCH 30, 2012 *** పిల్లలు సున్నితమనస్కులు. ఒక్కోసారి మనం అనాలోచితంగా అన్నమాటలను వారు గుర్తుపెట్టుకొంటారు. ఆ తరువాత ఎప్పుడో మీరిలా అన్నారు అని చెప్పి ఆశ్చర్యపరుస్తారు. ఆ రోజు మీరు చెప్పిన ఈ మాటలవల్ల నేనీరోజు ఈ స్థాయిలో ఉన్నాను అన్నప్పుడు నిజానికి మనం అన్నమాటలు గుర్తులేకపోయినా సంతోషం కలుగుతుంది. అలా ఒక రోజు ఒక అమ్మాయి – "ఆ రోజు మీరు నా కంటే తెల్లగా అందంగా ఉన్న అమ్మాయి చేత బొకే ఇప్పించారు" అని అన్న మాటలు నన్నెంతగానో వెంటాడాయి. నేను చెప్పిన సారీలకు ఆ అమ్మాయి కన్విన్స్ అయి ఉండకపోవచ్చు. కానీ ఒక హృదయం గాయపడింది. ఆ గాయమే ఈ కవితగా పోతపోసుకొని నన్ను ఊరడిస్తుందింది నేటికీ. 4. చర్మం రంగు ముఖ్య అతిధికి బొకే నేను ఇస్తాను టీచర్” “నువ్వొద్దు ….. అందుకు వేరే వాళ్ళను ఎంపిక చేసాం” ఆ “వేరేవాళ్ళకు” తనకూ ఉన్న తేడా ఆ అమ్మాయికి కాసేపటికి తెలిసింది చర్మం రంగు. చరిత్ర లోయలోకి నెత్తురూ, కన్నీళ్ళూ పారిస్తూ, జీవన మార్గాలపై చీకటివెలుగుల్ని శాసిస్తోన్న చర్మం రంగు ….. చర్మం రంగు….. సంచి కన్నా ఆత్మ గొప్పదని వెర్రికేకలతో అరవాలనుకొంది ఆ అమ్మాయి. ఉబ్బిన మొహం, ఎర్రని కళ్లతో తనకొచ్చిన ప్రైజుల్ని తీసుకొని మౌనంగా నిష్క్రమించింది. పదేళ్ళ తరువాత ……. “ముఖ్య అతిధి” స్పీచ్ ముగించుకొని వెళుతూ వెళుతూ ఉబ్బిన మొహం, ఎర్రని కళ్ళతో ఉన్న ఓ స్టూడెంట్ చేతిలో బొకే పెట్టి, భుజం ఎందుకు తట్టిందో ఎవరికీ అర్ధం కాదు మరో పదేళ్ళ దాకా AUGUST 14, 2013 *** సాధారణంగా సెలవులలో కాలేజీకి వెళితే ఒక జడవాతావరణం తాండవిస్తూంటుంది. జీవం ఉండదు. పిల్లలు లేని కాలేజీ పక్షులెగిరిపోయిన వేడాంతంగళ్ (వలసపక్షులు వచ్చే ఒక ఊరు) లా అనిపించకమానదు. 5. సెలవుల్లో కాలేజీ సెలవుల్లో కాలేజీ పక్షులెగిరి పోయిన వేడాంతంగళ్ లా ఉంది. ఇసుక తుఫానులో తడిచిన ఖర్జూరపు చెట్టులా కాలేజీ గదుల కళ్ళపై ధూళి పొర పరచుకొంది. సరస్వతీ దేవికి నిద్రా భంగం కాకూడదని కామోసు ఇస్మాయిల్* నడచిన చెట్టుపై చిలకల సందడి విరామం తీసుకుంది. ఉపన్యాసాల పావురాళ్ళను ఎగరేసే తరగతి గదులు వర్జించిన పక్షిగూళ్ళై నిశ్శబ్ధాన్ని ధరించాయి. తమపై వ్రాసిన ప్రేమరాతలను చదువుకొంటున్న చెక్క బల్లలు వసంతంలో భ్రమరాలతో తమ సరాగాల్ని తలపోసుకొంటున్నాయి. శలవుల్లో కాలేజీ మొత్తం విత్తనాలకై ఎండబెట్టిన బీరకాయలా పొడిపొడిగా ఉంది. కోతకోసిన వరిచేను దుబ్బుల జీవరాహిత్యం గ్రవుండులోని పాదముద్రలలోకి ప్రవహించింది. విద్యార్ధుల్లేని కాలేజీ తలతెగిన వృక్షంలా, వృక్షాల్ని నరికిన వనంలా వనాల్ని మింగిన శిశిరంలా ఉంది. అచ్చు పగలు చూస్తే రాత్రి కవితలోకొచ్చేలా. OCTOBER 14, 2008 *ఇస్మాయిల్ గారు నేను పనిచేస్తున్న కాలేజీలో పనిచేసారు **** కాలేజ్ వయసుకు వచ్చిన విద్యార్ధులు తమ వ్యక్తిగత సమస్యలను చెప్పుకోవటం న్యూనతగా భావిస్తారు. అంత గమ్ముని ఓపెన్ అవ్వరు. టీచర్ల వద్దకూడా. అయినప్పటికీ కొన్ని కొన్ని కుటుంబసమస్యలు కాలేజీ వరకూ కూడా వస్తుంటాయి. ఇవి ఎక్కువగా ప్రేమ వ్యవహారాలుగా ఉంటాయి. వాటిని తీర్చటంలో మా పాత్ర పెద్దగా ఏమీ ఉండదు. కానీ ఈ కవితలోని సమస్య నన్ను చాన్నాళ్లు వెన్నాడింది. . 6. నీటిపొర తాగుడు పై సదభిప్రాయం లేకపోయినా దురభిప్రాయం మాత్రం ఉండేది కాదు అదో పురాతన విలాసం కదాని కానీ మొన్నోరోజు మా కాలేజీలో ఓ విద్యార్ధిని తండ్రి తన కూతుర్ని నలుగురెదుటా బూతులు తిడుతూ అవమానించినపుడు ఆమె కనుల నీటిపొరలో తాగుబోతు తండ్రులందరూ దగ్ధమైపోవాలనుకొన్నాను “కొయిటా అమ్మ నా పేర్న పంపించే డబ్బుల కోసమే ఇదంతా” అని ఆ అమ్మాయి అన్నప్పుడు ఆ నీటిపొరలో ఈ మద్యప్రపంచం కొట్టుకు పోవాలనుకొన్నాను గత ఘర్షణల గాయాల్ని చూపించినపుడు ఆ నీటిపొరలో ఈ మదపు నేల నిలువునా కృంగి పోవాలనుకొన్నాను సముద్రాన్నీదటానికి పూచికపుల్లంత నమ్మకాన్ని తప్ప ఏమివ్వగలిగాం? ఆరోజా అమ్మాయికి ***** మూడ్రోజుల తరువాత ముత్యాల్లాంటి అక్షరాలతో ఎసైన్మెంట్ రాసుకొచ్చిన ఆ అమ్మాయి కనుల నీటిపొరలో ఎన్నెన్ని సౌందర్యాలు ! October 30, 2014 *** ప్రభుత్వకళాశాలల్లో చదివే విద్యార్ధులు ఎక్కువగా దిగువతరగతులకు చెందినవారు. చాలామందికి చిన్నవయసునుంచే సంపాదించటం అనివార్యమైన బాధ్యత. కాలేజ్ డిస్కంటిన్యూ చేసిన పిల్లలు ఎక్కువగా అప్పట్లో ఆటో డ్రైవర్లుగా కుదురుకోవటం ఉండేది. అలా నాకు ఇష్టమైన విద్యార్ధి ఆటో డ్రైవరుగా మారి ప్రమాదంలో మరణించాడు. అతని ఇంటిమీదుగానే కాలేజీకి వెళ్ళేవాడిని. ఆ సందర్భం ఈ కవితకు నేపథ్యం. . 7. ఎందుకో తెలియటం లేదు......... ఎందుకో తెలియటం లేదు కానీ ఆ వీధిలోంచి వెళ్ళాలనిపించటం లేదు. ఆ గుడిసె ముందు ఆ ఆటోని చూసినప్పుడల్లా యాక్సిడంటులో నుజ్జు నుజ్జయిన ఆ ఆటోని చూసినప్పుడల్లా పగిలిన దాని హెడ్ లైట్ నిస్తేజాన్ని చూసినప్పుడల్లా.... "అటెండెన్స్ సరిపోలేదని స్కాలర్ షిప్ నిలుపు చేసేసారు సార్ డబ్బు చాలా అవసరం హెల్ప్ చేసి పెట్టండి సార్" అని అభ్యర్దించిన ఆ కుర్రవాని కనులే జ్ఞాపకం వస్తున్నాయి. కాగితాలు, కంప్యూటర్లూ జీవితాల్లోకి చూడలేవన్న విషయాన్ని ఎలా చెప్పగలిగానూ? ఆ వీధిలో, ఆ గుడిసె ముందు నిలిచిపోయిన ఆ ఆటోని చూసినప్పుడల్లా.... రంగువెలసీ, తుప్పు పట్టీ, గడ్డి మొలచీ శిధిలమౌతున్న ఆ ఆటోని చూసినప్పుడల్లా..... చాన్నాళ్ళ తరువాత ఆటో నడుపుతూ కనిపించిన వాడు "దేవుని కృప వల్ల అంతో ఇంతో సంపాదిస్తున్నాను కదా, నువ్వింక రిక్షా తొక్కడం మానేయమంటే వినటం లేదు సార్ మా నాన్న" అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. క్లాస్ రూమ్స్ లో ఎప్పటికీ నేర్వలేని పాఠాలవి. ఆ రోజు వాడెంత ముద్దొచ్చాడనీ! యాక్సిడెంటులో నుజ్జు నుజ్జయిన వాడి ఆటో పక్కనే కొత్తగా గ్రీజు పెట్టిన డొక్కు రిక్షాను చూసినప్పటి నుంచీ ....... ఎందుకో తెలియటం లేదు కానీ .... .... MONDAY, JANUARY 24, 2011 *** ఇటీవల కాలేజీలలో ఉచిత వైఫై అమరుస్తున్నారు. ఇప్పుడంటే ఆన్ లైన్ పాఠాలు కానీ ఈ కవిత వ్రాసే సమయానికి అంత లేదు. అయినప్పటికీ విద్యార్ధులు ఉచిత వైఫిని వాడుకొంటూ టిక్ టాక్ లు చూస్తూ సమయాన్ని వృధాచేసుకోవటం గమనించి వ్రాసిన కవిత ఇది. నిజానికి పిల్లలే కాదు నేడు అందరూ కూడా సెల్ ఫోన్ కు దగ్గరై, మానవసంబంధాలకు దూరమై జీవిస్తోన్న చిత్రమైన కాలమిది. రంగురంగుల మాటల చిలుకలు ఎగిరే కాలాన్ని స్వప్నిస్తూ.... . 8. ఫ్రీ వైఫై కాంపస్ చెట్టునీడలో కూర్చొన్న విద్యార్దుల గుంపు వెలుతురు తెరలో దూకి వైఫై సముద్రంలో తేలింది. దారాన్ని స్రవించుకొని కాళ్లతో పేనుకొంటూ తనచుట్టూ తానే గూడు నిర్మించుకొనే పురుగులా ప్రతీ విద్యార్ధీ తనచుట్టూ ఓ మౌన పంజరాన్ని దిగేసుకొన్నాడు. వైఫై లింక్ తెగింది ఓహ్! షిట్..... గూడులోంచి సీతాకోక చిలుక మెత్త మెత్తగా బయటపడినట్లుగా ఒక్కో విద్యార్ధీ మాటల ప్రపంచంలోకి మెల మెల్లగా మేల్కొన్నాడు. కాసేపటికి కాంపస్ అంతా రంగు రంగుల మాటల చిలుకలు రెక్కల్లల్లార్చుకొంటూ ఎగురుతో! DECEMBER 19, 2015 బొల్లోజు బాబా

No comments:

Post a Comment