Thursday, August 7, 2008

పక్కింటబ్బాయి ఆత్మహత్యాయత్నం



మా పక్కింటబ్బాయి
నిన్న రాత్రి ఆత్మహత్యాయత్నం చేసాట్ట.
" పరామర్శించటానికై" వెళ్లా
ఏరా అబ్బాయ్ ఏంజరిగిందీ అంటే
మధుకలశం విష పాత్రికైందన్నాడు.
సైకత సౌధాలను గాలిమొమ్ము తన్నుకుపోయిందన్నాడు.
కనిపించని గోడలకు గుద్దుకొని ఆలోచనలు
ముక్కముక్కలై రాలిపోయాయన్నాడు.
అలా వాడు ఏవేవో అంటూనే ఉన్నాడు.
నేనేం మాట్లాడలేదు.
వాడి భుజంపై చేయివేసి
" పదరా అబ్బాయ్ అలా లోకం చూసొద్దాం"
అంటూ బయటకు తీసుకొచ్చాను.
***********

తల టైరుక్రింద కొబ్బరికాయై " ఠాప్" మని పగలగా
దేహం ప్రశాంతంగా పవళిస్తూ ఉంది. పక్కనే
ఓ మనసు అప్పటికే సహగమనం చేసేసింది.
మృతుని కూతురి లేత యవ్వనాన్ని అద్దెకు తిప్పటానికై
అప్పటికే కొన్ని కళ్లు పధకాలు రచిస్తున్నాయి.

దగ్ధ భోగీ లోంచి దింపిన, పచ్చికట్టెలా పూర్తిగా కాలని
దేహాలు ప్రశాంతంగా పవళిస్తూ ఉన్నాయి. పక్కనే
ఓ తల్లి తన కొడుకు దేహం కోసం వెతుకులాట.
కాలిన కొడుకు దేహాన్ని అప్పటికే లక్ష సార్లు చూసినా
పోల్చుకోలేక పోవటం ఓ జీవిత కాల విషాదం.

ఇంతకాలం ఆ వృద్ధదంపతులకు చేతికర్రై పరిమళించిన
కొడుకును కాన్సర్ కౌగిలించుకోగా
దేహం ప్రశాంతంగా పవళిస్తూ ఉంది. పక్కనే
చూపులులేని నాలుగు ముసలి నేత్రాలు,
నేత్రాలు లేని రెండు మొహాలు, మొహాలు లేని రెండు దేహాలు
అవి కోల్పోయిన కూడు, గూడు, గుడ్డా.
ఆ దేహాల్లోకి మెల్లగా నల్లని ఒంటరితనం ఎగబాకుతుంది.

సరిహద్దుల్లో వేయిపిరంగులు పేల్చిన
యోధుణ్ణి ఒక్క బుల్లెట్ ముద్దాడింది.
దేహం ప్రశాంతంగా పవళిస్తూ ఉంది. పక్కనే
ఒక కుటుంబం రెక్కతెగిన పిట్టలా
గిరికీలు కొడుతూ నేలకూలింది.
శోక కాంతిలో ఒక జాతి మొత్తం,
ఒత్తి కింది మైనంలా ద్రవిస్తూనే ఉంది.

రేప్ అనంతరం పైశాచికంగా చంపబడ్డ విద్యార్ధిని
దేహం ప్రశాంతంగా పవళిస్తూ ఉంది. పక్కనే
ఆకాశమంత ఆక్రోశాన్ని, సముద్రమంత బాధనీ
జ్వలింపచేసుకొన్న హృదయ చితి ఇంకా కాలుతూనే ఉంది.
నక్షత్రాలన్ని అశ్రుబిందువుల్ని
రాల్చుకున్న నేత్రాలు నెరళ్లు తీసి
నెరనెరలో దిగులు మొలకలు లేస్తూనే ఉన్నాయి.
************

పార్ధివ దేహాలెప్పుడూ
ప్రశాంతంగా పవళిస్తూనే ఉంటాయిరా అబ్బాయ్.
నడిచే దేహాలు మాత్రం- ఆ అకస్మిక వియోగ
విషాదంలో ప్రయాణిస్తూనే ఉండాలి.

హఠాన్మరణం వెనుకే ఇంత విషాదం ఉన్నప్పుడు
బలవన్మరణం వెనుక ఇంకెంత ఉంటుందో తెలుసా నీకు?

నీ బాధల్నీ, దైన్యాన్ని, పగిలిన హృదయాన్ని
మరొకరిలోకి బట్వాడా చేస్తున్నావన్న విషయం నీకు తెలియదు.

నీ ఆక్రోశాన్ని, ఆవేదనను, భాధ్యతలనీ, జ్ఞాపకాలని
నీవు చేసిన శూన్యాన్ని
నీ వాళ్లు జీవితాంతం మోసుకు తిరగాల్సిఉంటుంది.
**********

మా పక్కింటి అబ్బాయి పశ్చాత్తాపం
వాని కళ్లను నీళ్ల మడుగు చేసింది.

బొల్లోజు బాబా

12 comments:

  1. ఒక పెద్ద గీత పక్కన దానికన్నా పెద్ద గీత గీస్తే, మొదటి పెద్దగీత చిన్నదైపోతుంది.బాధలూ,నిరాశలూ,నిస్పృహలూ అంతే. పక్కింటబ్బాయి కళ్ళకి మీరు చూపిన లోకం "కళ్ళూ తెరిపించడం",కన్నీళ్ళు కురిపింపజెయ్యడం సహజమేకదా.

    హఠాన్మరణం బలవన్మరణమే కాదు,ఒకరి మరణం కారణంగా మిగిలిపోయే జీవచ్చవాలగురించి తెలిసిన ఎవరూ ఆత్మహత్యకు ప్రయత్నించరనుకుంటా!

    ఎప్పటిలాగే..మీ కవిత తగలాల్సిన చోట తగిలింది. కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. మొన్న జరిగిన రైలు ప్రమాదం గుర్తొచ్చింది.

    ReplyDelete
  2. చాలా బాగా రాశారు.

    ReplyDelete
  3. ఇది నా జీవితం, పూర్తిగా నా స్వవిషయం అని భావించి క్షణికావేశంలో ఇలా ప్రాణాలు మీదకు తెచ్చుకున్న వారు, ఒక్కసారి ఈ జీవితంతో మరెన్ని జీవితాలు పెనవేసుకుపోయాయో గుర్తిస్తే బాగుణ్ణు. మీరు ప్రతీ చోటకి వెళ్ళలేకపోయినా, మీ కవితకి రెక్కలొస్తే బాగుణ్ణు!! ఇంత కన్నా ఏమీ చెప్పలేకపోతున్నాను!!

    ReplyDelete
  4. బాబా గారు,
    Excellent.
    శోక కాంతిలో ఒక జాతి మొత్తం
    ఒత్తి కింది మైనంలా ద్రవిస్తూనే ఉంది.
    చాలా అద్భుతం. ఇంత హృద్యంగా రాయడంలో మీకు మీరే సాటి.

    ReplyDelete
  5. "నీ బాధల్నీ, దైన్యాన్ని, పగిలిన హృదయాన్ని
    మరొకరిలోకి బట్వాడా చేస్తున్నావన్న విషయం నీకు తెలియదు" - తాము భరించలేక తప్పించుకోటానికి ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధని తమ ఆప్తులు ఇంకో రూపంలో మోయాలనే స్పృహ వస్తే ఎవ్వరూ అలాంటి ప్రయత్నాలు చెయ్యరేమో.

    చాలా బాగా చెప్పారు. ఎన్నో ఆలోచనలు కదిలించింది. నెనర్లు

    ReplyDelete
  6. మాటలకి మనుషులు మారరు కానీ ఎదుట జరిగే వాస్తవాలకి మనుషుల్ని మార్చే బలం ఉంటుంది.

    ReplyDelete
  7. మీ కలంలోకి మనసుని ఎలా ఇంకిస్తారో తెలుసుకోవాలని ఉంది. మీ కవితలు ముఖ్యంగా వ్య్ధాభరితమైన అంశాలతో రాసినవి చదువుతుంటే, కన్నీళ్ళు రాలక ఆగవు! ప్రతి కవితకీ పాదాభివందనం చేయాల్సిందే!

    ReplyDelete
  8. మీరు రాసిన ఈ కవితను ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ చదివితే బాగుంటుంది.

    అద్బుతంగా చెప్పారు. అభినందనలు.

    ReplyDelete
  9. జీవితం క్షణబద్భుకం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకొనే బదులు కాస్సేపు అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మేలన్న మీ అంతర్లీన సూక్తిని నేను అంగీకరిస్తాను, పాటిస్తాను.

    ReplyDelete
  10. ఇలాంటి విషయాలు ఎలా చెబితే బాగా అర్దం అవుతుందో అలా చెప్పారు. ప్రత్యక్షంగా ఒక వ్యక్తిని దారిలో పెట్టారు. ఎంతో మందిని ఆలోచింపచేసేలా మంచి విషయాన్ని ఇక్కడ రాసారు. మీకు నా అభినందనలు.

    ReplyDelete
  11. మహేష్ గారికి
    స్పందించి నందుకు ధన్యవాదములు. మొన్నటి రైలు ప్రమాదాన్ని కూడా ఒక పదచిత్రంగా వాడటం జరిగింది సారూ.
    కొత్త పాళీ గారు చాలా సంతోషంగా ఉంది సారు.
    పూర్ణిమ గారు నా ఆశ కూడా అదేనండి.
    సాయిసాహితి గారు, ఈ కవితలో నాకు బాగా నచ్చిన వాక్యాలు అవేనండి.
    చైతన్య గారు
    నెనర్లు
    మురళి గారు
    కరక్టు గా చెప్పారు.
    అనానిమస్సు గారు
    థాంక్యూ సార్.
    పెదరాయుడు గారికి
    నా క్కూడా అదే ఆశగా ఉంది సారు.
    కలగారికి
    ధన్యవాదములు
    బాలు గారికి
    నెనర్లు.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  12. baba garu..andukondi.. naa chappatlu.................

    ReplyDelete