మాది యానం అని చెప్పేసరికి
పెదాలమీద పరచుకొనే వక్ర నవ్వుకి
విక్రమార్కుడైనా భాష్యం చెప్పగలడా?
సాయింత్రమయ్యేసరికి
ఎలట్రిక్ పోల్ ని "స్టెడీ ప్లీజ్" అనే వాళ్లు
మునిసిపాలిటీ వైతరిణిలో కూలబడి
"జగాన్ని మాయం" చేసే వారు.
పక్కనే అప్పటిదాకా చక్కగానే నడుస్తూ
ఒక్కసారిగా మన భుజంపై భళ్లున వాంతి చేసుకొనేవారు.
బస్సులో సీటు క్రింది బుడ్డి ఎవరిదంటే
ణాధి ఖాదంఠే ణమ్మరే? అని దబాయించేవారు.
ఇవీ ఇక్కడ మనకు కనిపించే ఒకానొక
వికృత క్రీడా వినోదపు చేష్టలు.
ఇక్కడ కనిపించే కనిపించే ప్రతి కొత్తదేహము,
నడిచే మత్తుముద్ద.
గుద్ది గాయం చేసిన తరువాతే
తెలుస్తుంది అది
మత్తు చెట్టుకు ఊయలలూగుతుందని.
మాది యానం అని చెప్పేసరికి
పెదాలమీదపరచుకొనే వక్ర నవ్వుకు
విక్రమార్కుడక్కరలేదేమో భాష్యం చెప్పటానికి.
బొల్లోజు బాబా
(యానంలో మద్యం చవకగా లభించే కారణంగా పరిసర ప్రాంతాలనుండి మద్యపాన ప్రియులు వచ్చి ఫుల్లుగా లాగించి పోతుంటారు.)