Monday, January 26, 2026

లించింగ్.... .


తమ్ముడూ!
నువ్వు హింసను
సాధన చేయాలోయ్
మనిషిని మనిషే
సజీవంగా పీక్కుతుంటూంటే
తప్పట్లు కొడుతూ
"ఒన్స్ మోర్... ఒన్స్ మోర్" అని అరుస్తూ
ఎంజాయ్ చేసే స్థాయికి చేరుకోవాలోయ్
ఏళ్ళొచ్చినయ్.
ఎప్పటికి తెలుసుకొంటావ్.
ఎక్కువ ఆలోచించకు.
ఈ ప్రపంచం
ఎలా ఆనందిస్తోందో
ఒక్కసారి చూడు !
.
బొల్లోజు బాబా

ఇది "హరప్పా నుండి నేటివరకూ" పుస్తకానికి ప్రముఖ రచయిత, చరిత్ర సాంస్కృతిక విశ్లేషకులు శ్రీ కల్లూరి భాస్కరం గారు రాసిన ముందుమాట.


చరిత్రను ఈ కాలంలో ఎలా చదవాలి, ఎలా ఎదుర్కోవాలి అన్నదానికి ఇది ఒక బలమైన బౌద్ధిక నేపథ్యాన్ని అందించింది.
ఇంత లోతైన, బాధ్యతాయుతమైన విశ్లేషణతో ముందుమాట రాసిన శ్రీ భాస్కరం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
పాఠకుల నుంచి పుస్తకానికి వస్తున్న ఆదరణ, ఈ ప్రయత్నం సార్థకమైందనే నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది.
ఈ ప్రయాణంలో తోడైన అందరికీ ధన్యవాదాలు.
ఈ వ్యాసాన్ని ప్రచురించిన సాహిత్యప్రస్థానం పత్రిక ఎడిటర్ గారికి, ప్రచురణకర్తలు శ్రీ ఎస్.వి. నారాయణగారికి, కవర్ పేజ్ ఇచ్చిన శ్రీ గిరిధర్ గారికి, బలమైన క్రిస్పీ బ్లర్బ్ ఇచ్చిన సహృదయ మిత్రుడు శ్రీ అద్దేపల్లి ప్రభుగారికి, మరీ ముఖ్యంగా ఈ పుస్తకాన్ని కొని చదివి ఫోన్ లో మెసేజుల ద్వారా అభినందించిన అందరకూ....
బొల్లోజు బాబా
.
అసత్యాల అంధకారంపై చరిత్రవెలుగుల జడి
.
మన దేశం ఈరోజున ఒక కీలకదశలో ఉంది, కీలకమైన మలుపు తిరిగే దశలో ఉందని కూడా చెప్పవచ్చు. దానికి పూర్వరంగంలో క్షీరసాగరమథనంలా ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున భావసాగరమథనం జరుగుతోంది. అయితే, దానినీ, దాని ప్రాముఖ్యాన్నీ ఎంతమంది గుర్తించారో తెలియదు. గుర్తించవలసిన అవసరం మాత్రం ఉంది. బహుశా ఉపనిషత్తుల కాలం తర్వాత ఈ గడ్డమీద మళ్ళీ ఇప్పుడే పతాకస్థాయిలో భావాలు సంఘర్షించుకుంటున్నాయని నేను పదే పదే చెబుతూవచ్చాను. నేటి సందర్భ ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించి, అర్థం చేసుకునేవరకూ మళ్ళీ మళ్ళీ ఆ మాట చెప్పుకోక తప్పదు.
క్షీరసాగరమథనంలో విలువైనవాటితోపాటు, విషం కూడా పుట్టిందని మనకు తెలుసు. భావసాగరమథనం అందుకు భిన్నంగా ఉంటుందనీ, ఉండాలనీ ఆశించలేం. ఈ దేశానికీ, ఈ దేశగమనానికీ చెందిన ఎన్నో అంశాలలో ఒక స్పష్టతకు, ఒక అవగాహనకు రావడానికి చేయగల దోహదమే - దానినుంచి రాబట్టుకోగల విలువ; ఆ క్రమంలో అజ్ఞానపూరిత ఆవేశకావేశాల రూపంలో పుట్టుకొచ్చేది - విషం. అయినా అంతిమంగా జ్ఞానామృతభాండం చేతికందేవరకూ మథనం అనివార్యం.
ఇప్పుడీ భావసాగరమథనం అనేక రంగాల మీదుగా, అనేక పొరలలో జరుగుతోంది. వాటిలో ‘చరిత్ర’ ఒకటి. ఎక్కడైనా, ఎప్పుడైనా భావసంఘర్షణా, భౌతిక పరిస్థితులూ ఒకదానినొకటి పెనవేసుకుని, ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటూనే మనుషులను, లేదా దేశాలను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఈ గమనమంతా కలసి చరిత్ర అవుతుంది. స్థలకాలాల మీదుగా జరిగిన ఈ గమనం తాలూకు వివరాలన్నీ ఒకచోట క్రోడీకరిస్తే, అది ‘చరిత్ర’ అనే రూపం ధరిస్తుంది. అయితే, శ్రీశ్రీ చెప్పినట్టు చరిత్ర అంటే కేవలం తారీకులు, దస్తావేజులు మాత్రమే కాదు; స్థలకాలాలతో లేదా పరిణామక్రమంతో ముడిపడిన ప్రతీదీ చరిత్రగానే మారుతుంది. ఆవిధంగా చూసినప్పుడు, మనకు సంబంధించి, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు, కావ్యాలు, నాటకాలు, ప్రబంధాలు, అన్ని రకాల కళారూపాలు కూడా చరిత్రలో భాగమవుతాయి. కనుక, ఆధ్యాత్మికవాదులు చెప్పే ఆత్మ సర్వవ్యాపి అవునో కాదో తెలియదు కానీ, చరిత్ర సర్వవ్యాపి.
అయితే, ఒక మాట గానూ, ఒక సబ్జెక్టుగానూ కూడా చరిత్ర అంత గంద్రగోళానికి, వివాదాలకీ, తిరస్కారానికీ, చులకనకూ, అస్పృశ్యతకూ గురైన మరో మాటా, మరో సబ్జెక్టూ కనిపించదు. ఏది చరిత్ర, చరిత్ర నిర్వచనం ఏమిటి, చరిత్రను ఎలా వర్గీకరించాలి మొదలైన అనేక విషయాల్లో మన మధ్య ఇంతవరకూ ఒక కనీసమైన వస్తురూపసంబంధమైన ఏకీభావం కూడా ఏర్పడలేదు. మనకు చరిత్ర అక్కర్లేదండీ అంటూ ఒక్కమాటతో తీసి పారేసి, సంభాషణను హఠాత్తుగా ముగించిన విశ్వవిద్యాలయ పండితులు నాకు తెలుసు.
అయినాసరే, బ్రిటిష్ వలస పాలన దరిమిలా ఆత్మన్యూనతను, ఆత్మోత్కర్షగా మలచుకునే ప్రయత్నంలో మనకు చాలా గొప్ప చరిత్ర ఉందని చెప్పుకుంటూ చరిత్రరచనకు పూనుకున్న విచిత్ర చరిత్రా మనకు ఉంది. చరిత్రపట్ల తిరస్కారంతోపాటు, చరిత్ర రచనకు అవసరమైన విధివిధానాల క్రమశిక్షణ లోపించిన పరిస్థితిలో చరిత్రకు మసి పూయడం, మాయచేయడం, అణచిపెట్టడం, చరిత్ర పేరుతో అబద్ధాలను దండగుచ్చడం, లేని ఘనతను ఉన్నట్టు చూపడం, ఉన్న ఘనతను లేనిదిగానో, తక్కువ చేసో చూపడం విశృంఖలంగా జరుగుతూవచ్చింది. అదిప్పుడు ఔత్సాహిక చరిత్ర రచయితలు, అకడమిక్ పండితులు, భావజాల దృక్కోణంనుంచి చరిత్రను వ్యాఖ్యానించే ఆలోచనాపరులనే పొరలను దాటి రాజకీయకార్యక్షేత్రంలోకి, అందులోనూ అధికారపు అండ ఉన్న రాజకీయక్షేత్రంలోకి, సినిమా వంటి కళారూపాల్లోకి ప్రవేశించి మరింతగా వికటతాండవం, విలయతాండవం చేయడం చూస్తున్నాం.
ఇంకొక వింతా, వైరుధ్యమూ ఏమిటంటే; ఈ రాజకీయప్రేరిత చరిత్ర కల్పనకూ, కల్పితాలకూ, అబద్ధాలకూ, అసమగ్ర చిత్రణలకూ పాల్పడేవారు, వాస్తవంగా తాము ఉద్దేశించిన లక్ష్యానికి తామే నష్టం కలిగించుకుంటున్నామన్న సంగతిని గుర్తించకపోవడం! ఎలాగంటే, అసత్యాలతో, అర్ధసత్యాలతో, అతిశయోక్తులతో ఎవరినైనా, దేనినైనా ఆకాశానికి ఎత్తే ప్రయత్నం జరుగుతున్నకొద్దీ; దానికి సమాంతరంగా, వాటిని ఎత్తిచూపి, ఇదీ అసలు వాస్తవమని చెప్పే ప్రయత్నమూ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అది ఉద్యమరూపం ధరించిన దామాషాలోనే ఇదీ ఉద్యమరూపం ధరిస్తుంది. అంటే, మెచ్చులు, హెచ్చులు చూపినకొద్దీ పుచ్చులూ, రొచ్చులూ కూడా వేలెత్తి చూపవలసి వస్తూ ఉంటుంది.
ఈ క్షణాన అక్షరాలా జరుగుతున్నది అదే. అదీ జరగవలసిందే కానీ, అకడమిక్ రంగానికి పరిమితమై జరగడం వేరు, రాజకీయక్షేత్రంలోకి అడుగుపెట్టి జనం భావోద్వేగాలతో నేరుగా ముడిపెట్టుకుని జరగడం వేరు. అందుకు బాధ్యత వహించవలసింది, రాజకీయప్రేరిత సోకాల్డ్ చరిత్రకారులు మాత్రమే.
నేరుగా బొల్లోజు బాబా గారి ‘హరప్పానుంచి నేటి దాకా’ అనే ఈ పుస్తకంలోకి రావలసింది పోయి, మరీ ఇంత పెద్ద ఉపోద్ఘాతమా అని, ఇంతవరకూ చదివిన పాఠకులు అనుకుంటూ ఉండవచ్చు. కానీ, ఈ పుస్తకం విలువను మదింపు వేయడానికి ఇంత ఉపోద్ఘాతం అవసరమే. ఇది కూడా పూర్తిగా సరిపోతుందని కానీ, సమగ్రమని కానీ, సంపూర్ణ న్యాయం చేశానని కానీ నేను అనుకోవడంలేదు.
ఈ పుస్తకరూపంలోని బాబా గారి కృషి అంతా పైన చెప్పిన అనివార్య సమాంతర ప్రయత్నంలోకే వస్తుంది. తెలుగునాట ప్రస్తుతం చరిత్రరంగంలో అలాంటి సమాంతర ప్రయత్నం చేస్తున్న కొద్దిమందిలో బాబాగారు ఒకరు. ఆవిధంగా ఈ పుస్తకంలోని ప్రతి ఒక్క వ్యాసానికీ గొప్ప ప్రాసంగికత ఉంది. చరిత్ర పేరుతో రాజకీయపు ఊతతో బయట వినిపిస్తున్న అనేకానేక విపరీతకర్ణకఠోరవికటధ్వనులకు వ్యతిరేకంగా, వాస్తవికసమాచారం ఆధారంగా, సత్యాన్వేషణ ప్రధానంగా చేసిన కర్ణపేయమైన ప్రతిధ్వనులు – స్థూలంగా ఈ వ్యాసాలు.
ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ చిరకాలంగానే కాక, సమకాలీనంగా కూడా, చరిత్ర పేరిట వివిధరూపాల్లో ప్రచారంలోకి తెచ్చిన అసత్యాలను, అర్ధసత్యాలను, వక్రీకరణలను ఎత్తి చూపి వాస్తవాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగాలు. ఆవిధంగా ప్రాసంగికతను స్థాపించుకుంటున్నాయి. ప్రతి ఒక్క వ్యాసమూ ప్రమాణసూచికలతో, అంతగా ప్రాచుర్యంలో లేని విలువైన సమాచారంతో, ఎంతో ఆసక్తినీ, ఆలోచననూ గొలిపేవిగా ఉన్నాయి. నిజానికి, ఏ విశ్వవిద్యాలయ స్థాయిలోనో, తగినంత అర్థబలం, అంగబలం ఉన్న ఏ సంస్థ ద్వారానో జరగవలసిన కృషిని వ్యక్తిగతస్థాయిలో బాబా గారు తలకెత్తుకున్నారు. కాకపోతే అందువల్ల అనివార్యంగా కొన్ని పరిమితులూ ఏర్పడతాయి కనుక ఈ పుస్తకపాఠకులు వాటినీ దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది.
తాజా జన్యుఆధారాలతో ఆర్యుల వలసను నిర్ధరించడం, కులాలు బ్రిటిష్ వారి సృష్టా అని ప్రశ్నించి చర్చించడం, మాక్స్ ముల్లర్ , మెకాలే, చివరికి ఇటీవలి అంబేడ్కర్, నెహ్రూలకు వ్యతిరేకంగా జరుగుతున్న ద్వేషపూరిత అసత్యప్రచారాన్నీ; శంభాజీ లాంటి వారికి అనుకూలంగా జరుగుతున్న అబద్ధప్రచారాన్నీ; రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ పాత్రను తక్కువ చేస్తూ బి. ఎన్. రావు పాత్రను ఎక్కువ చేసి చూపడం వగైరాలనూ ప్రశ్నిస్తూ, అసలు నిజాలను ఆవిష్కరించడం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. వాటితోపాటు, మొగల్ చక్రవర్తులకు జన్మనిచ్చిన హిందూస్త్రీల గురించి, మొగల్ పాలకులు సంస్కృతాన్ని, సంస్కృతపండితులను ఆదరించడం గురించిన సమాచారాన్ని ఇవ్వడంతో సహా - ఇందులోని అనేక వ్యాసాలు - ప్రత్యేకించి గత దశాబ్దకాలంగా, అధికారపక్షపు అండతో మరింత పెద్ద గొంతును తెచ్చుకున్న ఏకపక్షవాదాలకు సముచిత ప్రతిస్పందనలు, ఆవిధంగా ఎంతైనా ప్రాసంగికాలు.
ఆ క్రమంలోనే కొందరు చారిత్రకవ్యక్తులు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వారు తీసుకున్న చర్యలు వగైరాలను, ప్రచారంలో ఉన్నదానికి భిన్నమైన కోణంలో, లేదా మరుగుపడిన కోణంలో రచయిత చూపిస్తారు; అలనాటి రాజరాజనరేంద్రుడితో మొదలుపెట్టి, ఔరంగజేబ్, దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇటీవలి ఇందిరాగాంధీ తదితరులు ఇందుకు ఉదాహరణలు.
ఇందులోని ‘ఆదిశంకరాచార్యుడు-ఆధ్యాత్మికయాత్ర’, ‘సింహాచలం-కొన్ని సంగతులు’ మొదలైన వ్యాసాలు చదువుతున్నప్పుడు, అవి అమిత ఆసక్తికరంగా ఉండడమే కాక; ప్రాచీన, మధ్యయుగ, ఆధునికపూర్వకాలిక చారిత్రకగమనాన్నీ, ఆ వెలుగులో నేటి దేశగమనాన్నీ అర్థం చేసుకోవడానికి అవి ఎంతైనా తోడ్పడతాయనిపించింది. సింహాచలం కేంద్రంగా జరిగిన యుద్ధాల తీరునే గమనిస్తే, ఇప్పుడు కూడా అలాగే రాజకీయయుద్ధాలు మతం ముసుగులోనే జరుగుతున్న సంగతి మనకు స్ఫురిస్తుంది.
అలాగే, ‘అయోతీ థాస్-దక్షిణభారత దళితమేధావి’, ‘రిజర్వేషన్ల కోసం పోరాడిన పెరియార్’ మొదలైనవి ఇటీవలి తరాలకు పెద్దగా తెలియని విస్మృతవ్యక్తులను, లేదా ఆయారంగాలలో వారి విస్మృతపాత్రనూ పరిచయం చేసిన వ్యాసాలు. ఈ పుస్తకం విలువను పెంచే విశేషాలు ఇంకా అనేకం ఉన్నప్పటికీ, విస్తరణభయంవల్ల ప్రస్తావించ లేకపోతున్నాను. పుస్తకం ఎలాగూ మీ చేతుల్లో ఉంది కనుక మీరే వాటిని దర్శించవచ్చు.
చివరిగా ఒక మాట చెప్పుకోవాలి. ఇటువంటి చరిత్ర ప్రధానమైన వ్యాసాలకు సంబంధించి, వస్తురూపాల నిర్వహణలో కేవలం ఒక కోణం కాక, అనేక కోణాలు జతపడి ఉంటాయి, అనేకవైపుల నుంచి విషయాలను పరిశీలించి నిగ్గు తేల్చుకోవలసి ఉంటుంది. ఒక నిర్దిష్ట ఉదాహరణ చెప్పాలంటే; సమాజం, సంస్కృతి, సాహిత్యం, మతవిశ్వాసాలు, దేవీదేవతలు, స్త్రీ-పురుష అంతరాలు మొదలైనవాటిని స్వదేశ, లేదా ప్రాంత కేంద్రితంగా మాత్రమే చూసినప్పుడు వాటి సమగ్రచరిత్ర బయటపడదు; ఎందుకంటే, ఇలాంటి అనేక విషయాలలో, ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు దేశాలుగా చెప్పుకునే అనేక ప్రాంతాలు పరస్పరం ప్రభావితం చేసుకున్నాయి, అనేకమైన వాటిని ఇచ్చిపుచ్చుకున్నాయి. కనుక వాటిని విశ్వజనీనకేంద్రితంగా చూసినప్పుడే వాటి గురించిన సమగ్రచరిత్ర వెల్లడవుతుంది.
ఉదాహరణకు, గ్రామదేవతారాధన మూలాలు హరప్పా సంస్కృతిలోనే ఉన్నాయనడం కానీ, ‘భారతీయసంస్కృతి’లోని సిందూరం, నల్లపూసలు, పువ్వులు ధరించడం వగైరా స్త్రీల తాలూకువన్నీ హరప్పన్ల నుంచి వచ్చాయనడం కానీ పాక్షికసత్యాలే అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల సౌభాగ్యవర్ధనంతో నేరుగా ముడిపెట్టుకుని చూసిన ఋతురక్తం, ప్రసవరక్తం, జంతురక్తాల నేపథ్యంనుంచి సిందూరధారణ వచ్చిందనీ; అలాగే, పూవులు, పండ్లు, రకరకాల మూలికలతో కూడిన పెరటిసాగుతో స్త్రీలకు మొదటినుంచీ, దాదాపు ప్రపంచమంతటా హార్దికసంబంధం ఉంటూ వచ్చిందనీ తేల్చిన అధ్యయనాలు అనేకం ఉన్నాయి. అలాగే, స్త్రీల స్థానం దిగజారడం వెనుక కూడా ఇలాంటి విశ్వజనీనకేంద్రిత చరిత్ర చాలా ఉంది. మనదేశానికి మాత్రమే పరిమితమై దానిని చెప్పుకోవడంవల్ల ఆ అంశానికి పూర్తి చారిత్రకన్యాయం జరగదు.
ఇతరత్రా ఎంతో విలువైన సమాచారమూ, దృష్టికోణమూ, ప్రాసంగికతా కలిగిన ఈ పుస్తకంలోని అంశాలను ఇలాంటి అదనపు కోణాలను కూడా జత చేసుకుని చూడాలని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఎన్నో చారిత్రకాంశాలను పొందుపరచడంతోపాటు, ఎన్నో ఆలోచనలను రేకెత్తించే ఈ పుస్తకం ఇలాంటి మరెన్నో కోణాలనుంచి పరిశీలనకు ఒక చక్కని ఆధారభూమిక కాగలిగినది.
బొల్లోజు బాబాగారికి హృదయపూర్వక అభినందనలు.

-కల్లూరి భాస్కరం

(ఈ వ్యాసం సాహిత్యప్రస్థానం పత్రికలో ప్రచురింపబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను)






పిల్లలు…


మన జీవితమనే ఇంట్లోకి
పిల్లలు బుడి బుడి అడుగులతో
నిశ్శబ్దంగా ప్రవేశిస్తారు

వారి చిట్టిచేతులతో
మన ఆలోచనలని
మన మాటలను
మన కాలాన్ని
కౌగిలించుకొని
పాటలతో నవ్వులతో
నింపేస్తారు

మనమేమో
చల్లని ఎండను, వేడి వెన్నెలను
మోసుకొంటూ సాగే నదిలా
తీరాల్ని ఒరుసుకొంటూ
ముందుకు సాగిపోతాం

మనం లేకపోయాక కూడా
వాళ్ళు ఇక్కడే ఉంటారు
వానాకాలం ముగిసాక
గోడలపై మిగిలే తేమలా
సాయంకాలం ఇంటిముందు
పడే పొడవైన నీడల్లా…

బొల్లోజు బాబా

suffocation....


.
చిన్ని చిన్ని ఆశలు
ఇప్పుడే కాదని
కలలను కొంతకాలం
వాయిదా పెట్టిందామె
కాళ్ళకింద నేల గట్టిపడాలని
***
పెళ్ళయింది
తల్లయింది
వంటగది వాసనైంది
నలుగురికి నీడైంది
అన్నీ అయింది
కానీ
'తాను' అవ్వలేకపోయింది.

ఒక్కొక్కటిగా
వాయిదా... వాయిదా..
వాయిదాలే జీవితమై పోయింది

అద్దంలో అదే మొఖం
అదనంగా
నుదుటి ముడుతలు
జుత్తులో తెల్లని నిశ్శబ్దం

ఆమె తన కుమార్తెకి
ఒకటే మాట
చెప్పాలనుకుంది
“తల్లీ!
ప్రపంచం కోసం
దేన్నీ వాయిదా వెయ్యకు
ఇప్పుడే మొదలు పెట్టు
నీ కోసం
నీ ఊపిరి కోసం”

బొల్లోజు బాబా

డిజిటల్ శ్వాస.....




.
మరణం తరువాత కూడా
అతని పేరు
సోషల్ మీడియంలో
శ్వాస తీసుకుంటూనే ఉంది
పోస్టులుగా
ఫొటోలుగా
కామెంట్లుగా

తెలియని ఎవరో
ఎప్పుడైనా చెప్పిన
బర్త్ డే విషెస్ కు
వెలుతురు స్క్రీన్
సమాధి రాయిలా
చేతికి చల్లగా తాకుతుంది.

ఎప్పటికైనా
ఫోన్ మూసేసి
రోజువారి పనుల్లో పడిపోక తప్పదు

లోపల ఎక్కడో
సిగ్నల్ లేని ప్రాంతంలో
వేదన మాత్రం
ఇంకా లోడ్
అవుతూనే ఉంటుంది

బొల్లోజు బాబా

Saturday, January 10, 2026

ప్రాచీనగాథల గురించి ….


.
ప్రాచీన గాథలు పుస్తకం విడుదలై ఏడాది కావొస్తుంది. సుమారు 500 పైగా ప్రాకృత, తమిళ, సంస్కృత పురాగాథల అనువాద సంపుటి ఇది. “సంగం కవిత్వం” ఈ పుస్తకంలో మొదటి చాప్టరు. నాకెంతో ఇష్టమైన చాప్టరు. పుస్తకంలో సుమారు 100 వరకూ సంగం కవితలు ఉన్నాయి.
సంగం కవిత్వంలో నాకు నచ్చిన ఒక గొప్ప కవిత ఇది.

55
పండగ రోజులు సమీపించాయి
భార్య ప్రసవవేదనలో ఉంది
వర్షం వల్ల పెందలాడనే చీకటి కమ్మేసింది
ఆమెకు సహాయం చేయటానికి
తొందరగా ఇంటికి వెళ్ళాలి ఆ చర్మకారుడు
బొంతను కుడుతున్న అతని చేతివేళ్ళ మధ్య సూది -
పట్టణాన్ని జయించటానికి వచ్చిన శత్రువుతో
ద్వంద్వయుద్ధంలో పోరాడుతున్న రాజు మెడలోని
దేవకాంచన పూలమాల కన్నా
వడిగా, కోమలంగా కదులుతోంది
Purananuru 82
(Perunarkilli అనే చోళరాజుకు Amur Mallan కు జరిగిన మల్లయుద్ధం ఈ గాథాసందర్భం)
.
బొంతను కుట్టే చర్మకారుని పని, పట్టణాన్ని కాపాడేందుకు ఒక రాజు చేస్తున్న పోరాటాన్ని ఒకే తలంపై నిలబెడతాడు ఈ గాథాకారుడు. రాజు చేసే యుద్ధం ఎంత విలువైనదో చర్మకారుని పని కూడా అంతే గౌరవనీయమని కవి చెబుతున్నాడు. మానవ విలువలు వృత్తితో నిర్ణయించబడవు అన్న భావన ఎంత ఉదాత్తమైనది. వర్ణ వ్యవస్థ, పురుషాధిక్యత ఇంకా కబళించని కాలమది.
అంతే కాక అప్పట్లో ప్రాణనష్టం నివారించటానికి ఇరురాజులు ద్వంధ్వ యుద్ధం ద్వారా జయాపజయాలను నిర్ణయించుకొనేవారనే చారిత్రక సత్యం కూడా ఈ గాథలో పొందుపరచబడింది.
***
పుస్తకం చివర ఆయా గాథల చారిత్రక నేపథ్యం చెప్పే నోట్సులో సంగం కవిత్వ సమాచారం ఇది.
ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో ఛాయా వారి స్టాల్స్ 178 నందు లభిస్తుంది. మొదటి కామెంటులో ఇచ్చిన అమజాన్ లింక్ లో కూడా దొరుకుతుంది.
***

సంగం కవిత్వం నోట్సు
.
సంగం కవిత్వం, 300 BCE నుండి 300 CE మధ్య రచింపబడిన తమిళ సాహిత్యం. ఇంతవరకూ లభించిన సంగం కవిత్వం సుమారు 473 మంది కవులు రచించిన 30 వేల పాదాలున్న 2381 కవితలు. ఈ 473 మంది కవులలో 103 మంది అజ్ఞాతకవులు. కపిలర్‌ కవి పేరుతో అత్యధికంగా 235 గాథలు ఉన్నాయి. సంగం కవిత్వంలో రెండు సంప్రదాయాలున్నాయి. ఒకటి అకం` ప్రేమ, మానవోద్వేగాలను వర్ణించే భాగం, రెండు పురం- రాజకీయాలు, యుద్ధాలను ప్రతిబింబించే భాగం. ఈ సాహిత్యంలో వేటగాళ్ళు, రైతులు, నావికులు మత్స్యకారులు, కుమ్మరులు, గొల్లలు, వర్తకులు, గాయకులు, కమ్మరులు, సైనికులు లాంటి దిగువతరగతి కుటుంబాలకు చెందిన సామాన్య వ్యక్తులే ప్రధాన పాత్రలు. కులీనుల జీవిత చిత్రణ అరుదు.

తెలుగు తమిళాలు ఒకే రకమైన మూలాలను, సంస్కృతిని పంచుకొన్నప్పటికీ తెలుగు తమిళవారసత్వాన్ని కాక, సంస్కృత కావ్య వారసత్వాన్ని అందిపుచ్చుకోవటం వల్ల, ప్రాచీనమైన ఉమ్మడి తమిళ, ప్రాకృత మూలాలకు దూరం జరిగిపోయింది. నన్నయకు పూర్వం తెలుగు సాహిత్యం ఉండేదని అరకొర ఆధారాలు లభిస్తాయి తప్ప బలమైన ఋజువులు లేవు. సంగం సాహిత్యానికి తొలి తెలుగు సాహిత్యానికి మధ్య సుమారు వెయ్యేళ్ల వ్యత్యాసం ఎందుకు ఉందనే ప్రశ్న విలువైనది.

‘‘సంగం సాహిత్యం ఎక్కువగా జైన, బౌద్ధ విశ్వాసాలకు సంబంధించినది. ఆ తరువాత కాలంలో వచ్చిన శైవ వైష్ణవ సంప్రదాయ పండితులు ప్రోత్సహించని కారణంగా సంగం సాహిత్యం చాన్నాళ్ళు గుప్తంగా ఉండిపోయింది’’ అని Poems of Love and War పేరుతో వెలువరించిన సంగం సాహిత్య అనువాదరచనకు రాసిన ముందుమాటలో శ్రీ A.K. Ramanujan అన్నారు.

ఈ పని తెలుగునాట కూడా జరిగి ఉంటుంది. నన్నయపూర్వ ప్రాకృత లేదా ప్రాచీన తెలుగు సాహిత్యం ఎక్కువగా జైన, బౌద్ధ విశ్వాసాలకు సంబంధించినదనే కారణంతో సంప్రదాయ పండితులు దాన్ని తగలపెట్టి ఉంటారు. ఇదే అభిప్రాయాన్ని శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్ళపల్లి వారి గాథాసప్తశతి తొలి తెలుగు అనువాద రచన తొలిముద్రణ (1931) ముందుమాటలో చెప్పారు. సంగం సాహిత్య వారసత్వాన్ని రెండువేల సంవత్సరాల పాటు అటకలపై దాచుకొని, మఠాలలో భద్రపరచుకొని నిలబెట్టుకొన్నారు తమిళులు. తెలుగునేలపై అలాంటి పని జరిగినట్లు లేదు. బ్రాహ్మణిజపు విలువల్ని స్థాపించే మహాభారత కావ్యానువాద రచన చేసిన నన్నయను తెలుగుభాషకు ‘ఆదికవి’ గా ప్రతిష్ఠించుకోవలసి వచ్చింది.

***
ప్రాచీనతమిళ సమాజాన్ని, సంస్కృతిని అర్ధం చేసుకొనటానికి సంగం సాహిత్యం ఎంతో దోహదపడుతుంది. ప్రేమ, రాజ్యపాలన, యుద్ధం, నీతి, రాజకీయాలు, ప్రకృతి, సామాన్యప్రజల జీవనం వంటి అనేక జీవితకోణాలను ఈ సాహిత్యం ఆవిష్కరిస్తుంది. సంగం కాలం తరువాత శైవ నాయనార్ల, వైష్ణవ ఆళ్వార్ల సాహిత్యం ప్రసిద్ధి చెందింది.

సంగం కవిత్వంలో ప్రముఖమైనది ఎట్టుతొగై. ఇది ఎనిమిది సంకలనాల సముదాయం. అవి Ainkurunuru, Akananuru, Purananuru, Kalittokai, Kuruntokai, Natrinai, Paripadal, Patirruppattu.
ఈ ప్రాచీన కావ్యాలను వెలుగులోకి తెచ్చింది శ్రీ సామినాథ అయ్యర్‌ (1855-1942). తమిళ సంగం సాహిత్యం పునరుజ్జీవనం కొరకు ఇతను ఊరూరు తిరుగుతూ, మఠాలను సందర్శిస్తూ, అటకలపై దాచిన తాళపత్ర గ్రంథాలను సేకరిస్తూ, వాటిని పరిష్కరించి పుస్తకరూపంలో ప్రచురించటానికై తన యావజ్జీవితాన్ని వెచ్చించాడు. దాదాపు కనుమరుగైపోయిన ఒక విస్మృత సారస్వతాన్ని తిరిగి బతికించి ప్రచారంలోకి తీసుకొని వచ్చాడు.

1877లో ఎట్టుతొగై మొదటి ముద్రణకు రాసిన ముందుమాటలోని ఈ వాక్యాలు ఒక చారిత్రిక సందర్భాన్ని నమోదు చేస్తాయి

‘‘నిప్పు, నీరుల నుండి తప్పించుకొన్నవి మాత్రమే నిలిచాయి. వాటిలోకూడా చెదపురుగుల బారినబడి మిగిలినవి కొన్నే.... ముడి విప్పితే తాటిఆకులు పికిలిపోతాయి, ఆకు తిప్పితే అది మధ్యకు విరిగిపోతుంది.... పాత రాత ప్రతులు పొడుం పొడుం అయ్యాయి, వాటికి ఎవరూ పుత్రికలను పుట్టించలేకపోయారు’’

ఆ విధంగా వెలుగు చూసిన సంగం సాహిత్యం భారతీయ సాహిత్యచరిత్రలో గొప్ప స్థానాన్ని పొందింది. సంగం సాహిత్యం ఆర్యసంస్కృతి ప్రభావం దక్షిణ భారతదేశంపై ఇంకా పడని కాలంలో రచించబడటం వల్ల, వైదిక దేవతలు, ఆచారాలు, సంస్కృత పదాలు, పురుషాధిక్యత, వర్ణవ్యవస్థ లాంటివి కనిపించవు. ఆ విధంగా సంగం సాహిత్యపు చారిత్రికత ఎంతో విలువైనది. ఇది తమిళుల ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే సాహిత్యం.
ఈ గాథలు అనువదించడానికి Sri. A.K. Ramanujan, Sri. M.L. Thangappa, Prof. S.M. Ponniah వంటి ప్రముఖుల అనువాదాలు దారిచూపాయి.
.










బొల్లోజు బాబా

దేశవిభజన కొరకు జిన్నా చేసిన ఆర్గ్యుమెంట్



మేము (మాకొక దేశాన్ని ఇమ్మని) హిందువులను ఏమీ అడగటం లేదు. ఎందుకంటే వారేనాడూ చారిత్రికంగా సంపూర్ణ భారతదేశాన్ని పాలించలేదు. ముస్లిములే భారతదేశాన్ని ఏకం చేసి 700 ఏళ్ళు పాలించారు. మా నుంచి బ్రిటిష్ వారు భారతదేశాన్ని తీసుకొన్నారు. ఇప్పుడు అది వారిచేతుల్లో ఉంది కనుక వారిని అడుగుతున్నాము, మాకు తిరిగి ఇచ్చేయమని. హిందువులని కాదు. హిందుస్థాన్ హిందువులకే చెందుతుందని చెప్పడం ముమ్మాటికీ అర్ధం లేని మాట."
(Said by Muhammad Ali Jinnah, President of the All-India Muslim League March 2, 1941)

మూలవాసుల స్వరం - ద్రావిడ మహాసముద్రం


.
గూండ్ల వెంకటనారాయణ తాజా కవితాసంకలనం "ద్రావిడ మహాసముద్రం". ఇది కేవలం ఒక కవితా సంకలనం కాదు- ఒక సైద్ధాంతిక ప్రకటన, ఒక చారిత్రక పునర్నిర్మాణ ప్రయత్నం, ఆధిపత్య భావజాలంపై ఎక్కుపెట్టిన ఒక వాడి అయిన అస్త్రం. డా. జిలుకర శ్రీనివాస్ తన ముందుమాటలో అన్నట్లు ఇది "ఒక ఐడియలాజికల్ మెటఫర్". మరొక ముందుమాటలో పల్లెపట్టు నాగరాజు “సత్యం కోసం నిలబడేవాళ్ళు, సత్యం కోసం పలవరించే వాళ్ళు, సత్యం ఎంత సౌందర్యవంతమైందో అనుభవించేవాళ్ళు, ఈ పుస్తకాన్ని తెరవండి, కాలం గుండె చప్పుడు వినండి … అంటాడు. అది నిజం. "ద్రావిడ మహాసముద్రం" ఈ కాలపు దళితబహుజనుల గుండెచప్పుడు.
 
ఈ కావ్యంలోని భావజాలాన్ని, కవితా శిల్పాన్ని, దాని బలాలను పరిమితులను పరిశీలించినపుడు దాని ఆత్మ ఆవిష్కృతమౌతుంది.

భావజాల పునాది- ద్రావిడ అస్తిత్వ ప్రకటన
ఈ పుస్తకం యొక్క ఆత్మ ద్రావిడవాదం, కానీ అది కేవలం భౌగోళిక, రాజకీయ అస్తిత్వానికి పరిమితమైనది కాదు. కవి దృష్టిలో ద్రావిడవాదం ఒక తాత్విక చింతన. కవిచెబుతోన్న ద్రావిడ భావజాలం ఈ కింది మూల స్తంభాలపై నిర్మించబడింది:

1. ఆర్య సంస్కృతి వ్యతిరేకత:
భరతఖండానికి వలస వచ్చిన ఆర్యులు ఇక్కడి మూలవాసుల (ద్రావిడుల) మహోన్నత నాగరికతను ధ్వంసం చేసి, వారి చరిత్రను వక్రీకరించారని కవి బలంగా వాదిస్తాడు. ఈ ఆర్య ఆధిపత్య సంస్కృతిని, వారి దేవుళ్ళను, పురాణాలను కవి నిర్మొహమాటంగా తిరస్కరిస్తాడు.

"దేవుడికి ఆకలి అవుతుంది
నోటిలో నెత్తురు పిండితే కానీ ఆకలి తీరదు అంటాడు"
ఇక్కడ 'దేవుడు' అనే ప్రతీక, కేవలం ఒక మతపరమైన భావన కాదు. అది ఒక దోపిడీ వ్యవస్థకు, తన ఆధిపత్యంతో తన ప్రజలనే బలులగా కోరే ఆధిపత్య శక్తికి రూపకం.
/అక్కడ ఒక తోట ఉండేది
అది పూలతో, పండ్లతో ఇంకా నీడలతో గుబురుగా ఉండేది.
ఉదయసాయంత్రాల ఎండపొడితో ఒళ్ళుతోముకునేది
రాత్రి నక్షత్రాలను అంటించుకుని మురిసిపోయేది
చల్లని గాలులను మూటగట్టుకొని పైకి వెదజల్లుతూ ఉండేది//

కానీ ఒకనాడు అక్కడికో గోవు వచ్చింది
పూలను తుంపేసింది
తోకతో మొక్కలను విరిచింది
అక్కడ తేనె నెత్తురులా పారింది
నక్షత్రాలను, సీతాకోక చిలుకలను
తేనెటీగలను కాళ్లకింద నలిపేసింది
చల్లని గాలులను తరిమేసింది. //

ఈ కవితలో తోట అంటే కేవలం భౌతికమైన తోట కాదు. ఆర్యులరాక ముందు హరప్పాకాలం నుండీ ఈ నేలపై విలసిల్లిన ద్రావిడ సంస్కృతి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ నేల మూలవాసులైన దళిత బహుజనుల సంస్కృతి, వారి ప్రాకృతిక కళలు, శాంతి, సౌభాగ్యం, సౌందర్యం, ఆనందం నిండిన జీవనవిధానం. ఆర్యుల రాకను పవిత్రమైన గోవుతో పోలుస్తున్నాడు కవి. ఇదొక గొప్ప మెటఫర్. ఆ గోవు తోటను నాశనం చేసిందడంలో, ఆర్యులు మూలవాసుల కళలను, జీవనవిధానాన్ని, సామాజిక సాంస్కృతిక వ్యవస్థలను ధ్వంసం చేసిన వైనాన్ని మార్మికంగా చెబుతున్నాడు. “అక్కడ తేనె నెత్తురులా పారింది” అనే ఉపమానం ద్వారా జరిగిన హింసతో అణచివేత గొప్పగా వ్యక్తీకరించబడింది.
 
2. మూలవాసుల చరిత్ర పునర్నిర్మాణం:
ఆధిపత్య గాథలలో రాక్షసులుగా, దస్యులుగా, దెయ్యాలుగా చిత్రీకరించబడిన వారే ఈ నేల అసలైన బిడ్డలని, ఒకనాటి పాలకులని కవి గర్వంగా ప్రకటిస్తాడు. నిరాకరించబడిన గుర్తింపులను తిరిగి స్వీకరించి, వాటిని గౌరవ చిహ్నాలుగా మార్చుతాడు.

"అప్పుడు ఈ నేల మీద ఎన్నో దెయ్యాలు ఉండేవి
ఎంతో ముద్దుగా, ముచ్చటగా ఉండేవి"
ఈ వాక్యం ఒక అద్భుతమైన పునర్నిర్మాణం. 'దెయ్యం' అనే తిట్టును ఒక సహజమైన, అందమైన అస్తిత్వంగా మార్చడం ద్వారా, కవి ఆధిపత్య భాషను ధ్వంసం చేస్తున్నాడు.
“పంది తన రెక్కలతో నింగికి ఎగిరింది

నేలను చూసింది
అడవిని చూసింది
ఊరిని చూసింది
అలా ఎగురుతూ పక్షులతో స్నేహం చేసింది
రకరకాల పండ్లను తిన్నది, తేనెను రుచి చూసింది
మేఘాలపై నిద్రించింది
గాలులతో ఆటలు ఆడింది”//…... (రెక్కలపంది)

బ్రాహ్మణవాద ఉన్నతవర్గాల సౌందర్యశాస్త్రం పందిని నీచ జంతువు అంటుంది. దాన్ని అణచివేతకు గురైన వర్గాలకు ప్రతినిధిగా, కవితా వస్తువుగా చేయటం ఒక ధిక్కారం. ఆ రెక్కలు కేవలం కల్పన కాదు అవి చదువు, చైతన్యం, ఆత్మగౌరవం, తిరుగుబాటు. హెజిమోనిక్ బావజాలాన్ని తిరస్కరించటం.
 
3.అంబేద్కర్, ఫూలే, పెరియార్ తాత్విక కొనసాగింపు:
ఈ కావ్యం మహాత్మా ఫూలే ఆవిష్కరించిన ఆర్య-అనార్య, బ్రాహ్మణ-అబ్రాహ్మణ ద్వైదీకృత సంబంధాల వ్యక్తీకరణే అని స్పష్టమవుతుంది. రచయిత ఈ పుస్తకానికి రాసుకొన్న ముందుమాటలో తన స్వప్నం కోసం "అంబేద్కర్, మార్క్స్ అనే రెండు కాగడాలను పట్టుకొని పెరియార్ చూపుతో" తన కవిత్వంలో తిరుగుతానని చెప్పుకోవడం ఈ భావజాల స్పష్టతకు నిదర్శనం. ఈ మొత్తం అవ్యవస్థలకు పరిష్కారం ఏమిటనేది దానిపట్లకూడా కవి స్పష్టంగానే ఉన్నాడు.
“ఒరే బ్రాహ్మడా! నువ్వంటే ఎంతిష్టమో తెలుసా అంటూ మొదలయ్యే ఒక కవితలో
"రా, నా బిడ్డను నీ కుమారుడికి ఇచ్చి పెళ్ళి చేస్తాను
 
నీ కుమార్తెను నా కొడుక్కి ఇవ్వు" // అనడం కేవలం పెళ్లి ప్రతిపాదన కాదు. అది కుల నిర్మూలనకు డా. అంబేద్కర్ ప్రతిపాదించిన సూటియైన, విప్లవాత్మక మార్గం. వేల ఏళ్లుగా కులం పేరుతో వేరు చేయబడిన రెండు సమూహాలను "వియ్యంకులు"గా మార్చి, జాంబవ ద్వీపాన్ని (ప్రాచీన భారతదేశం) మళ్లీ పచ్చగా చూసుకుందాం అనడంలో ఒక గొప్ప ఆశ, బలమైన రాజకీయ ప్రకటన ఉన్నాయి. ముగింపులో కవి మళ్ళీ ఒక మానవీయమైన స్థాయికి సంభాషణను తెస్తాడు.
 
"ఆ మడి కట్టులో నువ్వెంత మగ్గి పోయావో కదా
ఊరి చివర వెట్టివాడిగా నేనూ అంతే కుమిలిపోయాను" అంటాడు. ఇక్కడ కులం అనేది కేవలం అణగారిన వర్గానికే కాదు, ఆచారాల చట్రంలో బందీ అయిన బ్రాహ్మణుడికి కూడా ఒక చెరసాలేనని కవి గుర్తిస్తాడు. ఇలాంటి వాక్యాలు రాయాలంటే మనుషులపట్ల అపారమైన ప్రేమా, లోతైన సామాజిక అవగాహనా ఉండాలి. ఇంత భావజాల స్పష్టత అరుదుగా చూస్తాం.
 
4. శిల్పం మరియు శైలి
నిజానికి ద్రావిడవాదం, చారిత్రిక, సైద్ధాంతిక వస్తువును కవిత్వరూపంలో చెప్పటం సాహసం అయినప్పటికీ వెంకట నారాయణ తన భావజాలాన్ని కేవలం నినాదాల రూపంలో కాకుండా, శక్తివంతమైన కవితా శిల్పంతో ఆవిష్కరించారు. దీనిని సాధించడానికి కవి జానపద కథనాత్మకత, ప్రతీకాత్మక, సంభాషణాత్మక శైలులను ఎంచుకొని చెప్పదలచుకొన్న వస్తువును సూటిగా స్పష్టంగా, బలంగా చెప్పగలిగాడు. ముందుమాటలో డాక్టర్ జిలుకర శ్రీనివాస్ చెప్పినట్లు, ఈ కవి "మృత రూపకాలకు రక్తమాంసాలిచ్చి, జీవం పోసాడు". ఈ టెక్నిక్, ఇతర పద్ధతులతో కలిసి, ఈ సంపుటిని ఒక సైద్ధాంతిక కావ్యంగా నిలబెట్టింది.

1. కథనాత్మక శైలి (Narrative Style): ఈ సంకలనంలోని అనేక కవితలు చిన్నచిన్న జానపద కథల రూపంలో ఉంటాయి. కథనాత్మకత పాఠకుడిని సులభంగా కట్టిపడేస్తుంది. 'రెక్కల పంది' కవిత ఇందుకు చక్కటి ఉదాహరణ. రెక్కలు మొలిచి ఆకాశంలోకి ఎగరాలనుకున్న పందిని (అణగారిన వర్గాల చైతన్యం), అధర్మం పేరుతో 'గోవులు' (ఆధిపత్య కులాలు) చంపేయడం కుల వ్యవస్థ యొక్క క్రూరత్వాన్ని సూటిగా చెబుతుంది.
 
‘పల్లెలో వెన్నెల’ కవితలో – ఒక పండితుడు అందమైన వెన్నెల తనపైనే కాకుండా “అధముల పల్లె” పై (దళితులు) కూడా కురుస్తున్నందుకు అవమానంగా భావించి దొరకు చాడీలు చెప్పి ఆ పల్లెను తగలబెట్టిస్తాడు. ఇది కులాధిపత్యంలోని దౌష్ట్యాన్ని కళ్ళకు కడుతుంది.
నిజమైన ఆవు, కోల్పోయిన లోకం, దేవుని స్వర్గం లాంటి కవితలు ఈ కోవకు చెందుతాయి
 
2. ప్రతీకాత్మక శైలి (Symbolism): ఈ కవిత్వంలో ప్రతీకలు కీలక పాత్ర పోషిస్తాయి. 'ఆవు' పూజ్యనీయమైనదిగా, 'పంది' అపవిత్రమైనదిగా నిర్మించిన సామాజిక సంకేతాలను కవి తలకిందులు చేస్తాడు. 'నలుపు' రంగును ఆత్మగౌరవానికి, సౌందర్యానికి ప్రతీకగా నిలబెడతాడు.
/నాయనా ఇలా రా! కాస్త నలుపెక్కుదాం
నలుపు జాతరలో బూరలమవుదాం//
పిల్లా! నీ కర్రెపెదాల మీద పూసిన వానపూగుత్తి ఇది
నీకోసం నేను కట్టిన నల్లపదం ఇది/ …..అంటాడు ‘నల్లపదం’ అనే కవితలో. ఇది కేవలం నలుపు రంగు గురించి కాదు, అణచివేయబడిన గుర్తింపును ఉత్సవంగా జరుపుకోవడం గురించి.
‘మనుష్యపంచకం’ అనే కవితలో గోవులను బ్రాహ్మణీయ వర్గానికి ప్రతీకగా, నల్లజాతి గొడ్లను ఈ దేశ దళిత-బహుజన శ్రామిక వర్గాలకు ప్రతీకగాను చేస్తాడు. ‘రంగుల దెయ్యంపిల్ల’ అనే కవితలో అట్టడుగు వర్గాల సంతోషాన్ని, సౌందర్యాన్ని ఆధిపత్య వర్గాలు ఎలా సహించలేవో ప్రతీకాత్మకంగా చెబుతాడు కవి.
 
3. సంభాషణాత్మక శైలి: కవి ఎక్కడా అభ్యర్థన స్వరంతో మాట్లాడరు. ఆయన స్వరం నిండా ఆత్మవిశ్వాసం, ధిక్కారం, మరియు హక్కుగా అడిగే తత్వం కనిపిస్తుంది. "మా కక్కయ్య మద్దూరి నగేష్ బాబుకి" అనే కవిత ఇందుకు పరాకాష్ట. బ్రాహ్మణుడిని సంబోధిస్తూ, ప్రేమను, ఆవేదనను, కోపాన్ని కలగలిపి, కుల నిర్మూలన జరగాల్సిన ఆవశ్యకతను ఒక సంక్లిష్టమైన సంభాషణగా మలిచారు.

‘కాంతివ్యాప్తం’ అనే కవిత ఇద్దరు ప్రేమికుల సంభాషణ. దానిలో “ప్రపంచంలో ఇంత బాధ ఉండగా మనమెలా ప్రేమించుకోగలం?”..... అంటూ కవి సంధించిన ప్రశ్న మామూలుది కాదు. ఆ ప్రశ్న ఎన్ని జీవితాల్ని రగిల్చి ఉంటుందో అనే ఊహే హృదయాన్ని పట్టిలాగుతుంది. ఈ సంపుటిలో ఇంకా ‘మనువాద దేశ ప్రేమకథ’, ‘గొప్ప కవిత్వానికి నిర్వచనం’ అనే కవితలు సంభాషణాత్మకంగా సాగుతాయి.
 
5. బలాలు - పరిమితులు
భావజాల స్పష్టత: ఈ పుస్తకం యొక్క అతిపెద్ద బలం దాని సైద్ధాంతిక స్పష్టత. రచయిత దేని తరపున నిలబడుతున్నాడో, దేనిని .వ్యతిరేకిస్తున్నాడో ఎక్కడా సందిగ్ధత లేదు.
శక్తివంతమైన రూపకాలు: "ద్రావిడ మహాసముద్రం" అనే శీర్షికే ఒక శక్తివంతమైన రూపకం. ఇది హిందూ మహాసముద్రం అనే ఆధిపత్య నామకరణాన్ని తిరస్కరించి, ఈ నేలపై, సముద్రంపై మూలవాసుల హక్కును ప్రకటిస్తుంది.

చారిత్రక చైతన్యం: సమకాలీన రాజకీయ పరిణామాల (తమిళనాడు గవర్నర్ జనగణమన జాతీయగీతంలో ద్రావిడ అనే పదాన్ని ఉచ్ఛరించనని రేపిన వివాదం) స్పృహతో మొదలుకొని, సింధు నాగరికత మూలాల వరకు కవి తన రచనను ఒక విస్తృత చారిత్రక చట్రంలో నిలబెట్టాడు.
పరిశీలించాల్సిన పరిమితులు

కవిత్వాన్ని అలంకారయుతంచేసే ప్రక్రియలో, అనివార్యంగా వస్తువును కొంతమేరకు రూపకాలు, ప్రతీకల మాటున కప్పి చెప్పవలసి ఉంటుంది. చారిత్రిక, రాజకీయ, సైద్ధాంతిక వస్తువును కవిత్వ రూపంలో చెప్పినప్పుడు పాఠకుడు దాని సౌందర్యాన్ని ఆస్వాదించే క్రమంలో దానిలోని చారిత్రక విమర్శను గుర్తించలేకపోవచ్చు.
 
సిద్ధాంతాలను కవిత్వరూపంలో చెప్పటం కత్తిమీద సాము. ఈ విషయంలో వెంకటనారాయణ వస్తువుకు సరిపడే రూపాన్ని ఎన్నుకోవటంద్వారా ఆ పరిమితిని అధిగమించి విజయం సాధించారని చెప్పవచ్చు. ఎందుకంటే కథనాత్మక, సంభాషణాత్మశైలిలో చెప్పినప్పుడు పాఠకులు సులభంగా లీనమైపోతారు. రచనతో కనక్టై ఆలోచించడం మొదలుపెడతాడు. ఏ రచన అంతిమ లక్ష్యమైనా ఇదే కదా!
 
6. ముగింపు
"ద్రావిడ మహాసముద్రం" తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా దళిత-బహుజన, ద్రావిడవాద సాహిత్యంలో ఒక గొప్ప ప్రయోగం. ఆర్యులు ఈ నేలకు వలస వచ్చారు అని ఇటీవలే జన్యుశోధనల ద్వారా నిరూపితమైంది. అయినప్పటికీ దాన్ని మనువాదులు ఒక సత్యంగా అంగీకరించటానికి సిద్ధంగా లేరు. కానీ ఆర్యులు వలస వచ్చి, మూలవాసుల సంస్కృతులను ధ్వంసం చేసి, వారిని బానిసలుగా చేసుకొని వారిపై తమ ఆధిపత్యాన్ని స్థాపించుకొన్నారు అనే సత్యం ఈ దేశ దళిత బహుజన వర్గాలు గ్రహించాయి. ఆ మేరకు వారు తమ అస్తిత్వాన్ని పునర్నిర్వచించుకొంటున్నారని పల్లెపట్టు నాగరాజు ముందుమాట స్పష్టపరుస్తుంది.
ఈ నేపథ్యంలో తెలుగు సాహిత్యంలో ఇలాంటి వస్తువుపై వచ్చిన కవిత్వంలో ఇదే మొదటిది కావచ్చు.
 
ద్రావిడ మహాసముద్రం అణగారిన వర్గాల వేదనను, ఆగ్రహాన్ని, వారి ఆకాంక్షలను ఇంకా వారి ఉజ్వలమైన భవిష్యత్ స్వప్నాన్ని అత్యంత శక్తివంతంగా నమోదు చేసింది. ఇది కేవలం చారిత్రక గాయాలను తడమడమే కాదు, భవిష్యత్తులో నిర్మించుకోవాల్సిన ఒక సమసమాజపు చిత్రపటాన్ని కూడా మన ముందు ఉంచుతుంది. గూండ్ల వెంకటనారాయణ కవిగా, ఒక సైద్ధాంతిక యోధుడిగా తన కలం ద్వారా ఒక బలమైన పొలికేక పెట్టాడు. ఆ పొలికేక ఈ "ద్రావిడ మహాసముద్రం" లో ప్రతిధ్వనిస్తోంది.

బొల్లోజు బాబా
(ఈ వ్యాసం నవ తెలంగాణ పత్రికలో ప్రచురింపబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను)




ఒక పెద్దాయన వాల్ పై.....

ఒక పెద్దాయన వాల్ పై --- "శంకరుడి తర్వాత...మళ్లీ ఈనేలలో మరెవడూ తాత్వికుడిగా పుట్టలేదు..!!" అనే మాటను విభేదించి డా. అంబేడ్కర్, ఫూలే, పెరియార్, రామస్వామి లాంటి తాత్వికులు మీకు కనిపించరా అని ప్రశ్నించాను. (ఆయనపట్ల నాకు గౌరవమే.) కానీ అక్కడ నేను ఎప్పుడెప్పుడో బ్లాక్ చేసిన అసహన పండితులందరూ చేరి నన్ను బాగానే తిట్టుకొన్నారు. Its ok. No problem.

ఇక ఈ అంశంపై కొంత వివరణ ఇది.

మనిషి, సమాజం, జీవితం, సత్యం, మానవ సంబంధాలు వంటి ప్రశ్నలపై తర్కబద్ధమైన, విమర్శనాత్మక ఆలోచనలనే తాత్వికశాస్త్రం అని అలా ఆలోచించే వ్యక్తిని తాత్వికుడు లేదా దార్శనికుడు అనీ అంటారు.
 
తత్వవేత్తలు సంప్రదాయాలను ప్రశ్నిస్తారు, కొత్త ఆలోచనా వ్యవస్థను నిర్మిస్తారు, మానవ అస్తిత్వాన్ని నిర్వచిస్తారు. ఈ పరిధిలోంచి చూసినపుడు మహాత్మా ఫూలే, డా.అంబేద్కర్, పెరియార్ లు ఇరవయ్యోశతాబ్దపు తత్వవేత్తలు.
 
1. మహాత్మా జ్యోతిరావు ఫూలే (1827–1890)
ఈయన చారిత్రిక నైతిక కారణాలు చూపి వేదాల ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. సమానత్వం ప్రాతిపదికన మానవసమాజాన్ని ఊహించాడు. పుట్టుక ఆధారంగా మనుషుల విభజన ఉండరాదని చెప్పారు. ఈయన రాసిన 'గులాంగిరీ' ఒక రాజకీయ తత్వశాస్త్ర గ్రంథం. దీన్ని రూసో లేదా మార్క్స్ రచనలతో పోల్చవచ్చు.

2. పెరియార్ ఇ.వి. రామసామి (1879–1973)
ఈయన హేతువుతో ఆలోచించి దేవుడిని, ఆత్మను, పునర్జన్మను అంగీకరించలేదు . కులం అనేది ఒక వ్యవస్థీకృత హింస అని వివరించాడు. నైతికత అనేది శాస్త్రాల నుండి కాదు, సామాజిక న్యాయం నుండి రావాలని చెప్పాడు. పెరియార్ ఆలోచనలు నీషే (Nietzsche) ఆలోచనలకు దగ్గరగా ఉంటాయి

3. డా. బి.ఆర్. అంబేద్కర్ (1891–1956): భారతదేశం అందించిన అత్యున్నత మేధావి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం వంటి పదాలకు భారతీయ పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త నిర్వచనాలు ఇచ్చారు.
ఈయన ప్రతిపాదించిన కుల నిర్మూలన అనేది కేవలం సామాజిక సంస్కరణ కాదు, ఒక నైతిక దిశానిర్ధేశనం. నవయాన బౌద్ధం ద్వారా దేవుడు లేని మానవతావాదాన్ని ప్రతిపాదించారు.
***

నేటి పండితులు తత్వశాస్త్రాన్ని ఇప్పటికీ శంకరుడు, రామానుజుడు, మాధ్వుడు, నింబార్కుడు, వల్లభాచార్యుడు వంటి కొన్ని పేర్ల చుట్టూనే తిప్పుతారు. వీరందరూ బ్రాహ్మణిజానికి కేంద్రంగా ఉండే కర్మ సిద్ధాంతం, వర్ణాశ్రమ ధర్మాలు, జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల వ్యవస్థ, బ్రాహ్మణాధిక్యత లాంటివాటిని తాత్వికంగా సమర్థించినవారే. ఈ ధోరణి సమాజంలోని అసమానతలను ప్రశ్నించకుండా, అవే సహజమైనవన్నట్లుగా చూపుతుంది. తత్వచింతనను “వేదాలు–బ్రాహ్మణులు–సంస్కృతభాష” అనే పరిమితిలో బంధించి, సామాజిక అనుభవాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వదు.
 
బ్రాహ్మణీయచట్రంలో కుదురుకొనే గాంధీ, సర్వేపల్లి రాధకృష్ణ, జిడ్డు కృష్ణమూర్తి, అరవిందో లాంటివారిని సమకాలీన పండితులు తత్వవేత్తలుగా అంగీకరిస్తారు కానీ బ్రాహ్మనిజాన్ని ధిక్కరించిన బుద్ధుడు, చార్వాకులు డా. అంబేడ్కర్, ఫూలే, పెరియార్, రామస్వామి, కంచె ఐలయ్య లాంటి వారిని ఒప్పుకోలేరు.

నిజానికి నేడు తత్వశాస్త్రం అంటే – సమాజం, మానవజీవితం పై చేసే తార్కిక విమర్శనాత్మక విశ్లేషణ. ఆధిపత్యధోరణులను సమర్ధించే వేదాంతం కాదు.
 
తత్వశాస్త్రం ఆధిపత్యం నుంచి విముక్తి వైపుకు పంతొమ్మిదో శతాబ్దంలోనే మార్క్స్ సిద్ధాంతంతో దిశమార్చుకుంది. ఈ మార్పు ఇప్పటికీ ఈ పండితుల కళ్లకు కనిపించటం లేదు. ఇంకా పాచిపళ్ళ పాటలే పాడుతున్నారు.

బొల్లొజు బాబా
పిఎస్. అక్కడ చర్చలో నా తరపున రెండుమాటలు మాట్లాడిన Sreerama Murthy గారికి, Pasunoori Ravinder అన్నకు ధన్యవాదములు

థ్యాంక్యూ విరాట్ గారు for a crisp review