Monday, September 1, 2025

చరిత్రపుటలలో – కోరంగి మహాపట్టణం

        కాకినాడకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరంగి గొప్ప చారిత్రిక ప్రాధాన్యత కలిగిన ఒకనాటి రేవుపట్టణం. క్రీస్తుపూర్వకాలం నుండి ఇరవయ్యో శతాబ్ద ప్రారంభం వరకూ కోరంగి ఓడరేవుగా, నౌకాపట్టణంగా, నౌకా నిర్మాణ కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది.


1. గత వైభవం

    సముద్రంలోకి నాలుక ఆకారంలో చొచ్చుకొని ఉన్న భూభాగాన్ని Cape (మూలాగ్రము) అని అంటారు. కోరంగి సహజసిద్ధంగా ఏర్పడిన ఒక Cape. క్రీశ మొదటి శతాబ్దానికి చెందిన రోమన్ చరిత్రకారుడు Pliny, గంగానదీముఖము నుండి 625 రోమన్ మైళ్ల దూరంలో Cape Calingon అనే ప్రముఖ రేవుపట్టణం ఉందని పేర్కొన్నాడు. దాన్ని కోరంగిగా Cunningham, Fergusson వంటి చరిత్రకారులు గుర్తించారు. కాలక్రమేణా తీరము విస్తరించటం, ఇసుక మేటలు వేయటం వల్ల ప్లీని వర్ణించిన కోరంగి రేవుపట్టణం నేడు సముద్ర తీరానికి దూరంగా జరిగింది.

    ప్లీని వర్ణించిన Cape Calingon అనేది నేటి కళింగపట్నం రేవు ఎందుకు కాకూడదని అనిపించవచ్చు. కానీ ఆ అవకాసం లేదు ఎందుకంటే గంగానదిముఖద్వారం నుండి కళింగపట్నం సుమారు 400 రోమన్ మైళ్ళు మాత్రమే ఉండగా (1 రోమన్ మైల్=1.47కిమీ). కోరంగి సుమారు 610 రోమన్ మైళ్ల దూరంలో ఉన్నది. ఇది ప్లీని చెప్పిన 625 రోమన్ మైళ్లతో సరిపోతుంది. అంతే కాక ఒకప్పుడు కళింగ సామ్రాజ్యం ఒరిస్సానుంచి గోదావరి వరకూ తూర్పు తీరం అంతటా విస్తరించి ఉండేది. కోరంగి కళింగ సామ్రాజ్యంలో ఒక భాగం ఆనాడు. కనుక Cape Calingon కోరింగ అనటం సబబుగానే అనిపిస్తుంది.

    ఒకటో శతాబ్దానికి చెందిన పెరిప్లస్ అనే గ్రీకు నౌకాయాన గ్రంథంలో ఒక గోదావరి రేవు నుంచి నిత్యం మలేషియాకు నౌకలు ప్రయాణంచేస్తున్నాయి, దానికి సమీపంలో అల్లోసినె (Allosygne) అనే పెద్ద పట్టణం కలదు అని వర్ణించాడు. Mccrindles అనే చరిత్రకారుడు ఆ రేవుపట్టణం కోరింగ కావొచ్చునని ఊహించాడు. [1] కోరంగికి ఆరుకిలోమీటర్ల దూరంలో ఆర్యావటం అనే ప్రముఖ బౌద్ధ క్షేత్రం కలదు. బహుసా టొలెమి చెప్పిన అల్లోసినె పట్టణం ఆర్యావటం కావొచ్చు.

    కోరంగి రేవుపట్టణం నుండి రోమ్, ఈజిప్టు లకు భారీగా వర్తకం జరిగేది. ఎక్కువగా సుగంధపరిమళాలు, మిరియాలు, యాలకులు, నీలిమందు, ఉక్కు, వజ్రాలు, ముత్యాలు, పత్తి, ఏనుగుదంతాలు, చందనము ఎగుమతి జరిగేది. సముద్రవ్యాపారం కారణంగా అపరిమితమైన బంగారం రోము నుండి భారతదేశానికి చేరిపోతున్నదని ప్లీని, హిప్పాలస్ వంటి వారి చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేసేవారు. కోరంగి రేవుద్వారా జరిగిన విదేశీ వాణిజ్యానికి సాక్ష్యంగా కోరంగి సమీపంలో కల మట్లపాలెం వద్ద రెండో శతాబ్దానికి చెందిన రోమను నాణెములు లభించాయి [2]. రేవు పట్టణములలో రాజు తరపున సుంకకరణములు అనే రాజోద్యోగులు ఉండేవారు. వీరు విదేశీ ఓడలకు రక్షణ కల్పించినందుకు, వ్యాపారులమధ్య ఘర్షణలు రాకుండా చూసినందుకు, మోసములు జరుగకుండా ఖచ్చితమైన తూకములు అమలుజరిపించేందుకు, ఓడదొంగలనుండి కాపాడేందుకు సరుకుల విలువలో నూటికి పది వంతులు చొప్పున రేవు సుంకము వసూలు చేసేవారు.

    అయిదవ శతాబ్దంలో రోమను సామ్రాజ్యం పతనమయ్యాకా, కొంతకాలం భారతదేశం నుండి జరిగే విదేశీ వాణిజ్యం మందగించింది. కానీ ఈ ప్రాంత వ్యాపారులు కొత్త వ్యాపార అవకాసాలను వెతుక్కొన్నారు. కోరంగి నుండి చైనా, జపాను, బర్మా, మలేషియా, జావా సుమత్రా లాంటి తూర్పు దేశాలను చేరి అక్కడి వారితో తమ వ్యాపారాలను కొనసాగించారు.

    క్రీశ. పదవ శతాబ్దములో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన రాజరాజ నరేంద్రుడు వేయించిన నాణెములు బర్మా దేశములో ఇసుకలో కూరుకుపోయిన ఒక ఓడ శిధిలములమధ్య లభించటాన్ని బట్టి ఆ తరువాత కూడా కోరంగి రేవు ప్రముఖ వ్యాపారకేంద్రంగా ఉండేదని ఊహించవచ్చును [3]. పదమూడవ శతాబ్దములో ఆంధ్రదేశాన్ని పాలించిన కాకతీయపాలకులు రేవులలో క్లుప్తశుంకమును (ముప్పదింట ఒకవంతు. అంతకుపూర్వం ఇది నూటికి పది వంతులు ఉండేది) ప్రవేశపెట్టి నౌకా వ్యాపారాన్ని ప్రోత్సహించారు. కాకతీయులు కృష్ణా తీర రేవులను ఎక్కువగా ప్రోత్సహించారు.
    ఈ కాలములో ఆంధ్రదేశాన్ని సందర్శించిన మార్కోపొలో కృష్ణా, గోదావరి రేవుల నుండి పెద్ద ఎత్తున విదేశీ వర్తకము జరుగుతున్నదని అన్నాడు. అంతే కాక ఇక్కడి ఓడలు చాలా బలమైనవని, పెద్దవిగా ఉన్నాయని; ఒక్కొక్క ఓడా అయిదారువేల మలగల (మలగ అనగా ఒక ఎద్దుమోయగల బరువు) మిరియములను మోయసామర్ధ్యము కలిగినవని; ఓడను నడుపుటకు మూడువందలమంది నావికులు ఉండాలని; ఓడ అడుగుభాగమున గదుల వంటి నిర్మాణములు కలవని, రాళ్లు లేదా తిమింగముల వలన ఏ గదికి దెబ్బతగిలితే ఆ భాగముమాత్రమే చెడిపోవును తప్ప ఓడ మునిగిపోయే ప్రమాదము లేదని అన్నాడు [4] . మార్కోపోలో కోరంగి అని ప్రత్యేకముగా ప్రస్తావించకపోయినా ఇక్కడకూడా నౌకా వ్యాపారం జరిగే ఉంటుందని ఊహించవచ్చును.

    ఆ తరువాత వచ్చిన నిజాం పాలకులు మచిలీపట్నాన్ని ప్రముఖ ఓడరేవుగా ప్రోత్సహించటం వల్ల క్రమక్రమంగా కోరంగిరేవు ప్రాభవం కొంత మసకబారినా అది ఏనాడూ మూతపడలేదని అనేక ఆధారాలు లభిస్తాయి.

   1619 జూలై నెలలో మచిలీపట్నం నుండి కెప్టైన్ Martin Pling నాయకత్వంలో సూరత్ కు బయలుదేరిన ఒక ఓడ, వాతావరణం సహకరించక కోరంగిరేవులో కొన్ని వారాలపాటు నిలిపి ఉంచవలసి వచ్చిందట. ఈ ఉదంతం ద్వారా కోరంగి రేవు అప్పటికి ఓడలకు కొన్ని వారాలపాటు ఆశ్రయం ఇచ్చే ఒక రేవు పట్టణంగా ఉండేది అని అర్ధం చేసుకొనవచ్చును [5].

    1666 జూలై లో ఒక ఓడ లోని సరుకులు ఎవరికి చెందాలి అనే అంశంపై వచ్చిన ఒక వివాదంలో మచిలీపట్నం వ్యాపారులు బెంగాలులో ఉండే కంపనీ అధికారులకు వ్రాసిన ఒక లేఖలో కోరింగ ప్రాంతానికి ‘మహమ్మద్ బేగ్ అనే వ్యక్తి సుబేదారుడు’ గా ఉన్నాడు అని చెప్పటాన్ని బట్టి కోరంగి రేవు గోల్కొండ నవాబు ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తుంది [6]. (ఈ మహమ్మద్ బేగ్ 1670-1676 మధ్య రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా చేసుకొని, నిజాం ప్రభువు ప్రతినిధిగా వేంగిరాజ్యాన్ని పాలించినట్లు మెకంజీ కైఫియ్యతుల ద్వారా తెలుస్తున్నది)

    ఆ తదుపరి కాలంలో నెలకొని ఉన్న రాజకీయ అస్థిరతల వల్ల కోరంగి నుండి జరిగే నౌకా వ్యాపారం క్షీణించింది. ఓడదొంగల దుర్మార్గములు పెరిగిపోయినవి. విదేశీ నౌకలు రేవులను చేరుటకు భయపడే పరిస్థితి వచ్చినది.

       కోరంగికి సమీపంలో ఉన్న ఇంజరం బ్రిటిష్ వారికి ఒకనాటి ప్రముఖ వర్తక కేంద్రం. ఇంజరంలో నివాసముండే ఈస్ట్ ఇండియా కంపనీ ప్రతినిధి అయిన జాన్ సాండర్ సన్ 1731, ఏప్రిల్ 7 న వ్రాసిన ఒక ఉత్తరంలో కోరంగికి సమీపంలో డచ్చి వారు ఒక స్థావరాన్ని నిర్మించుకోనున్నట్లు తెలిసింది, మనం కూడా అక్కడ ఏదైనా గొడౌన్ నిర్మించుకోగలిగితే ఉపయోగకరంగా ఉంటుందని పై అధికారులకు విన్నవించాడు [7] .

    1739 జూన్ 1 న ఇంజరం కంపనీ ప్రతినిధి Rich Prince వ్రాసిన ఒక ఉత్తరంలో బ్రిటిష్ వారు ఇంజరంలో కొనుగోలు చేసిన కాటన్ వస్త్రాలను రోడ్డుమార్గం గుండా కోరంగి రేవుకు చేరవేసి అక్కడ నుంచి ఎగుమతి చేయటం ఇబ్బందిగా ఉందని, వర్షాకాలంలో రోడ్డుమార్గంపై సరకులను చేరవేసేటపుడు తడిచిపోయి పాడయిపోతున్నాయని చెప్పాడు.

    1751, జనవరి 6 న ఇంజరంలో నివసించే ఈస్ట్ ఇండియా ప్రతినిధి వెస్ట్ కాట్ (Mr. Westcot) వ్రాసిన ఒక లేఖలో స్థానిక రాజు (పూసపాటి పెదవిజయరామరాజు) కోరంగిని సాలుకు 120 పగోడాల చొప్పున గోల్కొండ నవాబు నుండి కౌలుకి తీసుకొన్నాడు. అదే ధరకో కొంచెం ఎక్కువకో మనం తీసుకోగలిగితే మన వ్యాపారాలకు కోరంగి రేవు ఎంతో ఉపయోగపడుతుందని, తనకు అనుమతి ఇస్తే ముందుకు వెళతానని - అంటూ తన ఉన్నతాధికారులకు విన్నవించుకొన్నాడు. అదే సంవత్సరం సెప్టెంబరు నెలలో వ్రాసిన మరో ఉత్తరంలో కోరంగిని కౌలుకు తీసుకోవటం విషయంలో తన ఆలోచనను సమర్ధించినందుకు వెస్ట్ కాట్ ధన్యవాదాలు చెప్పినట్లు ఉండటాన్ని బట్టి ఈస్ట్ ఇండియా గవర్నరు ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి ఉంటారని భావించాలి.

    1753 ఫిబ్రవరి 1 వ తేదీన వెస్ట్ కాట్ ఉన్నతాధికారులకు వ్రాసిన ఒక లేఖలో - రాజుగారి నుండి కోరింగ రేవు పట్టణాన్ని ఏడాదికి రెండువందల అరవై పగోడాల మొత్తానికి కౌలుకు తీసుకొన్నానని, కోరంగి రేవును స్వాధీనం చేసుకొన్నానని; అంతే కాక ఇక్కడ దిగే ఓడలకు మూడు సంవత్సరాలపాటు సుంకం చెల్లించక్కరలేదని ప్రకటించానని, అలా చేయటం ద్వారా వివిధ దేశాలకు చెందిన నౌకలు ఇక్కడకు వస్తాయని తద్వారా ఎక్కువ వ్యాపారం చేసే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు [8]. కోరంగి రేవుపట్టణాన్ని కౌలుకు ఇప్పించటంలో సహకరించిన వారికి 66 పగోడాల బహుమతులను ఇచ్చినట్లు 1756 నాటి కంపనీ జమా ఖర్చులలో ఉండటం ఆనాటి సమాజంలో ఉన్న అవినీతిని పట్టిచూపుతుంది [9] .

        అంతవరకూ ఇంజరంలో ఉంటూ వ్యాపారాలు చేసిన వెస్ట్ కాట్ కోరంగికి తన మకాం మార్చి 1759 లో కోరంగి కాలువకు తూర్పువైపున అనేక నూతనభవనములు, గిడ్డంగులు నిర్మించాడు. వెస్ట్ కాట్ అభివృద్ది పరచిన ఈ ప్రాంతం కొత్తకోరంగి గా పేరుగాంచినది. కోరంగి కాలువకు పశ్చిమఒడ్డున కల ప్రాచీన కోరంగిపట్టణాన్ని పాతకోరంగిగా ప్రజలు పిలుచుకొంటున్నారు.
    వ్యాపారనిమిత్తం భారతదేశం వచ్చిన ఇంగ్లీషు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు వర్తకుల మధ్య పద్దెనిమిదో శతాబ్దంలో విపరీతమైన పోటీ ఉండేది. ఒకరినొకరు బద్ద శత్రువులుగా చూసుకొనేవారు. ఆనాటి అరాచక పరిస్థితులను 1789 లో కోరంగిని సందర్శించిన Mr. Topping అనే బ్రిటిష్ వ్యాపారి కళ్లకు కట్టినట్లు వర్ణించాడు – “కోరంగిలో ఇంగ్లీషు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు ఓడలు లంగరు వేసి ఉన్నాయి. చెడు ప్రవర్తన కలవారు ఇక్కడ విపరీతంగా సంచరిస్తున్నారు. ఎవరికీ భద్రత లేదు. రాత్రివేళల మద్యం మత్తులో ఎవరు ఎవరిని హత్యచేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఎవరు దోపిడీ చేస్తారో తెలియని పరిస్థితులు కోరంగిలో నెలకొని ఉన్నాయి” అంటూ Mr. Topping తనకు రక్షణ కల్పించమని కంపనీ అధికారులను కోరుకొన్నాడు [10]. పంతొమ్మిదో శతాబ్దం వచ్చేసరికి ఇంగ్లీషు వారు రాజకీయంగా బలపడటంతో ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు నెలకొన్నాయి.

    బ్రిటిష్ వారు కోరంగి రేవుకు తిరిగి పూర్వవైభవాన్ని తీసుకొచ్చి, ప్రపంచ ప్రసిద్ధ రేవుపట్టణంగా అభివృద్దిచేసారు. 1802 లో Mr. Ebenezer Roebuck అనే వ్యాపారి ఓడలు నిలుపుచేసే స్థలాన్ని (Dock) ను నిర్మించాడు. Ebenezer Roebuck ఒక లండన్ వ్యాపారి. ఇతను వ్యాపారనిమిత్తం భారతదేశం వచ్చి కోరంగిలో స్థిరపడి వ్యాపారాలు సాగించాడు. ఇతను నిర్మించిన Dock లో 155 అడుగుల పొడవు, 51 అడుగుల వెడల్పు ఉన్న Albatros పేరుగల ఓడకు మరమ్మత్తులు చేయటం అప్పట్లో ఒక రికార్డుగా నిలిచింది ఎందుకంటే కలకత్తా నుండి శ్రీలంక మధ్యలో ఎక్కడా ఇంతపెద్ద ఓడలను నిలుపుచేసే సౌకర్యం ఉండేది కాదు [11]. 1855 లో ఈస్ట్ ఇండియా కంపనీ 62,638 రూపాయిలతో కోరింగ హార్బర్ ను ఆధునీకరించింది. కోరంగి రేవు ద్వారా 1877-78 మధ్య ఎనిమిదిలక్షల రూపాయిల వ్యాపారం జరిగింది [12]. 1845 కోరంగి లైట్ హౌస్ ను నిర్మించారు. దీని నిర్మాణానికి 73 వేల రూపాయిలు ఖర్చు అయ్యాయి. 1855 లో దీని ఎత్తు 20 అడుగులు పెంపుచేసి, ఎక్కువదూరం కనిపించటం కొరకు లైట్ హౌస్ దీపం సామర్ధ్యం పెంచారు. ఈ లైట్ హౌస్ నుంచి వచ్చే కాంతి సముద్రంలో పద్నాలుగుమైళ్లవరకూ ప్రసరిస్తూ నౌకలకు దారిచూపేది. 1902 తరువాత దీనిని వినియోగించటం నిలిపివేసారు. ప్రస్తుతం ఇది కోరంగి మడ అడవులను సందర్శించటానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ఒక టూరిస్టు స్పాటుగా ఉంది.

    మద్రాసు గవర్నరుగా పనిచేసిన లార్డ్ కన్నెమెరా 19 డిసంబరు 1889 న మద్రాసులో Sirsa అనే ఓడపై బయలుదేరి మచిలీపట్నం, కాకినాడ రాజమండ్రి ప్రాంతాలను సందర్శన చేసాడు. ఇతను కోరంగిరేవులో దిగి కాకినాడ వెళ్ళిన వివరాలు ఇలా ఉన్నాయి "మచిలీపట్నం నుంచి బయలుదేరి ఆ రాత్రంతా ప్రయాణించి ఉదయానికల్లా కాకినాడకు పదిమైళ్ళ దూరంలో ఉన్న కోరంగి రేవుకు చేరుకొన్నాం. కోరంగి రేవు సందడిగా ఉంది. పెద్ద సంఖ్యలో ఓడలు, పడవలు లంగరు వేసి ఉన్నాయి. దూరంనుంచే యజమానులు తమ ఓడలను గుర్తించేందుకు వీలుగా ఓడలకు వివిధ రకాల రంగురంగుల జండాలు ఎగురుతూన్నాయి. జిల్లా కలక్టర్ Mr. Power వచ్చి ఓడలో గవర్నరుగారిని కలిసాడు. అప్పటికే సిద్ధం చేసిన ఆవిరి పడవ ఎక్కి కాకినాడ చేరుకొన్నాము [3]. " పై వివరాలనుబట్టి 1889 నాటికి కోరంగి రేవు ప్రధాన జలమార్గంగా, ఓడరేవుగా ఉన్నట్లు అర్ధమౌతుంది.

    1901 లో బ్రిటిష్ ప్రభుత్వం Mr. Brown అనే ఇంజనీరు ఆధ్వర్యంలో కోరంగి వద్ద తెరుచుకొనే వంతెన (Bascule Bridge) ను నిర్మించింది. ఓడలు వచ్చినప్పుడు ఈ వంతెన రెండుగా తెరచుకొని సుమారు 50 అడుగుల దారి ఇచ్చేది. ఈ వంతెన తలుపులను పైకిలేపటానికి ఎనిమిదిమంది అవసరపడేదట [14] .

    ఇరవయ్యో శతాబ్దం వచ్చేసరికి కోరంగి రేవులో ఇసుకమేటలు వేయటంతో దానిలోతు క్రమేపి తగ్గనారంభించింది. ప్రతి పదేళ్లకు ఒక అడుగుచొప్పున ఇసుక పేరుకుపోయేదట. పెద్దఓడలు వచ్చినపుడు అవి ఇసుకలో కూరుకుపోయేవి. అందుచేత ఓడల రాక నెమ్మదినెమ్మదిగా తగ్గిపోవటం జరిగింది. 1898-99 నాటికి కోరంగి రేవులోకి ఓడలరాక పూర్తిగా నిలిచిపోయింది. కోరంగి తన వైభవాన్ని కోల్పోవటంతో కాకినాడ నౌకాశ్రయం క్రమేపీ దీని ప్రాభవాన్ని అందిపుచ్చుకొని ప్రధాన రేవుపట్టణంగా ఎదిగింది.

2. కోరంగి ఒకనాటి నౌకా నిర్మాణ కేంద్రం

        పూర్వం నౌకల నిర్మాణం, మరమ్మత్తులకు కోరంగి ప్రపంచవ్యాప్త కీర్తి గడించింది. 500 టన్నుల బరువును మోయగలిగే సామర్ధ్యం కల ఓడలు ప్రతీ ఏటా వందకుపైగా తయారయ్యేవి. అంతే కాక ఈ సంఖ్యకు నాలుగురెట్లు ఓడలు మరమ్మత్తుల కొరకు వచ్చేవి. నౌకానిర్మాణానికి ప్రధాన ముడిసరుకు టేకు కలప. గోదావరి జిల్లాలోని అడవులలో టేకు కలప విస్తారంగా కలదు. ఇది ఇతర ప్రాంతాలలో దొరికే టేకు కన్న తక్కువ ధరకు లభించటవల్ల కోరంగిలో నౌకా నిర్మాణ పరిశ్రమ బాగా అభివృద్ధిచెందింది. అంతే కాక కోరంగి నుంచి ప్రతీఏటా 2000-3000 టేకు దూలాలు కోరంగి ఇతరప్రాంతాలకు ఎగుమతి జరిగేది. 1793 లో Hamilton అనే ఈస్ట్ ఇండియా వ్యాపారికి కోరంగిలో వెయ్యి టేకుదూలాలను నిలువ చేయగలిగే గొడౌన్ ఉండేదంటే ఏ స్థాయిలో ఇక్కడ కలప వ్యాపారం జరిగిందో అర్ధం చేసుకొన వచ్చును [15]. నేటికీ కోరంగిలో వందగదుల బిల్డింగ్ పేరుతో కొన్ని శిథిలాలను చూపిస్తారు స్థానికులు అది ఒకనాడు ఇక్కడ జరిగిన లావాదేవీలకు జ్ఞాపకంగా మిగిలిన ఆనవాలు.

        నిజానికి భారతదేశ నౌకాయాన పరిశ్రమ అతి ప్రాచీనమైనది. వేదాలలో నావికా పరిశ్రమ, నౌకా వ్యాపారమును గురించి ప్రస్తావనలు ఉన్నాయి. భుజ్యురాజు ఓడ ప్రమాదమునకు గురయినపుడు అశ్విని సోదరులు తమ నూరుతెడ్ల ఓడలో అతనిని సంరక్షించిన కథ వేదరుక్కులలో కలదు. మహాభారతంలో రాజసూయయోగ సందర్భముగా సహదేవుడు అనేక ద్వీపములను జయించాడని ఉన్నది. వరాహపురాణములో గోకర్ణుడను వర్తకుడు నౌకాయానముచేస్తూ నౌకా భంగానికి గురయినట్లు తెలుపబడింది. నౌకానిర్మాణానికి అనుకూలమైన కలప గురించి, నౌకా లక్షణముల గురించి, వివిధ అవసరాలకు తగినట్లు సుమారు 25 రకాల వివిధ నౌకలనిర్మాణం వాటి మంచి చెడ్డల గురించి "యుక్తికల్పతరువు" అనే గ్రంథంలో మన ప్రాచీనులు విపులంగా వర్ణించారు. మనుస్మృతిలో నౌకా వ్యాపారం చేసేందుకు అనుకూలమైన కాలములు చెప్పారు. రేవుపట్టణంలో ఉండే రాజప్రతినిధి అయిన నావాధ్యక్షుని విధులు -పన్నులు వసూలు చేయటం, నౌకలకు కావలసిన సదుపాయములు కల్పించటం, ఎగుమతి దిగుమతుల్లో అక్రమాలు జరగకుండా చూడటం, ఓడదొంగలనుండి వ్యాపారులకు రక్షణ కల్పించటం- అని చాణక్యుని అర్ధశాస్త్రంలో చెప్పబడింది. శాతవాహనపాలకులు నౌకా చిహ్నాలను తమనాణాలపై ముద్రించుకొన్నారు [16].

        అంతటి ఘన చరిత్ర కలిగిన భారతీయ నౌకా పరిశ్రమ శాస్త్రీయంగా నిర్మించిన ఓడలను తొలిసారిగా చూసిన యూరోపియన్ లు అచ్చెరువొందారు. వాళ్ళు వ్యాపారం కొరకు వచ్చారు కనుక ఇక్కడ నిర్మించిన నౌకలను విదేశాలకు ఎగుమతి చేసి పెద్దఎత్తున వ్యాపారం చేసారు. కోరంగిలో నిర్మించిన నౌకలు దేశవిదేశాలలో క్షణాలలో అమ్ముడు పోయేవి. ఉదాహరణకు 1814లో కోరంగిలో నిర్మించబడ్డ Lady Hood పేరుకల ఓడ ఫ్రాన్స్ దేశం లో విక్రయించబడింది. 1816లో తయారైన City of Edinurgh ఓడను ఇంగ్లాండు వ్యాపారులు కొనుక్కొన్నారు. 1818 నాటి Isabella ఓడను అమెరికా కు పంపించటం జరిగింది [17] .

        1833 లో కోరంగిలో నిర్మితమైన Charles Eaton అనే ఓడ ఎలా ఉండేదో వివరాలు ఇలా ఉన్నాయి.

        "Charles Eaton 350 టన్నుల బరువును మోయగలిగే సామర్ధ్యము కలిగి ఉన్నది. కోరంగి ఓడరేవు అధికారిగా పనిచేసి 1827 లో ఇక్కడే మరణించిన Charles Eaton పేరును ఈ ఓడకు పెట్టారు. ఈ ఓడ అత్యుత్తమ టేకు తో తయారయినది. రెండు అంతస్థులు కలవు. ఒక్కో అంతస్థు ఎత్తు ఆరున్నర అడుగులు. ఓడముందరి భాగము ఎత్తుగా అందముగా నగిషీలతో ఉన్నది. గదుల మధ్య నడవటానికి పొడవుగా, వెడల్పైన వసారా కలదు. ఓడ వెలుపలి భాగం దృఢంగా ఉండటం కొరకు చెక్కలకు సున్నం, తారులతో రాగిరేకులు తాపడం చేసి ఉన్నవి. ఈ ఓడకు చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే, ప్రయాణికులు బసచేసే గదులు పెద్ద ఓడలలో ఉన్నట్లుగా చాలా విశాలంగా, విలాసవంతంగా ఉండి, ప్రతి గదికి ప్రత్యేకమైన Toilet కలిగి ఉండటం. ఈ ఓడను లండన్ మార్కెట్టులో అమ్మకానికి పెట్టగా Gledstanes & Co అనే కంపనీ కొనుగోలు చేసింది" [18].

        కోరంగి ఓడలకు ఉన్న డిమాండ్ కారణంగా నౌకానిర్మాణకారులకు ముందస్తుగా అడ్వాన్సులు ఇచ్చి తయారుచేయించుకొనేవారు. ఉదాహరణకు; 1854 లో Delacombe అనే ఫ్రెంచి వ్యాపారి మాసరయ్య అనే వడ్రంగికి 20 మీటర్ల పొడవైన నౌకను నిర్మించి ఇవ్వటానికి 350 రూపాయిలు అడ్వాన్సుగా ఇచ్చి ఎగ్రిమెంటు చేసుకొన్నాడు [19].

        పై వర్ణనలను బట్టి కోరంగి నౌకా నిర్మాతలు అంతర్జాతీయ ప్రమాణ నైపుణ్యాలను కలిగి ఉండేవారని అర్ధమౌతుంది.

        కోరంగి రేవు వద్దకు అనేక అంతర్జాతీయ నౌకలు మరమ్మత్తుల కొరకు వచ్చేవి. CPT Laplace అనే ఒక ప్రపంచ యాత్రికుడు 1830 జూలై నెలలో కోరంగిలో ఆగి తన 120 అడుగుల పొడవు, 33 అడుగుల వెడల్పు కల La Favourite అనే నౌకను మరమ్మత్తు చేయించుకొన్న సంగతిని “Voyage autour du Monde” (Travel around the world) అనే పుస్తకంలో ఇలా గ్రంథస్థం చేసాడు.

        "కోరంగి వద్ద నైపుణ్యం కలిగిన వడ్రంగులు, కమ్మరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. La Favourite చెడిపోయిన చుక్కాని యొక్క లోహఅమరికను జాగ్రత్తగా విప్పి, దాన్ని కరిగించి ఎంతో ఖచ్చితత్వంతో, నైపుణ్యంగా పూర్తిగా కొత్తదానివలె తయారు చేసి తిరిగి ఓడకు బిగించారు. చాలా చవకగా, తక్కువ సమయంలో ఓడకు వీరు చేసిన ఇది ఇంకా ఇతర మరమ్మత్తులు నాకెంతో సంతృప్తిని ఇచ్చాయి" అంటూ ప్రపంచాన్ని చుట్టి వచ్చిన లాప్లాస్ కోరంగి ఓడలు నిర్మించేవారి పనితనాన్ని గురించి చేసిన వ్యాఖ్యలు విలువైనవి.

        తుఫానులు, వరదలు, ఉప్పెనల కారణంగా ఏర్పడ్డ ఇసుకమేటల వలన ఇక్కడి నౌకా నిర్మాణ, మరమ్మత్తుల వ్యాపారం కాలక్రమేణా క్షీణించింది. అంతేకాక ఆవిరి ఓడల రాకవల్ల తెరచాపలపై ఆధారపడి నడిచే ఓడలు తమ ప్రాముఖ్యతను కోల్పోవటం కూడా మరో కారణము. గతవైభవానికి చిహ్నంగా కోరంగి సమీపంలో కల తాళ్లరేవులో పడవల నిర్మాణం ఇంకా నేటికీ కొనసాగుతున్నది.

3. కోరంగిని ధ్వంశంచేసిన తుఫానులు ఉప్పెనలు

        కోరంగి తీరప్రాంతంలో ఉండటం వలన ఉప్పెనల తాకిడి ఎక్కువ. Topping అనే బ్రిటిష్ ఇంజనీరు 1789 లో కోరింగని సర్వే చేసేటపుడు, అతడు స్థానిక ప్రజలను చేసిన విచారణల ద్వారా 1706 లో కోరంగిలో వచ్చిన ఒక ఉప్పెన వల్ల స్వల్ప నష్టం జరిగిందని, ఆ తరువాత 1787 మే 20 న వచ్చిన ఉప్పెన మహా ప్రళయాన్ని సృష్టించిందని రికార్డు చేసాడు.

        ఈ ఉప్పెన వచ్చిన మర్నాడు ఇంజరంలో నివాసం ఉంటున్న ఇంగ్లీషు అధికారి తన పై అధికారులకు వ్రాసిన ఉత్తరంలో ... “ఉప్పెన వల్ల కోరంగిపట్టణం, చుట్టుపక్కల గ్రామాలు నేలమట్టం అయ్యాయి. బంధువులను కోల్పోయిన ప్రజలు అటూ ఇటూ పరుగులెడుతూ రోదిస్తూ తిరిగుతుండటం హృదయవిదారకరంగా అనిపిస్తుంది. నూతులు చెరువులు ఉప్పునీటితో నిండిపోయాయి. ప్రజలకు తాగునీరు ఎక్కడా లభించటం లేదు. కనీసం ఇరవైవేలమంది ప్రజలు, అయిదులక్షల పశువులు కనిపించటం లేదు. ఆహారనిల్వలు, పంటలు అన్నీ నాశనం అయ్యాయి” అంటూ ఆనాటి ఉప్పెన విధ్వంసాన్ని వర్ణించాడు.

        ప్రపంచయాత్రికుడు లాప్లాస్ తన పుస్తకంలో ఆనాటి విధ్వంసం గురించి ఇలా చెప్పుకొచ్చాడు "తుఫాను ఒక్క రోజులో విలయం సృష్టించింది. తాడెత్తు కెరటం కోరంగిపై విరుచుకుపడింది. ఇరవై వేలమంది ప్రజలు ఆ ఉప్పెనలో కొట్టుకు పోయారు. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. తుఫాను ముగిసాక కోరంగి పోర్టు ఆఫీసరు ఇల్లు, ఓడలు నిలుపు స్థలము తప్ప సర్వం మట్టిలో కప్పబడిపోయాయి. అంతవరకూ ఇక్కడ అన్ని యూరోపియన్ దేశాలకు చెందిన వర్తక స్థావరాలు ఉండేవి. 1787 లో వచ్చిన ఉప్పెనకు ముందు కోరంగిలో ముప్పై వేలమంది నివసించేవారు. అనేక ఎత్తైన భవనాలు ఉండేవి. ఈ రోజు ఏమీ లేదక్కడ " [20].

        1787 నాటి ఉప్పెనకు కోరంగిలో నిలుపుచేసిన ఓడలు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో కల రాజమండ్రి వరకు కొట్టుపోయాయంటే ఎంత ఎత్తులో నీరు వచ్చిందో ఊహించుకొనవచ్చును.

        ఆ తరువాత కాలంలో కోరంగిని అతలాకుతలం చేసిన అతి పెద్ద తుఫాను 1839 నవంబరు 16, 17 తారీఖులలో వచ్చింది. ఈ తుఫాను అండమాను నుంచి మొదలై తక్కువ వ్యాసంతో, ఎక్కువ శక్తితో, సుడులు తిరుగే గాలులతో కోరంగిని తాకిందని వాతావరణ శాస్త్రవేత్త Henry Piddington అభిప్రాయపడ్డాడు. ఈ రకపు తుఫానులకు Cyclone అనే పదాన్ని సృష్టించి వాడుకలోకి తీసుకొచ్చాడు
    ఆనాటి రాజమండ్రి కలక్టర్ George Smith ఈ తుఫానుగురించి ”16 వ తారీఖు ఉదయం నుంచీ గాలులు తీవ్రంగా వీచటం మొదలైంది. ఆ రాత్రికల్లా సముద్రం అనేక తీరప్రాంత గ్రామాలను ముంచెత్తింది. సుమారు అయిదువేలమంది మరణించి ఉంటారని అనుకొంటున్నాను” అంటూ తుఫానుపై తన తక్షణ రిపోర్టును పై అధికారులకు తెలిపాడు [21] .

    నవంబరు 27వ తారీఖు Madras Herald అనే పత్రిక ఈ తుఫానును గురించి ఇలా వ్రాసింది “పదహారవ తారీఖు రాత్రి పదకొండు గంటలనుండి గాలుల తీవ్రత పెరిగి ఉదయం 4 గంటలవరకూ బీభత్సాన్ని సృష్టించాయి. ఆ సమయంలో కోరంగిలో కాస్త ఎత్తులో ఉన్న ఒకే ఒక పెద్ద బిల్డింగు, ఇంకా మూడు నాలుగు చిన్న ఇళ్ళు మాత్రమే మిగిలాయి. సర్వం ఆ ఉప్పెనలో కొట్టుకుపోయాయి. సుమారు 20000 మంది చనిపోయారు. ఎక్కడ చూసినా శవాల కుప్పలు.

    కోరంగికి దానికి నాలుగైదుమైళ్ళ దూరంలో ఉన్న Onagalo ఆలయానికి మధ్య నివాసప్రాంతాలన్నీ నిర్జనమయ్యాయి. (బహుశా చొల్లంగి ఆలయం కావొచ్చు). లైట్ హౌస్ లాంతరు, ఫోకస్ అద్దం పగిలిపోయాయి [22] .

    1839 డిసంబరు 7 వ తేదీ "Bombay Courier" అనే పత్రిక "నవంబరు లో వచ్చిన తుఫాను కారణంగా యూరోపియన్, దేశీయుల ఇళ్ళన్నీ నేలమట్టం అయ్యాయి. కోరంగిలో నేడు చూడటానికి ఏమీ లేవు శిథిలాలు తప్ప. ఒక్క అయిదారు గంటలు మాత్రమే సాగిన విధ్వంసంలో సుమారు 20000 మంది పైగా మృతి చెందారు. ఎటుచూసినా మృతదేహాలు. పెద్ద పెద్ద ఓడలు నదిలో ఎక్కడెక్కడికో కొట్టుకుపోయాయి. వందలాది చిన్న పడవలు గల్లంతు అయ్యాయి. " అంటూ 1839 కోరంగి తుఫాను నష్టాన్ని రిపోర్టు చేసింది.

    1839 కోరంగి తుఫాను ఉగ్రత గురించి సమీప ఫ్రెంచి కాలనీ అయిన యానాం అధికారి Colin De Bar పాండిచేరీకి గవర్నరుకు వ్రాసిన లేఖలలో ఇలా తెలియచేసాడు. "ఆ రాత్రి 11 గంటలకు తుఫాను గాలులు తీవ్రతరం కావటంతో ప్రజలు భయాందోళనలకు గురయి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవటం మొదలుపెట్టారు. నా అధికారిక నివాసంలోకి నీళ్ళు ప్రవేశించి చాలా రికార్డులు కొట్టుకు పోయాయి. నేనుకూడా నా నివాసాన్ని విడిచి మన్యం వారి మేడపైకి చేరుకొన్నారు. ఫ్రెంచి జండాను ఎగరేసే జండా స్థంభం మొదలులోకి విరిగిపడింది. యానాం, కాకినాడ రాజమండ్రి ప్రాంతాలలో సుమారు 130 నౌకలు ఎక్కడెక్కడికో కొట్టుకుపోయాయి. అనేక వందల పడవల ఆచూకీ లేదు. కొంతమంది వ్యక్తులు, శవాలు తమతమ ఇళ్ళకు కొన్ని కిలోమీటర్ల వరకూ విసిరివేయబడ్డారు. నాలుగొందలమంది తలదాచుకొన్న ఓ ఇల్లు కూలిపోవటంతో అందరూ అక్కడికక్కడే చనిపోయారు " [23]

    కోరంగిలో వచ్చిన ఈ రెండు తుఫానులు ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైనవిగా, గరిష్టస్థాయిలో నష్టాన్ని కలిగించిన వాటిగా నేడు గుర్తిస్తున్నారు. 1839 కోరింగ సైక్లోనులో మూడు లక్షల మంది చనిపోయారని, ఇది ప్రపంచ తుఫానులలో మూడవ అతి పెద్ద తుఫాను అంటూ అనేక ఇంటర్నెట్ సైట్లలో చెప్పబడుతూ ఉన్నది. కానీ ఈ సంఖ్యలకు సంబంధించిన సరైన చారిత్రిక ఆధారాలు కనిపించలేదు.

4. కోరంగి రేవునుంచి జరిగిన వలసలు

    గోదావరి జిల్లాలలో పద్దెనిమిదో శతాబ్దంలో ఆహారపంటలు బదులుగా ఎక్కువలాభాలను అందించే నీలిమందు, పత్తి, చెరకు, పొగాకు, నువ్వులు వంటి వ్యాపార పంటలను పెంచి వాటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే వారు. అలా సంప్రదాయ వ్యవసాయంలో వచ్చిన మార్పు వలన ఆహారధాన్యాలకు కరువు ఏర్పడింది. వ్యవసాయకూలీలకు పనులు లేక తిండిలేక కోరంగి కాకినాడ లాంటి రేవులలో కూలీలుగా మారి జీవనం సాగించేవారు. అనేకమంది కూలీలు ఇక్కడ విలయతాండవం చేస్తున్న కరువునుండి తప్పించుకోవటం కొరకు రంగూను, మారిషస్ ప్రాంతాలకు వలసపోయేవారు. ఎక్కువమంది అక్కడే స్థిరపడిపోయారు. ఇలాంటి వలసలు 1830 ల నుంచి మొదలైంది. కోరంగి రేవునుంచి రంగూను, మలేషియా వెళ్ళి అక్కడ స్థిరపడిన వారిని అక్కడి స్థానికులు నేటికీ కొరంగీలు అని పిలుస్తారు. 1850 ల తరువాత ధవళేశ్వరం ఆనకట్ట కారణంగా వేల ఎకరాలు సాగులోకి వచ్చి ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు తగ్గాయి. ఆ కాలంలో ఈ ప్రాంతవాసులు మెరుగైన అవకాశాలకొరకు, వ్యాపారం చేయటానికి రంగూను వెళ్ళేవారు. అలా వెళ్ళినవారిలో కోరంగి గ్రామానికి చెందిన శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ ఒకరు. వీరు రంగూన్ వెళ్ళి, వ్యాపారాలు చేసి సంపాదించిన ఎనిమిది లక్షల రూపాయిలతో కాకినాడలో విద్యాసంస్థలు నెలకొల్పమని 1919 లో ఏర్పాట్లు చేసారు. వారి ఆశయాలకు అనుగుణంగా నెలకొల్పిన MSN Charities విద్యాసంస్థలు నేటికీ నడుస్తూ జిల్లాకి తలమానికంగా నిలిచాయి.

5. కోరంగి సాంస్కృతిక అంశాలు

    కోరంగి ఊరికి ఆ పేరెలా వచ్చిందో చెప్పే స్థలపురాణం ఒకటి మెకంజీ సేకరించిన సిద్ధాంతం కైఫియ్యతులో కలదు. "త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తున్నపుడు గోదావరి తీరంపై కొంతకాలం నివసించాడు. ఒకనాడు సీత ముచ్చట పడిన బంగారు కురంగమును (జింక) పట్టుకోవటానికి దానిని చాలాదూరము వెంటతరిమాడు. అది ప్రాణము విడిచిన ప్రాంతములో ఆ పిమ్మట ఒక గ్రామము ఏర్పడినది. దానిని కోరంగి అని ప్రజలు పిలుచుకొంటున్నారు". ఈ కథ కోరంగి గ్రామనామానికి ఐతిహాస్య సంబంధాన్ని కల్పిస్తుంది.
ఏడవ శతాబ్దంలో కోరంగి కురంగేశ్వరపురము పేరుతో ప్రఖ్యాతిక్కెకిన పట్టణముగా ఉండెను. [24] నేడు కోరంగి సమీపములో ఉన్న తూరంగి వద్ద రాముడు ప్రతిష్టించినట్లు చెప్పబడే తురంగేశ్వర ఆలయము కలదు. కురంగేశ్వర నామం తురంగేశ్వరం గా కాలానుగుణ మార్పు చెంది ఉండవచ్చు.

    తూర్పుతీరంపై నవంబరు నుండి జనవరి మధ్య మధ్య ఉత్తరతూర్పు గాలులు బలంగా వీస్తాయి. భారతీయ పంచాంగం ప్రకారం ఈ రోజులు కార్తీకమాసంలో వస్తాయి. ఈ సమయంలో ఓడలు సరుకులు తీసుకొని తూర్పుదక్షిణ దేశాలకు వ్యాపారనిమిత్తం బయలుదేరేవి. ఓడలపై బయలుదేరివెళ్ళే పురుషులకు వారి కుటుంబస్త్రీలు తీరంవద్దకు వచ్చి ఆనందోత్సాహాలతో వీడ్కోలు చెప్పేవారు. తీరప్రాంతాలలో ఈ సమయంలో పెద్ద ఎత్తున ఉత్పత్తుల అమ్మకాలు కొనుగోళ్ళు జరుగుతూ ఒక పండగవాతావరణం ఉండేది. నేటికీ కార్తీకపౌర్ణమిరోజున నౌకాయానంతో సంబంధం ఉన్న ఒరిస్సానుంచి తమిళనాడు వరకూ స్త్రీలు బొమ్మపడవపై దీపాన్ని ఉంచి నదులలోకి విడిచిపెట్టటం ఒక ఆచారంగా పాటిస్తారు. దీనిని ఒరిస్సాలో బాలియాత్ర గా, తెలుగు, తమిళప్రాంతాలలో ఈ పండుగను కార్తీకపౌర్ణమిగా పాటిస్తారు. తెలుగు ప్రాంతాలలో కార్తీక అమావాస్య మరుసటి రోజు అంటే మార్గశిర పాడ్యమి నాడు నదీ స్నానం ఆచరించి అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టడం ఆనవాయతి గా ఉన్నది.

    ఇదే విధంగా నీటిలో దీపం ఉంచిన పడవబొమ్మలను విడువటం అనే ఆచారం ఇక్కడ నుంచి మనవాళ్ళు బయలుదేరి ఎక్కడైతే వ్యాపారాలు చేసేవారో అక్కడి దేశాలలో కూడా ఉండటం గమనార్హం. థాయిలాండ్ లో స్త్రీలు నీటిలో బొమ్మపడవలో దీపం ఉంచి విడిచే పండుగను Loykrathong పేరుతో, బాలి లో Masakapan Ke Tukad పేరుతో జరుపుకొంటారు. ఈ సాంస్కృతిక సారూప్యతను వందల సంవత్సరాల క్రితం జరిగిన Cultural Exchange గా అనుకోవచ్చు.
కార్తీక మాసంలో ఆడపడుచులు తమ సోదరులకు భగినీ హస్తభోజనం పేరుట విందు ఏర్పాటు చేసే ఆచారం కూడా తెలుగునాట కనిపిస్తుంది. ఇది బహుసా వ్యాపారాల నిమిత్తం బయలుదేరుతున్న సోదరులకు శుభకామనలు చెప్పటం కొరకు లేదా ఎక్కువ ధనంతో తిరిగి వచ్చి తమకు మంచి బహుమతులు ఇవ్వవలసి ఉంటుంది అంటూ తమ బంధాలను దృఢపరచుకోవటం కావొచ్చు. కారణమేదైనా ఈ పండుగలు నౌకలు ప్రయాణించే నెలలలో రావటం వెనుక ఉండే చారిత్రిక కారణాలను విస్మరించలేం. [25]

        వ్యవసాయ ఉత్పత్తులు వచ్చే కాలంలో సంక్రాంతి పండుగ జరుపుకోవటం ఎలాంటి ఆచారంగా పరిణమించిందో తూర్పుతీరంలో నౌకా వ్యాపారాలు జరుపుకొనే ఈ కాలంకూడా పండుగల రూపంలో మన సంస్కృతిలో ఒక భాగంగా స్థిరపడటం జరిగింది. ఈ పండుగలు ఒకనాడు ఈ ప్రాంతాలలో జరిగిన నౌకావ్యాపారాల అవశేషంగా భావిస్తారు.

ముగింపు

        కోరంగి సెమెటరీ లో బ్రిటిష్ అధికారులకు చెందిన ఏడు సమాధులు ఉన్నట్లు List of Inscriptions on Tombs in Madras Vol II లో సమాచారం ఉంది. అవి William Clark (1802), A. Meris (1804), Alexander Woodcock (1816), John Eaton (1819), Charles Eaton (1827), William Charles Eaton (1857) వ్యక్తులవి. వీరు కోరింగలో కంపనీ అధికారులుగా పనిచేసి ఇక్కడే గతించారు.

2009 లో ఈ సమాధులను మొత్తం పెకలించి ఆ ప్రాంతాన్ని చదును చేసినట్లు తెలిసింది. వాటిని విక్టోరియా సమాధులు అని స్థానికులు పిలుచుకొనేవారట. స్థానిక మాజీ సర్పంచి శ్రీ బుజ్జి గారి సహాయంతో, అతి కష్టం మీద ఎవరో ఔత్సాహికుడు భద్రపరచిన ఒక సమాధి ఫలకం దొరికింది. దానిపై
.
        "Sacred to the memory of Alexander Woodcock, Esq, who departed this life on 19th May 1816, aged 46 and Mary Ann, his infant daughter, who died in March, 1810, aged 11 months" అని ఉన్నది.

        ఈ అలెగ్జాండర్ వుడ్ కాక్ కోరంగి ఒక పెద్ద ఓడరేవుగా, నౌకా నిర్మాణకేంద్రంగా వెలుగొందిన కాలంలో ఓడరేవు అధికారిగా పని చేసాడు (Master attendant).
1817 నాటి Asiatic Journal and Monthly Register లో ఈ అలెగ్జాండర్ వుడ్ కాక్, Lark అనే ఓడపై కోరంగినుండి మద్రాసు వెళుతూ దారిమధ్యలో చనిపోయాడని ఉంది.
పైన చెప్పిన ఫలకం మద్రాసులో తయారైనట్లు క్రింద రాసి ఉంది. ఆ ఫలకంపై అలెగ్జాండర్ పేరుతో పాటు అంతకు ఆరేళ్ల క్రితం పదకొండునెలల వయసులో చనిపోయిన అతని కూతురు Mary Ann పేరు కూడా ఉండటం గమనార్హం. బహుశా అలెగ్జాండర్ మిత్రులో బంధువులో ఎవరో ఈ ఫలకాన్ని మద్రాసులో తయారుచేయించి ఆ తండ్రి కూతుర్ల జ్ఞాపకార్ధంగా పాతించి ఉంటారు.

        1915 లో గోదావరి జిల్లా చరిత్ర వ్రాసిన హెమ్మింగ్ వే "నేడు సముద్రంలో తీరానికి ఒక మైలు దూరంలో జాలరుల వలలకు ఏవో నిర్మాణాలు తగులుకొంటున్నాయి; పాటు సమయంలో అనేక ప్రాచీన నాణాలు బయటపడుతున్నాయి; సముద్రం లోపలేదో మునిగిపోయిన పట్టణం ఉండే ఉంటుంది" - అంటూ ఈ ప్రాంత ప్రాచీనతకు సముద్రాన్ని సాక్ష్యం చేస్తాడు. భారతదేశ చరిత్రలో జగజ్జేయమానంగా వెలుగొందిన ఒకనాటి కోరంగి, తుఫానులు, సునామీలు, వరదలు వంటి ప్రకృతివైపరీత్యాల కారణంగా పదుల అడుగుల మట్టి క్రింద కప్పడిపోయింది, కొంత సముద్రంలో కొట్టుకుపోయింది. ఏమో నేటి కోరంగి మట్టిపొరల క్రింద ఒకనాటి ఆంధ్రదేశ ఔన్నత్యాన్ని చాటే ఏఏ ఆధారాలు నిద్రిస్తున్నాయో! కానీ పైకి కనిపిస్తూ గతవైభవాన్ని సూచించే ఏ చిహ్నాలూ నేడు ఇక్కడ లేవు. సెమెటరీని కూడా ఇటీవలే పాడుచేసుకోవటం దురదృష్టకరం.

బొల్లోజు బాబా
8/9/2020


Footnotes

1.     1.     Ancient India of Ptolemy by Mccrindles, p.no 68

2.    సేకరణ: శ్రీ వెంకటేష్ కందుల, ప్రముఖ ప్రాచీననాణెముల సేకర్త

3.    ప్రాచీనాంధ్ర నౌకాజీవనము - భావరాజు వెంకట కృష్ణారావు పే. 61

4.    ప్రాచీనాంధ్ర నౌకాజీవనము - భావరాజు వెంకట కృష్ణారావు 

5.    The English Factories in India 1618-1621

6.    The English Factories in India 1665-1667

7.    Letters to Fort St. George 1731

8.    Letters to Fort St. George 1752-53

9.    Dairy and Consultation book 1756

10.  Madras District Gazetteers, Godavari Vol I by FR Hemmingway p.211

11.   A descriptive & historical account of the Godavery District by Henry Morris, 

12.  Ibid p.40

13.  Narratives of Tours in India by JD Rees

14.  Madras District Gazetteers, Godavari Vol I by FR Hemmingway p. 126

15.  Economic Development of Andhra pradesh 1766-1957 by AV Ramana Rao.

16.  భారత నౌకాపరిశ్రమ, కర్రి సీతారామయ్య

17.  A Collection of Papers Relative to Ship Building in India By John Phipps p. 174

18.  Charles Eaton: wake for the melancholy shipwreck - Australian maritime history

19.  ఫ్రెంచిపాలనలో యానాం, బొల్లోజు బాబా 

20.  Sailors Horn-book by  Henry Piddington

21.  The progress of the development of the law of storms Reid, William పే. 99

22.  Journal of Asiatic society, 1840 p.410

23.  ] ఫ్రెంచిపాలనలో యానాం, బొల్లోజు బాబా p.32

24.  ఆంధ్రుల చరిత్రము - ప్రధమ భాగము చిలుకూరి వీరభద్రరావు పే.24

25.  https://www.ancient-asia-journal.com/articles/10.5334/aa.118/











Tuesday, August 5, 2025

ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి

డా. చిరంజీవినికుమారి విద్యావేత్త, అభ్యుదయవాది, కవయిత్రి, అనువాదకురాలు, సాహిత్య-సామాజికాంశాలపై అద్భుతమైన వక్త, సాహితీ కార్యకర్త, సమాజసేవకురాలు అన్నింటికీ మించి అనన్యసామాన్యమైన వ్యక్తిత్వం, నిత్యచైతన్య శీలత కలిగిన ధీర.  

కుటుంబనేపథ్యం, విద్యాభ్యాసం

చిరంజీవినికుమారి గారి తల్లి, తండ్రి ఇరువైపులా పండిత కుటుంబాలు. వీరి మాతామహులు తిమ్మరాజు శేషగిరిరావు. ప్రముఖ ఉపాధ్యాయులు. ప్రఖ్యాత రచయిత బోయి భీమన్న వీరివద్ద విద్యాభ్యాసం చేసారు. ఒకసారి భీమన్న అద్భుతంగా చేసిన ఒక అనువాదానికి ముచ్చటపడిన  తిమ్మరాజు శేషగిరిరావు అతనిని బెంచిపైకి ఎక్కించి “అందరూ వాడిని చూడండి, అసలైన బ్రాహ్మణుడంటే వాడు” అని అన్నారని భీమన్న గారు ఒక వ్యాసంలో రాసుకొన్నారు.[1] చిరంజీవినికుమారి నాయినమ్మ పులుగుర్త లక్ష్మీనరసమాంబ, విద్యాధికురాలు.  అనేక బెంగాలి నవలలను తెలుగు చేసారు. వాటిలో కొన్ని హైస్కూలు నాన్ డిటైల్డ్ పాఠ్యాంశాలుగా పెట్టారు. 1902-1908 మధ్యకాలంలో వీరు ‘సావిత్రి’ అనే పత్రికను నడిపారు. స్త్రీ విద్యను ప్రోత్సహించటానికి ఈమె వ్యవస్థాపక కార్యదర్శిగా 1903 జనవరి 30 న ‘శ్రీ విద్యార్ధిని సమాజము’ పేరుతో కాకినాడలో ఒక సంఘాన్ని స్థాపించారు.[2]  ఈ సంఘాన్ని కందుకూరి వీరేశలింగం, బండారు అచ్చమాంబల చేతులమీదుగ ప్రారంభించారు.  1923 లో కాకినాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ సభలలో పులుగుర్త లక్ష్మినరసమాంబ చురుకైన కార్యకర్తగా పనిచేసారు. ప్రముఖ నాయకురాలు దుర్గాభాయ్ దేశ్ ముఖ్ తో వీరికి  గొప్ప స్నేహం ఉండేది.  పులుగుర్త లక్ష్మీ నరసమాంబకు ఏకైక సంతానం   పులుగుర్త బృందావనం.

పులుగుర్త బృందావనం, బాలాత్రిపుర సుందరి దంపతులకు  చిరంజీవినికుమారి 30-3-1931 న అమ్మమ్మగారి ఊరైన రామచంద్రపురంలో జన్మించారు. వీరి తండ్రిగారికి ఆరుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు సంతానం.  వీరిలో చిరంజీవినికుమారి పెద్ద.  తండ్రిగారు కాకినాడ పి.ఆర్. కళాశాలలో గణితశాస్త్రం బోధించేవారు.    చిరంజీవినికుమారి విద్యాభ్యాసం కాకినాడలో జరిగింది. స్కూలుఫైనలు దాకా పి.ఆర్. హైస్కూలులో చదివారు.  బి.ఎ. తెలుగు పి.ఆర్. కళాశాలలో పూర్తిచేసి యూనివర్సిటీ గోల్డ్ మెడల్ పొందారు. 1959  ఆంధ్రా యూనివర్సిటీ   నుండి ఎమ్.ఎ. ఇంగ్లీషు లిటెరేచర్ తరువాత బి.ఇ.డి. చేసారు.  పాట్నా యూనివర్సిటీలో “Social and Ethical Philosophy in Valmiki Ramayana” అనే అంశంపై 1969 లో పిహెచ్.డి చేసి డాక్టరేట్ పొందారు.

వివాహం, కుటుంబం

చిరంజీవినికుమారి ఉద్యమాల నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినందున విద్యార్ధిదశనుంచే సామాజిక సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఈ దశలో కమ్యూనిష్టుపార్టీ అనుబంధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ లో చురుకుగా పాల్గొనే శ్రీ పి.ఎస్. శర్మ గారితో పరిచయం ఏర్పడింది.  శర్మగారు అప్పటికి చాలాకాలం క్రితమే  నేతాజి సుభాష్ చంద్రబోస్ ను కాకినాడ రప్పించి ఉత్తేజపూర్వక ఉపన్యాసం ఇప్పించిన ఘనత సంపాదించుకొన్నారు.  వీరిరువురు అనేక విద్యార్ధి ఉద్యమాల్లో  కలిసి పనిచేసారు. ఆ సాన్నిహిత్యం కాలక్రమేణా ప్రేమగా మారింది. ఇరువురూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.  వరుడు కమ్యూనిష్టు భావాలు కలిగి ఉన్నాడని, ఇద్దరికీ 14 ఏళ్ళ వయో బేధం ఉందని, పైగా వధువు MA చదవగా, వరుడు చదువు ఇంటర్ తో ఆపేసి సామాజిక సేవాకార్యక్రమాలలో పాల్గొంటున్నాడనే కారణాలతో  చిరంజీవినికుమారి తల్లిదండ్రులు ఈ వివాహానికి మొదట్లో అంగీకరించలేదు. కాని వారి ప్రేమ,  అన్యోన్యతలను చూసి ఒప్పుకోకతప్పలేదు.  అలా ఇరుకుటుంబాల అంగీకారంతో చిరంజీవినికుమారి, పిఎస్ శర్మ అక్టోబరు 1953 లో  రిజిష్టరు మేరేజ్ చేసుకొన్నారు.  చిరంజీవినికుమారి వివాహానంతరం కూడా తన ఉన్నతవిద్యను కొనసాగించారు.

ఉద్యోగ జీవితం

డా.చిరంజీవినికుమారి తన ఉద్యోగజీవితంలో అనేక మైలురాళ్లు ఏర్పరచుకొన్నారు.  1959 లో ఆంధ్రాయూనివర్సిటీ నుంచి ఎం.ఏ పట్టా అందుకొన్న వెంటనే, కాకినాడలోని ప్రతిష్టాత్మకమైన  రంగరాయ మెడికల్ కాలేజిలో ఇంగ్లీషు లెక్చరర్ గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అప్పట్లో MBBS మొదటి సంవత్సరంలో ఇంగ్లీషు భాష బోధనలోభాగంగా ఉండేది.  ఆ తర్వాత, మూడు సంవత్సరాలపాటు సత్యదేవ కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్ గా సేవలందించారు.   1969 లో డాక్టరేట్ పూర్తయిన తరువాత మళ్ళీ రంగరాయ మెడికల్ కాలేజీలో చేరి 8 సంవత్సరాలపాటు  లేడిస్ హాస్టల్ వార్డెన్ గా పనిచేసారు.

1977లో రంగరాయ కాలేజ్ నుంచి డిప్యుటేషన్ మీద ఐడియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా నియమితులయ్యారు. అప్పటినుంచి ఐడియల్ విద్యాసంస్థలే వీరి కార్యక్షేత్రంగా మారాయి.  వీరి అవిశ్రాంత కృషి, నాయకత్వం వల్ల   ఐడియల్ విద్యాసంస్థలు  విస్తరించి నేడు జిల్లాలోనే అత్యుత్తమ  సంస్థలుగా నిలిచాయి.

ఐడియల్ విద్యాసంస్థలు

ఐడియల్ విద్యాసంస్థలు  డా.చిరంజీవినికుమారి అచంచలమైన అంకితభావం, దూరదృష్టి, నిబద్దతకు ప్రతీకగా నిలుస్తాయి. వీరు ఈ విద్యాసంస్థల అభివృద్ధికి, విద్యార్ధుల శ్రేయస్సుకి తన సమస్త శక్తిని, జీవితాన్ని వెచ్చించారు.   ప్రముఖ వైద్యులు, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గౌరవవైద్యులుగా సేవలందిస్తున్న డా. పివిఎన్ రాజు వ్యవస్థాపక అధ్యక్షుడుగా డా.చిరంజీవినికుమారి సెక్రటరీగా 1970లో ఐడియల్ జూనియర్ కాలేజిని స్థాపించారు.  ఈ సంస్థ 1974 లో డిగ్రీ కళాశాలగా, 1992 నుంచి పీజి కళాశాలగా, 2009 నుంచి ఐడియల్ ఇంజనీరింగ్ కళాశాలగా అంచెలంచెలుగా విస్తరించుకొంటూ వచ్చారు. ఒక చిన్నకళాశాలగా ప్రారంభించి బహుళ విద్యాసంస్థల సముదాయంగా తీర్చిదిద్దటంలో డా. చిరంజీవినికుమారి కృషి, నాయకత్వం కీలకమైనవి.  డా. చిరంజీవినికుమారి ఈ విద్యాసంస్థలకు సెక్రటరీ మరియు కరస్పాండెంట్ గా జీవితాంతం సేవలందించడమే కాక ఐడియల్ కళాశాలకు 16 సంవత్సరాలపాటు ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసారు.   

“మానవ వనరులు పుట్టవు, సంస్కృతి, సంప్రదాయం, విద్య ద్వారా తయారవుతాయి”- అనే సత్యాన్ని నమ్మిన వీరు, ఈ విద్యాసంస్థలను ఉత్తమ మానవ విలువలతో కూడిన విద్యార్థులను సమాజానికి అందించే కేంద్రంగా నడిపారు. ఈ సంస్థలు అలా విలువలు నైపుణ్యాలు కలిగిన లక్షలాది విద్యార్ధులను సమాజానికి అందించాయి. ఐడియల్ కళాశాల జిల్లాలో NAAC, Autonomous  గుర్తింపు పొందిన మొట్టమొదటి ఎయిడెడ్ విద్యాసంస్థగా నిలిచింది.

వివిధ సంస్థలలో సభ్యత్వం

డా. చిరంజీవినికుమారి ఎన్నో సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సంస్థలలో కీలక పదవులను నిర్వహించారు.  వాటిద్వారా ఎన్నో  గొప్ప కార్యక్రమాలు చేసారు.   ఐడియల్ కాలేజిని వేదికగా ఇచ్చారు.

1. అభ్యుదయ రచయితల సంఘం: అరసం ప్రారంభం నుంచి దానిలో ప్రముఖ పాత్ర పోషించారు.  గుజ్జుల యల్లమందారెడ్డి, బూదరాజు రాధాకృష్ణ వంటి సాహిత్యవేత్తలు వీరిని అరసంవైపు నడిపించారు.  తుమ్మల వెంకటరామయ్య, పరకాల పట్టాభిరామారావు వంటి పెద్దలు, డా.చిరంజీవినికుమారిని పిలిచి కాకినాడలో అరసం మహాసభ పెట్టాలని కోరారు.  అలా 1972లో కాకినాడలో అరసం రాష్ట్ర మహాసభను వీరు నిర్వహించారు. ఈ సభకు చాగంటి సోమయాజులు ఆవంత్స సోమసుందర్, మహీధర రామమోహన్ లాంటి ప్రబృతులు  హాజరయ్యారు.  రాష్ట్ర అభ్యుదయరచయితల సంఘానికి వీరు చాలాకాలం గౌరవాధ్యక్షురాలిగా పనిచేసారు.

2. ఇండో సోవియట్ కల్చరల్ సొసైటి(ఇస్కస్): ఇది ఇండియా సోవియట్ యూనియన్ మధ్య సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించే సంస్థ. ఇరుదేశాల ప్రజలమధ్య సాంస్కృతిక అవగాహన, స్నేహాన్ని పెంపొందించడం ఈ సంస్థ లక్ష్యం.  ఈ సంస్థ తరపున  డా. చిరంజీవినికుమారి 1970 లో సోవియట్ యూనియన్ పర్యటించారు.  ఆ దేశం సాధించిన ప్రగతిని, అక్కడ సామాన్య మానవుని జీవన విధానాన్ని అధ్యయనం చేసి తమ అనుభవాలను ప్రజలకు వివరించి, భారత్ -సోవియట్ మైత్రి మరింత బలపడేందుకు తోడ్పడటం ఈ బృంద పర్యటన ముఖ్యోద్దేశం. 

డాక్టర్లు, న్యాయవాదులు, వ్యవసాయదారులు, వ్యాపారులు, యువకులతో మొత్తం భారతదేశంలోని ఐదు రాష్ట్రాలనుండి 72 మంది సభ్యులు గల ఈ బృందానికి ఇస్కస్ రాష్ట్రకార్యదర్శి హోదాలో  డా.చిరంజీవినికుమారి నాయకత్వం వహించారు.  ఈ బృందం ఇరవై రోజులపాటు సోవియట్ లో మాస్కో, లెనిన్ గ్రాడ్, ఆర్మేనియా ప్రాంతాలను సందర్శించి, అక్కడి రచయితలు, మేధావులు, సామాన్యప్రజలతో సంభాషించారు. అక్కడి ప్రజల జీవన విధానాలను పరిశీలించారు. ఆ స్పూర్తితో  తిరిగి ఇండియాకు వచ్చాక డా.చిరంజీవినికుమారి కొన్ని రష్యన్ రచనలను తెలుగులోకి అనువదించారు.

ఇస్కస్ సంస్థలో ఉండగా  1970లో Lenin and Universal Brotherhood అనే ఇంగ్లీషు వ్యాసం రాసారు.  దీనిలో The Basis of this analysis is the proposition that the Economic Structure of the man Determins the social relationships of the members of that society అనే వాక్యం ఆనాటి విశ్లేషకులను ఆకర్షించింది.[3]

డా.చిరంజీవినికుమారి ఇస్కస్ కు 1977 లో ఉపాధ్యక్షురాలిగా పనిచేసారు.[4]

3. తూర్పుగోదావరి జిల్లా హిస్టరీ కాంగ్రెస్: ఈ సంస్థకు  డా. చిరంజీవినికుమారి, చాన్నాళ్ళు సెక్రటరిగా పనిచేసారు.  ఈ సంస్థ తరపున “తూర్పుగోదావరి జిల్లా చరిత్ర, సంస్కృతి” అనే 650 పేజీల గొప్ప బృహత్ గ్రంథాన్ని తన సంపాదకత్వంలో తీసుకొచ్చారు. దీనిలో వివిధ అంశాలపై నిష్ణాతులైన వారిచే రాయించిన 66 వ్యాసాలు కలవు.  ఈ వ్యాసాలు జిల్లాకు సంబంధించిన ప్రాచీనచరిత్ర, మతపరమైన పరిణామాలు, వలసపాలనలు, సంస్కరణోద్యమాలు, స్వాతంత్రోద్యమాలను మదింపువేస్తాయి. ఈ ప్రాంత చరిత్రను సమగ్రంగా ఆవిష్కరిస్తాయి.

ఈ గ్రంథంలో డా. వకుళాభరం రామకృష్ణ, జాస్తి దుర్గాప్రసాద్, కె.ఎస్. కామేశ్వరరావు వంటి లబ్దప్రతిష్టులైన చరిత్రకారుల పత్రాలు; ఆవంత్స సోమసుందర్, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ,  అద్దేపల్లి రామమోహనరావు, కాశీభట్ల సత్యన్నారాయణ వంటి ప్రముఖ సాహితీవేత్తల వ్యాసాలు ఉన్నాయి.

ఈ పుస్తకం జిల్లా చరిత్రను అధ్యయనం చేయాలనుకొనేవారికి ఒక కరదీపిక. 

4. తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం: ఈ సంస్థకు వీరు కార్యదర్శి.  స్వీయ సంపాదకత్వంలో 2018 లో “తూర్పుగోదావరి జిల్లా సాహిత్య చరిత్ర (1880-2015 వరకు) పేరుతో ఒక అధ్యయనాత్మక గ్రంథాన్ని ఈ సంస్థతరపున వెలువరించారు. ఈ గ్రంథం జిల్లాకు చెందిన శాసనసాహిత్యం, ప్రాచీన సాహిత్యం, సంస్కరణలు, ఆధునిక సాహిత్యం, ప్రక్రియలు, సాహితీవేత్తలు, పత్రికలు, సాహితీ సంస్థలు, సాహిత్యవిమర్శలాంటి వివిధ అంశాలను  సమగ్రంగా విశ్లేషిస్తుంది. ఈ విశ్లేషణ ఒక ప్రాంత సాహిత్యఅస్తిత్వపు  సమగ్ర అధ్యయనం. ఆ కోణంలోంచి ఈ పుస్తకం ఇతరజిల్లాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది.

మాజీప్రధాని పివి నరసింహారావు శతజయంతి సందర్భంగా ఆయన రచించిన ‘గొల్లరామవ్వ’ కథపై ప్రాంతాలకు అతీతంగా ప్రముఖ సాహితీవేత్తల అభిప్రాయాలతో ‘అభిప్రాయమాలిక” ను తీసుకొచ్చారు.

ఇదే సంస్థ తరపున జిల్లాకుచెందిన కథా రచయితల కథలతో తీసుకొచ్చిన “కథలు-అలలు” సంకలనానికి సంపాదకత్వం వహించారు.

తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం తరపున 2024 లో యువకథకులకు దిశానిర్ధేశం చేయటానికి ‘కథ ఎందుకు ఏమిటి ఎలా’ పేరుతో 2024 లో ఒక జాతీయ సదస్సు నిర్వహించారు

వీరి సహచరుడైన శ్రీ పి.ఎస్. శర్మ రచించిన సాతంత్ర్యసంగ్రామంలో తూర్పుగోదావరి అనే పుస్తకాన్ని పునర్ముద్రించారు.

జిల్లా సాంస్కృతిక సాహిత్య వారసత్వాన్ని రికార్డు చేయటంలో డా. చిరంజీవినీ కుమారి  కృషి విశేషమైనది.

4. జనవిజ్ఞాన వేదిక: వీరు  జనవిజ్ఞాన వేదిక కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షురాలుగా సేవలందించారు. 1953 ప్రాంతంలో కమ్యూనిష్టు నాయకుడు ఎస్.ఎ డాంగే రచించిన “From Primitive Communism to Slavery”  అనే గ్రంథం చదివి వామపక్ష భావవాదం, మార్క్సిష్టు సిద్ధాంతాలను లోతుగా  అర్ధం చేసుకొన్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.[5]  జీవితాంతం వామపక్షభావజాలంతో మెలిగి అనేకమందికి ఆదర్శంగా నిలిచారు.  జెవివి నిర్వహించిన అక్షర గోదావరి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు.

5. ఇవే కాక – శ్రీవేణుగోపాల సంస్కృత ప్రచారసభ, ఈశ్వర పుస్తక భాండాగారం, కాకినాడకు సెక్రటరీగా; జిల్లా గ్రంధాలయ సంఘానికి సెక్రటరీగా; జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కు పాతికేళ్ళు వివిధ హోదాలలో; గిరిజన ప్రాంతాలలో వారి అభివృద్ధికై పనిచేసే ‘స్పందన’ అనే సంస్థకు ప్రెసిడెంట్ గా; ఎపి స్టేట్ ప్రైవేట్ విద్యాసంస్థల మేనేజ్ మెంట్ అసోసియేషన్ కు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వివిధ పదవులలో ఆ సంస్థల వికాశానికి, ఉన్నతికి తనవంతు సహకారం అందించారు.  

6. ఆదికవి నన్నయ యూనివర్సిటీని జిల్లాకు సాధించటానికి ఏర్పడ్డ గోదావరి యూనివర్సిటీ సాధన సమితికి డా. చిరంజీవినికుమారి వైస్ ప్రెసిడెంటుగా పనిచేసారు.  ఆంధ్రాయూనివర్సిటి పిజి సెంటరు, అన్నవరం సత్యదేవి మహిళా కళాశాల లాంటి విద్యాసంస్థలు కాకినాడకు రావటంలో కృషిచేసి వాటికి వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్నారు.  తూర్పుగోదావరి జిల్లాను విద్యా, సాహిత్య, సాంస్కృతిక హబ్‌గా మార్చడంలో డా. చిరంజీవినికుమారి కీలకపాత్ర పోషించారు.

చరిత్రాత్మక మహాసభల నిర్వహణ

1. శ్రీశ్రీ సప్తతి సభ: డా. చిరంజీవినికుమారి ఆధ్వర్యంతో1980 మార్చి 2వ తేదీన కాకినాడలో శ్రీశ్రీ సప్తతిపూర్తి (70వ జన్మదిన) సభలు  అత్యంత వైభవంగా జరిగాయి.  ఈ సందర్భంగా శ్రీశ్రీకి అయిదువేల రూపాయిలు బహుమతిగా అందచేసారు.  ఆయన రచనలను పునర్ముద్రించి అమ్మారు. అభినందన సంచిక వెలువరించారు. ఈ సభకు శ్రీ హరీంద్రనాథ్  ఛటోపాధ్యాయ ముఖ్య అతిధిగా, సభాధ్యక్షునిగా వ్యవహరించారు. వీటన్నిటి వెనుక చిరంజీవినికుమారి  మెటిక్యులస్ ప్లానింగ్  ఎగ్జిక్యూషన్ ఉన్నాయి. 

ఈ సభ జరగటానికి మూడునెలల ముందు డా. చిరంజీవినికుమారి, శ్రీ మిరియాల రామకృష్ణ 1979 డిశంబరు మొదటివారంలో మద్రాసులోని శ్రీశ్రీని కలిసి సప్తతి కార్యక్రమం గురించి చర్చించి ఆహ్వానించారు

ఈ ఫంక్షన్ గురించి శ్రీశ్రీ సతీమణి శ్రీమతి సరోజ తనపుస్తకం ‘సంసారంలో శ్రీశ్రీ’ లో ఇలా రాసారు—"మార్చి రెండవ తేదీ ఫంక్షన్ కి కాకినాడ వెళ్ళాం. అందరూ  మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు చిరంజీవినీ కుమారిగారు అన్ని పనులు తనే  చేస్తూ, చచ్చేటంత  బిజీగా  వుండి కూడా అడుగడుక్కి  వచ్చి నన్ను పలకరించి వెళుతూవుండేవారు” [6].

సరోజ శ్రీశ్రీ రాసిన  పై వాక్యాలు డా.చిరంజీవినికుమారి కార్యదీక్షకు, ఆదరణకు అద్దంపడతాయి.

శ్రీశ్రీ సప్తతి సభలు తెలుగుసాహిత్యరంగంలో  గొప్పగా నిలిచిపోయిన సంఘటన.  శ్రీశ్రీ షష్తిపూర్తి సభ భిన్నాభిప్రాయాలు, నిరసనలవల్ల రసాభాస అయింది.  కాని సప్తతి సభలు మాత్రం ఏ రకమైన నిరసనలు లేక అంగరంగవైభవంగా జరిగాయి.  

2. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యపు వెలుగులు: తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం తరపున, 1989 డిసెంబరు 29, 30, 31 తేదీలలో ఐడియల్ కళాశాలలో,  “వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యపు వెలుగులు” అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు తెలుగు సాహిత్య చరిత్రను సమగ్రంగా చర్చించే వేదికగా నిలిచింది. ఈ సదస్సుకి దేశం నలుమూలలనుంచి లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తలు హాజరయ్యారు.

3. గరికిపాటి నరసింహారావు మొదటి సహస్రావధానం కార్యక్రమం డా. చిరంజీవినికుమారి ఆధ్వర్యంలో జరిగింది.. ఈ కార్యక్రమం తెలుగు సాహిత్యంలో అవధాన కళను ప్రోత్సహించడంలో, గరికిపాటి నరసింహారావు  సాహిత్య ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంలో ఒక ముఖ్యమైన సంఘటన.

రచనలు

డా. చిరంజీవినికుమారి కవిగా, అనువాదకురాలిగా, వ్యాసకర్తగా, వక్తగా  సాహిత్య రంగంలో విశిష్టమైన కృషి సలిపారు.

డా. చిరంజీవినికుమారి మూడు స్వీయ కవితా సంపుటులను వెలువరించారు. ఈ సంపుటులు ఆమె సాహిత్య సృజనాత్మకత, సామాజిక చైతన్యం, మరియు స్త్రీవాద దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి

సోవియట్ రష్యాను సందర్శించినపుడు ఆర్మేనియాలో హోవనేస్తు మన్య అనే రచయితతో పరిచయం కలిగింది. ఆయన  కథలపుస్తకం తెచ్చుకొని వాటిని “ఆర్మేనియా కథలు గాథలు” పేరిట తెలుగులోకి అనువదించారు.  ఈ పుస్తకాన్ని విశాలాంధ్ర వారు ప్రచురించారు.

సోవియట్ యూనియన్‌కు చెందిన 32 మంది మహిళా రచయిత్రుల కవితల సంపుటి Tender Muse ని వీరు “లేత మందారాలు-రక్త సింధూరాలు” పేరిట తెలుగులోకి అనువదించి ప్రచురించారు

80 పైన వివిధ సాహిత్య సాంస్కృతిక, స్త్రీవాద సంబంధ వ్యాసాలు రాసారు. వక్తగా వివిధ వేదికలపై కొన్ని వందల ప్రసంగాలు చేసారు. అనేక  రేడియో ప్రసంగాలు చేసారు.  మహిళాసమస్యలపై టివి చర్చాగోష్ఠులలో  పాల్గొన్నారు.

అవార్డులు

డా. చిరంజీవినికుమారి  విద్య, సాహిత్యం, సామాజిక సేవ, సాంస్కృతిక రంగాలలో చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలను అందుకున్నారు.

1.     సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు: భారత్-సోవియట్ సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసినందుకు, ముఖ్యంగా వీరు చేసిన రష్యన్ అనువాద రచనలు, ఇస్కస్ సంస్థలో చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.

2.     కీర్తి పురస్కారం 2011: సాహిత్య, విద్యా రంగాలలో డా.చిరంజీవినికుమారి చేసిన సేవలకు గుర్తింపుగా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నుంచి ఈ పురస్కారం అందుకున్నారు  

3.     విద్యారంగంలో విశేషమైన సేవలు అందించినందుకు SHE, ఫౌండేషన్, హైదరాబాద్ వారిచే ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ విమెన్ ఎంపవర్‌మెంట్ అవార్డు (2012)  హైదరాబాద్ రవీంద్ర బారతిలో, రాష్ట్ర గవర్నరు సతీమణి శ్రీమతి విమలా నరసింహన్  చేతులమీదుగా అందుకొన్నారు.

4.     ఇంటిగ్రల్ హ్యూమనిస్ట్ అవార్డు (2014), పుల్లెల తాతయ్య మెమోరియల్ అసోసియేషన్

5.     తుమ్మల వెంకట్రామయ్య సాహితీ సత్కారం, హైదరాబాద్

ముగింపు

          డా. చిరంజీవినికుమారి భర్త పిఎస్ శర్మ 25, డిశంబరు 2000 న మరణించారు.  వీరికి ఇద్దరు కుమారులు. డా. పిబిఎస్ గోపాల్ హైదరాబాదులో వైద్యుడిగా పనిచేస్తున్నారు.  పిఎస్. కిరణ్  ఐడియల్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారాలు చూస్తున్నారు. 

డా. చిరంజీవినికుమారి విద్య, సాహిత్యం, సామాజిక సేవ, సాంస్కృతిక పరిరక్షణలలో అసాధారణమైన కృషి చేసిన వ్యక్తి. విద్యావేత్తగా, కవిగా, అనువాదకురాలిగా, సాహితీ కార్యకర్తగా, సమాజ సేవకురాలిగా  చేసిన సేవలు తూర్పుగోదావరి జిల్లా సాహిత్య, విద్యా రంగాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.  వివిధ సంస్థల నిర్వహణలో, డా.చిరంజీవినికుమారి అసాధారణమైన నాయకత్వ పటిమను ప్రదర్శించారు. విద్య, సాహిత్యం, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఆమె నిర్వహించిన కార్యక్రమాలు ఆమె సమర్థ నాయకత్వానికి,  ప్రణాళికా నైపుణ్యానికి, అంకితభావానికి నిదర్శనం. వామపక్ష భావజాలాన్ని జీవితాంతం ఆచరించారు.  సమాజ అభ్యున్నతికి, ముఖ్యంగా మహిల అభ్యున్నతికి కృషి చేసారు.

ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు:

“మనమూలాల్ని మరచిపోకూడదు. వారసత్వంగా ఆస్తులు పంచినట్టే మన పిల్లలకు మన మూలాలను కూడా పంచి ఇవ్వాలి.  వాటిని వారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొనేట్టు చేయాలి…. అప్పుడే జీవితానికి ఒక విలువ ఏర్పడుతుంది”

ఈ వాక్యాలు సాహిత్య, సాంస్కృతిక, విద్యారంగాలలో వీరి జీవితకాలకృషిని ప్రతిబింబిస్తాయి.  డా. చిరంజీవినికుమారి గారి జీవితం పరిపూర్ణమైనది.  అందరిలో ఆదర్శప్రాయమైన స్ఫూర్తిని కలిగిస్తుంది.

 

(ఇచ్ఛామతి ఆన్ లైన్ పత్రిక సౌజన్యంతో)

బొల్లోజు బాబా

9849320443

Footnotes

1. పరిణతవాణి (2000, Volume – 2) పేన3

2.  కాకినాడ విద్యార్ధినీ సమాజం; ప్రారంభం,  వీక్షణం మాస పత్రిక, పేనం. 48,  ఫిబ్రవరి 2008,

3.  ఆంధ్రపత్రిక, 25, సెప్టెంబరు 1970

4. 1977-08-18 Visaalandhra 

5. విశాలాంధ్ర, 01, ఏప్రిల్ 2018

6. సంసారంలో శ్రీశ్రీ, సరోజా  శ్రీశ్రీ పేనం 78

 



 

Thursday, July 17, 2025

వివక్ష పట్ల ధిక్కారప్రకటన - ఐదుగురు కవుల సంగ్రహ చరిత్ర




సాహిత్యరంగంలో బ్రాహ్మణ ప్రాబల్యం ముందునించీ ఉంది. సాహిత్యం, విమర్శ అనేది వారి సొంత ఆస్తిగా, వారు మాత్రమే సృష్టించగలిగే విషయంగా చలామణీ చేసారు. దీనికి ప్రధాన కారణం బ్రాహ్మణులను అందరిలోను అగ్రస్థానంలో నిలబెట్టిన వర్ణవ్యవస్థ. మధ్య యుగాలలో ముస్లిమ్ పాలన వలన ఈ వర్ణ వ్యవస్థ హద్దులు కొద్దిమేరకు సడలడంతో బ్రాహ్మణేతరులు కూడా విద్యలను అభ్యసించి కావ్యాలను సృజించగలిగారు. అయినప్పటికీ రాజాస్థానాలలో ఏ రచన రాజు ప్రాపకం పొందాలో దేన్ని దూరం పెట్టాలో నిర్ణయించే స్థానంలో బ్రాహ్మణులే ఉండటంతో ఎందరి బ్రాహ్మణేతరుల రచనలు కాల గర్భంలో కలిసిపోయి ఉంటాయో ఎవరూ చెప్పలేరు. వాటిలో కొన్ని ప్రతిభ, ప్రజాదరణ కారణంగా కాలపరీక్షకు నిలిచినా, అలాంటి వాటిపట్ల బ్రాహ్మణులు ఉదాసీనంగా ఉండేవారని వేమన, వీరబ్రహ్మంల రచనలే సాక్ష్యంగా నిలుస్తాయి.
వేమన పద్యాలను పరిష్కరించటానికి సహకరించమని చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తనవద్ద పనిచేస్తున్న పండితులను కోరగా వారు దానిని “జబ్బు పని” అని ఎంచి తాత్సారం చేసేవారట. రాయలసీమ స్థానిక చరిత్రకథనాలను విస్త్రుతంగా సేకరించిన కాలిన్ మెకంజీ యొక్క పండితసహాయకులు ఎక్కడా వేమన, వీరబ్రహ్మంల చరిత్ర కైఫీయ్యతులలోకి ఎక్కకుండా జాగ్రత్తపడ్డారు. అబ్రాహ్మణుల రచనల స్థాయి అది. ఇన్ని అడ్డంకులను దాటుకొని నిలబడిన బ్రాహ్మణేతర రచనలు ఏవైనా ఉంటే ఒకటి రెండు తరాల తరువాత వాటిని బ్రాహ్మణ రచనలు అని చెప్పి తమ ఖాతాలో వేసుకొనేవారు పండిత విమర్శకులు.
 
అలా ఒక ఐదుగురు బహుజన కవులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన గ్రంథమే “ఐదుగురు కవుల సంగ్రహ చరిత్ర”
****

ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో ప్రభుత్వోద్యోగాలలో బ్రాహ్మణులే అధిక సంఖ్యలో ఉండేవారు. దీని వల్ల బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులమధ్య అనాదిగా ఉన్న సామాజిక అంతరాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ పరిస్థితులలోంచి దక్షిణభారతదేశంలో పండిత అయోథి దాస్, పెరియార్ ల నాయకత్వంలో బ్రాహ్మణేతర ఉద్యమం (Non Brahmin Movement) రూపుదిద్దుకొంది.
బ్రాహ్మణేతర కులాలలోని విద్యావంతుల ప్రోద్భలంతో 1916 లో మద్రాప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ ఏర్పడింది. ఈ పార్టీ సమాజంలోని బ్రాహ్మణేతర కులాలను సంఘటితం చేసింది. “ఒక పీడిత మహాజన సమూహం విద్య విజ్ఞానాల కొరకు, సాంఘిక మాన్యత కొరకు చేసే న్యాయమైన తపస్సు” గా బ్రాహ్మణేతరోద్యమాన్ని శ్రీ దువ్వూరి రామిరెడ్డి నిర్వచించారు.
 
ఇలాంటి చారిత్రిక నేపథ్యంలో - బండారు తమ్మయ్య (జంగమ), పెదగాడ గంగయ్య (విశ్వబ్రాహ్మణ) చిదిరెమఠం వీరభద్రశర్మ (జంగమ) వడ్డెపాటి నిరంజన శాస్త్రి (విశ్వబ్రాహ్మణ) లాంటి బహుజన సాహిత్యవిమర్శకులు చారిత్రికంగా బ్రాహ్మణేతర కవులకు జరిగిన అన్యాయాలను తమ రచనలు ద్వారా సరిదిద్దే ప్రయత్నం చేసారు.

1929 లో శ్రీ పెదగాడ గంగయ్య రాసిన “అయిదుగురు కవుల సంగ్రహ చరిత్ర” అలా ఒక ఐదుగురు బ్రాహ్మణేతర కవులకు జరిగిన వివక్షను ఎత్తి చూపుతుంది. ఈ కవులనందరినీ ఆనాటి సాహిత్యచరిత్రకారులు బ్రాహ్మణ కవులుగా (కందుకూరి రుద్రకవి మినహా) వారి రచనలను బ్రాహ్మణసాహిత్యంగా ప్రచారించుకొన్నారు.
 
ఐదుగురు కవుల సంగ్రహ చరిత్ర పుస్తకంలో ఏముంది ?
సంకుసాల నృశింహకవి ఇంటిపేరు టంకసాల అని; అతను కందుకూరి వీరేశలింగం తన కవుల చరిత్రలో (1917-19) చెప్పినట్లు నియోగిబ్రాహ్మణుడు కాదని విశ్వబ్రాహ్మణ సంజాతుడు అని స్పష్టపరిచారు.

కందుకూరి తన కవుల చరిత్రలో చేమకూర వేంకటకవిని నియోగి బ్రాహ్మణుడు అని పేర్కొన్నాడు. విజయవిలాసకావ్యంలోని పద్యాలు, ఇతర చాటువుల ఆధారంగా చేమకూర వెంకటకవి బోగినీ సుతుడని నిశ్చయం చేసారు.

కందుకూరి రుద్రకవిని కంసాలి రుద్రయ్య అని, అతను అష్టదిగ్గజములలో ఒకడు కాదు అని కందుకూరి వీరేశలింగం తన కవుల చరిత్రలో పేర్కొన్నాడు. దీనిని ఖండిస్తూ రుద్రకవి రాయల ఆస్థానంలో ఒకడని శాసన, పద్య ఆధారాలతో సోపత్తికంగా నిరూపణ చేసారు.
 
పాలకురికి సోమనాథకవి వీరశైవుడని కందుకూరి వీరేశలింగం, బ్రాహ్మణుడని వేటూరి ప్రభాకరశాస్త్రి, ఆరాధ్య బ్రాహ్మణుడని కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు అంటూ భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో అతను జంగమ కులానికి చెందిన కవి అని రుజువులు చూపారు.
 
హరిలీలావిలాసమును వ్రాసిన తెనాలి రామలింగయ్య, పాండురంగ మహాత్మ్యమును వ్రాసిన తెనాలి రామకృష్ణుడును ఒక్కరేయని నిష్కర్ష చేసారు. కందుకూరి వీరేశలింగం తన కవుల చరిత్రలో తెనాలి రామలింగయ్య బ్రాహ్మణుడు అని రాసారు. తెనాలి రామలింగయ్య విప్రుడు కాదు విశ్వబ్రాహ్మణుడు అని పెదగాడ గంగయ్య సాక్ష్యాధారాలతో నిరూపించారు.

*****
పైన చెప్పిన ఆ ఐదుగురుకవుల కులాలను నిర్ధారిస్తూ వారి సంగ్రహ చరిత్రను పెదగాడ గంగయ్య 1929 లో పుస్తకరూపంలో ప్రకటించాడు.
 
ఆ తరువాత కాలంలో కవుల చరిత్రను లిఖించిన ప్రముఖ సాహిత్యచరిత్రకారులు ఈ అభిప్రాయాలను ఏమేరకు పరిగణలోకి తీసుకొన్నారో పరిశీలిద్దాం.
శ్రీ చాగంటి శేషయ్య రచించిన “ఆంధ్రకవి తరంగిణి” (1946) లో పాల్కురికి సోమనాథుడు, తెనాలి రామకృష్ణ కవులు నియోగిబ్రాహ్మణులని, సంకుసాల నృశింహకవి శ్రీవైష్ణవ బ్రాహ్మణుడని అన్నారు. చేమకూర వేంకటకవి బోగినీ పుత్రుడని, తెనాలి రామలింగ కవి విశ్వబ్రాహ్మణ కవియని శేషయ్య అభిప్రాయపడ్డాడు. ఈ చివరి ఇద్దరి విషయంలో పెదగాడ గంగయ్య వాదనను ఈయన అంగీకరించినట్లు బావించాలి.
 
“ఆంధ్రకవి సప్తశతి” పేరుతో శ్రీ బులుసు వెంకటరమణయ్య (1956) లో వెలువరించిన కవుల జాబితాలో సంకుసాల నృశింహకవి, తెనాలి రామకృష్ణకవులు బ్రాహ్మణులని; కందుకూరి రుద్రకవి విశ్వబ్రాహ్మణుడని; చేమకూర వేంకటరాజు పాలకురికి సోమనాథులను కొందరు బ్రాహ్మణులు అని కొందరు శూద్రులని వాదించుచున్నారు అంటూ తటస్థవైఖరి తీసుకొన్నాడు.

కవుల చరిత్రకొరకు నేడు విస్త్రుతంగా రిఫర్ చేసే పుస్తకం ఆరుద్ర రాసిన “సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర” (1960 లు). సమగ్రాంధ్ర సాహిత్యచరిత్రలో ఆరుద్ర చేమకూర వేంకటకవిని వెంకటరాజు అని పిలుస్తూ ఒక క్షత్రకులస్థునిగా పరిచయం చేసి… “ఆయన కులం తక్కువవాడనే వదంతి ఒకటి చిరకాలం నుంచీ ప్రచారంలో ఉంది” అంటాడు తప్ప చర్చించడు. తెనాలి రామకృష్ణుడిని బ్రాహ్మణ కవి అని చెప్పాడు. కందుకూరి రుద్రకవి, సంకుసాల నరసయ్యల (నృశింహకవి) కుల ప్రస్తావనే తేలేదు. పాల్కురికి సోమనాథుడు సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడని అన్నాడు. సాహిత్యచరిత్ర సారమెల్లఎరిగిన ఆరుద్ర ఆకుకు అందకుండా పోకకు చిక్కకుండా చేసిన ఈ వాఖ్యలు ఆశ్చర్యం కలిగించకమానవు.
****
సాధారణంగా పద్యకావ్యాలలో బ్రాహ్మణకవులు తమ కులగోత్రాలను నిక్షిప్తం చేస్తారు. ఈ ‘లగ్జరీ’ బ్రాహ్మణేతర కవులకు ఉండదు. అందుకనే వారి కావ్యాలలో వారు ఏ కులానికి చెందినవారో ఏరకమైన క్లూ పెద్దగా లభించదు. ఒకవేళ చెప్పుకొన్నా ఆ కావ్యానికి బుధజనులలో సరైన ఆదరణ లభించకపోవచ్చు. “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేకదా” అన్న చేమకూర వేంకటకవి వ్యాఖ్య ఇక్కడ ప్రస్తావనార్హం.
 
బ్రాహ్మణేతర కవులు రాజాశ్రయం పొందటానికి ఎన్నెన్ని పాట్లు పడేవారో అనేక ఉదంతాలు కనిపిస్తాయి.
 
సంకుసాల నృశింహకవి “కవికర్ణరసాయనము” అనే ప్రబంధాన్ని రచించి, శ్రీకృష్ణదేవరాయల దర్శనం ఇప్పించమని అల్లసాని పెద్దనకు చూపగా అతడు ఆ రచనను చదివి అది రాజువద్దకు కొనిపోయిన ఆ కవికి గొప్ప ఆదరణ లభిస్తుందనే అసూయతో రాజదర్శనం కాకుండా చేసాడట. ఎంతకీ రాజసన్నిధి లభించకపోవటంచే తన రచనను ధనాశతో మనుషులకు అంకితమివ్వటం తుచ్ఛమని తలచి శ్రీరంగనాథునకు అంకితమిచ్చాడట నృశింహ కవి. పద్యసందర్భం వేరైనప్పటికీ ఇతను రాసిన ‘ఉద్ధతులమధ్య పేదలకుండ దరమే’ అనే పద్యపాదంలో ఈ బహుజనకవి తన జీవితంలో ఎదుర్కొన్న వివక్షను అన్యాపదేశంగా చెప్పాడా అనిపించకమానదు.
కందుకూరి రుద్రకవి రాజదర్శనానికి పండితకవులు అడ్డుపడగా రాయలవారికి క్షురకర్మ చేసే మంగలి కొండోజి చేత సిఫార్సు చేయించుకొని రాజు వద్దకు వెళ్ళాడని ఒక కథనం.
 
ప్రతాపరుద్రుడు రాజయిన కొత్తలో ఓరుగల్లులోని ఒక ఆలయానికి దర్శనానికి వెళ్ళాడట. అక్కడ కొందరు బసవపురాణాన్ని పఠిస్తున్నారు. “ఏమిటా పురాణం” అని అడగగా ఒక దూర్తవిప్రుడు “పాల్కురికి సోమ పతితుడను వాడొకడు ఈ మధ్య ద్విపద రాసాడు. అది అప్రమాణం, వినకూడనిది” అని చెప్పగా, ప్రతాపరుద్రుడు వినకుండానే వెళ్ళిపోయాడట.
 
ఎవరైనా బ్రాహ్మణేతరులు అసమాన ప్రతిభావ్యుత్పత్తులను చూపినపుడు వారి పాండిత్యము వెనుక ఏదో దేవతానుగ్రహం ఉందని కథలు పుట్టించటం మరొకరకం వ్యక్తిత్వహననం. ఒకనాడు ఒక సిద్ధుడు తెనాలి రామలింగకవికి కాళికాదేవిని ప్రసన్నం చేసుకొనే మంత్రమును ఉపదేశించేడట. ఆ మంత్రశక్తితో కాళికాదేవి దయకు పాత్రుడైన రామలింగడు ఆమెచే “వికటకవివై రాజసన్మానము పొందెదవు” అనే వరాన్ని పొందటం అలాంటిదే.
 
ఇలాంటి కథలు కోకొల్లలుగా సాహిత్యచరిత్రలో కనిపిస్తాయి. ఇవన్నీ బ్రాహ్మణ బ్రాహ్మణేతర మేథోశక్తులు చరిత్రలో పరస్పరం సంఘర్షించుకొన్న క్షణాలు. ఈ రాపిడి నేటికీ సమాజంలో అంతర్లీనంగా ప్లే అవుతూనే ఉంటుంది. అన్నమయ్యలాంటి పదకర్తకు ప్రోజెక్టుల రూపంలో కోట్లాది రూపాయలు వెచ్చించటానికి, బ్రాహ్మణాధిపత్యాన్ని ధిక్కరించిన పోతులూరి వీరబ్రహ్మం రచనల పరిరక్షణకు అటువంటి కృషి చేయకపోవటానికి వెనుక ఉండే బ్రాహ్మణాధిపత్య భావజాల ప్రభావాన్ని ఎవరు కాదనగలరు?.
****
“ఐదుగురు కవుల సంగ్రహ చరిత్ర” పుస్తకం దాదాపు శతాబ్దం కిందటిది. అప్పట్లో ఈ పుస్తకంపై తీవ్రమైన వాదప్రతివాదనలు నడిచాయి. పెదగాడ గంగయ్య అపండితుడని వ్యక్తిగతంగా నిందిస్తూ సనాతన పండితులు వ్యాసాలు రాసారు. ఆ తదనంతరం పెదగాడ గంగయ్య చేసిన ప్రతిపాదనలను నిశ్శబ్దంగా స్వీకరించారు కొందరు సాహిత్య చరిత్రకారులు. ఇంతటి ఘన చరిత్రను కలిగిన ఈ పుస్తకం యొక్క ప్రాసంగిత నేడు ఏమేరకు ఉంది అని ప్రశ్నించుకొంటే……
సాహిత్య చరిత్రలో బహుజనుల అస్తిత్వాన్ని చెరిపేయటం పట్ల, వారిపై జరిగిన వివక్ష పట్ల ఈ పుస్తకం ఒక ధిక్కారప్రకటన. తెలుగుసాహిత్య నిర్మాణంలో బహుజనుల పాత్రను సముచితంగా గౌరవించుకోవటం కొరకు ఈ పుస్తకాన్ని ప్రతిఒక్కరూ చదవాలి. ఇలాంటి చారిత్రిక ద్రోహాలు ఎక్కడెక్కడ జరిగాయో శోధించటానికి, విస్మృతంగా ఉండిపోయిన ఎంతోమంది బహుజన సాహితీవేత్తలను చరిత్రపుటలలోంచి వెలికితీసి పునర్మూల్యాంకనం చేయటానికి, నేటి తరం పరిశోధకులకు ఈ పుస్తకం ఒక స్పూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.

గొప్ప యజ్ఞాన్ని చేస్తున్న డా.సంగిశెట్టి శ్రీనివాస్ అన్నకు వందనాలు

భవదీయుడు
బొల్లోజు బాబా
కాకినాడ
16/5/2025




Tuesday, May 20, 2025

భర్తపోయిన స్త్రీలకు గాజులు, బొట్టు తియ్యమని ఏ శాస్త్రాలలో ఉంది?

భర్తపోయిన స్త్రీలకు గాజులు, బొట్టు తియ్యమని ఏ శాస్త్రాలలో ఉంది అని ఢంకాభజాయించి మరీ ప్రశ్నిస్తున్నారు ఈవిడ. (see video link in comment).
 
వీళ్ళు తెలియక ఇలా మాట్లాడుతున్నారని అనుకోను. హిందూ ధర్మంలో ఎలాంటి దురాచారాలు లేవు అని బుకాయించటం నేడు ఫాషన్. 

యజ్ఞాలలో మాంస, మద్యసేవనాలని కందమూలాల సేవనంగా గీతా ప్రెస్ ఇటీవలి ప్రచురణలలో క్రమేపీ మార్చుకొంటూ వస్తూంది.
 
గొప్ప సమానత్వం వెల్లివిరిసిన సమాజంలోకి కులాలను బ్రిటిష్ వారు తీసుకొచ్చారట.
 
స్త్రీని గౌరవించిన ఒకే ఒక ధర్మం మనది అట.
 
సతీసహగమనం ఎన్నడూ జరగనే లేదట అలా జరిగింది అనటం బ్రిటిష్ వారి అతిశయోక్తులట.
బ్రిటిష్ వారు ధర్మశాస్త్రాలను, వేదాలను వక్రీకరించి అనువదించారట. వాటిపై ఆధారపడిన డా. అంబేద్కర్ తెలియక హిందూమతాన్ని విమర్శించారట.
 
ఒకటా రెండా.... నేడు ఏవైతే రాజ్యాంగ విరుద్దమో అవన్నీ కల్పితాలు అంటూ మాట్లాడుతున్నారు. అబద్దాలతో ప్రజల్ని ఊదరకొడుతున్నారు.

ఎంతకాలం ఇలా అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలని మోసగిస్తారు వీళ్ళు. 

ఒకె .... సరే....జరిగిందేదో జరిగిపోయింది... కాలానుగుణంగా ఈ ఈ దురాచారాలను రద్దుచేస్తున్నాం అని ఒక లిస్ట్ ఇచ్చి, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం అని పీఠాధిపతులు, ఇలాంటి ప్రవచనకారులు ప్రకటించి ముందుకు వెళితే మన మతానికి ఎంతగౌరవంగా ఉంటుంది? కానీ చెయ్యరు ఎందుకంటే అప్పుడు వీళ్ళనెవరూ వినరు, చూడరు కనుక. ధర్మం పేరుతో మూఢత్వాలను ప్రచారం చేసినప్పుడే, పరిహారాలంటూ వీరికి చేతినిండాపని, మనుగడ ఉంటుంది.
 
ఇదిగో ఈ వీడియోలో వృద్ధపతివ్రతలు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారో గమనించండి. వీళ్ళే పెద్దముత్తైదువులపాత్రలో భర్త పోయిన ఎందరి అభాగ్యునుల గాజులు బద్దలు కొట్టి ఉంటారో, నా కైతే అనుమానం లేదు. పోనీ కనీసం అలాంటి తంతులను చూసి ఉండరా? వేదికపై మాత్రం గొప్ప సుద్దులు చెబుతున్నారు. సిగ్గులేకుండా. ఈ ఆచారాలు మధ్యలో ఎలా వచ్చాసాయో వచ్చేసాయండి అంటున్నారావిడ. ఇంకా నయం. బ్రిటిష్ వారు తీసుకొచ్చారు అనలేదు. సంతోషం.
 
ఇక ఈ వీడియోలో ఆవిడ ప్రశ్నించినట్లు – వైధవ్యం పొందిన స్త్రీ బొట్టు, కాటుక గురించే కాదు, ఇంకా చాలా దుర్మార్గమైన విషయాలు శాస్త్రాలలో పండితులు చెప్పారు.
 
భర్తచనిపోయిన స్త్రీకి రెండేగతులు. ఒకటి సతీసహగమనం. రెండవది ఈ క్రింది నియమాలతో వైధవ్యాన్ని పాటించటం.
 
1. శీలమును కాపాడుకోవలెను. శీలమును కోల్పోయినచో స్వర్గములోని భర్త పితృ, సోదరులు నరకములోకి పంపబడెదరు.

2. జుట్టు ముడివేసినచో పైలోకములోని భర్తకు బంధనమగును కనుక గుండుకొట్టించుకోలెను
3. రోజుకి ఒకపూటమాత్రమే భుజించాలి

4. ఉపవాసాలుండాలి

5. మంచంపై పడుకోరాదు, నేలపై నిద్రించాలి.

6. నలుగుపెట్టుకొని తలనీళ్ళుపోసుకోకూడదు

7. సుగంధద్రవ్యములు, పన్నీరు, పైపూతలు, ఆభరణాలు, చందనాదులు లాంటి భోగములపట్ల ఆసక్తి కూడదు .

8. ఎడ్లబండిపై ఎక్కకూడదు

9. జాకెట్టు, రంగుచీరలు ధరించకూడదు.

10.తాంబూలము, కంచుపాత్రలో భోజనము నిషేదం

11. పుత్రుడు లేని విధవ స్త్రీ ప్రతిరోజు భర్తకు తిలోదకములచే తర్పణములు ఇవ్వాలి.

12. పరపురుషుల పేర్లు ఉచ్చరించరాదు.
 
వైధవ్యం పొందినవారికి సనాతన ధర్మం vidhavadharmah అనే పేరుతో అనేక ఆంక్షలు విధించింది. ఇవన్నీ సతీసహగమనానికి ప్రత్యామ్న్యాయంగా చెప్పి, అదేదో గొప్ప మానవత్వం నిండిన ఔదార్యప్రకటనగా భావించి ఉంటారు శాస్త్రకారులు. పండితులు రాసిన ఈ దుర్మార్గమైన చట్టాల వలన వైధవ్యం పొందిన హిందూ స్త్రీలు నేటికీ సున్నితమైన, చెప్పుకోలేని వివక్షకు గురవుతూండటం గమనించవచ్చు.

బుకాయించినంతమాత్రానా సనాతన చరిత్ర చిరిగిపోదు.
 
బొల్లోజు బాబా

Friday, May 16, 2025

ప్రాచీనగాథలు పరిచయం



ఆత్మీయమైన పలుకులకు దేవదానం రాజుగారికి సదా కృతజ్ఞుడను. వీరి పరిశీలనలు విలువైనవి. శిరోధార్యమైనవి....

థాంక్యూ అనేది చిన్నమాట.....
బొల్లోజు బాబా
....
ప్రాచీన గాథలు కొత్తగా
 
కొన్ని విషయాలు రాయానంటే శోధించాలి. శోధించిన దానికి ప్రామాణికత సంతరించేలా పరిశ్రమించాలి. చరిత్ర లోకి తొంగి చూసి రాయగలగడం ఒక విద్య. ఏమాత్రం తేడా ఉంటే చుట్టూరా ఉన్న వేల కళ్ళకు జవాబు చెప్పుకోవాలి. అంటే సంయమనం కోల్పోకూడదు. ఒక పక్క వాలకూడదు. నిరపేక్షంగా ఉండాలి. పక్కన వేయి కళ్ళు చూస్తుంటాయి. అవెప్పుడూ రంధ్రాన్వేషణకు ప్రయత్నిస్తాయి. మానసికంగా మనల్ని దెబ్బతీస్తాయి. చేసే పనిని చిత్తశుద్ధితో చేసినా మన రాతల్ని అనుమానిస్తారు. నేను చెప్పదలచిన విషయం ఇది కాదు. ఉపోద్ఘాతంగా మొదలెట్టానంతే. చాలా కాలంగా ‘ప్రాచీన గాథలు’ చదివే పుస్తకాల గుట్టలోంచి పలకరిస్తూనే ఉంది. చెప్పాలంటే గత కొద్ది కాలంగా బొల్లోజు బాబా వెలువరిస్తున్న వ్యాసాలు ముఖ్యంగా నాకు తెలీని లోకంలోకి విహరింప చేస్తున్నాయి. పాత దారుల్ని వెతికి కొత్తగా పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
 
మానవానుభవాలు కాలం వెంట తరలి వస్తూనే ఉంటాయి. అనుభూతుల్ని అనుభవాల్ని ఉద్వేగాల్ని ఒకనాటి సామాజిక చిత్రాల్ని శతాబ్దాల క్రితం జీవితాల్ని ప్రతిబింబించినపుడు విస్మయం కలుగుతుంది. ఇవన్నీ సామాన్యుల జీవితాల్ని నమోదు చేసిన గాధలే . మొదటిసారి చదివినపుడు వీటిలో కొన్నింటిని ‘కథలు’ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది.
 
ఆ వృద్ధురాలి కడుపు / తామరాకులా ముడుతలు పడిఉంది /ఆమె దుర్బల భుజాలపై నరాలు పైకి తేలాయి /ఆమె కొడుకు యుద్ధంలో ఓడిపోయి పారిపోయాడని /చాలామంది చెప్పిన మాటలు విని /‘అదే నిజమైతే అతనికి పాలు ఇచ్చిన ఈ రొమ్ములను / నేనే కోసి వేసుకుంటాను’ అని కోపంతో /కత్తి తీసుకుని యుద్ధరంగానికి బయలు దేరింది / అక్కడ ఛిద్రమైన కొడుకు మృతదేహాన్ని చూసి /అతనికి జన్మనిచ్చిన రోజు కంటే /ఎక్కువ సంతోషించింది. ఇదొక ప్రాచీన గాథ. దీన్ని నేటి సమాజానికి అనుగుణంగా కథ రాస్తానన్న మాట. అదేమిటో చివరి చెబుతానని మాత్రం అంటాను.
 
ఇంకోటి...
 
అతను /నన్ను పెండ్లాడినట్లు సాక్ష్యం తెమ్మంటే / ఎక్కడ్నించి తేను /అతనే సాక్షి /ఆ...గుర్తొచ్చింది / కందిజువ్వల్లాంటి సన్నని పొడవైన ఆకుపచ్చని కాళ్ళతో /ఏటి ఒడ్డున నిలుచున్న కొంగ ఒకటి /ఆ సమయంలో మమ్మల్నే తదేకంగా చూసింది. దీన్ని నేటి కథగా ఎలా రాయాలి? అదీ చెబుతాను.
 
ఊహకు హద్దులు లేవు కదా. బోలిడన్ని ఆలోచనలు గమ్మున వచ్చేస్తుంటాయి. వాటిని అదను చూసి పట్టుకుంటే ఎన్నో అక్షరాలు ఎన్నో పదాలు ఎన్నో వాక్యాలు...కాదంటారా?
మళ్ళీ ‘ప్రాచీన గాథలు’ చదవాలి. బొల్లోజు బాబా పరిశ్రమను గుర్తించాలి. తను చరిత్ర లోంచి మనుష్యుల్ని చూడటం మొదలెట్టి చాలా కాలం అయింది. కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని కోరుకుంటున్నాను. మరో మాట చెప్పి ముగిస్తాను. ఇది విమర్శ కాదు. గమనింపు...అంతే. బొల్లోజు బాబా ఒకోసారి అనువదించి ఊరుకోకుండా కలగజేసుకుని తన అభిప్రాయాన్ని కూడా చెబుతాడు. అవి ఖచ్చితంగా ఇదే అన్నట్టు కాకుండా సంశయాత్మకంగా చెబుతుండడాన్ని గమనించాను. ‘బహుశా’ అంటూ చెప్పే వాటిని పాఠకుడు సీరియస్‌గా తీసుకుంటాడనుకోను`
 
--దాట్ల దేవదానం రాజు
 
ప్రా


 


చీన గాధలు కావాలంటే సంప్రదించండి...ఛాయ ప్రచురణలు
7093165151
https://www.amazon.in/dp/8198229310

 

Monday, May 5, 2025

ఒక కామెంటు......



ఈ మాటలో మిత్రులు శ్రీ రాణి శివశంకర శర్మ గారు "భారతీయులకు హేతు చింతన ఉందా?" అనే పేరుతో ఒక వ్యాసం రాసారు. అది క్లుప్తంగా ఇలా ఉంది....

///హేతు చింతనను ఆధునికతకు పర్యాయంగా భావించినప్పటికీ, భారతీయ హేతు చింతన గురించి కమ్యూనిస్టులు, దళితవాదులు, హిందువాదులు వలసవాద ప్రభావంతో తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాసం వాదిస్తుంది. భారతీయ దృక్పథంలో చక్రీయ కాల భావన ప్రధానమని, శంకరాచార్యులు, బౌద్ధులు స్థల-కాలాలు మనోనిర్మితమని చెప్పారు, ఇది క్వాంటం ఫిజిక్స్‌తో సమానంగా ఉంది. వలసవాద ప్రభావంతో భారతీయ తాత్విక చింతనను మేధావులు, రోమిలా థాపర్ తో సహా తక్కువగా చూసారని అభియోగం మోపుతుంది. .....
దీనిపై రాసిన విమర్శను ఈమాట వెబ్ సైటులో తీసుకోవటం లేదు. కనుక ఇక్కడ ఒక పోస్టుగా పోస్ట్ చేస్తున్నాను.

నా వ్యాఖ్య ఇది.
.
భారతీయులు సుదూర గతంలో గొప్ప హేతుబుద్ధి కలిగి ఉండేవారు, దాన్ని క్రమేపీ కోల్పోయారు....ఈ వ్యాసం మొత్తం మీద ఇదొక్కటే సత్యపూర్వక వాక్యం.
సుదూరగతంలో చార్వాకులు బౌద్ధం రూపంలో గొప్ప హేతుబుద్ది కలిగి ఉండేవారు. క్రమేపీ ఆత్మ, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, మోక్షం, స్వర్గనరకాలు, పాపపుణ్యాలు లాంటి అభౌతిక అంశాలను- పండితులు తమ అధిపత్యానికి, ఉదరపోషకు- మతలక్షణాలుగా స్థిరీకరించి జనబాహుళ్యాన్ని నమ్మించారు.
1. చార్వాకులు ఇలా అన్నారని ఆధారాలేమిటి?
/////జీవసృష్టిలో చైతన్యం (Consciousness) కూడా ఇలాంటి భౌతిక మూలకాల (భూమి, నీరు, అగ్ని, వాయువు) సంయోగం వల్ల ఉద్భవిస్తుంది. తాంబూలం యొక్క ఎరుపు రంగు లేదా రుచి ఎలా ఒక స్వతంత్ర శక్తి లేకుండా సహజంగా ఏర్పడుతుందో, అదేవిధంగా చైతన్యం కూడా శరీరంలోని భౌతిక అవయవాల సంక్లిష్ట సంయోగం ఫలితంగా ఉత్పన్నమవుతుంది.////
---- ఆత్మ, చైతన్యం లాంటివాటిని చార్వాకులు ఖండించారు. ఇవన్నీ ఆ తరువాత పండితులు చేసిన చార్వాక వ్యాఖ్యానాలలోని వక్రీకరణలు. పై వాక్యాలను చార్వాకులవని నిరూపించే ఆధారాలు చూపండి. ఉదాహరణకు; యావజ్జీవేత్సుఖం జీవేదృణం కృత్వా ఘృతం పిబేత్ । భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః లాంటి చార్వాక వాక్యాలను చూపండి. ఎవరెవరో ఆ తరువాత చేసిన పండిత వ్యాఖ్యానాలు చూపొద్దు. ముఖ్యంగా తాంబూల దృష్టాంతం.
.
2. భారతీయ తత్వశాస్త్రం కాలం సైక్లికల్ అని చెబుతుంది. కానీ దానికి సంబంధించిన ఆధారాలను చూపదు. ఉదా. ఇది కలికాలం అనుకొంటే అంతకు ముందు జరిగిన కలికాలాన్ని ఉదాహరణగా చూపి వాదించాలి. అలా చెయ్యదు కనుక అది నిరూపణ కాదు. బిగ్ బేంగ్ కూడా ఒక బిందువు నుంచే ప్రారంభమౌతుంది. అయిన్ స్టీన్ రెలటివిటీ కాలాన్ని నాలుగవ డైమెన్శన్ అని లీనియర్ గానే చూపుతుంది. సైక్లికల్ గా కాదు.
కాలం సైక్లికల్ అని చెప్పటం కర్మ సిద్ధాంతంలాగే సంస్కరణను, అభివృద్ధిని నిరోధిస్తుంది. అంతా దైవేచ్ఛ అని ప్రకటించి స్వీయ సంకల్పాన్ని నిరుత్సాహ పరుస్తుంది. కాలం సైక్లిక్ అనే భావన అశాస్త్రీయమైనది. పురాణ కల్పితమైనది. మానవాభివ్రుద్ధికి దోహదపడదు. ఇది పండితులు సమాజంపై చేసిన సామాజిక ప్రభావం. దీనిద్వారా వారి ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్నారు.
కాలం చక్రీయమని చెప్పటానికి 60 సంవత్సరాలకు పేర్లు పెట్టి అవి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కదా అని చెప్పటం కురచ వాదన. నేటి కలియుగం అనేది రెండో సారో మూడో సారో ముప్పయ్యోసారో అని చెప్పి ఋజువులు చూపాలి.
.
3. కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలు బౌద్ధమతానికి పూర్వం నుండి ఉన్నాయి. ముఖ్యంగా జైనానికి చెందినవి ఇవి. వైదికంలో కూడా ​ఛాందోగ్య ఉపనిషత్ 5.10.7 శ్లోకంలో పునర్జన్మ భావన కనిపిస్తుంది.
జైనం కర్మను ఆత్మపై అంటుకునే భౌతిక కణాలుగా వర్ణిస్తుంది.
బౌద్ధం వీటిని అనాత్మావాదం కోణంలోంచి రీడిఫైన్ చేసింది. అంతే తప్ప కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను బౌద్ధం ప్రతిపాదించలేదు. జైన హైందవాలు చెప్పిన అర్థంలో కూడా చెప్పలేదు. వాటిని బౌద్ధానికి ఆపాదించటం ఈ వ్యాసం చేస్తున్న వక్రీకరణ.
కర్మ, పునర్జన్మ వైదికమైనవి. వాటివల్లే నేటి కులవ్యవస్థ ఏర్పడింది. (ఛాందోగ్య ఉపనిషత్ 5.10.7 శ్లోకం-- ఈ లోకంలో మంచి కర్మలు చేసిన వారు బ్రాహ్మణ, క్షత్రియ లేదా వైశ్యులుగా జన్మిస్తారు. కాని చెడు కర్మలు చేసిన వారు కుక్క, పంది లేదా చండాలులుగా జన్మిస్తారు అని అర్థం).
కులవ్యవస్థకు మూలం వైదికంలో ఉండగా బౌద్ధం కారణమనటం అతితెలివి కుటిలపండిత వ్యాఖ్యానం.
చార్వాక దర్శనం కర్మ మరియు పునర్జన్మ సిద్ధాంతాలను అనుభవసిద్ధ ఆధారాలు లేని ఊహాగానాలుగా తిరస్కరించింది.
.
4. బౌద్ధాన్ని నాశనం చేసి, మనుధర్మానికి, బ్రాహ్మణ ఆధిపత్యానికి శంకరాచార్యుడు దోహదపడినట్లు ఒక అభిప్రాయం కలదు. అందుకే నేటికీ పండితులు పల్లకీలు ఎత్తుతారు.
"శ్రవణాథ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ........." అనే బ్రహ్మసూత్రానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో శూద్రునికి వేదాలు వినడం నిషిద్ధమని, ఒకవేళ వింటే అతని చెవుల్లో సీసం కరిగించి పోయాలని, వేదాలు పలికితే నాలుక కొసివేయాలని అంటూ అనేక ఉపపత్తులు ఇస్తాడు.....
ఇతనొక హెచ్చుతగ్గుల మనుధర్మ సమర్ధకుడు. ఇతనిని సమర్ధిస్తూ మాట్లాడే వారిని, ఉటంకించే వారిని సమకాలీనంగా అందరూ సమానం అని చెప్పే రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న వారిగా భావించాల్సి ఉంటుంది.
బ్రహ్మసూత్రకు శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో 9 అప శూద్రాధికరణం 34-38 లలో శూద్రునికి ఉపనయన సంస్కారం లేదు కనుక వేదాధ్యయనం లేదు. వేదాధ్యయనం లేదు కనుక బ్రహ్మ విద్యాధికారం లేదు అని స్పష్టంగా శూద్రులు విద్యనేర్చుకోవటానికి అర్హులు కారని ప్రకటించిన వ్యక్తి...... ఇతనినా! మనం ప్రామాణికంగా తీసుకోవలసింది. ఇంకా అతని భావాలు గొప్పవి, ఐన్ స్టీన్ తో సమానవైన భావాలు అవి అని ప్రకటించే వ్యక్తులవి ఎంత మలిన ఆలోచనలు
శంకరుని భావజాలం బౌద్ధుల భావజాలానికి దగ్గరగా ఉంది అని చెప్పటం కూడా అనాదిగా పండితులు చేస్తున్న ప్రభావమే. బౌద్ధులేనాడూ పైన శంకరుడు చెప్పినట్లు ప్రజలను విభజించలేదు. అందరూ సమానమే అన్నారు. బౌద్ధులను నిర్మూలించాడన్న అపప్రధను తొలగించటానికి శంకరుడే ప్రచ్ఛన్న బౌద్ధుడని ప్రచారం జరిగి ఉంటుంది.
5. భారతీయ తాత్విక చింతనలలో చార్వాకం తప్ప మరేదీ ఆధునిక హేతుచింతన/ సైన్స్ తో సరితూగలేదు. మిగిలినవి అన్నీ సామాజికంగా ప్రజలను ఆలోచనారహిత, క్రియారహిత జఢులుగా తీర్చిదిద్దిన తాత్వికతలే. ఇవేవీ ఆధునిక సైన్స్ పరిధిలోకి రానట్టె, ప్రాచీన తాత్విక చింతనలు కూడా రావు. క్వాంటం ఫిజిక్స్ ను అవి ప్రతిబింబిస్తాయి అని చెప్పటం.... అన్నీ వేదాలలో ఉన్నాయిష అని ఒక్కాణించటమే.
చార్వాకులు చెప్పిన శాస్త్రీయ సత్యాలు
అ. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణమును మాత్రమే అంగీకరించారు. ఇంద్రియములకు అందని వాటిని అంగీకరించలేదు.చార్వాకమతం. ధర్మాధర్మములు, పాపపుణ్యములు, దేవుడు, జన్మాంతర విషయాలు లాంటివి అభౌతికాలు, ఇంద్రియగోచరములు కావు కనుక వాటిని చార్వాకులు అంగీకరించలేదు. .....
...... సైన్సు కూడా అంతే ప్రత్యక్షప్రమాణాన్నే అంగీకరిస్తుంది.
ఆ. చైతన్యం భౌతికమైనది. దేహంలో ఉండే చైతన్యమే ఆత్మ. వేరుగా ఆత్మలేదు.
ఇ. దేవుడు లేడు, స్వర్గనరకాలు లేవు. మరణానంతర జీవితం లేదు. దేహంలోంచి ప్రాణం పోవటమే మోక్షం. కనుక మోక్షం కొరకు ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు తపస్సులు చెయ్యక్కరలేదు. జీవించినంతకాలమే ఆనందించగలం. చావుతరువాత ఏమీ లేదు.
ఈ. వేదాలు, ఆగమ శాస్త్రాలు వంటి ఏ మతగ్రంథాలనైనా జ్ఞాన హేతువులుగా భావించరాదు. వేదాలను రచించినవారు విదూషకులు, మోసగాళ్ళు, రాక్షసులు.
ఉ. ఇంకా నిరూపించాల్సి ఉన్న అంశాలైన ఆత్మ, దేవుడు, మరో జన్మ, స్వర్గనరకాలువంటి వాటి ద్వారా నిష్కపట మనస్కులు ఏ కొత్త జ్ఞానాన్ని పొందలేరు
.
6. ఎవరి విశ్వాసాలను వారికి పరిమితం చేసుకోవటం విజ్ఞత. అది ఎవరికీ అభ్యంతరం కాదు. అలాకాక మా విశ్వాసాలలో ఐన్ స్టీన్ సిద్ధాంతాలు, అణుబాంబు తయారీ, పుష్పక విమానాల తయారీ, కాస్మాలజీ, క్వాంటం థీరి లాంటివి ఉన్నాయి అని మాట్లాడటం అశాస్త్రీయమని గుర్తించాలి. ఏవీ చూపించు అని ప్రశ్నిస్తారన్న ఎరుక ఉండాలి.
ఏనాటికైనా భారతీయ తాత్విక చింతనలలో చార్వాక దర్శనమే శాస్త్రీయంగా నిలబడగలిగేది. కానీ దీనిని ప్రచారంలోకి తెస్తే ఆత్మ, దేవుడు, స్వర్గనరకాలు, పాపం, పుణ్యం, మోక్షం, పూజలు, వ్రతాలు అంటూ కొందరికి ఆధిపత్యాన్ని, జీవనోపాధిని ఇచ్చే ప్రపంచం మొత్తం కుప్పకూలుతుంది.
అందుకని చార్వాకులను వెనక్కితోసి, మిమాంస, అద్వైతం, ద్వైతం, వేదాలు, ఉపనిషత్తులు, సూక్తాలు, షట్దర్శనాలు అంటూ మనిషిని, తార్కికతను వదిలి చేసే మాయాపూరిత విశ్లేషణలను, కొందరు ముందుకు తెచ్చి శతాబ్దాలుగా చేసిన అనాది మోసమే ఈ వ్యాసంలోనూ కనిపించింది.
బొల్లోజు బాబా
(పై వ్యాసం ఒక వాదనకు ప్రతివాదనగా అకడెమిక్ ఇంటరెస్ట్ తో చేసినది తప్ప ఆ వ్యాసరచయితను అఫెండ్ చేయటానికి కాదు)