భర్తపోయిన స్త్రీలకు గాజులు, బొట్టు తియ్యమని ఏ శాస్త్రాలలో ఉంది అని ఢంకాభజాయించి మరీ ప్రశ్నిస్తున్నారు ఈవిడ. (see video link in comment).
వీళ్ళు తెలియక ఇలా మాట్లాడుతున్నారని అనుకోను. హిందూ ధర్మంలో ఎలాంటి దురాచారాలు లేవు అని బుకాయించటం నేడు ఫాషన్.
యజ్ఞాలలో మాంస, మద్యసేవనాలని కందమూలాల సేవనంగా గీతా ప్రెస్ ఇటీవలి ప్రచురణలలో క్రమేపీ మార్చుకొంటూ వస్తూంది.
గొప్ప సమానత్వం వెల్లివిరిసిన సమాజంలోకి కులాలను బ్రిటిష్ వారు తీసుకొచ్చారట.
స్త్రీని గౌరవించిన ఒకే ఒక ధర్మం మనది అట.
సతీసహగమనం ఎన్నడూ జరగనే లేదట అలా జరిగింది అనటం బ్రిటిష్ వారి అతిశయోక్తులట.
బ్రిటిష్ వారు ధర్మశాస్త్రాలను, వేదాలను వక్రీకరించి అనువదించారట. వాటిపై ఆధారపడిన డా. అంబేద్కర్ తెలియక హిందూమతాన్ని విమర్శించారట.
ఒకటా రెండా.... నేడు ఏవైతే రాజ్యాంగ విరుద్దమో అవన్నీ కల్పితాలు అంటూ మాట్లాడుతున్నారు. అబద్దాలతో ప్రజల్ని ఊదరకొడుతున్నారు.
ఎంతకాలం ఇలా అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలని మోసగిస్తారు వీళ్ళు.
ఒకె .... సరే....జరిగిందేదో జరిగిపోయింది... కాలానుగుణంగా ఈ ఈ దురాచారాలను రద్దుచేస్తున్నాం అని ఒక లిస్ట్ ఇచ్చి, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం అని పీఠాధిపతులు, ఇలాంటి ప్రవచనకారులు ప్రకటించి ముందుకు వెళితే మన మతానికి ఎంతగౌరవంగా ఉంటుంది? కానీ చెయ్యరు ఎందుకంటే అప్పుడు వీళ్ళనెవరూ వినరు, చూడరు కనుక. ధర్మం పేరుతో మూఢత్వాలను ప్రచారం చేసినప్పుడే, పరిహారాలంటూ వీరికి చేతినిండాపని, మనుగడ ఉంటుంది.
ఇదిగో ఈ వీడియోలో వృద్ధపతివ్రతలు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారో గమనించండి. వీళ్ళే పెద్దముత్తైదువులపాత్రలో భర్త పోయిన ఎందరి అభాగ్యునుల గాజులు బద్దలు కొట్టి ఉంటారో, నా కైతే అనుమానం లేదు. పోనీ కనీసం అలాంటి తంతులను చూసి ఉండరా? వేదికపై మాత్రం గొప్ప సుద్దులు చెబుతున్నారు. సిగ్గులేకుండా. ఈ ఆచారాలు మధ్యలో ఎలా వచ్చాసాయో వచ్చేసాయండి అంటున్నారావిడ. ఇంకా నయం. బ్రిటిష్ వారు తీసుకొచ్చారు అనలేదు. సంతోషం.
ఇక ఈ వీడియోలో ఆవిడ ప్రశ్నించినట్లు – వైధవ్యం పొందిన స్త్రీ బొట్టు, కాటుక గురించే కాదు, ఇంకా చాలా దుర్మార్గమైన విషయాలు శాస్త్రాలలో పండితులు చెప్పారు.
భర్తచనిపోయిన స్త్రీకి రెండేగతులు. ఒకటి సతీసహగమనం. రెండవది ఈ క్రింది నియమాలతో వైధవ్యాన్ని పాటించటం.
1. శీలమును కాపాడుకోవలెను. శీలమును కోల్పోయినచో స్వర్గములోని భర్త పితృ, సోదరులు నరకములోకి పంపబడెదరు.
2. జుట్టు ముడివేసినచో పైలోకములోని భర్తకు బంధనమగును కనుక గుండుకొట్టించుకోలెను
3. రోజుకి ఒకపూటమాత్రమే భుజించాలి
4. ఉపవాసాలుండాలి
5. మంచంపై పడుకోరాదు, నేలపై నిద్రించాలి.
6. నలుగుపెట్టుకొని తలనీళ్ళుపోసుకోకూడదు
7. సుగంధద్రవ్యములు, పన్నీరు, పైపూతలు, ఆభరణాలు, చందనాదులు లాంటి భోగములపట్ల ఆసక్తి కూడదు .
8. ఎడ్లబండిపై ఎక్కకూడదు
9. జాకెట్టు, రంగుచీరలు ధరించకూడదు.
10.తాంబూలము, కంచుపాత్రలో భోజనము నిషేదం
11. పుత్రుడు లేని విధవ స్త్రీ ప్రతిరోజు భర్తకు తిలోదకములచే తర్పణములు ఇవ్వాలి.
12. పరపురుషుల పేర్లు ఉచ్చరించరాదు.
వైధవ్యం పొందినవారికి సనాతన ధర్మం vidhavadharmah అనే పేరుతో అనేక ఆంక్షలు విధించింది. ఇవన్నీ సతీసహగమనానికి ప్రత్యామ్న్యాయంగా చెప్పి, అదేదో గొప్ప మానవత్వం నిండిన ఔదార్యప్రకటనగా భావించి ఉంటారు శాస్త్రకారులు. పండితులు రాసిన ఈ దుర్మార్గమైన చట్టాల వలన వైధవ్యం పొందిన హిందూ స్త్రీలు నేటికీ సున్నితమైన, చెప్పుకోలేని వివక్షకు గురవుతూండటం గమనించవచ్చు.
బుకాయించినంతమాత్రానా సనాతన చరిత్ర చిరిగిపోదు.
బొల్లోజు బాబా
No comments:
Post a Comment