Thursday, July 17, 2025

వివక్ష పట్ల ధిక్కారప్రకటన - ఐదుగురు కవుల సంగ్రహ చరిత్ర




సాహిత్యరంగంలో బ్రాహ్మణ ప్రాబల్యం ముందునించీ ఉంది. సాహిత్యం, విమర్శ అనేది వారి సొంత ఆస్తిగా, వారు మాత్రమే సృష్టించగలిగే విషయంగా చలామణీ చేసారు. దీనికి ప్రధాన కారణం బ్రాహ్మణులను అందరిలోను అగ్రస్థానంలో నిలబెట్టిన వర్ణవ్యవస్థ. మధ్య యుగాలలో ముస్లిమ్ పాలన వలన ఈ వర్ణ వ్యవస్థ హద్దులు కొద్దిమేరకు సడలడంతో బ్రాహ్మణేతరులు కూడా విద్యలను అభ్యసించి కావ్యాలను సృజించగలిగారు. అయినప్పటికీ రాజాస్థానాలలో ఏ రచన రాజు ప్రాపకం పొందాలో దేన్ని దూరం పెట్టాలో నిర్ణయించే స్థానంలో బ్రాహ్మణులే ఉండటంతో ఎందరి బ్రాహ్మణేతరుల రచనలు కాల గర్భంలో కలిసిపోయి ఉంటాయో ఎవరూ చెప్పలేరు. వాటిలో కొన్ని ప్రతిభ, ప్రజాదరణ కారణంగా కాలపరీక్షకు నిలిచినా, అలాంటి వాటిపట్ల బ్రాహ్మణులు ఉదాసీనంగా ఉండేవారని వేమన, వీరబ్రహ్మంల రచనలే సాక్ష్యంగా నిలుస్తాయి.
వేమన పద్యాలను పరిష్కరించటానికి సహకరించమని చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తనవద్ద పనిచేస్తున్న పండితులను కోరగా వారు దానిని “జబ్బు పని” అని ఎంచి తాత్సారం చేసేవారట. రాయలసీమ స్థానిక చరిత్రకథనాలను విస్త్రుతంగా సేకరించిన కాలిన్ మెకంజీ యొక్క పండితసహాయకులు ఎక్కడా వేమన, వీరబ్రహ్మంల చరిత్ర కైఫీయ్యతులలోకి ఎక్కకుండా జాగ్రత్తపడ్డారు. అబ్రాహ్మణుల రచనల స్థాయి అది. ఇన్ని అడ్డంకులను దాటుకొని నిలబడిన బ్రాహ్మణేతర రచనలు ఏవైనా ఉంటే ఒకటి రెండు తరాల తరువాత వాటిని బ్రాహ్మణ రచనలు అని చెప్పి తమ ఖాతాలో వేసుకొనేవారు పండిత విమర్శకులు.
 
అలా ఒక ఐదుగురు బహుజన కవులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన గ్రంథమే “ఐదుగురు కవుల సంగ్రహ చరిత్ర”
****

ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో ప్రభుత్వోద్యోగాలలో బ్రాహ్మణులే అధిక సంఖ్యలో ఉండేవారు. దీని వల్ల బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులమధ్య అనాదిగా ఉన్న సామాజిక అంతరాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ పరిస్థితులలోంచి దక్షిణభారతదేశంలో పండిత అయోథి దాస్, పెరియార్ ల నాయకత్వంలో బ్రాహ్మణేతర ఉద్యమం (Non Brahmin Movement) రూపుదిద్దుకొంది.
బ్రాహ్మణేతర కులాలలోని విద్యావంతుల ప్రోద్భలంతో 1916 లో మద్రాప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ ఏర్పడింది. ఈ పార్టీ సమాజంలోని బ్రాహ్మణేతర కులాలను సంఘటితం చేసింది. “ఒక పీడిత మహాజన సమూహం విద్య విజ్ఞానాల కొరకు, సాంఘిక మాన్యత కొరకు చేసే న్యాయమైన తపస్సు” గా బ్రాహ్మణేతరోద్యమాన్ని శ్రీ దువ్వూరి రామిరెడ్డి నిర్వచించారు.
 
ఇలాంటి చారిత్రిక నేపథ్యంలో - బండారు తమ్మయ్య (జంగమ), పెదగాడ గంగయ్య (విశ్వబ్రాహ్మణ) చిదిరెమఠం వీరభద్రశర్మ (జంగమ) వడ్డెపాటి నిరంజన శాస్త్రి (విశ్వబ్రాహ్మణ) లాంటి బహుజన సాహిత్యవిమర్శకులు చారిత్రికంగా బ్రాహ్మణేతర కవులకు జరిగిన అన్యాయాలను తమ రచనలు ద్వారా సరిదిద్దే ప్రయత్నం చేసారు.

1929 లో శ్రీ పెదగాడ గంగయ్య రాసిన “అయిదుగురు కవుల సంగ్రహ చరిత్ర” అలా ఒక ఐదుగురు బ్రాహ్మణేతర కవులకు జరిగిన వివక్షను ఎత్తి చూపుతుంది. ఈ కవులనందరినీ ఆనాటి సాహిత్యచరిత్రకారులు బ్రాహ్మణ కవులుగా (కందుకూరి రుద్రకవి మినహా) వారి రచనలను బ్రాహ్మణసాహిత్యంగా ప్రచారించుకొన్నారు.
 
ఐదుగురు కవుల సంగ్రహ చరిత్ర పుస్తకంలో ఏముంది ?
సంకుసాల నృశింహకవి ఇంటిపేరు టంకసాల అని; అతను కందుకూరి వీరేశలింగం తన కవుల చరిత్రలో (1917-19) చెప్పినట్లు నియోగిబ్రాహ్మణుడు కాదని విశ్వబ్రాహ్మణ సంజాతుడు అని స్పష్టపరిచారు.

కందుకూరి తన కవుల చరిత్రలో చేమకూర వేంకటకవిని నియోగి బ్రాహ్మణుడు అని పేర్కొన్నాడు. విజయవిలాసకావ్యంలోని పద్యాలు, ఇతర చాటువుల ఆధారంగా చేమకూర వెంకటకవి బోగినీ సుతుడని నిశ్చయం చేసారు.

కందుకూరి రుద్రకవిని కంసాలి రుద్రయ్య అని, అతను అష్టదిగ్గజములలో ఒకడు కాదు అని కందుకూరి వీరేశలింగం తన కవుల చరిత్రలో పేర్కొన్నాడు. దీనిని ఖండిస్తూ రుద్రకవి రాయల ఆస్థానంలో ఒకడని శాసన, పద్య ఆధారాలతో సోపత్తికంగా నిరూపణ చేసారు.
 
పాలకురికి సోమనాథకవి వీరశైవుడని కందుకూరి వీరేశలింగం, బ్రాహ్మణుడని వేటూరి ప్రభాకరశాస్త్రి, ఆరాధ్య బ్రాహ్మణుడని కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు అంటూ భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో అతను జంగమ కులానికి చెందిన కవి అని రుజువులు చూపారు.
 
హరిలీలావిలాసమును వ్రాసిన తెనాలి రామలింగయ్య, పాండురంగ మహాత్మ్యమును వ్రాసిన తెనాలి రామకృష్ణుడును ఒక్కరేయని నిష్కర్ష చేసారు. కందుకూరి వీరేశలింగం తన కవుల చరిత్రలో తెనాలి రామలింగయ్య బ్రాహ్మణుడు అని రాసారు. తెనాలి రామలింగయ్య విప్రుడు కాదు విశ్వబ్రాహ్మణుడు అని పెదగాడ గంగయ్య సాక్ష్యాధారాలతో నిరూపించారు.

*****
పైన చెప్పిన ఆ ఐదుగురుకవుల కులాలను నిర్ధారిస్తూ వారి సంగ్రహ చరిత్రను పెదగాడ గంగయ్య 1929 లో పుస్తకరూపంలో ప్రకటించాడు.
 
ఆ తరువాత కాలంలో కవుల చరిత్రను లిఖించిన ప్రముఖ సాహిత్యచరిత్రకారులు ఈ అభిప్రాయాలను ఏమేరకు పరిగణలోకి తీసుకొన్నారో పరిశీలిద్దాం.
శ్రీ చాగంటి శేషయ్య రచించిన “ఆంధ్రకవి తరంగిణి” (1946) లో పాల్కురికి సోమనాథుడు, తెనాలి రామకృష్ణ కవులు నియోగిబ్రాహ్మణులని, సంకుసాల నృశింహకవి శ్రీవైష్ణవ బ్రాహ్మణుడని అన్నారు. చేమకూర వేంకటకవి బోగినీ పుత్రుడని, తెనాలి రామలింగ కవి విశ్వబ్రాహ్మణ కవియని శేషయ్య అభిప్రాయపడ్డాడు. ఈ చివరి ఇద్దరి విషయంలో పెదగాడ గంగయ్య వాదనను ఈయన అంగీకరించినట్లు బావించాలి.
 
“ఆంధ్రకవి సప్తశతి” పేరుతో శ్రీ బులుసు వెంకటరమణయ్య (1956) లో వెలువరించిన కవుల జాబితాలో సంకుసాల నృశింహకవి, తెనాలి రామకృష్ణకవులు బ్రాహ్మణులని; కందుకూరి రుద్రకవి విశ్వబ్రాహ్మణుడని; చేమకూర వేంకటరాజు పాలకురికి సోమనాథులను కొందరు బ్రాహ్మణులు అని కొందరు శూద్రులని వాదించుచున్నారు అంటూ తటస్థవైఖరి తీసుకొన్నాడు.

కవుల చరిత్రకొరకు నేడు విస్త్రుతంగా రిఫర్ చేసే పుస్తకం ఆరుద్ర రాసిన “సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర” (1960 లు). సమగ్రాంధ్ర సాహిత్యచరిత్రలో ఆరుద్ర చేమకూర వేంకటకవిని వెంకటరాజు అని పిలుస్తూ ఒక క్షత్రకులస్థునిగా పరిచయం చేసి… “ఆయన కులం తక్కువవాడనే వదంతి ఒకటి చిరకాలం నుంచీ ప్రచారంలో ఉంది” అంటాడు తప్ప చర్చించడు. తెనాలి రామకృష్ణుడిని బ్రాహ్మణ కవి అని చెప్పాడు. కందుకూరి రుద్రకవి, సంకుసాల నరసయ్యల (నృశింహకవి) కుల ప్రస్తావనే తేలేదు. పాల్కురికి సోమనాథుడు సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడని అన్నాడు. సాహిత్యచరిత్ర సారమెల్లఎరిగిన ఆరుద్ర ఆకుకు అందకుండా పోకకు చిక్కకుండా చేసిన ఈ వాఖ్యలు ఆశ్చర్యం కలిగించకమానవు.
****
సాధారణంగా పద్యకావ్యాలలో బ్రాహ్మణకవులు తమ కులగోత్రాలను నిక్షిప్తం చేస్తారు. ఈ ‘లగ్జరీ’ బ్రాహ్మణేతర కవులకు ఉండదు. అందుకనే వారి కావ్యాలలో వారు ఏ కులానికి చెందినవారో ఏరకమైన క్లూ పెద్దగా లభించదు. ఒకవేళ చెప్పుకొన్నా ఆ కావ్యానికి బుధజనులలో సరైన ఆదరణ లభించకపోవచ్చు. “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేకదా” అన్న చేమకూర వేంకటకవి వ్యాఖ్య ఇక్కడ ప్రస్తావనార్హం.
 
బ్రాహ్మణేతర కవులు రాజాశ్రయం పొందటానికి ఎన్నెన్ని పాట్లు పడేవారో అనేక ఉదంతాలు కనిపిస్తాయి.
 
సంకుసాల నృశింహకవి “కవికర్ణరసాయనము” అనే ప్రబంధాన్ని రచించి, శ్రీకృష్ణదేవరాయల దర్శనం ఇప్పించమని అల్లసాని పెద్దనకు చూపగా అతడు ఆ రచనను చదివి అది రాజువద్దకు కొనిపోయిన ఆ కవికి గొప్ప ఆదరణ లభిస్తుందనే అసూయతో రాజదర్శనం కాకుండా చేసాడట. ఎంతకీ రాజసన్నిధి లభించకపోవటంచే తన రచనను ధనాశతో మనుషులకు అంకితమివ్వటం తుచ్ఛమని తలచి శ్రీరంగనాథునకు అంకితమిచ్చాడట నృశింహ కవి. పద్యసందర్భం వేరైనప్పటికీ ఇతను రాసిన ‘ఉద్ధతులమధ్య పేదలకుండ దరమే’ అనే పద్యపాదంలో ఈ బహుజనకవి తన జీవితంలో ఎదుర్కొన్న వివక్షను అన్యాపదేశంగా చెప్పాడా అనిపించకమానదు.
కందుకూరి రుద్రకవి రాజదర్శనానికి పండితకవులు అడ్డుపడగా రాయలవారికి క్షురకర్మ చేసే మంగలి కొండోజి చేత సిఫార్సు చేయించుకొని రాజు వద్దకు వెళ్ళాడని ఒక కథనం.
 
ప్రతాపరుద్రుడు రాజయిన కొత్తలో ఓరుగల్లులోని ఒక ఆలయానికి దర్శనానికి వెళ్ళాడట. అక్కడ కొందరు బసవపురాణాన్ని పఠిస్తున్నారు. “ఏమిటా పురాణం” అని అడగగా ఒక దూర్తవిప్రుడు “పాల్కురికి సోమ పతితుడను వాడొకడు ఈ మధ్య ద్విపద రాసాడు. అది అప్రమాణం, వినకూడనిది” అని చెప్పగా, ప్రతాపరుద్రుడు వినకుండానే వెళ్ళిపోయాడట.
 
ఎవరైనా బ్రాహ్మణేతరులు అసమాన ప్రతిభావ్యుత్పత్తులను చూపినపుడు వారి పాండిత్యము వెనుక ఏదో దేవతానుగ్రహం ఉందని కథలు పుట్టించటం మరొకరకం వ్యక్తిత్వహననం. ఒకనాడు ఒక సిద్ధుడు తెనాలి రామలింగకవికి కాళికాదేవిని ప్రసన్నం చేసుకొనే మంత్రమును ఉపదేశించేడట. ఆ మంత్రశక్తితో కాళికాదేవి దయకు పాత్రుడైన రామలింగడు ఆమెచే “వికటకవివై రాజసన్మానము పొందెదవు” అనే వరాన్ని పొందటం అలాంటిదే.
 
ఇలాంటి కథలు కోకొల్లలుగా సాహిత్యచరిత్రలో కనిపిస్తాయి. ఇవన్నీ బ్రాహ్మణ బ్రాహ్మణేతర మేథోశక్తులు చరిత్రలో పరస్పరం సంఘర్షించుకొన్న క్షణాలు. ఈ రాపిడి నేటికీ సమాజంలో అంతర్లీనంగా ప్లే అవుతూనే ఉంటుంది. అన్నమయ్యలాంటి పదకర్తకు ప్రోజెక్టుల రూపంలో కోట్లాది రూపాయలు వెచ్చించటానికి, బ్రాహ్మణాధిపత్యాన్ని ధిక్కరించిన పోతులూరి వీరబ్రహ్మం రచనల పరిరక్షణకు అటువంటి కృషి చేయకపోవటానికి వెనుక ఉండే బ్రాహ్మణాధిపత్య భావజాల ప్రభావాన్ని ఎవరు కాదనగలరు?.
****
“ఐదుగురు కవుల సంగ్రహ చరిత్ర” పుస్తకం దాదాపు శతాబ్దం కిందటిది. అప్పట్లో ఈ పుస్తకంపై తీవ్రమైన వాదప్రతివాదనలు నడిచాయి. పెదగాడ గంగయ్య అపండితుడని వ్యక్తిగతంగా నిందిస్తూ సనాతన పండితులు వ్యాసాలు రాసారు. ఆ తదనంతరం పెదగాడ గంగయ్య చేసిన ప్రతిపాదనలను నిశ్శబ్దంగా స్వీకరించారు కొందరు సాహిత్య చరిత్రకారులు. ఇంతటి ఘన చరిత్రను కలిగిన ఈ పుస్తకం యొక్క ప్రాసంగిత నేడు ఏమేరకు ఉంది అని ప్రశ్నించుకొంటే……
సాహిత్య చరిత్రలో బహుజనుల అస్తిత్వాన్ని చెరిపేయటం పట్ల, వారిపై జరిగిన వివక్ష పట్ల ఈ పుస్తకం ఒక ధిక్కారప్రకటన. తెలుగుసాహిత్య నిర్మాణంలో బహుజనుల పాత్రను సముచితంగా గౌరవించుకోవటం కొరకు ఈ పుస్తకాన్ని ప్రతిఒక్కరూ చదవాలి. ఇలాంటి చారిత్రిక ద్రోహాలు ఎక్కడెక్కడ జరిగాయో శోధించటానికి, విస్మృతంగా ఉండిపోయిన ఎంతోమంది బహుజన సాహితీవేత్తలను చరిత్రపుటలలోంచి వెలికితీసి పునర్మూల్యాంకనం చేయటానికి, నేటి తరం పరిశోధకులకు ఈ పుస్తకం ఒక స్పూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.

గొప్ప యజ్ఞాన్ని చేస్తున్న డా.సంగిశెట్టి శ్రీనివాస్ అన్నకు వందనాలు

భవదీయుడు
బొల్లోజు బాబా
కాకినాడ
16/5/2025




No comments:

Post a Comment